కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోబు గ్రంథంలోని ముఖ్యాంశాలు

యోబు గ్రంథంలోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యోబు గ్రంథంలోని ముఖ్యాంశాలు

పితరుడైన యోబు ఊజు దేశంలో నివసించేవాడు, అదిప్పుడు అరేబియా ప్రాంతంలో ఉంది. ఆ కాలంలో చాలామంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించేవారు. యోబు ఇశ్రాయేలీయుడు కాకపోయినా యెహోవా దేవుని ఆరాధకుడు. ఆయన గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు.” (యోబు 1:⁠8) ఆయన, యాకోబు కుమారుడైన యోసేపు, ప్రవక్తయైన మోషే అనే ఇద్దరు గొప్ప యెహోవా సేవకులు జీవించిన కాలానికి మధ్యకాలంలో జీవించివుండవచ్చు.

యోబు గ్రంథాన్ని వ్రాశాడని భావించబడుతున్న మోషే, ఊజు దేశానికి దగ్గర్లో ఉన్న మిద్యానులో 40 సంవత్సరాలు గడిపినప్పుడు యోబు గురించి తెలుసుకొనివుండవచ్చు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్న 40 సంవత్సరాల చివరిభాగంలో ఊజు దగ్గరికి వచ్చినప్పుడు, యోబు చివరి సంవత్సరాల గురించి మోషే విని ఉండవచ్చు. * యోబు జీవితకథ ఎంత అందంగా కూర్చబడిందంటే అది ఒక సాహిత్య కళాఖండంగా పరిగణించబడుతోంది. అయితే ఆ వృత్తాంతం ఒక సాహిత్య కళాఖండం మాత్రమే కాదు. అది, మంచివారు ఎందుకు కష్టాలనుభవిస్తున్నారు? దుష్టత్వం ఉనికిలో ఉండేందుకు యెహోవా ఎందుకు అనుమతిస్తున్నాడు? అపరిపూర్ణ మానవులు దేవునిపట్ల తమ యథార్థతను కాపాడుకోగలరా? వంటి ప్రశ్నలకు జవాబిస్తుంది. దేవుని ప్రేరేపిత వాక్యంలో భాగంగా ఉన్న యోబు గ్రంథంలోని సందేశం, మన కాలంలో కూడా సజీవముగా, బలముగలదిగా ఉంది.​—⁠హెబ్రీయులు 4:​12.

‘నేను పుట్టిన దినము లేకపోవును గాక’

(యోబు 1:1-3:26)

ఒకరోజు సాతాను, దేవునిపట్ల యోబుకున్న యథార్థతను సవాలుచేస్తాడు. యెహోవా ఆ సవాలును స్వీకరించి, సాతాను యోబుమీద వరుసగా విపత్తులు తీసుకువచ్చి ఆయనకు బాధ కలిగించేందుకు అనుమతిస్తాడు. అయినప్పటికీ యోబు ‘దేవుణ్ణి దూషించడానికి’ నిరాకరిస్తాడు.​—⁠యోబు 2:⁠9.

యోబు ముగ్గురు స్నేహితులు “అతనిని ఓదార్చుటకు” వస్తారు. (యోబు 2:​11) వారు ఒక్క మాటా మాట్లాడకుండా ఆయనతో కూర్చుంటారు, “నేను పుట్టిన దినము లేకపోవును గాక” అని అంటూ యోబు నిశ్శబ్దాన్ని ఛేదించేవరకు వారలా కూర్చునేవుంటారు. (యోబు 3:⁠3) తాను “వెలుగు చూడని బిడ్డలవలె” లేక మృతశిశువుగా ఉండాల్సిందని ఆయన కోరుకుంటాడు.​—⁠యోబు 3:​11, 16.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​4​—⁠యోబు పిల్లలు జన్మదిన వేడుకలను జరుపుకున్నారా? లేదు, వారు జరుపుకోలేదు. ప్రాథమిక భాషలో “దినము,” “జన్మదినము” అనే పదాల కోసం వేర్వేరు పదాలు ఉన్నాయి, ఆ రెండింటికీ వేర్వేరు అర్థాలున్నాయి. (ఆదికాండము 40:​20) యోబు 1:⁠4లో “దినము” అనే పదం ఉపయోగించబడింది, అది సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకుండే కాలవ్యవధిని సూచిస్తుంది. యోబు ఏడుగురు కుమారులు కుటుంబంగా సంవత్సరానికి ఒకసారి చొప్పున ఏడు రోజుల విందును జరుపుకునేవారు. ప్రతీ కుమారుడు తన ‘వంతు చొప్పున’ తన గృహంలో నిర్వహించబడే విందుకు ఆతిథేయిగా వ్యవహరించేవాడు.

1:⁠6; 2:​1​—⁠యెహోవా సన్నిధిలోకి ప్రవేశించడానికి ఎవరు అనుమతించబడ్డారు? యెహోవా సన్నిధిలోకి ప్రవేశించినవారిలో వాక్యమైన దేవుని ఏకైక కుమారుడు, నమ్మకమైన దేవదూతలు, అపవాదియైన సాతానుతోపాటు అవిధేయ ‘దేవదూతలు’ కూడా ఉన్నారు. (యోహాను 1:​1, 18) సాతాను, అతని దయ్యాలు 1914లో దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాతగానీ పరలోకం నుండి పడద్రోయబడలేదు. (ప్రకటన 12:​1-12) యెహోవా వారిని తన సన్నిధిలోకి ప్రవేశించడానికి అనుమతించడం ద్వారా సాతాను సవాలును, అతడు లేవనెత్తిన వివాదాంశాలను ఆత్మ ప్రాణులందరూ తెలుసుకొనేలా చేశాడు.

1:⁠7; 2:​2​—⁠యెహోవా నేరుగా సాతానుతో మాట్లాడాడా? యెహోవా ఆత్మ ప్రాణులతో ఎలా సంభాషిస్తాడనే విషయం గురించి బైబిలు ఎక్కువ వివరాలు ఇవ్వడంలేదు. అయితే మీకాయా ప్రవక్త, ఒక దర్శనంలో దేవదూత యెహోవాతో నేరుగా మాట్లాడడాన్ని చూశాడు. (1 రాజులు 22:​14, 19-23) కాబట్టి, యెహోవా మధ్యవర్తులద్వారా కాక, నేరుగా సాతానుతో మాట్లాడాడని స్పష్టమవుతుంది.

1:​21​—⁠యోబు ఏ విధంగా తన “తల్లిగర్భములోకి” తిరిగివెళ్ళగలడు? యెహోవా దేవుడు మానవుణ్ణి “నేలమంటితో” సృష్టించాడు కాబట్టి, ఇక్కడ “తల్లి” అనే పదం అలంకారార్థంగా నేలను సూచించడానికి ఉపయోగించబడింది.​—⁠ఆదికాండము 2:⁠7.

2:​9​—⁠దేవుణ్ణి దూషించి మరణించమని యోబు భార్య తన భర్తకు చెప్పినప్పుడు ఆమె ఎలాంటి మానసికస్థితిలో ఉండివుండవచ్చు? యోబు భార్య తన భర్త అనుభవించిన నష్టాలనే అనుభవించింది. ఒకప్పుడు ఆరోగ్యంగా ఉన్న తన భర్త ఇప్పుడు అసహ్యమైన వ్యాధితో హీనస్థితికి రావడం ఆమెను బాధించివుండవచ్చు. ఆమె తన ప్రియమైన పిల్లలను కోల్పోయింది. వీటన్నింటినిబట్టి ఆమె ఎంత వ్యాకులతకు గురైవుండవచ్చంటే, దేవునితో తమ సంబంధం అనే అత్యంత ప్రాముఖ్యమైన విషయం గురించి ఆమె ఆలోచించలేదు.

