కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘సకల జనములకు సాక్ష్యము’

‘సకల జనములకు సాక్ష్యము’

‘సకల జనములకు సాక్ష్యము’

‘భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులైయుందురు.’​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8.

మత్తయి 24:14లో వ్రాయబడిన యేసు మాటలు మనకెంత పరిచయమంటే, మనలో చాలామందికి అవి కంఠస్థమే. అది నిజంగా ఎంత గమనార్హమైన ప్రవచనమో కదా! శిష్యులు మొదటిసారి దాన్ని విన్నప్పుడు వారేమి తలంచివుంటారో ఊహించండి! అది సా.శ. 33వ సంవత్సరం. ఆ శిష్యులు మూడు సంవత్సరాలుగా యేసుతో ఉన్నారు, వారిప్పుడు ఆయనతో కలిసి యెరూషలేముకు వచ్చారు. ఆయన చేసిన అద్భుతాలను చూశారు, ఆయన బోధలు విన్నారు. యేసు తమకు బోధించిన ప్రశస్తమైన సత్యాలనుబట్టి వారు ఆనందించినా, అందరూ తమలా ఆనందంగా లేరని వారికి తెలుసు. యేసుకు అధికారం, పరపతిగల శత్రువులు ఉన్నారు.

2 ఒలీవ కొండపై యేసుతోపాటు నలుగురు శిష్యులు కూర్చొని, ఆయన రానున్న ప్రమాదాల గురించి వారు ఎదుర్కొనబోయే సవాళ్ల గురించి చెబుతుండగా వారు జాగ్రత్తగా వింటున్నారు. అంతకుముందు, యేసు వారితో తాను చంపబడతానని చెప్పాడు. (మత్తయి 16:21) అయితే వారు కూడా క్రూరమైన హింసను అనుభవిస్తారని ఆయనిప్పుడు స్పష్టం చేశాడు. ఆయనిలా అన్నాడు: “జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.” అంతేకాదు, అబద్ధ ప్రవక్తలు అనేకులను మోసగిస్తారు. కొందరు అభ్యంతరపడి, పరస్పరం వంచించుకుంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఇంకా ఇతరులు, నిజానికి, “అనేకులు” దేవునిపట్ల, ఆయన వాక్యంపట్ల తమ ప్రేమ చల్లారిపోవడానికి అనుమతిస్తారు.​—⁠మత్తయి 24:9-12.

3 అలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల గురించి ముందే చెప్పిన తర్వాత, శిష్యులను ఆశ్చర్యానికి గురిచేసిన ఈ మాటలను యేసు పలికాడు: “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్తయి 24:14) అవును, ఇశ్రాయేలులో యేసు ఆరంభించిన పని అంటే “సత్యమును గూర్చి సాక్ష్యమి[చ్చే]” పని కొనసాగి భూవ్యాప్తంగా విస్తరిస్తుంది. (యోహాను 18:37) నిజంగా అదెంత ఆశ్చర్యకరమైన ప్రవచనమో కదా! ఆ పనిని “సకల జనములకు” విస్తరింపజేయడం ఒక సవాలే కాక, ‘సకల జనములు ద్వేషిస్తున్నా,’ ఆ పనిని కొనసాగించడం నిజంగా ఒక అద్భుతమే. ఈ బృహత్‌ కార్యాన్ని సాధించడం యెహోవా సర్వాధిపత్యాన్ని, శక్తినే కాక, ఆయన ప్రేమను, కనికరాన్ని, ఓర్పును కూడా ఘనపరుస్తుంది. అంతేకాక అది ఆయన సేవకులకు తమ విశ్వాసాన్ని, భక్తిని ప్రదర్శించే అవకాశాన్నిస్తుంది.

