కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నడవడం

తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నడవడం

తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నడవడం

“పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.”​—⁠సామెతలు 4:⁠18.

చీకటి రాత్రిపై ఉదయిస్తున్న సూర్యుని ప్రభావాన్ని, వెలుగుకే మూలమైన యెహోవా దేవునికన్నా మెరుగ్గా ఇంకెవరు వర్ణించగలరు? (కీర్తన 36:⁠9) ‘అరుణోదయము భూ దిగంతములవరకు వ్యాపించినప్పుడు, ముద్రవలన మంటికి రూపము కలుగునట్లు భూముఖము మార్పునొంది విచిత్రమైన పనిగల వస్త్రమువలే సమస్తమును కనబడును.’ (యోబు 38:​12-14) మెత్తని మట్టిలో ముద్రపడగానే, ఆ మట్టి ఆకారం మారినట్లే, సూర్యకాంతి పెరిగేకొద్ది భూమి తీరు మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

2 ఆధ్యాత్మిక వెలుగుకు కూడా యెహోవాయే మూలం. (కీర్తన 43:⁠3) లోకం గాఢాంధకారంలో ఉండగా, సత్యదేవుడు తన ప్రజలపై ఎడతెగక వెలుతురును ప్రసరింపజేస్తున్నాడు. దాని ఫలితమేమిటి? బైబిలు ఇలా చెబుతోంది: “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” (సామెతలు 4:​18) అంతకంతకూ అధికమౌతున్న యెహోవా వెలుగు ఆయన ప్రజల మార్గాన్ని ప్రకాశవంతం చేస్తోంది. అది వారిని సంస్థాగతంగా సైద్ధాంతికంగా, నైతికంగా శుద్ధీకరిస్తోంది.

పెరిగిన అవగాహన సంస్థాగత శుద్ధీకరణకు నడిపించింది

3 యెషయా ప్రవక్త ద్వారా యెహోవా ముందే ఇలా చెప్పాడు: “నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని కఱ్ఱకు ప్రతిగా ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను.” (యెషయా 60:​17) తక్కువ విలువగల లోహం స్థానంలో అధిక విలువగల లోహాన్ని ఉంచడం అభివృద్ధిని సూచించినట్లే, ఈ “యుగసమాప్తి”లో లేక “అంత్యదినములలో” యెహోవాసాక్షులు తమ సంస్థాగత ఏర్పాట్లలో అభివృద్ధిని చవిచూశారు.​—⁠మత్తయి 24:3; 2 తిమోతి 3:⁠1.

4 అంత్యదినముల ఆరంభంలో బైబిలు విద్యార్థులని అప్పట్లో పిలవబడిన యెహోవాసాక్షుల సంఘాలు ప్రజాతంత్ర విధానంలో పెద్దలను, డీకన్లను ఎన్నుకునేవి. అయితే కొంతమంది పెద్దల్లో సువార్త ప్రకటించాలనే యథార్థమైన స్ఫూర్తి ఉండేది కాదు. కొందరు ప్రకటనా పనిలో పాల్గొనేందుకు సుముఖత చూపించకపోగా, పాల్గొనే ఇతరులను నిరుత్సాహపరిచారు. అందువల్ల, 1919లో ప్రతీ సంఘంలో ఒక సేవా నిర్దేశకుణ్ణి నియమించే ఏర్పాటు చేయబడింది. ఆ సేవా నిర్దేశకుణ్ణి సంఘం ఎన్నుకోవడం కాదుగానీ, దైవపరిపాలనా పద్ధతితో దేవుని ప్రజల బ్రాంచి కార్యాలయమే ఆయనను ఆ స్థానంలో నియమించేది. ఆ నియమిత నిర్దేశకుని బాధ్యతల్లో ప్రకటనా పనిని వ్యవస్థీకరించడం, క్షేత్రాలను నియమించడం, క్షేత్రసేవలో పాల్గొనడాన్ని ప్రోత్సహించడం ఇమిడివున్నాయి. ఆ తర్వాతి సంవత్సరాల్లో రాజ్య ప్రకటనా పనికి అద్భుతమైన ప్రోత్సాహం లభించింది.

