కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వేరే భాషా సంఘంలో సేవచేయడం

వేరే భాషా సంఘంలో సేవచేయడం

వేరే భాషా సంఘంలో సేవచేయడం

“అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశమధ్యమున ఎగురుచుండెను” అని అపొస్తలుడైన యోహాను వ్రాశాడు. (ప్రకటన 14:⁠6) ఈ ప్రవచనాత్మక దర్శన నెరవేర్పులో భాగంగా దేవుని రాజ్య సువార్త ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రకటించబడుతోంది. ఆ భాషల్లో అనేక భాషలను, తమ స్వదేశాల నుండి దూరంగా నివసిస్తున్న వలసదార్లు మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తులు కూడా వేరే భాష నేర్చుకున్న ఉత్సాహవంతులైన యెహోవాసాక్షుల నుండి సువార్త వింటున్నారు.

వేరే భాషా సంఘంలో సేవచేస్తున్న సాక్షుల్లో మీరూ ఒకరా? లేక మీరు అలా సేవచేయాలని అనుకుంటున్నారా? మీ ప్రయత్నంలో విజయం సాధించడానికి మీకు నిస్వార్థమైన ప్రేరణ, సరైన మానసిక దృక్పథం అవసరం. దేవుని వాక్య సత్యాన్ని ఇతరులు తెలుసుకునేందుకు సహాయం చేయాలనేదే మీ లక్ష్యం కాబట్టి, దేవునిపట్ల, పొరుగువారిపట్ల ప్రేమ చూపించాలనే అత్యుత్తమ ప్రేరణ మీకుంది. (మత్తయి 22:37-39; 1 కొరింథీయులు 13:⁠1) ఇతర దేశాలవారి లేక సముదాయాలవారి సహవాసాన్ని, ఆహారాన్ని, సంస్కృతిని ఆస్వాదించాలనే కోరికకన్నా, ఇతరులు దేవుణ్ణి తెలుసుకునేందుకు సహాయం చేయాలనే కోరిక అతి బలమైన ప్రేరణగా పనిచేస్తుంది. వేరే భాష నేర్చుకోవడం చాలా కష్టమని మీకు అనిపిస్తోందా? అలాగైతే, సరైన దృక్పథంతో ఉండడం సహాయకరంగా ఉంటుంది. “భాష మిమ్మల్ని భయపెట్టేందుకు అనుమతించకండి” అని జపనీస్‌ నేర్చుకున్న జేమ్స్‌ అంటున్నాడు. మీకన్నా ముందు చాలామంది భాష నేర్చుకోగలిగారని గ్రహించడం పట్టుదలతో ప్రయత్నించడానికీ, ఆశావహ దృక్పథాన్ని కాపాడుకోవడానికీ సహాయం చేస్తుంది. అయితే, మీరు ఒక క్రొత్త భాషను ఎలా నేర్చుకోవచ్చు? ఆ భాష ఉపయోగించబడే సంఘంలో ఇమిడిపోయేందుకు మీకు ఏమి సహాయం చేస్తుంది? మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు ఏమి చేయాలి?

