కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మేము మెస్సీయను కనుగొంటిమి”

“మేము మెస్సీయను కనుగొంటిమి”

“మేము మెస్సీయను కనుగొంటిమి”

“మేము మెస్సీయను కనుగొంటిమి.” “ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి.” మొదటి శతాబ్దానికి చెందిన దైవభక్తిగల ఇద్దరు యూదులు ఆశ్చర్యాన్ని కలిగించే ఆ ప్రకటనలు చేశారు. చివరకు, తాము ఎదురుచూసిన మెస్సీయ వచ్చాడనే నమ్మకం వారిలో కలిగింది!​—⁠యోహాను 1:​35-45.

మీరు ఆ కాలానికి చెందిన చారిత్రక, మత సంబంధమైన నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే వారి నమ్మకానికి ఇంకా ఎంతో ప్రాధాన్యత ఉంది. తాము విమోచకులము కావాలని కోరుకున్న చాలామంది ఆర్భాటంగా వచ్చి వాగ్దానాలు గుప్పించారు, అయితే అలాంటి వ్యక్తులు యూదులను రోమన్ల కాడి క్రింది నుండి తప్పించలేకపోయినప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలయ్యాయి.​—⁠అపొస్తలుల కార్యములు 5:​34-37.

అయితే, అంద్రెయ, ఫిలిప్పు అనే ఆ ఇద్దరు యూదులు తాము నిజమైన మెస్సీయను కనుగొన్నామన్న విషయంలో తమ నమ్మకాన్ని ఎన్నడూ కోల్పోలేదు. దానికిబదులు, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆ వ్యక్తి, మెస్సీయ గురించి ప్రవచించబడిన విషయాలను నెరవేర్చడంలో భాగంగా చేసిన శక్తిమంతమైన కార్యాలను వారు వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయనపట్ల వారి నమ్మకం పెరిగింది.

ఆయన కేవలం అబద్ధ మెస్సీయ లేక నిరాశపరిచే మోసగాడు కాదనే నమ్మకంతో ఆ ఇద్దరే కాక, చాలామంది ఇతరులు కూడా ఆయనమీద ఎందుకు విశ్వాసముంచారు? ఆయనే నిజమైన మెస్సీయ అని ఒప్పించిన రుజువులు ఏమిటి?

చారిత్రక వృత్తాంతం ప్రకారం, అంద్రెయ, ఫిలిప్పు, గతంలో వండ్రంగిగా పనిచేసిన నజరేయుడైన యేసును, ఎంతోకాలంగా ఎదురుచూడబడుతున్న వాగ్దత్త మెస్సీయగా గుర్తించారు. (యోహాను 1:​45) ఆ శకానికి చెందిన శ్రద్ధగల చరిత్రకారుడైన లూకా, మెస్సీయ “తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు” వచ్చాడని చెబుతున్నాడు. (లూకా 3:​1-3) తిబెరి పరిపాలనలోని 15వ సంవత్సరం, సా.శ. 28 సెప్టెంబరులో ప్రారంభమై సా.శ. 29 సెప్టెంబరులో ముగిసింది. ఆ కాలంలోని యూదులు మెస్సీయ రాక కోసం ‘కనిపెట్టుకొని ఉన్నారని’ కూడా లూకా చెబుతున్నాడు. (లూకా 3:​15) ఆ నిర్దిష్ట సమయంలో ఆయన వస్తాడని వారు ఎందుకు ఎదురుచూశారు? ఇప్పుడు మనం దాని గురించి చూద్దాం.

మెస్సీయను గుర్తించేందుకు నిదర్శనాలు

మెస్సీయ ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తాడు కాబట్టి ఆయన కోసం కనిపెట్టుకొని ఉన్న నమ్మకస్థులు వాగ్దత్త మెస్సీయను గుర్తించేందుకు సహాయం చేయడానికి సృష్టికర్తయైన యెహోవా ఖచ్చితమైన సంకేతాలను అందిస్తాడని మీరు ఎదురుచూడడం సహేతుకం. ఎందుకు? ఎందుకంటే అలా అందించడం ద్వారా మెస్సీయ కోసం కనిపెట్టుకుని ఉన్నవారు, అనేకులు మోసపోయినట్లు మోసగాళ్ళచేత మోసగించబడరు.