4 యేసు తన శిష్యుల భుజస్కంధాలపై నెరవేర్చవలసిన బృహత్‌ కార్యం ఉందని వారికి స్పష్టం చేశాడు. తాను పరలోకానికి ఆరోహణమవడానికి ముందు యేసు వారికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొస్తలుల కార్యములు 1:8) అయితే, త్వరలోనే ఇతరులూ వారితో కలిసి పనిచేస్తారు. అయినప్పటికీ శిష్యుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. ఈ దైవిక నియామకాన్ని నెరవేర్చేలా దేవుని పరిశుద్ధాత్మ వారిని శక్తిమంతులను చేస్తుందని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరమో కదా!

5 సువార్త ప్రకటించి “సమస్త జనులను శిష్యులనుగా” చేయాలని ఆ శిష్యులకు తెలుసు. (మత్తయి 28:19, 20) అయితే, ఆ సాక్ష్యాన్ని ఎంత సమగ్రంగా ఇవ్వాలి, అంతమెప్పుడు వస్తుంది అనేవి వారికి తెలియదు. మనకూ తెలియదు. ఇవి కేవలం యెహోవా మాత్రమే తీర్మానించే విషయాలు. (మత్తయి 24:36) యెహోవా తృప్తిమేరకు సాక్ష్యమివ్వబడినప్పుడు, ఆయన ఈ దుష్ట విధానాన్ని అంతం చేస్తాడు. అప్పుడు మాత్రమే క్రైస్తవులు యెహోవా సంకల్పం మేరకు ప్రకటనా పని నెరవేర్చబడిందని గ్రహిస్తారు. ఈ యుగాంతంలో సాక్ష్యం ఎంత విస్తృతంగా ఇవ్వబడుతుందో ఆ తొలి శిష్యులు ఏ మాత్రం ఊహించివుండరు.

మొదటి శతాబ్దంలో ఇవ్వబడిన సాక్ష్యము

6 మొదటి శతాబ్దంలో రాజ్య ప్రకటనా పని, శిష్యులను చేసే పని ఆశ్చర్యకరమైన ఫలితాలు తీసుకొచ్చింది. సా.శ. 33 పెంతెకొస్తునాడు యెరూషలేములో దాదాపు 120 మంది శిష్యులు ఒక మేడగదిలో ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడినప్పుడు, అపొస్తలుడైన పేతురు ఆ అద్భుతం యొక్క భావాన్ని వివరిస్తూ ప్రేరణాత్మక ప్రసంగమిచ్చాడు. ఫలితంగా దాదాపు 3,000 మంది విశ్వాసులై బాప్తిస్మం తీసుకున్నారు. అది ఆరంభం మాత్రమే. సువార్త ప్రకటనా పనిని ఆపుజేయాలని మతనాయకులు కంకణం కట్టుకుని ప్రయత్నించినప్పటికీ, ‘యెహోవా, రక్షణ పొందుచున్నవారిని అనుదినము శిష్యులతో చేర్చుచుండెను.’ అనతికాలంలోనే ఆ “సంఖ్య అయిదు వేలు ఆయెను.” ఆ తర్వాత “పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కువగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.”​—⁠అపొస్తలుల కార్యములు 2:1-4, 8, 14, 41, 47; 4:4; 5:​14.

7 సా.శ. 36వ సంవత్సరంలో మరో విశేషమైన సంఘటన జరిగింది, అన్యుడైన కొర్నేలీ క్రైస్తవుడై బాప్తిస్మం తీసుకున్నాడు. యెహోవా దైవభక్తిగల ఈ మనుష్యుని దగ్గరకు అపొస్తలుడైన పేతురును పంపిస్తూ, “సమస్త జనులను శిష్యులనుగా” చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞ వివిధ ప్రాంతాల్లోని యూదులకు మాత్రమే పరిమితం కాదని చూపించాడు. (అపొస్తలుల కార్యములు 10:44, 45) నాయకత్వం వహిస్తున్నవారి ప్రతిస్పందన ఎలావుంది? యూదేతర జనములకు కూడా సువార్తను ప్రకటించాలని అపొస్తలులు, యూదయలోని పెద్దలు గ్రహించినప్పుడు వారు దేవుణ్ణి మహిమపరిచారు. (అపొస్తలుల కార్యములు 11:1, 18) అదలా ఉండగా, ప్రకటనా పని యూదుల్లో ఎడతెగక సత్ఫలితాలు సాధించింది. కొన్ని సంవత్సరాల తర్వాత, బహుశా సా.శ. 58వ సంవత్సరానికి అన్య విశ్వాసులకు తోడుగా ‘యూదుల్లో విశ్వాసులైనవారు ఎన్నోవేలమంది’ ఉన్నారు.​—⁠అపొస్తలుల కార్యములు 21:20.

