కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సరైనది తెలుసుకొని దానిని చేయడం

సరైనది తెలుసుకొని దానిని చేయడం

జీవిత కథ

సరైనది తెలుసుకొని దానిని చేయడం

హేడెన్‌ సాండర్సన్‌ చెప్పినది

యేసు ఒకసారి తన అపొస్తలులతో ఇలా చెప్పాడు: “ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసినయెడల మీరు ధన్యులగుదురు.” (యోహాను 13:​17) నిజమే, సరైనది మనకు తెలిసుండవచ్చు, కానీ దానిని చేయడమే కొన్నిసార్లు కష్టం! అయితే, 40 సంవత్సరాల మిషనరీ సేవతో కూడిన దాదాపు 80 కన్నా ఎక్కువ సంవత్సరాల నా జీవితంలో, యేసు మాటలు సత్యమనే నమ్మకం నాకు కలిగింది. దేవుడు చెప్పినట్లే చేయడం నిజంగా సంతోషాన్నిస్తుంది. నన్ను వివరించనివ్వండి.

నాకు మూడు సంవత్సరాల వయసున్నప్పుడు, 1925లో నా తల్లిదండ్రులు అస్ట్రేలియాలోని మా సొంత ఊరైన న్యూకాసల్‌లో ఒక బైబిలు ప్రసంగాన్ని వినడానికి వెళ్ళారు. “ఇప్పుడు జీవిస్తున్న లక్షలాదిమంది మరెన్నడూ మరణించరు” అనే ప్రసంగం విన్న తర్వాత సత్యాన్ని కనుగొన్నాననే నమ్మకం మా అమ్మకు కలిగింది, ఆమె క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరుకావడం ప్రారంభించింది. అయితే, మా నాన్న ఆసక్తి త్వరగా సన్నగిల్లింది. అమ్మ క్రొత్తగా కనుగొన్న విశ్వాసాన్ని ఆయన వ్యతిరేకించాడు, ఆమె తన విశ్వాసాన్ని విడువకపోతే ఆమెను విడిచిపెడతానని బెదిరించాడు. అమ్మకు నాన్నంటే ఇష్టం, కుటుంబం ఐక్యంగా ఉండాలని కోరుకునేది. అయితే, దేవునిపట్ల విధేయత చాలా ప్రాముఖ్యమని ఆమెకు తెలుసు, ఆయన దృష్టిలో సరైనది చేయాలని ఆమె నిశ్చయించుకుంది. (మత్తయి 10:​34-39) మా నాన్న మమ్మల్ని విడిచిపెట్టేశాడు, ఆ తర్వాత నేను ఆయనను అప్పుడప్పుడు మాత్రమే చూసేవాణ్ణి.

ఆ విషయాల గురించి మననం చేసుకున్నప్పుడు, దేవునిపట్ల మా అమ్మ చూపించిన విశ్వసనీయతను నేను అభినందిస్తాను. ఆమె తీసుకున్న నిర్ణయంవల్ల నేను, మా అక్క బ్యూలా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో కూడిన జీవితాన్ని అనుభవించగలిగాం. అది మాకొక ప్రాముఖ్యమైన పాఠాన్ని కూడా బోధించింది, అదేమిటంటే మనకు సరైనది తెలిసినప్పుడు, దానిని చేయడానికి తప్పక కృషి చేయాలి.

విశ్వాసానికి పరీక్షలు

బైబిలు విద్యార్థులు (అప్పట్లో యెహోవాసాక్షులు అలా పిలవబడేవారు) మా కుటుంబానికి సహాయం చేసేందుకు ఎంతో కృషిచేశారు. మా అమ్మమ్మ మాతోపాటు ఉండడానికి మా ఇంటికి వచ్చి, ఆమె కూడా బైబిలు సత్యాన్ని అంగీకరించింది. ఆమె, మా అమ్మ ప్రకటనా పనిలో విడదీయరాని సహచరులయ్యారు, పరిచర్యలో వారి హుందా ప్రవర్తన, స్నేహశీల స్వభావం ప్రజల గౌరవాన్ని చూరగొంది.

