కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఏకైక పరిష్కారం!

ఏకైక పరిష్కారం!

ఏకైక పరిష్కారం!

యెరూషలేముకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతనియ పట్టణంలో లాజరు అనే వ్యక్తి, ఆయన సహోదరీలైన మార్త, మరియలు నివసిస్తున్నారు. వారి స్నేహితుడైన యేసు వారికి దూరంగా ఉన్న ఒకరోజు, లాజరుకు తీవ్రంగా జబ్బుచేస్తుంది. ఆయన సహోదరీలు ఆయన గురించి చాలా కలవరపడతారు. వారు యేసుకు వర్తమానం పంపిస్తారు. ఆ వార్త విన్న కొన్నిరోజుల తర్వాత యేసు లాజరును చూడడానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో యేసు తన శిష్యులతో, తాను లాజరును నిద్రనుండి మేల్కొల్పడానికి అక్కడికి వెళ్తున్నానని చెబుతాడు. మొదట్లో శిష్యులు ఆయన మాటల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, అయితే యేసు ఇలా చెప్పడం ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేస్తాడు: “లాజరు చనిపోయెను.”​—⁠యోహాను 11:​1-14.

యేసు లాజరు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దానికి అడ్డుగా పెట్టివున్న రాయిని తొలగించమని మొదట ఆదేశిస్తాడు. ఆయన బిగ్గరగా ప్రార్థించిన తర్వాత “లాజరూ, బయటికి రమ్ము” అని ఆజ్ఞాపిస్తాడు. దానితో లాజరు బయటికి వస్తాడు. నాలుగురోజుల క్రితం మరణించిన వ్యక్తి పునరుత్థానం చేయబడ్డాడు.​—⁠యోహాను 11:​38-44.

లాజరు గురించిన వృత్తాంతం, మరణానికి ఖచ్చితమైన పరిష్కారం పునరుత్థామేనని చూపిస్తోంది. అయితే లాజరు తిరిగి జీవానికి తీసుకురాబడడమనే అద్భుతం నిజంగా సంభవించిందా? అది నిజమేనని బైబిలు పేర్కొంటోంది. యోహాను 11:​1-44లోని వృత్తాంతాన్ని చదవండి, అక్కడ వివరాలు ఎంతో స్పష్టంగా ఉండడాన్ని మీరు గమనిస్తారు. అది సంభవించలేదని మీరు చెప్పగలరా? అలా చెప్పడం, యేసుక్రీస్తు పునరుత్థానంతోపాటు బైబిల్లో నమోదుచేయబడిన అద్భుతాలన్నిటికీ సంబంధించిన సత్యసంధతను అనుమానించేందుకు మీకు కారణాన్ని ఇవ్వవచ్చు. “క్రీస్తు లేపబడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే” అని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 15:​17) పునరుత్థానం లేఖనాధారితమైన ప్రాథమిక బోధ. (హెబ్రీయులు 6:1, 2) అయితే, “పునరుత్థానం” అనే పదానికి అర్థమేమిటి?

“పునరుత్థానం” అంటే ఏమిటి?

క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో “పునరుత్థానం” అనే పదం 40 కన్నా ఎక్కువసార్లు కనిపిస్తుంది. “తిరిగి లేచినిలబడడం” అనే అక్షరార్థ భావంగల గ్రీకు పదం నుండి అది అనువదించబడింది. దాని సమాంతర హీబ్రూ పదానికి “మృతులను పూర్వస్థితికి తీసుకురావడం” అని అర్థం. అయితే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి పునరుత్థానం చేయబడుతుంది? కుళ్ళిపోయి మంటికి చేరే శరీరం పునరుత్థానం చేయబడే అవకాశంలేదు. పునరుత్థానం చేయబడేది అదే శరీరం కాదు గానీ అదే వ్యక్తి. కాబట్టి పునరుత్థానంలో ఒక వ్యక్తి జీవనవిధానం పునరుద్ధరించబడుతుంది, అంటే అతని వ్యక్తిగత లక్షణాలు, అతని వ్యక్తిగత చరిత్ర, అతని గుర్తింపుకు సంబంధించిన వివరాలన్నీ పునరుద్ధరించబడతాయి.

