మీరు దేవుని చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
మీరు దేవుని చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
అమెరికాలో ఓ వ్యక్తి $25,000 (11,25,000 రూపాయల) చెక్కుతో బ్యాంక్‌కు వెళ్ళాడు. ఆయన ఆ డబ్బును ఫిక్సిడ్ డిపాజిట్ చేయాలనుకున్నాడు. అయితే, ఆ డబ్బును స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిగా పెట్టమని బ్యాంక్ ఉద్యోగి సలహా ఇస్తూ, స్టాక్ మార్కెట్ విలువ ఎన్నటికీ పడిపోదని నొక్కిచెప్పాడు. ఆ వ్యక్తి బ్యాంక్ ఉద్యోగి సలహాను పాటించాలనుకున్నాడు. కొద్దికాలానికే, ఆయన పెట్టుబడి పెట్టిన షేర్ల విలువ చాలావరకు పడిపోయింది.
జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం సులభంకాదని ఆ అనుభవం ఉదాహరిస్తోంది. మనం జీవితంలో తీసుకోవలసివచ్చే వివిధ నిర్ణయాల విషయమేమిటి? చాలా నిర్ణయాలు విజయవంతంకావచ్చు లేక విఫలంకావచ్చు, చివరకు, అవి జీవన్మరణ విషయాలుగా కూడా మారవచ్చు. కాబట్టి, మనం జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకుంటున్నామనే నమ్మకంతో ఎలా ఉండవచ్చు?
“ఇదే త్రోవ”
మనం ఆరగించాల్సిన ఆహారం, ధరించాల్సిన దుస్తులు, వెళ్ళాల్సిన స్థలం వంటి విషయాల్లో రోజూ నిర్ణయాలు తీసుకుంటుంటాం. కొన్ని నిర్ణయాలు అల్పమైనవిగా కనిపించినా వాటివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిరావచ్చు. ఉదాహరణకు, మొదటిసారిగా సిగరెట్టు కాల్చాలనే నిర్ణయం తీసుకోవడంవల్ల జీవితాంతం పొగత్రాగే అలవాటుకు బానిసయ్యే అవకాశం ఉంది. చిన్నవిగా కనిపించే నిర్ణయాల ప్రాముఖ్యతను మనమెప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.
చిన్నవిగా కనిపించే విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఎవరి మార్గనిర్దేశం కోసం చూడవచ్చు? మనం క్లిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు మనకు సలహా ఇవ్వడానికి నమ్మదగిన సలహాదారుడు ఉంటే ఎంత బాగుంటుందో కదా! మీరు అలాంటి సలహాదారుణ్ణి కనుగొనవచ్చు. మనకాలానికి అన్వయించే సందేశం ఉన్న ఒక ప్రాచీన పుస్తకం ఇలా చెబుతోంది: “మీరు కుడి తట్టయినను ఎడమ తట్టయినను తిరిగినను—ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.” (యెషయా 30:21) అవి ఎవరి మాటలు? ఆయన మార్గనిర్దేశం నమ్మదగినది అనే నమ్మకంతో మీరు ఎలా ఉండవచ్చు?
పైనున్న హామీ బైబిల్లో ఉంది, దానిని కోట్లాదిమంది అధ్యయనం చేసి, అది సృష్టికర్తయైన యెహోవా దేవుని ప్రేరణ ద్వారా ఇవ్వబడిందని గుర్తించారు. (2 తిమోతి 3:16, 17) మనం రూపొందించబడిన తీరు యెహోవాకు తెలుసు కాబట్టి, మార్గదర్శనానికి ఆయనే శ్రేష్ఠమైన మూలం. ‘నా ఆలోచన నిలుచునని చెప్పుకొనుచు ఆదినుండి కలుగబోవువాటిని తెలియజేయుచూ పూర్వకాలమునుండి యింక జరుగనివాటిని తెలియజేయుచున్న’ వ్యక్తి ఆయనే కాబట్టి, ఆయన భవిష్యత్తును కూడా ముందుగా తెలుసుకోగలడు. (యెషయా 46:10) కాబట్టి, ఒక కీర్తనకర్త యెహోవా దేవుని వాక్యంపట్ల తనకున్న నమ్మకాన్ని ఇలా వ్యక్తంచేశాడు: “నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై యున్నది.” (కీర్తన 119:105) అయినా, నేటి కల్లోలభరిత లోకంలో మన మార్గాన్ని క్షేమంగా గమ్యంవైపు నిర్దేశించుకోవడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తాడు. మనం దేవుని చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చు?
