కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిజమైన క్రైస్తవులు ఎవరు?

నిజమైన క్రైస్తవులు ఎవరు?

నిజమైన క్రైస్తవులు ఎవరు?

“ఎక్కడైతే యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ప్రజల బోధలను, వారి క్రియలను ప్రభావితం చేస్తుందో, అక్కడే క్రైస్తవత్వం ఉనికిలో ఉంటుంది.” (ఆన్‌ బీయింగ్‌ ఎ క్రిస్టియన్‌) ఆ మాటలతో, స్విట్జర్లాండ్‌ వేదాంతి హాన్స్‌ క్యున్‌ ఒక సుస్పష్టమైన సత్యాన్ని పేర్కొంటున్నాడు: యేసు బోధలను ఆచరణలోపెట్టే యథార్థవంతులైన వ్యక్తులున్నచోటే నిజమైన క్రైస్తవత్వం ఉంటుంది.

క్రీస్తు అనుచరులమని చెప్పుకుంటూ యేసు బోధించినవాటిని అనుసరించని వ్యక్తుల, సంస్థల మాటేమిటి? చాలామంది తాము క్రైస్తవులమని చెప్పుకుంటారు అని యేసే స్వయంగా చెప్పాడు. “మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా?” అంటూ తాము ఆయన సేవచేశామని నిరూపించుకోవడానికి వారు వివిధ కార్యకలాపాలను సూచిస్తారు. అయితే యేసు ఎలా ప్రతిస్పందిస్తాడు? నిర్మొహమాటంగా ఆయన పలికిన ఈ మాటలు ఆయన తీర్పును వ్యక్తం చేస్తాయి: “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండి.”​—⁠మత్తయి 7:​22, 23.

యేసును అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ ‘అక్రమము చేసేవారికి’ అదెంత తీవ్రమైన హెచ్చరికో కదా! అక్రమము చేసేవారని తిరస్కరించేబదులు నిజమైన క్రైస్తవులేనని తాను గుర్తించాలంటే, ప్రజలు కలిగివుండడం అవసరమని యేసు చెప్పిన రెండు ప్రాథమిక షరతులను పరిశీలించండి.

“మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల”

యేసు పెట్టిన షరతుల్లో ఇది ఒకటి: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.”​—⁠యోహాను 13:​34, 35.

తన అనుచరులు ఒకరి ఎడల ఒకరు, అలాగే మిగతా మానవజాతి అంతటిపై నిజమైన ప్రేమగలవారై ఉండాలని యేసు కోరుతున్నాడు. యేసు భూమిపై జీవించిన తర్వాతి శతాబ్దాల్లో చాలామంది క్రైస్తవులు దానికి అనుగుణంగా జీవించారు. క్రీస్తుకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే అనేక మతసంస్థల మాటేమిటి? వాటి చరిత్ర ప్రేమతో నిండినట్లు ఉందా? ఎంతమాత్రం లేదు. బదులుగా అవి నిరపరాధుల రక్తం చిందించబడిన అనేకానేక యుద్ధాల్లో, పోరాటాల్లో ముందున్నాయి.​—⁠ప్రకటన 18:​24.

ఆధునిక కాలాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది. క్రైస్తవ దేశాలని చెప్పుకున్నవే, 20వ శతాబ్దపు రెండు ప్రపంచ యుద్ధాల్లో జరిగిన ఊచకోతకు నాయకత్వం వహించాయి. ఇటీవలి కాలాల్లో, క్రైస్తవ చర్చీలని చెప్పుకుంటున్నవాటి సభ్యులు 1994లో రువాండాలో జరిగిన పాశవిక దారుణకృత్యాల్లో, జాతినిర్మూలనా ప్రయత్నంలో ముందున్నారు. “ఇలా రక్తదాహంతో ఒకరిపైకి మరొకరు విరుచుకుపడిన వీరు ఒకే విశ్వాసానికి చెందినవారు. వారిలో అనేకులు క్రైస్తవులు” అని మాజీ ఆంగ్లికన్‌ ఆర్చ్‌బిషప్‌ డెస్మండ్‌ టూటూ వ్రాశాడు.

మీరు నా వాక్యమందు నిలిచినవారైతే”

నిజక్రైస్తవత్వానికి రెండవ ప్రాథమిక ఆవశ్యకతను ప్రస్తావిస్తూ యేసు ఇలా పేర్కొన్నాడు: “మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు; అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును.”​—⁠యోహాను 8:​31, 32.

