కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు

దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు

దేవుని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దోహదపడే ఒక ఏర్పాటు

“[దేవుడు] తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు.”​—⁠ఎఫెసీయులు 1:11.

ఏప్రిల్‌ 12, 2006 బుధవారం సాయంకాలం దాదాపు 1.6 కోట్లమంది ప్రభువు రాత్రి భోజన ఆచరణకు సమావేశమౌతారు. అలా సమావేశమయ్యే ప్రతీ స్థలంలో ఒక బల్లమీద, క్రీస్తు శరీరానికి చిహ్నంగా పులియని రొట్టె, ఆయన చిందించిన రక్తానికి చిహ్నంగా ఎర్రని ద్రాక్షారసం ఉంచబడతాయి. యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకున్న అర్థాన్ని వివరించే ప్రసంగ ముగింపులో ఈ చిహ్నాలు అంటే మొదట రొట్టె, ఆ తర్వాత ద్రాక్షారసం హాజరైనవారందరి దగ్గరకు పంపించబడతాయి. యెహోవాసాక్షుల కొన్ని సంఘాల్లో, హాజరైనవారిలో ఒకరిద్దరు ఆ చిహ్నాలను పుచ్చుకుంటారు. అయితే అనేకచోట్ల, హాజరైనవారిలో ఎవరూ వాటిని పుచ్చుకోరు. కొద్దిమంది క్రైస్తవులు మాత్రమే, అంటే పరలోకంలో జీవించాలని నిరీక్షించేవారు మాత్రమే వాటిని పుచ్చుకొంటుండగా, భూమ్మీద నిరంతరం జీవించాలని నిరీక్షించే అధికశాతం మంది వాటినెందుకు పుచ్చుకోరు?

2 యెహోవా సంకల్పంగల దేవుడు. ఆయన తన సంకల్పాన్ని నెరవేర్చడంలో “తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగి[స్తాడు].” (ఎఫెసీయులు 1:11) ఆయన మొదట తన అద్వితీయ కుమారుణ్ణి సృష్టించాడు. (యోహాను 1:1, 14; ప్రకటన 3:14) ఆ తర్వాత, ఈ కుమారుని ద్వారా ఆత్మకుమారుల కుటుంబాన్నీ, చివరకు ఈ భూమి దానిపైనున్న మానవజాతితో సహా భౌతిక విశ్వాన్నంతటినీ సృష్టించాడు.​—⁠యోబు 38:4, 7; కీర్తన 103:19-21; యోహాను 1:2, 3; కొలొస్సయులు 1:15, 16.

3 క్రైస్తవమత సామ్రాజ్యంలోని అనేక చర్చీలు బోధిస్తున్నట్లుగా, యెహోవా పరలోకంలోని తన ఆత్మకుమారుల కుటుంబాన్ని విస్తరింపజేసుకోవడానికి ఒక పరీక్షా స్థలంగా ఈ భూమిని సృష్టించలేదు. ఆయన దాన్ని ఒక నిర్దిష్ట సంకల్పంతో, అంటే ఒక “నివాసస్థలము”గా ఉండాలని దానిని సృష్టించాడు. (యెషయా 45:18) దేవుడు మనిషి కోసం భూమిని, భూమి కోసం మనిషిని సృష్టించాడు. (కీర్తన 115:16) ఈ భూమంతా, నేలను సేద్యపరచి దానిపట్ల శ్రద్ధవహించే నీతిమంతులతో నింపబడిన పరదైసుగా మారాలి. చివరికి పరలోకానికి తిరిగి వెళ్ళే ఉత్తరాపేక్ష మొదటి మానవ దంపతులకు ఎన్నడూ ఇవ్వబడలేదు.​—⁠ఆదికాండము 1:​26-28; 2:7, 8, 15.