భాష నేర్చుకోవడమనే సవాలును అధిగమించడం

ఒక భాష నేర్చుకోవడానికి అనేక పద్ధతులున్నాయి. నేర్చుకునే, బోధించే పద్ధతులు, విద్యార్థులనుబట్టి, బోధకులనుబట్టి మారుతుంటాయి. అయితే, చాలామంది విద్యార్థులు అర్హుడైన బోధకుడు బోధించే కొన్ని తరగతులకు హాజరవడం ద్వారా భాషను త్వరగా, సులభంగా నేర్చుకోగలుగుతారు. మీరు నేర్చుకునే క్రొత్త భాషలో బైబిలును, బైబిలు ఆధారిత ప్రచురణలను చదవడం, అందుబాటులోవున్న రికార్డింగులను వినడం మీ పదసంపదను, దైవపరిపాలనా పదబంధాలకు సంబంధించిన మీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి సహాయం చేస్తాయి. సరైన అంశాలున్న రేడియో, టీవీ, వీడియో కార్యక్రమాలు కూడా ఆ భాషను, సంస్కృతిని తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తాయి. అధ్యయనానికి కేటాయించాల్సిన సమయం విషయానికొస్తే, అప్పుడప్పుడు ఎక్కువసేపు కూర్చొని కష్టపడి అధ్యయనం చేయడంకన్నా ప్రతీరోజు కొద్దికొద్దిగా అధ్యయనం చేయడం సాధారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒక భాష నేర్చుకోవడం ఈత నేర్చుకోవడం వంటిది. మీరు కేవలం ఒక పుస్తకం చదవడం ద్వారానే ఈత నేర్చుకోలేరు. మీరు నీళ్ళలోకి దిగి కాళ్ళూచేతులూ ఆడించాలి. భాష నేర్చుకోవడం కూడా అంతే. దానిని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే నేర్చుకోవడం కష్టం. మీకు వీలైనప్పుడల్లా ప్రజలతో సంభాషించాలి, అంటే వారు మాట్లాడుతున్నప్పుడు వినాలి, వారితో కలిసిపోవాలి, అంతేగాక వారితో మీరు ఖచ్చితంగా మాట్లాడాలి! వాటినన్నింటినీ చేయడానికి క్రైస్తవ కార్యకలాపాలు సరైన వాతావరణం కల్పిస్తాయి. తరచూ, మీరు నేర్చుకున్నవాటిని వెంటనే క్షేత్ర పరిచర్యలో ఉపయోగించవచ్చు. “అలా చేయడానికి మీకు భయమనిపించవచ్చు కానీ, సాక్షులమైన మనం ఎంతో కృషి చేస్తున్నామని గృహస్థులు చూడగలుగుతారు. మనం చెప్పేది వినడానికి అది వారిని కదిలించవచ్చు. ‘నేను మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను’ అని మనం వారి భాషలో చెబితే చాలు, వారి కళ్ళు మెరుస్తాయి!” అని చైనీస్‌ నేర్చుకుంటున్న మీడోరి చెబుతోంది.

క్రొత్త భాష నేర్చుకోవడానికి క్రైస్తవ కూటాలు కూడా ఎంతో సహాయపడతాయి. ప్రతీ కూటంలో ఒక్క వ్యాఖ్యానమైనా చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడానికి ప్రారంభంలో మీకు ఎంత భయమనిపించినా కలవరపడకండి. మీరు భాష నేర్చుకోవడంలో విజయం సాధించాలని సంఘం కోరుకుంటోంది! కొరియన్‌ భాష నేర్చుకుంటున్న మోనీఫా ఇలా చెబుతోంది: “కూటం జరుగుతున్నప్పుడు నా ప్రక్కన కూర్చొని నా కోసం కొన్ని పదాల అర్థాలను వ్రాసే సహోదరికి నేనెంతో కృతజ్ఞురాలిని. ఆమె ఆప్యాయంగా, ఓర్పుతో ఇస్తున్న మద్దతు నాకు నిజంగా సహాయం చేస్తోంది.” మీ పదసంపద పెరిగేకొద్దీ, మీరు మీ మనసులో ప్రతీ పదాన్ని అనువదించే బదులు ఆ పదాలు వర్ణించేవాటితో నేరుగా వాటిని జతచేయడం ద్వారా ఆ క్రొత్త భాషలో ఆలోచించడం ప్రారంభించవచ్చు.

“స్పష్టమైన మాటలు” పలకడమే భాష నేర్చుకోవడానికి మీ ప్రధాన లక్ష్యంగా ఉండాలి. (1 కొరింథీయులు 14:​8-11) ప్రజలు మీరు చేస్తున్న ప్రయత్నాలను అర్థం చేసుకోవచ్చు, అయితే తప్పులు లేదా భిన్నమైన ఉచ్ఛారణారీతి మీరు అందించే సందేశం వారు వినకుండా చేయవచ్చు. ప్రారంభం నుండే సరైన ఉచ్ఛారణమీద, వ్యాకరణంమీద దృష్టి కేంద్రీకరించినట్లయితే మార్చడానికి కష్టంగా ఉండే చెడు అలవాట్లు మీరు అలవర్చుకోకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది. స్వాహిలీ భాష నేర్చుకున్న మార్క్‌ ఇలా సలహా ఇస్తున్నాడు: “మీరు భాషాపరంగా చేస్తున్న ఘోర తప్పిదాలను సరిదిద్దమని భాషా ప్రావీణ్యంగలవారిని అడగండి, ఆ తర్వాత సరిచేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలపండి!” అలా సహాయం చేస్తున్నవారు మీ కోసం వెచ్చించే సమయం, శక్తి గురించి ఆలోచించండి. మీరు తయారుచేసుకున్న నోట్స్‌ను చూడమని మీరు ఒక వ్యక్తిని అడగవచ్చు, అయితే మీరు మీ ప్రసంగాలను, వ్యాఖ్యానాలను మీకు ఇప్పటికే తెలిసిన పదాలను లేక మీరు చదివిన పదాలను ఉపయోగించి సిద్ధపడడానికి ప్రయత్నించండి. అలా చేయడం మీరు భాషను త్వరగా నేర్చుకునేందుకే కాక, మీరు ఆ భాషలో ధైర్యంగా మాట్లాడేందుకు కూడా సహాయం చేస్తుంది.

