కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బొలీవియాలోని మారుమూల పట్టణాలు సువార్త వింటున్నాయి

బొలీవియాలోని మారుమూల పట్టణాలు సువార్త వింటున్నాయి

బొలీవియాలోని మారుమూల పట్టణాలు సువార్త వింటున్నాయి

నది ఎగువన ఉన్న పల్లెలను మేము పగటిపూటే చూడాలని ఉత్సాహంగా ఎదురుచూస్తూ దాదాపు 20 మందిమి సముద్రతీరం దగ్గర సమకూడాం. మేము ఆండీస్‌ పర్వత పాదపీఠం దగ్గర ఉన్నాం, అమెజాన్‌ పరీవాహక ప్రాంతానికి చెందిన విస్తార మైదానాల్లోకి పారే బెనీ నది అక్కడికి చేరుకుంటుంది. అది చాలా రమణీయమైన స్థలం.

మేము పర్యాటకులం కాదు. మాలో కొందరు స్థానిక ప్రజలున్నారు, అయితే, మాలో చాలామంది రురెనాబాకీ అనే ఈ పట్టణంలో నివసించడానికి సుదూర నగరాల నుండి వచ్చినవారు ఉన్నారు. ఈ చిన్న పట్టణం పూలు విరబూసే చెట్లు, గుడిసెలు, అప్పుడప్పుడు మోటర్‌సైకిల్‌ టాక్సీ ద్వారా మాత్రమే ప్రశాంతతకు భంగంవాటిల్లే వీధులతో అందంగా ఉంటుంది. మేము ఎందుకీ ప్రయాణం చేస్తున్నాం?

ఈ పట్టణంలో జరుగుతున్నది బొలీవియాలోని అనేక ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధికి ఒక నమూనా. నగరాలనుండి, ఇతర దేశాలనుండి వచ్చిన యెహోవాసాక్షులు చిన్న పట్టణాల్లో దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తున్నారు.​—⁠మత్తయి 24:​14.

బొలీవియా దక్షిణ అమెరికా మధ్య భాగంలో నెలకొనివుంది. ఆ దేశ భూభాగం ఫ్రాన్స్‌ కన్నా రెండింతలు పెద్దది కానీ దాని జనాభా మాత్రం ఫ్రాన్స్‌ జనాభాలో పదోవంతు. బొలీవియావాసులు చాలామంది అసాధారణ ఎత్తులో ఉన్న నగరాల్లో, గనులున్న పట్టణాల్లో నివసిస్తున్నారు లేక లోయ ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ కేంద్రాల్లో నివసిస్తున్నారు. అయితే ఉష్ణమండల లోతట్టు ప్రాంతాల్లో, ఒక పట్టణానికి మరో పట్టణానికి మధ్య విస్తారమైన అడవులున్నాయి.

1950, 1960లలో ధైర్యవంతులైన మిషనరీ సహోదరీలైన బెట్టీ జాక్సన్‌, ఎల్సి మియన్‌బర్గ్‌, పమెలా మోస్లే, షార్లట్‌ టొమాస్కాఫ్‌స్కై అనేక మారుమూల పట్టణాల్లో ప్రకటనా పనికి నాయకత్వం వహించారు. వారు యథార్థహృదయులకు బైబిలు సత్యాన్ని బోధించి చిన్న సంఘాలను స్థాపించడంలో సహాయపడ్డారు. 1980, 1990లలో, యెహోవాసాక్షుల సంఖ్య ఆరురెట్లు పెరిగింది, ఆ పెరుగుదల ప్రధానంగా నగరాల్లో సంభవించింది. ఇప్పుడు నగరంలోని అన్ని ప్రాంతాల్లో సంఘాలున్నాయి. ఎత్తైన ఆఫీసు భవనాల్లో పనిచేస్తూ, వైభవోపేతంగా ఉండే పెద్ద ఇళ్లల్లో నివసిస్తూ, సూపర్‌ మార్కెట్లలో షాపింగ్‌ చేసే ప్రజలుగల వర్ధిల్లుతున్న జిల్లాల్లో మీరు సంఘాలను కనుగొంటారు. పచ్చి ఇటుకలతో చేసిన గుడిసెల్లో నివసిస్తూ, ఆరుబయట సంతల్లో వస్తువులను కొంటూ, రంగురంగుల స్వదేశీ బట్టలు ధరించే ప్రజలు నివసించే మారుమూల ప్రాంతాల్లో కూడా సంఘాలున్నాయి. అయితే, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న అనేకమందికి యెహోవా గురించి తెలుసుకునేందుకు సహాయం చేయడానికి ఏమి చేయవచ్చు?