5 అమెరికాలోవున్న ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌ వద్ద 1922వ సంవత్సరంలో జరిగిన బైబిలు విద్యార్థుల సమావేశంలో “రాజును, ఆయన రాజ్యాన్ని ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి” అనే విన్నపం సంఘంలోని వారందరినీ మరింతగా పునరుత్తేజితుల్ని చేసింది. క్షేత్రసేవ 1927కల్లా ఎంతగా వ్యవస్థీకరించబడిందంటే, ఇంటింటి ప్రకటనా పనిలో పాల్గొనేందుకు ఆదివారం అత్యుత్తమ దినంగా దృష్టించబడింది. ఆ రోజే ఎందుకు? ఎందుకంటే, చాలామందికి ఆ రోజే సెలవు. యెహోవాసాక్షులు కూడా నేడు ప్రజలు అధికశాతం ఇంట్లోవుండే వారాంతాలు, సాయంకాలాల వంటి సమయాల్లో వారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ అదే స్ఫూర్తిని కనబరుస్తున్నారు.

6 మొదట అమెరికాలోవున్న ఒహాయోలోని కొలంబస్‌లో 1931, జూలై 26 ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా, ఒక తీర్మానం చేపట్టడంతో రాజ్య ప్రకటనా పనికి గొప్ప ప్రోత్సాహం లభించింది. ఆ తీర్మానంలోని కొంతభాగం ఇలా ఉంది: “యెహోవా దేవుని సేవకులమైన మనకు ఆయన నామమున సేవ చేయాలనే ఆజ్ఞ ఇవ్వబడింది, ఆ ఆజ్ఞకు లోబడి యేసుక్రీస్తు ఇచ్చిన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ యెహోవాయే సత్యదేవుడని ప్రజలకు ప్రకటించాలి; కాబట్టి మనం ప్రభువైన దేవుడే స్వయంగా సెలవిచ్చిన ఆ నామాన్ని ఆనందంగా హత్తుకుని, స్వీకరించడమే కాక ఆ నామమున అంటే యెహోవాసాక్షులు అని పిలవబడాలని మనం కోరుకుంటాం.” (యెషయా 43:​10) ఆ నామాన్ని ధరించినవారి ప్రాథమిక కర్తవ్యమేమిటో ఆ క్రొత్త నామము ఎంత స్పష్టంగా నిర్వచించిందో కదా! అవును, యెహోవా సేవకులందరూ పాలుపంచుకోవలసిన పనివుంది. లభించిన స్పందన నిజంగా ఎంతో ఉత్సాహభరితంగా ఉంది!

7 చాలామంది పెద్దలు వినమ్రంగా ఆ ప్రకటనా పనికి అంకితమయ్యారు. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఎన్నికైన పెద్దలు సంఘంలోని ప్రతీ ఒక్కరూ బహిరంగ పరిచర్యలో పాల్గొనాలనే తలంపును ఎంతో వ్యతిరేకించారు. కానీ త్వరలోనే మరిన్ని మార్పులు జరగనున్నాయి. పెద్దలను, డీకన్లను ఎన్నుకునే పద్ధతిని నిలిపివేయాలని 1932లో కావలికోట (ఆంగ్లం) ద్వారా సంఘాలకు ఆదేశమివ్వబడింది. బదులుగా బహిరంగ ప్రకటనా పనిలో పాలుపంచుకునే ఆధ్యాత్మిక పురుషులుగల సేవా కమిటీని వారు ఎన్నుకోవాలి. ఆ విధంగా, పరిచర్యలో చురుకుగా పాల్గొనేవారికే పర్యవేక్షణ అప్పగించబడడంతో, సేవ ముందుకు కొనసాగింది.

