కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎంత బాగా సంభాషిస్తారు?

మీరు ఎంత బాగా సంభాషిస్తారు?

మీరు ఎంత బాగా సంభాషిస్తారు?

“అరవై సంవత్సరాల వ్యక్తి వ్రాసే ప్రేమలేఖ” అనే శీర్షికతో కొద్ది సంవత్సరాల క్రితం జపాన్‌లోని ఒక బ్యాంక్‌ పోటీని నిర్వహించింది. తమ భార్యలపట్ల తమకున్న “యథార్థమైన భావాలను” వ్యక్తం చేయమని 50వ పడిలో, 60వ పడిలో ఉన్న జపనీయులను అది ప్రోత్సహించింది. ఒక అభ్యర్థి తన భార్యకు ఇలా వ్రాశాడు: “నీకు నవ్వురావచ్చు, కానీ నేనీవిషయం నీకు చెప్పకపోతే, తర్వాత నేను చింతించాల్సివస్తుంది, కాబట్టి నేను నా భావాలను ఇలా నొక్కిచెబుతున్నాను: నువ్వు నన్ను పెళ్ళిచేసుకున్నందుకు కృతజ్ఞతలు.”

కొన్ని ప్రాచ్య దేశాలతోపాటు అనేక సంస్కృతుల్లో తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడం ప్రోత్సహించబడడం లేదు. అయినా, 15,000 కన్నా ఎక్కువమంది ఆ ప్రేమలేఖ పోటీలకు ప్రతిస్పందించారు. అది ఎంత ప్రజాదరణ పొందిందంటే, అలాంటి మరో పోటీ నిర్వహించబడి, వ్రాయబడిన లేఖల ఆధారంగా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. చాలామంది తాము ప్రియంగా ఎంచే తమ భాగస్వామిపట్ల తమకున్న భావాలను వ్యక్తం చేయడానికి హృదయాంతరాల్లో ఎంతో ఇష్టపడతారని అది సూచిస్తోంది. అయితే మరికొందరు అలా వ్యక్తం చేయడానికి ఇష్టపడరు. ఎందుకు? ఎందుకంటే ఇతరులు, అంటే భాగస్వామి వంటివారు తమ భావాలను అర్థం చేసుకునేలా చేయడానికి కొంత కృషి, నైపుణ్యం అవసరం కాబట్టి, వారలా చేయడానికి ఇష్టపడకపోవచ్చు.

జపాన్‌లో ఉన్న వృద్ధ దంపతుల మధ్య, విడాకులకు సంబంధించిన చట్టబద్ధమైన చర్యలు చాలావరకు భార్యలే ముందు తీసుకుంటున్నారని, చాలా సంవత్సరాలుగా లోతుగా పాతుకుపోయిన అయిష్టాల కారణంగా వారలా చేస్తున్నారని ఉద్యోగ విరమణ గురించి ఒక పుస్తకం వ్రాసిన హితోషీ కాథో చెబుతున్నాడు. “అయితే, గడ్డుపరిస్థితులు ఎదురైనప్పుడు తమ భావాలను ఒకరితో మరొకరు వ్యక్తం చేసుకోకపోవడం కూడా దానికి కారణం” అని ఆయన చెబుతున్నాడు.

కొన్నిసార్లు తమ భర్తల ఉద్యోగ విరమణ అయిన వెంటనే భార్యలు విడాకుల నోటీసు పంపిస్తారు, అది తెలుసుకొని ఆశ్చర్యపోవడం భర్తల వంతవుతుంది. ఒకరిపట్ల మరొకరికి ఉన్న భావాలను వారు అనేక సంవత్సరాలు చర్చించుకొనివుండకపోవచ్చు. భార్యాభర్తలు తమ భావాలను వ్యక్తం చేయడానికి ప్రయత్నించివుండవచ్చు కానీ వారు ఆ సంభాషణను ఆహ్లాదకరమైన రీతిలో కొనసాగించడంలో విఫలమైవుండవచ్చు. తాము సన్నిహిత సంబంధం వృద్ధిచేసుకునే బదులు పదేపదే వాగ్వివాదాల్లోనే తలమునకలవుతున్నట్లు వారు గమనిస్తారు.

భార్యాభర్తలు తమ భేదాభిప్రాయాలను శాంతియుతంగా ఎలా పరిష్కరించుకొని తమ భావాలను ఆహ్లాదకరమైన రీతిలో వ్యక్తం చేసుకోవచ్చు? దానికి అవసరమైన ఎన్నో ఆచరణసాధ్యమైన సలహాలు, వివాహ సలహాదారుడు ఇటీవల ప్రచురించిన పుస్తకంలో లేవు గానీ అనేక శతాబ్దాలుగా విలువైనదిగా ఎంచబడుతున్న ప్రాచీన పుస్తకమైన బైబిల్లో ఉన్నాయని తెలుసుకోవడం మీకు ఆసక్తికరంగా ఉండవచ్చు.