కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం

పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం

పరలోకంలో ఉన్నవాటిని, భూమ్మీద ఉన్నవాటిని సమకూర్చడం

“తన దయాసంకల్పము చొప్పున . . . ఆయన పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను.”​—⁠ఎఫెసీయులు 1:8-10.

విశ్వశాంతి! అదే ‘సమాధానకర్తయగు దేవుడైన’ యెహోవా అద్భుత సంకల్పం. (హెబ్రీయులు 13:​20) ‘పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెననేది తన దయాసంకల్పమని’ వ్రాసేందుకు ఆయన అపొస్తలుడైన పౌలును ప్రేరేపించాడు. (ఎఫెసీయులు 1:​8-10) ఈ వచనంలో ‘ఏకముగా సమకూర్చడం’ అని అనువదించబడిన క్రియాపదానికి అర్థమేమిటి? బైబిలు విద్వాంసుడైన జె. బి. లైట్‌ఫుట్‌ ఇలా వ్రాస్తున్నాడు: “ఈ మాట విశ్వంలోని సంపూర్ణ సామరస్యాన్ని సూచిస్తుంది. అందులో విరుద్ధమైన, విభజనాత్మకమైన కారకాలకు ఏ మాత్రం తావుండదు, బదులుగా ప్రతీదీ క్రీస్తే కేంద్ర బిందువుగా, ఆయనతో ఐక్యంగా ఉంటాయి. పాపమరణాలు, దుఃఖం, వైఫల్యం, బాధ గతించిపోతాయి.”

‘పరలోకములో ఉన్నవి’

2 నిజ క్రైస్తవుల అద్భుతమైన నిరీక్షణను క్లుప్తీకరిస్తూ అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మనమాయన వాగ్దానమునుబట్టి క్రొత్త ఆకాశములకొరకును క్రొత్త భూమికొరకును కనిపెట్టుచున్నాము; వాటియందు నీతి నివసించును.” (2 పేతురు 3:​13) ఇక్కడ వాగ్దానం చేయబడిన “క్రొత్త ఆకాశములు” క్రొత్త ప్రభుత్వాధికారాన్ని, మెస్సీయ రాజ్యాన్ని సూచిస్తున్నాయి. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో పౌలు ప్రస్తావించిన ‘పరలోకములో ఉన్నవి’ “క్రీస్తునందు” సమకూర్చబడాలి. వారు పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించడానికి పరిమిత సంఖ్యలో ఎంచుకోబడిన మానవులు. (1 పేతురు 1:​3, 4) పరలోక రాజ్యంలో క్రీస్తుతోడి వారసులుగా ఉండేందుకు ఈ 1,44,000 అభిషిక్త క్రైస్తవులు ‘భూలోకములోనుండి కొనబడ్డారు,’ ‘మనుషులలో నుండి కొనబడ్డారు.’​—⁠ప్రకటన 5:9, 10; 14:3, 4; 2 కొరింథీయులు 1:21; ఎఫెసీయులు 1:​11; 3:⁠6.

3 అభిషిక్త క్రైస్తవులు యెహోవా ఆధ్యాత్మిక కుమారులయ్యేందుకు పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించారు. (యోహాను 1:​12, 13; 3:​5-7) యెహోవాచే ‘పుత్రులుగా’ దత్తత తీసుకోబడిన వీరు యేసు సహోదరులవుతారు. (రోమీయులు 8:15; ఎఫెసీయులు 1:​4-5) అందువల్ల, భూమ్మీద ఉన్నప్పుడు సహితం వారు ‘క్రీస్తుయేసునందు ఆయనతో కూడా లేపబడి, పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నారు’ అని చెప్పబడ్డారు. (ఎఫెసీయులు 1:3; 2:⁠7) పరలోకంలో వారికోసం కేటాయించబడిన ‘[వారి] స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్న వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిన’ కారణంగా వారు ఈ ఆధ్యాత్మిక ఉన్నతస్థానం పొందారు. (ఎఫెసీయులు 1:13, 14; కొలొస్సయులు 1:⁠5) కాబట్టి, మొత్తం ఇంతమందని యెహోవా ముందే నిర్ణయించిన ‘పరలోకములో ఉన్నవి’ అనేవారు సమకూర్చబడాలి.