యేసు తన అనుచరులు తన వాక్యమందు నిలిచివుండాలని, అంటే తన బోధలను అంటిపెట్టుకుని ఉండాలని ఆశిస్తున్నాడు. దానికి భిన్నంగా, ఆయనను అనుసరిస్తున్నామని చెప్పుకునే మతబోధకులు “గ్రీకు బోధలను ఎక్కువగా ఆమోదించారు” అని క్యున్‌ అనే వేదాంతి పేర్కొంటున్నాడు. వారు యేసు బోధలను అనుసరించే బదులు ఆత్మ అమర్త్యత, పాపవిమోచన లోకం, మరియ ఆరాధన, మతనాయక వర్గం వంటి తలంపులను నమ్మడం ప్రారంభించారు, అవన్నీ అన్యమతాల నుండి, తత్త్వవేత్తల నుండి అరువుతెచ్చుకున్నవే.​—⁠1 కొరింథీయులు 1:19-21; 3:​18-20.

మతనాయకులు, యేసు తనకు కావాలని ఎన్నడూ కోరుకోని స్థానానికి ఆయనను హెచ్చిస్తూ అగోచరమైన త్రిత్వ సిద్ధాంతాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఆ ప్రక్రియలో వారు, యేసు ఎల్లప్పుడూ ఎవరివైపైతే అవధానాన్ని మళ్ళించాడో ఆయన తండ్రియైన యెహోవాను ఆరాధించకుండా ప్రజలను ప్రక్కదారిపట్టించారు. (మత్తయి 5:16; 6:9; యోహాను 14:28; 20:​17) “యేసు, దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయన, పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల ప్రాచీన దేవుడైన యహ్‌వహ్‌ను ఉద్దేశించి మాట్లాడాడు . . . ఆయనకు ఈయనే ఏకైక మరియు అద్వితీయ దేవుడు” అని హాన్స్‌ క్యున్‌ వ్రాస్తున్నాడు. యేసు యొక్క దేవుడును, తండ్రియైన యహ్‌వహ్‌, అంటే తెలుగులో సాధారణంగా వ్రాయబడే విధంగా యెహోవా అని నేడు ఎంతమంది వెంటనే గుర్తిస్తారు?

రాజకీయ విషయాల్లో తటస్థంగా ఉండమని యేసు ఇచ్చిన ఆజ్ఞను మతనాయకులు పూర్తిగా అలక్ష్యం చేశారు. యేసు కాలంలో, గలిలయ “జాతిసంబంధ దేశాభిమానానికి ముఖ్యస్థానంగా ఉంది” అని ట్రెవర్‌ మొరొ అనే రచయిత వ్రాశాడు. చాలామంది యూదా దేశభక్తులు రాజకీయ, మత స్వేచ్ఛను పొందడానికి ఆయుధాలు చేపట్టారు. అలాంటి పోరాటాల్లో పాల్గొనమని యేసు తన శిష్యులకు చెప్పాడా? లేదు. బదులుగా, ఆయన వారికిలా చెప్పాడు: “మీరు లోకసంబంధులు కారు.” (యోహాను 15:19; 17:​14) అయితే, చర్చి నాయకులు తటస్థంగా ఉండే బదులు, ఐర్లాండ్‌ రచయితయైన హూబెర్ట్‌ బట్లర్‌, “కయ్యానికి కాలుదువ్వే, రాజకీయపరమైన చర్చి సిద్ధాంతాలు” అని వర్ణిస్తున్న వాటిని వృద్ధిచేశారు. ఆయనిలా వ్రాస్తున్నాడు: “రాజకీయ క్రైస్తవత్వం దాదాపు ఎల్లప్పుడూ సైనిక క్రైస్తవత్వంగా ఉంది, రాజకీయ నాయకులూ మతనాయకులూ ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు, సాధారణంగా జరిగేదేమిటంటే, చర్చి తాను పొందిన కొన్ని ప్రయోజనాలకు ప్రతిఫలంగా దేశ సైనిక శక్తులను ఆశీర్వదిస్తుంది.”