నగర జీవితంలోని సౌకర్యాలను త్యాగం చేయడం

గత రెండు దశాబ్దాల్లో బొలీవియాలోని గనులున్న పట్టణాలనుండి, పల్లెలనుండి ప్రజలు అధికసంఖ్యలో నగరాలకు వలసవెళ్ళారు. ప్రజలు వ్యతిరేక దిశలో అంటే నగరం నుండి పల్లెకు వెళ్ళడం అసాధారణ విషయం. అనేక పల్లెల్లో కేవలం ఒక టెలిఫోనే ఉంది, రోజులో కేవలం కొద్ది గంటలే కరెంటు ఉంటుంది. ఈ చిన్న పట్టణాల్లో నివసించే సాక్షులు తమ తోటి విశ్వాసులను వార్షిక సమావేశాలప్పుడే చూడవచ్చు, అంతేకాక, ఆ సమావేశాలకు ప్రయాణించడం ఖర్చుతో కూడుకొన్నదిగా, ప్రమాదకరమైనదిగా, అలసట కలిగించేదిగా ఉండవచ్చు. పల్లెల్లోని పాఠశాలలు ప్రాథమిక విద్యను మాత్రమే అందిస్తాయి. అయితే, చాలామంది యెహోవాసాక్షులు నగరాల నుండి పల్లెలకు వెళ్ళడానికి వారిని పురికొల్పేదేమిటి?

లూయిస్‌ ఇటీవల ఇలా చెప్పాడు: “నాకు లా పాజ్‌ నగరంలో ఉద్యోగం చేసే అవకాశం దొరికింది. అయితే శిష్యులను చేసే పని అతి ప్రయోజనకరమైన వృత్తి అని నా తల్లిదండ్రులు నాకు ఎప్పుడూ చెప్పేవారు. కాబట్టి నేను నిర్మాణ పద్ధతులకు సంబంధించిన ఒక చిన్న కోర్సు చేపట్టాను. నేను సెలవుల్లో ఒకసారి రురెనాబాకీ వచ్చినప్పుడు సువార్త వినే విషయంలో ఇక్కడి ప్రజలు చూపిస్తున్న ఉత్సాహాన్ని గమనించాను. ఇక్కడ ఎంత తక్కువమంది సహోదరులున్నారో నేను గమనించినప్పుడు, నేనిక్కడికి వచ్చి సహాయం చేయాలని అనుకున్నాను. నేను ఇప్పుడు 12 గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాను. ఉదాహరణకు, నేను నలుగురు పిల్లలున్న ఒక యువ జంటతో అధ్యయనం చేస్తున్నాను. ఆయన బాగా త్రాగేవాడు, జూదమాడేవాడు, అయితే ఆయన ఆ అలవాట్లన్నీ మానేసి తాను యెహోవా గురించి నేర్చుకుంటున్న విషయాలను తన స్నేహితులకు చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన ఎప్పుడూ తాను అధ్యయనం చేయబోయే పాఠాన్ని సిద్ధపడేవాడు. కలప కోసం అడవిలోని చెట్లను నరకడానికి మూడు నాలుగు రోజులు ఇంటినుండి దూరంగా గడపాల్సివచ్చినప్పుడు ఆయన ఎంతో బాధపడేవాడు, ఎందుకంటే క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోవడం ఆయనకు ఇష్టంలేదు. నేను వారినందరినీ క్రైస్తవ కూటాల్లో చూసినప్పుడు నేను ఇక్కడికి రావడానికి చేసిన త్యాగానికి తగిన ఫలితం దొరికిందని నాకనిపిస్తుంది.”

