కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి మాదిరిగా ఉండండి

తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి మాదిరిగా ఉండండి

తల్లిదండ్రులారా మీ పిల్లలకు మంచి మాదిరిగా ఉండండి

“పిల్లల్ని చక్కగా పెంచేందుకు కీలకాన్ని కనుగొనడానికి శతాబ్దం నుండి చేస్తున్న అన్వేషణను మనోవిజ్ఞానశాస్త్రజ్ఞులు ఇక ఆపేయవచ్చు, ఎందుకంటే వారికి ఆ కీలకం లభించిందని కాదుకానీ అలాంటి కీలకమేదీ ఉనికిలోనే లేదు.” పిల్లల్ని పెంచడంపై వ్రాయబడిన ఒక పుస్తకాన్ని సమీక్షిస్తూ టైమ్‌ పత్రిక అలా వ్యాఖ్యానించింది. పిల్లలు ప్రధానంగా తమ సహవాసుల ప్రమాణాలనే అలవర్చుకుంటారు కానీ, తల్లిదండ్రుల ప్రమాణాలను కాదని ఆ పుస్తకం వాదించింది.

సహవాసుల ప్రభావం చాలా శక్తిమంతమైనదనడంలో సందేహం లేదు. (సామెతలు 13:​20; 1 కొరింథీయులు 15:​33) విలియమ్‌ బ్రౌన్‌ అనే విలేఖరి ఇలా వ్యాఖ్యానించాడు: “యౌవనస్థులకు లౌకికంగా అత్యంత ప్రాముఖ్యమైనదిగా పరిగణించే విషయం ఏదైనా ఉందంటే, అది సామాజిక ప్రమాణాలకు కట్టుబడి ఉండాలన్న కోరికే. . . . ఇతరులకు భిన్నంగా ఉండడాన్ని యౌవనులు చావుకన్నా ఘోరమైందిగా పరిగణిస్తారు.” ఖాళీ సమయమే దొరకని నేటి లోకంలో సామాన్యంగా జరుగుతున్నట్లు, ఒకవేళ తల్లిదండ్రులు ఇంట్లో ఆత్మీయతను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో విఫలమైనా, లేక తమ పిల్లలతో తగినంత సమయం గడపకపోయినా, వారు తమ పిల్లల జీవితాల్లో సాంగత్య ప్రభావం దుష్పరిణామాలు చూపేందుకు అనుమతిస్తున్నవారిగా ఉంటారు.

అంతేగాక, బైబిలు ప్రవచించినట్లుగా ప్రజల జీవితాలు డబ్బుతో, సుఖభోగాలతో, స్వార్థపూరిత ఆసక్తులతో నిండివున్నాయి కాబట్టి, ఈ “అంత్యదినములలో” కుటుంబ ఏర్పాటు ప్రత్యేకంగా ప్రమాదంలో ఉంది. కాబట్టి “తలిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞతలేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు[గా]” పిల్లలు తయారవడం చూసి మనం ఆశ్చర్యపోవాలా?​—⁠2 తిమోతి 3:​1-3.

బైబిల్లో ఉపయోగించబడిన “అనురాగం” అనే పదం, కుటుంబంలో ఉండే ప్రేమను వర్ణిస్తుంది. ఆ ప్రేమ, తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ చూపించడాన్ని, పిల్లలు తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండడాన్ని పురికొల్పే సహజమైన బంధం. కానీ తల్లిదండ్రులు అనురాగరహితులుగా ఉన్నప్పుడు పిల్లలు భావోద్వేగ ఆసరాకోసం తమ సహవాసులవైపు తిరుగుతారు. అలాంటప్పుడు ఆ సహవాసుల ప్రమాణాలను, వైఖరులనే అలవర్చుకుంటారు. అయితే, తమ కుటుంబంలో బైబిలు సూత్రాలను, దాని నడిపింపును అనుసరించే తల్లిదండ్రులు, తరచూ అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోగలుగుతారు.​—⁠సామెతలు 3:⁠5, 6.

