కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రేరేపిత బైబిలు పుస్తకాల ప్రాచీన పట్టిక

ప్రేరేపిత బైబిలు పుస్తకాల ప్రాచీన పట్టిక

ప్రేరేపిత బైబిలు పుస్తకాల ప్రాచీన పట్టిక

“తొలి క్రైస్తవుల చరిత్రపట్ల ఆసక్తివున్నవారి జిజ్ఞాసను రేకెత్తించడానికే ప్రతీ వాక్యం వ్రాయబడిందన్నట్లు అనిపిస్తుంది.” ఈ మాటలతో ఒక ప్రాచీన దస్తావేజు వర్ణించబడింది. ఆ దస్తావేజు ఏమిటో మీరు ఊహించగలరా?

అదే మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌, దాని గురించి మీరు వినుండొచ్చు, వినుండకపోవచ్చు. ఏదేమైనా, ‘మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ ఎందుకంత ప్రత్యేకమైనది’ అని మీరు అనుకుంటుండవచ్చు. అది ఉనికిలో ఉన్న అతిప్రాచీన, బైబిలు పుస్తకాల అధికారిక పట్టిక లేదా క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పుస్తకాల అధికారిక పట్టిక.

కొన్ని పుస్తకాలు బైబిల్లో భాగమని మీరు ఎలాంటి వివరణా లేకుండానే నమ్ముతుండవచ్చు. అయితే, ఏ పుస్తకాలను బైబిల్లో చేర్చాలి అని కొందరు సందేహించిన సమయం ఉందని తెలుసుకోవడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందా? మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌లో లేక బైబిలు పుస్తకాల అధికారిక పట్టికలో దైవప్రేరేపితమైనవిగా పరిగణించబడే పుస్తకాల పట్టిక ఉంది. బైబిల్లో ఉన్న ఖచ్చితమైన సమాచారం చాలా ప్రాముఖ్యమని మీకు ఇప్పటికే తెలుసు. అయితే, ఇప్పుడు క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో భాగంగావున్న పుస్తకాల గురించి ఆ దస్తావేజు ఏమి వెల్లడిచేసింది? ముందుగా ఆ దస్తావేజుకున్న నేపథ్యాన్ని కొంత తెలుసుకుందాం.

దానిని కనిపెట్టడం

మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌, ఒక్కొక్కటి 27 సెంటీమీటర్ల పొడవు, 17 సెంటీమీటర్ల వెడల్పు ఉండే 76 చర్మపత్రాలతో తయారుచేయబడిన కోడెక్స్‌ వ్రాతప్రతుల్లో ఒక భాగం. అది ఇటలీకి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడైన లుడోవికో ఆంటోన్యో మురాటోరీకి (1672-1750), ఇటలీలోని మిలాన్‌లో ఉన్న ఆంబ్రోసియన్‌ గ్రంథాలయంలో దొరికింది. మురాటోరీ తనకు దొరికిన ఫ్రాగ్మెంట్‌ను 1740లో ప్రచురించాడు, అలా దానికి మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ అనే పేరు వచ్చింది. ఎనిమిదవ శతాబ్దంలో, ఉత్తర ఇటలీలోని ప్లసెంచియాకు దగ్గరున్న బోబీయోకు చెందిన ప్రాచీన మఠంలో ఆ కోడెక్స్‌ తయారుచేయబడినట్లు అనిపిస్తోంది. అది 17వ శతాబ్దపు ప్రారంభంలో ఆంబ్రోసియన్‌ గ్రంథాలయానికి మార్చబడింది.

మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌లో 85 లైన్లు ఉన్న మూలపాఠం ఉంది, అది కోడెక్స్‌లోని 10వ, 11వ పత్రాల్లో కనిపిస్తుంది. దానిలో ఉన్న మూలపాఠం లాటిన్‌లో ఉంది, అంత జాగ్రత్తలేని లేఖికుడు దానిని నకలు చేశాడని స్పష్టమవుతోంది. అయితే 11వ, 12వ శతాబ్దాలకు చెందిన నాలుగు వ్రాతప్రతుల్లో చేర్చబడిన అదే మూలపాఠంతో మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ను పోల్చడం ద్వారా ఆయన చేసిన కొన్ని తప్పులు బహిర్గతమయ్యాయి.

అది ఎప్పుడు వ్రాయబడింది?

మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌లో ఉన్న సమాచారం ప్రాథమికంగా ఎప్పుడు వ్రాయబడిందో మీరు తెలుసుకోవాలనుకుంటుండవచ్చు. గ్రీకు నుండి లాటిన్‌లోకి అనువదించబడిన ఫ్రాగ్మెంట్‌ మూలపాఠం కూర్చబడడానికి అనేక శతాబ్దాల పూర్వమే ప్రాథమిక మూలపాఠం గ్రీకులో కూర్చబడినట్లు అనిపిస్తుంది. ప్రాథమిక మూలపాఠం వ్రాయబడిన కాలాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ఒక ఆధారముంది. ఈ ఫ్రాగ్మెంట్‌, షెపర్డ్‌ అనే బైబిలేతర పుస్తకం గురించి ప్రస్తావించి, హెర్మాస్‌ అనే వ్యక్తి దానిని “రోము నగరంలో ఇటీవల, మన కాలాల్లో” వ్రాశాడని పేర్కొంటోంది. హెర్మాస్‌ రచించిన షెపర్డ్‌లోని చివరిభాగం సా.శ. 140 నుండి 155 మధ్యకాలంలో వ్రాయబడిందని పండితులు చెబుతున్నారు. కాబట్టి, మీరు లాటిన్‌ అనువాదమైన మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌కు ఆధారమైన, గ్రీకు భాషలో ఉన్న ప్రాథమిక మూలపాఠం, సా.శ. 170 నుండి 200 మధ్య కాలానికి చెందిందనే నిర్ధారణకు ఎలా రాగలరో దీనినిబట్టి గ్రహించవచ్చు.

దానిలో రోము గురించి ఉన్న ప్రత్యక్ష, పరోక్ష ప్రస్తావనలు అది ఆ నగరంలో కూర్చబడివుండవచ్చని సూచిస్తున్నాయి. అయితే దాని గ్రంథకర్త ఎవరు అనే విషయం వివాదాంశంగా ఉంది. అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌, సార్దీస్‌కు చెందిన మెలెటో, ఎఫెసుకు చెందిన పోలిక్రెటెస్‌ అనేవారి పేర్లు సూచించబడ్డాయి. అయితే అనేకమంది విద్వాంసులు, మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌లోని అంశాలు కూర్చబడిన కాలంలో రోములో నివసించి గ్రీకులో అనేక రచనలు చేసిన హిప్పోలిటస్‌ అనే గ్రంథకర్త ప్రాథమిక మూలపాఠాన్ని కూర్చివుండవచ్చని చెబుతున్నారు. మీకు అదంత ఆసక్తికరమైన విషయంగా అనిపించకపోవచ్చు, కానీ దానిని ఎంతో విలువైనదిగా చేసే దానిలోని అంశాల గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడుతుండవచ్చు.

దానిలోని సమాచారం

ఆ మూలపాఠంలో కేవలం క్రైస్తవ గ్రీకు లేఖనాల్లోని పుస్తకాల పట్టిక మాత్రమే లేదు. దానిలో పుస్తకాల గురించిన, వాటి రచయితల గురించిన వ్యాఖ్యానాలు కూడా ఉన్నాయి. మీరు మూలపాఠాన్ని చదివినట్లయితే, వ్రాతప్రతుల్లోని మొదటి లైన్లు లేనట్లు మీరు గమనిస్తారు, అలాగే అది మధ్యలో అర్ధాంతరంగా ఆపేయబడినట్లు కూడా అనిపిస్తుంది. అది లూకా సువార్త గురించిన ప్రస్తావనతో ప్రారంభమవుతుంది, ఆ బైబిలు పుస్తక రచయిత ఒక వైద్యుడు అని కూడా ఆ దస్తావేజు చెబుతోంది. (కొలొస్సయులు 4:​14) లూకా సువార్తను మూడవ సువార్తగా అది పేర్కొంటోంది, కాబట్టి దానిలో ప్రారంభంలో లేని భాగం మత్తయి, మార్కు సువార్తల ప్రస్తావనై ఉండవచ్చని మీరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఆ నిర్ధారణకు వచ్చినట్లయితే, దానికి మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ మద్దతునిస్తుంది, అది యోహాను సువార్తను నాలుగవ సువార్తగా పేర్కొంటోంది.

అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని లూకా “ఘనతవహించిన థెయొఫిల” కోసం వ్రాశాడని ఆ ఫ్రాగ్మెంట్‌ ధ్రువీకరిస్తోంది. (లూకా 1:1; అపొస్తలుల కార్యములు 1:⁠1) ఆ తర్వాత అది అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు (రెండు), ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, గలతీయులకు, థెస్సలొనీకయులకు (రెండు), రోమీయులకు, ఫిలేమోనుకు, తీతుకు, తిమోతికి (రెండు) వ్రాసిన పత్రికల గురించి పేర్కొంటోంది. యూదా వ్రాసిన పత్రిక, యోహాను వ్రాసిన రెండు పత్రికలు కూడా ప్రేరేపిత పుస్తకాలుగా పేర్కొనబడ్డాయి. అపొస్తలుడైన యోహాను వ్రాసిన మొదటి పత్రిక, ఆయన సువార్తతోపాటు ముందుగానే పేర్కొనబడింది. ప్రేరేపిత పుస్తకాలుగా పరిగణించబడే పుస్తకాల పట్టికలో అపోకలిప్స్‌ లేక ప్రకటన పుస్తకం పేరు చివర్లో ఉంది.