మనకు పాఠాలు:

1:​8-11; 2:​3-5. యోబు విషయంలో రుజువైనట్లుగా, యథార్థంగా ఉండడానికి సరైన చర్యలు, మాటలతోపాటు యెహోవాను సేవించడానికి సరైన ఉద్దేశం కూడా ఉండాలి.

1:​21, 22. అనుకూల పరిస్థితుల్లోనే కాక ప్రతికూల పరిస్థితుల్లో కూడా యెహోవాపట్ల యథార్థంగా ఉండడం ద్వారా మనం సాతానును అబద్ధికుడని నిరూపించవచ్చు.​—⁠సామెతలు 27:​11.

2:​9, 10. మన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు కుటుంబ సభ్యులు విలువివ్వకపోయినా లేక రాజీపడమని గానీ మన విశ్వాసాన్ని విడిచిపెట్టమని గానీ మనమీద ఒత్తిడి తీసుకువచ్చినా యోబులాగే మనమూ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి.

2:​13. యోబు స్నేహితులు దేవుని గురించి, ఆయన వాగ్దానాల గురించి ఓదార్పుకరమైన విషయాలు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే వారిలో ఆధ్యాత్మికత లేదు.

“నేనెంతమాత్రమును యథార్థతను విడువను!”

(యోబు 4:1-31:​40)

యోబు ముగ్గురు స్నేహితులు తమ సంభాషణల్లో వ్యక్తం చేసిన ప్రధానాంశం ఏమిటంటే, యోబు దేవుని నుండి అంతటి తీవ్రమైన శిక్ష పొందడానికి ఆయన ఏదో ఒక పెద్ద తప్పు చేసివుండవచ్చు. మొదట ఎలీఫజు మాట్లాడతాడు. ఎలీఫజు తర్వాత బిల్దదు మరింత వ్యంగ్యమైన భాష ఉపయోగిస్తూ మాట్లాడతాడు. జోఫరు, బిల్దదుకన్నా మరింత వ్యంగ్యంగా మాట్లాడతాడు.

యోబు తనను చూడడానికి వచ్చినవారు చేసిన తప్పుడు తర్కాలను అంగీకరించలేదు. తాను కష్టాలు అనుభవించడానికి దేవుడు ఎందుకు అనుమతించాడో గ్రహించలేక ఆయన తననుతాను సమర్థించుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. అయినా యోబు దేవుణ్ణి ప్రేమించాడు, అందుకే ఆయన ఇలా ప్రకటించాడు: “మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను!”​—⁠యోబు 27:⁠5.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

7:⁠1; 14:​14​—⁠“యుద్ధకాలము” లేక “యుద్ధదినము” అంటే ఏమిటి? యోబు కష్టాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, జీవితం ఎంతో కష్టంగా, శ్రమతోకూడిన యుద్ధంలా ఉందని ఆయన భావించాడు. (యోబు 10:​17, NW అధస్సూచి) ఒక వ్యక్తి షియోల్‌లో గడిపే కాలం, అంటే ఒక వ్యక్తి మరణించడానికీ పునరుత్థానం చేయబడడానికీ మధ్యవున్న కాలం, నిర్బంధిత కాలం కాబట్టి యోబు ఆ కాలాన్ని యుద్ధకాలంతో పోల్చాడు.

7:​9, 10; 10:​21; 16:​22​—⁠యోబు పునరుత్థానాన్ని నమ్మలేదని ఈ వాక్యాలు సూచిస్తున్నాయా? ఈ వాక్యాలు, యోబు సమీప భవిష్యత్తు గురించిన వ్యాఖ్యానాలు. అయితే ఆయన మాటల్లోని భావమేమిటి? తాను మరణించాల్సివస్తే తన సమకాలీనులెవ్వరూ తనను చూడరని ఆయన భావించివుండవచ్చు. వారి దృష్టిలో, దేవుని నిర్ణయకాలంవరకు, ఆయన తన ఇంటికి తిరిగిరాడు లేక ఆయనకు మరే గుర్తింపు ఉండదు. షియోల్‌ నుండి ఎవరూ తమంతటతాము వెనక్కి రాలేరన్నది కూడా యోబు ఉద్దేశమైవుండవచ్చు. యోబు భవిష్యత్తులో జరగబోయే పునరుత్థానంపట్ల విశ్వాసముంచాడని యోబు 14:​13-15 వచనాల నుండి స్పష్టమవుతుంది.