ఆ సమయంలోనే వృద్ధ క్రైస్తవ సహోదరులు నా పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించి నాకు విలువైన శిక్షణను ఇచ్చారు. నేను కొంతకాలానికి, ఇంటింటి పరిచర్యలో ప్రజలకు సరళమైన ప్రతిపాదనలను అందించేందుకు సాక్ష్యమిచ్చే కార్డును ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను. నేను పోర్టబుల్‌ గ్రామ్‌ఫోన్‌ సహాయంతో బైబిలు ప్రసంగాలు వినిపించేవాణ్ణి, పట్టణ ప్రధాన వీధుల గుండా వెళ్తూ ప్లాకార్డ్‌లను (ప్రకటనా పత్రాలను) ప్రదర్శించేవాణ్ణి. నేను మనుష్యుల భయంతో సతమతమయ్యేవాణ్ణి కాబట్టి నాకు ఆ పనులు కష్టమనిపించేవి. అయితే సరైనది నాకు తెలుసు, నేను దానినే చేయడానికి నిశ్చయించుకున్నాను.

నేను పాఠశాల విద్య ముగించిన తర్వాత ఒక బ్యాంకులో పని చేయడం ప్రారంభించాను, ఆ పనిలో భాగంగా న్యూ సౌత్‌ వేల్స్‌ రాష్ట్రమంతటా ఉన్న, ఆ బ్యాంకుకు సంబంధించిన అనేక బ్రాంచీలకు ప్రయాణించాల్సివచ్చేది. ఆ రాష్ట్రంలో కొద్దిమంది సాక్షులే ఉన్నా నాకు లభించిన శిక్షణ, నా విశ్వాసాన్ని సజీవంగా ఉంచుకోవడానికి సహాయం చేసింది. మా అమ్మ నాకు ప్రోత్సాహకరమైన ఉత్తరాలు వ్రాసేది, అవి నన్ను ఆధ్యాత్మికంగా బలపర్చేవి.

ఆ ఉత్తరాలు నాకు సరైన సమయంలో సహాయాన్ని అందించాయి. ఆ సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది, సైన్యంలో చేరాల్సిందిగా నేను ఆజ్ఞాపించబడ్డాను. మా బ్యాంకు మేనేజరు ఉత్సాహంగా చర్చికి వెళ్ళేవాడు, అంతేకాక ఆయన స్థానిక సైనికాధికారి కూడా. క్రైస్తవుడిగా నా తటస్థ వైఖరి గురించి నేను ఆయనకు వివరించినప్పుడు నాకు తుదిహెచ్చరిక జారీ చేశాడు, నీవు నీ మతాన్నైనా వదులుకో లేక బ్యాంకునైనా విడిచిపెట్టు అని చెప్పాడు. సైనికులను భర్తీ చేసుకొనే స్థానిక కేంద్రానికి నేను వెళ్ళినప్పుడు పరిస్థితులు పరాకాష్ఠకు చేరాయి. మా మేనేజరు అక్కడున్నాడు, నేను రిజిస్ట్రేషన్‌ బల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఎంతో ఉత్సుకతతో నన్ను గమనించాడు. భర్తీ పత్రాల మీద సంతకం చేయడానికి నేను తిరస్కరించడంతో అధికారులకు కోపం వచ్చింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, కానీ సరైనది చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. యెహోవా సహాయంతో నేను ప్రశాంతంగా, స్థిరనిశ్చయంతో ఉండగలిగాను. కొంతమంది రౌడీలు నన్ను కొట్టడానికి చూస్తున్నారని నేను ఆ తర్వాత తెలుసుకున్నప్పుడు నేను వెంటనే నా సామాను సర్దుకొని తర్వాతి ట్రైన్‌ ఎక్కి ఆ పట్టణాన్ని వదిలి వెళ్ళాను!