ఒంటరి తల్లియైన జువానా ఇలా చెబుతుంది: “నేను లా పాజ్‌లో ఇళ్ళల్లో పనిమనిషిగా పనిచేసేదాన్ని, నా కుమారుడు చిన్నవయస్సులో ఉన్నప్పుడు నేను నగరంలో పూర్తికాల పరిచర్య చేపట్టాను. ఒకసారి నేను రురెనాబాకీ పట్టణానికి వచ్చినప్పుడు, నేను ఇక్కడికి రావడం ద్వారా ఇంకా ఎంత సాధించగలనో గుర్తించాను. కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం, ఇక్కడ కూడా నేను ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేస్తున్నాను. ప్రారంభంలో, వేడి వాతావరణాన్ని, కీటకాలను భరించడం కష్టమనిపించింది. కానీ ఇప్పటికి ఏడు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం. నేను ప్రతీవారం అనేక బైబిలు అధ్యయనాలు నిర్వహించగలుగుతున్నాను, చాలామంది విద్యార్థులు కూటాలకు రావడం ద్వారా తమ కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నారు.” నది ఎగువన ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి పడవ ఎక్కినవారిలో జువానా, ఆమె కుమారుడు కూడా ఉన్నారు. మీరు కూడా మాతో రావచ్చు.

నది ఎగువనున్న ప్రాంతాలకు ప్రయాణం

పర్వతాల మధ్య ఉన్న ఇరుకైన స్థలం గుండా పయనిస్తున్నప్పుడు అవుట్‌బోర్డ్‌ ఇంజిన్‌ పెద్ద శబ్దం చేస్తోంది. చిలుకల గుంపు మా ఉనికికి అసమ్మతిని తెలియజేస్తూ గట్టిగా అరుస్తున్నాయి. పర్వతాల నుండి వస్తున్న బురదనీళ్లు మా చుట్టూ అతి తీవ్రంగా సుళ్ళు తిరుగుతున్నాయి, పడవ నడిపే వ్యక్తి చాకచక్యంగా వాటిని దాటిస్తున్నాడు. ఉదయానికల్లా మేము ఒక చిన్న పల్లెటూరుకు చేరుకున్నాం. అక్కడ మేము రురెనాబాకీ సంఘానికి చెందిన ఒక సంఘ పైవిచారణకర్తను కలుసుకున్నాం, మేము ప్రకటించాల్సిన ప్రాంతాన్ని ఆయన మాకు చూపించాడు.

పల్లెవాసులు మమ్మల్ని చెట్టు నీడలోకి లేదా తాటి ఆకుల పైకప్పుతో ఉన్న వెదురుకర్రతో కట్టిన తమ పూరిళ్ళలోకి ఆప్యాయంగా ఆహ్వానించారు. మేము కాసేపటికి ఒక యువజంటను కలిశాం, వారు స్థానికంగా చెక్కతో తయారుచేయబడిన యంత్రాన్ని ఉపయోగించి చెరకుగడలను నలుగగొట్టడంలో నిమగ్నమైవున్నారు. రాగిగిన్నెలోకి చెరుకురసం వేగంగా ప్రవహిస్తోంది. తర్వాత ఆ చెరకురసాన్ని, పట్టణంలో అమ్మడానికి వీలుగా నల్లటి బెల్లపు పాకంగా మారేంతవరకు ఇగరబెడతారు. వారు మమ్మల్ని వారి ఇంట్లోకి ఆహ్వానించి బైబిలు గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు.

మేము నదీ ప్రవాహానికి ఎగువ దిశలో మా ప్రయాణాన్ని కొనసాగించి ప్రతీ పల్లెలో ప్రకటించాం. అనారోగ్యం, మరణం అంతమవడం గురించిన బైబిలు బోధలను వినడానికి చాలామంది ఇష్టపడ్డారు. (యెషయా 25:8; 33:​24) వైద్య సదుపాయాలు తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు పిల్లలను కోల్పోవడం అనే బాధాకరమైన అనుభవాన్ని చవిచూశారు. చాలీచాలని రాబడి వచ్చే రైతులుగా, మత్స్యకారులుగా జీవనం సాగించడం చాలా అలసట కలిగించే, భద్రతలేని జీవితం. కాబట్టి, బీదరికాన్ని తొలగించే ప్రభుత్వం గురించి 72వ కీర్తనలో నమోదుచేయబడిన దేవుని వాగ్దానం ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్లు చాలామంది భావిస్తారు. అయినా అలాంటి మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఆసక్తి చూపించిన ఆ వ్యక్తులు క్రైస్తవ కూటాలకు హాజరవడానికి కృషి చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఆ ప్రశ్నే, అమెజాన్‌ పరీవాహక ప్రాంతంలో మరో మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న సాంటా రోసా పట్టణంలో పూర్తికాల పరిచారకులుగా సేవచేస్తున్న ఎరిక్‌, విక్కీల జంటను కూడా కలవరపెట్టింది.

