బైబిలును అర్థం చేసుకోవడం ఆ ఆనందం మీకు అందుబాటులోనే ఉంది
బైబిలును అర్థం చేసుకోవడం ఆ ఆనందం మీకు అందుబాటులోనే ఉంది
బైబిల్లో దేవుడిచ్చిన అమూల్యమైన సత్యాలున్నాయి. అది మనకు జీవిత సంకల్పం గురించి, మానవ బాధకున్న కారణం గురించి, మానవజాతి భవిష్యత్తు గురించి చెబుతుంది. అది మనకు, సంతోషాన్ని ఎలా పొందవచ్చో, స్నేహితులనెలా చేసుకోవచ్చో, సమస్యల్ని విజయవంతంగా ఎలా ఎదుర్కోవచ్చో బోధిస్తుంది. అంతకంటే ఎక్కువగా, దాని మూలంగా మనం మన సృష్టికర్తయైన, పరలోకపు తండ్రియైన యెహోవా గురించి తెలుసుకోగలుగుతాము. అలాంటి జ్ఞానం మనకు ఆనందాన్నిస్తూ, మన జీవితాలకు అర్థాన్ని తీసుకువస్తుంది.
బైబిల్లో, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం, తినడంతో పోల్చబడింది. యేసు ఇలా చెప్పాడు: “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్తయి 4:4; హెబ్రీయులు 5:12-14) మనం సజీవంగా ఉండాలంటే ప్రతీరోజు పౌష్టికాహారం తినడం ఎలా అవసరమో, అలాగే నిత్యజీవం అనుగ్రహిస్తానని దేవుడు చేసిన వాగ్దానం నుండి ప్రయోజనం పొందాలంటే ఆయన వాక్యాన్ని క్రమంగా చదవడం అవసరం.
తినడాన్ని మనం ఆనందిస్తాం, దానికి కారణం మనం సృష్టించబడిన రీతి, అంతేగాక అది మన ప్రాథమిక అవసరతను తీరుస్తుంది. అయితే, మనం సంతోషంగా ఉండాలంటే మనం శ్రద్ధతీసుకోవలసిన మరో ప్రాథమిక అవసరత కూడా ఉంది. యేసు ఇలా చెప్పాడు: ‘తమ ఆధ్యాత్మిక అవసరతను గుర్తించినవారు సంతోషంగా ఉంటారు.’ (మత్తయి 5:3, NW) దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆ అవసరత తీరుతుంది కాబట్టి, సంతోషంగా ఉండడం సాధ్యమవుతుంది.
నిజమే, బైబిలును అర్థం చేసుకోవడం అంత సులభం కాదని కొందరు భావిస్తారు. ఉదాహరణకు, మనకు తెలియని ఆచారాలను సూచించే లేదా అలంకారార్థ పదజాలాలను ఉపయోగించే లేఖనాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయం అవసరం కావచ్చు. అంతేగాక, అందులో ఒకే విధమైన అంశంతో వ్యవహరించే ఇతర బైబిలు లేఖనాలను దానియేలు 7:1-7; ప్రకటన 13:1, 2) అయినప్పటికీ, మీరు బైబిలును నిజంగా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవచ్చని మీరెలా నిశ్చయత కలిగివుండవచ్చు?
పరిశీలించడం ద్వారా మాత్రమే అర్థం చేసుకోవడం సాధ్యమయ్యే సూచనార్థక భాషలో వ్రాయబడిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. (ఆ ఆనందం అందరికీ అందుబాటులోవుంది
బైబిలు దేవుని వాక్యం. అందులో దేవుడు మనకు తన చిత్తం గురించి తెలియజేస్తున్నాడు. దేవుడు మనకు, మనం అర్థం చేసుకోలేని పుస్తకాన్ని లేదా కేవలం ఉన్నతవిద్య గల ప్రజలు మాత్రమే అర్థం చేసుకోగల పుస్తకాన్ని ఇస్తాడా? లేదు, యెహోవా అంత నిర్దయుడు కాడు. క్రీస్తుయేసు ఇలా చెప్పాడు: “మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డు నడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:11-13) కాబట్టి, బైబిలును అర్థం చేసుకోవడం మీకు సాధ్యమేననీ, మీరు నిష్కపటంగా దేవుణ్ణి అడిగితే, ఆయన తన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన సహాయాన్ని ఇస్తాడనీ మీరు నిశ్చయత కలిగివుండవచ్చు. నిజానికి, ప్రాథమిక బైబిలు బోధలను పిల్లలు సహితం అర్థం చేసుకోవచ్చు!—2 తిమోతి 3:14.
బైబిలును అర్థం చేసుకోవడానికి కృషి అవసరమే, అయితే అలా చేయడం మనపై శక్తిమంతమైన, ప్రోత్సాహకరమైన ప్రభావం చూపగలదు. యేసు తాను పునరుత్థానం చేయబడిన తర్వాత తన శిష్యుల్లో ఇద్దరికి కనిపించి, బైబిలు ప్రవచనాల గురించి వారితో మాట్లాడాడు. లూకా వృత్తాంతం ఇలా చెబుతోంది: “మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.” దాని ఫలితమేమిటి? ఆ సాయంకాలం శిష్యులు తాము తెలుసుకున్న విషయాల గురించి ఆలోచిస్తూ, ఒకరితో ఒకరు ఇలా అనుకున్నారు: “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా?” (లూకా 24:13-32) దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం వారికి ఆనందాన్నిచ్చింది, ఎందుకంటే అది దేవుని వాగ్దానాల్లో వారికున్న విశ్వాసాన్ని బలపరిచి, వారికి భవిష్యత్తు గురించిన ఆశావహ దృక్కోణాన్ని ఇచ్చింది.
దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం ఒక భారంలా ఉండే బదులు అది ఆసక్తికరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది, కమ్మని భోజనం చేసినంత ఆనందాన్నిస్తుంది. అలాంటి అవగాహనను పొందడానికి మీరేమి చేయాలి? “దేవుని గూర్చిన విజ్ఞానము”లో మీరెలా ఆనందించవచ్చో తర్వాతి ఆర్టికల్ చూపిస్తుంది.—సామెతలు 2:1-5.
[4వ పేజీలోని చిత్రం]
ఒక ప్రేమగల తండ్రిలా యెహోవా, బైబిలును అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేసేందుకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు