మనకు ప్రయోజనం చేకూర్చే “అలంకార రూపకము”
మనకు ప్రయోజనం చేకూర్చే “అలంకార రూపకము”
కొన్ని లేఖన భాగాల మీద ఇతర లేఖన భాగాల వెలుగు ప్రసరించకపోతే వాటి పూర్తి ప్రాముఖ్యతను గుర్తించడం ఎంత కష్టంగా ఉండేదో కదా! దేవుని వాక్యంలో ఉన్న చారిత్రక కథనాలను లోతుగా ఆలోచించకుండానే చదవవచ్చు. అయితే ఈ వృత్తాంతాల్లోని కొన్నింటిలో వెంటనే అర్థంకాని లోతైన సత్యాలు కూడా ఉన్నాయి. పితరుడైన అబ్రాహాము కుటుంబంలో ఉన్న ఇద్దరు స్త్రీల గురించిన వృత్తాంతం దానికి ఒక ఉదాహరణ. అపొస్తలుడైన పౌలు దానిని “అలంకార రూపకము” అని పిలిచాడు.—గలతీయులు 4:24.
యెహోవా దేవుని ఆశీర్వాదాలను పొందాలని కోరుకొనే వారందరూ ఆ రూపకము సూచిస్తున్న వాస్తవాలను తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం కాబట్టి, మనం దానిపై దృష్టినిలపాలి. అది ఎందుకు అంత ప్రాముఖ్యమో పరిశీలించేముందు, ఆ రూపకానికి ఉన్న ప్రాముఖ్యతను వెల్లడిచేయడానికి పౌలును పురికొల్పిన పరిస్థితులు ఏమిటో మనం పరిశీలిద్దాం.
మొదటి శతాబ్దపు గలతీయలోని క్రైస్తవుల మధ్య ఒక సమస్య తలెత్తింది. మోషే ధర్మశాస్త్రం ఆజ్ఞాపించిన “దినములు, మాసములు, ఉత్సవకాలములు, సంవత్సరములు” వంటివాటిని వారిలో కొందరు ఎంతో ఖచ్చితంగా పాటిస్తున్నారు. విశ్వాసులు దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉండాలని ఆ వ్యక్తులు వాదిస్తున్నారు. (గలతీయులు 4:10; 5:2, 3) అయితే, క్రైస్తవులు అలాంటి ఆచారాలను పాటించాల్సిన అవసరంలేదని పౌలుకు తెలుసు. దానిని నిరూపించడానికి, ఆయన యూదా నేపథ్యానికి చెందిన వారందరికీ పరిచయమున్న ఒక వృత్తాంతాన్ని పేర్కొన్నాడు.
యూదా జనాంగానికి తండ్రియైన అబ్రాహాము, ఇష్మాయేలు ఇస్సాకులను కన్నాడని పౌలు గలతీయులకు గుర్తుచేశాడు. ఇష్మాయేలు, దాసియైన హాగరుకు పుట్టాడు, ఇస్సాకు స్వతంత్రురాలైన శారాకు పుట్టాడు. ప్రారంభంలో శారా గొడ్రాలిగా ఉన్న కారణంగా తన స్థానంలో ఒక పిల్లవాణ్ణి కనేందుకు, తన దాసియైన హాగరును అబ్రహాముకు ఇవ్వడం గురించిన వృత్తాంతం మోషే ధర్మశాస్త్రానికి విధేయులై ఉండాలని బలవంతపెడుతున్న గలతీయులకు ఖచ్చితంగా తెలిసే ఉండవచ్చు. హాగరు గర్భవతియై ఆదికాండము 16:1-4; 17:15-17; 21:1-14; గలతీయులు 4:22, 23.