సమకూర్చేపని ఆరంభమవడం

4 యెహోవా ‘ఏర్పాటుకు’ లేదా కార్యనిర్వహణా విధానానికి అనుగుణంగా ‘పరలోకములో ఉన్నవి’ సమకూర్చబడడం “కాలము సంపూర్ణమైనప్పుడు” ఆరంభమవుతుంది. (ఎఫెసీయులు 1:⁠8) ఆ నిర్ణయకాలం సా.శ. 33 పెంతెకొస్తు రోజున వచ్చింది. ఆ రోజు, పరిశుద్ధాత్మ అపొస్తలులపై, శిష్యుల గుంపుపై అంటే స్త్రీపురుషులపై కుమ్మరించబడింది. (అపొస్తలుల కార్యములు 1:13-15; 2:​1-4) ఈ సంఘటన ఒక క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చిందని, క్రైస్తవ సంఘ ఆవిర్భవానికీ, ‘దేవుని ఇశ్రాయేలుగా’ ఉండే ఓ క్రొత్త ఆధ్యాత్మిక ఇశ్రాయేలు జనాంగ ఆరంభానికీ గుర్తని రుజువు చేసింది.​—⁠గలతీయులు 6:16; హెబ్రీయులు 9:​15; 12:23, 24.

5 సహజ ఇశ్రాయేలీయులతో చేసిన ధర్మశాస్త్ర నిబంధన, నిత్యం పరలోకంలో సేవచేసే ‘యాజక రూపమైన రాజ్యమును, పరిశుద్ధమైన జనమును’ ఉత్పత్తి చేయలేదు. (నిర్గమకాండము 19:​5, 6) యూదా మతనాయకులతో యేసు ఇలా అన్నాడు: “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును.” (మత్తయి 21:​43) ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులైన ఆ జనం, క్రొత్త నిబంధనలోకి తీసుకోబడిన అభిషిక్త క్రైస్తవులతో రూపొందించబడింది. వీరికి అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకసమూహమును, పరిశుద్ధజనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక యిప్పుడు దేవుని ప్రజయైతిరి.” (1 పేతురు 2:​9, 10) సహజ ఇశ్రాయేలీయులు ఇక దేవుని నిబంధనా ప్రజలుగా లేరు. (హెబ్రీయులు 8:​7-13) యేసు ముందే చెప్పినట్లుగా, మెస్సీయ రాజ్యంలో భాగంగావుండే ఆధిక్యత వారినుండి తొలగించబడి ఆధ్యాత్మిక ఇశ్రాయేలు సభ్యులైన 1,44,000 మందికి ఇవ్వబడింది.​—⁠ప్రకటన 7:4-8.

రాజ్య నిబంధనలోకి తీసుకోబడడం

6 యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించిన రాత్రి, తన నమ్మకమైన అపొస్తలులతో ఇలా అన్నాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:​28-30) యేసు ఇక్కడ “మరణమువరకు నమ్మకముగా” ఉండి, ‘జయించినవారిగా’ నిరూపించుకునే తన 1,44,000 మంది ఆత్మజనిత సహోదరులతో తాను చేసిన ఒక ప్రత్యేక నిబంధనను సూచిస్తున్నాడు.​—⁠ప్రకటన 2:​10; 3:21.

7 ఆ పరిమిత గుంపు రక్తమాంసాలుగల మానవులుగా భూమ్మీద నిత్యం జీవించే నిరీక్షణను పూర్తిగా త్యజిస్తారు. వారు మానవాళికి తీర్పుతీర్చడానికి సింహాసనాల మీద కూర్చొని క్రీస్తుతోపాటు పరలోకంలో పరిపాలిస్తారు. (ప్రకటన 20:​4, 6) కేవలం ఈ అభిషిక్తులకు మాత్రమే వర్తించేవే కాక, జ్ఞాపకార్థ చిహ్నాలను ‘వేరే గొఱ్ఱెలకు’ చెందినవారు ఎందుకు పుచ్చుకోరో వివరించే ఇతర లేఖనాల్నీ మనమిప్పుడు పరిశీలిద్దాం.​—⁠యోహాను 10:16.

8 అభిషిక్తులు క్రీస్తు బాధలను పంచుకుని, ఆయనలాగే మరణించేందుకు ఇష్టపడతారు. పౌలు ఆ గుంపులోని సభ్యునిగా తాను “క్రీస్తును సంపాదించుకొని . . . ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును” ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధమేనని చెప్పాడు. అవును, “ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడై” ఉండేలా తనను లోబరచుకునేందుకు పౌలు ఇష్టపడ్డాడు. (ఫిలిప్పీయులు 3:​8, 10) చాలామంది అభిషిక్త క్రైస్తవులు తమ శరీరాల్లో “యేసుయొక్క మరణానుభవమును” సహించారు.​—⁠2 కొరింథీయులు 4:10.

