కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తనను కనుగొనేందుకు నాకు సహాయం చేశాడు

యెహోవా తనను కనుగొనేందుకు నాకు సహాయం చేశాడు

జీవిత కథ

యెహోవా తనను కనుగొనేందుకు నాకు సహాయం చేశాడు

ఫ్లారెన్స్‌ క్లార్క్‌ చెప్పినది

తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నా భర్త చెయ్యి పట్టుకున్నాను. ఆంగ్లికన్‌ చర్చి అనుయాయిగా నేను, నా భర్త కోలుకోవాలని దేవునికి ప్రార్థించాను, ఆయన బ్రతికి బయటపడితే దేవుడు దొరికే వరకు దేవుని కోసం వెదుకుతాననీ, ఆ తర్వాత ఆ దేవుని కోసమే జీవిస్తాననీ వాగ్దానం చేశాను.

ఫ్లారెన్స్‌ చూలంగ్‌ అనే నేను పశ్చిమ ఆస్ట్రేలియాలోని సుదూర కింబర్లీ పీఠభూమి ప్రాంతంలోవున్న ఊమ్బల్గర్రీ ఆదివాసుల సమాజంలో, 1937 లో సెప్టెంబరు 18న జన్మించాను.

నిశ్చింతగా, సంతోషంగా గడిచిపోయిన చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నాకెన్నో ఉన్నాయి. చర్చిలో నేను దేవుని గురించి, బైబిలు గురించి కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకున్నాను, కానీ మా అమ్మే నాకు క్రైస్తవ సూత్రాలు నేర్పించింది. ఆమె నాకు క్రమంగా బైబిలు చదివి వినిపించేది, చిన్ననాటి నుండే నేను ఆధ్యాత్మిక విషయాలపట్ల మక్కువ ఏర్పర్చుకున్నాను. తన చర్చిలో మిషనరీగా ఉన్న మా చిన్నమ్మ అంటే నాకెంతో ఇష్టం. ఆమె అడుగుజాడల్లో నడవాలని నా మనసులో కోరుకునేదాన్ని.

మునుపు ఫారెస్ట్‌ రివర్‌ మిషన్‌ అని పిలువబడిన మా సమాజంలో, ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉండేది. నేను ప్రతీ ఉదయం కేవలం రెండు గంటలు మాత్రమే పాఠశాలకు వెళ్ళేదాన్ని. అంటే నా చదువు అంతంత మాత్రంగా సాగేది, ఈ విషయం మా నాన్నగారిని చాలా కలతపరిచేది. తన పిల్లలు బాగా చదువుకోవాలని ఆయన కోరుకునేవాడు, అందుకే మా కుటుంబమంతా ఊమ్బల్గర్రీ వదిలి విన్‌దామ్‌ పట్టణానికి వెళ్ళాలని నిశ్చయించాడు. మేము అలా బయల్దేరిన రోజున నేను చాలా బాధపడ్డాను, కానీ విన్‌దామ్‌లో నేను తర్వాతి నాలుగు సంవత్సరాలు అంటే 1949 నుండి 1952 వరకు రోజంతా పాఠశాలకు వెళ్ళగలిగేదాన్ని. మా నాన్నగారు నేనలా చదువుకోవడానికి ఏర్పాటు చేసినందుకు నేనెంతో కృతజ్ఞురాలిని.

అమ్మ స్థానిక వైద్యుని దగ్గర పనిచేసేది, నేను 15 ఏళ్ళ వయసులో పాఠశాల చదువు ముగించడంతో, ఈ వైద్యుడు విన్‌దామ్‌ హాస్పిటల్‌లో నాకు నర్సుగా ఉద్యోగం ఇస్తానన్నాడు. ఆ రోజుల్లో ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉండేది, అందుకే నేను సంతోషంగా ఒప్పుకున్నాను.

కొన్ని సంవత్సరాల తర్వాత నేను అలెక్‌ను కలిశాను, ఆయన శ్వేతజాతీయుడైన పశువుల కాపరి. మేము 1964లో, డెర్బీ పట్టణంలో వివాహం చేసుకున్నాము, నేను అక్కడే ఆంగ్లికన్‌ చర్చికి క్రమంగా వెళ్ళేదాన్ని. ఒకరోజు యెహోవాసాక్షులు మా ఇంటికి వచ్చారు. నాకు ఏ మాత్రం ఆసక్తి లేదనీ, మళ్లీ నా దగ్గరికి రావద్దనీ వాళ్లకు చెప్పాను. అయినా వాళ్లు చెప్పిన ఒక విషయం నాకు ఆసక్తి కలిగించింది, అది దేవుని పేరు యెహోవా అన్న విషయం.

