కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

మత్తయి 5:22లో యేసు ఏ మూడు ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాడు?

యేసు తాను కొండమీద ఇచ్చిన ప్రసంగంలో తన అనుచరులను ఇలా హెచ్చరించాడు: “నేను మీతో చెప్పునదేమనగా​—⁠తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి [‘గెహెన్నాకు,’ NW] లోనగును.”​—⁠మత్తయి 5:​22.

పాపాల గంభీరత పెరిగే కొద్దీ శిక్షల తీవ్రత పెరుగుతుందనే విషయం యూదులకు తెలియజేయడానికి యేసు వారికి సుపరిచితమైన విమర్శ, మహాసభ, నరకాగ్ని వంటివాటిని ఉపయోగించాడు.

మొదట, తన సహోదరుని మీద కోపం పెట్టుకుని ఉండే ప్రతి ఒక్కరూ “విమర్శకు” లోనవుతారు, అంటే వారు స్థానిక న్యాయస్థానంలో హాజరు కావలసి ఉంటుంది. యూదుల సాంప్రదాయం ప్రకారం, ఈ స్థానిక న్యాయస్థానాలు సాధారణంగా 120 లేక అంతకంటే ఎక్కువమంది పురుషుల జనాభావున్న పట్టణాల్లో నెలకొల్పబడేవి. (మార్కు 13:⁠9) అలాంటి స్థానిక న్యాయస్థానాల్లోని న్యాయాధిపతులకు హత్య కేసుల్లో సహితం తీర్పు చెప్పే అధికారం ఉండేది. (ద్వితీయోపదేశకాండము 16:18; 19:12; 21:​1, 2) అలా, తన సహోదరుని మీద కోపం పెట్టుకుని ఉండే వ్యక్తి గంభీరమైన పాపం చేస్తున్నట్లే అని యేసు చూపిస్తున్నాడు.

ఆ తర్వాత యేసు, “తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును” అని చెప్పాడు. “వ్యర్థుడు” అని అనువదించబడిన రాకా అనే గ్రీకు పదానికి “శూన్యం” లేక “వివేక శూన్యమైన” అనే భావం ఉంది. ద న్యూ థేయర్స్‌ గ్రీక్‌ ఇంగ్లీష్‌ లెక్సికన్‌ ఆఫ్‌ ద న్యూ టెస్ట్‌మెంట్‌ ప్రకారం, ఆ పదాన్ని “క్రీస్తు కాలంలో యూదులు ఒక తిట్టు మాటగా” ఉపయోగించేవారు. తన తోటి మానవుణ్ణి ఉద్దేశించి అలాంటి తిట్టు మాట ఉపయోగించి ద్వేషాన్ని వ్యక్తం చేయడం యొక్క గంభీరత గురించి యేసు హెచ్చరిస్తున్నాడు. అలాంటి పదాన్ని ఉపయోగించే వ్యక్తి కేవలం స్థానిక న్యాయస్థానం చేత కాదుగానీ మహాసభ చేతనే తీర్పు తీర్చబడతాడని యేసు చెబుతున్నాడు, అది ప్రధానయాజకుడు, 70 మంది పెద్దలు శాస్త్రులతో రూపొందిన, యెరూషలేములోవున్న న్యాయసంబంధమైన యూదుల మహాసభ.​—⁠మార్కు 15:⁠1.

చివరిగా, ఒక వ్యక్తి మరో వ్యక్తిని “ద్రోహి” అంటే అతడు గెహెన్నాకు లోనవుతాడని యేసు వివరించాడు. “గెహెన్నా” అనే పదం గె హిన్నోమ్‌ అనే హీబ్రూ పదాల నుండి వచ్చింది, దానికి “హిన్నోము లోయ” అని అర్థం, ఆ లోయ ప్రాచీన యెరూషలేముకు పశ్చిమాన దక్షిణదిశగా ఉంది. యేసు కాలంలో, ఆ లోయలో చెత్తపడేసి కాల్చేవారు, సమాధి చేయబడడానికి అర్హులు కారని పరిగణించబడిన నీచమైన నేరస్థుల శవాలను కూడా అందులో పడేసేవారు. కాబట్టి “గెహెన్నా” అనే పదం సంపూర్ణ నాశనానికి తగిన చిహ్నంగా ఉంది.

మరైతే, “ద్రోహి” అనే పదం దేన్ని సూచిస్తుంది? ఇక్కడ ఉపయోగించబడిన పదం, “తిరుగుబాటుచేసే” లేక “ప్రతిఘటించే” అనే భావాలు గల హీబ్రూ పదంలాగే ఉంటుంది. అది ఒక వ్యక్తిని నైతికంగా ఏ మాత్రం విలువలేనివాడిగా, మతభ్రష్టునిగా, దేవుణ్ణి వ్యతిరేకించేవాడిగా గుర్తిస్తుంది. కాబట్టి తోటి మనిషిని “ద్రోహి” అని పిలిచే వ్యక్తి, తన సహోదరుడు దేవుణ్ణి వ్యతిరేకించే వ్యక్తి పొందదగిన శిక్షను, అంటే నిత్యనాశనాన్ని పొందాలని చెబుతున్నట్లే. దేవుని దృక్కోణం నుండి చూస్తే, మరో వ్యక్తిని అలా ఖండించే వ్యక్తి స్వయంగా తీవ్రమైన శిక్షను, అంటే నిత్యనాశనాన్ని పొందడానికి అర్హుడు.​—⁠ద్వితీయోపదేశకాండము 19:​17-19.

కాబట్టి, యేసు తన అనుచరులకు మోషే ధర్మశాస్త్రంలోని సూత్రాలకంటే ఉన్నతమైన ప్రమాణాలను పెడుతున్నాడు. హంతకుడు “విమర్శకు లోనగును” అని ప్రజలు నమ్మితే, యేసు చర్యలే కాక, చివరికి అలాంటి హృదయ పరిస్థితి కూడా మంచిది కాదని నొక్కిచెప్పాడు. తమ సహోదరులపట్ల కోపం పెట్టుకోవడాన్ని కూడా నివారించాలని ఆయన తన అనుచరులకు బోధించాడు.​—⁠మత్తయి 5:​21, 22.