కుటుంబం​—⁠దైవిక ఏర్పాటు

ఆదాముహవ్వలను భార్యాభర్తలుగా జతపరిచిన తర్వాత, దేవుడు వారికి ఈ ఆజ్ఞనిచ్చాడు: “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండిం[చండి].” ఆ తర్వాతే తండ్రి, తల్లి, పిల్లలు అంటే కుటుంబం అనేది ఉనికిలోకి వచ్చింది. (ఆదికాండము 1:​28; 5:​3, 4; ఎఫెసీయులు 3:​14, 15) పిల్లల్ని పెంచడానికి సహాయం చేసే కొన్ని ప్రధాన గుణాలను మనుష్యుల్లో, యెహోవా సహజంగానే ఉంచాడు. కానీ జంతువులకు భిన్నంగా మానవులకు అదనపు సహాయం అవసరం కాబట్టి, యెహోవా వ్రాతపూర్వక నిర్దేశాలను అనుగ్రహించాడు. వాటిలో నైతిక, ఆధ్యాత్మిక విషయాల గురించిన నిర్దేశాలు, పిల్లలకు తగినవిధంగా ఉపదేశించడాన్ని గురించిన నిర్దేశాలు కూడా ఉన్నాయి.​—⁠సామెతలు 4:​1-4.

ప్రత్యేకంగా తండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవుడు ఇలా అన్నాడు: “నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను.” (ద్వితీయోపదేశకాండము 6:​6, 7; సామెతలు 1:​8, 9) దేవుని ధర్మశాస్త్రాన్ని తల్లిదండ్రులు మొదట తమ హృదయాల్లో ఉంచుకోవాలన్న విషయాన్ని కాస్త గమనించండి. అది ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే ఇతరులను పురికొల్పగలిగే బోధ నోటినుండి కాదుకానీ హృదయం నుండి వస్తుంది. తల్లిదండ్రులు తమ హృదయాలనుండి బోధించినప్పుడు మాత్రమే తమ పిల్లల హృదయాలను చేరుకోగలరు. అలాంటి తల్లిదండ్రులు, సులభంగా కపటాన్ని గ్రహించగల తమ పిల్లలకు మంచి మాదిరిగా ఉంటారు.​—⁠రోమీయులు 2:​21.

క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యంనుండే “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను” శిక్షణ ఇవ్వాలని కోరబడ్డారు. (ఎఫెసీయులు 6:⁠4; 2 తిమోతి 3:​14) బాల్యంనుండేనా? అవును! ఒక తల్లి ఇలా వ్రాసింది: “కొన్నిసార్లు తల్లిదండ్రులమైన మనం పిల్లలకు ఇవ్వాల్సినంత ఆదరణ ఇవ్వం. వారి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తాం. వారిలో సామర్థ్యం ఉంది. తల్లిదండ్రులమైన మనం దానిని సద్వినియోగం చేసుకోవాలి.” అవును, పిల్లలో నేర్చుకోవాలనే తపన ఉంటుంది, దైవభక్తిగల తల్లిదండ్రులు నేర్పిస్తే, వారు ప్రేమించడం కూడా నేర్చుకుంటారు. అటువంటి పిల్లలు తమకోసం ఏర్పర్చిన హద్దుల్లో సురక్షితంగా, భద్రంగా ఉన్నట్టు భావిస్తారు. కాబట్టి, తల్లిదండ్రులుగా విజయం సాధించాలనుకుంటున్నవారు ప్రేమగల సహచరులుగా, చక్కగా సంభాషించేవారిగా, ఓర్పుతోనే అయినా దృఢంగా బోధించేవారిగా, తమ పిల్లలు వర్ధిల్లే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పే వారిగా ఉండడానికి కృషి చేయాలి. *

మీ పిల్లల్ని సంరక్షించుకోండి

జర్మనీలో, కలతచెందిన ఒక ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రులకు వ్రాసిన ఉత్తరంలో ఇలా పేర్కొన్నాడు: “పిల్లల వ్యక్తిత్వాన్ని రూపొందించాల్సిన తమ బాధ్యతను టీవీకో లేక చెడు సాంగత్యాలకో వదిలివేయకుండా, తల్లిదండ్రులందరూ తమ పిల్లల్ని పెంచడంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని మేము వారిని ప్రోత్సహించాలనుకుంటున్నాము.”