“మీరు మీ సొంతగా ప్రార్థన చేసుకోలేరా?”

1965లో జీవితం చాలా కష్టభరితం కావడం ప్రారంభించింది. నా భర్త రెండుసార్లు తన గుఱ్ఱం మూలంగా, ఒకసారి తన కారు మూలంగా, మొత్తం మూడుసార్లు చాలా తీవ్రమైన ప్రమాదాలకు గురయ్యాడు. అయితే ఆయన ఈ మూడు ప్రమాదాల నుండీ కోలుకుని తిరిగి పని చేయడం ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత కొద్దికాలానికే, ఆయన గుఱ్ఱం మూలంగా మరో ప్రమాదానికి గురయ్యాడు. ఈ సారి ఆయన తలకు బాగా దెబ్బలు తగిలాయి. నేను హాస్పిటల్‌కు చేరుకునేసరికి, నా భర్త బ్రతకడం కష్టమని డాక్టరు చెప్పాడు. నేను కుప్పకూలిపోయాను. ఒక నర్సు నన్ను చూడడానికి రమ్మని ఒక ప్రీస్టుకు చెప్పింది, కానీ అతడు, “ఈ రోజు కాదు, రేపు వస్తాను” అన్నాడు.

ప్రీస్టు నా దగ్గర ఉండి నాతో కలిసి ప్రార్థించాలని నేను కోరుకుంటున్నట్లు నర్సుకు చెప్పాను. ఆమె, “మీకేమైంది? మీరు మీ సొంతగా ప్రార్థన చేసుకోలేరా?” అంది. దానితో నేను చర్చి విగ్రహాలకు ప్రార్థించడం మొదలుపెట్టాను, గానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు. నా భర్త మరణానికి చేరువవుతున్నట్లు అనిపించింది. ‘నా భర్త చనిపోతే నేనెలా తట్టుకోగలను?’ అనుకున్నాను. క్రిస్టీన్‌, నానెట్‌, జెఫ్రీ అనే నా ముగ్గురు పిల్లల గురించి కూడా నాకు చింతగా ఉంది. తండ్రి లేకుండా వారి జీవితమెలా ఉంటుంది? సంతోషకరంగా, మూడు రోజుల తర్వాత నా భర్త స్పృహలోకి వచ్చాడు, దానితో ఆయన 1966 డిసెంబరు 6న డిస్చార్జి చేయబడ్డాడు.

నా భర్త బాగానే కోలుకున్నా, ఆయన మెదడుకు మాత్రం దెబ్బ బాగా తగిలింది. దానితో ఆయన కొంత జ్ఞాపకశక్తి కోల్పోయి, దౌర్జన్యపూరితంగా తయారయ్యాడు, ఆయన మనోభావాలు ఎప్పుడూ మారుతూ ఉండేవి. ఆయనకు పిల్లల్ని సహించడం కష్టంగా ఉండేది, వాళ్ళు పెద్దవాళ్ళలా స్పందించకపోతే ఆయనకు విపరీతమైన కోపం వచ్చేది. ఆయన గురించి శ్రద్ధ తీసుకోవడం కష్టమైపోయేది. ఆయనకు దాదాపు అన్ని పనులూ నేనే చేయాలి. చివరికి చదవడం, వ్రాయడం కూడా నేను ఆయనకు మళ్ళీ నేర్పించాను. ఇతర ఇంటిపనులన్నీ చేసుకుంటూ ఆయన గురించి శ్రద్ధ తీసుకోవడం నాకు చాలా కష్టమైపోయింది, మానసికంగా నేను బాగా దెబ్బతిన్నాను. నా భర్తకు ప్రమాదం జరిగిన ఏడు సంవత్సరాల తర్వాత, నేను ఆరోగ్యం పుంజుకునేదాకా మేము విడిగా ఉండాలని నిశ్చయించుకున్నాము.

