కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు

నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

నెహెమ్యా పుస్తకంలోని ముఖ్యాంశాలు

బైబిలు పుస్తకమైన ఎజ్రాలో వ్రాయబడిన చివరి సంఘటనలు జరిగి పన్నెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ‘యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరవలసిన’ సమయం దగ్గరపడింది, ఈ సంఘటన మెస్సీయ వద్దకు నడిపించే 70 వారాల సంవత్సరాల ప్రారంభాన్ని సూచిస్తుంది. (దానియేలు 9:​24-27) నెహెమ్యా పుస్తకంలో దేవుని ప్రజల చరిత్రవుంది, దానిలో యెరూషలేము ప్రాకార పునర్నిర్మాణం గురించి కూడా ఉంది. అది సా.శ.పూ. 456 నుండి సా.శ.పూ. 443 తర్వాత కొంతకాలం వరకు ఉన్న 12 కంటే ఎక్కువ సంవత్సరాల నిర్ణాయక కాలాన్ని గురించి తెలియజేస్తుంది.

అధిపతియైన నెహెమ్యా వ్రాసిన ఈ పుస్తకం, దృఢనిశ్చయతతో చర్యతీసుకుని యెహోవా దేవునిపై సంపూర్ణంగా ఆధారపడితే సత్యారాధన ఎలా ఉన్నతపరచబడుతుందో తెలియజేసే ఉత్తేజకరమైన వృత్తాంతం. యెహోవా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి విషయాలను ఎలా నడిపిస్తాడో ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఇది ఒక శక్తిమంతుడైన, ధైర్యవంతుడైన నాయకుని కథ కూడా. నెహెమ్యా పుస్తకంలోని సందేశం నేటి సత్యారాధకులందరికీ విలువైన పాఠాలను అందజేస్తుంది, “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగల[ది].”​—⁠హెబ్రీయులు 4:​12.

“ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను”

(నెహెమ్యా 1:1-6:​19)

నెహెమ్యా అర్తహషస్త లాంజిమెనస్‌ రాజు దగ్గర నమ్మకమైన స్థానంలో సేవ చేస్తూ షూషను కోటలో ఉంటాడు. తన ప్రజలు, “బహుగా శ్రమను నిందను పొందుచున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడినవి” అనే వార్త విన్నప్పుడు నెహెమ్యా ఎంతో కలత చెందుతాడు. నడిపింపు కోసం ఆయన దేవునికి తీవ్రంగా ప్రార్థిస్తాడు. (నెహెమ్యా 1:​3, 4) యుక్తసమయంలో రాజు, నెహెమ్యా దుఃఖాన్ని గమనిస్తాడు దానితో ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి మార్గం సుగమమవుతుంది.

