కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ధైర్యంగా ఉండండి

ధైర్యంగా ఉండండి

ధైర్యంగా ఉండండి

“ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.”​—⁠జెకర్యా 8:⁠9.

హగ్గయి జెకర్యాల ప్రవచనాలు దాదాపు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబడినా, అవి మీ జీవితానికి ఖచ్చితంగా ప్రాముఖ్యమైనవే. ఈ రెండు పుస్తకాల్లోని బైబిలు వృత్తాంతాలు కేవలం చరిత్ర కాదు. అవి ‘మనకు బోధ కలుగు నిమిత్తము పూర్వమందు వ్రాయబడిన’ వాటిలో భాగం. (రోమీయులు 15:⁠4) వాటిలో మనం చదివే అధికభాగం, పరలోకంలో 1914లో రాజ్యం స్థాపించబడిన దగ్గరనుండి పరిణమిస్తున్న వాస్తవ పరిస్థితుల గురించి మనం తలంచేలా చేస్తాయి.

2 పూర్వం దేవుని ప్రజలకు కలిగిన సంఘటనల్ని, అనుభవించిన పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా అన్నాడు: “ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను.” (1 కొరింథీయులు 10:​11) కాబట్టి మీరిలా ఆలోచించవచ్చు: ‘హగ్గయి జెకర్యా పుస్తకాలకు మన కాలంలో ఎలాంటి ప్రాముఖ్యత ఉంది?’

3 ముందరి ఆర్టికల్‌లో పేర్కొన్నట్లుగా, హగ్గయి జెకర్యాల ప్రవచనాలు యూదులు బబులోను చెరనుండి విడుదలై దేవుడు తమకిచ్చిన దేశానికి తిరిగివచ్చిన కాలానికి సంబంధించినవి. ఆ ఇద్దరు ప్రవక్తలు ఆలయ పునర్నిర్మాణంపై దృష్టి నిలిపారు. యూదులు సా.శ.పూ. 536లో ఆలయ పునాది వేశారు. వృద్ధులైన కొందరు యూదులు గతం గురించి ఆలోచించినా, మొత్తానికి వారిలో ‘సంతోషం బహుగా’ వెల్లివిరిసింది. కానీ మనకాలంలో నిజానికి అంతకంటే మరెంతో ప్రాముఖ్యమైనది జరిగింది. ఎలా జరిగింది?​—⁠ఎజ్రా 3:​3-13.

4 మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే, యెహోవా అభిషిక్తులు మహా బబులోను చెరనుండి విడుదల చేయబడ్డారు. అది యెహోవా మద్దతుకు ఓ పెద్ద సూచనగా నిలిచింది. మతనాయకులు, వారి రాజకీయ సహవాసులు బైబిలు విద్యార్థుల బహిరంగ ప్రకటనా పనిని, బోధనా పనిని దాదాపు నిలిపేయగలిగారన్నట్లే మొదట్లో అనిపించింది. (ఎజ్రా 4:​8, 13, 21-24) అయితే, యెహోవా దేవుడు ప్రకటనా పనికి, శిష్యులను చేసే పనికి ఎదురైన ఆటంకాలను తొలగించాడు. 1919 తర్వాతి దశాబ్దాల్లో రాజ్యసేవ అభివృద్ధి చెందింది, దాని పురోగతిని ఏదీ ఆపలేకపోయింది.

5 విధేయతగల యెహోవా సేవకులు మనకాలంలో చేస్తున్న ప్రకటనా పని, బోధనా పని యెహోవా మద్దతుతో ముందుకు సాగుతుందని మనం దృఢంగా నమ్మవచ్చు. జెకర్యా 4:7లో మనమిలా చదువుతాం: “కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలువేయగా అతడు పైరాయి తీసికొని పెట్టించును.” ఇది మనకాలంలో జరిగే ఏ గొప్ప కార్యాన్ని సూచిస్తోంది?