ఒక రాయబారి మరో ప్రభుత్వానికి తనను తాను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆయన తన నియామకాన్ని ధ్రువీకరించుకోవడానికి అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే, మెస్సీయకు ఉండే అర్హతల గురించి యెహోవా ఎంతోకాలం ముందే నమోదు చేశాడు. కాబట్టి “మెస్సీయ” వచ్చినప్పుడు ఆయన తన గుర్తింపును ధృవీకరించే దస్తావేజులతో లేక ఆధారాలతో వచ్చినట్లు ఉంటుంది.

ఒక నిజమైన మెస్సీయకు ఉండాల్సిన అర్హతల గురించి శతాబ్దాల క్రితం వ్రాయబడిన అనేక బైబిలు ప్రవచనాల్లో ముందుగానే పేర్కొనబడింది. మెస్సీయ వచ్చే తీరు, ఆయన పరిచర్య స్వభావం, ఇతరుల చేతుల్లో ఆయన శ్రమననుభవించడం వంటి విషయాలతోపాటు, ఆయన ఎలాంటి మరణాన్ని చవిచూస్తాడు అనే విషయం గురించి కూడా పూర్తి వివరాలు అవి ముందుగానే చెప్పాయి. ఆ విశ్వసనీయమైన ప్రవచనాలు ఆయన పునరుత్థానం గురించి, దేవుని కుడిపార్శ్వానికి ఉన్నతపరచబడడం గురించి, చివరకు భవిష్యత్తులో ఆయన రాజ్య పరిపాలన తీసుకువచ్చే ఆశీర్వాదాల గురించి కూడా ముందుగానే చెప్పాయనేది తెలుసుకోవడానికి మీరు ఇష్టపడవచ్చు. ఈ విధంగా బైబిలు ప్రవచనాలు మెస్సీయ గురించి ప్రత్యేక నమూనాను అందించాయి, ఆ నమూనాను ఒకే ఒక వ్యక్తిని గుర్తించడానికి ఉపయోగించే వేలిముద్రలతో పోల్చవచ్చు.

యేసు సా.శ. 29లో రంగప్రవేశం చేసినప్పుడు, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలన్నీ అప్పుడే నెరవేరలేదు. ఉదాహరణకు, ఆయన అప్పటికి చంపబడి, పునరుత్థానం చేయబడలేదు. అయితే అంద్రెయ, ఫిలిప్పులే కాక ఇతరులు కూడా యేసు బోధలనుబట్టి, క్రియలనుబట్టి ఆయనమీద విశ్వాసముంచారు. ఆయనే మెస్సీయ అని నిరూపించే అనేక రుజువులను వారు చూశారు. మీరు ఆ కాలంలో జీవిస్తూ ఆ రుజువును విశాల హృదయంతో వ్యక్తిగతంగా పరిశీలించి ఉంటే, యేసే మెస్సీయ అనే నమ్మకం బహుశా మీకు కూడా కలిగి ఉండేది.

సంయుక్త రుజువు

ఆ నిర్ధారణకు రావడానికి మీకు ఏమి సహాయం చేసివుండేది? అనేక శతాబ్దాలుగా బైబిలు ప్రవక్తలు, మెస్సీయను ఖచ్చితంగా గుర్తించడానికి ఆయనకు ఉండాల్సిన నిర్దిష్ట అర్హతల గురించిన వివరాలు అందించారు. శతాబ్దాలుగా ప్రవక్తలు ఆ వివరాలను అందిస్తున్నప్పుడు మెస్సీయకు సంబంధించిన చిత్రం క్రమంగా ఏర్పడింది. హెన్రీ హెచ్‌. హేలీ ఇలా వ్యాఖ్యానించాడు: “గతంలో ముఖపరిచయంలేని, ఇదివరకెన్నడూ ఒకరితో ఒకరు సంభాషించుకోని, వివిధ దేశాలకు చెందిన చాలామంది వ్యక్తులు ఒక గదిలోకి ప్రవేశించి, ప్రతీఒక్కరు చెక్కబడిన ఒక్కో చలవరాయి ముక్కను చూపిస్తారని అనుకుందాం, ఆ ముక్కలను ఒక దగ్గర చేర్చినప్పుడు సంపూర్ణ విగ్రహం ఏర్పడుతుంది, అలాంటి విగ్రహం ఏర్పడాలంటే ఒక వ్యక్తి నమూనాలు గీసి ప్రతీ వ్యక్తికి ఒక భాగం పంపించడం తప్ప అది ఏర్పడడానికి మరో మార్గం ఏదైనా ఉందా?” ఆయన ఆ తర్వాత ఇలా అడుగుతున్నాడు: “యేసు రావడానికి కొన్ని యుగాలముందే, వివిధ శతాబ్దాలకు చెందిన వివిధ రచయితలు అద్భుతమైన అనేక భాగాలతో కూడిన యేసు జీవితాన్ని, కార్యాలను ఒక దగ్గర చేర్చడాన్నిబట్టి మానవాతీత మేధస్సు ఆ రచనలను పర్యవేక్షించిందనే వివరణ తప్ప దానికి మరే వివరణలనైనా ఇవ్వగలమా?” హేలీ, “అది ఎంతో గొప్ప అద్భుతం!” అనే నిర్ధారణకు వచ్చాడు.