10:​10​—⁠యెహోవా ‘యోబును పాలుపోసినట్లు పోసి, జున్నుగడ్డ పేరబెట్టినట్లు’ ఎలా పేరబెట్టాడు? యోబు తన తల్లి గర్భంలో రూపింపబడిన విధానాన్ని ఇది కావ్యరూపంలో వర్ణిస్తుంది.

19:​20​—⁠“దంతముల అస్థిచర్మము మాత్రము నాకు మిగిలింపబడి యున్నది” అనే వాక్యం చెప్పడంలో యోబు భావమేమిటి? నిజానికి చర్మమనేదే లేకపోయినా, నాకు చర్మము మాత్రమే మిగిలింపబడిందని చెప్పడం ద్వారా యోబు తనకు చివరకు మిగిలింది శూన్యమే అని చెబుతుండవచ్చు.

మనకు పాఠాలు:

4:​7, 8; 8:​5, 6; 11:​13-15. కష్టాల్లో ఉన్న వ్యక్తి, తాను ఏమి విత్తాడో దాన్నే కోస్తున్నాడని, ఆయనపై దేవుని అనుగ్రహంలేదని మనం వెంటనే అనుకోకూడదు.

4:​18, 19; 22:​2, 3. మన సలహా దేవుని వాక్యం మీద ఆధారపడినదై ఉండాలే కానీ వ్యక్తిగత అభిప్రాయం మీద కాదు.​—⁠2 తిమోతి 3:​16.

10:⁠1. తీవ్ర బాధ యోబు దృష్టిని మళ్ళించింది, అందుకే ఆయన తన బాధకుగల ఇతర కారణాల గురించి ఆలోచించలేదు. మనకు కష్టాలు ఎదురైనప్పుడు మనం కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే దానిలో ఇమిడివున్న వివాదాంశాల గురించిన స్పష్టమైన అవగాహన మనకుంది.

14:​7, 13-15; 19:​25; 33:​24. సాతాను మనపైకి ఎలాంటి పరీక్షలు తీసుకువచ్చినా, దానిని ఎదుర్కోవడానికి పునరుత్థాన నిరీక్షణ మనకు బలాన్నిస్తుంది.

16:⁠5; 19:⁠2. మన మాటలు ఇతరులను ప్రోత్సహించి, బలపర్చాలే గానీ వారిని విసిగించకూడదు.​—⁠సామెతలు 18:​21.

22:​5-7. బలమైన రుజువులేని నిందారోపణల ఆధారంగా ఇవ్వబడే సలహా విలువలేనిది, హానికరమైనది.

27:⁠3; 30:​20, 21. యథార్థత కాపాడుకోవడానికి పరిపూర్ణత అవసరం లేదు. యోబు తప్పుగా దేవుణ్ణి విమర్శించాడు.

27:⁠5. యథార్థంగా ఉండాలో లేదో యోబు మాత్రమే నిర్ణయించుకోగలడు ఎందుకంటే యథార్థత అనేది ఒక వ్యక్తికి దేవునిపట్ల ఉన్న ప్రేమమీద ఆధారపడివుంటుంది. కాబట్టి మనం యెహోవాపట్ల బలమైన ప్రేమను వృద్ధిచేసుకోవాలి.

28:​1-28. భూమిలో సంపదలు ఎక్కడున్నాయో మానవునికి తెలుసు. అతడు వాటికోసం అన్వేషిస్తున్నప్పుడు తన చాతుర్యాన్ని ఉపయోగించి దూరదృష్టిగల వేటాడే ఏ పక్షీ చూడలేని భూగర్భ మార్గాల్లోకి వెళ్తాడు. అయితే, యెహోవాపట్ల భయభక్తులు కలిగివుంటే దైవిక జ్ఞానం లభిస్తుంది.