నేను న్యూకాసల్‌కు తిరిగివచ్చిన తర్వాత, సైన్యంలో చేరడానికి తిరస్కరించిన మరో ఏడుగురు సహోదరులతోపాటు నేను కూడా కోర్టు విచారణ ఎదుర్కొన్నాను. న్యాయాధిపతి మాకు మూడు నెలల కఠిన కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో ఉండడం బాధాకరమైన అనుభవమే అయినా, సరైనది చేయడం ఆశీర్వాదాలను తెచ్చింది. మేము విడుదలైన తర్వాత నా తోటి ఖైదీల్లో ఒకరైన హిల్టన్‌ విల్కిన్సన్‌ అనే తోటి సాక్షి నన్ను తనతోపాటు తన ఫోటో స్టూడియోలో పనిచేయమని ఆహ్వానించాడు. నాకు కాబోయే భార్య మెలొడీని నేను అక్కడే కలుసున్నాను, ఆమె ఆ స్టూడియోలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. నేను విడుదలవగానే యెహోవాకు నా సమర్పణకు సూచనగా బాప్తిస్మం తీసుకున్నాను.

పూర్తికాల సేవ చేపట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం

వివాహం చేసుకున్న తర్వాత, మెలొడీ, నేను న్యూకాసల్‌లో సొంత ఫోటో స్టూడియోను తెరిచాం. కొంతకాలానికి మేము పనిలో ఎంతగా నిమగ్నమైపోయామంటే మా ఆరోగ్యం, ఆధ్యాత్మికత దెబ్బతినడం ప్రారంభించింది. ఆ సమయంలోనే, అప్పట్లో యెహోవాసాక్షుల ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్న, ఇప్పటి పరిపాలక సభ్యుడైన టెడ్‌ జారస్‌ మా ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మాతో మాట్లాడాడు. ఆ చర్చ తర్వాత మేము మా వ్యాపారాన్ని అమ్మి మా జీవితాన్ని నిరాడంబరంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 1954లో మేము ఒక చిన్న ట్రేయిలర్‌ కొనుక్కొని, విక్టోరియా రాష్ట్రంలోని బల్లారాట్‌ నగరానికి తరలివెళ్ళాం, మేము అక్కడ పయినీర్లుగా లేక పూర్తికాల సువార్తికులుగా సేవచేయడం ప్రారంభించాం.

బల్లారాట్‌లోని చిన్న సంఘంలో మేము పనిచేస్తున్నప్పుడు యెహోవా మా ప్రయత్నాలను ఆశీర్వదించాడు. 18 నెలల్లోనే కూటాలకు హాజరయ్యేవారి సంఖ్య 17 నుండి 70కి పెరిగింది. అప్పుడే నాకు దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ప్రయాణ లేక ప్రాంతీయ పైవిచారణకర్తగా సేవచేసే నియామకం లభించింది. తర్వాతి మూడు సంవత్సరాలు ఆడిలైడ్‌ నగరంలోని సంఘాలను, ముర్రె నది తీరం వెంబడి వైన్‌ను తయారుచేసే, నిమ్మ, నారింజ లాంటి పండ్లను ఉత్పత్తి చేసే ప్రాంతాల్లోని సంఘాలను సందర్శించే ఆహ్లాదకరమైన నియామకం మాకు లభించింది. మా జీవితాలు ఎంతో మారిపోయాయి. మేము ప్రేమగల సహోదర సహోదరీలతో కలిసి సంతోషంగా సేవచేసేవాళ్ళం. సరైనదని మాకు తెలిసినదాన్ని చేసినందుకు ఎంత గొప్ప ప్రతిఫలం లభించిందో!