ప్రగతి సాధిస్తూనే ఉండండి

“వేరే భాష నేర్చుకోవడం నేను ఇప్పటివరకు ప్రారంభించిన పనుల్లో అతి కష్టమైనది, క్రొత్త భాష నేర్చుకోవడం ఆపేయాలని నేను కొన్నిసార్లు అనుకున్నాను. కానీ బైబిలు విద్యార్థులు నా సరళమైన కొరియన్‌ భాషలో లోతైన ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి ఎంతగా ఇష్టపడతారనే విషయాన్ని, నేను కాస్త ప్రగతి సాధించినా సహోదరులలో కనిపించే ఆనందాన్ని నేను గుర్తుచేసుకుంటాను” అని మోనీఫా చెబుతోంది. విషయమేమిటంటే, అంత సులభంగా పట్టుదల కోల్పోకండి. ప్రాణరక్షక లేఖనాధార సత్యాలను ఇతరులకు బోధించగలగడమే మీ లక్ష్యం. (1 కొరింథీయులు 2:​10) కాబట్టి, బైబిలును ఇతర భాషలో బోధించడాన్ని నేర్చుకోవడానికి ఏకాగ్రతతోపాటు దీర్ఘకాలిక కృషి అవసరం. మీరు ప్రగతి సాధించేకొద్దీ, మీ ప్రగతిని ఇతరుల ప్రగతితో ప్రతికూలంగా పోల్చుకోవడం ద్వారా మీరు సాధించిన ప్రగతిని అంచనావేయకండి. క్రొత్త భాష నేర్చుకుంటున్నవారు వేర్వేరు వేగాలతో, వేర్వేరు విధాలుగా ప్రగతి సాధిస్తారు. అయితే మీరు సాధిస్తున్న ప్రగతి గురించి తెలుసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. (గలతీయులు 6:⁠4) “క్రొత్త భాష నేర్చుకోవడం మెట్లు ఎక్కడం వంటిది, మీరు ప్రగతి సాధించడంలేదని మీకు అనిపించినప్పుడే మీరు భాష నేర్చుకోవడంలో ప్రగతి సాధించినట్లు అకస్మాత్తుగా గుర్తిస్తారు” అని చైనీస్‌ భాష నేర్చుకోవడం ప్రారంభించిన జూన్‌ అంటున్నాడు.

క్రొత్త భాష నేర్చుకోవడం జీవితకాలం కొనసాగే ప్రక్రియ. కాబట్టి క్రొత్త భాష నేర్చుకోవడంలో ఆనందాన్ని పొందండి, పరిపూర్ణతను ఆశించకండి. (కీర్తన 100:⁠2) తప్పులు దొర్లక మానవు. అవి నేర్చుకునే ప్రకియలో ఒక భాగం. ఇటాలియన్‌ భాషలో ప్రకటించడం ప్రారంభించిన ఒక సహోదరుడు, “జీవిత చీపురు ఏమిటో మీకు తెలుసా?” అని గృహస్థుడ్ని అడిగాడు. ఆయన “జీవిత సంకల్పం” ఏమిటి అని అడగాలనుకున్నాడు. పోలిష్‌ భాషను క్రొత్తగా నేర్చుకుంటున్న ఒక సాక్షి పాట పాడదామని చెప్పే బదులు కుక్క పాడదామని సంఘాన్ని ఆహ్వానించాడు. చైనీస్‌ నేర్చుకుంటున్న ఒక వ్యక్తి ఉచ్ఛారణ కొద్దిగా మారిన కారణంగా, యేసు విమోచన క్రయధనంపట్ల విశ్వాసముంచండి అని తన సభికులకు చెప్పడానికి బదులు యేసు పుస్తకాలకేసుపట్ల విశ్వాసముంచమని వారిని ప్రోత్సహించాడు. తప్పులు చేయడంవల్ల ప్రయోజనమేమిటంటే సరైన పదాలను మరచిపోకుండా గుర్తుంచుకోవడానికి అవి మీకు సహాయం చేస్తాయి.