29:​12-15. అవసరంలో ఉన్నవారిపట్ల మనం ఇష్టపూర్వకంగా దయ చూపించాలి.

31:​1, 9-28. సరసాలాడడం, వ్యభిచరించడం, ఇతరులతో అన్యాయంగా, నిర్దయగా వ్యవహరించడం, ఐశ్వర్యాసక్తి, విగ్రహారాధన వంటి విషయాల జోలికి వెళ్ళకుండా ఉండడం ద్వారా యోబు మనకు ఒక మాదిరినుంచాడు.

“ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను”

(యోబు 32:1-42:17)

ఎలీహు అనే యువకుడు, దగ్గర్లో కూర్చొని వారి వాదనలను ఓర్పుతో వింటాడు. ఆయన ఆ తర్వాత ధైర్యంగా మాట్లాడతాడు. ఆయన యోబునూ, ఆయనను బాధపెడుతున్న ముగ్గురినీ సరిచేస్తాడు.

ఎలీహు మాట్లాడడం ముగించిన తర్వాత, యెహోవా సుడిగాలి నుండి జవాబిస్తాడు. యోబు కష్టాలను అనుభవించడానికిగల కారణాన్ని ఆయన వివరించడు. అయితే సర్వశక్తుడు, యోబును వరుసగా ప్రశ్నలు అడగడం ద్వారా తన అసాధారణ శక్తిని, గొప్ప జ్ఞానాన్ని యోబు గ్రహించేలా చేస్తాడు. తాను అవగాహన లేకుండా మాట్లాడానని యోబు ఒప్పుకొని ఇలా అంటాడు: “నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను.” (యోబు 42:⁠6) యోబు పడిన శ్రమలు ముగిసినప్పుడు ఆయన యథార్థతకు ప్రతిఫలం లభిస్తుంది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

32:​1-3​—⁠ఎలీహు ఎప్పుడు వచ్చాడు? ఎలీహు వారి సంభాషణలన్నిటినీ విన్నాడు కాబట్టి, యోబు మాట్లాడడం ప్రారంభించి తన ముగ్గురు స్నేహితుల ఏడు దినాల మౌనానికి భంగంవాటిల్లజేసిన కొద్దిసమయం ముందు ఆయన అక్కడికి వచ్చి వారి సంభాషణలు వినబడేంత దూరంలో కూర్చొనివుండవచ్చు.​—⁠యోబు 3:​1, 2.

34:​7​—⁠యోబు “మంచి నీళ్లవలె తిరస్కారమును పానము చేయు” వ్యక్తిలా ఎలా తయారయ్యాడు? తనను చూడడానికి వచ్చిన ముగ్గురు, వాస్తవానికి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, బాధాకరమైన పరిస్థితిలో ఉన్న యోబు వారి అపహాస్యాన్ని తనమీదే వేసుకునేందుకు ఇష్టపడ్డాడు. (యోబు 42:⁠7) అలా, ఆయన సంతోషంగా నీళ్లను త్రాగే ఒక వ్యక్తిలా తిరస్కారాన్ని పానము చేశాడు.

మనకు పాఠాలు:

32:​8, 9. ఒక వ్యక్తికి వయసు పైబడినంత మాత్రాన అతడు జ్ఞానవంతుడు కాడు. ఒక వ్యక్తి జ్ఞానవంతుడు కావాలంటే అతనికి దేవుని వాక్య అవగాహన, దేవుని ఆత్మ ఇచ్చే మార్గనిర్దేశం అవసరం.

34:​36. మనం ఏదో విధంగా ‘తుదమట్టుకు శోధించబడడం ద్వారా’ మన యథార్థత నిరూపించబడుతుంది.

35:⁠2. ఎలీహు, మాట్లాడేముందు జాగ్రత్తగా విని, అసలైన వివాదాంశాన్ని నిర్దిష్టంగా సూచించాడు. (యోబు 10:7; 16:7; 34:⁠5) క్రైస్తవ పెద్దలు సలహా ఇచ్చేముందు జాగ్రత్తగా విని, వాస్తవాలు తెలుసుకొని, దాని సంబంధిత వివాదాంశాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి.​—⁠సామెతలు 18:​13.