యెరూషలేముకు చేరిన తర్వాత, నెహెమ్యా రాత్రిచాటున ప్రాకారాన్ని పరిశీలించి, ప్రాకారాన్ని పునర్నిర్మించడం గురించిన తన పథకాన్ని యూదులకు వెల్లడిచేస్తాడు. నిర్మాణం ప్రారంభమవుతుంది. అలాగే పనికి వ్యతిరేకత కూడా ఆరంభమవుతుంది. అయితే నెహెమ్యా ధైర్యవంతమైన నాయకత్వం క్రింద, “ప్రాకారమును కట్టుట సమాప్త[మవుతుంది].”​—⁠నెహెమ్యా 6:​15.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:⁠1; 2:1​—⁠ఈ రెండు వచనాల్లోనూ ప్రస్తావించబడిన “ఇరువదియవ సంవత్సరము” ఒకే సమయం నుండి లెక్కించబడిందా? అవును, ఆ 20వ సంవత్సరం, అర్తహషస్త రాజు పరిపాలన యొక్క ఇరువదియవ సంవత్సరం. అయితే, ఈ వచనాల్లో ఉపయోగించబడిన లెక్కింపు విధానం భిన్నంగా ఉంది. సా.శ.పూ. 475 అర్తహషస్త రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన సంవత్సరమని చారిత్రక సాక్ష్యాధారం చూపిస్తోంది. పర్షియా రాజుల పాలనను బబులోను శాస్త్రులు వాడుకగా నీసాను (మార్చి/ఏప్రిల్‌) నుండి నీసానుకు లెక్కించేవారు కాబట్టి, అర్తహషస్త పరిపాలనా మొదటి సంవత్సరం సా.శ.పూ. 474 నీసానులో ప్రారంభమైంది. కాబట్టి, నెహెమ్యా 2:1లో ప్రస్తావించబడిన, పరిపాలన యొక్క 20వ సంవత్సరం సా.శ.పూ. 455 నీసానులో ప్రారంభమైంది. నెహెమ్యా 1:1లో ప్రస్తావించబడిన కిస్లేవు మాసము, సహేతుకంగానే ముందటి సంవత్సరపు అంటే సా.శ.పూ. 456వ సంవత్సరపు కిస్లేవు మాసమవుతుంది. ఆ నెల కూడా అర్తహషస్త పరిపాలన యొక్క 20వ సంవత్సరంలోనే వస్తున్నట్లు నెహెమ్యా చెబుతున్నాడు. ఈ సందర్భంలో బహుశా ఆయన రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన తేదీనుండి సంవత్సరాలను లెక్కించివుండవచ్చు. నెహెమ్యా నేడు యూదులు పౌర సంవత్సరం అని పిలిచే దాని ద్వారా కూడా సమయాన్ని లెక్కించి ఉండవచ్చు, ఇది సెప్టెంబరు/అక్టోబరు నెలల్లో వచ్చే తిష్రి నెలలో ప్రారంభమవుతుంది. ఏదేమైనా, యెరూషలేము పునఃస్థాపించబడాలని ఆజ్ఞ బయలుదేరిన సంవత్సరం సా.శ.పూ. 455.

4:​17, 18​—⁠పునర్నిర్మాణ పనిని ఎవరైనా కేవలం ఒక్క చేత్తో ఎలా చేయగలరు? బరువులెత్తేవారికి ఇదొక సమస్యకాదు. బరువు ఒకసారి వాళ్ళ తలపైనో భూజాలపైనో పెట్టబడిన తర్వాత, వాళ్లు ఒక్క చేత్తో దాన్ని సునాయాసంగా మోస్తూ, “ఒక చేతితో ఆయుధము పట్టుకొని” ఉండేవారు. పని చేయడానికి రెండు చేతులూ అవసరమైన నిర్మాణకులు “ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను.” శత్రువులు దాడి చేస్తే వాళ్ళు వెంటనే పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు.

5:7​—⁠నెహెమ్యా ఏ భావంలో “ప్రధానులను అధికారులను గద్దించ[డం]” ప్రారంభించాడు? వీరు మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తూ తోటి యూదుల నుండి వడ్డి వసూలుచేస్తున్నారు. (లేవీయకాండము 25:36; ద్వితీయోపదేశకాండము 23:​19) అంతేగాక వాళ్ళు అడుగుతున్న వడ్డి చాలా ఎక్కువగా ఉంది. ప్రతీ నెల “నూరవభాగము” ఇవ్వాలంటే, అది సంవత్సరానికి 12 శాతానికి సమానమవుతుంది. (నెహెమ్యా 5:​11) అప్పటికే పన్నుల భారంతో, ఆహార కొరతతో ఎన్నో అవస్థలు పడుతున్న ప్రజలపై ఇది విధించడం క్రూరత్వం. నెహెమ్యా ధనికులను గద్దించాడంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి వారిని మందలించి, చీవాట్లుపెట్టి వారి తప్పును బహిర్గతం చేశాడు.

