కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలును అర్థం చేసుకోవడం ఏది మీకు సహాయం చేస్తుంది?

బైబిలును అర్థం చేసుకోవడం ఏది మీకు సహాయం చేస్తుంది?

బైబిలును అర్థం చేసుకోవడం ఏది మీకు సహాయం చేస్తుంది?

“నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావు.” (లూకా 10:​21) యేసు తన పరలోక తండ్రిని ఉద్దేశించి పలికిన ఈ మాటలు, బైబిలును అర్థం చేసుకోవడానికి మనకు సరైన దృక్పథం ఉండాలని సూచిస్తున్నాయి. వినయంగల, బోధించదగిన ప్రజలు మాత్రమే నిజంగా అర్థం చేసుకోగల పుస్తకాన్ని ఇవ్వడంలో యెహోవా జ్ఞానము వెల్లడౌతోంది.

మనలో చాలామందికి వినయాన్ని పెంపొందించుకోవడం అంత సులభంకాదు. మనందరిలో స్వతహాగా గర్వించే స్వభావం ఉంది. అంతేగాక, మనం “అంత్యదినములలో” ఉండే “స్వార్థప్రియులు, . . . మూర్ఖులు, గర్వాంధులు” అయిన ప్రజల మధ్య జీవిస్తున్నాం. (2 తిమోతి 3:​1-4) ఈ దృక్పథాలు దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోకుండా చేస్తాయి. విచారకరంగా, మనమందరం మన చుట్టూ ఉన్న పరిసరాలనుబట్టి కొంతమేరకు ప్రభావితులమౌతాము. మరైతే, బైబిలును అర్థం చేసుకోవడానికి అవసరమైన దృక్పథాన్ని మనమెలా ఏర్పరచుకోవచ్చు?

హృదయాన్ని, మనస్సును సిద్ధం చేసుకోవడం

దేవుని ప్రజల ప్రాచీన నాయకుడైన ఎజ్రా ‘యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించుటకు తన హృదయమును సిద్ధము చేసికొనెను.’ (ఎజ్రా 7:​10, NW) మనం మన హృదయాన్ని సిద్ధం చేసుకునే మార్గమేదైనా ఉందా? ఉంది. లేఖనాల గురించి సరైన దృక్పథం ఏర్పరచుకోవడంతో మనం ప్రారంభించవచ్చు. అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులకు ఇలా వ్రాశాడు: “మీరు దేవునిగూర్చిన వర్తమానవాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి.” (1 థెస్సలొనీకయులు 2:​13) లేఖనాలు వ్రాయడానికి మనుష్యులు ఉపయోగించుకోబడినా, వారు వ్రాసింది యెహోవా నుండి వచ్చినదే. ఈ ఆవశ్యకమైన వాస్తవాన్ని గుర్తించడం, మనం చదివేదాన్ని మరింత సులభంగా అంగీకరించేందుకు మనకు సహాయం చేస్తుంది.​—⁠2 తిమోతి 3:​16.

మన హృదయాన్ని సిద్ధం చేసుకోవడానికి మరో మార్గం, ప్రార్థన. బైబిలు పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడింది కాబట్టి, ఆ ఆత్మ సహాయంతోనే దాని సందేశాన్ని మనమర్థం చేసుకోవడం సాధ్యమవుతుంది. మనమలాంటి సహాయం కోసం ప్రార్థించాలి. ఈ విషయంలో కీర్తనకర్తకున్న శ్రద్ధను గమనించండి, ఆయనిలా వ్రాశాడు: “నీ ధర్మశాస్త్రము ననుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణహృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును.” (కీర్తన 119:​34) వ్రాయబడివున్న దానిని అర్థం చేసుకునే మానసిక సామర్థ్యం కోసమే కాక, దాన్ని అంగీకరించడానికి అనుమతించే హృదయ దృక్పథం కోసం కూడా మనం ప్రార్థించాలి. బైబిలును అర్థం చేసుకోవడానికి, మనం సత్యమైనదాన్ని స్వీకరించే విధంగా ఉండాలి.

సరైన మనోవైఖరి కలిగివుండడానికి మీరు ధ్యానించేటప్పుడు, బైబిలు అధ్యయనం చేయడం మీకెలా సహాయం చేయగలదో ఆలోచించండి. దేవుని వాక్యాన్ని సంప్రదించడానికి మనకు అనేక అద్భుతమైన కారణాలున్నాయి గానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన కారణమేమిటంటే, దేవునికి సన్నిహితమయ్యేందుకు అది మనకు సహాయం చేస్తుంది. (యాకోబు 4:⁠8) యెహోవా వివిధ పరిస్థితులకు ఎలా స్పందిస్తాడో, ఆయన తనను ప్రేమించేవారిని ఎంత విలువైనవారిగా ఎంచుతాడో, తనను విడిచివెళ్ళే వారితో ఆయనెలా వ్యవహరిస్తాడో మనం చదువుతుండగా, ఆయనెలాంటి వ్యక్తి అనేది మనం గ్రహిస్తాం. మనం బైబిలు చదవడానికి ప్రాథమిక ప్రేరణ ఎల్లప్పుడూ, దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని తద్వారా ఆయనతో మన సంబంధాన్ని బలపరచుకోవాలన్నదే అయ్యుండాలి.