పెరిగిన జ్ఞానం మరిన్ని శుద్ధీకరణలకు దారితీసింది

8 ‘వెలుగు అంతకంతకు తేజరిల్లింది.’ 1938లో ఎన్నిక పద్ధతే పూర్తిగా తొలగించబడింది. “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” పర్యవేక్షణలో సంఘంలోని సేవకులందరూ దైవపరిపాలనా విధానంలో నియమించబడాలి. (మత్తయి 24:​45-47) దాదాపుగా యెహోవాసాక్షుల సంఘాలన్నీ ఆ మార్పును సంసిద్ధంగా అంగీకరించాయి, సాక్ష్యపు పని ఫలితాలు సాధించడంలో కొనసాగింది.

9 సంఘ పర్యవేక్షణకు సంబంధించి 1972 అక్టోబరు 1తో ఆరంభించి మరో సవరణ అమల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఘాల్లో కేవలం ఒక సంఘ సేవకుడు లేదా పైవిచారణకర్త పర్యవేక్షించే బదులు పెద్దల సభ పర్యవేక్షించే ఏర్పాటు చేయబడింది. ఈ క్రొత్త ఏర్పాటు పరిణతిగల పురుషులు సంఘంలో సారథ్యం వహించేలా అర్హులయ్యేందుకు అద్భుతమైన ప్రోత్సాహాన్నిచ్చింది. (1 తిమోతి 3:​1-7) ఫలితంగా, సంఘ బాధ్యతలపట్ల శ్రద్ధవహించే విషయంలో చాలామంది సహోదరులు అనుభవం గడించారు. బైబిలు సత్యాన్ని అంగీకరించిన అనేకమంది క్రొత్తవారిని కాయడంలో వారెంత విలువైనవారిగా నిరూపించబడ్డారో కదా!

10 పరిపాలక సభ సభ్యులు 1976, జనవరి 1తో ఆరంభించి, ఆరు కమిటీలుగా వ్యవస్థీకరించబడ్డారు. సంస్థకు సంబంధించిన, భూవ్యాప్తంగావున్న సంఘాల కార్యకలాపాలన్నీ ఈ కమిటీల పర్యవేక్షణ క్రిందికివచ్చాయి. రాజ్య సేవాసంబంధ పనులన్నీ ‘ఆలోచన చెప్పే బహుమంది’ ద్వారా నిర్దేశించబడడం ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నట్లు నిరూపించబడిందో కదా!​—⁠సామెతలు 15:​22; 24:⁠6.

11 మరో శుద్ధీకరణ 1992వ సంవత్సరంలో జరిగింది. అది ఇశ్రాయేలీయులు, ఇతరులు బబులోను చెరనుండి తిరిగివచ్చిన తర్వాత జరిగిన దానికి పోలికగా ఉంది. ఆ కాలంలో, ఆలయ సేవలపట్ల శ్రద్ధ వహించేందుకు సరిపడేంతమంది లేవీయులు అందుబాటులో లేరు. అందువల్ల, లేవీయులకు మరింతగా సహాయపడే బాధ్యత ఇశ్రాయేలేతరులైన నెతీనీయులకు ఇవ్వబడింది. అదేవిధంగా పెరుగుతున్న తన భూసంబంధమైన సేవాబాధ్యతల్లో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతికి సహాయం చేసేందుకు 1992లో ‘వేరే గొఱ్ఱెల్లోని’ కొందరు అదనపు బాధ్యతలు పొందారు. పరిపాలక సభ కమిటీల సహాయకులుగా వారు నియమించబడ్డారు.​—⁠యోహాను 10:⁠16.

12 దీనంతటి ఫలితమేమిటి? “సమాధానమును నీకధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను” అని యెహోవా చెబుతున్నాడు. (యెషయా 60:​17) నేడు యెహోవా ప్రజల్లో “సమాధానము” ఉండడమే కాక, దేవుని సేవించాలని వారిని పురికొల్పే, “నీతిని” ప్రేమించడం వారి ‘విచారణకర్తగా’ ఉంది. రాజ్య ప్రకటనా పనిని, శిష్యులనుగా చేసే పనిని నెరవేర్చేందుకు వారు చక్కగా వ్యవస్థీకరించబడ్డారు.​—⁠మత్తయి 24:​14; 28:19, 20.

