కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండండి!

అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండండి!

అబద్ధ ఆరాధనకు దూరంగా ఉండండి!

“మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు.”​—⁠2 కొరింథీయులు 6:18.

నిష్కపటులైన అనేకమందికి దేవుని గురించిన సత్యం గానీ, మానవాళి భవిష్యత్తు గురించి గానీ తెలియదు. వారి ప్రగాఢమైన ఆధ్యాత్మిక చింతనకు జవాబు దొరకని కారణంగా, వారు గలిబిలితో అనిశ్చిత స్థితిలో జీవిస్తున్నారు. మన సృష్టికర్త మనస్సు నొప్పించే మూఢనమ్మకాలకు, మతకర్మలకు, ఆచరణలకు కోట్లాదిమంది బానిసలుగా ఉన్నారు. నరకాగ్నిని, త్రిత్వ దేవుణ్ణి, ఆత్మ అమర్త్యతను లేదా మరితర అబద్ధబోధలను నమ్ముతున్న పొరుగువారు, బంధువులు బహుశా మీకుండవచ్చు.

2 ఈ విస్తారమైన ఆధ్యాత్మిక అంధకారానికి ఎవరు బాధ్యులు? ఆశ్చర్యకరంగా, మతమే దానికి బాధ్యురాలు అని చెప్పాలి​—⁠ప్రత్యేకంగా దేవుని తలంపులకు భిన్నమైన ఆలోచనలు బోధిస్తున్న మత సంస్థలు, మత నాయకులే బాధ్యత వహించాలి. (మార్కు 7:​7, 8) ఫలితంగా, చాలామంది తాము సత్యదేవుని ఆరాధిస్తున్నామని నమ్మేలా మోసగించబడుతున్నారు, అయితే వాస్తవానికి వారు ఆయన మనసు నొప్పిస్తున్నారు. ఈ శోచనీయ పరిస్థితికి నేరుగా అబద్ధమతానిదే బాధ్యత.

3 అబద్ధమతం వెనక ఒక అదృశ్య వ్యక్తి ఉన్నాడు. అతణ్ణి సూచిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను.” (2 కొరింథీయులు 4:⁠4) ఆ “యుగ సంబంధమైన దేవత” మరెవరో కాదు అపవాదియైన సాతానే. అతడే అబద్ధారాధనకు ప్రధాన సూత్రధారి. “సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు.” (2 కొరింథీయులు 11:​14, 15) సాతాను చెడు విషయాలను మంచి విషయాలుగా కనిపించేలా చేస్తూ, ప్రజలు అబద్ధాల్ని నమ్మేలా మోసగిస్తున్నాడు.

4 కాబట్టి అబద్ధారాధనను బైబిలు తీవ్రంగా ఖండించడంలో ఆశ్చర్యం లేదు! ఉదాహరణకు, అబద్ధ ప్రవక్తల విషయంలో మోషే ధర్మశాస్త్రం దేవుడు ఎంచుకున్న ప్రజలను ప్రత్యేకంగా హెచ్చరించింది. అబద్ధ బోధలను, అబద్ధ దేవతారాధనను పురికొల్పే ఎవరికైనా సరే ‘యెహోవాపై తిరుగుబాటును ప్రేరేపించినందుకు మరణశిక్ష’ విధించబడాలి. ‘తమ మధ్యనుండి ఆ చెడుతనాన్ని పరిహరించాలని’ ఇశ్రాయేలీయులు ఆజ్ఞాపించబడ్డారు. (ద్వితీయోపదేశకాండము 13:​1-5) అవును, అబద్ధమతాన్ని యెహోవా చెడుతనంగా దృష్టిస్తున్నాడు.​—⁠యెహెజ్కేలు 13:3.

5 అబద్ధమతం విషయంలో యెహోవాకున్న తీవ్రమైన భావాలనే యేసుక్రీస్తు, ఆయన అపొస్తలులు కూడా వ్యక్తపరిచారు. యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “అబద్ధ ప్రవక్తలనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు గొఱ్ఱెల చర్మములు వేసికొని మీయొద్దకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు.” (మత్తయి 7:15; మార్కు 13:​22, 23) “సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది” అని పౌలు వ్రాశాడు. (రోమీయులు 1:​18) నిజ క్రైస్తవులు ఈ హెచ్చరికలను లక్ష్యపెట్టి దేవుని వాక్య సత్యాన్ని అడ్డగించే లేదా అబద్ధ బోధలను వ్యాప్తిచేసే వారికి దూరంగా ఉండడం ఎంత ప్రాముఖ్యమో కదా!​—⁠1 యోహాను 4:1.