బైబిలు సూత్రాలను అన్వయించుకోండి
క్రైస్తవులు సరైన నిర్ణయాలు తీసుకునేందుకు యెహోవా దేవుడు వారికి దైవిక సూత్రాలను ఇచ్చాడు. బైబిలు సూత్రాలను తెలుసుకొని వాటిని అన్వయించుకోవడాన్ని, ఒక భాష నేర్చుకొని ఆ భాషలో మాట్లాడడంతో పోల్చవచ్చు. మీరు ఒకసారి ఆ భాషపై పట్టుసాధించిన తర్వాత, ఎవరైనా వ్యాకరణ సంబంధమైన తప్పులు చేస్తే మీరు సాధారణంగా వాటిని గుర్తించగలుగుతారు, ఎందుకంటే ఆ వ్యక్తి చెబుతున్నది అంత సరిగా ఉండదు. ఆ వ్యక్తి పలికిన వాక్యంలో ఖచ్చితంగా ఏ వ్యాకరణ సంబంధమైన తప్పు ఉందో మీరు చెప్పలేకపోవచ్చు, కానీ అది తప్పు అని మాత్రం మీకు తెలుస్తుంది. మీరు బైబిలు సూత్రాలను నేర్చుకొని వాటిని మీ జీవితంలో సరైన విధంగా ఎలా అన్వయించుకోవాలో తెలుసుకున్నప్పుడు, మీరు సాధారణంగా ఏదైనా ఒక నిర్ణయం సరైనది కాదనీ, అది దైవిక సూత్రాలకు అనుగుణంగా లేదనీ గుర్తించగలుగుతారు.
ఉదాహరణకు, ఒక యువకుడు తాను ఎలాంటి కేశాలంకరణ ఎంపిక చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సిరావచ్చు. ఫలానా కేశాలంకరణ సరైనది కాదని ఏ బైబిలు నియమమూ నిర్దిష్టంగా చెప్పదు. అయినా, ఒక బైబిలు సూత్రాన్ని పరిశీలించండి. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియలచేత తమ్మును తాము అలంకరించుకొనవలెను.” (1 తిమోతి 2:9, 10) పౌలు ఇక్కడ స్త్రీల గురించి వ్రాస్తున్నాడు గానీ దానిలోని సూత్రం స్త్రీపురుషులిద్దరికీ వర్తిస్తుంది. ఆ సూత్రం ఏమిటి? మనం కనబడే తీరు అణకువను, స్వస్థబుద్ధిని ప్రతిబింబించాలి. కాబట్టి, ‘నా కేశాలంకరణ ఒక క్రైస్తవునికి ఉండాల్సిన అణకువను ప్రతిబింబిస్తోందా?’ అని ఆ యువకుడు తనను తాను ప్రశ్నించుకోవచ్చు.
శిష్యుడైన యాకోబు చెప్పిన క్రింది మాటల నుండి ఒక యువకుడు ఎలాంటి సహాయకరమైన సూత్రాన్ని నేర్చుకోవచ్చు? “వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును.” (యాకోబు 4:4) దేవునికి శత్రువుగా ఉన్న లోకంతో స్నేహితులుగా ఉండడం అనే ఆలోచననే క్రైస్తవులు అసహ్యించుకుంటారు. అలాంటప్పుడు తన తోటివారు ఇష్టపడే కేశాలంకారాన్ని తాను ఇష్టపడడం, తాను దేవుని స్నేహితుడనే అభిప్రాయం కలిగిస్తుందా లేక లోకానికి స్నేహితుడనే అభిప్రాయం కలిగిస్తుందా? తాను ఎలాంటి కేశాలంకారాన్ని ఎంపిక చేసుకోవాలి అనే విషయం గురించి ఆలోచిస్తున్న ఒక యువకుడు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకునేందుకు అలాంటి బైబిలు ఆధారిత సూత్రాలను ఉపయోగించవచ్చు. అవును, నిర్ణయాలు తీసుకునేందుకు దైవిక సూత్రాలు మనకు సహాయం చేస్తాయి. బైబిలు సూత్రాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడానికి మనం అలవాటుపడినప్పుడు, దుష్పరిణామాలు ఉండని జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవడం మనకు సులభమౌతుంది.