37:​14; 38:​1–39:​30. యెహోవా శక్తికి, జ్ఞానానికి సంబంధించిన వ్యక్తీకరణలైన ఆయన అద్భుతక్రియల గురించి ధ్యానించడం, మనల్ని వినయస్థులను చేసి మన స్వప్రయోజనాలకన్నా ఆయన విశ్వసర్వాధిపత్యం నిరూపించబడడం చాలా ప్రాముఖ్యమని గ్రహించడానికి మనకు సహాయం చేస్తుంది.​—⁠మత్తయి 6:​9, 10.

40:​1-4. సర్వశక్తునికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయాలని మనకు అనిపించినప్పుడు, మనం ‘మన నోటిమీద మన చేతిని’ ఉంచుకోవాలి.

40:​15–41:​34. నీటిగుర్రానికి, మకరానికి ఎంత శక్తి ఉందో కదా! దేవుని సేవలో కొనసాగడానికి, మనల్ని బలపరచే, ఈ శక్తిమంతమైన మృగాలను సృష్టించిన సృష్టికర్త నుండి మనకు కూడా బలం అవసరం.​—⁠ఫిలిప్పీయులు 4:​13.

42:​1-6. యెహోవా వాక్యాన్ని విని, ఆయన శక్తి ప్రదర్శన గురించి గుర్తుచేయబడడం ‘దేవుణ్ణి చూసేందుకు’ లేక ఆయన గురించిన సత్యాన్ని గ్రహించేందుకు యోబుకు సహాయం చేసింది. (యోబు 19:​26) అది ఆయన ఆలోచనను సరిచేసింది. మనం లేఖనానుసారంగా సరిదిద్దబడినప్పుడు మనం మన తప్పును అంగీకరించి, మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి.

“యోబు యొక్క సహనమును” పెంపొందించుకోండి

మానవ కష్టాలకు దేవుడు బాధ్యుడు కాదని యోబు గ్రంథం స్పష్టంగా చూపిస్తుంది. సాతానే దానికి బాధ్యుడు. దేవుడు భూమ్మీద దుష్టత్వాన్ని అనుమతించడం, యెహోవా సర్వాధిపత్యం, మన యథార్థత వంటి వివాదాంశాల విషయంలో మన వైఖరి గురించి వ్యక్తిగతంగా జవాబిచ్చేందుకు మనకు అవకాశాన్ని కల్పిస్తుంది.

యోబులాగే, యెహోవాను ప్రేమించేవారందరూ పరీక్షించబడతారు. మనం సహించగలమనే ధైర్యం యోబు వృత్తాంతం మనకు ఇస్తుంది. మన సమస్యలు శాశ్వతంగా ఉండవని అది మనకు గుర్తుచేస్తుంది. “యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసిన దాన్ని చూశారు” అని యాకోబు 5:​11 (ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) చెబుతోంది. యోబు తన యథార్థతను కాపాడుకున్నందుకు యెహోవా ఆయనను ఆశీర్వదించాడు. (యోబు 42:​10-17) పరదైసు భూమ్మీద నిరంతర జీవితమనే ఎంత గొప్ప నిరీక్షణ మన ముందు ఉందో కదా! యోబులాగే మనం కూడా మన యథార్థత కాపాడుకోవాలనే దృఢనిశ్చయంతో ఉందాం.​—⁠హెబ్రీయులు 11:⁠6.

[అధస్సూచి]

^ పేరా 4 యోబు గ్రంథం, సా.శ.పూ. 1657 నుండి 1473 వరకున్న దాదాపు 140 కన్నా ఎక్కువ సంవత్సరాల మధ్యకాలంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తుంది.

[16వ పేజీలోని చిత్రాలు]

‘యోబు సహనం’ నుండి మనమేమి నేర్చుకోవచ్చు?