నేను పిల్లల్ని తీసుకుని దక్షిణంగావున్న పెర్త్‌ నగరానికి వెళ్ళాను. నేను అలా వెళ్ళేముందు, నా చెల్లెలు పశ్చిమ ఆస్ట్రేలియాలోని కునునుర్రా అనే చిన్న పట్టణంలోవున్న యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించింది. నిత్యజీవమునకు నడుపు సత్యము * అనే పుస్తకంలో, పరదైసు భూమి గురించిన బైబిలు వాగ్దానాన్ని చూపించే చిత్రాన్ని ఆమె నాకు చూపించింది. ఈ పుస్తకంలో నుండి, ఆమె నాకు దేవుని పేరు యెహోవా అని చూపించింది, ఇది నన్నెంతో ఆకర్షించింది. మా చర్చిలో ఈ విషయాలు నాకెప్పుడూ చెప్పబడలేదు కాబట్టి, నేను పెర్త్‌లో స్థిరపడ్డాక యెహోవాసాక్షులకు ఫోన్‌ చేయాలని నిర్ణయించుకున్నాను.

కానీ వాళ్ళను సంప్రదించడానికి నేను కాస్త సంకోచించాను. ఒక సాయంకాలం మా కాలింగ్‌ బెల్‌ మ్రోగింది. మా అబ్బాయి తలుపు తెరిచి, గబగబా నా దగ్గరికి వచ్చి, “అమ్మా, నువ్వు ఫోన్‌ చేద్దామనుకున్నావు చూడు, వాళ్ళు వచ్చారు” అని చెప్పాడు. నాకు కాస్త ఆశ్చర్యం అనిపించింది, “నేను లేనని చెప్పు!” అన్నాను. కానీ వాడు, “అబద్ధాలు చెప్పకూడదు కదమ్మా” అన్నాడు. బుద్ధి తెచ్చుకుని తలుపు దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్లను పలకరిస్తూ, వాళ్ళ ముఖాల్లో ఆశ్చర్యాన్ని గమనించాను. వాళ్ళు ఆ ఇంట్లో ఇంతకుముందు అద్దెకున్న వ్యక్తిని కలవడానికి వచ్చారు. నేను వాళ్ళను లోపలికి ఆహ్వానించి, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసి, బైబిలు నుండి సంతృప్తికరమైన సమాధానాలు పొందాను.

తర్వాతి వారం, నిత్యజీవమునకు నడుపు సత్యము అనే పుస్తకాన్ని ఉపయోగిస్తూ నేను సాక్షులతో క్రమంగా బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఆ అధ్యయనం ఆధ్యాత్మిక విషయాలపట్ల నాకున్న ప్రేమను పునర్‌జాగృతం చేసింది. రెండు వారాల తర్వాత నేను క్రీస్తుయేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యాను. నేను ప్రతీ ఆదివారం కూటాలకు హాజరవడం మొదలుపెట్టాను, కొద్దికాలానికే నేను వారం మధ్యలో జరిగే కూటాలకు కూడా హాజరయ్యేదాన్ని. నేను తెలుసుకుంటున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం కూడా మొదలుపెట్టాను. బైబిలు సత్యాలు తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయడం నా మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లు గ్రహించాను. ఆరునెల్ల తర్వాత నేను పెర్త్‌లో జరిగిన జిల్లా సమావేశంలో బాప్తిస్మం తీసుకున్నాను.

నేను ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తుండగా, “ఏ స్త్రీకైనను అవిశ్వాసియైన భర్తయుండి, ఆమెతో కాపురముచేయ నిష్టపడినయెడల, ఆమె అతని పరిత్యజింపకూడదు” అని చెబుతున్న 1 కొరింథీయులు 7:13లోని బైబిలు సూత్రంతో సహా వివాహ పవిత్రత గురించిన యెహోవా దృక్కోణాన్ని అర్థం చేసుకున్నాను. ఈ లేఖనం నేను అలెక్‌ దగ్గరికి తిరిగి వెళ్ళడానికి నన్ను పురికొల్పింది.