సరైన దృక్పథం కలిగివుండడానికి ఆటంకాలు

దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఏది మనల్ని ఆటంకపర్చగలదు? ఒక ఆటంకం ఏమిటంటే తప్పుదారిపట్టించబడిన యథార్థత. ఉదాహరణకు, మీరు కొంతమంది నమ్మకాలను, అభిప్రాయాలను ఎంతో ఉన్నతమైనవిగా ఎంచుతుండవచ్చు. కానీ, వారు దేవుని వాక్య సత్యాన్ని నిజంగా విలువైనదిగా ఎంచకపోతే అప్పుడేమిటి? అలాంటి పరిస్థితుల్లో, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోందో అర్థం చేసుకోవడం ఒక సవాలుగా పరిణమించవచ్చు. కాబట్టి, మనకు బోధించబడిన దాన్ని జాగ్రత్తగా పరీక్షించి చూసుకోమని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.​—⁠1 థెస్సలొనీకయులు 5:​21.

యేసు తల్లియైన మరియ అలాంటి సవాలునే ఎదుర్కొంది. ఆమె పెంపకం యూదా సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆమె మోషే ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పాటించింది, నిస్సందేహంగా సమాజమందిరానికి వెళ్ళింది. కానీ ఆ తర్వాతి జీవితంలో, తన తల్లిదండ్రులు తనకు బోధించిన ఆరాధనా విధానం దేవుని దృష్టికి ఇక ఎంతమాత్రం అంగీకారమైనది కాదని గుర్తించింది. తత్ఫలితంగా మరియ యేసు బోధను అంగీకరించి, క్రైస్తవ సంఘంలో మొదటి సభ్యులైనవారిలో ఒకరిగా మారింది. (అపొస్తలుల కార్యములు 1:​13, 14) అది ఆమె తన తల్లిదండ్రులపట్ల గానీ వారి సాంప్రదాయాలపట్ల గానీ అగౌరవం చూపించడం కాదు; బదులుగా, అది దేవునిపట్ల ఆమెకున్న ప్రేమకు వ్యక్తీకరణ. కాబట్టి మనం బైబిలు నుండి ప్రయోజనం పొందాలంటే, మరియలాగే మనం కూడా, ఎవరిపట్లనో యథార్థంగా ఉండడానికంటే దేవునిపట్ల యథార్థంగా ఉండడానికే ప్రాముఖ్యతనివ్వాలి.

విచారకరంగా, చాలామంది బైబిలు సత్యానికి అంత విలువివ్వరు. కొందరు అబద్ధంపై ఆధారపడిన మత సాంప్రదాయాలను అనుసరించడంలోనే సంతృప్తిపడతారు. ఇతరులు తమ సంభాషణలోనూ, జీవనవిధానంలోనూ సత్యంపట్ల నిర్లక్ష్యభావాన్ని చూపిస్తారు. కాబట్టి, బైబిలు సత్యాన్ని అంగీకరించడానికి త్యాగం అవసరం: దానివల్ల మీకూ మీ స్నేహితులకూ, పొరుగువారికీ, తోటి ఉద్యోగస్థులకూ, చివరికి మీ కుటుంబానికీ మధ్య అసమ్మతి ఏర్పడవచ్చు. (యోహాను 17:​14) అయితే, జ్ఞానియైన సొలొమోను ఇలా వ్రాశాడు: “సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము.” (సామెతలు 23:​23) మీరు సత్యాన్ని ఎంతో ఉన్నతమైనదిగా ఎంచితే, బైబిలును అర్థం చేసుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు.

బైబిలు సందేశాన్ని అర్థం చేసుకోవడానికి మరో ఆటంకం, అది చెబుతున్నదాన్ని అన్వయించుకోవడానికి ఇష్టపడకపోవడం. యేసు తన శిష్యులకిలా చెప్పాడు: “పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. . . . వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి.” (మత్తయి 13:​11, 13) యేసు ఎవరికైతే ప్రకటించాడో వారిలో చాలామంది ప్రతిస్పందించలేదు, మారడానికి ఇష్టపడలేదు. యేసు ఒక ఉపమానంలో ప్రస్తావించిన వర్తకునికి, వీరికి ఎంత తేడా ఉందో కదా! ఆ వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యాన్ని కనుగొని దాన్ని కొనుక్కోవడానికి తనకున్నవన్నీ వెంటనే అమ్మేశాడు. బైబిలు సత్యాన్ని అర్థం చేసుకోవడం మనకూ అంతే అమూల్యమైనదిగా ఉండాలి.​—⁠మత్తయి 13:​45, 46.