సిద్ధాంతపరంగా యెహోవా మార్గాన్ని వెలుగుమయం చేశాడు

13 యెహోవా సిద్ధాంతపరంగా కూడా తన ప్రజల మార్గాన్ని క్రమంగా వెలుగుమయం చేశాడు. ప్రకటన 12:1-9 ఒక ఉదాహరణను అందిస్తోంది. ఆ వృత్తాంతం మూడు సూచనార్థక పాత్రధారులను సూచిస్తోంది: గర్భిణీగా ఉండి ప్రసవించే “స్త్రీ,” “ఘటసర్పము,” “మగశిశువు.” ఈ పాత్రధారులు ఎవరిని సూచిస్తున్నారో మీకు తెలుసా? ఆ పాత్రధారులు, కావలికోట (ఆంగ్లం) మార్చి 1, 1925లో ప్రచురించబడిన “జనాంగ ఆవిర్భావం” అనే ఆర్టికల్‌లో గుర్తించబడ్డారు. ఆ ఆర్టికల్‌ దేవుని ప్రజలకు రాజ్య ఆవిర్భావం గురించిన ప్రవచనాల చక్కని అవగాహనను, యెహోవా సంస్థ, సాతాను సంస్థ అనే రెండు విభిన్న సంస్థలున్నాయని స్పష్టం చేసిన అంతర్దృష్టిని అందించింది. ఆ తర్వాత 1927/28లో దేవుని ప్రజలు క్రిస్మస్‌, జన్మదిన వేడుకలు లేఖనవిరుద్ధమని గుర్తించి వాటిని ఆచరించడం మానేశారు.

14 మూడు సిద్ధాంతపరమైన సత్యాలపై 1930వ దశాబ్దంలో మరింత వెలుగు ప్రసరించబడింది. ప్రకటన 7:9-17లో చెప్పబడిన గొప్ప జనసమూహం లేదా “గొప్పసమూహము” క్రీస్తుతోపాటు రాజులుగా, యాజకులుగా పరిపాలించే 1,44,000 మంది కాదని బైబిలు విద్యార్థులకు ఎన్నో సంవత్సరాల నుండి తెలుసు. (ప్రకటన 5:​9, 10; 14:​1-5) అయితే, ఆ గొప్ప జనసమూహపు గుర్తింపు అస్పష్టంగానే ఉండిపోయింది. ఉదయకాల వెలుగు అప్పటివరకు అస్పష్టంగావున్న వస్తువుల రూపాన్ని, రంగును ఎలా స్పష్టం చేస్తుందో, ఆ ప్రకారమే 1935లో గొప్ప జనసమూహం భూమ్మీద జీవించే ఉత్తరాపేక్షతో “మహాశ్రమలు” తప్పించుకునే ప్రజలని గుర్తించబడింది. ఆ తర్వాత ఆ సంవత్సరమే అనేక దేశాల్లో బడికివెళ్లే యెహోవాసాక్షుల పిల్లలపై ప్రభావం చూపించిన ఒక విషయం స్పష్టం చేయబడింది. ప్రపంచవ్యాప్తంగా దేశభక్తి భావం ముమ్మరంగా ఉన్న ఆ కాలంలో జెండా వందనం చేయడం ఒక రివాజు మాత్రమే కాదని సాక్షులు గుర్తించారు. ఆ మరుసటి సంవత్సరం మరో సైద్ధాంతిక సత్యం, అంటే క్రీస్తు సిలువపై కాదుగానీ మ్రానుపై మరణించాడనే సత్యం వివరించబడింది.​—⁠అపొస్తలుల కార్యములు 10:39.

