కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని నూతనలోకంలో నిజంగా సంతృప్తికరమైన జీవితం

దేవుని నూతనలోకంలో నిజంగా సంతృప్తికరమైన జీవితం

దేవుని నూతనలోకంలో నిజంగా సంతృప్తికరమైన జీవితం

క్రైస్తవ భర్త, తండ్రి అయిన డేవిడ్‌, * తాను సరైన పనే చేస్తున్నాననే దృఢనమ్మకంతో అమెరికాకు వలసవెళ్ళాడు. ఆయనకు తన భార్యాపిల్లల్ని వదలి వెళ్లడం ఇష్టంలేకపోయినా, తాను ఎక్కువ డబ్బు సంపాదిస్తే వాళ్ళందరి జీవితాలు బాగుపడతాయనే నమ్మకం ఆయనకు కలిగింది. కాబట్టి న్యూయార్క్‌లో ఉన్న బంధువుల ఆహ్వానాన్ని అంగీకరించి, త్వరలోనే అక్కడ ఉద్యోగం సంపాదించుకున్నాడు.

అయితే నెలలు గడుస్తుండగా, డేవిడ్‌ దృక్పథం మారనారంభించింది. ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం లేకుండా పోయింది. ఒక సమయంలో ఆయన దేవునిపై నమ్మకాన్నే దాదాపు కోల్పోయాడు. ఆయన నైతిక శోధనకు లొంగిపోయేంత వరకు కూడా తాను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోలేకపోయాడు. వస్తు సమృద్ధిపై ఆయన అవధానం ఆయన తాను ప్రాముఖ్యమైనవని భావించిన వాటన్నిటినుండి ఆయనను క్రమేణా దూరంగా తీసుకువెళ్తోంది. ఆయన మార్పులు చేసుకోవలసిన అవసరం ఉంది.

డేవిడ్‌లాగే, ప్రతీ సంవత్సరం చాలామంది తమ ఆర్థికస్థితిని మెరుగుపరచుకోవాలనే ఆశతో పేదదేశాలైన తమ స్వదేశాల నుండి వలసవెళ్తున్నారు. అయితే తరచూ వారు ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోవలసి వస్తోంది. కొందరిలా ఆలోచించారు: ‘ఒక క్రైస్తవుడు వస్తు సంపదలను సంపాదించుకుంటూ అదేసమయంలో దేవుని ఎదుట ధనవంతునిగా ఉండగలడా?’ ఇది సాధ్యమేనని ప్రఖ్యాత రచయితలు, మతనాయకులు చెబుతారు. కానీ డేవిడ్‌, ఇంకా ఇతరులు తెలుసుకున్నట్లుగా, ఒకటి పోగొట్టుకోకుండా మరొకటి సంపాదించుకోవడం చాలాకష్టం.​—⁠లూకా 18:​24.

డబ్బు చెడ్డదేమీ కాదు

డబ్బు మనుష్యులు కనిపెట్టిందే. కనిపెట్టబడిన అనేక ఇతర విషయాల్లాగే అది కూడా చెడ్డదేమీ కాదు, దానిలో దోషమేమీ లేదు. అది ఒక వినిమయ సాధనమే తప్ప మరింకేమీ కాదు. కాబట్టి దాన్ని సరైనవిధంగా వినియోగించుకున్నప్పుడు అది చక్కగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు డబ్బు, లేక “ద్రవ్యము ఆశ్రయాస్పదము” అని బైబిలు అంగీకరిస్తోంది, ప్రాముఖ్యంగా బీదరికంవల్ల వచ్చే సమస్యల దృష్ట్యా చూస్తే ఇదెంతో వాస్తవం. (ప్రసంగి 7:​12) కనీసం కొంతమంది విషయంలోనైనా “డబ్బుంటే అనేక సమస్యలు పరిష్కారమవుతాయి” అనిపిస్తుంది.​—⁠ప్రసంగి 10:​19, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

లేఖనాలు సోమరితనాన్ని ఖండిస్తూ కష్టపడి పనిచేయడాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మనం మన కుటుంబాన్ని పోషించుకోవాలి, ఏమైనా కాస్త ఎక్కువగా ఉంటే, ‘అక్కరగలవారికి పంచిపెట్టడానికి’ ఉపయోగపడుతుంది. (ఎఫెసీయులు 4:27; 1 తిమోతి 5:⁠8) అంతేగాక, బైబిలు స్వీయ పరిత్యాగులుగా ఉండడాన్ని ప్రోత్సహించే బదులు మనకున్న వాటిని ఆనందించమని ప్రోత్సహిస్తోంది. ‘మన భాగము’ తీసుకుని, కష్టానికి తగిన ఫలితాలను అనుభవించాలని మనకు చెప్పబడుతోంది. (ప్రసంగి 5:​18-20) వాస్తవానికి, సంపన్నులుగావున్న నమ్మకమైన స్త్రీ పురుషుల అనేక ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.