పరిపూర్ణ జ్ఞాపకశక్తిగల యెహోవా దేవునికి మరణించినవారి జీవనవిధానాలను గుర్తుంచుకోవడం సమస్యేకాదు. (యెషయా 40:​26) యెహోవా జీవానికి మూలకర్త కాబట్టి, అదే వ్యక్తిని క్రొత్తగా ఏర్పడిన శరీరంతో పునరుత్థానం చేయడం ఆయనకు సులభమే. (కీర్తన 36:⁠9) అంతేకాక, మృతులను పునరుత్థానం చేయడానికి యెహోవా దేవుడు ‘ఇష్టపడుతున్నాడని,’ అంటే వారిని పునరుత్థానం చేయాలనే ప్రగాఢ ఆకాంక్ష ఆయనకుందని బైబిలు పేర్కొంటోంది. (యోబు 14:​14, 15) ఒక వ్యక్తిని పునరుత్థానం చేసే శక్తితోపాటు అలా చేయాలనే కోరిక కూడా యెహోవాకు ఉన్నందుకు మనం ఎంతగా సంతోషించాలో కదా!

మృతులను పునరుత్థానం చేయడంలో యేసుక్రీస్తు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడు. యేసు తన పరిచర్య ప్రారంభించిన దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఇలా అన్నాడు: “తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.” (యోహాను 5:​21) మృతులను పునరుత్థానం చేసే శక్తితోపాటు అలా చేయాలనే కోరిక కూడా యేసుక్రీస్తుకు ఉందని లాజరు అనుభవం చూపించడంలేదా?

మనం మరణించిన తర్వాత మనలో ఏదో ఒక భాగం ఇంకా సజీవంగా ఉంటుందనే నమ్మకం విషయమేమిటి? వాస్తవానికి, పునరుత్థానం గురించిన బోధకూ మానవ ఆత్మ అమర్త్యమైనదనే నమ్మకానికీ పొంతనలేదు. మనలో ఉన్నది ఏదైనా మరణం తర్వాత సజీవంగా ఉంటే, ఇక పునరుత్థానం చేయబడాల్సిన అవసరమేముంటుంది? లాజరు సహోదరియైన మార్త, తన సహోదరుడు మరణించినప్పుడు ఆయన ఆత్మ సంబంధ లోకంలో జీవనం కొనసాగిస్తున్నాడని నమ్మలేదు. ఆమె పునరుత్థానంలో నమ్మకముంచింది. “నీ సహోదరుడు మరల లేచును” అని యేసు హామీ ఇచ్చినప్పుడు, “అంత్యదినమున పునరుత్థానమందు లేచునని యెరుగుదును” అని మార్త జవాబిచ్చింది. (యోహాను 11:​23, 24) లాజరు తిరిగి బ్రతికించబడినప్పుడు ఆయన మరణానంతర జీవితంలో ఎదురైన ఎలాంటి అనుభవం గురించీ చెప్పలేదు. ఆయన మరణించాడు. “బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు . . . అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు; నీవు పోవు పాతాళమునందు [మానవజాతి సామాన్య సమాధిలో] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” అని బైబిలు చెబుతోంది.​—⁠ప్రసంగి 9:​5, 10.

బైబిలు ప్రకారం, మరణానికి ఏకైక పరిష్కారం పునరుత్థానమే. అయితే మరణించిన అసంఖ్యాకుల్లో ఎవరు పునరుత్థానం చేయబడతారు, ఎక్కడికి పునరుత్థానం చేయబడతారు?

ఎవరు పునరుత్థానం చేయబడతారు?

“ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున [‘జ్ఞాపకార్థ,’ NW]సమాధులలో నున్నవారందరు [యేసు] శబ్దము విని . . . బయటికి వచ్చెదరు” అని యేసు చెప్పాడు. (యోహాను 5:​28, 29) ఈ వాగ్దానం ప్రకారం, జ్ఞాపకార్థ సమాధుల్లో ఉన్నవారు, అంటే యెహోవా జ్ఞాపకంలో ఉన్నవారు పునరుత్థానం చేయబడతారు. అయితే ప్రశ్నేమిటంటే, మరణించినవారందరిలో, దేవుని జ్ఞాపకంలో ఉండి, పునరుత్థానం కోసం నిజంగా వేచివున్నవారు ఎవరు?

బైబిలు పుస్తకమైన హెబ్రీయులు 11వ అధ్యాయంలో, దేవుణ్ణి నమ్మకంగా సేవించిన స్త్రీపురుషుల పేర్లున్నాయి. వారు, వారితోపాటు, ఇటీవలి సంవత్సరాల్లో మరణించిన దేవుని విశ్వసనీయ సేవకులు పునరుత్థానం చేయబడతారు. బహుశా తెలియక దేవుని నీతిసూత్రాలను పాటించనివారి విషయమేమిటి? వారు కూడా దేవుని జ్ఞాపకంలో ఉన్నారా? అలాంటివారు చాలామంది దేవుని జ్ఞాపకంలో ఉన్నారు, ఎందుకంటే బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.”​—⁠అపొస్తలుల కార్యములు 24:​14.

అయితే, పునరుత్థానం చేయబడనివారు కూడా ఉన్నారు. “మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుట . . . ఉండును” అని బైబిలు చెబుతోంది. (హెబ్రీయులు 10:​26, 27) కొందరు క్షమాపణలేని పాపాలు చేశారు. వారు హేడిస్‌లో (మానవజాతి సామాన్య సమాధిలో) లేరు గానీ నిత్యనాశనానికి సూచనార్థక స్థలమైన గెహెన్నాలో ఉన్నారు. (మత్తయి 23:​33) అయితే ఫలానా వ్యక్తి పునరుత్థానం చేయబడతాడా లేదా అనేదాని గురించి ఊహించకుండా మనం జాగ్రత్త వహించాలి. యెహోవాయే ఆ నిర్ణయం తీసుకుంటాడు. హేడిస్‌లో ఎవరున్నారో, గెహెన్నాలో ఎవరున్నారో ఆయనకు తెలుసు. మనకైతే, దేవుని చిత్త ప్రకారం జీవించడం శ్రేయస్కరం.

పరలోకానికి ఎవరు పునరుత్థానం చేయబడతారు?

యేసుక్రీస్తు పునరుత్థానం అత్యంత అసాధారణమైన పునరుత్థానం. ఆయన ‘శరీరవిషయములో చంపబడ్డాడు కానీ ఆత్మవిషయములో బ్రదికింపబడ్డాడు.’ (1 పేతురు 3:​18) ఇంతకుముందు ఏ మానవుడూ అలాంటి పునరుత్థానాన్ని చవిచూడలేదు. యేసు స్వయంగా ఇలా చెప్పాడు: “పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను 3:​13) కాబట్టి, ఆత్మ సంబంధ వ్యక్తిగా పునరుత్థానం చేయబడినవారిలో మనుష్యకుమారుడు మొదటివాడు. (అపొస్తలుల కార్యములు 26:​22) ఆయన తర్వాత వేరే వ్యక్తులు కూడా ఆత్మ సంబంధ వ్యక్తులుగా పునరుత్థానం చేయబడ్డారు. లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.”​—⁠1 కొరింథీయులు 15:​23.