15 రెండవ ప్రపంచయుద్ధానంతర సంవత్సరాల్లో, క్షతగాత్రులైన సైనికుల చికిత్సకోసం రక్తమార్పిడులు చేయడం ఒక ప్రామాణిక విధానమైంది, రక్తంయొక్క పవిత్రత విషయంలో మరింత వెలుగు ప్రసరించబడింది. కావలికోట (ఆంగ్లం) 1945 జూలై 1 సంచిక ఇలా ప్రోత్సహించింది: “యెహోవా నీతిగల నూతనలోకంలో నిత్యజీవం పొందాలనుకునే ఆయన ఆరాధకులందరూ రక్తంయొక్క పవిత్రతను గౌరవిస్తూ, ఈ ఆవశ్యక విషయంలో దేవుని నీతి ప్రమాణాలకు తగినవిధంగా ప్రవర్తించాలి.”

16 ఇటీవల వెలుగుచూసిన విషయ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, క్రైస్తవమత సామ్రాజ్య ఆచారాలపై ఆధారపడిన మతసిద్ధాంతాల మాలిన్యంలేని ఓ క్రొత్త బైబిలు అనువాదం అవసరమనే విషయం 1946లో స్పష్టమైంది. ఆ అనువాదపు పని 1947 డిసెంబరులో ప్రారంభమైంది. 1950లో క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదము ఆంగ్లంలో విడుదల చేయబడింది. 1953తో ఆరంభించి హీబ్రూ లేఖనాల ఆంగ్ల అనువాదం క్రమేణా ఐదు సంపుటులుగా విడుదల చేయబడింది. చివరి సంపుటి 1960లో అంటే, అనువాదపు ప్రణాళిక ఆరంభమైన 12 సంవత్సరాల తర్వాత విడుదల చేయబడింది. పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము మొత్తం 1961లో ఒకే సంపుటిగా విడుదల చేయబడింది. ఇప్పుడు అనేక భాషల్లో లభ్యమవుతున్న ఈ అనువాదంలో కొన్ని ప్రముఖ అంశాలున్నాయి. అది దేవుని నామమైన యెహోవాను పునరుద్ధరించింది. అంతేకాక, దాని ఆదిమ వ్రాతల అక్షరార్థ అనువాదం, దైవిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో నిరంతర అభివృద్ధికి ఆధారాన్ని సమకూర్చింది.

17రోమీయులు 13:1లోని “పై అధికారులు” ఎవరు, క్రైస్తవులు వారికి ఎంతమేరకు లోబడివుండాలనే అంశం 1962లో స్పష్టం చేయబడింది. రోమీయులు 13వ అధ్యాయంతోపాటు తీతు 3:1, 2; 1 పేతురు 2:13, 17 వంటి లేఖనాల లోతైన అధ్యయనం “పై అధికారులు” అనేమాట యెహోవా, యేసుక్రీస్తులను కాదుగానీ ప్రభుత్వాధికారులను సూచిస్తోందని స్పష్టం చేసింది.

18 ఆ తర్వాతి సంవత్సరాల్లో నీతిమంతుల మార్గం మరింత తేజోవంతమైంది. “జీవము” పొందగలిగేలా నీతిమంతునిగా తీర్చబడడమంటే ఏమిటో, దేవుని స్నేహితునిగా, నీతిమంతునిగా ప్రకటించబడడమంటే ఏమిటో 1985లో మరింత స్పష్టమైంది. (రోమీయులు 5:18; యాకోబు 2:​23) క్రైస్తవ సునాదపు అర్థం 1987లో సమగ్రంగా వివరించబడింది.

