కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఆదికాండము 44:5లో సూచించబడినట్లు కనిపిస్తున్నట్లుగా యెహోవా నమ్మకమైన సేవకుడైన యోసేపు శకునాలు చూడడానికి ఒక ప్రత్యేకమైన వెండి గిన్నెను ఉపయోగించాడా?

యోసేపు నిజానికి ఏదో ఒక రకమైన శకునాన్ని ఉపయోగించాడని నమ్మడానికి ఎలాంటి కారణమూ లేదు.

భవిష్యత్తు తెలుసుకునేందుకు మాంత్రిక విద్యలను ఉపయోగించడం గురించి యోసేపుకున్న నిజమైన అవగాహనను బైబిలు వెల్లడిచేస్తోంది. కొంతకాలం క్రితం తన కలల భావం చెప్పమని ఫరో ఆయనను అడిగినప్పుడు, దేవుడు మాత్రమే సంభవించనున్న ఘటనల గురించి “ఉత్తరమిచ్చునని” పదేపదే నొక్కిచెప్పాడు. తత్ఫలితంగా, యోసేపు ఆరాధించిన దేవుడు అంటే మాంత్రిక శక్తులుకాదు గానీ సత్య దేవుడే భవిష్యత్తు గురించిన వివరాలను యోసేపు తెలుసుకునేలా చేశాడని ఫరో స్వయంగా నమ్మడం ప్రారంభించాడు. (ఆదికాండము 41:16, 25, 28, 32, 39) యెహోవా కొంతకాలం తర్వాత మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఇంద్రజాలం లేక శకునం ఉపయోగించడాన్ని నిషేధించాడు, అలా తాను మాత్రమే భవిష్యత్తు గురించి ప్రవచిస్తానని ధ్రువీకరించాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 18:​10-12.

అయితే, యోసేపు తాను ‘శకునాలు చూడడానికి’ వెండి గిన్నెను ఉపయోగిస్తానని తన సేవకునితో ఎందుకు చెప్పించాడు? * (ఆదికాండము 44:⁠5) ఆ వాక్యాన్ని యోసేపు ఏ పరిస్థితుల్లో చెప్పాడో మనం పరిశీలించాలి.

యోసేపు సహోదరులు తీవ్ర కరవు కారణంగా ఆహారం సంపాదించుకునేందుకు ఐగుప్తుకు వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆ సహోదరులే యోసేపును దాసత్వంలోకి అమ్మేశారు. ఇప్పుడు వారు తమకు తెలియకుండానే, ఐగుప్తు ఆహార సరఫరా అధికారిగా మారిన తమ సహోదరుణ్ణి సహాయం కోసం విన్నవించుకున్నారు. యోసేపు తన గుర్తింపును వెల్లడి చేయలేదు. దానికి బదులు ఆయన వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే యోసేపు వారు నిజంగా పశ్చాత్తాపపడ్డారో లేదో తెలుసుకోవాలనుకున్నాడు. అంతేకాక, వారు తమ సహోదరుడు బెన్యామీనును, ఆయనను చాలా ఇష్టపడే తమ తండ్రియైన యాకోబును ప్రేమిస్తున్నారో లేదో, ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలనుకున్నాడు. కాబట్టి యోసేపు ఉపాయం పన్నాడు.​—⁠ఆదికాండము 41:55-44:⁠3.

తన సహోదరుల సంచుల్లో ధాన్యం నింపి, ప్రతీ ఒక్కరి ధనాన్ని వారి సంచుల మూతిలో తిరిగిపెట్టమని, బెన్యామీను సంచి మూతిలో తన వెండి గిన్నెను పెట్టమని ఒకానొక సేవకునికి యోసేపు ఆజ్ఞాపించాడు. దీనంతటిలో యోసేపు ఒక అన్య దేశపు అధికారిగా వ్యవహరిస్తున్నాడు. ఏమి జరుగుతుందో తెలియని తన సహోదరుల దృష్టిలో ఒక అధికారిగా కనిపించేందుకు ఆ పాత్రకు సరిపోయే విధంగా తనను తాను మలచుకోవడమే కాక, తన చర్యలను, తన భాషను కూడా మలచుకున్నాడు.

యోసేపు తన సహోదరులను కలిసినప్పుడు వారిని ఇలా అడగడం ద్వారా తన ఉపాయాన్ని కొనసాగించాడు: “నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా?” (ఆదికాండము 44:​15) కాబట్టి, ఆ గిన్నె యోసేపు పన్నిన ఉపాయంలో కేవలం ఒక భాగమనేది స్పష్టం. బెన్యామీను గిన్నెను దొంగలించడం ఎలాగైతే నిజం కాదో అలాగే యోసేపు శకునాలు చూడడానికి గిన్నెను ఉపయోగించడం నిజం కాదు.

[అధస్సూచి]

^ పేరా 5 ఈ ప్రాచీన అభ్యాసాన్ని వివరిస్తూ ఎఫ్‌. సి. కుక్‌ సంపాదకత్వంలో ముద్రించబడిన ద హోలీ బైబిల్‌, విత్‌ యాన్‌ ఎక్స్‌ప్లనేటరీ అండ్‌ క్రిటికల్‌ కామెంట్రీ ఇలా వివరిస్తోంది: “బంగారాన్ని, వెండిని లేక రత్నాలను నీళ్ళలో పడేసి వాటి రూపాన్ని పరిశీలించడం ద్వారా లేదా అద్దంలోకి చూసినట్లు నీళ్ళలోకి చూడడం ద్వారా దానిని అభ్యసించేవారు.” బైబిలు వ్యాఖ్యాత క్రిస్టఫర్‌ వర్డ్స్‌వర్త్‌ ఇలా అంటున్నాడు: “కొన్నిసార్లు గిన్నె నీళ్లతో నింపబడేది, గిన్నెలోని నీళ్ళలో ఏర్పడే సూర్యుని ప్రతిరూపం ఆధారంగా జవాబివ్వబడేది.”