మిషనరీ నియామకం

1958లో, ఆ సంవత్సరపు తర్వాతి భాగంలో న్యూయార్క్‌లో జరగనున్న “దైవిక చిత్తం” అంతర్జాతీయ సమావేశానికి హాజరవ్వాలని మేము అనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయానికి తెలియజేశాం. అమెరికాలో జరగనున్న గిలియడ్‌ మిషనరీ పాఠశాల కోసం దరఖాస్తు ఫారాలు పంపించడం ద్వారా వారు మాకు జవాబిచ్చారు. మేము 30వ పడిలో ఉన్నాం కాబట్టి గిలియడ్‌కు హాజరయ్యేందుకు మా వయసు దాటిపోయిందని అనుకున్నాం. అయినా మేము మా దరఖాస్తులను పంపించాం, మేము 32వ తరగతికి హాజరయ్యేందుకు ఆహ్వానించబడ్డాం. సగం కోర్సు ముగిసిన తర్వాత మేము ఇండియాను మా మిషనరీ నియామకంగా పొందాం! మేము ప్రారంభంలో కంగారుపడినా సరైనది చేయాలని మేము అనుకున్నాం కాబట్టి ఆ నియామకాన్ని ఆనందంగా స్వీకరించాం.

మేము ఓడలో ప్రయాణించి 1959వ సంవత్సరంలో ఒకరోజు తెల్లవారుజామున బొంబాయికి (ఇప్పుడు ముంబయి) చేరుకున్నాం. ఆ ఓడరేవులో ఆరుబయట వందలాదిమంది పనివారు పడుకుని నిద్రపోతున్నారు. గాలి వింత వాసనలతో నిండివుంది. సూర్యుడు ఉదయించినప్పుడు మేము చవిచూడనున్న అనుభవాలను కొద్దిగా రుచిచూశాం. మేము మునుపెన్నడూ అంత వేడిని చవిచూడలేదు! బల్లారాట్‌లో మాతోపాటు పయినీరింగు చేసిన లింటన్‌, జెన్ని డోవర్‌ అనే మిషనరీ దంపతులు మమ్మల్ని ఆహ్వానించారు. వారు మమ్మల్ని ఇండియా బెతెల్‌ గృహానికి తీసుకువెళ్ళారు, నగర కేంద్రానికి దగ్గర్లో ఉన్న ఆ గృహం ఇరుకుగా ఉన్న గదులతో పైఅంతస్థులో ఉంది. ఆ గృహంలో ఆరుగురు బెతెల్‌ స్వచ్ఛంద సభ్యులు నివసిస్తున్నారు. ఇండియాలో 1926 నుండి మిషనరీగా సేవచేసిన సహోదరుడు ఎడ్విన్‌ స్కిన్నర్‌, మా నియామకానికి వెళ్ళేముందు రెండు హోల్డాల్‌లు కొనుక్కోమని మాకు సలహా ఇచ్చాడు. దానికి హోల్డాల్‌ అనే పేరు సరైనది ఎందుకంటే ప్రయాణీకులు దానిలో అన్నిరకాల వస్తువులను తీసుకువెళ్ళేవారు. అవి భారతీయ రైళ్ళలో ఎక్కువగా కనిపించేవి, మా తర్వాతి ప్రయాణాల్లో అవి ఎంతో ఉపయోగపడ్డాయి.

మేము రెండు రోజుల రైలు ప్రయాణం చేసిన తర్వాత మా నియామకమైన తిరుచిరాపల్లికి చేరుకున్నాం, ఆ నగరం దక్షిణాన ఉన్న మద్రాసు (ఇప్పుడు తమిళనాడు) రాష్ట్రంలో ఉంది. అక్కడ మేము, 2,50,000 మందిజనాభాకు సాక్ష్యమిస్తున్న ముగ్గురు భారతీయ ప్రత్యేక పయినీర్లతో కలిసి పనిచేశాం. జీవన పరిస్థితులు నిరాడంబరంగా ఉండేవి. ఒకసారి మా దగ్గర $4 (యు. ఎస్‌.) కన్నా తక్కువ డబ్బు ఉంది. అయితే ఆ డబ్బు ఖర్చైపోయినప్పుడు యెహోవా మమ్మల్ని విడిచిపెట్టలేదు. మాతో బైబిలు అధ్యయనం చేస్తున్న ఒక వ్యక్తి కూటాలను నిర్వహించేందుకు సరైన గృహాన్ని అద్దెకు తీసుకోవడానికి డబ్బు అప్పుగా ఇచ్చాడు. ఒకసారి మాకు ఆహారకొరత ఏర్పడినప్పుడు, పొరుగింటాయన వాళ్ళింట్లో చేసిన కొంత కూరను మా కోసం దయతో తీసుకువచ్చాడు. నేను ఆ కూరను ఇష్టపడ్డాను, కానీ దానిలో మసాలా ఎంత ఎక్కువగా ఉందంటే దాన్ని తినగానే నాకు వెక్కిళ్ళు వచ్చేశాయి!