9 ప్రభువు రాత్రి భోజనం ఏర్పాటు చేసేటప్పుడు, యేసు “ఇది నా శరీరము” అని చెప్పాడు. (మార్కు 14:​22) ఆయన కొద్దిసేపటిలో కొట్టబడి, రక్తం చిందించబడే తన అక్షరార్థ శరీరాన్ని సూచిస్తున్నాడు. పులిసిన పిండి కలపకుండా చేసే రొట్టె ఆ శరీరానికి తగిన చిహ్నం. ఎందుకు? ఎందుకంటే బైబిల్లో పులిసిన పిండి పాపానికి లేదా దుష్టత్వానికి చిహ్నంగా ఉంది. (మత్తయి 16:4, 11, 12; 1 కొరింథీయులు 5:​6-8) యేసు పరిపూర్ణుడు, ఆయన మానవ శరీరం పాపరహితమైనది. ఆ పరిపూర్ణ శరీరాన్ని ఆయన పరిహారార్థ బలిగా అర్పిస్తాడు. (హెబ్రీయులు 7:​26; 1 యోహాను 2:2) ఆయనలా చేయడం, పరలోక జీవ నిరీక్షణగలవారైనా లేక పరదైసు భూమిపై నిత్యజీవ నిరీక్షణగలవారైనా నమ్మకమైన క్రైస్తవులందరికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.​—⁠యోహాను 6:​51.

10 జ్ఞాపకార్థ ఆచరణలో అభిషిక్త క్రైస్తవులు పుచ్చుకునే ద్రాక్షారసం గురించి పౌలు ఇలా వ్రాశాడు: “మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర లోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయేగదా?” (1 కొరింథీయులు 10:​16) ద్రాక్షారసము పుచ్చుకునేవారు ఏ విధంగా ‘క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నవారిగా’ ఉంటారు? వారికే విమోచన అవసరం కాబట్టి, విమోచన క్రయధనం చెల్లించడంలో వారు నిశ్చయంగా భాగంవహించరు. కీస్తు రక్తానికున్న విమోచనా శక్తిలోని తమ విశ్వాసాన్నిబట్టి వారి పాపాలు క్షమించబడి, పరలోక జీవానికి అర్హులై నీతిమంతులని ప్రకటించబడతారు. (రోమీయులు 5:8, 9; తీతు 3:​4-7) క్రీస్తు చిందించిన రక్తం మూలంగానే క్రీస్తుతోడి వారసులైన ఆ 1,44,000 మంది ‘పరిశుద్ధపరచబడి,’ ప్రత్యేకించబడి, ‘పరిశుద్ధులగుటకు’ పాపం లేకుండా కడగబడతారు. (హెబ్రీయులు 10:29; దానియేలు 7:18, 27; ఎఫెసీయులు 2:​19) అవును, క్రీస్తు తాను చిందించిన రక్తముతో “ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చే[శాడు]; గనుక వారు భూలోకమందు ఏలుదురు.”​—⁠ప్రకటన 5:​9, 10.

11 యేసు తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ఏర్పాటు చేసినప్పుడు, తన నమ్మకమైన అపొస్తలులకు ద్రాక్షారసపు గిన్నెను అందించి ఇలా అన్నాడు: “దీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము.” (మత్తయి 26:​27, 28) కోడెల రక్తము, మేకల రక్తము ఎలా ఇశ్రాయేలు జనాంగానికీ, దేవునికీ మధ్య ధర్మశాస్త్ర నిబంధనను ధృవీకరించిందో అలాగే, యేసు రక్తము సా.శ. 33 పెంతెకొస్తుతో ఆరంభించి ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో యెహోవా చేసే క్రొత్త నిబంధనను ధృవీకరించింది. (నిర్గమకాండము 24:5-8; లూకా 22:20; హెబ్రీయులు 9:​14, 15) “నిబంధన రక్తమును” సూచించే ద్రాక్షారసాన్ని పుచ్చుకోవడం ద్వారా, అభిషిక్తులు తాము క్రొత్త నిబంధనలోకి తీసుకోబడ్డామనీ, దాని ప్రయోజనాలు పొందుతున్నామనీ సూచిస్తారు.

