కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక వ్యక్తి దయ్యాలచేత పీడింపబడుతుంటే, ఆ యాతన నుండి విముక్తి పొందడానికి ఆయనేమి చేయవచ్చు?

దయ్యాలచేత పీడింపబడుతున్నవారు ఆ యాతన నుండి విముక్తి పొందవచ్చని దేవుని వాక్యం చూపిస్తోంది. అలా విముక్తి పొందడంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. (మార్కు 9:25-29) కానీ దయ్యాలచేత బాధింపబడుతున్నవారు అదనపు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల జీవితాల్లో జరిగిన సంఘటనలు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో చూపిస్తాయి.

క్రీస్తు అనుచరులు కాకముందు, ప్రాచీన ఎఫెసులోని కొందరు వ్యక్తులకు అభిచారంతో సంబంధముండేది. అయితే, వారు దేవుని సేవించాలని తీర్మానించుకున్న తర్వాత, “మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి.” (అపొస్తలుల కార్యములు 19:​19) క్రొత్తగా విశ్వాసంలోకి వచ్చిన ఆ ఎఫెసు వాసులు మాంత్రికవిద్యకు సంబంధించిన తమ పుస్తకాలను నాశనం చేయడం ద్వారా, నేడు దయ్యాల దాడుల నుండి తప్పించుకోవాలని ఆశించేవారికి ఒక మాదిరినుంచారు. అలాంటివారు అభిచారానికి సంబంధించిన వస్తువులన్నింటినీ వదిలించుకోవాలి. వాటిలో పుస్తకాలు, పత్రికలు, సినిమాలు, కంప్యూటర్‌లో లభించే సమాచారం, అభిచారాన్ని ప్రోత్సహించే పాటల రికార్డింగులు, తాయత్తులు, లేక “రక్షణ” కొరకు ధరించే లేదా క్షుద్రాచారాలతో సంబంధమున్న ఇతర రక్షరేకులు కూడా ఇమిడివున్నాయి.​—⁠ద్వితీయోపదేశకాండము 7:25, 26; 1 కొరింథీయులు 10:21.

ఎఫెసులోని క్రైస్తవులు మాంత్రికవిద్యకు సంబంధించిన తమ పుస్తకాలను నాశనం చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: ‘దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము.’ (ఎఫెసీయులు 6:12) క్రైస్తవులను పౌలు ఇలా ఉద్బోధించాడు: “మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి.” (ఎఫెసీయులు 6:11) ఆ సలహా ఈనాటికీ అన్వయించుకోదగినదే. దురాత్మల బారినుండి తప్పించుకోవాలంటే క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక ఆయుధాలను సిద్ధంగా ఉంచుకోవాలి. “ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు” అని పౌలు నొక్కి చెబుతున్నాడు. (ఎఫెసీయులు 6:16) బైబిలు అధ్యయనం చేయడంద్వారా ఒక వ్యక్తి తన విశ్వాసాన్ని బలపర్చుకుంటాడు. (రోమీయులు 10:17; కొలొస్సయులు 2:​6-7) కాబట్టి, దురాత్మల ప్రభావాన్ని అడ్డుకోవడానికి డాలులా ఉపయోగపడే విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి క్రమ బైబిలు అధ్యయనం సహాయం చేస్తుంది.​—⁠కీర్తన 91:4; 1 యోహాను 5:⁠5.

ఎఫెసులోని ఆ క్రైస్తవులు మరో ప్రాముఖ్యమైన చర్య తీసుకోవాల్సి వచ్చింది. పౌలు వారికిలా చెప్పాడు: “ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయు[డి].” (ఎఫెసీయులు 6:18) అవును, నేడు దయ్యాలు పెట్టే యాతననుండి విముక్తి పొందాలనుకునేవారు యెహోవా సంరక్షణకోసం ప్రార్థన చేయడం ఎంతో ప్రాముఖ్యం. (సామెతలు 18:10; మత్తయి 6:13; 1 యోహాను 5:18, 19) బైబిలు సముచితంగానే ఇలా అంటోంది: “కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును.”​—⁠యాకోబు 4:⁠7.

దయ్యాలచేత పీడింపబడుతున్న వ్యక్తి విముక్తి పొందడం కోసం తప్పక తీవ్రంగా ప్రార్థించాలి అయితే, నిజంగా యెహోవాను సేవించాలని కోరుకుంటూ, దురాత్మలకు వ్యతిరేకంగా పోరాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న వ్యక్తి కోసం, ఇతర నిజ క్రైస్తవులు కూడా ప్రార్థించవచ్చు. దయ్యాలచేత పీడింపబడుతున్న వ్యక్తి వాటి దాడులనుండి తప్పించుకునేందుకు ఆధ్యాత్మిక శక్తిని పొందేలా సహాయం చేయమని వారు దేవుణ్ణి విన్నవించుకోవచ్చు. “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును” అని దేవుని వాక్యం చెబుతోంది కాబట్టి, ‘అపవాదిని ఎదిరించేందుకు’ తీవ్రంగా కృషిచేస్తున్నవారందరికీ దేవుని సేవకులు చేసే ప్రార్థనలు తప్పక ప్రయోజనం చేకూరుస్తాయి.​—⁠యాకోబు 5:​16.

[31వ పేజీలోని చిత్రం]

ఎఫెసులోని విశ్వాసులు మాంత్రికవిద్యకు సంబంధించిన తమ పుస్తకాలను నాశనం చేశారు