“మహా బబులోను”కు దూరంగా పారిపోండి

6 అబద్ధమతాన్ని బైబిలు పుస్తకమైన ప్రకటన ఎలా వర్ణిస్తోందో పరిశీలించండి. అది అనేక రాజ్యాలపై, వాటి ప్రజలపై అధికారమున్న, మత్తిల్లిన వేశ్యగా వర్ణించబడింది. ఈ అలంకారార్థ స్త్రీ అనేకమంది రాజులతో వ్యభిచరిస్తూ, దేవుని సత్యారాధకుల రక్తంతో మత్తిల్లింది. (ప్రకటన 17:1, 2, 6, 18) దాని అసహ్యమైన, జుగుప్సాకరమైన ప్రవర్తనకు సరిపడే పేరు దాని నొసటిపై వ్రాయబడింది. ఆ పేరు “వేశ్యలకును భూమిలోని ఏహ్యమైనవాటికిని తల్లియైన మహా బబులోను.”​—⁠ప్రకటన 17:⁠5.

7 మహా బబులోనుకు సంబంధించిన లేఖనాధారిత వర్ణన ప్రపంచంలోని అబద్ధమతాలన్నింటినీ సూచిస్తోంది. వేలాది మతాలు అధికారికంగా ఒకే ప్రపంచ సంస్థగా ఐక్యమవకపోయినా, అవి వాటి ఉద్దేశాల్లో క్రియల్లో విడదీయరానంతగా కలిసిపోయాయి. ప్రకటనలో వర్ణించబడిన దుర్నీతిని జరిగించే స్త్రీలాగే, అబద్ధమతం ప్రభుత్వాలపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తోంది. వివాహ ప్రమాణాలకు నమ్మకంగా కట్టుబడని స్త్రీలా, అబద్ధమతం అనేక రాజకీయ ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా వ్యభిచారానికి పాల్పడింది. “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు.​—⁠యాకోబు 4:4.

8 అబద్ధమతం ఈ విధంగా ప్రభుత్వాలతో మమేకమవడం మూలంగా మానవాళి ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆఫ్రికా రాజకీయ విశ్లేషకుడైన డా. ఒనేనా మాంగూ ఇలా వ్యాఖ్యానించాడు: “మతం మరియు రాజకీయాల పొత్తువల్ల కలిగిన సామూహిక నరమేధాల అనేక ఉదాహరణలతో ప్రపంచ చరిత్ర నిండిపోయింది.” ఇటీవల ఒక వార్తాపత్రిక ఇలా చెప్పింది: “నేడు జరుగుతున్న విపరీతమైన రక్తపాతం, ప్రమాదకరమైన పోరాటాలు . . . మతంతో ముడిపడివున్నాయి.” మతం మద్దతిచ్చిన పోరాటాల్లోనే కోట్లాదిమంది తమ ప్రాణాలు కోల్పోయారు. మహా బబులోను దేవుని నిజ సేవకులను సహితం హింసించి, చంపి అలంకారార్థపు భావంలో అది వారి రక్తంతో మత్తిల్లింది.​—⁠ప్రకటన 18:24.

9 మహాబబులోనుకు సంభవించే వాటినుండి, అబద్ధారాధనను యెహోవా అసహ్యించుకుంటున్నాడని స్పష్టంగా చూడవచ్చు. ప్రకటన 17:⁠16 ఇలా చెబుతోంది: “నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కులేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.” మొదట, ఆ పెద్ద మృగం దాన్ని చీల్చిచెండాడి దాని మాంసాన్ని భక్షిస్తుంది. ఆ తర్వాత, దానిలో ఇంకా మిగిలివున్నది పూర్తిగా కాల్చివేయబడుతుంది. దీనికి అనుగుణంగా త్వరలోనే ప్రపంచ ప్రభుత్వాలు అబద్ధమతంపై అలాంటి చర్యే తీసుకుంటాయి. ఆ చర్య తీసుకునేలా దేవుడే వారికి బుద్ధి పుట్టిస్తాడు. (ప్రకటన 17:​17) ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోనుకు నాశనం ముంచుకొస్తోంది. అది “ఇక ఎన్నటికిని కనబడకపోవును.”​—⁠ప్రకటన 18:21.