6జెకర్యా 4:​7, సర్వాధిపతియైన దేవుని ఆధ్యాత్మిక ఆలయ భూసంబంధ ఆవరణలో సత్యారాధన పరిపూర్ణ స్థితికి తీసుకురాబడే కాలాన్ని సూచిస్తోంది. క్రీస్తుయేసు విమోచనా బలి ఆధారంగా తనను ఆరాధించడానికి యెహోవా చేసిన ఏర్పాటే ఆ ఆలయం. నిజమే, ఆ గొప్ప ఆధ్యాత్మిక ఆలయం సా.శ. మొదటి శతాబ్దం నుండే ఉనికిలో ఉంది. అయితే, భూసంబంధ ఆవరణలో సత్యారాధన పరిపూర్ణ స్థితికి తీసుకురాబడవలసి ఉంది. ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక ఆలయ భూసంబంధ ఆవరణలో లక్షలాదిమంది ఆరాధకులు సేవచేస్తున్నారు. వీరు, పునరుత్థానులైన అనేకులు, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో పరిపూర్ణతకు తీసుకురాబడతారు. వెయ్యేండ్ల అంతానికి, పరిశుభ్రం చేయబడిన భూమ్మీద దేవుని సత్యారాధకులు మాత్రమే ఉంటారు.

7 అధిపతియైన జెరుబ్బాబెలు, ప్రధానయాజకుడైన యెహోషువ సా.శ.పూ. 515లో ఆలయం పూర్తవడాన్ని కళ్లారా చూశారు. దానికి పోలికగా, సత్యారాధనను పరిపూర్ణ స్థితికి తీసుకురావడంలో యేసు పోషించే కీలక పాత్ర గురించి జెకర్యా 6:​12, 13 ముందే ఇలా తెలియజేసింది: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా​—⁠చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములోనుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. . . . అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై యేలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చే[యును].” పరలోకంలో ఉండి, దావీదు వంశపు రాజులను చిగురింపజేసే యేసే ఆధ్యాత్మిక ఆలయంలో రాజ్య పనికి మద్దతు ఇస్తున్నాడు కాబట్టి, దాని పురోగతిని ఎవరైనా ఆపుజేయగలరని మీరనుకుంటున్నారా? ఎవ్వరూ ఆపుజేయలేరు. దైనందిన చింతలతో దారితప్పే బదులు, మన పరిచర్యలో ముందుకు సాగాలని ఇది మనలను ప్రోత్సహించవద్దా?

ప్రాధాన్యతలు

8 యెహోవా మద్దతును, ఆశీర్వాదాన్ని కలిగివుండేందుకు, మనం మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఆలయ పనికి ప్రథమస్థానం ఇవ్వాలి. “సమయమింకరాలేదు” అని చెప్పిన యూదుల్లా కాక, మనం జీవిస్తున్న దినములు ‘అంత్యదినములని’ మనం గుర్తుంచుకోవాలి. (హగ్గయి 1:⁠2; 2 తిమోతి 3:⁠1) తన నమ్మకమైన అనుచరులు రాజ్యసువార్త ప్రకటిస్తూ శిష్యులను చేస్తారని యేసు ముందేచెప్పాడు. మన సేవాధిక్యతను నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్తపడాలి. లోక వ్యతిరేకత కారణంగా తాత్కాలికంగా ఆగిన ప్రకటనా పని, బోధనా పని, 1919లో మళ్లీ ఆరంభమైంది, అయితే అది ఇంకా పూర్తికాలేదు. అయితే అది ఖచ్చితంగా పూర్తవుతుందని మీరు నమ్మవచ్చు!

9 మనఃపూర్వకంగా మనమెంత ఎక్కువగా ఈ సేవ చేస్తామో అంత ఎక్కువగా మనమొక ప్రజగానేకాక, ఆయా వ్యక్తులుగా కూడా ఆశీర్వదించబడతాం. మనకు ధైర్యమిచ్చే యెహోవా వాగ్దానాన్ని గమనించండి. పూర్ణాత్మతో ఆరాధన మొదలుపెట్టి, ఆలయ పునాది పనిని యూదులు మనఃపూర్వకంగా మళ్లీ ఆరంభించిన వెంటనే యెహోవా వారికిలా వాగ్దానం చేశాడు: “ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.” (హగ్గయి 2:​19) సంపూర్ణంగా పునరుద్ధరించబడిన ఆయన అనుగ్రహం నుండి వారు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు, దేవుని వాగ్దానంలో కనబడే ఆశీర్వాదాల గురించి ఆలోచించండి: “సమాధానసూచకమైన ద్రాక్షచెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశమునుండి మంచు కురియును, ఈ జనులలో శేషించినవారికి వీటినన్నిటిని నేను స్వాస్థ్యముగా ఇత్తును.”​—⁠జెకర్యా 8:​9-13.

