కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“నేను మీకు తోడుగా ఉన్నాను”

“నేను మీకు తోడుగా ఉన్నాను”

“నేను మీకు తోడుగా ఉన్నాను”

“యెహోవా దూత . . . ప్రకటించినదేమనగా​—⁠నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.”​—⁠హగ్గయి 1:13.

మనం చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన కాలంలో జీవిస్తున్నాం. బైబిలు ప్రవచన నెరవేర్పు రుజువు చేసినట్లుగా, 1914 నుండి మనం ‘ప్రభువు దినములో’ ఉన్నాం. (ప్రకటన 1:​10) ఈ విషయం మీకు తెలిసే ఉండవచ్చు, అలాగే యేసు, రాజ్యాధికారంలోవున్న ‘మనుష్యకుమారుని దినములను’ ‘నోవహు దినములతో,’ ‘లోతు దినములతో’ పోల్చిన విషయమూ మీకు తెలుసు. (లూకా 17:​26, 28) అందుకే ఈ సంఘటనలకూ మనకాలానికీ పోలిక ఉందని బైబిలు సూచిస్తోంది. అయితే, మనం గంభీరంగా పరిశీలించవలసిన మరో పోలిక కూడా ఉంది.

2 పూర్వం హెబ్రీ ప్రవక్తలైన హగ్గయి జెకర్యాల కాలంలో నెలకొన్న ఒక పరిస్థితిని మనం పరిశీలిద్దాం. ఆ ఇద్దరు నమ్మకమైన ప్రవక్తలు, మన కాలంలోని యెహోవా ప్రజలకు ప్రత్యేకంగా వర్తించే ఏ సందేశాన్ని అందించారు? యూదులు బబులోను చెరనుండి తిరిగివచ్చిన తర్వాత హగ్గయి జెకర్యాలు వారికి ‘యెహోవా దూతలుగా’ పనిచేశారు. ఆలయ పునర్నిర్మాణంలో ఇశ్రాయేలీయులకు దేవుని మద్దతు ఉంటుందని ధైర్యపరచాల్సిన పని వారికి అప్పగించబడింది. (హగ్గయి 1:13; జెకర్యా 4:​8, 9) హగ్గయి జెకర్యాలు వ్రాసిన పుస్తకాలు చిన్నవైనా, అవి ‘ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైన, దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనములో’ భాగంగా ఉన్నాయి.​—⁠2 తిమోతి 3:⁠16.

మనం వాటికి అవధానమివ్వాలి

3 నిశ్చయంగా, హగ్గయి జెకర్యాల సందేశాలు అప్పటి యూదులకు ప్రయోజనం చేకూర్చడమే కాక, వారి ప్రవచనాలు ఆ కాలంలో నెరవేరాయి కూడా. కానీ, ఆ రెండు పుస్తకాల్లో నేడు మనమెందుకు ఖచ్చితంగా ఆసక్తి కలిగివుండాలి? దానికిగల ఓ కీలకాన్ని మనం హెబ్రీయులు 12:26-29లో చూడవచ్చు. ఆ వచనాల్లో అపొస్తలుడైన పౌలు, దేవుడు ‘ఆకాశమును భూమిని కంపింపజేయడం’ గురించి చెబుతున్న హగ్గయి 2:6ను ఉల్లేఖించాడు. ఆ కంపింపజేయడం చివరకు ‘రాజ్యముల సింహాసనములను క్రింద పడవేసి, అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేస్తుంది.’​—⁠హగ్గయి 2:⁠22.

4 హగ్గయి ప్రవచనాన్ని ఉల్లేఖించిన తర్వాత, పౌలు “అన్యజనుల రాజ్యములకు” సంభవించే దానిగురించి చెబుతూ, అభిషిక్త క్రైస్తవులు పొందే నిశ్చలమైన రాజ్యంయొక్క ఔన్నత్యం గురించి మాట్లాడాడు. (హెబ్రీయులు 12:​28) దీనినుండి మీరు హగ్గయి జెకర్యా ప్రవచనాలు, మన సామాన్య శకం మొదటి శతాబ్దంలో హెబ్రీయుల పుస్తకం వ్రాసే సమయానికి, ఇంకా భవిష్యత్తులోవున్న కాలాన్ని సూచిస్తున్నట్లు గమనించవచ్చు. మెస్సీయ రాజ్యానికి యేసు తోటి వారసులుగా ఉండే అభిషిక్త క్రైస్తవుల శేషం నేడు ఇంకా భూమ్మీద ఉంది. కాబట్టి, హగ్గయి జెకర్యా ప్రవచనాలకు మనకాలంలో కూడా ప్రాముఖ్యత ఉంది.