10 మహా బబులోను విషయంలో సత్యారాధకులు ఎలాంటి వైఖరి అవలంబించాలి? బైబిలు చాలా స్పష్టంగా ఇలా ఆజ్ఞాపిస్తోంది: “నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి రండి.” (ప్రకటన 18:⁠4) రక్షించబడాలని కోరుకునేవారు ఆలస్యం కాకముందే అబద్ధమతం నుండి బయటకు రావాలి. యేసుక్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, అంత్యదినాల్లో చాలామంది తనను అనుసరిస్తున్నామని కేవలం చెప్పుకుంటారని ముందేచెప్పాడు. (మత్తయి 24:​3-5) అలాంటి వారికి ఆయనిలా చెబుతాడు: “నేను మిమ్మును ఎన్నడును ఎరుగను; అక్రమము చేయు వారలారా, నాయొద్దనుండి పొండి.” (మత్తయి 7:​23) ఇప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించిన రాజైన యేసుక్రీస్తు అబద్ధమతాన్ని పూర్తిగా తిరస్కరించాడు.

దూరంగా ఎలా ఉండవచ్చు?

11 అబద్ధమత బోధలను తిరస్కరిస్తూ, నిజ క్రైస్తవులు అబద్ధారాధనకు దూరంగా ఉంటారు. అంటే రేడియోలో, టీవీలో మత కార్యక్రమాలను వినకుండా, చూడకుండా ఉండడంతోపాటు దేవుని గురించి, ఆయన వాక్యం గురించి అబద్ధాలు వ్యాప్తిచేసే మత సాహిత్యాలను చదవకుండా ఉండడమని అర్థం. (కీర్తన 119:​37) అలాగే అబద్ధారాధనకు సంబంధించిన ఏ మత సంస్థ ఏర్పాటుచేసిన సాంఘిక ఫంక్షన్లలోనైనా, వినోద కార్యక్రమాల్లోనైనా భాగం వహించకుండా ఉండడం కూడా జ్ఞానయుక్తం. అంతేకాక, మనమేవిధంగానూ అబద్ధారాధనకు మద్దతివ్వం. (1 కొరింథీయులు 10:​21) వీటికి దూరంగా ఉండడం, మనల్ని ఎవరైనా ‘క్రీస్తును అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత చెరపట్టుకొని’ పోకుండా కాపాడుతుంది.​—⁠కొలొస్సయులు 2:⁠8.

12 యెహోవాసాక్షిగా మారాలని ఇష్టపడే వ్యక్తి ప్రస్తుతమొక అబద్ధమతానికి చెందిన రిజిస్టరులో పేరున్న సభ్యుడైతే అప్పుడేమిటి? సాధారణంగా, రాజీనామా పత్రం ఇవ్వడం ఆ వ్యక్తి ఆ అబద్ధమత సభ్యునిగా దృష్టించబడేందుకు ఇక ఏ మాత్రం కోరుకోవడం లేదని స్పష్టం చేస్తుంది. ఒక వ్యక్తి అబద్ధారాధనకు సంబంధించిన ప్రతీ విధమైన ఆధ్యాత్మిక కాలుష్యానికి పూర్తిగా దూరంగావుండేందుకు నిర్ణయాత్మక చర్య తీసుకోవడం ప్రత్యేకంగా ప్రాముఖ్యం. సాక్షికాబోయే వ్యక్తి చేపట్టే చర్యలు ఆయన ఆ మతంతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నట్లు ఆ మత సంస్థకు, సాధారణ ప్రజానీకానికీ స్పష్టంగా తెలియాలి.

13 “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? . . . కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైనదానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు” అని పౌలు వ్రాశాడు. (2 కొరింథీయులు 6:​14-18) అబద్ధారాధనకు దూరంగా ఉండడం ద్వారా మనమీ మాటలను లక్ష్యపెడతాం. అబద్ధారాధకులకు కూడా దూరంగా ఉండాలని పౌలు సలహా ఇస్తున్నాడా?

“జ్ఞానము కలిగి నడుచుకొనుడి”

14 అబద్ధారాధనలో పాల్గొనే ప్రజలతో సంబంధాన్ని సత్యారాధకులు పూర్తిగా తెంచుకోవాలా? మన విశ్వాసాన్ని పంచుకోని వారితో సంబంధం లేకుండా మనం పూర్తిగా దూరంగా ఉండాలా? అక్కర్లేదనేదే దానికి జవాబు. ముఖ్యమైన ఆజ్ఞల్లో రెండవది ఇలా చెబుతోంది: “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెను.” (మత్తయి 22:​39) పొరుగువారితో రాజ్య సువార్తను పంచుకున్నప్పుడు, వారిపట్ల మనకున్న ప్రేమను మనం నిశ్చయంగా కనబరుస్తాం. వారితో బైబిలు అధ్యయనం నిర్వహిస్తూ, అబద్ధారాధనకు దూరంగావుండాల్సిన అవసరాన్ని గురించి వారికి వివరించినప్పుడు కూడా వారిపట్ల మనకున్న ప్రేమ స్పష్టమౌతుంది.