యెహోవా సంకల్పం సవాలు చేయబడింది

4 యెహోవా దేవుని ఆత్మ కుమారుల్లో ఒకడు తిరుగుబాటు చేసి దేవుడనుగ్రహించిన స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేస్తూ ఆయన సంకల్పానికి అడ్డుకట్ట వేయాలని కంకణం కట్టుకున్నాడు. యెహోవా సర్వాధిపత్యానికి ప్రేమపూర్వకంగా విధేయులయ్యేవారందరికీ లభించే ప్రశాంతతను పాడుచేశాడు. దేవుని నుండి స్వేచ్ఛగా జీవించే విధానాన్ని అవలంబించేలా సాతాను మొదటి మానవ దంపతులను నడిపించాడు. (ఆదికాండము 3:1-6) అతడు యెహోవా శక్తిని శంకించలేదు గానీ, ఆయన సర్వాధిపత్యాన్ని, తద్వారా ఆయన పరిపాలనా హక్కును సవాలు చేశాడు. ఆ విధంగా, మానవ చరిత్రారంభంలోనే ఈ భూమిపై యెహోవా సర్వాధిపత్యపు ప్రాథమిక వివాదాంశం లేవదీయబడింది.

5 విశ్వ సర్వాధిపత్యపు ఆ ప్రాథమిక వివాదాంశానికి దగ్గరి సంబంధంగల రెండవ వివాదాంశాన్ని సాతాను, యోబు కాలంలో లేవదీశాడు. యెహోవా సృష్టిప్రాణులు ఆయనకు విధేయులై ఆయనను సేవించడం వెనుకున్న ఉద్దేశాన్ని సాతాను ప్రశ్నించాడు. వారు స్వార్థంతోనే ఆయనకు లోబడి ఆయనను సేవిస్తున్నారనీ, పరీక్షకు గురైతే వారు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారనీ సాతాను ఆరోపించాడు. (యోబు 1:​7-11; 2:​4, 5) యెహోవాయొక్క మానవ సేవకునికి సంబంధించి ఈ ప్రశ్న లేవదీయబడినప్పటికీ, అది దేవుని ఆత్మకుమారులకే కాక, యెహోవా అద్వితీయ కుమారునికి కూడా వర్తిస్తుంది.

6 యెహోవా తన సంకల్పానికి నమ్మకంగా కట్టుబడి, తన పేరుకున్న అర్థానికి తగ్గట్టుగా తానే ప్రవక్త, రక్షకుడు అయ్యాడు. * ఆయన సాతానుతో ఇలా అన్నాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆదికాండము 3:15) యెహోవా తన “స్త్రీ” సంతానం ద్వారా లేదా తన సంస్థలోని పరలోక భాగం ద్వారా సాతాను ప్రశ్నకు జవాబిచ్చి, ఆదాము సంతతికి విమోచననూ జీవాన్నీ పొందే నిరీక్షణను అనుగ్రహిస్తాడు.​—⁠రోమీయులు 5:21; గలతీయులు 4:26, 31.

“తన చిత్తమునుగూర్చిన మర్మము”

7 యెహోవా తన సంకల్ప నెరవేర్పువైపుకు పరిస్థితిని ఎలా నడిపిస్తాడో అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని క్రైస్తవులకు వ్రాసిన ఉత్తరంలో చక్కగా వివరిస్తున్నాడు. ఆయనిలా వ్రాశాడు: “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమునుగూర్చిన మర్మమును మనకు తెలియజేసి . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.” (ఎఫెసీయులు 1:8-10) తన సర్వాధిపత్యానికి ప్రేమపూర్వకంగా విధేయులయ్యే ప్రాణులతో సమైక్య విశ్వాన్ని నెలకొల్పాలన్నదే యెహోవా మహిమాన్వితమైన సంకల్పం. (ప్రకటన 4:​10-11) ఆ విధంగా ఆయన నామం పరిశుద్ధపరచబడడమే కాక, సాతాను అబద్ధికునిగా నిరూపించబడి, దేవుని చిత్తం “పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును” నెరవేరుతుంది.​—⁠మత్తయి 6:​9-10.

8 యెహోవా “దయాసంకల్పము” ఒక ‘ఏర్పాటు’ ద్వారా నెరవేరుతుంది. పౌలు ఇక్కడ “గృహనిర్వహణ” అనే అక్షరార్థ భావంగల పదాన్ని ఉపయోగించాడు. అది మెస్సీయ రాజ్యం వంటి ఒక ప్రభుత్వాన్ని సూచించదుగానీ, ఒక కార్యనిర్వహణా విధానాన్ని సూచిస్తుంది. * యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చడానికి విషయాలను నిర్వహించే అద్భుతమైన విధానంలో, కాల క్రమేణా వెల్లడిచేయబడే “మర్మము” చేరివుంది.​—⁠ఎఫెసీయులు 1:​8-10; 3:​8-9, NW అధస్సూచికలు.