5 ఎజ్రా పుస్తకం కొంత చారిత్రక నేపథ్యాన్ని అందిస్తోంది. సా.శ.పూ. 537లో యూదులు బబులోను చెరనుండి తిరిగివచ్చిన తర్వాత, అధిపతియైన జెరుబ్బాబెలు, ప్రధానయాజకుడైన యెహోషువ (లేదా యేషూవ) సా.శ.పూ. 536లో క్రొత్త ఆలయానికి పునాది వేసే పనిని పర్యవేక్షించారు. (ఎజ్రా 3:​8-13; 5:1) ఆ పని ఎంతో సంతోషాన్నిచ్చినా, కొద్దిరోజుల్లోనే యూదులను భయం ఆవహించడం ప్రారంభించింది. శత్రువులైన ఆ “దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి” అని ఎజ్రా 4:4 చెబుతోంది. ఆ శత్రువులు, ప్రత్యేకంగా సమరయులు యూదులపై అబద్ధారోపణలు చేశారు. ఆలయ నిర్మాణ పనిని నిషేధించేలా ఆ విరోధులు పారసీక రాజును ఒప్పించారు.​—⁠ఎజ్రా 4:​10-21.

6 ఆలయ నిర్మాణంలో ముందున్న ఉత్సాహం సన్నగిల్లింది. యూదులు తమ వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఆలయ పునాది వేయబడిన 16 సంవత్సరాల తర్వాత అంటే సా.శ.పూ. 520లో ఆలయ పనిని తిరిగి ఆరంభించేలా ప్రజల్ని పురికొల్పేందుకు యెహోవా, హగ్గయి జెకర్యాలను నియమించాడు. (హగ్గయి 1:1; జెకర్యా 1:⁠1) దేవుని సందేశకుల ద్వారా పురికొల్పబడడమే కాక, యెహోవా తోడ్పాటుకు సంబంధించిన స్పష్టమైన రుజువుతో యూదులు ఆలయ పనిని పునఃప్రారంభించి సా.శ.పూ. 515లో దానిని పూర్తిచేశారు.​—⁠ఎజ్రా 6:14, 15.

7 ఇదంతా మనకు ఎలాంటి ప్రాముఖ్యత కలిగివుందో మీకు తెలుసా? మనకు “రాజ్య సువార్త” ప్రకటించడానికి సంబంధించిన పని ఉంది. (మత్తయి 24:​14) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పనికి ప్రత్యేక శ్రద్ధ ఇవ్వబడింది. ప్రాచీనకాల యూదులు అక్షరార్థ బబులోను చెరనుండి విడిపించబడినట్లుగానే, యెహోవా ఆధునిక ప్రజలు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన మహా బబులోను చెరనుండి విడుదల చేయబడ్డారు. దేవుని అభిషిక్తులు ప్రకటనా, బోధనా పనిని, ప్రజల్ని సత్యారాధనవైపు మళ్లించే పనిని శ్రద్ధగా కొనసాగించారు. ఆ పని నేడు మరింత విస్తృతస్థాయిలో జరుగుతోంది, అంతేకాక, మీరు కూడా దానిలో భాగం వహిస్తుండవచ్చు. ఆ ప్రకటనా పని చేయవలసిన సమయమిదే, ఎందుకంటే ఈ దుష్ట విధానపు అంతం సమీపించింది! దేవుడు అప్పగించిన ఈ పని, ‘మహా శ్రమలో’ యెహోవా మానవ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేవరకు కొనసాగాలి. (మత్తయి 24:​21) అది దుష్టత్వాన్ని పూర్తిగా నిర్మూలించి, భూవ్యాప్తంగా సత్యారాధన విలసిల్లేలా చేస్తుంది.