15 మనం మన పొరుగువారికి సువార్త ప్రకటించినప్పటికీ, యేసు అనుచరులుగా మనం ‘లోకసంబంధులం’కాము. (యోహాను 15:​19) ఇక్కడ ‘లోకము’ అనే మాట దేవునికి దూరమైన మానవ సమాజాన్ని సూచిస్తోంది. (ఎఫెసీయులు 4:17-19; 1 యోహాను 5:​19) యెహోవాను నొప్పించే దృక్పథాలను, సంభాషణను, ప్రవర్తనను విసర్జిస్తూ మనం లోకానికి వేరుగా ఉంటాం. (1 యోహాను 2:​15-17) అంతేకాక, “దుష్టసాంగత్యము మంచి నడవడిని చెరుపును” అనే సూత్రానికి అనుగుణంగా, క్రైస్తవ ప్రమాణాల ప్రకారం జీవించనివారితో స్నేహం చేయం. (1 కొరింథీయులు 15:​33) లోకసంబంధులు కాకుండా ఉండడమంటే దానర్థం, “ఇహలోకమాలిన్యము” మనకంటకుండా చూసుకోవడమే. (యాకోబు 1:​27) కాబట్టి, లోకానికి వేరుగా ఉండడమంటే, ఇతరులతో ఎలాంటి సంబంధం లేకుండా భౌతికంగా మనల్ని వారినుండి వేరుచేసుకోవడమని కాదు.​—⁠యోహాను 17:15, 16; 1 కొరింథీయులు 5:9, 10.

16 అలాగైతే, బైబిలు సత్యాలు తెలియనివారిని మనమెలా దృష్టించాలి? కొలస్సయి సంఘానికి పౌలు ఇలా వ్రాశాడు: “సమయము పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, సంఘమునకు వెలుపటి వారియెడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసికొనుటకై మీ సంభాషణ ఉప్పువేసినట్టు ఎల్లప్పుడు రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియ్యుడి.” (కొలొస్సయులు 4:​5, 6) అపొస్తలుడైన పేతురు ఇలా వ్రాశాడు: “మీలో ఉన్న నిరీక్షణనుగూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను [‘ప్రగాఢ గౌరవముతోను,’ NW] సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి, మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి.” (1 పేతురు 3:​15) “మనుష్యులందరియెడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెనని” పౌలు క్రైస్తవులకు ఉపదేశించాడు.​—⁠తీతు 3:⁠1.

17 యెహోవాసాక్షులుగా మనం ఇతరులతో కఠినంగా లేక జగడమాడేవారిగా వ్యవహరించం. ఇతర మతాల ప్రజల్ని వర్ణించేందుకు మనం అవమానకరమైన పదజాలం ఉపయోగించం. బదులుగా, గృహస్థులు, పొరుగువారు లేక తోటి ఉద్యోగస్థులు నిర్దయగా వ్యవహరించినా లేక బూతులు మాట్లాడినా మనం ఔచిత్యంతో ప్రవర్తిస్తాం.​—⁠కొలొస్సయులు 4:6; 2 తిమోతి 2:​23-24.

“హితవాక్యప్రమాణమును గైకొనుము”

18 బైబిలు సత్యాలు తెలుసుకున్న తర్వాత, ఒక వ్యక్తి మళ్లీ అబద్ధారాధనవైపుకు తిరగడం ఎంత విషాదకరమో కదా! అలా తిరగడంవల్ల కలిగే విషాదకరమైన పర్యవసానాలను వర్ణిస్తూ బైబిలు ఇలా చెబుతోంది: “వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానముచేత ఈ లోకమాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటిచేత జయింపబడినయెడల, వారి కడవరి స్థితి మొదటి స్థితికంటె మరి చెడ్డదగును. . . . కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్లినట్టును అను నిజమైన సామితె చొప్పున వీరికి సంభవించెను.”​—⁠2 పేతురు 2:20-22.

19 మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడేసే ఏ విషయంలోనైనా సరే మనం జాగరూకులుగా ఉండాలి. అవి నిజమైన ప్రమాదాలు! అపొస్తలుడైన పౌలు ఇలా హెచ్చరిస్తున్నాడు: “కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1 తిమోతి 4:⁠1) మనం “కడవరి దినములలో” జీవిస్తున్నాం. అబద్ధారాధనకు దూరంగా ఉండనివారు “మనుష్యుల మాయోపాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబ[డే]” అవకాశముంది.​—⁠ఎఫెసీయులు 4:13, 14.