6:5​—⁠ఆంతరంగిక లేఖలు సాధారణంగా ఏదైనా సీలు చేసిన సంచిలోనే ఉంచబడతాయి కదా, సన్బల్లటు నెహెమ్యాకు “విప్పియున్న యొక పత్రికను” ఎందుకు పంపాడు? సన్బల్లటు విప్పివున్న పత్రికను పంపడం ద్వారా, నెహెమ్యాపై మోపబడిన తప్పుడు నిందలు అందరికీ తెలిసేలా చేయాలని ఉద్దేశించి ఉండవచ్చు. దీనివల్ల నెహెమ్యాకు విపరీతమైన కోపం వస్తే దానితో ఆయన నిర్మాణ పని వదిలేసి తనను తాను సమర్థించుకోవడానికి వస్తాడని అతడు అనుకొని ఉండవచ్చు. లేదా పత్రికలోని విషయాలు యూదుల మధ్య రేకెత్తించే భయానికి వాళ్ళు తమ పని మొత్తానికే మానేస్తారని సన్బల్లటు తలంచివుండవచ్చు. నెహెమ్యా ఏమాత్రం భయపడకుండా, దేవుడిచ్చిన పనిలో ప్రశాంతంగా కొనసాగాడు.

మనకు పాఠాలు:

1:⁠4; 2:⁠4; 4:4, 5. కష్టపరిస్థితులు ఎదురైనప్పుడు లేక ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, మనం “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండి,” దైవపరిపాలనా నిర్దేశానికి అనుగుణంగా చర్య తీసుకోవాలి.​—⁠రోమీయులు 12:​12.

1:​11–2:⁠8; 4:​4, 5, 15, 16; 6:​16. యెహోవా తన సేవకుల యథార్థ ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు.​—⁠కీర్తన 86:6, 7.

1:4; 4:19, 20; 6:​3, 15. నెహెమ్యా ఎంతో కనికరంగల వ్యక్తే అయినప్పటికీ, నీతి కొరకు దృఢంగా పోరాడడంలో క్రియాశీలుడిగా చక్కని మాదిరి ఉంచాడు.

1:11-2:⁠3. నెహెమ్యా ఆనందానికి అసలైన మూలం, పానదాయకునిగా ఆయనకున్న గౌరవప్రదమైన స్థానంకాదు. ఆయనకు సత్యారాధనను పెంపొందింపజేయడం ముఖ్యం. యెహోవా ఆరాధనతోపాటు, దాన్ని పెంపొందింపజేసేవన్నీ మనకు ముఖ్య విషయాలుగా, మన ఆనందానికి మూలకారకాలుగా ఉండవద్దా?

2:​4-8. యెహోవా, నెహెమ్యా వెళ్లడానికి, యెరూషలేము ప్రాకారమును పునర్నిర్మించడానికి అర్తహషస్త అనుమతించేలా చేశాడు. “యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది. ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాని త్రిప్పును” అని సామెతలు 21:1 చెబుతోంది.

3:​5, 27. సత్యారాధన కోసం చేసే శారీరక కష్టాన్ని, తెకోవీయుల “అధికారులు” భావించినట్లు మన మర్యాదకు భంగమని భావించకూడదు. బదులుగా, ఇష్టపూర్వకంగా పనిచేసిన సామాన్య తెకోవీయులను అనుకరించాలి.

3:​10, 23, 28-30. కొందరు, రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతానికి వెళ్ళగలుగుతుండగా, మనలో చాలామందిమి మన ఇంటికి దగ్గర్లోనే సత్యారాధనకు మద్దతిస్తాము. రాజ్యమందిర నిర్మాణపనిలో, విపత్తు ఉపశమన కార్యకలాపాల్లో భాగంవహించడం ద్వారా, అయితే ప్రాథమికంగా రాజ్యప్రకటనా పనిలో పాల్గొనడం ద్వారా మనమలా చేయవచ్చు.

4:​14. వ్యతిరేకత ఎదురైనప్పుడు మనం కూడా “మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను” గుర్తుంచుకోవడం ద్వారా మన భయాన్ని అధిగమించవచ్చు.