క్షేత్ర పరిచర్యలో

తిరుచిరాపల్లిలో కొంతమంది ఇంగ్లీషులో మాట్లాడినా, చాలామంది తమిళంలోనే మాట్లాడేవారు. కాబట్టి క్షేత్రసేవలో ఉపయోగించేందుకు ఆ భాషలో ఒక సరళమైన ప్రతిపాదనను నేర్చుకోవడానికి మేము చాలా కృషిచేశాం. అలా కృషిచేయడం చాలామంది స్థానికుల గౌరవాన్ని చూరగొంది.

మేము ఇంటింటి పరిచర్యను ఎంతో ఆనందించాం. అతిథులను ఆదరించడం భారతీయుల నైజం, చాలామంది మమ్మల్ని లోనికి ఆహ్వానించి ఫలహారాలు ఇచ్చేవారు. ఉష్ణోగ్రత సాధారణంగా 40 డిగ్రీల సెల్సియస్‌ ఉండేది కాబట్టి వారి ఆతిథ్యాన్ని మేము కృతజ్ఞతతో స్వీకరించేవారం. మేము మా సందేశాన్ని చెప్పేముందు వ్యక్తిగత విషయాలను చర్చించడం అక్కడి మర్యాద. “మీరు ఎక్కడనుండి వచ్చారు? మీకు పిల్లలున్నారా? ఎందుకు లేరు?” వంటి ప్రశ్నలను గృహస్థులు తరచూ నన్నూ, నా భార్యనూ అడిగేవారు. మాకు పిల్లలు లేరని తెలుసుకున్నప్పుడు మంచి వైద్యునికి చూపిస్తామని వారు సాధారణంగా చెప్పేవారు! అయినా, ఆ సంభాషణలు మమ్మల్ని మేము పరిచయం చేసుకోవడానికి, మేము చేస్తున్న బైబిలు ఆధారిత పనికున్న ప్రాముఖ్యతను వివరించడానికి అవకాశాన్నిచ్చేవి.

మేము సాక్ష్యమిచ్చినవారిలో చాలామంది హిందూ మతస్థులు, ఆ మత నమ్మకాలు క్రైస్తవత్వానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. హిందూ తత్త్వజ్ఞానంలో ఉన్న సంక్లిష్టమైన విషయాల గురించి వాదించే బదులు కేవలం దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించి మేము మంచి ఫలితాలను సాధించాం. ఆరు నెలల్లోనే దాదాపు 20 మంది మా మిషనరీ గృహంలో జరిగే కూటాలకు హాజరుకావడం మొదలుపెట్టారు. వారిలో నల్లతంబి అనే సివిల్‌ ఇంజినీర్‌ ఉండేవాడు. ఆయన, ఆయన కుమారుడు విజయాలయన్‌ ఆ తర్వాత దాదాపు 50 మంది యెహోవా సేవకులయ్యేందుకు సహాయం చేశారు. విజయాలయన్‌ కొద్దికాలం ఇండియా బ్రాంచిలో కూడా సేవచేశాడు.