8 మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో సంఖ్యాపరమైన అభివృద్ధి గమనార్హంగా ఉన్నప్పటికీ, ఆ సంఖ్యలు సూచించే అసలు వ్యక్తులను మనమెన్నటికీ మర్చిపోకూడదు. వారు విన్న బైబిలు సందేశం శక్తిమంతమైనది. (హెబ్రీయులు 4:​12) ఆ సందేశాన్ని హత్తుకున్నవారి జీవితాలను అది గమనార్హంగా మార్చివేసింది. ఆ వ్యక్తులు తమ జీవితాలను శుభ్రపరచుకొని, నూతన స్వభావం ధరించుకొని దేవునితో తిరిగి సమాధానపడ్డారు. (ఎఫెసీయులు 4:22, 23) నేడు కూడా అదే జరుగుతోంది. సువార్తను అంగీకరిస్తున్న వారందరికీ నిరంతరం జీవించే అద్భుతమైన ఉత్తరాపేక్ష ఉంది.​—⁠యోహాను 3:16.

దేవుని జతపనివారు

9 ఆ తొలి క్రైస్తవులు నెరవేరుతున్న పని గొప్పతనాన్ని తమకు ఆపాదించుకోలేదు. పరిచారకులుగా తాము చేస్తున్న పని “పరిశుద్ధాత్మ శక్తి” మద్దతువల్లనే జరుగుతోందని వారు గుర్తించారు. (రోమీయులు 15:13, 18) ఆ ఆధ్యాత్మిక పురోగతికి కారకుడు యెహోవాయే. అదే సమయంలో, ఆ క్రైస్తవులకు “దేవుని జతపనివారి[గా]” ఉండే ఆధిక్యత, బాధ్యత తమకు ఉన్నాయని తెలుసు. (1 కొరింథీయులు 3:6-9) కాబట్టి, యేసు ఉపదేశానికి అనుగుణంగా వారు తమకు నియమించబడిన పనిలో తీవ్రంగా శ్రమించారు.​—⁠లూకా 13:24.

10 ‘అన్యజనులకు అపొస్తలునిగా’ పౌలు అటు సముద్రంలో, ఇటు నేలపై వేలాది కిలోమీటర్లు ప్రయాణించి, ఆసియాలోని రోమా పాలిత ప్రాంతాల్లో, గ్రీసులో అనేక సంఘాలు స్థాపించాడు. (రోమీయులు 11:14) ఆయన రోముకు, బహుశా స్పెయిన్‌కు కూడా వెళ్ళాడు. మరోవైపు, “సున్నతి పొందినవారికి బోధించుటకై సువార్త” అప్పగించబడిన అపొస్తలుడైన పేతురు, ఆ కాలంలో యూదులు అధిక సంఖ్యలోవున్న బబులోనులో సేవ చేయడానికి వెళ్ళాడు. (గలతీయులు 2:7-9; 1 పేతురు 5:13) ప్రభువు పనిలో ప్రయాసపడిన మరితరుల్లో త్రుఫైనా, త్రుఫోసా వంటి స్త్రీలు ఉన్నారు. పెర్సిసు అనే మరో స్త్రీ “ప్రభువునందు బహుగా ప్రయాసపడెను” అని చెప్పబడింది.​—⁠రోమీయులు 16:12.