పిల్లవాడిని టీవీకో లేక చెడు సాంగత్యాలకో వదిలేయడమంటే, వారి పెంపకాన్ని లౌకికాత్మ ప్రభావితం చేయడానికి అనుమతించడమే అవుతుంది. (ఎఫెసీయులు 2:​1, 2) దేవుని ఆత్మకు పూర్తి విరుద్ధంగావున్న ఈ లౌకికాత్మ వేగంగా వీచే గాలిలా ఉండి, “భూసంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటి” తలంపుల బీజాలను బుద్ధిహీనుల, జ్ఞానంలేనివారి మనసుల్లో, హృదయాల్లో ధారాళంగా విత్తుతుంది. (యాకోబు 3:​15) అటువంటి కలుపుమొక్కలు చివరకు హృదయాన్ని కలుషితం చేస్తాయి. హృదయంలో నాటబడినదాని ప్రభావం ఎలా ఉంటుందో ఉదాహరిస్తూ యేసు ఇలా అన్నాడు: “సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును.” (లూకా 6:​45) అందుకే బైబిలు మనకిలా ఉద్బోధిస్తోంది: “నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము.”​—⁠సామెతలు 4:​23.

పిల్లలు ఎంతైనా పిల్లలే కాబట్టి కొన్ని సందర్భాల్లో వారు మొండిగా, చపలంగా ప్రవర్తిస్తారు. (ఆదికాండము 8:​21) అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులేమి చేయవచ్చు? బైబిలు ఇలా చెబుతోంది: “బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. శిక్షాదండము దానిని దానిలోనుండి తోలివేయును.” (సామెతలు 22:​15) కొందరి దృష్టిలో అలా చేయడం క్రూరంగా వ్యవహరించడంగా, నేటికాలంలో అనంగీకృతమైనదిగా ఉంది. నిజం చెప్పాలంటే, దౌర్జన్యాన్ని, ఏ విధమైన దూషణనైనా బైబిలు వ్యతిరేకిస్తోంది. “దండము” కొన్నిసార్లు అక్షరార్థంగా శిక్షించడాన్నే సూచించినా, చాలాసార్లు అది పిల్లల నిత్య సంక్షేమం కోసం దృఢంగానే అయినా ప్రేమతో తగిన విధంగా తల్లిదండ్రులు చూపే అధికారాన్ని సూచిస్తుంది.​—⁠హెబ్రీయులు 12:​7-11.

మీ పిల్లలతో కలిసి వినోదాన్ని ఆస్వాదించండి

పిల్లలు సరిగ్గా ఎదగడానికి ఆటలు, వినోదం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. వివేకవంతులైన తల్లిదండ్రులు, సాధ్యమైనప్పుడల్లా తమ పిల్లలతో ఉల్లాసంగా సమయం గడిపేందుకు దొరికే అవకాశాలను తమ బంధాన్ని బలపర్చుకొనేందుకు సద్వినియోగం చేసుకుంటారు. ఆ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సరైన వినోదాన్ని ఎంపికచేసుకోవడంలో నిర్దేశమివ్వడమేకాక, తమ పిల్లల సహవాసాన్ని వారు ఎంత విలువైనదిగా పరిగణిస్తున్నారో కూడా చూపించగలుగుతారు.

తాను పనినుండి తిరిగి వచ్చిన తర్వాత తరచూ, తన కుమారునితో ఏదో ఒక విధమైన బంతి ఆట ఆడేవాడినని ఒక సాక్షియైన తండ్రి చెప్పాడు. తన పిల్లలతో చెస్‌, తదితర ఆటలు ఆడడాన్ని తాను చాలా ఇష్టపడేదాన్నని ఒక తల్లి గుర్తుతెచ్చుకుంటోంది. ఒక స్త్రీ, తాను చిన్నవయస్సులో ఉన్నప్పుడు తన కుటుంబమంతా కలిసి సైకిలు మీద వెళ్ళడాన్ని ఆనందించేవాళ్ళమని చెబుతోంది. ఆ పిల్లలందరూ ఇప్పుడు పెద్దవారు, అయినా తమ తల్లిదండ్రులపై, యెహోవాపై వారికున్న ప్రేమ ఇప్పటికీ బలంగానే ఉంది, మరింత బలపడుతూనే ఉంది.

పిల్లలపట్ల తమకున్న ప్రేమను మాటల్లో, క్రియల్లో వ్యక్తం చేసే తల్లిదండ్రులు, వారితో సమయం గడపాలనుకునే తల్లిదండ్రులు, తరచూ తమ పిల్లలపై జీవితాంతం గుర్తుండిపోయే ప్రభావాన్ని చూపిస్తారు. ఉదాహరణకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌లోని ఒక తరగతినుండి పట్టుభద్రులైన ఎంతోమంది, తమ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, వారి మంచి మాదిరి మూలంగానే తమకు పూర్తికాలసేవ చేయాలనే ఆకాంక్ష కలిగిందని చెప్పారు. అది ఆ పిల్లలకు ఎంతటి అద్భుతమైన స్వాస్థ్యమో, తల్లిదండ్రులకు ఎంతటి ఆశీర్వాదమో కదా! నిజమే, పిల్లలందరూ పెద్దయ్యాక పూర్తికాలసేవ చేసేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ దైవిక భయాన్ని కనబరిచి, వారికి సన్నిహిత స్నేహితులుగా, అనుకరించదగిన మాదిరులుగా ఉన్న తల్లిదండ్రులనుండి వారు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు, వారిని గౌరవిస్తారు కూడా.​—⁠సామెతలు 22:⁠6; ఎఫెసీయులు 6:​2, 3.