9 యెహోవా అనేక నిబంధనల ద్వారా, ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానానికి సంబంధించిన తన సంకల్పం ఎలా నెరవేరుతుందో క్రమేణా వెల్లడించాడు. అబ్రాహాముతో ఆయన చేసిన నిబంధన ఆ వాగ్దత్త సంతానం అబ్రాహాము వంశంలోనే ఈ భూమ్మీదకు వస్తాడనీ, ఆ సంతానం ద్వారానే “భూలోకములోని జనములన్నియు” ఆశీర్వదించబడతాయనీ వెల్లడించింది. ఆ సంతాన ప్రాథమిక భాగంతో ఇతరులకు సంబంధం ఉంటుందని కూడా ఆ నిబంధన తెలియజేసింది. (ఆదికాండము 22:17, 18) సహజ ఇశ్రాయేలీయులతో చేసిన ధర్మశాస్త్ర నింబంధన “యాజక రూపమైన రాజ్యము” కలిగివుండాలన్న యెహోవా సంకల్పం గురించి వెల్లడిచేసింది. (నిర్గమకాండము 19:​5, 6) ఆ సంతానమే ఆ రాజ్యానికి యుగయుగములు రాజుగా ఉంటాడని దావీదుతో చేసిన నిబంధన చూపించింది. (2 సమూయేలు 7:12, 13; కీర్తన 89:​3, 4) ధర్మశాస్త్ర నిబంధన ఒకసారి యూదులను మెస్సీయ దగ్గరికి నడిపించిన తర్వాత, యెహోవా తన సంకల్ప నెరవేర్పు గురించిన ఇతర అంశాలను వెల్లడిచేశాడు. (గలతీయులు 3:​19, 24) ఆ సంతానపు ప్రాథమిక భాగంతో సంబంధం కలిగివుండే మానవులు, ప్రవచించబడిన “యాజక రూపమైన రాజ్యముగా” రూపొంది, ఆధ్యాత్మిక క్రొత్త “ఇశ్రాయేలు”గా “క్రొత్త నిబంధన”లోకి తీసుకోబడతారు.​—⁠యిర్మీయా 31:31-34; హెబ్రీయులు 8:7-9. *

10 దేవుని సంకల్పానికి సంబంధించిన ఏర్పాటుకు అనుగుణంగా, ప్రవచించబడిన సంతానం భూమ్మీద కనిపించే సమయమాసన్నమైంది. యేసు అని పిలవబడే కుమారునికి జన్మనిస్తుందని చెప్పేందుకు యెహోవా గబ్రియేలు దూతను మరియ దగ్గరకు పంపించాడు. ఆ దూత ఆమెకిలా చెప్పాడు: “ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండును.” (లూకా 1:​32, 33) ఆ విధంగా వాగ్దత్త సంతానపు గుర్తింపు స్పష్టమైంది.​—⁠గలతీయులు 3:16; 4:⁠4.

11 యెహోవా అద్వితీయ కుమారుడు భూమ్మీదికి వచ్చి పూర్తిస్థాయిలో పరీక్షించబడాలి. సాతాను ప్రశ్నకు ఇవ్వాల్సిన పరిపూర్ణమైన జవాబు యేసుపై ఆధారపడి ఉంటుంది. ఆయన తన తండ్రిపట్ల నమ్మకంగా ఉంటాడా? దీనిలో మర్మము ఇమిడివుంది. యేసు నిర్వహించే పాత్ర గురించి అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత ఇలా వివరించాడు: “నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను, ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యెను.” (1 తిమోతి 3:​16) అవును, మరణం వరకు యేసు అచంచలమైన యథార్థతను చూపించడం ద్వారా, సాతాను సవాలుకు తిరుగులేని జవాబిచ్చాడు. అయితే మర్మానికి సంబంధించిన ఇతర వివరాలు వెల్లడికావలసి ఉన్నాయి.