19 “మేకల” నుండి “గొఱ్ఱెలను” వేరుచేయడమనే విషయాన్ని, 1995లో మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడం జరిగింది. అప్పటికే నెరవేరుతున్న, యెహెజ్కేలు ఆలయ దర్శనం 1998లో విపులంగా వివరించబడింది. ‘పరిశుద్ధ స్థలంలో హేయవస్తువు’ ఎప్పుడు, ఎలా నిలబడిందో 1999లో స్పష్టం చేయబడింది. (మత్తయి 24:​15, 16; 25:32) దేవుణ్ణి “ఆత్మతోను సత్యముతోను” ఆరాధించడం గురించిన అవగాహన 2002లో మరింత మెరుగయ్యింది.

20 సంస్థాగతమైన, సిద్ధాంతపరమైన శుద్ధీకరణలకు తోడుగా, క్రైస్తవ ప్రవర్తనకు సంబంధించిన శుద్ధీకరణలు కూడా జరిగాయి. ఉదాహరణకు 1973లో, పొగాకును ఉపయోగించడం ‘శరీరానికి కల్మషం కలిగిస్తుంది’ అనే కాక, దానినొక గంభీరమైన తప్పుగా దృష్టించాలనీ కూడా అర్థం చేసుకోవడం జరిగింది. (2 కొరింథీయులు 7:⁠1) ఒక దశాబ్దం తర్వాత, కావలికోట (ఆంగ్లం) 1983, జూలై 15 సంచిక మందుగుండు ఆయుధాల విషయంలో మన స్థానమేమిటో స్పష్టం చేసింది. మనకాలంలో ప్రసరించిన అధిక వెలుగుకు ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలే.

తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నిరంతరం నడవండి

21 “మార్పు వచ్చినప్పుడు దానిని అంగీకరించి, తదనుగుణంగా మలచుకోవడం కష్టం” అని ఒక దీర్ఘకాల పెద్ద అంగీకరించాడు. 48 సంవత్సరాలుగా రాజ్య ప్రచారకునిగావున్న ఆ సాక్షి అనేక సవరణలను అంగీకరించేందుకు ఆయనకు ఏది సహాయం చేసింది? ఆయనిలా జవాబిస్తున్నాడు: “సరైన దృక్పథం కలిగివుండడం కీలకం. శుద్ధీకరణను నిరాకరించడం అంటే సంస్థతోపాటు ముందుకు వెళ్లకుండా వెనకబడిపోవడమని అర్థం. మార్పులు అంగీకరించడం కష్టమని తోచినప్పుడు, పేతురు యేసుతో చెప్పిన ఈ మాటలను నేను ధ్యానిస్తాను: ‘ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు.’ ఆ తర్వాత నన్నునేను ఇలా ప్రశ్నించుకుంటాను, ‘నేను ఎక్కడికి వెళ్లాలి, లోకంలోని అంధకారంలోకా?’ ఇలా ప్రశ్నించుకోవడం దేవుని సంస్థను గట్టిగా హత్తుకొని ఉండేందుకు నాకు సహాయం చేస్తుంది.”​—⁠యోహాను 6:68.

22 మన చుట్టూవున్న లోకం నిస్సందేహంగా అంధకారంలో ఉంది. యెహోవా తన ప్రజలపై వెలుగును ప్రసరిస్తూ ఉండగా, వారికీ లోకస్థులకూ మధ్యగల అంతరం పెరుగుతుంది. ఈ వెలుగు మనకోసం ఏమి చేస్తుంది? చీకటి రహదారిలో ఉన్న గుంట మీదపడే వెలుగు ఆ గుంటను తొలగించనట్లే, దేవుని వాక్యపు వెలుగు ప్రమాదాలను నివారించదు. అయితే దైవిక వెలుగు మనం వాటిని తప్పించుకొని తేజరిల్లుతున్న వెలుగులో నడుస్తూ ఉండేందుకు మనకు తప్పక సహాయం చేస్తుంది. కాబట్టి మనం “చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్న” యెహోవా ప్రవచన వాక్యానికి ఎడతెగక అవధానమిస్తూ ఉందాం.​—⁠2 పేతురు 1:19.

మీకు జ్ఞాపకమున్నాయా?

• యెహోవా తన ప్రజలకు ఎలాంటి సంస్థాగతమైన మార్పులు తెచ్చాడు?