5:​14-19. అధిపతియైన నెహెమ్యా వినయం, నిస్వార్థం, వివేచనల్లో క్రైస్తవ పైవిచారణకర్తలకు అద్భుతమైన మాదిరిగా ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని అమలుచేయడంలో ఆసక్తి కలిగివున్నప్పటికీ ఆయన స్వార్థపూరిత లాభం కోసం ఇతరులమీద పెత్తనం చేయలేదు. బదులుగా, అణచివేయబడినవారిపట్ల, బీదలపట్ల ఆయన శ్రద్ధ చూపించాడు. ఉదారత చూపించడంలో, నెహెమ్యా దేవుని సేవకులందరికీ విశేషమైన ఉదాహరణగా ఉన్నాడు.

“నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము”

(నెహెమ్యా 7:1-13:31)

యెరూషలేము ప్రాకార నిర్మాణం ముగిసిన వెంటనే నెహెమ్యా ద్వారములను నెలకొల్పి నగరాన్ని పటిష్ఠం చేయడానికి ఏర్పాట్లు చేస్తాడు. ఆయన ప్రజల వంశానుక్రమ వివరాలను వ్రాసిపెట్టడం మొదలుపెడతాడు. ప్రజలందరూ “నీటి గుమ్మము ఎదుటనున్న మైదానము” దగ్గర సమకూడినప్పుడు, యాజకుడైన ఎజ్రా మోషే ధర్మశాస్త్రములో నుండి చదువుతుండగా, నెహెమ్యా, లేవీయులు ప్రజలకు ధర్మశాస్త్రాన్ని వివరిస్తారు. (నెహెమ్యా 8:⁠1) పర్ణశాలల పండుగ గురించి తెలుసుకుని వారు ఆనందంగా ఆ పండుగ జరుపుకుంటారు.

“ఇశ్రాయేలీయులు” మరోసారి సమావేశమై, తమ పాపములను ఒప్పుకుంటారు, లేవీయులు ఇశ్రాయేలుతో దేవుని వ్యవహారాలను పరిశీలిస్తారు, ‘దేవుని ధర్మశాస్త్రానికి విధేయులమవుతాము’ అని ప్రజలు ప్రమాణం చేస్తారు. (నెహెమ్యా 9:1, 2; 10:​29) యెరూషలేము జనాభా అప్పటికీ తక్కువగానే ఉంది కాబట్టి, నగరం వెలుపల నివసిస్తున్న ప్రతీ 10 మందిలో ఒకరు నగరంలోపలికి రావడానికి చీట్లు వేయబడ్డాయి. ఆ తర్వాత, ప్రాకార ప్రారంభోత్సవంలో ఎంత ఉత్సాహం పెల్లుబికిందంటే “యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.” (నెహెమ్యా 12:​43) నెహెమ్యా తాను వచ్చిన పన్నెండు సంవత్సరాల తర్వాత, అర్తహషస్త రాజు దగ్గర తన విధులు నిర్వర్తించడానికి యెరూషలేము విడిచి వెళ్తాడు. యూదుల్లో మళ్ళీ అపవిత్రత ప్రబలుతుంది. నెహెమ్యా యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితిని సరిదిద్దడానికి నిర్ణాయక చర్య తీసుకుంటాడు. ఆయన తన కోసం వినయపూర్వకంగా ఈ విన్నపం చేస్తాడు: “నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.”​—⁠నెహెమ్యా 13:​31.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