ఆదికాండము 4:6, 7, 13-16; ద్వితీయోపదేశకాండము 30:15-20; 1 కొరింథీయులు 10:11) అలాంటి వృత్తాంతాలను చదివి, దైవిక నిర్దేశానికి విధేయులు కావడంవల్ల, దానిని అలక్ష్యం చేయడంవల్ల కలిగే ప్రతిఫలాలను విశ్లేషించడం ద్వారా దేవుణ్ణి సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకునేందుకు మనకు సహాయం చేసే దైవిక సూత్రాలను మనం గ్రహిస్తాం.
మనం దేవుని వాక్యంలో అనేక సూత్రాలను చూడవచ్చు. నిజమే, మన పరిస్థితికి ఖచ్చితంగా అన్వయించే నిర్దిష్ట లేఖనం మనకు దొరకకపోవచ్చు. అయినా, కొందరు దేవుని మార్గనిర్దేశానికి ఎలా అవిధేయులయ్యారో, మరికొందరు దైవిక హెచ్చరికలను ఎలా అలక్ష్యం చేశారో మనం చదవవచ్చు. (ఉదాహరణకు, యేసుక్రీస్తుకూ, ఆయన అపొస్తలుడైన పేతురుకూ మధ్య జరిగిన క్లుప్త సంభాషణనే తీసుకోండి. అరషెకెలు పన్ను వసూలుచేస్తున్నవారు “మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా?” అని పేతురును అడిగినప్పుడు, “చెల్లించును” అని పేతురు జవాబిచ్చాడు. కొంతసేపైన తర్వాత యేసు, పేతురును ఇలా అడిగాడు: “భూరాజులు సుంకమును పన్నును ఎవరియొద్ద వసూలు చేయుదురు? కుమారులయొద్దనా అన్యులయొద్దనా?” “అన్యులయొద్దనే” అని పేతురు జవాబిచ్చినప్పుడు, యేసు ఆయనతో ఇలా అన్నాడు: “ఆలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచిన యెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్ము.” (మత్తయి 17:24-27) ఈ వృత్తాంతంలో మనం ఏ దైవిక సూత్రాలను చూడవచ్చు?
యేసు పేతురును వరుస ప్రశ్నలు అడగడం ద్వారా, తాను దేవుని కుమారుడు కాబట్టి, తాను పన్ను చెల్లించనక్కరలేదని పేతురు గ్రహించేందుకు సహాయం చేశాడు. మొదట్లో పేతురు దానిని గ్రహించలేకపోయినా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి యేసు దయతో సహాయం చేశాడు. ఇతరులు తప్పులు చేసినప్పుడు మనం యేసు మాదిరిని అనుకరిస్తూ, బాధకలిగించే విధంగా వారి తప్పును ఎత్తిచూపే బదులు లేక వారిని ఖండించే బదులు వారిపట్ల దయతో వ్యవహరించడానికి నిర్ణయించుకోవచ్చు.
ఇతరులను అభ్యంతరపెట్టకూడదనే కారణంతోనే పన్ను కట్టడం జరిగిందని పేతురు ఆ తర్వాత గ్రహించగలిగాడు. మనం ఈ వృత్తాంతం నుండి మరో సూత్రాన్ని నేర్చుకోవచ్చు. మన హక్కుల గురించి పట్టుపట్టే బదులు ఇతరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకోవడం చాలా ప్రాముఖ్యం.
ఇతరుల మనస్సాక్షికి గౌరవం చూపించే నిర్ణయాలు తీసుకునేందుకు మనల్ని ఏమి ప్రోత్సహిస్తుంది? పొరుగువారిపట్ల ప్రేమ. దేవుణ్ణి పూర్ణాత్మతో ప్రేమించాలనే ఆజ్ఞ తర్వాత, మనల్ని మనం ప్రేమించుకునేంతగా పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞ అతి ప్రాముఖ్యమైనదని యేసుక్రీస్తు బోధించాడు. (మత్తయి 22:39) అయితే మనం స్వార్థాన్ని ప్రోత్సహించే లోకంలో జీవిస్తున్నాం, పాపభరిత మానవులముగా మనం స్వార్థపూరితంగా ఉండడానికే మొగ్గుచూపుతాం. కాబట్టి, ఒక వ్యక్తి తనను తాను ప్రేమించుకునేంతగా తన పొరుగువారిని ప్రేమించాలంటే, ఆయన తన మనసు మార్చుకోవాలి.—రోమీయులు 12:2.