సంపన్నులుగావున్న నమ్మకస్థులు

దేవుని నమ్మకమైన సేవకుడైన అబ్రాహాము ఎన్నో పశువులను, మందలను, వెండిబంగారాలను, వందల సంఖ్యలో సేవకులను సమకూర్చుకున్నాడు. (ఆదికాండము 12:5; 13:​2, 6, 7) నీతిమంతుడైన యోబుకు కూడా చెప్పుకోదగినంత సంపద, అంటే ఎన్నో పశువులు, బంగారం, వెండి ఉండేవి, ఎంతోమంది సేవకులుండేవారు. (యోబు 1:3; 42:​11, 12) నేటి ప్రమాణాల ప్రకారం చూసినా వీరు ధనవంతులే, అయితే వారు దేవుని దృష్టిలో కూడా ధనవంతులుగా ఉన్నారు.

అపొస్తలుడైన పౌలు అబ్రాహామును, ‘నమ్మినవారికందరికి తండ్రి’ అని పిలుస్తున్నాడు. అబ్రాహాము పిసినారీ కాదు, అలాగని డబ్బే ఆయనకు ప్రాణమూ కాదు. (రోమీయులు 4:11; ఆదికాండము 13:9; 18:​1-8) అలాగే, దేవుడు యోబును “యథార్థవర్తనుడును న్యాయవంతుడునై” ఉన్నాడని వర్ణించాడు. (యోబు 1:⁠8) పేదవారికి, బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. (యోబు 29:​12-16) అబ్రాహాము, యోబు తమ సంపదలపై నమ్మకం పెట్టుకునే బదులు దేవునిమీద నమ్మకం ఉంచారు.​—⁠ఆదికాండము 14:22-24; యోబు 1:21, 22; రోమీయులు 4:​9-12.

రాజైన సొలొమోను మరో ఉదాహరణ. యెరూషలేములోని దేవుని సింహాసనానికి వారసునిగా సొలొమోను దైవిక జ్ఞానముతోనేకాక సకల సంపదలతో, మహిమతో ఆశీర్వదించబడ్డాడు. (1 రాజులు 3:​4-14) ఆయన తన జీవితంలో చాలాభాగం నమ్మకస్థునిగానే ఉన్నాడు. అయితే సొలొమోను చివరి సంవత్సరాల్లో ఆయన “హృదయము దేవుడైన యెహోవాయెడల యథార్థము కాకపోయెను.” (1 రాజులు 11:​1-8) నిజానికి, ఆయన దుఃఖకరమైన అనుభవం వస్తు సంపదలవల్ల కలిగే కొన్ని సాధారణ ఉరులను సోదాహరణంగా తెలియజేస్తోంది. కొన్ని పరిశీలించండి.

సంపదవల్ల వచ్చే ఉరులు

అన్నిటికంటే పెద్ద ప్రమాదం ఏమిటంటే, డబ్బును, అది కొనగల వాటిని ప్రేమించడం. డబ్బు కొందరిలో ఎన్నటికీ తీరని కోరికను రేపుతుంది. సొలొమోను తన జీవితపు తొలికాలంలోనే ఇతరుల్లో ఈ దృక్పథాన్ని గమనించాడు. ఆయనిలా వ్రాశాడు: “ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తినొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తినొందడు; ఇదియు వ్యర్థమే.” (ప్రసంగి 5:​10) మోసకరమైన ఈ ప్రేమ గురించి ఆ తర్వాత యేసు, పౌలు ఇద్దరూ క్రైస్తవులను హెచ్చరించారు.​—⁠మార్కు 4:18, 19; 2 తిమోతి 3:⁠2.