ఆసక్తి చూపిస్తున్నవారు వస్తారా?

ఎరిక్‌, విక్కీలు అమెరికాలోని కాలిఫోర్నియా నుండి బొలీవియాకు 12 సంవత్సరాల క్రితం వచ్చారు. ఒక ప్రయాణ పైవిచారణకర్త, సాంటా రోసాకు వెళ్లమని వారికి సలహా ఇచ్చాడు. విక్కీ ఇలా చెబుతోంది: “ఆ పట్టణంలో రెండే ఫోన్లున్నాయి, ఇంటర్నెట్‌ సదుపాయంలేదు, ఈ ప్రాంతంలో అనేక వన్యప్రాణులున్నాయి. మేము మారుమూల ప్రాంతాలకు మా మోటర్‌సైకిళ్ళ మీద వెళ్తున్నప్పుడు మొసళ్ళను, నిప్పుకోళ్లను, పెద్ద పాములను తరచూ చూస్తుంటాం. అయితే జంతువులకన్నా అక్కడి మనుషులు దృష్టిని ఆకర్షించేవారిగా ఉన్నారు. మేము వేకా కుటుంబంతో బైబిలు అధ్యయనం చేస్తున్నాం, వారు నలుగురు చిన్నపిల్లలున్న ఒక యువజంట. వారు పట్టణానికి వెలుపల 26 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్నారు. ఆ పిల్లల తండ్రి త్రాగుబోతు, అయితే ఆయన ఇప్పుడు మారాడు. ఆయన ప్రతీవారం తన కుటుంబాన్ని, తన చెల్లెలిని రాజ్యమందిరానికి తీసుకువస్తాడు. ఆయన తన పెద్ద సైకిల్‌కున్న క్యారేజీ మీద తన భార్యను, చిన్నపాపను ఎక్కించుకుంటాడు. ఆయన తొమ్మిదేండ్ల కుమారుడు తన చిన్న చెల్లిని సైకిల్‌ మీద ఎక్కించుకుంటాడు, ఎనిమిదేండ్ల మరో కుమారుడు సైకిల్‌ మీద ఒంటరిగా వస్తాడు. కూటాలకు సైకిల్‌ మీద రావడానికి వారికి మూడు గంటలు పడుతుంది.” ఆ కుటుంబం యెహోవాను నిజంగా ప్రేమిస్తోంది, సంఘంతో సహవసించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది.

కేవలం 18 నెలల్లోనే బాప్తిస్మం పొందడానికి ముగ్గురు అర్హత పొందారు, సాంటా రోసాలో ఉన్న క్రొత్త రాజ్యమందిరానికి దాదాపు 25 మంది వస్తారు. చాలామంది బైబిలు అధ్యయనం చేయాలనుకుంటున్నా, యెహోవాను సేవించడానికి అవరోధంగా నిలిచిన కష్టమైన ఆటంకాలను అనేకులు ఎదుర్కొంటున్నారు.