11 యెహోవా వారి, ఇతర పనివారి ఉత్సాహపూరిత ప్రయత్నాలను మెండుగా ఆశీర్వదించాడు. సకల జనములకు సాక్ష్యమివ్వబడుతుందని యేసు ప్రవచించిన తర్వాత 30 సంవత్సరాలు కూడా పూర్తవకముందే “సువార్త” ‘ఆకాశముక్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడిందని’ పౌలు వ్రాశాడు. (కొలొస్సయులు 1:23) మరి అంతం వచ్చిందా? ఒక విధంగా వచ్చిందనే చెప్పాలి. రోమా సైన్యాలు ఆలయంతోపాటు యెరూషలేమును నాశనం చేసినప్పుడు, సా.శ. 70లో యూదా మత విధానంపైకి ఆ అంతమొచ్చింది. అయితే, సాతాను భూవ్యాప్త విధానాన్ని అంతం చేసేముందు మరెంతో గొప్ప సాక్ష్యం ఇవ్వబడాలని యెహోవా నిర్ణయించాడు.

నేడు ఇవ్వబడుతున్న సాక్ష్యము

12 మతభ్రష్టత్వం ప్రబలిన దీర్ఘకాలం తర్వాత, 19వ శతాబ్దపు మలిదశలో స్వచ్ఛారాధన తిరిగి స్థాపించబడింది. అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలవబడిన యెహోవాసాక్షులు భూవ్యాప్తంగా శిష్యులను చేయాలనే ఆజ్ఞను స్పష్టంగా అర్థం చేసుకున్నారు. (మత్తయి 28:19, 20) 1914వ సంవత్సరానికల్లా ప్రకటనా పనిలో చురుకుగా పాల్గొంటున్నవారు దాదాపు 5,100 మంది ఉండగా, సువార్త సుమారు 68 దేశాలకు చేరింది. అయితే ఆ తొలి బైబిలు విద్యార్థులు మత్తయి 24:⁠14 పూర్తి విశేషతను గ్రహించలేదు. 19వ శతాబ్దాంతానికి బైబిలు సొసైటీలు శుభవార్త లేదా సువార్త కలిగివున్న బైబిలును అనేక భాషల్లోకి అనువదించి, ముద్రించడమే కాక, ప్రపంచవ్యాప్తంగా పంచిపెట్టాయి. అందువల్ల, బైబిలు విద్యార్థులు చాలా దశాబ్దాల వరకు జనములకు సాక్ష్యం ఇవ్వబడిందని తర్కించారు.

13 క్రమేణా యెహోవా తన ప్రజలకు తన చిత్తం మరియు సంకల్పం గురించిన స్పష్టమైన అవగాహనను అనుగ్రహించాడు. (సామెతలు 4:18) కావలికోట (ఆంగ్లం) డిసెంబరు 1, 1928 ఇలా చెప్పింది: “బైబిలును పంపిణీ చేయడం ప్రవచించబడిన రాజ్య సువార్త ప్రకటనా పనిని నెరవేర్చిందని మనం చెప్పగలమా? ఎంతమాత్రం చెప్పలేం! బైబిలు ఇలా పంచిపెట్టబడినప్పటికీ, భూమ్మీది దేవుని సాక్షుల చిన్నగుంపు దేవుని [సంకల్పాన్ని] వివరించే సాహిత్యాలను ముద్రించి, బైబిలు అందించబడిన గృహాలను సందర్శించడం అవసరమే. అలా చేయకపోతే మనకాలంలో స్థాపించబడే మెస్సీయ రాజ్యం విషయంలో ప్రజలు అజ్ఞానులుగానే ఉంటారు.”

14కావలికోట ఆ సంచికే ఇంకా ఇలా చెప్పింది: “1920లో . . . బైబిలు విద్యార్థులు మత్తయి 24:14లో ఉన్న మన ప్రభువు ప్రవచనపు సరైన అవగాహనకు వచ్చారు. అన్యజనులకు లేదా జనాంగాలన్నింటికి సాక్ష్యార్థంగా లోకమందంతటా ప్రకటించబడవలసిన ‘సువార్త’ ఇంకనూ రానున్న రాజ్య సువార్త కాదుగానీ, మెస్సీయ రాజు భూమ్మీద తన పరిపాలన ఆరంభించాడనే సువార్తైయున్నది.”