12 అభిషిక్తులకు మరో విషయం కూడా జ్ఞాపకం చేయబడుతుంది. యేసు తన నమ్మకమైన శిష్యులకు ఇలా చెప్పాడు: “నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు; నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు.” (మార్కు 10:​38, 39) అపొస్తలుడైన పౌలు ఆ తర్వాత, క్రైస్తవులు “[క్రీస్తు] మరణములోనికి బాప్తిస్మము” పొందే విషయం గురించి మాట్లాడాడు. (రోమీయులు 6:⁠3) అభిషిక్తులు త్యాగపూరిత జీవితం జీవిస్తారు. భూమ్మీది నిత్యజీవ నిరీక్షణను పూర్తిగా త్యజిస్తారు కాబట్టి, వారి మరణమూ త్యాగపూరితమైనదే. ఈ అభిషిక్త క్రైస్తవులు నమ్మకస్థులుగా మరణించి, పరలోకంలో క్రీస్తుతో ‘కూడ ఏలుటకు’ ఆత్మప్రాణులుగా పునరుత్థానం చేయబడినప్పుడు, క్రీస్తు మరణములోనికి వారి బాప్తిస్మం పూర్తవుతుంది.​—⁠2 తిమోతి 2:10-12; రోమీయులు 6:5; 1 కొరింథీయులు 15:42-44, 50.

చిహ్నాలను పుచ్చుకోవడం

13 జ్ఞాపకార్థ ఆచరణలో అందించబడే రొట్టె ద్రాక్షారసాలను పుచ్చుకోవడంలో ఇన్ని విషయాలు ఇమిడివున్నాయి కాబట్టి, భూనిరీక్షణగలవారు వాటిని పుచ్చుకోవడం ఖచ్చితంగా అనుచితం. తాము క్రీస్తు శరీరంలోని అభిషిక్త సభ్యులం కాదనీ, యేసుక్రీస్తుతోపాటు పరిపాలించేవారితో యెహోవా చేసిన క్రొత్త నిబంధనలో తాము లేమనీ ఈ భూనిరీక్షణగలవారు గ్రహిస్తారు. “గిన్నె” క్రొత్త నిబంధనకు సూచనగా ఉంది కాబట్టి, క్రొత్త నిబంధనలో ఉన్నవారు మాత్రమే చిహ్నాలను పుచ్చుకుంటారు. రాజ్య పరిపాలనలో భూమ్మీద మానవ పరిపూర్ణత కలిగి నిత్యం జీవించేందుకు ఎదురుచూసేవారు, యేసు మరణములోనికి బాప్తిస్మం పొందలేదు లేదా పరలోకంలో ఆయనతోపాటు పరిపాలించేందుకు పిలవబడనూ లేదు. కాబట్టి వారు చిహ్నాలను పుచ్చుకుంటే, అది వారి విషయంలో సత్యం కానిదాన్ని సూచిస్తుంది. అందువల్ల, వారు గౌరవపూర్వకంగా గమనించేవారిగానే జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవుతారు గానీ, వారు చిహ్నాలను పుచ్చుకోరు క్రీస్తు చిందించిన రక్తం ఆధారంగా పాపక్షమాపణ అనుగ్రహించడంతోపాటు యెహోవా తన కుమారుని ద్వారా తమకోసం చేసిన సమస్త విషయాలపట్ల వారు కృతజ్ఞతా భావం కలిగివుంటారు.

14 పరలోకంలో క్రీస్తుతో పరిపాలించేందుకు పిలువబడిన కొద్దిమంది క్రైస్తవులను ముద్రించే కడవరి ప్రక్రియ ముగింపుకొచ్చింది. అభిషిక్తులు భూమ్మీది తమ త్యాగపూరితమైన జీవితం ముగిసే పర్యంతం, జ్ఞాపకార్థ చిహ్నాలను పుచ్చుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా బలపర్చబడతారు. క్రీస్తు శరీరంలోని సభ్యులుగా వారు తమ సహోదర సహోదరీలతో ఐక్యభావాన్ని కలిగివుంటారు. చిహ్నార్థకమైన రొట్టె, ద్రాక్షారసాలను పుచ్చుకోవడం మరణంవరకు నమ్మకంగా నిలిచివుండవలసిన వారి బాధ్యతను వారికి గుర్తుచేస్తుంది.​—⁠2 పేతురు 1:10, 11.