ఇష్మాయేలు ఆమె గర్భంలో ఉన్నప్పుడు, ఆమె తన యజమానురాలైన శారాను నీచంగా చూడడం మొదలుపెట్టిందని వారికి తెలిసివుండవచ్చు. అయితే దేవుని వాగ్దానం ప్రకారం, శారా చివరకు తన వృద్ధాప్యంలో ఇస్సాకుకు జన్మనిచ్చింది. ఇష్మాయేలు ఇస్సాకుతో చెడుగా వ్యవహరించాడు కాబట్టి, ఆ తర్వాత అబ్రాహాము హాగరును, ఇష్మాయేలును పంపివేశాడు.—ఇద్దరు స్త్రీలు, రెండు నిబంధనలు
ఈ “అలంకార రూపకము”లో ఉన్న పాత్రల గురించి పౌలు వివరించాడు. “ఈ స్త్రీలు రెండు నిబంధనలై యున్నారు, వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కనును; ఇది హాగరు . . . ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతోకూడ దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయియున్నది” అని ఆయన వ్రాశాడు. (గలతీయులు 4:24, 25) హాగరు, యెరూషలేము రాజధానిగాగల అక్షరార్థ ఇశ్రాయేలుకు ప్రతీకగా ఉంది. సీనాయి పర్వతం దగ్గర ప్రారంభించబడిన ధర్మశాస్త్ర నిబంధన ద్వారా యూదా జనాంగం యెహోవాకు బద్ధులయ్యారు. తాము పాపానికి దాసులమని, విముక్తి చేయబడాల్సిన అవసరం తమకుందని ధర్మశాస్త్ర నిబంధన క్రిందవున్న ఇశ్రాయేలీయులకు ఎల్లప్పుడూ గుర్తుచేయబడేది.—యిర్మీయా 31:31, 32; రోమీయులు 7:14-24.
అయితే “స్వతంత్రురాలైన” శారా, ఆమె కుమారుడైన ఇస్సాకు ఎవరికి ప్రతీకగా ఉన్నారు? “గొడ్రాలైన” శారా, దేవుని భార్యకు అంటే, ఆయన సంస్థలోని పరలోక భాగానికి ప్రతీకగా ఉందని పౌలు సూచించాడు. యేసు రాకముందు ఈ పరలోక స్త్రీకి భూమ్మీద ఆత్మాభిషిక్త “పిల్లలు” లేరు కాబట్టి ఆమె గొడ్రాలిగా ఉంది. (గలతీయులు 4:27; యెషయా 54:1-6) అయితే, సా.శ. 33 పెంతెకొస్తునాడు, కొంతమంది స్త్రీపురుషుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది, వారు ఆ పరలోక స్త్రీకి పిల్లలుగా మళ్ళీ జన్మించారు. అలా ఈ సంస్థకు జన్మించిన పిల్లలు దేవుని కుమారులుగా దత్తతు తీసుకోబడి ఒక క్రొత్త నిబంధనా సంబంధం ద్వారా యేసుక్రీస్తు తోటి వారసులుగా తయారయ్యారు. (రోమీయులు 8:15-17) ఆ పిల్లల్లో ఒకరైన అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాయగలిగాడు: “పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి.”—గలతీయులు 4:26.
ఆ స్త్రీ పిల్లలు
బైబిలు వృత్తాంతం ప్రకారం, ఇష్మాయేలు ఇస్సాకును హింసించాడు. అదేవిధంగా, సా.శ. మొదటి శతాబ్దంలో దాసత్వంలో ఉన్న యెరూషలేము పిల్లలు, పైనున్న యెరూషలేము పిల్లలను ఎగతాళి చేసి, హింసించారు. “అప్పుడు శరీరమునుబట్టి పుట్టినవాడు [ఇష్మాయేలు] ఆత్మనుబట్టి పుట్టినవానిని [ఇస్సాకు] ఏలాగు హింసపెట్టెనో యిప్పుడును ఆలాగే జరుగుచున్నది” అని పౌలు వివరించాడు. (గలతీయులు 4:29) హాగరు కుమారుడు ఇష్మాయేలు, అబ్రాహాము నిజ వారసుడైన ఇస్సాకుతో వ్యవహరించినట్లే, యూదా మతనాయకులు యేసుక్రీస్తు భూమ్మీదకు వచ్చి రాజ్యం గురించి ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఆయనతో వ్యవహరించారు. తాము అబ్రాహాము చట్టబద్ధవారసులమని, యేసు చొరబాటుదారుడని భావించి వారు యేసుక్రీస్తును ఎగతాళి చేసి, హింసించారని స్పష్టమవుతుంది.
సహజ ఇశ్రాయేలు పాలకులు తనను చంపడానికి కొద్దికాలంముందు, యేసు ఇలా అన్నాడు: “యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.”—మత్తయి 23:37, 38.