డబ్బు మన అవసరాలు తీర్చుకోవడానికి ఒక మార్గంగా మాత్రమే ఉండక, మనకు అత్యంత ప్రియమైనదైపోతే, మనం అబద్ధాలు, దొంగతనం, మోసం వంటివాటితో సహా అన్ని రకాలైన నైతిక శోధనలకు లొంగిపోయే ప్రమాదంలో పడతాము. క్రీస్తు అపొస్తలుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా తన యజమానిని కేవలం 30 వెండి నాణాలకు అప్పగించాడు. (మార్కు 14:11; యోహాను 12:⁠6) ధనాపేక్ష మరీ ఎక్కువైపోయినప్పుడు కొందరు దేవునికి బదులు ధనాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. (1 తిమోతి 6:​10) కాబట్టి క్రైస్తవులు, ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలనే తమ సంకల్పం వెనుకున్న అసలు ఉద్దేశాన్ని ఎలప్పుడూ యథార్థంగా పరిశీలించుకోవడానికి ప్రయత్నించాలి.​—⁠హెబ్రీయులు 13:⁠5.

ధనాన్వేషణ ఎంతో మోసకరమైన ప్రమాదాలను కూడా తీసుకువస్తుంది. మొదటిగా, అధిక సంపదలు స్వీయనమ్మకాన్ని పెంచుతాయి. యేసు “ధనమోసము” గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని చెప్పాడు. (మత్తయి 13:​22) అలాగే బైబిలు రచయితయైన యాకోబు, వ్యాపార సంబంధ పథకాలు వేసుకునేటప్పుడు కూడా దేవుణ్ణి మరచిపోకూడదని క్రైస్తవులను హెచ్చరించాడు. (యాకోబు 4:​13-16) డబ్బు మనకు కాస్త స్వేచ్ఛను ఇస్తున్నట్లు అనిపిస్తుంది కాబట్టి, అది ఉన్నవారికి, దేవునిపై నమ్మకం ఉంచే బదులు డబ్బును నమ్ముకునే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది.​—⁠సామెతలు 30:7-9; అపొస్తలుల కార్యములు 8:​18-24.

రెండవదిగా, ముందు ప్రస్తావించబడిన డేవిడ్‌ తెలుసుకున్నట్లుగా, ధన సంపాదన ఒక వ్యక్తి సమయాన్నీ శక్తినీ ఎంతగా తీసేసుకుంటుందంటే, అది ఆ వ్యక్తిని ఆధ్యాత్మిక కార్యకలాపాల నుండి క్రమేణా దూరంగా తీసుకువెళ్తుంది. (లూకా 12:​13-21) సంపన్నులకు, తమకున్నదాన్ని ప్రాథమికంగా విలాసాల కోసం లేదా వ్యక్తిగత లక్ష్యసాధనల కోసం ఉపయోగించుకోవాలనే నిరంతర శోధన కూడా ఉంటుంది.

సొలొమోను విలాసవంతమైన జీవనవిధానం తన జ్ఞానేంద్రియాలు మొద్దుబారేలా చేయడానికి అనుమతించడం, ఆయన ఆధ్యాత్మిక పతనానికి కొంతమేరకు కారణమై ఉండవచ్చా? (లూకా 21:​34) అన్యులతో వివాహ బంధాలు ఏర్పరచుకోవద్దని దేవుడిచ్చిన సూటియైన నిషేధం గురించి ఆయనకు తెలుసు. అయినా, చివరికాయన దాదాపు వెయ్యిమంది ఉపపత్నులను సమకూర్చుకున్నాడు. (ద్వితీయోపదేశకాండము 7:⁠3) అన్యులైన తన భార్యలను సంతోషపెట్టాలనే ఆత్రంతో, వారి ప్రయోజనార్థం ఆయన మిశ్రిత విశ్వాసం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాడు. ముందు పేర్కొనబడినట్లుగా, సొలొమోను హృదయం క్రమేణా యెహోవా నుండి దూరమయ్యింది.

స్పష్టంగా, ఈ ఉదాహరణలు యేసు ఇచ్చిన ఈ ఉపదేశ సత్యత్వాన్ని చూపిస్తాయి: “మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.” (మత్తయి 6:​24) మరైతే, ఇప్పుడు అనేకులకు ఎదురవుతున్న ఆర్థిక సవాళ్ళను ఒక క్రైస్తవుడు ఎలా విజయవంతంగా ఎదుర్కోవచ్చు? మరింత ప్రాముఖ్యంగా, భవిష్యత్తులో మరింత మంచి జీవితానికి ఎలాంటి నిరీక్షణ ఉంది?