10 యెహోవా ఆ యూదులను ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఆశీర్వదించినట్లే, ఆయన మనకు నియమించిన పనిని శ్రద్ధతో, సంతోష హృదయంతో చేసినప్పుడు మనలనూ ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదాల్లో మనమధ్య సమాధానం, భద్రత, సుభిక్షం, ఆధ్యాత్మిక పురోగతివంటివి ఉన్నాయి. అయితే, యెహోవా కోరిన విధంగా ఆధ్యాత్మిక ఆలయంలో మనం చేసే పనిమీదే దేవుని నిరంతర ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయని మీరు నమ్మవచ్చు.

11 ‘మన ప్రవర్తననుగూర్చి ఆలోచించుకోవలసిన’ సమయమిదే. (హగ్గయి 1:​5, 7) మనం మన జీవిత ప్రాధాన్యతలను విశ్లేషించుకునేందుకు సమయం తీసుకోవాలి. యెహోవా నామాన్ని ఎంతమేరకు ఘనపరుస్తున్నాం, ఆయన ఆధ్యాత్మిక ఆలయంలోని మన పనిలో మనమెంత ప్రగతి సాధిస్తున్నాం, అనే వాటిమీదే నేడు యెహోవా మనల్ని ఆశీర్వదించడం ఆధారపడి ఉంటుంది. మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నా ప్రాధాన్యతలు మారాయా? నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవాపట్ల, ఆయన సత్యంపట్ల, ఆయన పనిపట్ల నాకున్న ఉత్సాహంతో పోలిస్తే ఇప్పుడు నా ఉత్సాహం ఎలావుంది? సౌకర్యవంతమైన జీవితం గడపాలనే ఆసక్తి యెహోవాకు, ఆయన రాజ్యానికి నేనిచ్చే అవధానంపై ప్రభావం చూపుతోందా? మనుష్య భయం అంటే ఇతరులు ఏమనుకుంటారో అనే చింత నన్ను కొంతమేరకు ఆటంకపరుస్తోందా?’​—⁠ప్రకటన 2:​2-4.

12 దేవుని నామాన్ని ఘనపరిచే పనిని మనం నిర్లక్ష్యం చేసిన కారణంగా ఆయన మెండైన ఆశీర్వాదాలు మనకు దక్కకుండా ఉండాలని మనం కోరుకోం. హగ్గయి 1:9 నివేదిస్తున్నట్లుగా, యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు ఆలయ నిర్మాణపనిని మొదట చక్కగా ఆరంభించినప్పటికీ, ఆ తర్వాత వారిలో ప్రతీ ఒక్కరూ ‘తమ తమ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడ్డారు’ అని గుర్తుచేసుకోండి. వారు తమ దైనందిన అవసరాలను తీర్చుకోవడంలో, సొంత జీవనశైలిలో తలమునకలయ్యారు. తత్ఫలితంగా, వారికి మంచి ఆహారం, పానీయం, వెచ్చని దుస్తులు “కొంచెమే” లభించాయి. (హగ్గయి 1:⁠6) యెహోవా తన ఆశీర్వాదాలు నిలిపేశాడు. దీనిలో మనకు ఏదైనా పాఠముందా?

13 దేవుని ఆశీర్వాదాలు నిరంతరం అనుభవించేందుకు మనం, యెహోవా ఆరాధనను నిర్లక్ష్యం చేస్తూ మన వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదనే విషయాన్ని మీరు అంగీకరించరా? కాబట్టి మన అవధానాన్ని మళ్లిస్తున్న విషయాల్లో ధన సంపాదన, తక్షణమే ధనవంతులయ్యే పథకాలు, ఈ విధానంలో ఇష్టమైన ఉద్యోగం సంపాదించుకోవడం కోసం ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశతో పథకాలు వేసుకోవడం లేదా వ్యక్తిగత అభీష్టాన్ని తీర్చుకునే ప్రణాళికల్ని అనుసరించడం వంటి కార్యక్రమం లేదా ఆసక్తి ఏదైనావుంటే దాన్ని మనం ఎదిరించాలి.