ఎల్లప్పుడూ ప్రయాణాలు చేస్తుండడం

మేము ఇండియాకు వచ్చి ఆరు నెలలు తిరక్కుండానే ఆ దేశంలో మొదటి పర్మనెంటు జిల్లా పైవిచారణకర్తగా సేవచేయడానికి ఆహ్వానించబడ్డాను. ఆ నియామకంలో భాగంగా మేము ఇండియా అంతటా ప్రయాణించి, సమావేశాలను వ్యవస్థీకరించి తొమ్మిది భాషా గుంపులతో పనిచేయాల్సివచ్చింది. అది ఎంతో కష్టమైన పని. మేము ఆరు నెలలకు సరిపడే బట్టలను, పరికరాలను మూడు తగరంతో చేసిన ట్రంకుల్లో, ఎంతో ఉపయోగకరమైన మా హోల్డాల్లలో సర్దుకొని మద్రాసు నగరం (ఇప్పుడు చెన్నై) నుండి ట్రైన్‌లో ప్రయాణమయ్యాం. మా జిల్లా క్షేత్ర పరిధి దాదాపు 6,500 కిలోమీటర్లు కాబట్టి మేము ఎప్పుడూ ప్రయాణం చేయాల్సివచ్చేది. ఒక సందర్భంలో మేము దక్షిణాన ఉన్న బెంగుళూరు నగరంలో ఆదివారం సమావేశాన్ని ముగించుకున్నాం. ఆ తర్వాత, హిమాలయ పర్వతానికి దిగువన ఉన్న డార్జిలింగ్‌లో తర్వాతి వారంలో జరిగే మరో సమావేశంలో సేవచేయడానికి మేము ఉత్తరంవైపుకు ప్రయాణించాం. డార్జిలింగ్‌కు చేరుకోవాలంటే దాదాపు 2,700 కిలోమీటర్లు ప్రయాణించాలి, మార్గంలో ఐదు ట్రైన్‌లు మారాలి.

మా తొలి ప్రయాణాల్లో కార్యనిర్వహణలోనున్న నూతనలోక సంస్థ (ఆంగ్లం) అనే చిత్రాన్ని ప్రదర్శించడంలో మేము ఆనందించాం. ఈ చిత్రం ద్వారా ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా యెహోవా సేవకుల పని పరిధిని, కార్యకలాపాలను తెలుసుకోగలిగారు. సాధారణంగా, వందలాదిమంది ఈ ప్రదర్శనలకు హాజరయ్యేవారు. ఒక సందర్భంలో, మేము ఈ చిత్రాన్ని రోడ్డు ప్రక్కన గుమికూడిన ఒక గుంపుకు ప్రదర్శించాం. చిత్రం నడుస్తున్నప్పుడు మేఘాలు కమ్మి భయపెట్టే రీతిలో మా వైపు వచ్చాయి. ఒకసారి చిత్రాన్ని మధ్యలో ఆపేసినందుకు ఒక గుంపు నిరసనను ప్రదర్శించారు కాబట్టి నేను చిత్ర ప్రదర్శనను కొనసాగించాలనుకున్నాను, అయితే దానిని త్వరత్వరగా చూపించాలనుకున్నాను. సంతోషకరంగా, ఎలాంటి అంతరాయమూ లేకుండా ఆ చిత్ర ప్రదర్శన ముగిసింది, ఆ తర్వాత చినుకులు పడడం మొదలైంది.

ఆ తర్వాతి సంవత్సరాల్లో మెలొడీ, నేను ఇండియాలోని అనేక ప్రాంతాలకు ప్రయాణం చేశాం. ఆహారం, దుస్తులు, భాష, ప్రకృతి దృశ్యాలు, ప్రతీ ప్రాంతంలో వేర్వేరుగా ఉండేవి కాబట్టి మేము ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్తున్నట్లు అనిపించేది. యెహోవా సృష్టిలో ఎంత అద్భుతమైన వైవిధ్యం ఉందో కదా! ఇండియాలో వన్యప్రాణుల విషయంలో కూడా వైవిధ్యం ఉంది. మేము ఒకసారి నేపాల్‌ అడవుల్లో విడిది చేసినప్పుడు ఒక పెద్ద పులిని దగ్గరినుండి చూడగలిగాం. అది ఒక అద్భుతమైన జంతువు. దాన్ని చూసిన తర్వాత మానవులు, జంతువుల మధ్య చివరకు శాంతి నెలకొనివుండే పరదైసులో జీవించాలనే మా కోరిక బలోపేతమైంది.