20 అబద్ధమత హానికరమైన ప్రభావానికి వ్యతిరేకంగా మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు? యెహోవా ఏర్పాటుచేసిన వాటన్నింటిని పరిశీలించండి. మనకు దేవుని వాక్యమైన బైబిలు ఉంది. (2 తిమోతి 3:​16, 17) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా యెహోవా సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారం కూడా దయచేశాడు. (మత్తయి 24:​45) మనం సత్యంలో ఎదుగుతుండగా ‘వయస్సువచ్చినవారికి తగిన బలమైన ఆహారం’ కోసం అభిరుచిని, ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకునే స్థలానికివెళ్ళాలనే కోరికను పెంపొందించుకోవద్దా? (హెబ్రీయులు 5:13, 14; కీర్తన 26:⁠8) మనం వినిన “హితవాక్యప్రమాణమును గైకొ[న]”గలిగేలా యెహోవా ఏర్పాట్లనుండి పూర్తి ప్రయోజనం పొందాలని తీర్మానించుకుందాం. (2 తిమోతి 1:​13) ఆ విధంగా మనం అబద్ధారాధనకు దూరంగా ఉండగలం.

మీరేమి నేర్చుకున్నారు?

“మహా బబులోను” అంటే ఏమిటి?

అబద్ధమతానికి దూరంగా ఉండడానికి మనమేమి చేయాలి?

మన ఆధ్యాత్మికతకు సంబంధించిన ఎలాంటి ప్రమాదాల నుండి మనం దూరంగా ఉండాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. నిష్కపటులైన చాలామంది ఎలాంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు?

2. మతనాయకులు ఏమిచేశారు, దాని ఫలితమేమిటి?

3. అబద్ధారాధనకు ప్రధాన సూత్రధారి ఎవరు, బైబిల్లో అతను ఎలా వర్ణించబడ్డాడు?

4. ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్రం అబద్ధ ప్రవక్తల గురించి ఏమి చెప్పింది?

5. నేడు మనం ఏ హెచ్చరికలను లక్ష్యపెట్టాలి?

6. బైబిల్లో “మహా బబులోను” ఎలా వర్ణించబడింది?

7, 8. అబద్ధమతం ఎలా వ్యభిచరించింది, ఫలితాలు ఎలావున్నాయి?

9. అబద్ధారాధనపట్ల యెహోవాకున్న ద్వేషం ప్రకటన గ్రంథంలో ఎలా వ్యక్తపరచబడింది?

10. అబద్ధమతం విషయంలో మనం ఎలాంటి వైఖరి అవలంబించాలి?

11. అబద్ధారాధనకు దూరంగా ఉండేందుకు మనమేమి చేయాలి?

12. అబద్ధమత సంస్థలతో ఒక వ్యక్తి తన సభ్యత్వాన్ని ఎలా రద్దు చేసుకోవచ్చు?

13. అబద్ధారాధనకు దూరంగా ఉండడం గురించి బైబిలు ఏమని ఉపదేశిస్తోంది?

14. అబద్ధారాధనలో పాల్గొనేవారికి మనం పూర్తిగా దూరంగా ఉండాలా? వివరించండి.

15. ‘లోకసంబంధులు’ కాకుండా ఉండడమంటే అర్థమేమిటి?

16, 17. బైబిలు సత్యం తెలియనివారితో క్రైస్తవులు ఎలా వ్యవహరించాలి?

18. మళ్లీ అబద్ధారాధనవైపుకు తిరిగేవారు ఎలాంటి ఘోరమైన ఆధ్యాత్మిక పరిస్థితిని ఎదుర్కొంటారు?

19. మన ఆధ్యాత్మికతను ప్రమాదంలో పడేసే ఏ విషయంలోనైనా జాగరూకులుగా ఉండడం ఎందుకు ఆవశ్యకం?

20. అబద్ధమత హానికరమైన ప్రభావానికి వ్యతిరేకంగా మనల్నిమనం ఎలా కాపాడుకోవచ్చు?

[28వ పేజీలోని చిత్రం]

“మహా బబులోను” ఎందుకు దుర్నీతికరమైన స్త్రీగా వర్ణించబడిందో మీకు తెలుసా?

[29వ పేజీలోని చిత్రం]

“మహా బబులోను” నాశనం కానైయుంది

[31వ పేజీలోని చిత్రం]

మన నమ్మకాలను పంచుకోనివారిపట్ల ‘సాత్వికాన్ని ప్రగాఢ గౌరవాన్ని’ ప్రదర్శిస్తాం