14 అలాంటివి పాపాలు కాకపోవచ్చు. అయితే, నిత్యజీవపు దృక్కోణం నుండి చూస్తే అవి నిజంగా ‘నిర్జీవ క్రియలే’ అని మీరు గ్రహించడం లేదా? (హెబ్రీయులు 9:​14) అవి ఏ భావంలో నిర్జీవ క్రియలు? అవి ఆధ్యాత్మికంగా నిర్జీవమైనవి, వ్యర్థమైనవి, నిష్ఫలమైనవి. ఒక వ్యక్తి అలాంటి క్రియల్లో కొనసాగితే, అవి ఆధ్యాత్మిక మరణానికి నడిపిస్తాయి. అపొస్తలుల కాలంలో కొందరు అభిషిక్త క్రైస్తవులకు అదే సంభవించింది. (ఫిలిప్పీయులు 3:​17-19) మన కాలంలో కూడా కొందరికి అదే సంభవించింది. క్రైస్తవ కార్యకలాపాల నుండి, సంఘంనుండి నెమ్మదిగా దూరమైపోయిన కొందరు బహుశా మీకు తెలిసి ఉండవచ్చు; వారిప్పుడు యెహోవా సేవకు తిరిగివచ్చే ఇష్టాన్ని ఏ మాత్రం కనబర్చడంలేదు. అలాంటివారు యెహోవావైపు తిరుగుతారని మనం తప్పక నిరీక్షిస్తాం, అయితే వాస్తవమేమిటంటే, “నిర్జీవ క్రియలను” వెంబడించడం ఫలితంగా మనం యెహోవా అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అదెంత విచారకరమైన పరిణామమో మీరు చూడవచ్చు. దానర్థం దేవుని ఆత్మ కలిగించే ఆనందాన్ని, సమాధానాన్ని పోగొట్టుకోవడమే. ఆప్యాయతగల క్రైస్తవ సహోదరత్వం నుండి ప్రయోజనం పొందలేకపోవడమెంత నష్టమో ఊహించండి!​—⁠గలతీయులు 1:6; 5:​7, 13, 22-24.

15 ఇది చాలా గంభీరమైన విషయం. అక్షరార్థంగా లేదా సూచనార్థకంగా తమ ఇళ్లకు సరంబీ వేసుకుంటూ యెహోవా ఆరాధనా మందిరాన్ని నిర్లక్ష్యం చేసిన యూదులను యెహోవా ఎలా దృష్టించాడో హగ్గయి 2:14లో గమనించండి. “ఈ ప్రజలును ఈ జనులును నా దృష్టికి ఆలాగుననేయున్నారు; వారు చేయు క్రియలన్నియు వారచ్చట అర్పించునవియన్నియు నా దృష్టికి అపవిత్రములు; ఇదే యెహోవా వాక్కు.” యూదులు సత్యారాధనను నిర్లక్ష్యం చేసినంతకాలం, యెరూషలేములో తాత్కాలిక బలిపీఠం మీద వారు అర్ధహృదయంతో అర్పించిన నామకార్థ బలులన్నీ అనంగీకృతమే.​—⁠ఎజ్రా 3:⁠3.

మద్దతు హామీ ఇవ్వబడింది

16 జెకర్యా పొందిన ఎనిమిది దర్శనముల ద్వారా దేవుడు సూచించినట్లుగా, దేవుని ఆలయాన్ని తిరిగి నిర్మించే పనిచేసిన విధేయతగల యూదులకు దేవుని మద్దతు లభిస్తుందని హామీ ఇవ్వబడింది. ఆలయం పూర్తవుతుందనీ, యూదులు తాము చేయవలసిన పనిలో విధేయులుగా కొనసాగినంతకాలం యెరూషలేము, యూదా దేశాలు సుభిక్షంగా ఉంటాయని మొదటి దర్శనం హామీ ఇచ్చింది. (జెకర్యా 1:8-17) సత్యారాధనను వ్యతిరేకించే ప్రభుత్వాలన్నీ అంతమౌతాయని రెండవ దర్శనం వాగ్దానం చేసింది. (జెకర్యా 1:​18-21) నిర్మాణ పనికి దేవుని కాపుదల ఉంటుందనీ, పూర్తిచేయబడిన యెహోవా ఆరాధనా మందిరానికి అనేక జనాంగాలవారు గుంపులు గుంపులుగా వస్తారనీ, నిజమైన శాంతిభద్రతలు ఉంటాయనీ, దైవ నియమిత పనికి దుర్భేద్యమైన అడ్డంకులుగా ఉన్నట్లు అనిపించేవి చదును చేయబడతాయనీ, దుష్టత్వం నిర్మూలించబడుతుందనీ, దేవదూతల పర్యవేక్షణ, రక్షణ ఖాయమనీ ఇతర దర్శనాలు వివరించాయి. (జెకర్యా 2:​5, 11; 3:​10; 4:⁠7; 5:​6-11; 6:​1-8) దైవిక మద్దతుకు సంబంధించి అలాంటి హామీ పొందిన విధేయులు, తమ జీవన శైలిని మార్చుకుని, దేవుడు వారిని ఏ పని కోసం బబులోను నుండి విడిపించాడో ఆ పని చేయడంపై ఎందుకు దృష్టి నిలిపారో మీరు అర్థం చేసుకోవచ్చు.