సంఘంతో పనిచేయడం

భాషా భేదాలు మాత్రమే ప్రజలను వేరుచేయవు. సాంస్కృతిక, తెగ, జాతీయ భేదాలు తరచూ ప్రజలను మరింత విభజిస్తాయి. అయితే అవి అధిగమించలేని అడ్డంకులు కావు. యూరప్‌లోని చైనీస్‌ భాషా సంబంధమైన మతగుంపుల మీద అధ్యయనం చేస్తున్న ఒక విద్వాంసుడు, యెహోవాసాక్షులు “జాతీయతా భావాలకు అతీతులు” అని వ్యాఖ్యానించాడు. వారి మధ్య “వర్గ భేదాలు ఉండవు, అంతేగాక భాష, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మాధ్యమం మాత్రమే” అని ఆయన చెప్పాడు. నిజమే, బైబిలు సూత్రాలను అన్వయించుకోవడం ద్వారానే నిజ క్రైస్తవులు జాతీయ భేదాలను అధిగమించగలుగుతారు. ‘నవీన స్వభావాన్ని’ ధరించుకున్నవారికి ‘గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు.’​—⁠కొలొస్సయులు 3:​9-11.

కాబట్టి, సంఘంలోవున్న వారందరూ ఐక్యత కోసం కృషిచేయాలి. అలా కృషిచేయాలంటే ఒక వ్యక్తి, క్రొత్త ఆలోచనా పద్ధతులను, క్రొత్త భావాలను, క్రొత్త కార్యాచరణ పద్ధతులను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. వ్యక్తిగత ఇష్టాలమీద అనవసర దృష్టినిలపకుండా ఉండడం ద్వారా మీరు జాతీయ భేదాలు విభజనలకు దారితీయకుండా నివారించవచ్చు. (1 కొరింథీయులు 1:10; 9:​19-23) సంస్కృతులన్నిటిలోని మంచి విషయాలను ఆస్వాదించడం నేర్చుకోండి. మంచి సంబంధాలకు, నిజమైన ఐక్యతకు నిస్వార్థ ప్రేమ కీలకమని గుర్తుంచుకోండి.

అనేక వేరే భాష సంఘాలు చిన్న గుంపులుగా ప్రారంభమౌతాయి, ఆ సంఘాల్లో తరచూ క్రొత్త భాష నేర్చుకుంటున్నవారు ఎక్కువగా ఉంటారు, వారితోపాటు బైబిలు సూత్రాలను ఇటీవల నేర్చుకోవడం ప్రారంభించిన కొందరు కూడా ఉంటారు. కాబట్టి, అలాంటి గుంపుల్లో, స్థాపిత పెద్ద సంఘాల్లోకన్నా భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పరిణతిచెందిన క్రైస్తవులు సంఘంలో స్థిరపరిచే ప్రభావాన్ని చూపించడానికి కృషి చేయాలి. మాటల్లో, క్రియల్లో ప్రేమను, దయను ప్రదర్శించడం, క్రొత్తవారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి అనువుగా ఉండే ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి సహాయం చేస్తుంది.

వేరే భాషా సంఘానికి సహాయం చేయడానికి ముందుకొచ్చేవారు ఇతరుల నుండి తాము ఆశించే అంశాల విషయంలో కూడా సమతూకాన్ని ప్రదర్శించాలి. అలాంటి ఒక సంఘంలో పెద్దగా ఉన్న రిక్‌ ఇలా వివరిస్తున్నాడు: “సంస్థాగత నైపుణ్యాల్లో స్థానిక భాషా సంఘాల్లోనివారు పొందినంత శిక్షణ, ఈ సంఘాల్లో ఉన్న కొంతమంది క్రొత్త సాక్షులు పొందివుండకపోవచ్చు. అయితే వారిలో సామర్థ్యలేమి ఉన్నా ప్రేమ, ఉత్సాహం అధికంగా ఉంటాయి. ఆసక్తిగలవారు చాలామంది సత్యంలోకి వస్తున్నారు.” మీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం ద్వారా, మీకు సాధ్యమైనది మనస్ఫూర్తిగా చేయడం ద్వారా, మీరు ఇప్పటికీ భాష నేర్చుకుంటున్నా సంఘానికి నిజంగా ప్రయోజనకరంగా ఉండగలరు. ఐక్యంగా పనిచేయడం ద్వారా, సంఘ ఆధ్యాత్మిక ప్రగతికి అందరూ దోహదపడవచ్చు.