‘భూమ్మీద ఉన్నవాటిని’ సమకూర్చడం

15 ‘చిన్నమందకు’ చెందని, అంతకంతకు అధిక సంఖ్యాకులవుతున్న, భూమిపై నిత్యజీవ నిరీక్షణగల “వేరే గొఱ్ఱెలు,” 1935వ దశాబ్దపు మధ్యకాలం నుండి అభిషిక్తులకు మద్దతుగా నిలిచారు. (యోహాను 10:16; లూకా 12:32; జెకర్యా 8:​23) సకల జనములకు సాక్ష్యార్థంగా “ఈ రాజ్య సువార్త” ప్రకటించడంలో విలువైన చేయూతనిస్తూ వారు క్రీస్తు సహోదరులకు విశ్వసనీయ సహవాసులయ్యారు. (మత్తయి 24:​14; 25:​40) అలా చేస్తున్న కారణంగా వారు క్రీస్తుచేత ఆయన ‘గొర్రెలుగా’ సానుకూల తీర్పుపొందడమే కాక, జనాంగములకు తీర్పు తీర్చేందుకు ఆయన వచ్చినప్పుడు ఆయన ‘కుడివైపున’ నిలబడే ఆధిక్యత కూడా వారికి లభిస్తుంది. (మత్తయి 25:​33-36, 46) క్రీస్తు రక్తాన్ని విశ్వసించడం ద్వారా వారు “మహాశ్రమలు” తప్పించుకునే ‘గొప్పసమూహముగా’ రూపొందుతారు.​—⁠ప్రకటన 7:9-14.

16 ఆ 1,44,000 మందిని ముద్రించే కడవరి ప్రక్రియ భూమ్మీది సాతాను విధానంపై నాశనకరమైన “వాయువులను” విడిచే మార్గాన్ని సుగమం చేస్తుంది. (ప్రకటన 7:​1-4) క్రీస్తు, ఆయన సహరాజులైన యాజకుల వెయ్యేండ్ల పరిపాలనా కాలంలో, ఈ గొప్పసమూహానికి, పునరుత్థానులైన అసంఖ్యాకులు తోడవుతారు. (ప్రకటన 20:​12, 13) మెస్సీయ రాజైన క్రీస్తుయేసుకు శాశ్వతమైన భూ సంబంధ ప్రజలుగా ఉండే అవకాశం వీరికి ఉంటుంది. వెయ్యేండ్ల పరిపాలన ముగింపులో ‘భూమ్మీద ఉన్న’ వీరందరూ కడవరి పరీక్షకు గురిచేయబడతారు. నమ్మకస్థులుగా నిరూపించుకున్నవారు భూసంబంధ “దేవుని పిల్లలు[గా]” స్వీకరించబడతారు.​—⁠ఎఫెసీయులు 1:10; రోమీయులు 8:20; ప్రకటన 20:7, 8.

17 ఆ విధంగా యెహోవా తన అపారమైన జ్ఞానంతో చేసిన ‘ఏర్పాటు’ ద్వారా లేదా కార్యనిర్వహణా విధానం ద్వారా “పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చే” తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అటు పరలోకంలో ఇటు భూమ్మీద ఉన్న బుద్ధిసూక్ష్మతగల ప్రాణులందరూ విశ్వశాంతికి సమకూర్చబడి, మహా సంకల్పకర్తయైన యెహోవా నీతియుక్త సర్వాధిపత్యానికి సంతోషంగా లోబడతారు.

18 కొద్దిమందిగావున్న అభిషిక్తులకు, లక్షల సంఖ్యలోవున్న వారి వేరేగొర్రెల సహవాసులకు 2006, ఏప్రిల్‌ 12న సమకూడడం విశ్వాసాన్ని ఎంత బలోపేతం చేసేదిగా ఉంటుందో కదా! “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి” అని యేసు ఆజ్ఞాపించినట్లే వారు క్రీస్తు మరణ జ్ఞాపకార్థాన్ని ఆచరిస్తారు. (లూకా 22:​19) హాజరయ్యేవారందరూ యెహోవా తన ప్రియకుమారుడైన క్రీస్తుయేసు ద్వారా చేసినదానిని గుర్తుంచుకోవాలి.

పునఃసమీక్ష

పరలోకంలో ఉన్నవాటిపట్ల, భూమ్మీద ఉన్నవాటిపట్ల యెహోవా సంకల్పమేమిటి?