7:​6-67​—⁠ప్రతీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలిపే సంఖ్యల విషయంలో, యెరుబ్బాబెలుతోపాటు యెరూషలేముకు తిరిగివచ్చిన శేషము యొక్క పేర్లతో నెహెమ్యా రూపొందించిన పట్టికకు, ఎజ్రా రూపొందించిన పట్టికకు తేడా ఎందుకుంది? (ఎజ్రా 2:​1-65) ఈ తేడాలకు కారణం, ఎజ్రా నెహెమ్యా రెండు భిన్నమైన మూలాలను ఉపయోగించారు. ఉదాహరణకు, తిరిగిరావడానికి నమోదు చేసుకున్నవారి సంఖ్య, వాస్తవంగా తిరిగివచ్చినవారి సంఖ్యకు భిన్నంగా ఉండవచ్చు. ముందు తమ వంశానుక్రమాన్ని స్థాపించుకోలేకపోయినవారు ఆ తర్వాత దాన్ని చేయడంవల్ల కూడా ఆ రెండు పట్టికలు భిన్నంగా ఉండివుండవచ్చు. అయితే, రెండు పట్టికలు ఒక విషయంలో ఏకీభవిస్తున్నాయి: బానిసలు, గాయకులు కాకుండా, మొదట్లో తిరిగివచ్చినవారు 42,360 మంది.

10:34​—⁠ప్రజలు కట్టెల అర్పణ ఎందుకు తీసుకురావలసి వచ్చింది? కట్టెల అర్పణ మోషే ధర్మశాస్త్రంలో పేర్కొనబడలేదు. ఖచ్చితంగా ఈ పని అవసరాన్ని బట్టే ఏర్పడింది. బలిపీఠం మీద బలులను దహించడానికి పెద్ద మొత్తంలో కట్టెలు అవసరమయ్యేవి. ఇశ్రాయేలీయులు కాని ఆలయ సేవకులుగా సేవచేసే నెతీనీయులు తగినంతమంది లేకపోయి ఉండవచ్చని స్పష్టమవుతోంది. కాబట్టి, కట్టెలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడడానికి చీట్లు వేయబడేవి.

13:​6​—⁠నెహెమ్యా యెరూషలేములో ఎంతకాలంపాటు లేడు? “కొన్నిదినములైన తరువాత” లేక అక్షరార్థంగా “దినముల అంతమున” మాత్రమే నెహెమ్యా యెరూషలేముకు తిరిగి రావడానికి రాజు దగ్గర సెలవు అడిగాడని బైబిలు చెబుతోంది. కాబట్టి, ఆయన ఎంతకాలంపాటు యెరూషలేములో లేడనే విషయాన్ని నిశ్చయంగా చెప్పడం అసాధ్యం. అయితే, నెహెమ్యా యెరూషలేముకు తిరిగివచ్చిన తర్వాత, యాజకత్వానికి మద్దతు ఇవ్వబడడం లేదనీ, సబ్బాతు ఆచరణ ఆచరించబడడం లేదనీ తెలుసుకున్నాడు. చాలామంది అన్య భార్యలను తెచ్చుకున్నారు, వాళ్ళ సంతానానికి యూదుల భాషకూడా రాదు. పరిస్థితులు అంతగా దిగజారిపోయాయంటే, నెహెమ్యా బహుశా చాలాకాలమే యెరూషలేము నుండి దూరంగా ఉండివుంటాడు.

13:​25, 28​—⁠నెహెమ్యా భ్రష్టులవుతున్న యూదులతో ‘వాదించడమే’ కాక, ఇంకా ఎలాంటి సరిదిద్దే చర్యలు చేపట్టాడు? నెహెమ్యా వారిని ‘శపించాడు’ అంటే, దేవుని ధర్మశాస్త్రములో వారికి వ్యతిరేకంగా ఉన్న తీర్పులను ప్రకటించాడు. ఆయన ‘కొందరిని కొట్టాడు,’ అంటే బహుశా వారికి వ్యతిరేకంగా న్యాయపరమైన చర్య తీసుకోమని ఆజ్ఞాపించడం ద్వారా అలా చేసి ఉండవచ్చు. ఆయన తన నైతిక ఆగ్రహానికి గుర్తుగా ‘వారి తలవెండ్రుకలను పెరికివేశాడు.’ అంతేగాక ఆయన, హోరోనీయుడైన సన్బల్లటు కుమార్తెను వివాహం చేసుకున్న, ప్రధానయాజకుడైన ఎల్యాషీబు మనమణ్ణి తరిమేశాడు.