“ఆయనవారు” అంటే క్రీస్తుకు చెందిన ఒక చిన్నగుంపు, ఒక ప్రత్యేక సంకల్పంతో పరలోకానికి పునరుత్థానం చేయబడతారు. (రోమీయులు 6:⁠5) వారు క్రీస్తుతోపాటు “భూలోకమందు ఏలుదురు.” (ప్రకటన 5:​9, 10) అంతేకాక, వారు యాజకులుగా సేవచేస్తారు, అంటే వారు మొదటి మానవుడైన ఆదాము నుండి మానవజాతి వారసత్వంగా పొందిన పాపపు పరిణామాలను తీసివేయడంలో భాగం వహిస్తారు. (రోమీయులు 5:​12) క్రీస్తుతోపాటు రాజులుగా, యాజకులుగా 1,44,000 మంది సేవచేస్తారు. (ప్రకటన 14:​1, 3) వారు పునరుత్థానం చేయబడిన తర్వాత ఎలాంటి శరీరం పొందుతారు? “ఆత్మసంబంధ శరీరము” అని బైబిలు చెబుతోంది. అలా వారు పరలోకంలో జీవించగలుగుతారు.​—⁠1 కొరింథీయులు 15:​35, 38, 42-45.

పరలోక పునరుత్థానం ఎప్పుడు జరుగుతుంది? “క్రీస్తు వచ్చినపుడు” అని 1 కొరింథీయులు 15:​23 జవాబిస్తోంది. క్రీస్తు ప్రత్యక్షత, “యుగసమాప్తి” రెండూ 1914లోనే ప్రారంభమయ్యాయని ఆ సంవత్సరంనుండి సంభవిస్తున్న ప్రపంచ ఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. (మత్తయి 24:​3-7) కాబట్టి నమ్మకస్థులైన క్రైస్తవుల్ని పరలోకంలోకి పునరుత్థానం చేయడం ఇప్పటికే ప్రారంభమైందని నిర్ధారించేందుకు కారణం ఉంది, అయితే, అది మానవులకు అదృశ్యంగా జరుగుతోంది. అపొస్తలులు, తొలిక్రైస్తవులు పరలోక జీవితానికి పునరుత్థానం చేయబడ్డారని దానర్థం. మన కాలంలో మరణించే అభిషిక్త క్రైస్తవులు ఎప్పుడు పునరుత్థానం చేయబడతారు? వారు “రెప్ప పాటున” పునరుత్థానం చేయబడతారు, అంటే వారు మరణించిన వెంటనే పునరుత్థానం చేయబడతారు. (1 కొరింథీయులు 15:​51) ఈ చిన్నగుంపు అయిన 1,44,000 మంది పునరుత్థానం, భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడే అసంఖ్యాకుల పునరుత్థానంకన్నా ముందు జరుగుతుంది కాబట్టి, అది “తొలి పునరుత్థానము,” “మొదటి పునరుత్థానము” అని పిలువబడుతోంది.​—⁠ఫిలిప్పీయులు 3:​10, NW; ప్రకటన 20:⁠6.

భూమ్మీద జీవించడానికి ఎవరు పునరుత్థానం చేయబడతారు?

లేఖనాల ప్రకారం, మృతుల్లో చాలామంది భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడతారు. (కీర్తన 37:29; మత్తయి 6:​9, 10) అపొస్తలుడైన యోహాను, పునరుత్థానం చేయబడినవారి గురించి తాను చూసిన అద్భుతమైన దర్శనాన్ని వర్ణిస్తూ ఇలా వ్రాశాడు: “సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును [“హేడిస్‌,” NW] వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియలచొప్పున తీర్పుపొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.” (ప్రకటన 20:​11-14) హేడిస్‌లో లేక షియోల్‌లో అంటే మానవజాతి సామాన్య సమాధిలో ఉన్నవారు దేవుని జ్ఞాపకంలో ఉన్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరూ మరణపాశం నుండి విడుదలచేయబడతారు. (కీర్తన 16:10; అపొస్తలుల కార్యములు 2:​31) ప్రతి ఒక్కరూ పునరుత్థానం చేయబడిన తర్వాత తాము చేసే క్రియలనుబట్టి తీర్పుతీర్చబడతారు. అప్పుడు మరణానికీ, హేడిస్‌కూ ఏమవుతుంది? అవి “అగ్నిగుండములో” పడవేయబడతాయి. దానర్థం, ఆదాము నుండి వారసత్వంగా పొందిన మరణం మానవులపై ఇక ఎన్నడూ ప్రభావం చూపించదు.