17 అదేవిధంగా, సత్యారాధన నిశ్చయ విజయానికి సంబంధించి మనకున్న హామీ, మనల్ని కార్యాచరణకు ప్రేరేపించడమే కాక, యెహోవా ఆరాధనా మందిరం గురించి గంభీరంగా ఆలోచించేలా పురికొల్పాలి. మిమ్మల్నిమీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘రాజ్య సువార్త ప్రకటిస్తూ శిష్యులను చేయవలసిన సమయమిదే అని నేను నమ్మితే, నా లక్ష్యాలు, నా జీవనశైలి నా నమ్మకానికి అనుగుణంగా ఉన్నాయా? దేవుని ప్రవచన వాక్యాన్ని అధ్యయనం చేయడానికి సముచితమైన సమయాన్ని వెచ్చిస్తూ, దానికే ప్రాధాన్యతనిస్తూ, దాని గురించి తోటి క్రైస్తవులతోనే కాక, నేను కలుసుకునేవారితో కూడా మాట్లాడుతున్నానా?’

18 మహా బబులోను నాశనాన్ని, ఆ తర్వాత జరిగే అర్మగిద్దోను యుద్ధాన్ని జెకర్యా సూచించాడు. మనమిలా చదువుతాం: “ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలుకాదు రాత్రికాదు; అస్తమయకాలమున వెలుతురు కలుగును.” అవును, యెహోవా దినము భూమ్మీది ఆయన శత్రువులకు అంధకారంతో నిండిన వినాశకరమైన దినంగా ఉంటుంది! అయితే, యెహోవా నమ్మకమైన ఆరాధకులకు అది వెలుగు, అనుగ్రహం నిండిన దినంగా ఉంటుంది. నూతనలోకంలో ప్రతీదీ ఎలా యెహోవా పరిశుద్ధతను ప్రకటిస్తుందో కూడా జెకర్యా వర్ణించాడు. దేవుని గొప్ప ఆధ్యాత్మిక ఆలయంలో జరిగే సత్యారాధన మాత్రమే భూమ్మీద జరిగే ఏకైక ఆరాధనగా ఉంటుంది. (జెకర్యా 14:7, 16-19) ఎంత గొప్ప అభయమో కదా! ప్రవచన నెరవేర్పును చవిచూడడమే కాక, యెహోవా సర్వాధిపత్యమే సత్యమని రుజువుకావడాన్నీ మనం చూస్తాం. యెహోవాకు మాత్రమే చెందిన ఆ దినమెంత నిరుపమానమో కదా!

శాశ్వత ఆశీర్వాదాలు

19 అత్యద్భుతమైన ఆ నెరవేర్పు తర్వాత, సాతాను అతని దయ్యాలు క్రియాశూన్య అగాధంలో బంధించబడతారు. (ప్రకటన 20:​1-3, 7) ఆ తర్వాత క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనలో ఆశీర్వాదాలు వెల్లువలా ప్రవహిస్తాయి. జెకర్యా 14:​8, 9 ఇలా చెబుతోంది: “ఆ దినమున జీవజలములు యెరూషలేములోనుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును. వేసవికాలమందును చలికాలమందును ఆలాగుననే జరుగును. యెహోవా సర్వలోకమునకు రాజైయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును.”

20 నిత్యజీవం కోసం యెహోవా చేసిన ఏర్పాట్లకు చిత్రీకరణగా ఉన్న ‘జీవజలం’ లేదా “జీవజలముల నది” మెస్సీయ సింహాసనం నుండి నిరంతరం పారుతుంది. (ప్రకటన 22:​1, 2) అర్మగిద్దోనును తప్పించుకున్న యెహోవా ఆరాధకుల గొప్పసమూహం, ఆదామువల్ల కలిగిన మరణదండన నుండి విడుదల పొందుతుంది. అప్పటికే చనిపోయినవారు సైతం పునరుత్థానం మూలంగా ప్రయోజనం పొందుతారు. ఆ విధంగా భూమ్మీద యెహోవా పరిపాలనా క్రొత్త శకం మొదలవుతుంది. భూవ్యాప్తంగా మానవులు యెహోవాను విశ్వ సర్వాధిపతిగా, ఆరాధించవలసిన ఏకైక దేవునిగా గుర్తిస్తారు.