• తేజరిల్లిన వెలుగు ఎలాంటి సిద్ధాంతపరమైన సవరణలు తెచ్చింది?

• వ్యక్తిగతంగా మీరు ఎలాంటి సవరణలు చూశారు, వాటిని అంగీకరించేలా మీకు ఏది సహాయం చేసింది?

• తేజరిల్లుతున్న వెలుగు మార్గంలో నడుస్తూ ఉండేందుకు మీరెందుకు ఇష్టపడతారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. అంతకంతకూ అధికమౌతున్న యెహోవా వెలుగు కారణంగా దేవుని ప్రజలు దేనిని చవిచూస్తున్నారు?

3. యెషయా 60:17లో ఏమి వాగ్దానం చేయబడింది?

4. ఏ ఏర్పాటు 1919లో అమల్లోకి వచ్చింది, అదెలాంటి ప్రయోజనాన్నిచ్చింది?

5. ఏ విధమైన శుద్ధీకరణ 1920లలో నిజమైంది?

6. ఏ తీర్మానం 1931లో తీసుకోబడింది, రాజ్య ప్రకటనా పనిపై అదెలాంటి ప్రభావం చూపించింది?

7. ఎలాంటి మార్పు 1932లో పరిచయం చేయబడింది, ఎందుకు?

8. ఎలాంటి శుద్ధీకరణ 1938లో జరిగింది?

9. ఏ ఏర్పాటు 1972లో చేయబడింది, అదెందుకు ఒక మంచి పరిణామం?

10. ఏ ఏర్పాటు 1976లో అమల్లోకి వచ్చింది?

11. ఏ శుద్ధీకరణ 1992లో ప్రవేశపెట్టబడింది, ఎందుకు?

12. యెహోవా సమాధానమును మనకు అధికారులుగా ఎలా నియమించాడు?

13. యెహోవా 1920వ దశాబ్దంలో తన ప్రజల మార్గాన్ని ఎలా వెలుగుమయం చేశాడు?

14. ఎలాంటి సిద్ధాంతపరమైన సత్యాలు 1930వ దశాబ్దంలో స్పష్టం చేయబడ్డాయి?

15. రక్తంయొక్క పవిత్రత ఎప్పుడు, ఏ విధంగా నొక్కిచెప్పబడింది?

16. పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము ఎప్పుడు విడుదల చేయబడింది, దానిలోని రెండు ప్రముఖ అంశాలేమిటి?

17. దేనికి సంబంధించిన అవగాహన 1962లో అధికమైంది?

18. ఏ సత్యాలు కొన్ని 1980వ దశాబ్దంలో స్పష్టం చేయబడ్డాయి?

19. ఇటీవలి సంవత్సరాల్లో యెహోవా తన ప్రజలకు మరింత ఆధ్యాత్మిక వెలుగును ఎలా ప్రసాదించాడు?

20. మరి ఏ ఇతర రంగంలో దేవుని ప్రజలు శుద్ధీకరణలు చవిచూశారు?

21. తేజరిల్లే వెలుగు మార్గంలో నడుస్తూ ఉండేందుకు ఎలాంటి దృక్పథం మనకు సహాయం చేస్తుంది?

22. వెలుగులో నడవడం ద్వారా మనమెలా ప్రయోజనం పొందుతాం?

[27వ పేజీలోని చిత్రాలు]

ఒహాయోలో సీడార్‌ పాయింట్‌ వద్ద 1922వ సంవత్సరంలో జరిగిన సమావేశం బైబిలు విద్యార్థులను దేవుని పనికి పునరుత్తేజితుల్ని చేసింది

[29వ పేజీలోని చిత్రం]

‘క్రైస్తవ గ్రీకు లేఖనముల నూతనలోక అనువాదాన్ని’ 1950లో ఎన్‌. హెచ్‌. నార్‌ విడుదల చేశారు

[26వ పేజీలోని చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com