అబద్ధ బోధకులు యేసును ఎరుగమనడం

అపొస్తలుడైన పౌలు నిజక్రైస్తవత్వం నుండి పడిపోవడం గురించి హెచ్చరించాడు. తన మరణం తర్వాత, క్రైస్తవులమని చెప్పుకునేవారి మధ్యనుండి “క్రూరమైన తోడేళ్లు” బయలుదేరి, “శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు[తారు]” అని ఆయన చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) వారు బహిరంగంగా ‘దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు’ గానీ వాస్తవానికి “తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టు” ఉంటారు. (తీతు 1:​16) అలాగే అపొస్తలుడైన పేతురు కూడా, అబద్ధబోధకులు “తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, . . . నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు” అని హెచ్చరించాడు. వారి చెడు ప్రవర్తన, ప్రజలు ‘సత్యమార్గమును దూషించడానికి’ కారణమవుతుందని ఆయన అన్నాడు. (2 పేతురు 2:​1, 2) ఈ విధంగా, క్రీస్తును ఎరుగమన్నట్లు ఉండడమంటే, “మతభ్రష్టత్వానికి పాల్పడడం ద్వారా, హానికరమైన బోధలను వ్యాప్తిచేయడం ద్వారా తండ్రిని, కుమారుణ్ణి నిరాకరించడ[మే]” అని గ్రీకు విద్వాంసుడైన డబ్ల్యూ. ఈ. వైన్‌ చెబుతున్నాడు.

యేసు శిష్యులమని చెప్పుకునేవారు ‘ఆయన వాక్యమందు నిలిచివుండడంలో,’ ఆయన నిర్దేశించిన ఇతర షరతులకు కట్టుబడి ఉండడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమౌతుంటే ఆయనెలా ప్రతిస్పందిస్తాడు? ఆయనిలా హెచ్చరించాడు: “మనుష్యులయెదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రియెదుట నేనును ఎరుగనందును.” (మత్తయి 10:​33) అయితే, నమ్మకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బహుశా పొరపాటు చేసే వ్యక్తిని యేసు ఎరుగననడు. ఉదాహరణకు, అపొస్తలుడైన పేతురు మూడుసార్లు యేసును ఎరుగననినా, అయన పశ్చాత్తాపపడడంతో క్షమించబడ్డాడు. (మత్తయి 26:​69-75) అయితే, యేసును అనుసరిస్తున్నట్లు నటిస్తూ ఉద్దేశపూర్వకంగా పదేపదే ఆయన బోధలను నిరాకరించే, గొఱ్ఱెతోలు కప్పుకున్న తోడేళ్ళవంటి వ్యక్తులను లేదా సంస్థలను ఆయన ఎరుగనంటాడు. అలాంటి అబద్ధబోధకుల గురించి యేసు ఇలా చెప్పాడు: “వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.”​—⁠మత్తయి 7:​15-20.

అపొస్తలులు మరణించడం, మతభ్రష్టత్వం వృద్ధిచెందడం

అబద్ధక్రైస్తవులు ఎప్పుడు క్రీస్తును ఎరుగమనడం మొదలుపెట్టారు? యేసు మరణించిన కొంతకాలానికే. యేసు, తాను తన పరిచర్యా కాలంలో నాటిన “గోధుమల” మధ్య లేక నిజక్రైస్తవుల మధ్య, అపవాదియైన సాతాను ఆ వెంటనే “గురుగులను” అంటే అబద్ధ క్రైస్తవులను నాటుతాడని స్వయంగా హెచ్చరించాడు. (మత్తయి 13:​24, 25, 37-39) అపొస్తలుడైన పౌలు తన కాలంలో, మోసగాళ్ళైన బోధకులు అప్పటికే తమపని మొదలుపెట్టారని హెచ్చరించాడు. వారు యేసుక్రీస్తు బోధల నుండి వైదొలగిపోవడానికి ప్రధాన కారణం, వారికి “సత్యవిషయమైన” యథార్థ “ప్రేమ” లేకపోవడమేనని ఆయన అన్నాడు.​—⁠2 థెస్సలొనీకయులు 2:​9.

యేసుక్రీస్తు అపొస్తలులు తాము జీవించి ఉన్నంతవరకు మతభ్రష్టత్వానికి ప్రతిబంధకంగా పనిచేశారు. అయితే అపొస్తలుల మరణం తర్వాత, అనేకులను మోసగించడానికి మతనాయకులు, ‘అబద్ధ విషయమైన సమస్తబలమును, నానావిధములైన సూచకక్రియలను, మహత్కార్యములను, దుర్నీతిని పుట్టించు సమస్త మోసమును’ ఉపయోగించి, యేసూ ఆయన అపొస్తలులూ బోధించిన సత్యాల నుండి చాలామందిని దూరంచేశారు. (2 థెస్సలొనీకయులు 2:​3, 6-12) కొంతకాలంలోనే, తొలి క్రైస్తవ సంఘం, “యేసుకు, పౌలుకు సహితం ఆశ్చర్యం కలిగించే” మతసంస్థగా మారిందని ఆంగ్ల తత్త్వవేత్త బెర్ట్రాండ్‌ రస్సెల్‌ వ్రాశాడు.

