కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేడు క్రీస్తు బోధలను ఎవరు అనుసరిస్తున్నారు?

నేడు క్రీస్తు బోధలను ఎవరు అనుసరిస్తున్నారు?

నేడు క్రీస్తు బోధలను ఎవరు అనుసరిస్తున్నారు?

చాలామంది యేసుక్రీస్తును జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనుష్యుల్లో ఒకనిగా దృష్టిస్తారు. అయితే అనేకులు ఆయనే ఏకైక మహాగొప్ప మనిషి అని పరిగణిస్తారు. దాదాపు రెండువేల సంవత్సరాలుగా, ఆయన చేసిన బోధలు, “దయాకనికరాలుగల సామాన్యుల జీవితాలనూ, అలాగే పెద్ద మొత్తంలో దానధర్మాలు చేసేవారి జీవితాలనూ” ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని ఆంగ్ల రచయిత మెల్విన్‌ బ్రాగ్‌ వ్రాశాడు.

క్రైస్తవత్వం మాటేమిటి?

క్రైస్తవత్వం మాటేమిటి? అది “మానవజాతిలో కలిగిన అతిగొప్ప ఆధ్యాత్మిక అభివృద్ధి” అని వర్ణించబడుతోంది. స్కాట్లాండ్‌లోవున్న గ్లాస్‌గోవ్‌ కలెడోనియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్‌ కెల్సో తన దృక్కోణాన్ని వ్యక్తంచేస్తూ ఇలా వ్రాశాడు: “దాని రెండువేల సంవత్సరాల చరిత్ర కళలు, నిర్మాణశైలి, తత్త్వశాస్త్రం, సంగీతం, సామాజిక కార్యకలాపాలు వంటి రంగాల్లో సాధించబడిన సాటిలేని విజయాలతో నిండివుంది.”

అయితే, చాలామంది ఇతరులు విషయాలను మరోవిధంగా దృష్టిస్తారు. “యేసుక్రీస్తు బోధలమీద, ఆయన దేవుని కుమారుడనే నమ్మకంమీద ఆధారపడివున్న ఒక మతం” అని ఒక నిఘంటువులో నిర్వచింపబడిన క్రైస్తవత్వమంటే వారికెలాంటి అభ్యంతరమూ లేదు. (కోలిన్స్‌ కోబిల్డ్‌) బదులుగా, క్రైస్తవత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే మతసంబంధ సంస్థల, సంస్థాపనాల ప్రవర్తనను వారు చీదరించుకుంటారు.

ఉదాహరణకు, పంతొమ్మిదవ శతాబ్దపు జర్మన్‌ తత్వవేత్త ఫ్రీడ్రిక్‌ నీట్స్కి క్రైస్తవత్వాన్ని “మానవజాతిపై పడిన నిత్య కళంకం” అని వర్ణించాడు. అది, “ఒక ఘోరమైన శాపం, అపరిమితమైన అంతర్గత భ్రష్టత్వం, . . . తన లక్ష్యసాధనకు అది ఎంత అసహ్యమైన, అవినీతికరమైన, రహస్యమైన, నీచమైన మార్గాలను అనుసరించడానికైనా వెనుకాడదు” అని వ్రాశాడు. నిజమే, నీట్స్కి దృక్కోణం తీవ్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ మరింత సహేతుకతగల అనేకమంది కూడా అలాంటి ముగింపుకే వచ్చారు. ఎందుకు? ఎందుకంటే చరిత్రంతటిలోనూ క్రైస్తవులమని చెప్పుకున్నవారి ప్రవర్తన యేసుక్రీస్తు లక్షణాలకు అనుగుణంగా లేదుగానీ, “భ్రష్టత్వం, హేయమైన నేరాలు, దేవదూషణ” వంటివాటితో నిండివుంది.

క్రైస్తవత్వంలో క్రీస్తు ఉన్నాడా?

కాబట్టి, “క్రైస్తవత్వంలో ఇప్పటికీ క్రీస్తు ఉన్నాడా?” అని అడగడం నిర్హేతుకమైనదేమీ కాదు. దానికి కొందరు వెంటనే ఇలా జవాబిస్తారు, “తప్పకుండా ఉన్నాడు! ‘యుగసమాప్తి వరకు సదాకాలము’ మీతో ఉంటానని ఆయన తన అనుచరులకు వాగ్దానం చేయలేదా?” (మత్తయి 28:20) అవును, యేసుక్రీస్తు అలా అన్నాడు. కానీ, తన అనుచరులని చెప్పుకునేవారి ప్రవర్తన ఎలా ఉన్నా వారిలో ప్రతి ఒక్కరితోనూ తాను ఉంటానన్నది ఆయన భావమా?

యేసుక్రీస్తు కాలంనాటి కొంతమంది మతనాయకులు, దేవుడు తమతోనే ఉన్నాడని గట్టిగా నమ్మారు. దేవుడు ఇశ్రాయేలీయులను ఒక ప్రత్యేక పాత్ర కోసం ఎంచుకున్నాడు కాబట్టి, కొంతమంది మతనాయకులు దేవుడు తమను ఎన్నడూ, తాము ఏమి చేసినా సరే విడనాడడని తలంచారు. (మీకా 3:​11) అయితే, దేవుని కట్టడలను, ప్రమాణాలను తిరస్కరించడంలో వాళ్ళు చాలాదూరం వెళ్ళారు. ఫలితంగా యేసుక్రీస్తు సూటిగా వారికిలా చెప్పాడు: “ఇదిగో! మీ యిల్లు మీకు విడువబడియున్నది.” (మత్తయి 23:​38) ఒక మతవ్యవస్థ మొత్తం దేవుని అనుగ్రహాన్ని కోల్పోయింది. ఆయన దాన్ని తిరస్కరించి, సా.శ. 70లో రోమా సైన్యాలు దాని రాజధాని నగరమైన యెరూషలేమును, దానిలోని ఆలయాన్ని నాశనం చేయడానికి అనుమతించాడు.

క్రైస్తవత్వానికి కూడా అటువంటిదే జరిగే అవకాశముందా? “యుగసమాప్తి” వరకు తన అనుచరులతోనే ఉంటాననే తన వాగ్దానంతోపాటు యేసు ఇంకా ఏ షరతులను పెట్టాడో మనం పరిశీలిద్దాం.

[2, 3వ పేజీలోని చిత్రాలు]

ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది జీవితాలపై యేసుక్రీస్తు బోధలు గొప్ప ప్రభావాన్ని చూపించాయి