8 హగ్గయి జెకర్యాల ప్రవచనాలు చూపిస్తున్నట్లుగా, ఈ పనిలో మనం పూర్ణహృదయంతో భాగంవహిస్తుండగా యెహోవా మద్దతు, అనుగ్రహం ఉంటాయనే నిశ్చయతతో ఉండవచ్చు. దేవుని సేవకులను అణచివేయాలనో లేక వారి నియమిత పనిని నిషేధించాలనో కొందరు ప్రయత్నించినా, సువార్త ప్రకటనా పని పురోగతిని ఏ ప్రభుత్వమూ ఆపలేకపోయింది. మొదటి ప్రపంచ యుద్ధానంతర దశాబ్దాలు మొదలుకొని మనకాలం వరకు రాజ్య పని పురోగతిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో ఆలోచించండి. అయితే చేయవలసిన పని ఇంకా ఎంతో ఉంది.

9 హగ్గయి జెకర్యా పుస్తకాల నుండి మనం నేర్చుకునే విషయాలు ప్రకటించి, బోధించమని దేవుడిచ్చిన ఆజ్ఞకు మరింతగా లోబడేలా మనల్ని ఎలా పురికొల్పగలవు? ఈ రెండు బైబిలు పుస్తకాలనుండి మనం గ్రహించగల కొన్ని పాఠాలను మనం పరిశీలిద్దాం. ఉదాహరణకు, యెరూషలేముకు తిరిగివచ్చిన యూదులు చేయవలసిన ఆలయ నిర్మాణ పనికి సంబంధించిన కొన్ని వివరాల్ని పరిశీలిద్దాం. ముందు పేర్కొన్నట్లుగా, బబులోను నుండి యెరూషలేముకు తిరిగివచ్చిన యూదులు ఆలయ పనిని పట్టుదలగా కొనసాగించలేదు. పునాది వేసిన తర్వాత వారు నీరసించారు. వారిలో ఎలాంటి తప్పుడు దృక్కోణం వృద్ధయింది? మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు?

సరైన వైఖరిని అలవరచుకోవడం

10 యెరూషలేముకు తిరిగి వచ్చిన యూదులు ఇలా అన్నారు: “సమయమింకరాలేదు.” (హగ్గయి 1:⁠2) సా.శ.పూ. 536లో పునాది వేసి, ఆలయ నిర్మాణ పనిని ఆరంభించినప్పుడు, వారు “సమయమింకరాలేదు” అనలేదు. కానీ వారు కొద్దికాలానికే పొరుగువారి వ్యతిరేకత, ప్రభుత్వ జోక్యం తమపై ప్రభావం చూపేందుకు అనుమతించారు. ఆ యూదులు తమ సొంత ఇళ్లకు, తమ సుఖాలకు ఎక్కువ శ్రద్ధనివ్వడం ఆరంభించారు. మంచి కలపతో కట్టుకున్న వారి ఇళ్లకూ, పూర్తికాని దేవాలయానికీ మధ్యగల తేడాను ప్రస్తావిస్తూ యెహోవా వారినిలా అడిగాడు: “ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?”​—⁠హగ్గయి 1:⁠4.

11 అవును, ప్రాధాన్యతల విషయంలో యూదుల దృక్కోణం మారింది. ఆలయాన్ని పునర్నిర్మించాలనే యెహోవా సంకల్పానికి మొదటి స్థానమిచ్చే బదులు, దేవుని ప్రజలు తమ స్వవిషయాలపై, తమ ఇళ్లపై దృష్టి కేంద్రీకరించారు. దేవుని ఆరాధనా మందిర నిర్మాణ పని నిర్లక్ష్యం చేయబడింది. హగ్గయి 1:5లో వ్రాయబడిన యెహోవా మాటలు, ‘తమ ప్రవర్తన గురించి ఆలోచించుకోమని’ యూదులను ప్రోత్సహించాయి. ఆగి, తాము చేస్తున్న పనిని పరిశీలించి చూసుకోమనీ, తమ జీవితాల్లో ఆలయ నిర్మాణ పనికి ప్రథమ స్థానమివ్వకుంటే అది తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచించమనీ యెహోవా వారికి చెబుతున్నాడు.

12 మీరు ఊహించగలిగినట్లే, యూదులు తప్పుడు విషయాలకు ప్రాధాన్యతనివ్వడం వారిపై వ్యక్తిగతంగా ప్రభావం చూపించింది. హగ్గయి 1:6లో వ్యక్తం చేయబడిన ఈ దృక్కోణాన్ని గమనించండి: “మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, [‘త్రాగుచున్ననూ, మత్తెక్కడం లేదు,’ NW] బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.”​—⁠హగ్గయి 1:⁠6.