15 ఆ “సాక్షుల చిన్నగుంపు” 1920ల్లో చిన్నగుంపుగానే మిగిలిపోలేదు. రానున్న దశాబ్దాల్లో ‘వేరేగొర్రెల’ “గొప్పసమూహము” గుర్తించబడి, సమకూర్చబడడం ఆరంభమైంది. (ప్రకటన 7:9; యోహాను 10:16) నేడు భూమ్మీద 235 దేశాల్లో దాదాపు 66,13,829 మంది సువార్తను ప్రకటిస్తున్నారు. ప్రవచనం ఎంత అద్భుతంగా నెరవేరుతుందో కదా! గతంలో “ఈ రాజ్య సువార్త” ఇంత విస్తృతంగా ఎన్నడూ ప్రకటించబడలేదు. గతంలో భూమ్మీద ఎన్నడూ ఇంతమంది యెహోవా నమ్మకమైన సేవకులు లేరు.

16 ఈ విస్తారమైన సాక్షుల గుంపు సమిష్టిగా 2005వ సేవా సంవత్సరంలో అవిశ్రాంతంగా పనిచేసింది. 235 దేశాల్లో సువార్త ప్రకటించడానికి వందకోట్ల గంటలకన్నా ఎక్కువ సమయం వెచ్చించబడింది. కోట్ల సంఖ్యలో పునర్దర్శనాలు చేయబడి, లక్షల సంఖ్యలో బైబిలు అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఇతరులతో దేవుని వాక్యాన్ని పంచుకోవడంలో తమ సమయాన్ని వనరులను ఉచితంగా ధారపోసిన యెహోవాసాక్షులు ఈ పనిని నెరవేరుస్తున్నారు. (మత్తయి 10:8) శక్తిమంతమైన తన పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా తన చిత్తం నెరవేర్చేందుకు, తన సేవకులను ఎడతెగక బలపరుస్తున్నాడు.​—⁠జెకర్యా 4:6.

సాక్ష్యమిచ్చేందుకు కష్టపడి పనిచేయడం

17 సువార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పి ఇప్పటికి దాదాపు 2,000 సంవత్సరాలు గడిచిపోయినా, ఆ పనిపట్ల దేవుని ప్రజల ఉత్సాహం మాత్రం సన్నగిల్లలేదు. మేలు చేయడంలో సహనం కనబరచినప్పుడు, మనం యెహోవా లక్షణాలైన ప్రేమ, కనికరం, ఓర్పులను ప్రతిబింబిస్తామని మనకు తెలుసు. యెహోవాలాగే మనం కూడా ఎవరూ నశించాలని కాదుగానీ ప్రతీ ఒక్కరూ పశ్చాత్తాపపడి ఆయనతో తిరిగి సమాధానపడాలని కోరుకుంటాం. (2 కొరింథీయులు 5:​18-20; 2 పేతురు 3:9) దేవుని ఆత్మయందు తీవ్రతగల యెహోవాసాక్షులు భూదిగంతముల వరకు ఉత్సాహంగా సువార్త ప్రకటించడంలో కొనసాగుతున్నారు. (రోమీయులు 12:11) ఫలితంగా, ప్రతీచోటా ప్రజలు సత్యాన్ని అంగీకరిస్తూ, యెహోవా ప్రేమపూర్వక నిర్దేశానికి అనుగుణంగా జీవిస్తున్నారు. కొన్ని ఉదాహరణలు పరిశీలించండి.

18 పశ్చిమ కెన్యాలో నివసించే ఛార్లెస్‌ ఒక రైతు. 1998లో ఆయన 8,000 కిలోలకు పైగా పొగాకు విక్రయించడంతో, ఆయనకు బహుమానంగా ఉత్తమ పొగాకు రైతు అనే ధ్రువపత్రం లభించింది. ఆ సమయంలో, ఆయన బైబిలు అధ్యయనం ఆరంభించాడు. పొగాకు పండించే వ్యక్తి పొరుగువాణ్ణి ప్రేమించమనే యేసు ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాడని ఆయన త్వరలోనే గ్రహించాడు. (మత్తయి 22:39) ‘ఉత్తమ పొగాకు రైతు’ నిజానికి ‘పరమ హంతకుడు’ అనే ముగింపుకొచ్చి, ఛార్లెస్‌ తన పొగాకు చెట్లపై విషాన్ని పిచికారీ చేశాడు. ఆయన సమర్పణ బాప్తిస్మం దిశగా ప్రగతి సాధించి, ఇప్పుడు క్రమ పయినీరుగా, పరిచర్య సేవకునిగా సేవ చేస్తున్నాడు.