సంస్థాగత ప్రగతి

ఆ రోజుల్లో ఇండియాలోని సహోదరులు, యెహోవా సంస్థాగత ఏర్పాట్లకు అనుగుణంగా తమ జీవితాల్లో మార్పులు చేసుకోవాల్సివచ్చింది. కొన్ని సంఘాల్లో కూటం జరిగే స్థలంలో పురుషులు ఒకవైపు కూర్చుంటే, స్త్రీలు మరోవైపు కూర్చొనేవారు. కూటాలు అరుదుగా సమయానికి ప్రారంభమయ్యేవి. ఒక స్థలంలోనైతే పెద్ద గంట రాజ్య ప్రచారకులను కూటాలకు సమావేశపరిచేది. ఇతర ప్రాంతాల్లో ప్రచారకులు, ఆకాశంలో సూర్యుడు ఒక నిర్దిష్ట స్థానానికి వచ్చిన తర్వాత కూటాలకు వచ్చేవారు. సమావేశాలు, ప్రయాణ పైవిచారణకర్తల సందర్శనాలు క్రమంగా జరిగేవి కావు. సహోదరులు సరైనది చేయడానికి ఇష్టపడేవారు, కానీ వారికి శిక్షణ అవసరం.

1959లో యెహోవా సంస్థ రాజ్య పరిచర్య పాఠశాలను ప్రారంభించింది. ప్రాంతీయ పైవిచారణకర్తలు, ప్రత్యేక పయినీర్లు, మిషనరీలు, సంఘ పెద్దలు తమ లేఖనాధార బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఈ ప్రపంచవ్యాప్త శిక్షణా కార్యక్రమం సహాయం చేసింది. ఈ పాఠశాల ఇండియాలో 1961 డిసెంబరులో ప్రారంభమైనప్పుడు నేను తరగతి ఉపదేశకునిగా పనిచేశాను. క్రమంగా ఆ శిక్షణ ఫలితాల నుండి దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు లబ్ది పొంది వేగంగా ప్రగతి సాధించాయి. ఒకసారి సహోదరులకు సరైనది తెలిసినప్పుడు దానిని చేయడానికి దేవుని ఆత్మ వారిని పురికొల్పింది.

పెద్ద సమావేశాలు కూడా సహోదరులను ప్రోత్సహించి ఐక్యం చేశాయి. ఈ సమావేశాల్లో గమనార్హమైనది 1963వ సంవత్సరంలో, న్యూఢిల్లీలో నిర్వహించబడిన “నిత్య సువార్త” అనే అంతర్జాతీయ సమావేశం. ఆ సమావేశానికి హాజరుకావడానికి ఇండియాలోని వివిధ ప్రాంతాల నుండి సాక్షులు వేలాది కిలోమీటర్లు ప్రయాణంచేసి వచ్చారు, అలా రావడానికి చాలామంది తాము కూడబెట్టుకున్న డబ్బునంతటినీ ఖర్చుచేశారు. 27 దేశాల నుండి 583 మంది ప్రతినిధులు ఆ సమావేశానికి వచ్చారు కాబట్టి, పెద్ద సంఖ్యలో ఇతర దేశాల నుండి వచ్చిన సహోదరులను కలుసుకొని వారితో సహవసించే అవకాశం స్థానిక సాక్షులకు మొదటిసారి దొరికింది.

1961లో మెలొడీ, నేను బొంబాయిలో ఉన్న బెతెల్‌ కుటుంబంలో సభ్యులయ్యేందుకు ఆహ్వానించబడ్డాం, కొంతకాలం తర్వాత నేను అక్కడ బ్రాంచి కమిటీ సభ్యునిగా పనిచేశాను. నేను ఇతర నియామకాలను కూడా పొందాను. నేను ఎన్నో సంవత్సరాలు ఆసియా, మధ్య ప్రాచ్య దేశాలన్నిటిలో జోన్‌ పైవిచారణకర్తగా పనిచేశాను. ఆ ప్రాంతంలో ఉన్న అనేక దేశాల్లో ప్రకటనా పనిమీద నిషేధం ఉండేది కాబట్టి ఆ దేశాల ప్రచారకులు “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై” ఉండాల్సివచ్చింది.​—⁠మత్తయి 10:​16.