పునరుత్థానం గురించిన వాగ్దానం, తమ ప్రియమైనవారిని మరణంలో కోల్పోయినవారికి ఇచ్చే ఒక సంతోషకరమైన భావినిరీక్షణ గురించి ఒక్కసారి ఆలోచించండి! నాయీనుకు చెందిన విధవరాలు, తన ఒక్కగానొక్క కుమారుణ్ణి యేసు పునరుత్థానం చేసినప్పుడు ఎంతగా ఆనందించివుంటుందో కదా! (లూకా 7:​11-17) యేసు 12 ఏండ్ల బాలికను పునరుత్థానం చేసినప్పుడు ఆమె తల్లిదండ్రులు పొందిన అనుభూతిని గురించి బైబిలు ఇలా చెబుతోంది: “వెంటనే వారు బహుగా విస్మయ మొందిరి.” (మార్కు 5:21-24, 35-42; లూకా 8:​40-42, 49-56) దేవుని వాగ్దాత్త నూతనలోకంలో, మరణించిన మన ప్రియమైనవారిని తిరిగి స్వాగతించడం సంతోషకరంగా ఉంటుంది.

పునరుత్థానం గురించిన సత్యం తెలుసుకోవడం ఇప్పుడు మనపై ఎలాంటి ప్రభావం చూపించగలదు? “చాలామంది మరణం గురించి భయపడి దాని గురించి ఆలోచించకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు” అని ద వరల్డ్‌ బుక్‌ ఎన్‌సైక్లోపీడియా చెబుతోంది. ఎందుకు? ఎందుకంటే చాలామందికి మరణం ఒక మర్మం, అది భయపడాల్సిన ఒక రహస్యం. మృతుల పరిస్థితి గురించిన సత్యాన్ని తెలుసుకొని పునరుత్థాన నిరీక్షణతో ఉండడం, ‘కడపటి శత్రువైన మరణం’ మనకు ముఖాముఖిగా ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండేందుకు సహాయం చేస్తుంది. (1 కొరింథీయులు 15:​26) మరణం మూలంగా ఒక సన్నిహిత స్నేహితుణ్ణి గానీ బంధువును గానీ కోల్పోయినప్పుడు మనం అనుభవించే బాధను సులభంగా భరించడానికి కూడా ఈ జ్ఞానం సహాయం చేస్తుంది.

భూసంబంధ పునరుత్థానం ఎప్పుడు ప్రారంభమౌతుంది? భూమి నేడు దౌర్జన్యం, పోరాటం, రక్తపాతం, కాలుష్యంతో నిండివుంది. ఇలాంటి భూమ్మీదకు మృతులు తిరిగి జీవానికి రావాల్సివస్తే, ఎలాంటి సంతోషమైనా కొద్దికాలమే ఉంటుంది. అయితే సాతాను అధీనంలో ఉన్న ప్రస్తుత లోకాన్ని త్వరలో నాశనం చేస్తానని సృష్టికర్త వాగ్దానం చేశాడు. (సామెతలు 2:21, 22; దానియేలు 2:44; 1 యోహాను 5:​19) భూమిపట్ల దేవుని సంకల్పం త్వరలో నెరవేరనుంది. ఆ తర్వాత, దేవుడు తీసుకువచ్చే శాంతిభరితమైన నూతనలోకంలో, ఇప్పుడు మరణంలో నిద్రిస్తున్న కోట్లాదిమంది తమ కళ్ళు తెరుస్తారు.

[7వ పేజీలోని చిత్రం]

మృతుల్లో చాలామంది భూమ్మీద జీవించడానికి పునరుత్థానం చేయబడతారు