“దేవుని రాజ్య మర్మము”

12 గలిలయ ప్రాంతంలో ప్రకటించిన ఒక సందర్భంలో, యేసు తన మెస్సీయ రాజ్య ప్రభుత్వానికీ ఆ మర్మానికీ దగ్గరి సంబంధముందని సూచించాడు. ఆయన తన శిష్యులకిలా చెప్పాడు: “పరలోకరాజ్య మర్మములు [“దేవుని రాజ్య మర్మము,” మార్కు 4:11] ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది.” (మత్తయి 13:​11) ఆ మర్మములోని ఒక అంశంలో, ఆ సంతానంలో భాగంగా తన కుమారునితోపాటు పరలోకంలో పరిపాలించేందుకు మానవుల్లోనుండి 1,44,000 మందిగల ‘చిన్నమందను’ యెహోవా ఎంపిక చేసుకోవడం ఇమిడివుంది.​—⁠లూకా 12:32; ప్రకటన 14:​1, 4.

13 మనుష్యులు భూమ్మీద జీవించడానికి సృష్టించబడ్డారు కాబట్టి, కొందరు పరలోకానికి వెళ్ళాలంటే యెహోవా ఒక “నూతన సృష్టి” చేయాలి. (2 కొరింథీయులు 5:​17) ఈ అసాధారణ పరలోక నిరీక్షణ కోసం ఎంచుకోబడినవారిలో ఒకనిగా మాట్లాడుతూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియైన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరముచొప్పున మనలను మరల జన్మింపజేసెను. . . . ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడియున్నది.”​—⁠1 పేతురు 1:​3-5.

14 భవిష్యత్‌ రాజ్య ప్రభుత్వ మర్మమునకు సంబంధించిన మరో భాగమేమిటంటే, క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలించడానికి పిలవబడే కొద్దిమంది మానవుల్లో యూదేతరులను చేర్చాలనే దేవుని చిత్తం. యెహోవా ‘ఏర్పాటుకు’ సంబంధించిన లేదా తన సంకల్ప నెరవేర్పు జరిగేలా చూసే కార్యనిర్వహణకు సంబంధించిన ఈ అంశాన్ని పౌలు ఇలా వివరించాడు: “ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా​—⁠అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే.” (ఎఫెసీయులు 3:​5, 6) మర్మమునకు సంబంధించిన ఈ భాగపు అవగాహన “పరిశుద్ధులగు అపొస్తలులకు” వెల్లడి చేయబడింది. అదేవిధంగా నేడు, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, “దేవుని మర్మములను” మనం అర్థం చేసుకోలేం.​—⁠1 కొరింథీయులు 2:10; 4:1; కొలొస్సయులు 1:26, 27.

15 పరలోక సీయోను పర్వతం మీద “గొఱ్ఱెపిల్ల”తోపాటు నిలబడివున్నట్లు కనబడిన “నూట నలువది నాలుగు వేలమంది . . . భూలోకమునుండి కొనబడిన[ట్లు] . . . దేవుని కొరకును గొఱ్ఱెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుష్యులలో నుండి కొనబడిన[ట్లు]” చెప్పబడుతోంది. (ప్రకటన 14:​1-4) ఏదెనులో వాగ్దానం చేయబడిన సంతానపు ప్రాథమిక భాగమై ఉండేందుకు యెహోవా తన పరలోక కుమారుల్లో జ్యేష్ఠుణ్ణి ఎంపిక చేసుకున్నాడు కదా, మరి క్రీస్తు సహవాసులను ఆయన మనుషుల్లో నుండి ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ పరిమిత సంఖ్య “[యెహోవా] సంకల్పము చొప్పున” ఆయన “చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి” పిలవబడ్డారని అపొస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు.​—⁠రోమీయులు 8:17, 28-30; ఎఫెసీయులు 1:5, 11; 2 తిమోతి 1:9.

16 తన మహోన్నతమైన పరిశుద్ధ నామాన్ని పవిత్రపరచి, తన విశ్వ సర్వాధిపత్యం సత్యమైనదని నిరూపించడమే యెహోవా సంకల్పం. యెహోవా తన అపార జ్ఞానయుక్తమైన ‘ఏర్పాటు’ ద్వారా లేదా కార్యనిర్వహణా విధానం ద్వారా తన జ్యేష్ఠ కుమారుణ్ణి భూమికి పంపించాడు, ఆ కుమారుడిక్కడ పూర్తిగా పరీక్షించబడ్డాడు. అంతేకాక, యెహోవా తన కుమారుని మెస్సీయ రాజ్య ప్రభుత్వంలో మానవులను చేర్చేందుకు నిర్ణయించాడు. వీరుకూడా ఆయన సర్వాధిపత్యాన్ని మరణాంతం వరకు సమర్థించినవారే.​—⁠ఎఫెసీయులు 1:8-12; ప్రకటన 2:10, 11.