నిజమైన క్రైస్తవత్వం పునఃస్థాపించబడింది

వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి. అపొస్తలుల మరణం తర్వాత, క్రైస్తవత్వం పేరుమీద జరిగినవి యేసు బోధలను ప్రతిబింబించలేదు. అయితే, యేసు “యుగసమాప్తి వరకు సదాకాలము” తన అనుచరులతో ఉంటానని తానుచేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని దాని భావం కాదు. (మత్తయి 28:​20) ఆయన ఆ మాటలు చెప్పినప్పటినుండి నమ్మకమైన వ్యక్తులు ఉన్నారనీ, వారి “బోధలను, క్రియలను యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానం ప్రభావితం” చేసిందనీ మనం నిశ్చయత కలిగివుండవచ్చు. నిజక్రైస్తవుల గుర్తింపు చిహ్నంగా ఉన్న ప్రేమను చూపించడానికి, ఆయన బోధించిన సత్యాలకు నమ్మకంగా కట్టుబడి ఉండడానికి కృషిచేస్తున్న అలాంటి వారికి మద్దతిస్తానని తాను చేసిన వాగ్దానాన్ని యేసుక్రీస్తు నిలబెట్టుకున్నాడు.

యేసు ఈ విధానపు అంత్యదినాల్లో తాను తన నమ్మకమైన శిష్యులను స్పష్టంగా గుర్తించదగిన, తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి తాను ఉపయోగించుకొనే క్రైస్తవ సంఘంలోకి సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. (మత్తయి 24:​14, 45-47) ఆయన ఇప్పుడు ఆ సంఘాన్ని, “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చిన పురుషుల, స్త్రీల, పిల్లల “గొప్ప సమూహమును” సమకూర్చడానికి ఉపయోగించుకుంటూ వారిని తన శిరసత్వం క్రింద, ‘ఒకే గొఱ్ఱెల కాపరి’ క్రిందవుండే ‘ఒకే మందగా’ ఐక్యపరుస్తున్నాడు.​—⁠ప్రకటన 7:9, 14-17; యోహాను 10:16; ఎఫెసీయులు 4:​11-16.

కాబట్టి, గత రెండువేల సంవత్సరాల్లో క్రీస్తు పేరును పాడుచేసిన, క్రైస్తవత్వానికి కళంకం తీసుకువచ్చిన ఏ సంస్థ నుండైనా, సంస్థాపన నుండైనా వైదొలగండి. లేదంటే, అపొస్తలుడైన యోహానుకు యేసుక్రీస్తు చెప్పినట్లుగా, దేవుడు త్వరలో వారిపై తీర్పు అమలుచేసినప్పుడు, ‘వారి తెగుళ్ళలో ఏదైనా’ మీ పైకి కూడా వచ్చే అవకాశం ఉంది. (ప్రకటన 1:1; 18:​4, 5) “అంత్యదినములలో” సత్యారాధకులు అంటే నిజక్రైస్తవత్వాన్ని హత్తుకునివుండే వారు దేవుని ఉపదేశాలను విని, పునఃస్థాపించబడిన స్వచ్ఛారాధనకు సంబంధించిన “ఆయన త్రోవలలో నడుచు[కుంటారు]” అని చెప్పినప్పుడు మీకా ప్రవక్త ఎవరి గురించైతే మాట్లాడాడో వారిలో ఒకరై ఉండాలని నిశ్చయించుకోండి. (మీకా 4:​1-4) ఆ సత్యారాధకులను గుర్తించడానికి మీకు సహాయం చేసేందుకు ఈ పత్రిక ప్రచురణకర్తలు సంతోషిస్తారు.

[5వ పేజీలోని చిత్రాలు]

నిజమైన క్రైస్తవులు ఎందుకు యుద్ధాల్లో పాల్గొనరు?

[చిత్రసౌజన్యం]

సైనికులు, ఎడమవైపు: U.S. National Archives photo; ఫ్లేమ్‌త్రోవర్‌, కుడివైపు: U.S. Army Photo

[7వ పేజీలోని చిత్రాలు]

‘ఒకరి ఎడల ఒకరు ప్రేమగలవారై ఉండండి,’ ‘నా వాక్యమందు నిలిచివుండండి’ అన్నవి నిజమైన క్రైస్తవుల కోసం యేసు పెట్టిన ప్రాథమిక షరతులు