13 ఆ యూదులు దేవుడు వారికిచ్చిన దేశంలో ఉన్నారు, అయినాసరే అది కోరుకున్నంత పంటనివ్వడం లేదు. ముందుగా హెచ్చరించినట్లే, యెహోవా వారిని ఆశీర్వదించలేదు. (ద్వితీయోపదేశకాండము 28:​38-48) ఆయన సహాయం లేకుండా, యూదులు విత్తినా వారికి అంతంతమాత్రమే కోత లభిస్తోంది, కడుపునిండా ఆహారం లభించడం లేదు. ఆయన ఆశీర్వాదం లేదు కాబట్టి, వారు వెచ్చని దుస్తులు ధరించలేకపోతున్నారు. చివరికి పనివారికి జీతంవల్ల ఏ మాత్రం లాభం లేకపోగా, వారు సంపాదించింది మొత్తం చిల్లు సంచిలో వేసినట్లుగా ఉంది. మరి ‘త్రాగుచున్ననూ, మత్తెక్కడం లేదు’ అనే మాటల అర్థమేమిటి? అంటే దానర్థం మత్తెక్కేంతగా త్రాగడం దేవుని ఆశీర్వాదానికి రుజువని కాదు; ఆయన త్రాగుబోతుతనాన్ని ఖండిస్తున్నాడు. (1 సమూయేలు 25:36; సామెతలు 23:​29-35) బదులుగా ఆ మాటలు, యూదులపై దేవుని ఆశీర్వాదం లేదని సూచిస్తున్నాయి. వారు తయారుచేసుకునే ద్రాక్షారసం పరిమితంగా ఉంటుంది, మత్తెక్కేంతగా త్రాగడానికి సరిపడేంత సమృద్ధిగా ఉండదు. హగ్గయి 1:6ను రివైజ్డ్‌ స్టాండార్డ్‌ వర్షన్‌ ఇలా అనువదిస్తోంది: “మీరు త్రాగినా, మీకు తృప్తి తీరదు.”

14 దీనంతటి నుండి మనం నేర్చుకోవలసిన పాఠం, మన ఇళ్లు ఎలావుండాలి, వాటిని ఎలా అలంకరించాలనేది కాదు. చెరకు వెళ్లడానికి ఎంతోకాలం ముందే, ప్రవక్తయైన ఆమోసు ధనవంతులైన ఇశ్రాయేలీయులు “దంతపు నగరులను” కలిగివున్నందుకు, ‘దంతపు మంచముల మీద పరుండుచున్నందుకు’ వారిని గద్దించాడు. (ఆమోసు 3:​15; 6:⁠4) వారి అలంకృత గృహాలు, అందమైన సామాగ్రి నిలవలేదు. వారిని జయించిన శత్రువులు వాటిని దోచుకున్నారు. అయినప్పటికీ, దేవుని ప్రజల్లో చాలామంది అనేక సంవత్సరాల తర్వాత, అంటే 70 సంవత్సరాల చెర తర్వాత కూడా పాఠం నేర్చుకోలేదు. మనమేమైనా నేర్చుకుంటామా? మనలో ప్రతీ ఒక్కరూ ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘నిజాయితీగా చూసుకుంటే, మా ఇంటికి, దాని అలంకరణకు నేనెంత ప్రాముఖ్యతనిస్తున్నాను? వృత్తిలో ఎదిగేందుకు, అదనపు విద్యనభ్యసించడం, నా ఆధ్యాత్మిక జీవితంలోని ప్రాముఖ్యమైన విషయాలకు చోటులేకుండా చేయడమే కాక, చాలా సంవత్సరాలపాటు అధిక సమయాన్ని తీసుకునేదైనా, అలాగే విద్యనభ్యసించాలనుకోవడం మాటేమిటి?’​—⁠లూకా 12:20, 21; 1 తిమోతి 6:17-19.