‘పరలోకంలో ఉన్నవి’ అనే వారెవరు, వారెలా సమకూర్చబడతారు?

‘భూమ్మీద ఉన్నవి’ అనే వారెవరు, వారికి ఏ నిరీక్షణ ఉంది?

[అధ్యయన ప్రశ్నలు]

1. పరలోకంపట్ల, భూమిపట్ల యెహోవా ‘దయా సంకల్పం’ ఏమిటి?

2. సమకూర్చబడవలసిన ‘పరలోకములో ఉన్నవి’ అనే వారెవరు?

3. భూమ్మీద ఉన్నప్పుడే అభిషిక్తులు ‘పరలోకమందు కూర్చున్నారు’ అని ఎలా చెప్పవచ్చు?

4. ‘పరలోకములో ఉన్నవి’ సమకూర్చబడడం ఎప్పుడు, ఎలా ఆరంభమైంది?

5. సహజ ఇశ్రాయేలు స్థానంలో యెహోవా ఎందుకు ఒక క్రొత్త ‘జనమును’ సృష్టించాడు?

6, 7. యేసు తన ఆత్మజనిత సహోదరులతో ఏ ప్రత్యేక నిబంధన చేశాడు, వారి విషయంలో దాని భావమేమిటి?

8. రొట్టెను తినడం ద్వారా అభిషిక్తులు ఏమి సూచిస్తారు? (23వ పేజీలోవున్న బాక్సు చూడండి.)

9. జ్ఞాపకార్థ రొట్టె ఎలాంటి శరీరానికి చిహ్నంగా ఉంది?

10. జ్ఞాపకార్థ ద్రాక్షారసం పుచ్చుకునేవారు ఏ విధంగా ‘క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటారు’?

11. జ్ఞాపకార్థ ద్రాక్షారసం పుచ్చుకోవడం ద్వారా అభిషిక్తులు ఏమి సూచిస్తారు?

12. అభిషిక్తులు క్రీస్తు మరణములోనికి ఎలా బాప్తిస్మం పొందుతారు?

13. భూనిరీక్షణగలవారు జ్ఞాపకార్థ చిహ్నాలను ఎందుకు పుచ్చుకోరు, అయితే జ్ఞాపకార్థ ఆచరణకు వారెందుకు హాజరవుతారు?

14. రొట్టె, ద్రాక్షారసాలను పుచ్చుకోవడంవల్ల అభిషిక్తులు ఆధ్యాత్మికంగా ఎలా బలపర్చబడతారు?

15. అభిషిక్త క్రైస్తవులకు మద్దతుగా ఎవరు సమకూర్చబడుతున్నారు?

16. ‘భూమ్మీద ఉన్న’వారిలో ఎవరు కూడా ఉంటారు, “దేవుని పిల్లలు[గా]” మారే అవకాశం వీరందరికీ ఎలా లభిస్తుంది?

17. యెహోవా సంకల్పం ఎలా నెరవేరుతుంది?

18. జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా అభిషిక్తులూ, వారి సహవాసులూ ఎలా ప్రయోజనం పొందుతారు?

[23వ పేజీలోని బాక్సు]

“క్రీస్తు శరీరము”

పౌలు 1 కొరింథీయులు 10:16, 17లో, క్రీస్తు ఆత్మాభిషిక్త సహోదరులకు రొట్టె కలిగివుండే ప్రత్యేక భావం గురించి చర్చిస్తూ “శరీరమును” ఒక విశేషార్థంతో ప్రస్తావించాడు. ఆయనిలా అన్నాడు: “మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా? మనమందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.” అభిషిక్త క్రైస్తవులు జ్ఞాపకార్థ రొట్టెను భుజించినప్పుడు, క్రీస్తు శిరస్సుగావున్న శరీరంలాంటి అభిషిక్తుల సంఘంలో తమ ఐక్యతను ప్రకటిస్తారు.​—⁠మత్తయి 23:10; 1 కొరింథీయులు 12:12, 13, 18.

[23వ పేజీలోని చిత్రాలు]

రొట్టె ద్రాక్షారసాలను అభిషిక్తులు మాత్రమే ఎందుకు పుచ్చుకుంటారు?

[25వ పేజీలోని చిత్రం]

యెహోవా ఏర్పాటు ద్వారా అటు పరలోకంలో, ఇటు భూమ్మీదున్న ప్రాణులందరూ ఐక్యపరచబడతారు