కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మెస్సీయ మనకు అవసరమా?

మెస్సీయ మనకు అవసరమా?

మెస్సీయ మనకు అవసరమా?

“మనకు మెస్సీయ అవసరమా” అని మీరు అడగవచ్చు. అవును, మెస్సీయ మీ జీవితం మీద నిజమైన ప్రభావమేమైనా చూపించగలడా లేదా అని ఆలోచించడం సహేతుకమే.

మీరు గౌరవించే కొందరి అభిప్రాయాలు దానికి సమాధానం స్పష్టంగా, నిర్దిష్టంగా ఉందనే నమ్మకాన్ని మీకు కలిగిస్తుంది: ప్రతీ ఒక్కరికి మెస్సీయ అవసరమైనట్లే మీకు కూడా ఖచ్చితంగా మెస్సీయ అవసరం. మొదటి శతాబ్దంలో, యూదా ధర్మశాస్త్రంలో ప్రవీణుడైన ఒక వ్యక్తి మెస్సీయ గురించి ఇలా వ్రాశాడు: “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి.” భూమ్మీదున్న జనాంగాలన్నిటినీ ఆశీర్వదించాలనే మన సృష్టికర్త సంకల్పాన్ని నెరవేర్చడంలో మెస్సీయ పోషించే కీలకమైన పాత్ర గురించి ఆయన అలా నొక్కిచెబుతున్నాడు. (2 కొరింథీయులు 1:​20) మెస్సీయ పాత్ర ఎంత ప్రాముఖ్యం అంటే, భూమ్మీద ఆయన జీవితం బైబిలు ప్రవచనాలకు కేంద్రబిందువుగా ఉంది. గత 70 సంవత్సరాలుగా లక్షలాదిమంది ఉపయోగించిన ఒక రెఫరెన్సు పుస్తకంలో హెన్రీ హెచ్‌. హేలీ ఇలా నొక్కిచెప్పాడు: “[మెస్సీయ] రాక కోసం ఎదురుచూడడానికి, ఆయన రాకకు మార్గం సుగమం చేయడానికి పాత నిబంధన వ్రాయబడింది.” అయితే ఆయన రావడం అవసరమా? మీరు దాని విషయంలో ఎందుకు ఆసక్తి చూపించాలి?

వాస్తవానికి “మెస్సీయ” అంటే “అభిషిక్తుడు” అని అర్థం, పేరుగాంచిన “క్రీస్తు” అనే పదానికి అది పర్యాయపదం. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా, 1970వ ఎడిషన్‌లో “అంతిమ విమోచకునిగా” పేర్కొనబడిన ఆ వ్యక్తి, మొదటి మానవ జంటయైన ఆదాముహవ్వల భక్తిహీన చర్యల కారణంగా రావాల్సివచ్చింది. ఆ జంట పరదైసు భూమ్మీద నిరంతరం జీవించే అద్భుతకరమైన భావినిరీక్షణతో పరిపూర్ణులుగా సృష్టించబడ్డారు, అయితే వారు ఆ భావినిరీక్షణను కోల్పోయారు. అపవాదియైన సాతానుగా పేరుపొందిన తిరుగుబాటుదారుడైన ఒక దేవదూత, వారి సృష్టికర్త చాలా కఠినుడని, మంచి చెడులను తామే స్వయంగా నిర్ణయించుకోవడం ద్వారా వారు మంచి జీవితాన్ని గడపవచ్చని వారికి చెప్పాడు.​—⁠ఆదికాండము 3:​1-5.

హవ్వ మోసగించబడి ఆ అబద్ధాన్ని నమ్మింది. ఆదాము దేవునికి యథార్థంగా ఉండడం కన్నా తన భార్య సహచర్యాన్ని విలువైనదిగా ఎంచాడు కాబట్టి అపవాది పురికొల్పిన ఆ తిరుగుబాటులో భాగస్వామి అయ్యాడు. (ఆదికాండము 3:6; 1 తిమోతి 2:​14) వారు తమ చర్యల ద్వారా పరదైసు పరిస్థితుల్లో నిరంతర జీవితాన్ని అనుభవించే భావినిరీక్షణను మాత్రమే కోల్పోలేదు. వారు ఇంకా జన్మించని తమ సంతతికి కూడా పాపాన్ని, దాని పర్యవసానమైన మరణాన్ని సంక్రమింపజేశారు.​—⁠రోమీయులు 5:​12.

మన సృష్టికర్తయైన యెహోవా, తిరుగుబాటు కారణంగా ప్రారంభమైన సంఘటనల పరంపరవల్ల కలిగే చెడు పర్యవసానాలను మార్చేందుకు వెంటనే మార్గాన్ని ఏర్పాటుచేశాడు. ఆ తర్వాత మోషే ధర్మశాస్త్రంలో చట్టబద్ధమైన సూత్రంగా మారే, ప్రాణానికి ప్రాణం అనే సూత్రం ఆధారంగా ఆయన రాజీ చేకూరుస్తాడు. (ద్వితీయోపదేశకాండము 19:21; 1 యోహాను 3:⁠8) ఆదాముహవ్వల నిర్భాగ్య సంతానంలో ఎవరైనా, సృష్టికర్త మానవ కుటుంబానికి సంకల్పించిన పరదైసు భూమ్మీద నిరంతర జీవితాన్ని సంపాదించుకోవాలంటే, ఆ చట్టబద్ధ సూత్రం అమలుచేయబడాలి. అది మనల్ని మెస్సీయవైపుకు నడిపిస్తుంది.

అపవాది మీద తీర్పు తీర్చేటప్పుడు, యెహోవా దేవుడు మొదటి బైబిలు ప్రవచనంలో ఇలా ప్రకటించాడు: “నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువు.” (ఆదికాండము 3:​15) “లేఖనాలు అందించే మెస్సీయ వాగ్దానాలకు సంబంధించిన కథ [ఈ] వాక్యంతో మొదలవుతుంది” అని ఒక బైబిలు విద్వాంసుడు వ్యాఖ్యానించాడు. “మొదటి మానవుల పాపంవల్ల కలిగిన కష్టాలన్నిటినీ తీసివేసి,” అదే సమయంలో మానవజాతికి ఆశీర్వాదాలను తీసుకువచ్చే దేవుని ఉపకరణం మెస్సీయ అని మరో విద్వాంసుడు వ్యాఖ్యానించాడు.​—⁠హెబ్రీయులు 2:​14, 15.

అయితే మానవజాతి ప్రస్తుతం ఆశీర్వాదాలను పొందడంలేదని మీకు తెలిసే ఉండవచ్చు. దానికి బదులు, మానవజాతి నిరాశానిస్పృహలనే ఊబిలో చిక్కుకుపోయింది. కాబట్టి, “చాలామంది యూదులు ఇప్పటికీ మెస్సీయ వస్తాడని ఎదురుచూస్తున్నారు” అనీ, ఆయన “తప్పిదాలను సరిదిద్ది, ప్రజల శత్రువులను ఓడిస్తాడు” అనీ ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. కానీ, మెస్సీయ ఇప్పటికే వచ్చాడని బైబిలు చెబుతోంది. బైబిలు చెబుతున్నదానిని నమ్మేందుకు కారణమేమైనా ఉందా? తర్వాతి ఆర్టికల్‌ దానికి జవాబిస్తుంది.