యేసు తోటివారసులుగా ఉండే కుమారులు, హాగరుకు ప్రతీకగా ఉన్న సహజ ఇశ్రాయేలు నుండి వారసత్వం ద్వారా రాలేదని మొదటి శతాబ్దపు ఘటనలకు సంబంధించిన ప్రేరేపిత వృత్తాంతం చూపిస్తోంది. తాము ఆ జనాంగంలో పుట్టిన కారణంగా అలాంటి వారసత్వం పొందే హక్కు తమకుందని గర్వంగా భావించిన యూదులను యెహోవా తిరస్కరించి, వెళ్ళగొట్టాడు. నిజమే, కొందరు సహజ ఇశ్రాయేలీయులు, క్రీస్తు తోటి వారసులయ్యారు. అయితే ఆ ఆధిక్యత యేసుపట్ల వారు చూపించిన విశ్వాసం ఆధారంగానే అనుగ్రహించబడింది గానీ వారి భౌతిక వంశానుసారంగా కాదు.
క్రీస్తు తోటివారసులుగా ఉండే వీరిలోని కొందరి గుర్తింపు, సా.శ. 33 పెంతెకొస్తునాడు స్పష్టమైంది. సమయం గడిచేకొద్ది, యెహోవా ఇతరులను పైనున్న యెరూషలేముకు కుమారులుగా అభిషేకించాడు.
మోషే మధ్యవర్తిగా ఉన్న ధర్మశాస్త్ర నిబంధనకన్నా క్రొత్త నిబంధన ఉన్నతమైనదని ఉదాహరించడానికే పౌలు ఈ “అలంకార రూపకము”ను వివరించాడు. మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన క్రియల ద్వారా దేవుని అనుగ్రహాన్ని ఎవరూ సంపాదించుకోలేరు, ఎందుకంటే మానవులందరూ అపరిపూర్ణులు, అంతేకాక ధర్మశాస్త్రం, వారు పాపపు దాసత్వంలో ఉన్నారని నొక్కిచెప్పింది. అయినా పౌలు వివరించినట్లు, యేసు “ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు” వచ్చాడు. (గలతీయులు 4:4, 5) కాబట్టి, క్రీస్తు బలికున్న విలువపట్ల విశ్వాసముంచడం, ధర్మశాస్త్రం ద్వారా తీర్పుతీర్చబడడం నుండి విముక్తి పొందేలా చేసింది.—గలతీయులు 5:1-6.
మనకు ప్రయోజనం చేకూర్చే రూపకం
పౌలు ప్రేరేపించబడి ఈ రూపకానికి ఇచ్చిన వివరణ విషయంలో మనమెందుకు ఆసక్తి చూపించాలి? ఒక కారణమేమిటంటే, అది అస్పష్టంగా మిగిలివుండే అవకాశం ఉన్న లేఖనాధార అర్థాల విషయంలో మనకు అంతర్దృష్టినిస్తుంది. ఆ వివరణ, బైబిలులోని ఏకత్వం, పొందిక విషయంలో మన నమ్మకాన్ని బలపరుస్తుంది.—1 థెస్సలొనీకయులు 2:13.
అంతేకాక, ఈ రూపకం సూచిస్తున్న వాస్తవాలు భవిష్యత్తులో మన సంతోషానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవుని వాగ్దానం ప్రకారం ‘పుత్రులు’ ప్రత్యక్షం కానట్లయితే పాపమరణాల దాసత్వంలోనికి వెళ్ళడం మాత్రమే మన భావినిరీక్షణగా ఉండేది. అయితే, క్రీస్తు ప్రేమపూర్వక పర్యవేక్షణతోపాటు అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేసిన ఆయన తోటి వారసుల ప్రేమపూర్వక పర్యవేక్షణలో “భూలోకములోని జనములన్నియు . . . ఆశీర్వదించబడును.” (ఆదికాండము 22:18) పాపం, అపరిపూర్ణత, దుఃఖం, మరణ ప్రభావాల నుండి వారు శాశ్వతంగా విడుదల చేయబడినప్పుడు ఇది సంభవిస్తుంది. (యెషయా 25:8, 9) అది ఎంతటి అద్భుతమైన సమయంగా ఉంటుందో కదా!
[11వ పేజీలోని చిత్రం]
ధర్మశాస్త్ర నిబంధన సీనాయి పర్వతం దగ్గర ప్రారంభించబడింది
[చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
[12వ పేజీలోని చిత్రం]
అపొస్తలుడైన పౌలు పేర్కొన్న “అలంకార రూపకము”నకున్న ప్రాముఖ్యత ఏమిటి?