డెర్బీకి తిరిగిరావడం

నేను ఐదుకంటే ఎక్కువ సంవత్సరాలు నా భర్త నుండి దూరంగా ఉన్న తర్వాత, 1979, జూన్‌ 21న డెర్బీకి తిరిగి వచ్చాను. నా భావాలు కలగాపులగంగా ఉన్నాయి, నా పునరాగమనానికి ఆయనెలా ప్రతిస్పందిస్తాడో అని ఆలోచిస్తున్నాను. నన్ను ఆశ్చర్యపరుస్తూ, నా రాకకు ఆయన సంతోషించాడు, అయితే నేను యెహోవాసాక్షినయ్యానని విని ఆయన కాస్త నిరాశచెందాడు. ఆయన వెంటనే, నేను తన చర్చికి, అంటే నేను పెర్త్‌కు వెళ్ళకముందు హాజరైన చర్చికి హాజరవ్వాలని చెప్పాడు. నేనలా చేయలేనని చెప్పాను. నేను ఆయన శిరస్సత్వాన్ని గౌరవించడానికి తీవ్రంగా కృషి చేస్తూ, క్రైస్తవ భార్యగా నేను చేయగలిగింది చేశాను. నేను యెహోవా గురించి, భవిష్యత్తు కోసం ఆయన చేసిన అద్భుతమైన వాగ్దానాల గురించి మాట్లాడడానికి ప్రయత్నించాను గానీ నా భర్త ఏ మాత్రం ప్రతిస్పందించలేదు.

అయితే, కొంతకాలానికి, అలెక్‌ నా క్రొత్త జీవన విధానాన్ని అంగీకరించడమేగాక నేను వారపు కూటాలకు, సమావేశాలకు హాజరవడానికి నాకు ఆర్థికంగా సహాయం చేయడం కూడా మొదలుపెట్టాడు. నేను క్రైస్తవ పరిచర్యలో ఉపయోగించుకోవడానికి నా కోసం ఆయన ఒక కారు కొన్నప్పుడు ఆయనపట్ల నాకెంతో కృతజ్ఞతాభావం కలిగింది, ఆస్ట్రేలియాలోని ఆ మారుమూల ప్రదేశంలో కారు నిజంగా ఎంతో ఉపయోగకరమైనది. ప్రాంతీయ పైవిచారణకర్తతో సహా సహోదర సహోదరీలు ఎన్నోరోజులు మా ఇంట్లో ఉండేవారు. ఇది అలెక్‌ అనేకమంది సాక్షులను తెలుసుకోవడానికి దోహదపడింది, ఆయన వారి సహచర్యాన్ని ఆనందిస్తున్నట్లు కనిపించేది.

నాకు యెహెజ్కేలులా అనిపించింది

సహోదర సహోదరీలు సందర్శిస్తే నాకెంతో సంతోషం కలిగేది, కానీ నేను ఒక సవాలునెదుర్కోవలసి వచ్చేది. నేను డెర్బీ పట్టణంలో నివసిస్తున్న ఏకైక సాక్షిని. 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రూమ్‌ సంఘమే మాకు అత్యంత దగ్గర్లో ఉన్న సంఘం. కాబట్టి సువార్త ప్రకటించడానికి నేను చేయగలిగిందంతా చేయాలని నిర్ణయించుకున్నాను. యెహోవా సహాయంతో నన్ను నేను సంస్థీకరించుకుని, ఇంటింటికి వెళ్ళి సాక్ష్యమివ్వడం మొదలుపెట్టాను. ఈ పని నాకు చాలా కష్టంగా అనిపించేది, కానీ అపొస్తలుడైన పౌలు చెప్పిన ఈ మాటలను నాకు నేను గుర్తుచేసుకుంటూ ఉండేదాన్ని: “నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను.”​—⁠ఫిలిప్పీయులు 4:​13.

స్థానిక మతనాయకులకు నా కార్యకలాపాలు, ముఖ్యంగా నేను తోటి ఆదివాసులకు సాక్ష్యమివ్వడం అంతగా నచ్చేదికాదు. వాళ్ళు నన్ను భయపెట్టి, నా ప్రకటనా పనిని ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ల వ్యతిరేకత నేను మరింత నిశ్చయతతో కొనసాగేలా చేసింది, నేను సహాయం కోసం క్రమంగా యెహోవాకు ప్రార్థించేదాన్ని. యెహెజ్కేలుకు ఇవ్వబడిన ఈ ప్రోత్సాహకరమైన మాటలను నేను తరచూ గుర్తుచేసుకునేదాన్ని: “ఇదిగో! వారి ముఖమువలెనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసెదను, వారి నుదురు వలెనే నీ నుదురును కఠినమైనదిగా చేసెదను. నీ నుదురు చెకుముకి రాతికంటె కఠినముగా ఉండు వజ్రమువలె చేసెదను; వారికి భయపడకుము, . . . వారిని చూచి జడియకుము.”​—⁠యెహెజ్కేలు 3:8, 9.