ఆ “అద్భుతం” బైబిలులోని మొదటి పుస్తకంలో ప్రారంభమైంది. మొదటి బైబిలు ప్రవచనం మెస్సీయ పాత్ర గురించి సూచించింది, అంతేగాక, ఆదికాండమును వ్రాసిన రచయిత ఆ మెస్సీయ అబ్రాహాము సంతానం నుండి వస్తాడని నమోదుచేశాడు. (ఆదికాండము 3:15; 22:​15-18) మెస్సీయ యూదా గోత్రం నుండి వస్తాడని మరో సంకేతం వెల్లడిచేసింది. (ఆదికాండము 49:​10) మెస్సీయ మోషే కన్నా గొప్ప వక్తగా, విమోచకునిగా తయారవుతాడని మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పాడు.​—⁠ద్వితీయోపదేశకాండము 18:​18.

దావీదు రాజు కాలంలో, మెస్సీయ దావీదు సింహాసనానికి వారసుడవుతాడని, ఆయన రాజ్యం ‘నిత్యము స్థిరపరచబడుతుందని’ ప్రవచనం వెల్లడిచేసింది. (2 సమూయేలు 7:​13-16) మెస్సీయ దావీదు పట్టణమైన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా పుస్తకం వెల్లడిచేసింది. (మీకా 5:⁠2) ఆయన కన్యకకు జన్మిస్తాడని యెషయా ప్రవచించాడు. (యెషయా 7:​14) ఆయన రాక గురించి ఏలీయా లాంటి ఒక వ్యక్తి ప్రకటిస్తాడని మలాకీ ప్రవచించాడు.​—⁠మలాకీ 4:​5, 6.

మెస్సీయకు సంబంధించిన మరికొన్ని నిర్దిష్టమైన వివరాలు దానియేలు పుస్తకంలో వ్రాయబడ్డాయి. మెస్సీయ వచ్చే సంవత్సరాన్నే ఖచ్చితంగా పేర్కొంటూ ప్రవచనం ఇలా చెబుతోంది: ‘యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. అరువది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులును కందకములును మరలా కట్టబడును.’​—⁠దానియేలు 9:​25.

పారసీక రాజైన అర్తహషస్త తన పరిపాలనలోని 20వ సంవత్సరంలో యెరూషలేమును పునరుద్ధరించి, మళ్ళీ కట్టించమని “ఆజ్ఞ” జారీచేశాడు. ఆయన పరిపాలన సా.శ.పూ. 474లో ప్రారంభమైంది, కాబట్టి ఆయన పరిపాలనలోని 20వ సంవత్సరం సా.శ.పూ. 455 అవుతుంది. (నెహెమ్యా 2:​1-8) కాబట్టి యెరూషలేమును పునరుద్ధరించి, తిరిగి కట్టమని ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత, మెస్సీయ రావడానికి 69 (7+62) ప్రవచనాత్మక వారాల సమయం పడుతుంది. అరవై తొమ్మిది అక్షరార్థ వారాలు కేవలం 483 రోజులతో లేక రెండుకన్నా తక్కువ సంవత్సరాలతో సమానం. “సంవత్సర మొకటింటికి ఒక దినము” అని పేర్కొనబడిన ప్రవచనాత్మక నియమాన్ని దీనికి అన్వయిస్తే, మెస్సీయ 483 సంవత్సరాల తర్వాత అంటే సా.శ. 29లో వస్తాడని అది వెల్లడిచేస్తుంది.​—⁠యెహెజ్కేలు 4:⁠6. *