భవిష్యత్తులో నిజమైన సంపద

పితరులైన అబ్రాహాము, యోబు, ఇశ్రాయేలు జనాంగంవలే కాకుండా యేసు అనుచరులకు, “సమస్త జనులను శిష్యులనుగా చేయ”వలసిన బాధ్యత అప్పగించబడింది. (మత్తయి 28:​19, 20) ఆ బాధ్యతను నిర్వర్తించడానికి, ఇతర లౌకిక లక్ష్యసాధనల కోసం వెచ్చించగల సమయం, కృషి అవసరమవుతాయి. కాబట్టి విజయానికి కీలకం యేసు చేయమని చెప్పిన దీనిని చేయడంలోనే ఉంది: “కాబట్టి మీరు [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.”​—⁠మత్తయి 6:​33.

డేవిడ్‌ తన కుటుంబాన్ని, తన ఆధ్యాత్మికతను దాదాపు పోగొట్టుకున్న తర్వాత, చివరికి తన జీవితాన్ని మళ్ళీ గాడిపైకి తెచ్చుకోగలిగాడు. డేవిడ్‌ మళ్ళీ బైబిలు అధ్యయనం, ప్రార్థన, పరిచర్యలకు తన జీవితంలో ప్రథమస్థానం ఇవ్వడం ప్రారంభించినప్పుడు, యేసు వాగ్దానం చేసినట్లుగా, ఆయన జీవితంలో అన్నీ మెరుగుపడనారంభించాయి. భార్యాపిల్లలతో ఆయన సంబంధం క్రమేణా మళ్ళీ పటిష్ఠమైంది. ఆయనకు ఆనందం, సంతృప్తి తిరిగి లభించాయి. ఇప్పటికీ ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. ఆయన ఉన్నపళంగా సంపన్నుడేమీ అయిపోలేదు. అయినా, తన వేదనభరిత అనుభవం నుండి ఆయన విలువైన పాఠాలు నేర్చుకున్నాడు.

డేవిడ్‌ అమెరికాకు వెళ్ళడం ఎంత జ్ఞానయుక్తమైనదనే విషయం గురించి పునరాలోచించాడు, డబ్బు తన నిర్ణయాలపై ఆధిపత్యం వహించేందుకు మరెన్నడూ అనుమతించకూడదని నిశ్చయించుకున్నాడు. ఆయనిప్పుడు జీవితంలో అత్యంత విలువైనవాటిని, అంటే ప్రేమగల కుటుంబం, మంచి స్నేహితులు, దేవునితో సంబంధం వంటివాటిని డబ్బుతో కొనలేమని తెలుసుకున్నాడు. (సామెతలు 17:17; 24:27; యెషయా 55:​1, 2) నిజంగా, వస్తుసంపదలకన్నా నైతిక యథార్థతే ఎంతో విలువైనది. (సామెతలు 19:1; 22:⁠1) తన కుటుంబంతో కలిసి, ప్రాముఖ్యమైన విషయాలకు ప్రథమస్థానం ఇవ్వాలని డేవిడ్‌ నిశ్చయించుకున్నాడు.​—⁠ఫిలిప్పీయులు 1:⁠9.

నిజంగా సంపన్నమైన, నైతిక విలువలుగల సమాజాన్ని నిర్మించాలన్న మానవ ప్రయత్నాలు తరచూ విఫలమయ్యాయి. అయితే, సంతృప్తికరమైన జీవితం గడపడానికి అవసరమైన వస్తుసంబంధ విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను తన రాజ్యం పుష్కలంగా అందజేస్తుందని దేవుడు వాగ్దానం చేశాడు. (కీర్తన 72:16; యెషయా 65:​21-23) నిజంగా సంతృప్తికరమైన జీవితం ఆధ్యాత్మికతతో ప్రారంభమవుతుందని యేసు బోధించాడు. (మత్తయి 5:⁠3) కాబట్టి మనం వస్తుపరంగా ధనికులమైనా, పేదలమైనా, ఇప్పుడు ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వడం, త్వరలో రానున్న దేవుని నూతనలోకం కోసం సిద్ధపడేందుకు మనలో ఎవరమైనా అనుసరించగల అత్యంత శ్రేష్ఠమైన మార్గం. (1 తిమోతి 6:​17-19) ఆ లోకం వస్తుపరంగానూ, ఆధ్యాత్మికంగానూ నిజంగా సుసంపన్నమైన సమాజమై ఉంటుంది.

[అధస్సూచి]

^ పేరా 2 పేరు మార్చబడింది.

[5వ పేజీలోని చిత్రాలు]

యోబు తన సంపదలపై కాదు గానీ దేవునిపై నమ్మకం ఉంచాడు

[7వ పేజీలోని చిత్రాలు]

జీవితంలో అత్యంత విలువైనవాటిని డబ్బుతో కొనలేము