15హగ్గయి 1:6లో మనం చదివేది మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదపు అవసరం గురించి ఆలోచించేలా చేయాలి. ఆ ప్రాచీనకాల యూదులు దేవుని ఆశీర్వాదం లేకపోవడంవల్లే తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నారు. మనకు ఎంతో సంపదవున్నా లేకపోయినా, యెహోవా ఆశీర్వాదం మనపై లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా మన ఆధ్యాత్మికతపై హానికర ప్రభావం చూపిస్తుంది. (మత్తయి 25:34-40; 2 కొరింథీయులు 9:​8-12) అయితే, మనమా ఆశీర్వాదాన్ని ఎలా పొందవచ్చు?

యెహోవా తన ఆత్మద్వారా సహాయం చేస్తాడు

16 హగ్గయి తోటి ప్రవక్తయైన జెకర్యా, ఆ కాలంలోని విశ్వాసులను యెహోవా దేని మూలంగా పురికొల్పి, ఆశీర్వదించాడో ఆ మాధ్యమాన్ని నొక్కిచెప్పేందుకు ప్రేరేపించబడ్డాడు. అది ఆయన మనల్ని కూడా ఎలా ఆశీర్వదిస్తాడో చూపిస్తుంది. మనమిలా చదువుతాం: “శక్తిచేతనైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను.” (జెకర్యా 4:⁠6) ఈ వచనం ఉల్లేఖించబడడాన్ని మీరు తరచూ వినే ఉండవచ్చు, అయితే హగ్గయి జెకర్యాల కాలంలోని యూదులకు అదెంత ప్రాముఖ్యంగా ఉంది, అలాగే అది మీ విషయంలో ఎలాంటి భావం కలిగివుంది?

17 హగ్గయి జెకర్యాల ఆ ప్రేరేపిత వాక్కులు ఆ కాలంలో అద్భుతమైన ప్రభావం చూపించాయని గుర్తుతెచ్చుకోండి. ఆ ఇద్దరు ప్రవక్తల మాటలు నమ్మకస్థులైన యూదుల్ని పునరుత్తేజితుల్ని చేశాయి. హగ్గయి సా.శ.పూ. 520లోని ఆరవ నెలలో ప్రవచించడం ఆరంభించాడు. జెకర్యా అదే సంవత్సరం ఎనిమిదవ నెలలో ప్రవచించడం ఆరంభించాడు. (జెకర్యా 1:⁠1) హగ్గయి 2:⁠18లో మీరు చూస్తున్నట్లుగా, తొమ్మిదవ నెలలో నిండుహృదయంతో పునాది వేయడం తిరిగి ఆరంభమైంది. కాబట్టి యూదులు పనిచేయడానికి పురికొల్పబడి, యెహోవా మద్దతుపై పూర్తినమ్మకంతో ఆయనకు విధేయులయ్యారు. జెకర్యా 4:6లోని మాటలు దేవుని మద్దతు గురించి తెలియజేస్తున్నాయి.

18 యూదులు సా.శ.పూ. 537లో తమ స్వదేశానికి తిరిగివచ్చినప్పుడు, వారికి సైనిక బలం లేదు. అయినప్పటికీ, యెహోవా వారిని కాపాడి, బబులోను నుండి తిరిగి వస్తున్నప్పుడు వారిని నడిపించాడు. ఆ తర్వాత కొద్దికాలానికే వారు ఆలయ పని ఆరంభించినప్పుడు ఆయన తన ఆత్మద్వారా పరిస్థితుల్ని నిర్దేశించాడు. వారు పూర్ణహృదయంతో పనిని తిరిగి ఆరంభించినప్పుడు, ఆయన తన పరిశుద్ధాత్మద్వారా వారిని బలపరుస్తాడు.

19 దేవాలయ పనిని చివరివరకు నమ్మకంగా చేసే తన ప్రజలతో యెహోవా ఉంటాడని, ఎనిమిది దర్శనాల పరంపర ద్వారా జెకర్యాకు హామీ ఇవ్వబడింది. ఆలయ నిర్మాణపనిని పూర్తి చేయకుండా యూదుల ప్రయత్నాలను నిరోధించడంలో సాతాను చురుకుగా పనిచేశాడని మూడవ అధ్యాయంలో వ్రాయబడిన నాల్గవ దర్శనం చూపిస్తోంది. (జెకర్యా 3:⁠1) క్రొత్త ఆలయంలో ప్రజల పక్షాన ప్రధానయాజకుడైన యెహోషువ సేవలందించడం సాతానుకు ఏ మాత్రం ఇష్టం లేదు. ఆలయం నిర్మించకుండా యూదులను అడ్డుకోవడంలో అపవాది చురుకుగా పనిచేసినప్పటికీ, ఆ అడ్డంకులను తొలగించి, ఆలయ నిర్మాణం పూర్తయ్యేవరకు ముందుకుసాగేలా యూదులను బలపర్చడంలో యెహోవా ఆత్మ కీలక పాత్ర వహిస్తుంది.