ఆ ఫ్రాగ్మెంట్‌, పేతురు వ్రాసిన ఒక అపోకలిప్స్‌ గురించి ప్రస్తావిస్తూ, క్రైస్తవులు దానిని చదవకూడదని కొందరు భావించారని పేర్కొనడం గమనార్హం. నకిలీ గ్రంథాలు తన కాలంలో అప్పటికే వ్యాప్తిలో ఉన్నాయని దాని రచయిత హెచ్చరిస్తున్నాడు. “చేదు పదార్థాన్ని తేనెతో కలపడం సరికాదు కాబట్టి,” ఆ గ్రంథాలను ఆమోదించకూడదని మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ వివరిస్తోంది. పరిశుద్ధ లేఖనాల్లో చేర్చకూడని ఇతర మూలపాఠాల గురించి కూడా ఆ దస్తావేజు పేర్కొంటోంది. ఆ గ్రంథాలు హెర్మాస్‌ రచించిన షెపర్డ్‌ పుస్తకంలాగా అపొస్తలుల కాలం తర్వాత వ్రాయబడినందుకో లేక మతవిరుద్ధమైన సిద్ధాంతాలను సమర్థించడానికి వ్రాయబడినందుకో వాటిని పరిశుద్థ లేఖనాల్లో చేర్చకూడదని పేర్కొనబడింది.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక, పేతురు వ్రాసిన రెండు పత్రికలు, యాకోబు వ్రాసిన పత్రిక ఈ ప్రామాణిక బైబిలు పుస్తకాల పట్టికలో పేర్కొనబడలేదని మీరు పైన చూసిన విషయాల నుండి గమనించివుండవచ్చు. అయితే, వ్రాతప్రతిని నకలు చేసిన లేఖికుని పనితనం గురించి పేర్కొంటూ డాక్టర్‌ జఫ్రీ మార్క్‌ హనెమెన్‌, “ఇతర పత్రికల గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ, ఎత్తివ్రాసేటప్పుడు అవి విడిచిపెట్టబడి ఉండవచ్చు, యాకోబు వ్రాసిన పత్రిక, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక (మరియు 1 పేతురు) వంటివాటి ప్రస్తావన అలాగే విడిచిపెట్టబడి ఉండవచ్చని చెప్పడం సహేతుకం” అని వ్యాఖ్యానించాడు.​—⁠ద మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ద క్యానన్‌.

ఆ విధంగా, క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ఇప్పుడు కనిపించే అనేక పుస్తకాలు, సా.శ. రెండవ శతాబ్దం నాటికే ప్రామాణిక పుస్తకాలుగా పరిగణించబడ్డాయి అని మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌ ధ్రువీకరిస్తోంది. అయితే, బైబిలు పుస్తకాల ప్రామాణికత అంటే బైబిల్లో చేర్చబడడానికి వాటికున్న అర్హత, ఒక ప్రాచీన పట్టికలో అవి పేర్కొనబడడంపై ఆధారపడి ఉండదు. బైబిలు పుస్తకాలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డాయని అనడానికి వాటిలో ఉన్న అంశాలే రుజువులు. ఆ పుస్తకాలన్నీ యెహోవా దేవుడే వాటి గ్రంథకర్త అని ధ్రువీకరిస్తున్నాయి, వాటిమధ్య సంపూర్ణ పొందిక ఉంది. బైబిల్లోని 66 ప్రామాణిక పుస్తకాల మధ్యవున్న పొందిక, సమతుల్యత దాని ఏకత్వాన్ని, సంపూర్ణతను రుజువుచేస్తున్నాయి. అది నిజంగా మన కాలాలవరకు భద్రపరచబడిన యెహోవా ప్రేరేపిత సత్య వాక్యం, కాబట్టి మీరు దాన్ని అలాగే అంగీకరించినట్లయితే మీకు ప్రయోజనం చేకూరుతుంది.​—⁠1 థెస్సలొనీకయులు 2:13; 2 తిమోతి 3:16, 17.

[13వ పేజీలోని చిత్రం]

లుడోవికో ఆంటోన్యో మురాటోరీ

[14వ పేజీలోని చిత్రం]

ఆంబ్రోసియన్‌ గ్రంథాలయం

[15వ పేజీలోని చిత్రం]

మురాటోరియన్‌ ఫ్రాగ్మెంట్‌

[చిత్రసౌజన్యం]

Diritti Biblioteca Ambrosiana. Vietata la riproduzione. Aut. No. F 157 / 05

[13వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫ్రాగ్మెంట్‌లు: Diritti Biblioteca Ambrosiana. Vietata la riproduzione. Aut. No. F 157 / 05; మురాటోరీ, రేఖాచిత్రం ఆధారంగా: © 2005 Brown Brothers