17 యెహోవా తన కుమారుణ్ణి భూమికి పంపించడం ద్వారా, రాజ్య ప్రభుత్వంలో తన కుమారుని తోటివారసులుగా ఉండబోయేవారిని మనుషుల్లోనుండి ఎన్నుకోవడం ద్వారా ఆదాము సంతతిపట్ల తన గొప్ప ప్రేమను చూపించాడు. హేబెలు మొదలుకొని యెహోవాపట్ల నమ్మకస్థులుగా నిరూపించుకున్న ఇతరులకు అదెలా ప్రయోజనం చేకూర్చగలదు? పాపమరణాలకు జన్మతః బానిసలుగా ఉన్న అపరిపూర్ణ మానవులు, మానవాళిపట్ల యెహోవాకున్న ఆది సంకల్పానికి అనుగుణంగా అటు ఆధ్యాత్మికంగా, ఇటు భౌతికంగా స్వస్థతపొంది పరిపూర్ణతకు తీసుకురాబడాలి. (రోమీయులు 5:​12) భూమ్మీద నిత్యజీవం కోసం నిరీక్షించేవారందరికీ, తమ రాజు తన భూపరిచర్య కాలంలో తన శిష్యులపట్ల ప్రదర్శించినట్లే తమపట్ల కూడా ప్రేమను, కనికరంతో కూడిన అవగాహనను ప్రదర్శిస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉంటుందో కదా! (మత్తయి 11:28, 29; హెబ్రీయులు 2:​17, 18; 4:​15; 7:​25, 26) పరలోకంలో క్రీస్తుతోపాటు రాజులుగా యాజకులుగా ఉండే నమ్మకస్థులైన స్త్రీపురుషులు మనలాగే ఒకప్పుడు వ్యక్తిగత బలహీనతలతో పోరాడి, జీవిత సవాళ్లనూ ఎదుర్కొన్నారని గ్రహించడం వారికెంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా!​—⁠రోమీయులు 7:21-25.

వైఫల్యమెరుగని యెహోవా సంకల్పం

18ఎఫెసీయులు 1:8-11లో ఉన్నట్లుగా, అభిషిక్త క్రైస్తవులను ఉద్దేశించి పౌలు వ్రాసిన మాటల భావాన్ని మనమిప్పుడు మరింత మెరుగ్గా అర్థం చేసుకోగలుగుతున్నాం. యెహోవా వారికి “తన చిత్తమునుగూర్చిన మర్మమును” తెలియజేశాడనీ, వారు క్రీస్తుకు ‘స్వాస్థ్యముగా’ నియమించబడ్డారనీ, ‘తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించేవాని సంకల్పమునుబట్టి వారు ముందుగా నిర్ణయించబడ్డారనీ’ ఆయన అన్నాడు. ఇది యెహోవా తన సంకల్ప నెరవేర్పు కోసం చేసే అద్భుతమైన ‘ఏర్పాటుకు’ చక్కగా సరిపోతుందని మనం గ్రహిస్తున్నాం. ప్రభువు రాత్రి భోజనానికి హాజరయ్యే క్రైస్తవుల్లో కొద్దిమంది మాత్రమే చిహ్నాలను ఎందుకు పుచ్చుకుంటారో అర్థం చేసుకోవడానికి కూడా ఇది మనకు సహాయం చేస్తుంది.

19 తర్వాతి ఆర్టికల్‌లో, పరలోక నిరీక్షణగల క్రైస్తవులకు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ భావమేమిటో మనం చూస్తాం. అలాగే భూమిపై నిత్యజీవ నిరీక్షణగల లక్షలాదిమంది జ్ఞాపకార్థ ఆచరణ సూచించేదాని విషయంలో ఎందుకు అత్యంత ఆసక్తి కలిగివున్నారో కూడా తెలుసుకుంటాం.