విస్తరణ, మార్పులు

1959లో మేము మొదటిసారి ఇండియాకు వచ్చినప్పుడు ఆ దేశంలో 1,514 మంది క్రియాశీల ప్రచారకులున్నారు. నేడు ఆ సంఖ్య 24,000కు పెరిగింది. ఆ అభివృద్ధికి అనుగుణంగా మేము రెండుసార్లు, బొంబాయిలో గానీ బొంబాయికి దగ్గర్లో గానీ ఉన్న క్రొత్త బెతెల్‌ సముదాయాల్లోకి బెతెల్‌ను మార్చాల్సివచ్చింది. ఆ తర్వాత 2002 మార్చిలో బెతెల్‌ కుటుంబం మళ్ళీ క్రొత్త బెతెల్‌ సముదాయంలోకి మారింది, ఈ సారి దక్షిణ భారతదేశంలో బెంగుళూరుకు దగ్గర్లో నిర్మించబడిన క్రొత్త సముదాయంలోకి మారింది. ఆధునిక సదుపాయాలున్న ఈ ప్రాంగణంలో 240 మంది బెతెల్‌ సభ్యులున్నారు, ప్రస్తుతం వారిలో కొందరు 20 భాషల్లోకి బైబిలు సాహిత్యాన్ని అనువదిస్తున్నారు.

మెలొడీ, నేను బెంగుళూరుకు వెళ్ళాలని ఉత్సాహంగా ఎదురుచూసినా అనారోగ్య కారణాలవల్ల మేము 1999లో ఆస్ట్రేలియాకు తిరిగిరావాల్సివచ్చింది. మేము ఇప్పుడు సిడ్నీలో బెతెల్‌ కుటుంబ సభ్యులుగా సేవచేస్తున్నాం. మేము ఇండియాను విడిచిపెట్టినా ఆ దేశంలోని మా ప్రియ స్నేహితులపట్ల, ఆధ్యాత్మిక పిల్లలపట్ల మాకున్న ప్రేమ బలంగానే ఉంది. వారి నుండి ఉత్తరాలను అందుకోవడం ఎంత ఆనందాన్నిస్తోందో!

మా 50 సంవత్సరాల పూర్తికాల సేవను మేము సింహావలోకనం చేసుకుంటే, మేము మెండుగా ఆశీర్వదించబడ్డామని మెలొడీకీ నాకూ అనిపిస్తుంది. ఒకప్పుడు, మేము ఫోటోగ్రాఫిక్‌ కాగితం మీద ప్రజల చిత్రాలను భద్రపరిచేందుకు పనిచేసేవాళ్ళం, కానీ దేవుని జ్ఞాపకంలో ప్రజలను సజీవంగా భద్రపరిచేందుకు కృషిచేయాలనుకోవడం ఇంకా చక్కని నిర్ణయం. జీవితంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వాలని మేము తీసుకున్న నిర్ణయం కారణంగా మేము ఎంత చక్కని అనుభవాలను చవిచూశామో! అవును, దేవుని దృష్టిలో సరైనది చేయడం నిజంగా సంతోషానికి దోహదపడుతుంది!

[15వ పేజీలోని మ్యాపులు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఇండియా

న్యూఢిల్లీ

డార్జిలింగ్‌

ముంబయి (బొంబాయి)

బెంగుళూరు

మద్రాసు (చెన్నై)

తిరుచిరాపల్లి

[13వ పేజీలోని చిత్రాలు]

1942లో హేడెన్‌, మెలొడీ

[16వ పేజీలోని చిత్రం]

ఇండియాలోని బెతెల్‌ కుటుంబం, 1975లో