వివాహాలు చట్టబద్ధం చేసుకోవడమనే సవాలు

బొలీవియా బ్రెజిల్‌ సరిహద్దుల దగ్గర్లో ఒక మారుమూల పట్టణంలో మిషనరీలుగా సేవచేస్తున్న మరీనా, ఒస్నీ అనే జంట, చాలామంది వివాహాన్ని శాశ్వత బంధంగా పరిగణించరని వివరిస్తున్నారు. వారు తమ భాగస్వాములను మారుస్తూ ఉంటారు. ఒస్నీ ఇలా చెబుతున్నాడు: “ఈ సమస్య ఆధ్యాత్మిక ప్రగతిని నిరోధిస్తోంది, వ్యక్తులు నిజక్రైస్తవులు కావాలనుకుంటే, అది ఎంతో సంక్లిష్టమైన, ఖర్చుతోకూడుకున్న ప్రక్రియ. కొందరు తమ గత భాగస్వాములతో తెగతెంపులు చేసుకుని చట్టబద్ధంగా వివాహం చేసుకోవాలి. అయితే, కొందరు వివాహాన్ని సరైన పద్ధతిలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం లేఖనాధారమైన నియమమని గుర్తించి న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి అయ్యే ఖర్చులను భరించడానికి కావల్సిన డబ్బు సంపాదించడానికి నిజంగా ఎంతో కష్టపడ్డారు.”​—⁠రోమీయులు 13:1, 2; హెబ్రీయులు 13:⁠4.

మరీనా, నొబార్టో అనుభవాన్ని చెబుతోంది. “ఆయన బేకర్‌గా పనిచేస్తున్న ఒక స్త్రీని వివాహం చేసుకునేముందు అనేకమంది స్త్రీలతో జీవితం గడిపాడు. ఆమె ఆయనకన్నా దాదాపు 35 సంవత్సరాలు చిన్నది, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, నొబార్టో ఆ అబ్బాయిని దత్తత తీసుకున్నాడు. ఆ అబ్బాయి ఎదుగుతున్నప్పుడు ఆయనకు తాను మంచి మాదిరిగా ఉండాలని నొబార్టో అనుకున్నాడు. కాబట్టి ఒక సాక్షి బేకరీ దగ్గరికి వచ్చి ఉచిత గృహ బైబిలు అధ్యయనాల గురించి వివరించినప్పుడు తాను చదవలేకపోయినా, తనకు అప్పటికే 70 సంవత్సరాలు పైబడినా నొబార్టో దానికి అంగీకరించాడు. నొబార్టో, ఆయన భాగస్వామి యెహోవా నియమాల గురించి తెలుసుకున్నప్పుడు వారు చట్టబద్ధంగా వివాహం చేసుకొని, ఆ తర్వాత బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్ళ అబ్బాయి తన సవతితండ్రి ఆశించిన విధంగానే ఒక బాధ్యతాయుతమైన క్రైస్తవ యువకునిగా ఎదిగాడు. నొబార్టో చదవడం నేర్చుకున్నాడు, సంఘ కూటాల్లో ప్రసంగాలు కూడా ఇచ్చాడు. తన వయసు కారణంగా పూర్తి దుర్భల స్థితిలో ఉన్నా, ఆయన ఉత్సాహంగా సువార్తను ప్రకటించే సాక్షిగా ఉన్నాడు.”

యెహోవా ఆత్మ ద్వారా బలపర్చబడ్డారు

యేసు తన తొలి అనుచరులకు ఇలా చెప్పాడు: “పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు . . . భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొస్తలుల కార్యములు 1:⁠8) క్రైస్తవ స్త్రీపురుషులు సుదూర ప్రాంతాలకు వెళ్ళేలా దేవుని ఆత్మ వారిని పురికొల్పడాన్ని చూడడం ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! ఉదాహరణకు, 2004వ సంవత్సరంలో బొలీవియాలోని దాదాపు 30 మంది ఉత్సాహవంతులైన క్రైస్తవులు మారుమూల క్షేత్రాల్లో ప్రత్యేక పయినీరు ప్రచారకులుగా సేవచేసే తాత్కాలిక నియామకాలను అంగీకరించారు. పయినీర్లుగా, ప్రాంతీయ పైవిచారణకర్తలుగా, బెతెల్‌ స్వచ్ఛంద సేవకులుగా, మిషనరీలుగా సేవచేయడానికి బొలీవియాకు వచ్చిన దాదాపు 180 మంది విదేశీయులు వారి ఎదుట ఉంచిన మాదిరినిబట్టి వారు కృతజ్ఞతతో ఉన్నారు. బొలీవియాలోని 17,000 మంది రాజ్య ప్రచారకులు ఆసక్తిగల ప్రజల గృహాల్లో దాదాపు 22,000 బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.