[అధస్సూచీలు]

^ పేరా 9 దేవుని పేరుకు అక్షరార్థంగా “తానే కర్త అవుతాడు” అని అర్థం. యెహోవా తన సంకల్ప నెరవేర్పుకు ఎలా కావాలంటే అలా అవుతాడు.​—⁠నిర్గమకాండము 3:​14, NW అధస్సూచి.

^ పేరా 12 ఆ ‘ఏర్పాటు’ తన కాలంలో పనిచేస్తున్నట్లు పౌలు మాటలు సూచిస్తుండగా, 1914 వరకు మెస్సీయ రాజ్యం స్థాపించబడలేదని లేఖనాలు సూచిస్తున్నాయి.

^ పేరా 13 దేవుని సంకల్ప నెరవేర్పులో ఇమిడివున్న ఈ నిబంధనల వివరణాత్మక చర్చకోసం కావలికోట ఫిబ్రవరి 1, 1990, 10-15 పేజీలు చూడండి.

పునఃసమీక్ష

• యెహోవా భూమిని ఎందుకు సృష్టించాడు, మనిషిని దానిపై ఎందుకు ఉంచాడు?

• యెహోవా అద్వితీయ కుమారుడు ఈ భూమిపై పరీక్షించబడడం ఎందుకు అవసరమయ్యింది?

• క్రీస్తు సహపరిపాలకులను యెహోవా మనుషుల్లో నుండి ఎందుకు ఎన్నుకున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యెహోవాసాక్షుల సంఘాలన్నీ 2006, ఏప్రిల్‌ 12న ఎందుకు సమావేశమౌతాయి?

2, 3. (ఎ) యెహోవా తన సంకల్పాన్నిబట్టి సృష్టించడాన్ని ఎలా కొనసాగించాడు? (బి) యెహోవా భూమిని, మానవులను ఏ సంకల్పంతో సృష్టించాడు?

4. మానవ చరిత్రారంభంలోనే యెహోవా సర్వాధిపత్యం ఎలా సవాలు చేయబడింది?

5. ఏ రెండవ వివాదాంశం లేవదీయబడింది, దీనిలో ఎవరెవరు ఇమిడివున్నారు?

6. యెహోవా తాను తన సంకల్పానికి నమ్మకంగా కట్టుబడివున్నానని, తన పేరుకు తగ్గట్టుగావున్నానని ఎలా నిరూపించుకున్నాడు?

7. అపొస్తలుడైన పౌలు ద్వారా యెహోవా ఏ సంకల్పాన్ని వెల్లడిచేశాడు?

8. ‘ఏర్పాటు’ అని అనువదించబడిన మాటకు అక్షరార్థ భావమేమిటి?

9. యెహోవా తన చిత్తాన్ని గురించిన మర్మమును క్రమేణా ఎలా వెల్లడిచేశాడు?

10, 11. (ఎ) ప్రవచించబడిన సంతానాన్ని యెహోవా ఎలా వెల్లడిచేశాడు? (బి) దేవుని అద్వితీయ కుమారుడు భూమికి ఎందుకొచ్చాడు?

12, 13. (ఎ) “దేవుని రాజ్య మర్మము”లోని ఒక అంశమేమిటి? (బి) పరలోకానికి వెళ్లేందుకు యెహోవా పరిమిత సంఖ్యలో మానవులను ఎంచుకోవడంలో ఏమి ఇమిడివుంది?

14. (ఎ) “దేవుని రాజ్య మర్మము”లో యూదేతరులు ఎలా ఇమిడివున్నారు? (బి) “దేవుని మర్మములను” మనమెలా అర్థం చేసుకోగలుగుతున్నాం?

15, 16. క్రీస్తుతోపాటు పరిపాలించేవారిని యెహోవా మనుషుల్లో నుండి ఎందుకు ఎన్నుకున్నాడు?

17. క్రీస్తు, ఆయన సహపరిపాలకులు ఒకప్పుడు మానవులుగా జీవించినందుకు మనమెందుకు సంతోషించవచ్చు?

18, 19. ఎఫెసీయులు 1:8-11లోని పౌలు మాటలు మనకెందుకు స్పష్టంగా ఉన్నాయి, తర్వాతి ఆర్టికల్‌లో ఏ విషయం పరిశీలించబడుతుంది?