ఒంటరి తల్లి లేక తండ్రి కూడా విజయం సాధించవచ్చు

నేడు అనేకమంది పిల్లలు ఒంటరి తల్లి లేక తండ్రి సంరక్షణలో పెరుగుతున్నారు. అది పిల్లలను పెంచే సవాలును మరింత కష్టదాయకం చేసినా, విజయం సాధించడం సాధ్యమే. ఒంటరి తల్లి లేక తండ్రి, మొదటి శతాబ్దపు బైబిలు ఉదాహరణగా ఉన్న యూదురాలైన యునీకే అనే క్రైస్తవ స్త్రీ నుండి ప్రోత్సాహం పొందవచ్చు. ఆమె భర్త అవిశ్వాసి కాబట్టి ఆమెకు అతనినుండి ఎటువంటి ఆధ్యాత్మిక సహాయమూ లభించివుండకపోవచ్చు. అయినా ఆమె తిమోతికి బోధించడంలో మంచి మాదిరినుంచింది. తిమోతి అమ్మమ్మయైన లోయితో కలిసి, ఆమె ఆయనపై బాల్యంనుండే చూపించిన ప్రభావం, ఆయన తోటిసహవాసుల చెడు ప్రభావంకన్నా శక్తిమంతంగా ఉందని రుజువైంది.​—⁠అపొస్తలుల కార్యములు 16:​1, 2; 2 తిమోతి 1:​1-3; 3:​14.

నేడు కూడా చాలామంది యౌవనస్థులు అవిశ్వాసులైన తల్లిదండ్రుల పెంపకంలో లేదా ఒంటరి తల్లిదండ్రుల పెంపకంలో పెరిగినా, తిమోతిలాంటి మంచి గుణాలనే ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు, పూర్తికాల పరిచారకునిగా సేవచేస్తున్న 22 ఏళ్ళ రయన్‌, తన అన్న, అక్కతోపాటు ఒంటరి తల్లి పెంపకంలోనే పెరిగాడు. ఆయన తండ్రి తాగుబోతు, రయన్‌కు నాలుగు సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. రయన్‌ ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “మా అమ్మకు కుటుంబమంతా యెహోవాను సేవించాలనే దృఢ నిశ్చయత ఉండేది, ఆ తీర్మానంతోనే ఆమె ముందుకు సాగింది.”

రయన్‌ ఇలా అంటున్నాడు: “ఒక విషయమేమిటంటే, మా అమ్మ పిల్లలమందరమూ మంచి సహవాసం కలిగివుండేలా జాగ్రత్తపడింది. సంఘంలోగానీ, బయటగానీ చెడు సాంగత్యమని బైబిలు వర్ణిస్తున్న వారితో మమ్మల్ని ఎప్పుడూ కలవనిచ్చేదికాదు. లౌకిక విద్యాభ్యాసంపై సరైన దృక్కోణాన్ని కూడా ఆమె మాలో కలిగించింది.” రయన్‌ వాళ్ళ అమ్మ తరచూ పనివల్ల తీరిక దొరకక అలసిపోయేది, అయినా ఆమె పిల్లలపై ప్రేమపూర్వక శ్రద్ధ చూపించలేనంతగా అందులో మునిగిపోయేది కాదు. రయన్‌ ఇలా చెబుతున్నాడు: “ఆమె ఎప్పుడూ మాతో ఉండాలనీ, మాతో మాట్లాడాలనీ కోరుకునేది. ఆమె సహనంతోనే అయినా దృఢంగా బోధించేది, మేమంతా క్రమ కుటుంబ బైబిలు అధ్యయనాన్ని చేసుకునేందుకు తను చేయగలిగినదంతా చేసేది. బైబిలు సూత్రాల విషయానికి వస్తే ‘రాజీపడడం’ అనే మాటే ఆమె ఎరుగదు.”