చాలామంది అలాంటి మార్పులు చేసుకున్నారు. వారు చిన్న నిర్ణయాలు తీసుకుంటున్నా పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నా ఇతరుల మనస్సాక్షిని పరిగణలోకి తీసుకుంటారు. పౌలు ఇలా వ్రాశాడు: “మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక్రియలకు హేతువు చేసికొనక, ప్రేమ కలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి.” (గలతీయులు 5:13) మనం ఆ లేఖనాన్ని ఎలా పాటించవచ్చు? ప్రజలు దేవుని వాక్యం గురించి నేర్చుకునేందుకు సహాయం చేయడానికి ఒక మారుమూల పట్టణానికి తరలివెళ్ళిన ఓ యువతి ఉదాహరణనే తీసుకోండి. ఆమె ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు, తన దుస్తుల ఫ్యాషన్ నగర ప్రమాణాల ప్రకారం అణకువగా ఉన్నా, ప్రజలు దాని గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారని గుర్తించింది. ఆమె దుస్తులు, కనబడేతీరు నమ్రతను కనబరచినా “దేవునివాక్యము దూషింపబడకుండునట్లు” అంత ఫ్యాషన్‌గా లేని దుస్తులు ధరించాలని ఆమె నిర్ణయించుకుంది.—తీతు 2:3.
మీరు కనబడే తీరు లేక మరో వ్యక్తిగత అభిరుచి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సివచ్చినప్పుడు మీరు ఎలా ప్రతిస్పందించేవారు? మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరుల మనస్సాక్షిపట్ల మీకున్న శ్రద్ధను ప్రతిబింబించినట్లయితే, యెహోవా సంతోషిస్తాడనే నమ్మకంతో మీరుండవచ్చు.
దూరదృష్టితో ఉండండి
మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు బైబిలు సూత్రాలు, ఇతరుల మనస్సాక్షి గురించి మాత్రమే కాక, మరే ఇతర విషయాల గురించి కూడా మనం ఆలోచించవచ్చు? క్రైస్తవుల మార్గం ఎగుడుదిగుడుగా, ఇరుకుగా ఉన్నా దేవుడు తాను విధించిన పరిమితుల్లో వారికి ఎంతో స్వేచ్ఛను ఇస్తున్నాడు. (మత్తయి 7:13, 14) మనం తీసుకునే నిర్ణయాలు మన ఆధ్యాత్మిక, మానసిక, భావోద్వేగ, భౌతిక సంక్షేమాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఆలోచించాలి.
మీరు ఒక ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారని అనుకుందాం. బహుశా అనైతికమైన, అనుచితమైన విషయాలేవీ ఆ పనిలో లేకపోవచ్చు. మీరు క్రైస్తవ కూటాలకు, సమావేశాలకు వెళ్ళడానికి వీలవుతుంది. జీతం మీరు ఇంతవరకు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంది. యజమాని మీ నైపుణ్యాన్ని ఎంతో విలువైనదిగా ఎంచుతున్నాడు కాబట్టి, మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. అదీగాక, అలాంటి పని మీకు ఇష్టం కూడా. మీరు ఆ ఉద్యోగంలో చేరకుండా మిమ్మల్ని ఏదైనా ఆపాలా? మీరు ఆ ఉద్యోగంలో పూర్తిగా నిమగ్నమయ్యే అవకాశముందని మీకు అనిపిస్తే అప్పుడేమిటి? మీరు ఓవర్‌టైమ్ చేయడానికి బలవంతపెట్టబడరని మీకు చెప్పబడుతుంది. అయితే ఒక ప్రణాళిక పూర్తి చేసేందుకు మీరు చేయవలసిన దానికన్నా ఎక్కువ చేయడానికి ఇష్టపడతారా? అలాంటి ఓవర్‌టైమ్‌లు తరచూ చేయాల్సివస్తుందా? దానివల్ల మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సివచ్చి, చివరకు మీరు తప్పక పాల్గొనాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమాల నుండి అది మిమ్మల్ని దూరం చేస్తుందా?