19 భూవ్యాప్తంగా ఇవ్వబడుతున్న సాక్ష్యం ఆధారంగా యెహోవా అన్యజనులను కదిలిస్తుండడంతో ఇష్టవస్తువులు అంటే ప్రజలు వస్తున్నారనడంలో సందేహం లేదు. (హగ్గయి 2:7) పోర్చుగల్‌లో నివసించే పేత్రూ, తన 13వ యేట ఒక సెమినరీలో చేరాడు. మిషనరీగా మారి బైబిలు బోధించాలనేది ఆయన లక్ష్యం. అయితే ఆయన తన తరగతుల్లో బైబిలు ప్రస్తావన చాలా అరుదుగావున్న కారణాన్నిబట్టి త్వరలోనే సెమినరీ విడిచిపెట్టాడు. ఆరు సంవత్సరాల తర్వాత ఆయన లిస్బన్‌ విశ్వవిద్యాలయంలో మనోవిజ్ఞానశాస్త్రం చదవడం మొదలుపెట్టి, యెహోవాసాక్షియైన తన చిన్నమ్మ దగ్గర ఉన్నాడు. బైబిలు అధ్యయనం చేయమని ఆమె ఆయనను ప్రోత్సహించింది. ఆ సమయానికి పేత్రూ దేవుని ఉనికినే సందేహిస్తూ, బైబిలు అధ్యయనం చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోలేకపోయాడు. ఆయన ఎటూ తేల్చుకోలేని తన పరిస్థితి గురించి తన మనోవిజ్ఞానశాస్త్ర ప్రొఫెసర్‌తో మాట్లాడాడు. ఎటూ తేల్చుకోలేని వారు స్వనాశనంవైపు పయనిస్తారని మనోవిజ్ఞానశాస్త్రం బోధిస్తోందని ఆ ప్రొఫెసర్‌ చెప్పాడు. దానితో పేత్రూ బైబిలు అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఇటీవలే బాప్తిస్మం తీసుకొని ఇప్పుడు తనే సొంతగా బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాడు.

20 జనాంగాలకు ఎంత విస్తృతంగా సాక్ష్యమివ్వబడుతుందనే విషయం గానీ, అంతమొచ్చే రోజు గానీ, ఘడియ గానీ మనకింకా తెలియదు. అది త్వరలోనే వస్తుందని మాత్రం మనకు తెలుసు. ప్రస్తుత మానవ ప్రభుత్వాల స్థానే దేవుని రాజ్యమొచ్చే సమయం దగ్గరైందని సూచించే అనేక అంశాల్లో, ఇంత విస్తృతస్థాయిలో సువార్త ప్రకటించబడడం కేవలం ఒకటనే సంగతినిబట్టి మనం ఆనందిస్తున్నాం. (దానియేలు 2:44) ప్రతీ సంవత్సరం గడిచేకొద్దీ సువార్తకు స్పందించే అవకాశం కోట్లాదిమందికి ఇవ్వబడడమే కాక, ఇది మన దేవుడైన యెహోవానూ మహిమపరుస్తోంది. విశ్వాసంలో నిలిచివుంటూ, సకల జనములకు సాక్ష్యమివ్వడంలో మన ప్రపంచవ్యాప్త సహోదరులతోపాటు అవిశ్రాంతంగా పనిచేయాలనేదే మన తీర్మానమై ఉండుగాక. అలా చేయడం ద్వారా మనల్నీ మన బోధ వినేవారినీ రక్షించుకుంటాం.​—⁠1 తిమోతి 4:16.