ఆధ్యాత్మిక బలాన్ని కాపాడుకోవడం

వేరే భాషను ఉపయోగిస్తున్న సంఘానికి క్రొత్తగా వచ్చిన ఒక సహోదరుడు, వ్యాఖ్యానం సిద్ధపడడంలో ఒక తల్లి తన కుమారునికి సహాయం చేస్తున్నప్పుడు వారి సంభాషణను విన్నాడు. “కానీ మమ్మీ, నా వ్యాఖ్యానాన్ని దీనికన్నా చిన్నదిగా కుదించవచ్చుకదా” అని ఆ పిల్లవాడు అభ్యర్థించాడు. “లేదు, నాన్నా, మనం చిన్న జవాబులను క్రొత్తగా భాష నేర్చుకుంటున్నవారి కోసం వదిలేయాలి” అని ఆ తల్లి జవాబిచ్చింది.

కొన్ని నెలలు లేక సంవత్సరాలు ధారాళంగా మాట్లాడలేకపోవడం ఒక వయోజనుడ్ని మానసికంగా, భావోద్రేకంగానే కాక, ఆధ్యాత్మికంగా కూడా బలహీనపర్చేదిగా ఉండవచ్చు. “నేను నా పరిమితులనుబట్టి త్వరగా మానసిక కృంగుదలకు గురయ్యేదాన్ని” అని ఇప్పుడు స్పానిష్‌ ధారాళంగా మాట్లాడుతున్న జానెట్‌ గుర్తుచేసుకుంటోంది. ఇంగ్లీషు మాట్లాడడం నేర్చుకున్న హిరోకో ఇలా అనుకునేదాన్ని అని గుర్తుచేసుకుంటోంది: ‘ఈ క్షేత్రంలోని కుక్కలు, పిల్లులు కూడా నా కన్నా బాగా ఇంగ్లీషు అర్థం చేసుకోగలవు.’ క్యాథీ ఇలా అంటోంది: “నేను స్పానిష్‌ సంఘానికి వచ్చేముందు అనేక బైబిలు అధ్యయనాలు, పునర్దర్శనాలు నిర్వహించేదాన్ని, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు అధ్యయనాలు, పునర్దర్శనాలు లేవు. నేను ఏమీ చేయడంలేదని నాకనిపించింది.”

ఇలాంటి పరిస్థితుల్లోనే ఆశావహ దృక్పథం చాలా అవసరం. తాను నిరుత్సాహానికి గురైనప్పుడు హిరోకో ఇలా అనుకుంది: “ఇతరులు వేరే భాష నేర్చుకోగలిగినట్లే నేను కూడా నేర్చుకోగలను.” క్యాథీ ఇలా అంటోంది: “చక్కని ప్రగతి సాధిస్తూ సంఘంలో ఎంతో చేస్తున్న నా భార్త గురించి ఆలోచించాను. ఆ అంశాలు నాకు ప్రారంభంలో ఎదురైన కష్టాలను అధిగమించి ప్రగతి సాధించేందుకు సహాయం చేశాయి. నేను ఇప్పటికీ ఎంతో కృషి చేయాల్సివస్తుంది, కానీ నేను క్రమంగా ప్రకటించే, బోధించే సామర్థ్యాన్ని సంపాదించుకుంటున్నాను, అది నాకు సంతోషాన్నిస్తుంది.” ఆమె భర్త జెఫ్‌ ఇలా అంటున్నాడు: “ప్రకటనల్లో, పెద్దల కూటాల్లో చెప్పబడుతున్న విషయాలన్నిటినీ అర్థం చేసుకోలేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించవచ్చు. నేను నిజాయితీగా, వినయంగా ఉండి, వివరాలు అడగాలి, అయితే సహోదరులు సంతోషంగా సహాయం చేస్తారు.”