మెస్సీయగా చెప్పుకున్నవారు చాలామంది వివిధ సమయాల్లో వచ్చారు. నజరేయుడైన యేసు సా.శ. 29లో ప్రపంచ రంగస్థలంమీదికి వచ్చాడు. (లూకా 3:​1, 2) ఆ సంవత్సరంలోనే యేసు బాప్తిస్మమిచ్చు యోహాను దగ్గరికి వెళ్ళి నీటి బాప్తిస్మం పొందాడు. అప్పుడు యేసు మెస్సీయగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాడు. ఆ తర్వాత, మెస్సీయకు ముందుగా వచ్చేవానిగా ప్రవచించబడిన ఏలీయా లాంటి వ్యక్తి అయిన యోహాను, “లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని యేసును పిలవడం ద్వారా ఆయనను అంద్రెయకు, మరో శిష్యునికి పరిచయం చేశాడు.​—⁠యోహాను 1:29; లూకా 1:13-17; 3:21-23.

వంశావళి, మెస్సీయ గుర్తింపు

ప్రేరేపిత ప్రవచనాలు మెస్సీయను యూదా వంశాంలోని నిర్దిష్ట కుటుంబాలతో ముడిపెట్టాయి. సర్వజ్ఞానియైన సృష్టికర్త, మెస్సీయ వంశపూర్వికులను ధృవీకరించడానికి వంశావళికి సంబంధించిన దస్తావేజులు అందుబాటులో ఉన్న సమయంలోనే మెస్సీయ వచ్చేలా ఏర్పాటు చేస్తాడని ఊహించడం సహేతుకం.

మెక్‌క్లింటాక్‌ అండ్‌ స్ట్రాంగ్స్‌ సైక్లోపీడియా ఇలా చెబుతోంది: “యూదా గోత్రాలకు, కుటుంబాలకు చెందిన వంశావళికి సంబంధించిన దస్తావేజులు [సా.శ. 70లో] యెరూషలేము నాశనం చేయబడినప్పుడే నాశనమయ్యాయి గానీ అంతకుముందు కాదని చెప్పడంలో ఎలాంటి సందేహమూలేదు.” మత్తయి, లూకా తమ సువార్తలను సా.శ. 70కి ముందే వ్రాశారని చెప్పడానికి స్పష్టమైన రుజువులున్నాయి. కాబట్టి, యేసు వంశావళి గురించిన తమ వృత్తాంతాలను సంపుటీకరించడానికి వారు ఆ దస్తావేజులను పరిశీలించివుండవచ్చు. (మత్తయి 1:1-16; లూకా 3:​23-38) అది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి, వారి సమకాలీనులు చాలామంది యేసు వంశావళిని స్వయంగా ధృవీకరించుకోవడానికి ఇష్టపడివుండవచ్చు.

ప్రవచనాలు యేసు విషయంలో యాదృచ్ఛికంగా నెరవేరాయా?

అయినా, మెస్సీయకు సంబంధించిన ప్రవచనాలు యేసు విషయంలో కేవలం యాదృచ్ఛికంగా నెరవేరే అవకాశం ఉందా? ఒక విద్వాంసుడు ఒక ఇంటర్వ్యూలో ఇలా జవాబిచ్చాడు: “అలాంటి అవకాశమే లేదు. అలా జరిగే అవకాశం ఎంత తక్కువగా ఉందంటే వారు ఆ అవకాశాన్ని కొట్టివేస్తారు. కేవలం ఎనిమిది ప్రవచనాలు నెరవేరే సంభావ్యత 1,000 కోట్ల కోట్లలో ఒకటని ఒక వ్యక్తి లెక్కకట్టి చెప్పాడు.” ప్రవచనాలు యాదృచ్ఛికంగా నెరవేరే అవకాశం ఎంత తక్కువో ఉదాహరించడానికి ఆయన ఇలా చెప్పాడు: “మీరు 1,000 కోట్ల కోట్ల వెండి నాణాలను తీసుకున్నట్లయితే అవి టెక్సాస్‌ రాష్ట్రాన్ని [6,90,000 చదరపు కిలోమీటర్ల స్థలాన్ని] 0.6 మీటర్ల ఎత్తు వరకు కప్పేస్తాయి. మీరు వాటిలో ఒక వెండి నాణెం మీద గుర్తుపెట్టి, కళ్లకు గంతలుకట్టిన ఒక వ్యక్తిని ఆ రాష్ట్రమంతటా సంచరించి, గుర్తుపెట్టిన ఆ నాణాన్ని వెదకమంటే ఆయన దానిని కనుగొనే అవకాశం ఎంత ఉంటుంది?” ఆ తర్వాత ఆయన, “చరిత్రలోని ఏదో ఒక వ్యక్తి [మెస్సీయకు సంబంధించిన] ప్రవచనాల్లో కేవలం ఎనిమిదింటిని నెరవేర్చే అవకాశం కూడా అంతే ఉంది” అని పేర్కొన్నాడు.