రయన్‌ సింహావలోకనం చేసుకున్నప్పుడు, యెహోవాను, తన పిల్లలను నిజంగా ప్రేమించిన తల్లే, తన జీవితంలో అలాగే తన తోబుట్టువుల జీవితంలో అత్యంత శక్తిమంతమైన ప్రభావాన్ని చూపిందని గ్రహించాడు. కాబట్టి, క్రైస్తవ తల్లిదండ్రులారా, మీరు ఒంటరివారైనా, లేక మీ భాగస్వామి విశ్వాసియైనా, అవిశ్వాసియైనా, మీ పిల్లలకు బోధించడానికి చేస్తున్న ప్రయత్నంలో తాత్కాలిక ఒత్తిళ్ళకు, నిరుత్సాహానికి లొంగిపోకండి. కొన్ని సందర్భాల్లో తప్పిపోయిన కుమారునిలా కొందరు యౌవనులు సత్యంనుంచి తొలగిపోవచ్చు. కానీ ఈ లోకం ఎంత వెలితిగా, కఠినంగా ఉందో చూసినప్పుడు వారు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అవును, “యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.”​—⁠సామెతలు 20:​6-7; 23:​23-25; లూకా 15:​10-24.

[అధస్సూచి]

^ పేరా 9 ఈ నిర్దిష్టమైన అంశాల గురించిన మరింత వివరణాత్మక చర్చకోసం యెహోవాసాక్షులు ప్రచురించిన కుటుంబ సంతోషానికిగల రహస్యము పుస్తకంలో 55-9 పేజీలను చూడండి.

[11వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

యేసు తల్లిదండ్రులను దేవుడే ఎన్నుకున్నాడు

యెహోవా, తన కుమారుణ్ణి మానవునిగా జన్మించడానికి భూమ్మీదకు పంపించినప్పుడు, యేసు తల్లిదండ్రులను ఆయన ఎంతో శ్రద్ధతో ఎన్నుకున్నాడు. ఆసక్తికరంగా, ఆయన దీనులైన, ఆధ్యాత్మిక దృష్టిగల జంటను ఎన్నుకున్నాడు. వారు యేసును గారాబం చేయలేదుకానీ, ఆయనకు దేవుని వాక్యాన్ని బోధించి, కష్టపడి పనిచేయడాన్ని, బాధ్యతలు స్వీకరించడంలోని విలువను నేర్పారు. (సామెతలు 29:​21; విలాపవాక్యములు 3:​27) యోసేపు, యేసుకు వడ్రంగి వృత్తిని నేర్పాడు, అంతేగాక వారికున్న ఇంకా ఆరుగురు పిల్లల శ్రద్ధ తీసుకోవడంలో మరియ యోసేపులు ఖచ్చితంగా యేసు సహాయం తీసుకునివుంటారు.​—⁠మార్కు 6:⁠3.

పస్కాపండుగ సమయంలో, దాదాపు 200 కిలోమీటర్ల దూరాన ఉన్న యెరుషలేముకు ఎటువంటి ఆధునిక ప్రయాణ సౌకర్యాలు లేకుండా వారు చేయాల్సిన వార్షిక ప్రయాణానికి యోసేపు కుటుంబమంతా కలిసి సిద్ధపడడాన్ని మీరు ఊహించుకోవచ్చు. తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువమంది సభ్యులున్న కుటుంబం అంతటి దూర ప్రయాణానికి ఖచ్చితంగా మంచిగా సిద్ధపడి ఉండాలి. (లూకా 2:​39, 41) దానిలో ఇక్కట్లు ఉన్నప్పటికీ యోసేపు మరియలు ఆ సందర్భాలను ఎంతో విలువైనవిగా పరిగణించివుంటారనడంలో సందేహం లేదు, వారు బహుశా వాటిని తమ పిల్లలకు ప్రాచీన బైబిలు సంఘటనల గురించి బోధించడానికి ఉపయోగించుకొనివుంటారు.

యేసు పెరుగుతుండగా కూడా తన తల్లిదండ్రులకు “లోబడియుండెను,” “జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.” (లూకా 2:​51, 52) అవును, యోసేపు మరియలు యెహోవా వారిపై ఉంచిన నమ్మకానికి తాము అర్హులమని నిరూపించుకున్నారు. నేటి తల్లిదండ్రులకు వారెంత ఉత్తమ ఉదాహరణో కదా!​—⁠కీర్తన 127:⁠3.