చాలా సందర్భాల్లో, నేను కావలసిన వస్తువులు కొనుక్కుంటున్నప్పుడు ఒక చర్చి గుంపుకు చెందిన ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చేవారు. కొనుగోలు చేస్తున్న ఇతరుల అవధానాన్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ వాళ్ళు బిగ్గరగా నన్ను హేళనచేసేవారు. నేను వాళ్ళను పట్టించుకోనేదాన్నికాదు. ఒకసారి, ఆసక్తిగల ఒక స్త్రీ దగ్గరికి పునర్దర్శనానికి నేను వెళ్ళినప్పుడు, స్థానిక చర్చికి చెందిన ఒక పరిచారకుడు వచ్చి, నేను యేసును నమ్మడం లేదని నన్ను నిందించాడు. అతడు నా చేతిలో నుండి బైబిలు లాక్కుని, బెదిరిస్తున్నట్లు దాన్ని నా ముఖానికి ఎదురుగా అటూఇటూ ఊపి మళ్ళీ నా చేతిలో పెట్టాడు. నేను సూటిగా ఆయనవైపు చూస్తూ, నెమ్మదిగానే అయినా స్థిరంగా యోహాను 3:⁠16ని ఎత్తిచూపిస్తూ, నాకు యేసుపై విశ్వాసం ఉందని ఆయనకు దృఢంగా చెప్పాను. నా దృఢమైన సమాధానం విని అతడు అవాక్కై, మారు మాట్లాడకుండా అక్కడినుండి వెళ్ళిపోయాడు.

డెర్బీలోవున్న ఆదివాసులకు ప్రకటించడంలో నేను చాలా ఆనందాన్ని పొందాను. స్థానిక ప్రీస్టు నేను ప్రత్యేకంగా ఒక సమాజంలోని ప్రజల దగ్గరికి వెళ్ళకుండా నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు, కానీ అతనికి అక్కడినుండి బదిలీ అయిపోయింది. అలా, నేను వాళ్ళకుకూడా బైబిలు సందేశం అందజేయగలిగాను. నేను మా చిన్నమ్మలా మిషనరీని కావాలని ఎప్పుడూ కోరుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను దేవుని వాక్యం గురించి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేస్తూ మిషనరీ సేవనే చేస్తున్నాను. నా ప్రకటనా పనికి చాలామంది ఆదివాసులు చక్కగా ప్రతిస్పందించారు, నేను చాలా బైబిలు అధ్యయనాలు ప్రారంభించాను.

నా ఆధ్యాత్మిక అవసరంపట్ల శ్రద్ధ కలిగివుండడం

దాదాపు ఐదు సంవత్సరాలపాటు డెర్బీలో నేను ఒక్కదాన్నే యెహోవాసాక్షిని. తోటి ఆరాధకులతో కలిసి క్రమమైన కూటాల ప్రోత్సాహం లేకుండా నేను ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం కష్టమవుతున్నట్లు గ్రహించాను. ఒక సందర్భంలో, నేను చాలా నిరుత్సాహపడి, కారు తీసుకుని అలా బయటికి వెళ్ళాను. ఆ సాయంకాలం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఒక సహోదరి, ఆమె ఏడుగురు పిల్లలు నాకోసం ఎదురుచూస్తున్నారు. చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రూమ్‌ సంఘం నుండి వాళ్ళు నా కోసం సాహిత్యాలు తీసుకువచ్చారు. అప్పటినుండి, బెట్టీ బట్టర్‌ఫీల్డ్‌ అనే ఈ సహోదరి నెలకొకసారి నా దగ్గరికి వచ్చి, వారాంతంలో నాతోపాటు ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంది. మేమిద్దరం కలిసి ప్రకటించి, తర్వాత మా ఇంట్లోనే ఇద్దరం కలిసి కావలికోట అధ్యయనం చేసుకునేవాళ్ళం. నెలకొకసారి నేను కూడా బ్రూమ్‌కు అలాగే వెళ్ళేదాన్ని.

బ్రూమ్‌లోని సహోదరులు ఎంతో సహాయకరంగా ఉండి, అప్పుడప్పుడూ నాకు క్షేత్రసేవలో సహాయం చేయడానికి ఎంతో దూరంలోవున్న డెర్బీకి వచ్చేవారు. డెర్బీగుండా వెళ్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి, నాతో కలిసి పరిచర్య చేయమని వాళ్ళు ఇతర పట్టణాల సహోదర సహోదరీలను కోరారు. వీరు నా కోసం బహిరంగ ప్రసంగాల క్యాసెట్లు కూడా తెచ్చేవారు. కొందరు నాతో కలిసి కావలికోట అధ్యయనం చేసేవారు. ఈ క్లుప్త సందర్శనాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవి.