క్రొత్త భాషా సంఘంతో పనిచేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక బలహీనతకు గురవకుండా ఉండడానికి మీరు మీ ఆధ్యాత్మిక ఆరోగ్యానికి తప్పక ప్రాధాన్యతనివ్వాలి. (మత్తయి 5:⁠3) పోర్చుగీస్‌ క్షేత్రంలో చాలాకాలం సేవచేసిన కాజుయుకీ ఇలా చెబుతున్నాడు: “మనం సరిపడేంత ఆధ్యాత్మిక పోషణ పొందడం ప్రాముఖ్యం. ఆ కారణంగా మేము ఒక కుటుంబంగా మా భాషలోనే కాక పోర్చుగీస్‌ భాషలో కూడా అధ్యయనం చేసి కూటాలకు సిద్ధపడతాం.” కొందరు అప్పుడప్పుడు తమ భాషలో జరిగే కూటాలకు హాజరవుతారు. అంతేకాక, సరిపోయేంత విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం.​—⁠మార్కు 6:​31.

లెక్క చూసుకోవడం

మీరు వేరే భాష ఉపయోగించే సంఘానికి మారాలనుకుంటున్నట్లయితే మీరలా చేయడంలో ఇమిడివున్న పరిస్థితుల్ని పరిగణలోనికి తీసుకోవాలి. (లూకా 14:​28) ఈ విషయంలో మీరు పరిశీలించాల్సిన అతి ప్రాముఖ్యమైన రంగాలు, మీ ఆధ్యాత్మికత, యెహోవాతో మీ సంబంధం. ప్రార్థనాపూర్వకంగా మీ పరిస్థితిని విశ్లేషించుకోండి. మీ భాగస్వామిని, పిల్లలను పరిగణలోకి తీసుకోండి. ‘నా పరిస్థితులు అలాంటి దీర్ఘకాల ప్రణాళికను చేపట్టేందుకు అనుకూలంగా ఉన్నాయా, అలాంటి ప్రణాళికను చేపట్టేందుకు కావాల్సిన ఆధ్యాత్మిక, భావోద్రేక శక్తి నాకుందా’ అని ఆలోచించండి. ఆధ్యాత్మికంగా మీకూ, మీ కుటుంబానికీ శ్రేష్ఠమైనది చేయడం జ్ఞానయుక్తం. మీరు ఎక్కడ రాజ్య ప్రచారకులుగా పనిచేసినా, మీరు చేయాల్సింది ఎంతో ఉంది, చవిచూడాల్సిన ఆనందం ఎంతో ఉంది.

వేరే భాషా సంఘంలో సేవచేయగలిగినవారు గొప్ప ఆశీర్వాదాలను చవిచూస్తారు. “ఇది నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన అనుభూతుల్లో ఒకటి, అది బైబిలు సత్యాన్ని మళ్ళీ నేర్చుకోవడం లాంటిది. నాకు ఈ అవకాశం దొరికినందుకు ఎంతో కృతజ్ఞురాలిని, ప్రత్యేకంగా విదేశాల్లో మిషనరీలుగా సేవచేసే అవకాశం మాకు లేదు కాబట్టి నేను ఎంతో కృతజ్ఞురాలిని” అని తన భర్తతోపాటు స్పానిష్‌ సంఘానికి మారిన బార్బరా చెబుతోంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ వయసులకు చెందిన వేలాదిమంది సామాన్యులు, సువార్త వ్యాప్తి చేయడానికి వేరే భాష నేర్చుకునే సవాలును చేపడుతున్నారు. వారిలో మీరూ ఒకరైతే, మంచి ఉద్దేశంతో, ఆశావహ దృక్పథంతో ఉండండి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా, యెహోవా మీ ప్రయత్నాలను ఆశీర్వదిస్తాడని నమ్మకముంచండి.​—⁠2 కొరింథీయులు 4:⁠7.

[18వ పేజీలోని చిత్రం]

అర్హుడైన బోధకుడు బోధించే భాషా తరగతులకు హాజరవడంద్వారా భాషను త్వరగా, సులభంగా నేర్చుకోవచ్చు

[20వ పేజీలోని చిత్రం]

మీరు వేరే భాష నేర్చుకుంటున్నప్పుడు మీ ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని అపాయంలోకి నెట్టేయకండి