20 పనిపై నిషేధం తీసుకురాగలిగిన ప్రభుత్వాధికారుల నుండి వస్తున్న వ్యతిరేకత దుర్భేద్యమైన అడ్డంకిలా కనబడింది. అయినప్పటికీ, ‘పర్వతంలా’ కనబడుతున్న ఆ అడ్డంకి తొలగించబడి “చదును భూమి”గా మారుతుందని యెహోవా వాగ్దానం చేశాడు. (జెకర్యా 4:⁠7) అదే జరిగింది! రాజైన దర్యావేషు పరిశోధన చేసి, యూదులు ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అధికారమిస్తూ కోరెషు ఇచ్చిన ఆజ్ఞాపత్రాన్ని కనుగొన్నాడు. దానితో దర్యావేషు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ, యూదుల పనికయ్యే ఖర్చుల కోసం రాజు ఖజానానుండి వారికి డబ్బు చెల్లించాలని ఆజ్ఞాపించాడు. పరిస్థితిలో ఎంత అసాధారణ మార్పోకదా! ఈ విషయంలో దేవుని ఆత్మ ఏదైనా పాత్ర వహించిందా? పాత్ర వహించిందనే మనం నమ్మవచ్చు. దర్యావేషు I పరిపాలనలోని ఆరవ సంవత్సరంలో అంటే సా.శ.పూ. 515లో ఆలయం పూర్తిచేయబడింది.​—⁠ఎజ్రా 6:1, 15.

21హగ్గయి 2:5లో ప్రవక్త, సీనాయి పర్వతం ‘మిక్కిలి కంపించిన’ సమయంలో యూదులతో దేవుడు స్థిరపరచిన నిబంధనను వారికి గుర్తుచేశాడు. (నిర్గమకాండము 19:​18) ఆరు, ఏడు వచనాల్లోని అలంకారార్థ భాష వర్ణించినట్లుగా, హగ్గయి జెకర్యాల కాలంలో యెహోవా మరోసారి కంపింపజేస్తాడు. అప్పుడు పర్షియా సామ్రాజ్యంలో పరిస్థితులు అస్థిరమవుతాయి, అయితే ఆలయపని ముందుకుసాగి పూర్తి చేయబడుతుంది. చివరకు ఆ ఆరాధనా స్థలంలో యూదులతోపాటు, “అన్యజనులందరియొక్క యిష్టవస్తువు[లైన]” యూదేతరులు కూడా దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుడు మనకాలంలో మన క్రైస్తవ ప్రకటన మూలంగా భారీ ఎత్తున ‘అన్యజనులను కదిలించాడు.’ తత్ఫలితంగా, అభిషిక్త శేషముతో కలిసి దేవుణ్ణి ఆరాధించేందుకు “అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” వస్తున్నారు. నిజానికి అభిషిక్తులు, వేరేగొర్రెలకు చెందిన ప్రజలు కలిసి యెహోవా మందిరాన్ని మహిమతో నింపుతున్నారు. అలాంటి సత్యారాధకులందరూ, యెహోవా అలంకారార్థ భావంలో ‘ఆకాశాన్నీ, భూమినీ కంపింపజేసే’ సమయం కోసం విశ్వాసంతో వేచివున్నారు. జనాంగాల రాజ్యాల బలాన్ని పడద్రోసి, నాశనం చేయడానికే అలా కంపింపజేయబడుతోంది.​—⁠హగ్గయి 2:22.