21 హగ్గయి జెకర్యాలు ప్రవచించిన దానంతటినిబట్టి, నెరవేరిన దానంతటినిబట్టి, దేవుని ఆధ్యాత్మిక ఆలయ భూసంబంధ ఆవరణలో మనకాయన అప్పగించిన పనిలో ముందుకు సాగేందుకు మనకు బలమైన కారణముంది. సత్యారాధన పరిపూర్ణ స్థితికి తీసుకురాబడేంతవరకు మనమందరం రాజ్య సంబంధ విషయాలకు ప్రథమస్థానమిద్దాం. జెకర్యా 8:6 మనకిలా ఉద్బోధిస్తోంది: “ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా, ధైర్యము తెచ్చుకొనుడి.”

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

• ఎలాంటి చారిత్రక పోలికలు హగ్గయి జెకర్యాల పుస్తకాల్ని నేటికి సంబంధించినవిగా చేస్తున్నాయి?

• హగ్గయి జెకర్యా పుస్తకాలు, ప్రాధాన్యతల గురించి మనకు ఏ పాఠం అందిస్తున్నాయి?

• హగ్గయి జెకర్యాలను పరిశీలించడం, భవిష్యత్తు గురించి గట్టి నమ్మకం కలిగివుండడానికి మనకెందుకు కారణాన్నిస్తోంది?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. హగ్గయి జెకర్యా పుస్తకాలు మన అవధానాన్ని పొందడానికి ఎందుకు తగినవి?

3. హగ్గయి జెకర్యాలు దేనిపై దృష్టి నిలిపారు?

4. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే ఏమి జరిగింది?

5, 6. జెకర్యా 4:7 ఏ గొప్ప నెరవేర్పును సూచిస్తోంది?

7. మనకాలంలో సత్యారాధనను పరిపూర్ణ స్థితికి తీసుకురావడంలో యేసు ఏ పాత్ర పోషిస్తాడు, అది మనకెందుకు ప్రోత్సాహకరంగా ఉండాలి?

8. మనం మన జీవితాల్లో ఆధ్యాత్మిక ఆలయ పనికి ఎందుకు ప్రథమస్థానం ఇవ్వాలి?

9, 10. యెహోవా ఆశీర్వాదం దేనిపై ఆధారపడి ఉంటుంది, మన విషయంలో దాని భావమేమిటి?

11. మనల్నిమనం ఎలా విశ్లేషించుకోవచ్చు?

12. యూదుల్లోని ఏ పరిస్థితి హగ్గయి 1:6, 9లో నొక్కిచెప్పబడింది?

13, 14. హగ్గయి 1:​6, 9లోని పాఠాన్ని మనమెలా అన్వయించుకోవచ్చు, ఇది ఎందుకు ప్రాముఖ్యం?

15. మన ఆరాధనకున్న గంభీరతను హగ్గయి 2:⁠14 ఎలా చూపిస్తోంది?

16. జెకర్యా పొందిన దర్శనాల ఆధారంగా, యూదులు ఏ విషయాలపై నమ్మకం కలిగి ఉండవచ్చు?

17. మనకున్న హామీ దృష్ట్యా, మనల్నిమనం ఏమని ప్రశ్నించుకోవాలి?

18. జెకర్యా 14వ అధ్యాయం ప్రకారం భవిష్యత్తులో ఏమి జరుగుతుంది?

19, 20. జెకర్యా 14:​8, 9 ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరెందుకు అంగీకరిస్తారు?

21. మన తీర్మానమేమై ఉండాలి?

[26వ పేజీలోని చిత్రం]

పూర్ణాత్మతో పనిచేసి తద్వారా ఆశీర్వాదాలు పొందమని హగ్గయి జెకర్యాలు యూదులను ప్రోత్సహించారు

[27వ పేజీలోని చిత్రాలు]

‘మీరు మీ ఇల్లు కట్టుకునేందుకు త్వరపడుచున్నారా?’

[28వ పేజీలోని చిత్రం]

యెహోవా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు, అలాగే ఆశీర్వదించాడు