యెహోవా ఆత్మ తమను నిర్దేశిస్తోందని తెలుసుకోవడం ఈ సహోదరులందరికీ ఎంతో ఆనందాన్నిస్తుంది. ఉదాహరణకు, రాబర్ట్‌, క్యాథీ అనే దంపతులు కామీరీ అనే ప్రాంతంలో మిషనరీలుగా సేవచేసే నియామకాన్ని అంగీకరించారు. పచ్చగా ఉండే గుండ్రని కొండల మధ్యలో ఒక నది ఒడ్డున నెలకొని ఉన్న కామీరీ పట్టణం ఎప్పుడూ ఒక మారుమూల పట్టణంగానే ఉంది. “మేము సరైన సమయంలోనే ఇక్కడికి వచ్చామని అనిపిస్తుంది, రెండు సంవత్సరాల్లో దాదాపు 40 మంది సువార్త ప్రచారకులయ్యారు” అని రాబర్ట్‌ చెబుతున్నాడు.

త్రాగుబోతు, జూదగాడు అయిన వ్యక్తి సువార్త వినడం

బైబిలు అధ్యయనం చేసేవారు తమ జీవితాల్లో చేసుకుంటున్న మార్పులు పట్టణస్థుల్లో చాలామందిని ఆకట్టుకున్నాయి. ఉదాహరణకు, దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం, ఒకరోజు, తప్పతాగిన ఏరియల్‌ అనే వ్యక్తి హ్యాంగోవర్‌ (తప్పతాగిన తర్వాత వచ్చే తలనొప్పి)తో మంచంమీద పడుకొని ఉన్నాడు. ఆయన జూదమాడడంవల్ల పేరుసంపాదించుకున్నా, పెరుగుతున్న అప్పులు, సంక్షోభంలో ఉన్న వివాహజీవితం, నిర్లక్ష్యానికి గురైన తన కూతుర్ల గురించిన చింతలు ఆయనను వేధిస్తున్నాయి. ఇంటింటికి వెళ్తున్న ఒక యెహోవాసాక్షి ఆయన ఆలోచనలకు అంతరాయం కలిగించాడు. ఆ సహోదరుడు లేఖనాలను వివరిస్తున్నప్పుడు ఏరియల్‌ చాలాసేపు శ్రద్ధగా విన్నాడు. కొంతసేపటికి ఏరియల్‌ మళ్ళీ మంచంమీదకు చేరుకున్నాడు, అయితే ఈ సారి మాత్రం ఆయన సంతోషభరితమైన కుటుంబ జీవితం, పరదైసు, దేవుని సేవ గురించి చదువుతూ పడుకున్నాడు. ఆయన ఆ తర్వాత బైబిలు అధ్యయనం చేయడానికి అంగీకరించాడు.

కామీరీ పట్టణానికి మిషనరీలు వచ్చే సమయానికి ఏరియల్‌ భార్య అర్మిండా కూడా అధ్యయనం చేస్తోంది, అయితే ఆమె అంత ఉత్సాహం చూపించేదికాదు. “ఆయన తాగుడు మాన్పించడానికి నేను ఎలాంటి ప్రయత్నం చేయడానికైనా వెనుకాడను. కానీ బైబిలు అధ్యయనం ఆయనను మార్చగలదని నేను అనుకోవడంలేదు. ఆయన మారే అవకాశమేలేదు” అని ఆమె అంది. అయితే బైబిలు అధ్యయనం ఆమె ఊహించినదానికన్నా ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక ఏడాదిలోగా ఆమె బాప్తిస్మం తీసుకుని తన కుటుంబానికి సాక్ష్యమివ్వడం ప్రారంభించింది. కొంతకాలానికే ఆమె బంధువుల్లో చాలామంది యెహోవాకు తమ జీవితాలను సమర్పించుకున్నారు.