22 ‘ఆకాశము, భూమి, సముద్రము, నేల’ సూచిస్తున్న వివిధమైన అంశాల్లో సంభవించిన సంక్షోభాలు మనకు గుర్తు చేయబడుతున్నాయి. అపవాదియైన సాతాను, అతని దయ్యాలు భూమ్మీదికి పడద్రోయబడడం వీటిలో ఒకటి. (ప్రకటన 12:​7-12) అంతేకాక, దేవుని అభిషిక్తులు నాయకత్వం వహిస్తున్న ప్రకటనా పని ఈ విధానపు మానవ సమాజాన్ని నిశ్చయంగా కంపింపజేసింది. (ప్రకటన 11:​18) అయినప్పటికీ, అన్ని జనాంగాల ఇష్టవస్తువులైన “ఒక గొప్ప సమూహము” యెహోవా సేవలో ఆధ్యాత్మిక ఇశ్రాయేలుతో చేతులు కలిపింది. (ప్రకటన 7:​9, 10) దేవుడు త్వరలోనే అర్మగిద్దోనులో జనాంగాలను కంపింపజేస్తాడనే సువార్తను ప్రకటించడంలో గొప్ప సమూహం అభిషిక్త క్రైస్తవులతో కలిసి పనిచేస్తుంది. ఆ సంఘటన భూవ్యాప్తంగా సత్యారాధన పరిపూర్ణ స్థితికి తీసుకురాబడేందుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో హగ్గయి జెకర్యాలు సేవచేశారు?

హగ్గయి జెకర్యాలు ఇచ్చిన సందేశాన్ని మీరెలా అన్వయించుకోవచ్చు?

జెకర్యా 4:6 ప్రోత్సాహకరంగా ఉన్నట్లు మీరెందుకు అంగీకరిస్తారు?

[అధ్యయన ప్రశ్నలు]

1. మన కాలానికి సంబంధించిన ఏ ప్రవచనార్థక పోలికను యేసు ప్రస్తావించాడు?

2. హగ్గయి జెకర్యాలను యెహోవా ఏ పనికి నియమించాడు?

3, 4. హగ్గయి జెకర్యాల సందేశాల్లో మనమెందుకు ఆసక్తి కలిగివుండాలి?

5, 6. హగ్గయి జెకర్యాల సేవకు సంబంధించిన నేపథ్యమేమిటి?

7. ఆ ప్రవక్తల కాలంలోని పరిస్థితికీ, నేటి పరిస్థితికీ ఎలాంటి పోలిక ఉంది?

8. మన పనికి దేవుని మద్దతు ఉంటుందనే నిశ్చయతతో మనమెందుకు ఉండవచ్చు?

9. ఏ ప్రాచీనకాల పరిస్థితికి మనం అవధానమివ్వాలి, ఎందుకు?

10. యూదులు ఎలాంటి తప్పుడు వైఖరిని అలవర్చుకున్నారు, దాని ఫలితమేమిటి?

11. హగ్గయి కాలంలోని యూదులను యెహోవా ఎందుకు హెచ్చరించవలసివచ్చింది?

12, 13. హగ్గయి 1:​6, యూదుల పరిస్థితిని ఎలా వర్ణిస్తోంది, ఆ వచనం అర్థమేమిటి?

14, 15. హగ్గయి 1:6 నుండి మనమే పాఠం నేర్చుకుంటాం?

16-18. ప్రాచీనకాలంలో జెకర్యా 4:6 ఏ భావాన్ని సంతరించుకుంది?

19. దేవుని ఆత్మ ఎలాంటి బలమైన ప్రభావాన్ని అధిగమించింది?

20. దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు పరిశుద్ధాత్మ యూదులకు ఎలా సహాయం చేసింది?

21. (ఎ) ప్రాచీన కాలాల్లో, దేవుడు ఎలా ‘అన్యజనులనందరిని కదిలించాడు,’ “యిష్టవస్తువులు” ఎలా వచ్చారు? (బి) ఆధునిక కాలంలో దాని నెరవేర్పు ఏమిటి?

22. జనాంగాలు ఎలా ‘కంపింపజేయబడుతున్నాయి,’ దాని ఫలితమేమిటి, ఇంకా ఏమి సంభవించనుంది?

[20వ పేజీలోని చిత్రాలు]

హగ్గయి జెకర్యాల పుస్తకాలు దేవుని మద్దతు మనకు లభిస్తుందనే హామీనిస్తున్నాయి

[23వ పేజీలోని చిత్రం]

“ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?”

[24వ పేజీలోని చిత్రం]

‘జనాంగముల ఇష్టవస్తువులకు’ ప్రకటించడంలో యెహోవా ప్రజలు భాగం వహిస్తున్నారు