అయినా, యేసు తన మూడున్నర సంవత్సరాల పరిచర్య సమయంలో కేవలం ఎనిమిది బైబిలు ప్రవచనాలనే కాదు, చాలా బైబిలు ప్రవచనాలను నెరవేర్చాడు. అలాంటి తిరుగులేని నిదర్శనం దృష్ట్యా ఆ విద్వాంసుడు ఇలాంటి నిర్ధారణకు వచ్చాడు: “చరిత్రంతటిలో యేసు, కేవలం యేసు మాత్రమే అనేక బైబిలు ప్రవచనాలను నెరవేర్చగలిగాడు.”

మెస్సీయ “రాక”

సా.శ. 29లో నజరేయుడైన యేసు మెస్సీయగా వచ్చాడనేది స్పష్టం. ఆయన అప్పుడు ఒక వినయంగల, బాధననుభవించే విమోచకునిగా వచ్చాడు. చాలామంది యూదులే కాక చివరికి తన అనుచరులు కూడా ఊహించినట్లు కనిపిస్తున్నట్లుగా, రోమన్ల అణచివేత నుండి తమను విడుదల చేయడానికి అన్నింటినీ జయించే రాజుగా ఆయన రాలేదు. (యెషయా, 53వ అధ్యాయం; జెకర్యా 9:9; అపొస్తలుల కార్యములు 1:​6-8) అయితే ఆయన భవిష్యత్తులో శక్తితో, గొప్ప అధికారంతో వస్తాడని ప్రవచించబడింది.​—⁠దానియేలు 2:44; 7:​13, 14.

భూవ్యాప్తంగా ఉన్న ఆలోచనాపరులైన వ్యక్తులు బైబిలు ప్రవచనాలను జాగ్రత్తగా అధ్యయనం చేయడం మెస్సీయ మొదటి శతాబ్దంలో వచ్చాడనే, ఆయన తిరిగివస్తాడనే నమ్మకం వారిలో కలిగించింది. ఆయన తిరిగివస్తాడనే ప్రవచన నెరవేర్పు అంటే ఆయన “ప్రత్యక్షత” ప్రారంభం గురించిన ప్రవచన నెరవేర్పు 1914లో సంభవించిందని సాక్ష్యాలు రుజువుచేస్తున్నాయి. * (మత్తయి 24:​3-14, NW) ఆ సంవత్సరంలో, యేసు అదృశ్యంగా పరలోకంలో దేవుని రాజ్యానికి రాజుగా సింహాసనాసీనుడయ్యాడు. త్వరలో ఆయన, ఏదెనులో జరిగిన తిరుగుబాటువల్ల కలిగిన పరిణామాలను భూమి మీదనుండి తీసివేయడానికి చర్యతీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన వెయ్యేండ్ల పాలన, ఆయనే “లోకపాపమును మోసికొనిపోవు” వాగ్దత్త సంతానం అని, మెస్సీయ అని విశ్వసించేవారినందరినీ ఆశీర్వదిస్తుంది.​—⁠యోహాను 1:29; ప్రకటన 21:​3, 4.

ఆ సాక్ష్యాల గురించి మీతో చర్చించడానికి, మెస్సీయ పరిపాలనవల్ల మీకు, మీ ప్రియమైనవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయం గురించి బైబిలు నుండి చూపించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.

[అధస్సూచీలు]

^ పేరా 17 దానియేలు 9:​25 గురించిన మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనములపై అంతర్దృష్టి (ఆంగ్లం), 2వ సంపుటిలోని 899-904 పేజీలు చూడండి.

^ పేరా 27 మరిన్ని వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకంలోని 10, 11 అధ్యాయాలను చూడండి.

[6, 7వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రాలు]

సా.శ.పూ. 455, సా.శ. 29, 1914, మెస్సీయ

“యెరూషలేమును మెస్సీయ

రావడం మెస్సీయ త్వరలో దుష్టత్వాన్ని

మరల కట్టించవచ్చునని పరలోకంలో నిర్మూలించి,

ఆజ్ఞ” సింహాసనాసీనుడయ్యాడు భూమిని పరదైసుగా

మారుస్తాడు

483 సంవత్సరాలు

(69 ప్రవచనాత్మక వారాలు)

​—దానియేలు 9:​25