ఏరియల్‌ విషయానికొస్తే ఆయన త్రాగుడు, ప్రొగత్రాగడం, జూదం మానేయడానికి ఎంతో కష్టపడాల్సివచ్చింది. క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు తన స్నేహితులందరినీ ఆహ్వానించినప్పుడు ఆయన జీవితంలో పెద్ద మార్పు వచ్చింది. ఆయన ఇలా నిర్ణయించుకున్నాడు: “జ్ఞాపకార్థ ఆచరణకు రానివారితో నేను ఇక స్నేహం చేయను. వచ్చినవారితో బైబిలు అధ్యయనం చేస్తాను.” ఆ విధంగా ఆయన మూడు బైబిలు అధ్యయనాలు ప్రారంభించాడు. ఏరియల్‌ సంఘ సభ్యుడు కాకముందే ఆయన తన బంధువుతో బైబిలు అధ్యయనం చేశాడు, ఆ బంధువు ప్రగతి సాధించి ఏరియల్‌ బాప్తిస్మం తీసుకున్న రోజే బాప్తిస్మం తీసుకున్నాడు. అర్మిండా ఇలా చెబుతోంది: “మునుపటి ఏరియల్‌కు ఇప్పటి ఏరియల్‌కు పోలికే లేదు.”

రాబర్ట్‌ ఇలా నివేదిస్తున్నాడు: “చివరిసారి లెక్కచూసినప్పుడు ఈ కుటుంబానికి చెందిన 24 మంది క్రమంగా కూటాలకు హాజరవుతున్నారు. పదిమంది బాప్తిస్మం తీసుకున్నారు, మరో ఎనిమిది మంది బాప్తిస్మం తీసుకోని ప్రచారకులుగా ఉన్నారు. మార్పు చెందినవారి ప్రవర్తనను చూసిన కొందరు కూడా బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించి, సంఘ కూటాలకు హాజరవుతున్నారు. హాజరవుతున్నవారి సంఖ్య 100 నుండి 190కి పెరిగింది. క్యాథీ, నేను దాదాపు 30 బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నాం, వారందరూ కూటాలకు హాజరవుతున్నారు. మేము ఇక్కడ ఉన్నందుకు సంతోషిస్తున్నాం.”

బొలీవియాలోని మారుమూల పట్టణాల్లో జరుగుతున్నది, ప్రకటన 7వ అధ్యాయంలో ప్రవచించబడిన ప్రపంచవ్యాప్త సమకూర్పులో కేవలం ఒక చిన్న భాగమే, ఆ వచనం “ప్రభువు దినం”లో మహాశ్రమలను తప్పించుకునేవారి సమకూర్పు గురించి వివరిస్తుంది. (ప్రకటన 1:10; 7:​9-14) మానవ చరిత్రలో ముందెన్నడూ దేశాలన్నిటికీ చెందిన లక్షలాదిమంది అద్వితీయ సత్యదేవుణ్ణి ఆరాధించడంలో ఐక్యంకాలేదు. దేవుని వాగ్దానాలు అతి త్వరలో నెరవేరనున్నాయనడానికి ఎంతటి పులకరింపజేసే రుజువో కదా!

[9వ పేజీలోని చిత్రం]

బెట్టీ జాక్సన్‌

[9వ పేజీలోని చిత్రం]

ఎల్సి మియన్‌బర్గ్‌

[9వ పేజీలోని చిత్రం]

పమెలా మోస్లే

[9వ పేజీలోని చిత్రం]

షార్లట్‌ టొమాస్కాఫ్‌స్కై, కుడివైపు చివరన

[10వ పేజీలోని చిత్రం]

వేకా కుటుంబం రాజ్యమందిరానికి చేరుకోవడానికి ప్రతీవారం సైకిళ్ళ మీద మూడు గంటలు ప్రయాణం చేస్తుంది

[10వ పేజీలోని చిత్రం]

ఎరిక్‌, విక్కీలు రాజ్య ప్రచారకుల అవసరం అధికంగావున్న స్థలంలో సేవచేయడానికి వెళ్ళారు

[11వ పేజీలోని చిత్రం]

బెనీ నది దగ్గర ఉన్న పల్లెవాసులు శ్రద్ధగా సువార్త వింటున్నారు

[12వ పేజీలోని చిత్రం]

రాబర్ట్‌, క్యాథీలు కామీరీలో మిషనరీలుగా సేవచేస్తున్నారు