మనకు పాఠాలు:

8:⁠8. దేవునివాక్య బోధకులముగా మనం, చక్కని ఉచ్ఛారణ ద్వారా, మౌఖికంగా నొక్కిచెప్పడం ద్వారా, లేఖనాలను సరిగ్గా వివరించడం ద్వారా, వాటి అన్వయింపును స్పష్టం చేయడం ద్వారా ‘అర్థము చెబుతాము.’

8:​10. మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తించి, దాన్ని తృప్తిపరచుకోవడం ద్వారా, దైవపరిపాలనా నిర్దేశాన్ని అనుసరించడం ద్వారా ‘యెహోవాయందు ఆనందించడం’ సాధ్యమవుతుంది. మనం శ్రద్ధగా బైబిలు చదవడం, క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరవడం, రాజ్యప్రకటనా పనిలో శిష్యులను చేసే పనిలో ఆసక్తితో భాగంవహించడం ఎంత ప్రాముఖ్యమో కదా!

11:⁠2. తన వారసత్వ సంపదను వదులుకుని యెరూషలేములోకి రావడానికి వ్యక్తిగతంగా కొంత త్యాగం చేయవలసి ఉంటుంది, కొన్ని నష్టాలను భరించవలసి ఉంటుంది. అలా యెరూషలేములోకి రావడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినవారు స్వయంత్యాగ స్ఫూర్తిని ప్రదర్శించారు. సమావేశాల్లో, ఇతర సందర్భాల్లో ఇతరులకు సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావలసిన అవకాశాలు ఏర్పడినప్పుడు మనం కూడా అలాంటి స్ఫూర్తిని చూపించవచ్చు.

12:​31, 38, 40-42. పాటలు పాడడం యెహోవాను స్తుతిస్తూ మన కృతజ్ఞతను తెలియజేసే ఒక చక్కని మార్గం. క్రైస్తవ కూటాల్లో మనం హృదయపూర్వకంగా పాడాలి.

13:​4-31. ఐశ్వర్యాసక్తి, భ్రష్టత్వం, మతభ్రష్టత్వం మన జీవితాల్లోకి ప్రవేశించకుండా మనం అప్రమత్తంగా ఉండాలి.

13:​22. తాను దేవునికి లెక్క అప్పగించవలసి ఉందని నెహెమ్యాకు బాగా తెలుసు. మనం కూడా యెహోవాకు లెక్క అప్పగించవలసి ఉందని తెలుసుకోవాలి.

యెహోవా ఆశీర్వాదాన్ని పొందడం ఆవశ్యకం!

“యెహోవా ఇల్లు కట్టించనియెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే” అని కీర్తనకర్త పాడాడు. (కీర్తన 127:⁠1) ఆ మాటల సత్యత్వాన్ని నెహెమ్యా పుస్తకం ఎంత చక్కగా ఉదాహరిస్తోందో కదా!

మనకు పాఠం స్పష్టంగా ఉంది. మనం చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే, మనకు యెహోవా ఆశీర్వాదం ఉండాలి. మన జీవితాల్లో సత్యారాధనకు మొదటిస్థానం ఇవ్వకుండా యెహోవా ఆశీర్వాదం లభించాలని మనం నిజంగా ఆశించవచ్చా? కాబట్టి, నెహెమ్యాలా యెహోవా ఆరాధనకు, దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రాముఖ్యతనిద్దాం.

[8వ పేజీలోని చిత్రం]

“యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది”

[9వ పేజీలోని చిత్రం]

క్రియాశీలుడైన, కనికర భావాలుగల నెహెమ్యా యెరూషలేముకు తిరిగివస్తాడు

[10, 11వ పేజీలోని చిత్రాలు]

దేవుని వాక్యానికి ఎలా ‘అర్థము చెప్పాలో’ మీకు తెలుసా?