బోధింపబడదగిన స్వభావం కలిగివుండడమనే సవాలు

బైబిలును అర్థం చేసుకోవడంలో ఒక పెద్ద సవాలు, బోధింపబడదగిన స్వభావం కలిగివుండడం. అల్పులుగా కనిపించే ఎవరి నుండైనా క్రొత తలంపులు అంగీకరించడం ఒక వ్యక్తికి కష్టం కావచ్చు. అయితే, యేసుక్రీస్తు అపొస్తలులు “విద్యలేని పామరులు.” (అపొస్తలుల కార్యములు 4:​13) దానికిగల కారణాన్ని వివరిస్తూ పౌలు ఇలా వ్రాశాడు: “సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశమువారైనను అనేకులు పిలువబడలేదు గాని . . . జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోనుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు.” (1 కొరింథీయులు 1:​26, 27) అల్పునిచేత బోధించబడడం మీ వినయానికి ఒక సవాలుగా పరిణమిస్తే, వారు, దేవుడు మీకు బోధించడానికి ఉపయోగించుకుంటున్న మాధ్యమం మాత్రమేనని గుర్తుంచుకోండి. మన ‘మహోపదేశకుడు’ అయిన యెహోవాచే బోధించబడడంకంటే గొప్ప ఆధిక్యత ఏమి ఉంటుంది?​—⁠యెషయా 30:​20, NW; 54:​13.

సిరియారాజు దగ్గర సైన్యాధిపతిగావున్న నయమానుకు కూడా అల్పుల నుండి ఉపదేశం స్వీకరించడం ఒక సవాలుగా పరిణమించింది. తనకు వచ్చిన కుష్ఠవ్యాధి నుండి స్వస్థతపొందాలని ఆయన యెహోవా ప్రవక్తయైన ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అయితే స్వస్థతపొందడానికి సంబంధించిన దేవుని ఉపదేశాలు నయమానుకు ఒక సేవకుని ద్వారా అందజేయబడ్డాయి. ఆ ఉపదేశం, అది అందించబడిన తీరు నయమాను వినయాన్ని సవాలుచేశాయి, కాబట్టి ఆయన దేవుని ప్రవక్త మాటలకు విధేయత చూపించడానికి మొదట్లో నిరాకరించాడు. ఆ తర్వాత నయమాను తన దృక్పథాన్ని మార్చుకొని స్వస్థతపొందాడు. (2 రాజులు 5:​9-14) బైబిలు నుండి నేర్చుకునేటప్పుడు మనం కూడా అలాంటి సవాలునే ఎదుర్కొంటాము. మనం ఆధ్యాత్మికంగా, నైతికంగా స్వస్థతపొందడానికి ఒక క్రొత్త జీవన విధానాన్ని అనుసరించాలని మనం తెలుసుకోవచ్చు. మనమేమి చేయాలో మనకు బోధించడానికి ఇతరులను అనుమతించేంత వినయం మనకు ఉందా? బోధించబడగల స్వభావం ఉన్నవారు మాత్రమే బైబిలును అర్థం చేసుకోగలుగుతారు.

ఐతియొపీయుల రాణియైన కందాకే క్రింద మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి చక్కని స్వభావాన్ని చూపించాడు. ఆయన తన రథంలో ఆఫ్రికాకు తిరిగి వెళ్తున్నప్పుడు శిష్యుడైన ఫిలిప్పు ఆయన రథంతోపాటు పరుగెత్తి ఆయనను సమీపించాడు. ఆయన చదువుతున్నది ఆయనకు అర్థమవుతోందో లేదో చెప్పమని ఫిలిప్పు ఆ వ్యక్తిని అడిగాడు. ఆ అధికారి వినయంగా ఇలా సమాధానమిచ్చాడు: “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను?” ఆ వ్యక్తి దేవుని వాక్య అవగాహనను పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత, ఆయన “సంతోషించుచు తన త్రోవను వెళ్లెను.”​—⁠అపొస్తలుల కార్యములు 8:​27-39.

యెహోవాసాక్షులు సామాన్య ప్రజలు. ప్రతీవారం 60 లక్షలకంటే ఎక్కువమంది ఇళ్ళల్లో వారు బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తున్నారు. బైబిలు సర్వశ్రేష్ఠమైన జీవన విధానాన్ని బోధిస్తూ, మానవజాతికి ఉన్న ఏకైక ఖచ్చితమైన నిరీక్షణ గురించి వివరించడమే కాక, దేవుని గురించి ఎలా తెలుసుకోవాలో కూడా మనకు తెలియజేస్తుంది కాబట్టి, బైబిలు అధ్యయనం చేయడం, అది చెబుతున్నదాన్ని అర్థం చేసుకోవడం గొప్ప ఆనందమని లక్షలాదిమంది తెలుసుకున్నారు. ఆ ఆనందం మీకు కూడా అందుబాటులోనే ఉంది.

[7వ పేజీలోని చిత్రం]

అల్పుడైన సేవకుడు ఇచ్చిన ఉపదేశాలను అంగీకరించడం నయమానుకు కష్టమైంది

[7వ పేజీలోని చిత్రం]

బైబిలును అర్థం చేసుకోవడం మన హృదయాలను ఉత్తేజపరుస్తుంది