మీకు జ్ఞాపకమున్నాయా?

మత్తయి 24:⁠14 ఎందుకంత గమనార్హమైన ప్రవచనం?

• ప్రకటించడానికి తొలి క్రైస్తవులు ఎలా ప్రయత్నించారు, ఎలాంటి ఫలితాలొచ్చాయి?

• సకల జనులకు సాక్ష్యమివ్వవలసిన అవసరతను బైబిలు విద్యార్థులు ఎలా అర్థం చేసుకున్నారు?

• గత సేవా సంవత్సరంలో యెహోవా ప్రజల కార్యశీలతను పరిశీలించినప్పుడు మిమ్నల్ని ఏది ముగ్ధుల్ని చేస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. మత్తయి 24:14లో వ్రాయబడిన ప్రవచనాన్ని శిష్యులు మొదట ఎప్పుడు, ఎక్కడ విన్నారు?

2. శిష్యులు ఎలాంటి ప్రమాదాలను, సవాళ్లను ఎదుర్కొంటారు?

3. మత్తయి 24:14లోని యేసు మాటలు ఎందుకు నిజంగా ఆశ్చర్యకరమైనవి?

4. సాక్ష్యమిచ్చే పని కొనసాగించాలని ఎవరికి చెప్పబడింది, యేసు ఎలాంటి ఓదార్పునిచ్చాడు?

5. సాక్ష్యపు పని గురించి శిష్యులకు ఏమి తెలియదు?

6. సా.శ. 33 పెంతెకొస్తునాడూ, ఆ తర్వాత ఏమి జరిగింది?

7. కొర్నేలీ క్రైస్తవునిగా మారడం ఎందుకు విశేషమైన పరిణామం?

8. సువార్త ఆయావ్యక్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తోంది?

9. తమకు ఏ ఆధిక్యత, బాధ్యత ఉన్నాయని తొలి క్రైస్తవులు గుర్తించారు?

10. సకల జనములకు సాక్ష్యమిచ్చేందుకు తొలి క్రైస్తవుల్లో కొందరెలా ప్రయత్నించారు?

11. తొలి శిష్యుల ప్రయత్నాలను యెహోవా ఎలా ఆశీర్వదించాడు?

12. ప్రకటించమని ఇవ్వబడిన ఆజ్ఞను తొలి బైబిలు విద్యార్థులు ఎలా అర్థం చేసుకున్నారు?

13, 14. కావలికోట 1928వ సంచికలో దేవుని చిత్తం మరియు సంకల్పాన్ని గురించిన ఏ స్పష్టమైన అవగాహన ఇవ్వబడింది?

15. సాక్ష్యపు పని 1920ల నుండి ఎలా విస్తృతమైంది?

16. గత సేవా సంవత్సరంలో ఏమి నెరవేర్చబడింది? (27-30 పేజీల్లోని చార్టు చూడండి.)

17. సువార్త ప్రకటించడం గురించి యేసు పలికిన మాటలకు యెహోవా ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

18, 19. సువార్తకు సానుకూలంగా స్పందించిన కొందరికి ఎదురైన ఏ అనుభవాలను మీరు వివరించగలరు?

20. జనములకు ఇంత విస్తృతస్థాయిలో సాక్ష్యమివ్వబడుతున్నందుకు మనమెందుకు ఆనందించవచ్చు?

[27-30వ పేజీలోని చార్టు]

ప్రపంచవ్యాప్త యెహోవాసాక్షుల 2005వ సేవా సంవత్సరపు నివేదిక

(బౌండ్‌ వాల్యూమ్‌ చూడండి)

[25వ పేజీలోని మ్యాపు/చిత్రాలు]

సువార్త ప్రకటించడానికి పౌలు అటు సముద్రంలో, ఇటు నేలపై వేలాది కిలోమీటర్లు ప్రయాణించాడు

[24వ పేజీలోని చిత్రం]

కొర్నేలీకీ, ఆయన కుటుంబానికీ సాక్ష్యమిచ్చేలా యెహోవా పేతురును నిర్దేశించాడు