జిమ్ తన ఉద్యోగానికి సంబంధించిన పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నాడో గమనించండి. ఆయన అవిశ్రాంతంగా కృషిచేసి తన కంపెనీలో ఉన్నతస్థానానికి చేరుకున్నాడు. చివరకు, ఆయన ప్రాచ్య దేశాల్లోని తన కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా, అమెరికాలోని దాని శాఖకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా, యూరప్‌లోని కంపెనీ కార్యకలాపాలను చూసుకునే బోర్డ్ డైరెక్టర్లలో ఒక సభ్యునిగా పదోన్నతి పొందాడు. అయితే, జపాన్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు డబ్బు, అధికారం సంపాదించుకోవడం ఎంత వ్యర్థమో ఆయన గుర్తించాడు. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు త్వరగా కనుమరుగైంది. ఆయన జీవితం సంకల్పరహితంగా మారిపోయింది. ‘నేను పది సంవత్సరాల తర్వాత ఏమి చేస్తుంటాను?’ అని ఆలోచించాడు. తన భార్యా పిల్లలు తమ జీవితాల్లో మరింత అర్థవంతమైన లక్ష్యాలమీద దృష్టినిలిపారని ఆయన అప్పుడు గుర్తించాడు. వారు ఎన్నో సంవత్సరాలుగా యెహోవాసాక్షులతో సహవసిస్తున్నారు. తన కుటుంబం అనుభవిస్తున్న సంతోషంలో సంతృప్తిలో తాను భాగం వహించాలని జిమ్ కోరుకున్నాడు. దానితో ఆయన బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు.
ఒక క్రైస్తవునిగా సంకల్పవంతమైన జీవితాన్ని గడపడానికి తన జీవనశైలి తనకు ఆటంకంగా ఉందని కొంతకాలానికి జిమ్ గుర్తించగలిగాడు. ఆసియా, అమెరికా, యూరప్‌ల మధ్య తరచూ ప్రయాణించాల్సివచ్చేది కాబట్టి, బైబిలు అధ్యయనానికీ, తోటి విశ్వాసులతో సహవసించడానికీ ఆయనకు సమయం సరిపోయేది కాదు. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది: ‘నేను గత 50 సంవత్సరాలు గడిపిన జీవన విధానాన్నే కొనసాగించాలా లేక క్రొత్త జీవన విధానాన్ని ప్రారంభించాలా?’ ఆయన తన నిర్ణయంవల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావం గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించి ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం ఉండేలా ఒక ఉద్యోగానికి తప్ప మిగతా ఉద్యోగాలన్నిటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాడు. (1 తిమోతి 6:6-8) ఆయన తీసుకున్న నిర్ణయం ఆయనకు సంతోషాన్నిచ్చింది, క్రైస్తవ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యేందుకు ఆయనకు అవకాశమిచ్చింది.
మీరు తీసుకునే నిర్ణయాలు చిన్నవైనా, పెద్దవైనా అవి ప్రాముఖ్యమైనవి. నేడు మీరు తీసుకునే నిర్ణయం విజయానికో లేక వైఫల్యానికో కారణం కావచ్చు, భవిష్యత్తులో జీవన్మరణ విషయంగా కూడా మారవచ్చు. మీరు బైబిలు సూత్రాలను, ఇతరుల మనస్సాక్షిని, మీ చర్యవల్ల కలిగే దీర్ఘకాల ప్రభావాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే మీరు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు దేవుని చిత్తానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి.
[13వ పేజీలోని చిత్రం]
అల్పమైనవిగా కనిపించే నిర్ణయాలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిరావచ్చు
[14వ పేజీలోని చిత్రం]
ఆమె జ్ఞానయుక్తంగా నిర్ణయం తీసుకునేందుకు బైబిలు సూత్రాలు ఆమెకు ఎలా సహాయం చేయగలవు?
[15వ పేజీలోని చిత్రం]
యేసు పేతురుతో దయగా మాట్లాడాడు