మరింత సహాయం రాబోతోంది

కొన్ని సంవత్సరాలపాటు, పశ్చిమ ఆస్ట్రేలియాలోని దక్షిణ భాగానికి చెందిన, ఉద్యోగ విరమణ చేసిన, ఆర్థర్‌ మరియు మేరీ విల్లీస్‌ అనే దంపతులు, చల్లగా ఉండే కాలాల్లో మూడు నెలలపాటు నాకు సహాయం చేయడానికి వచ్చినప్పుడల్లా నేను మరింత పురికొల్పబడేదాన్ని. సహోదరుడు విల్లీస్‌ కూటాల్లోని దాదాపు అన్ని భాగాలు నిర్వహిస్తూ, క్షేత్ర పరిచర్యలో నాయకత్వం వహించేవాడు. మేమ్ముగ్గురం కలిసి కింబర్లీ పీఠభూమిలోని సుదూర ప్రాంతాలకు ప్రయాణించి, ఈ దూర ప్రాంతాల్లో ఉన్న పశుపాలనా క్షేత్రాలను సందర్శించేవాళ్ళం. సహోదరుడు, సహోదరి విల్లీస్‌ వెళ్ళిపోతున్నప్పుడల్లా నాకెంతో బాధగా అనిపించేది.

చివరకు, 1983 చివరిభాగంలో, డానీ మరియు డెనీస్‌ స్టర్జన్‌ అనే దంపతులు, వాళ్ల నలుగురు కుమారులు డెర్బీలో నివసించడానికి వస్తున్నారనే సంతోషకరమైన వార్త నాకు అందింది. వాళ్ళు వచ్చాక, మేము క్రమంగా వారపు కూటాలు జరుపుకునేవాళ్ళం, క్షేత్రసేవకు వెళ్ళేవాళ్లం. 2001లో ఒక సంఘం ఏర్పడింది. నేడు, డెర్బీలో 24మంది రాజ్యప్రచారకులున్న బలమైన సంఘం ఉంది, దానిలో ఆధ్యాత్మికంగా మా పట్ల చక్కని శ్రద్ధతీసుకునే ఇద్దరు పెద్దలు, ఒక పరిచర్య సేవకుడు ఉన్నారు. మా కూటాలకు అప్పుడప్పుడూ దాదాపు 30 మందిదాకా హాజరవుతారు.

నేను గడిచిన సంవత్సరాల గురించి ఆలోచించినప్పుడు, యెహోవా తన సేవ చేయడానికి నాకు ఎలా సహాయం చేశాడో చూస్తే నాకెంతో సంతోషం కలుగుతుంది. నా భర్త ఇప్పటికింకా సాక్షి కాకపోయినా, ఇతర విధాలుగా నాకు మద్దతు ఇస్తూనే ఉన్నాడు. నా కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అంటే నా ఇద్దరు కూతుర్లు, ఇద్దరు మనమరాళ్ళు, నా చెల్లి కూతురు బాప్తిస్మం తీసుకున్న సాక్షులయ్యారు. అంతేగాక, నా బంధువుల్లో చాలామంది యెహోవా ప్రజలతో బైబిలు అధ్యయనం చేస్తున్నారు.

యెహోవా తనను కనుగొనేందుకు నాకు సహాయం చేసినందుకు నేను ఆయనకు నిజంగా కృతజ్ఞురాలిని. నేను ఎప్పటికీ ఆయన కోసమే జీవించాలని నిశ్చయించుకున్నాను.​—⁠కీర్తన 65:⁠2.

[అధస్సూచి]

^ పేరా 14 యెహోవాసాక్షులు ప్రచురించినది, కానీ ఇప్పుడది ముద్రణలో లేదు.

[15వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆస్ట్రేలియా

విన్‌దామ్‌

కింబర్లీ పీఠభూమి

డెర్బీ

బ్రూమ్‌

పెర్త్‌

[చిత్రసౌజన్యం]

కంగారూ, లైర్‌పక్షి: Lydekker; కోలా: Meyers

[14వ పేజీలోని చిత్రం]

విన్‌దామ్‌ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేయడం, 1953లో

[15వ పేజీలోని చిత్రం]

డెర్బీ సంఘం, 2005లో