కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మాకు ఇంకా చెప్పు”

“మాకు ఇంకా చెప్పు”

“మాకు ఇంకా చెప్పు”

రష్యాలోని నెజ్లోబ్నయా నగరంలోని ఒక ఉన్నత పాఠశాల తరగతిలోని విద్యార్థులు రష్యన్‌ రచయితయైన మైఖల్‌ బుల్గకాఫ్‌ వ్రాసిన సాహిత్యాలను చదువుతున్నారు. ఆయన రచనల్లోని ఒక నవలలో, ఆయన యేసుక్రీస్తును అవమానకరమైన రీతిలో వర్ణించడమేకాక, సాతానును వీరునిగా చిత్రించాడు. తరగతిలో చర్చ ముగిసిన తర్వాత టీచరు విద్యార్థులందరినీ ఆ నవల ఆధారంగా పెట్టిన పరీక్షను వ్రాయమని అడిగింది. అయితే, యెహోవాసాక్షియైన 16 ఏళ్ళ ఆండ్రే, తన మనస్సాక్షి ఇటువంటి సాహిత్యాలు చదవడానికి అంగీకరించదు కాబట్టి, తనను ఈ పరీక్ష వ్రాయడం నుండి మినహాయించమని కోరాడు. ఆ పరీక్ష బదులుగా యేసుక్రీస్తును తాను ఎలా దృష్టిస్తున్నాడనే విషయంపై వ్యాసం వ్రాస్తానని కోరాడు. అలా చేయడానికి టీచరు అనుమతించింది.

ఆండ్రే, ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తున్నప్పటికీ, యేసు గురించి నేర్చుకోవడానికి సువార్త వృత్తాంతాల్లో ఒకదానిని చదవడమే ఉత్తమమైన మార్గంగా కనుగొన్నానని తన వ్యాసంలో వివరించాడు. అలా చేయడం ద్వారా “ప్రత్యక్షసాక్షుల వృత్తాంతాల నుండి యేసు జీవితం, బోధల గురించి నేర్చుకుంటారు.” అతను ఇంకా ఇలా కొనసాగించాడు: “సాతాను ఎలా చిత్రీకరించబడ్డాడనేది పరిగణించాల్సిన మరొక విషయం. సాతాను కథానాయకునిగా ఉన్న పుస్తకం చదవడం కొందరికి వినోదంగా ఉండవచ్చు, కానీ నాకు మాత్రం కాదు.” నిజానికి సాతాను, దేవునినుండి వైదొలగి, ఈ లోకంలోకి దుష్టత్వాన్ని, మానవులకందరికీ ఆపదను, దుఃఖాన్ని తెచ్చిన ఒక బలమైన ఆత్మప్రాణి అని వివరించాడు. ఆండ్రే తన వ్యాసాన్ని ఇలా ముగించాడు: “ఈ నవల చదవడంవల్ల ప్రయోజనం ఉందనే నమ్మకం నాకు లేదు. ఒక రచయితగా బుల్గకాఫ్‌పై నాకు ఎటువంటి దురభిప్రాయమూ లేదు. వ్యక్తిగతంగా మాత్రం, యేసుక్రీస్తును గురించిన చారిత్రక సత్యాన్ని తెలుసుకోవడానికి వేరే పుస్తకాలకు బదులు బైబిలునే చదవాలనుకుంటాను.”

ఆండ్రే వాళ్ళ టీచరుకు ఆ వ్యాసం ఎంతగా నచ్చిందంటే, యేసుక్రీస్తుపై ఒక మౌఖిక నివేదికను తయారుచేయమని అతణ్ణి కోరింది. దానికి ఆండ్రే వెంటనే అంగీకరించాడు. ఆ తర్వాతి సాహిత్యపు క్లాసులో ఆండ్రే తన రిపోర్టును తరగతి పిల్లలందరి ముందు చదివి వినిపించాడు. తాను, యేసును జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషిగా ఎందుకు భావిస్తున్నాడో వారికి వివరించాడు. ఆ తర్వాత బైబిలు పుస్తకమైన మత్తయి నుండి యేసు మరణం గురించిన ఒక అధ్యాయాన్ని చదివాడు. తనకు కేటాయించబడిన సమయం అయిపోతున్నప్పుడు ఆండ్రే ఇక ముగించాలనుకున్నాడు. కానీ తోటి విద్యార్థులు “మాకు ఇంకా చెప్పు! ఆ తర్వాత ఏమి జరిగింది?” అంటూ బతిమిలాడారు. అందుకు ఆయన, యేసు పునరుత్థానం గురించిన మత్తయి వృత్తాంతాన్ని చదవడం కొనసాగించాడు.

ఆండ్రే ముగించిన తర్వాత, అతని తోటి విద్యార్థులు యెహోవా గురించి, యేసును గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు. “నేను జ్ఞానం కోసం ప్రార్థించినప్పుడు యెహోవా దానికి ప్రత్యుత్తరమిచ్చాడు, వారి ప్రశ్నలన్నింటికీ జవాబులు ఇవ్వగలిగాను” అని ఆండ్రే చెబుతున్నాడు. క్లాసు అయిపోయిన తర్వాత ఆండ్రే తన టీచరుకి జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి * పుస్తకాన్ని అందించినప్పుడు ఆమె దానిని ఆనందంగా స్వీకరించింది. ఆండ్రే ఇలా వ్యాఖ్యానించాడు: “ఆమె నా రిపోర్టుకి అధిక మార్కులు ఇవ్వడమేకాక, నేను నా స్వంత నమ్మకాలను కలిగివుండి వాటిని తెలియజేయడానికి సిగ్గుపడనందుకు ప్రశంసించింది. నా నమ్మకాలను కొన్నింటిని తాను కూడా విశ్వసిస్తున్నానని ఆమె అంది.”

తన బైబిలు శిక్షిత మనస్సాక్షిననుసరించి యెహోవాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును అవమానపరిచే దాన్ని చదవకుండా ఉండాలని నిశ్చయించుకున్నందుకు ఆండ్రే ఎంతో సంతోషిస్తున్నాడు. అలా చేయడం అతన్ని లేఖనవిరుద్ధమైన తలంపుల నుండి కాపాడడమే కాక, ముఖ్యమైన బైబిలు సత్యాలను ఇతరులతో పంచుకోవడానికి కూడా అతనికి ఒక అద్భుతమైన అవకాశాన్నిచ్చింది.

[అధస్సూచి]

^ పేరా 5 యెహోవాసాక్షులు ప్రచురించినది.