మీ భాగస్వామితో సంభాషించడానికి సహాయపడే కీలకాలు
మీ భాగస్వామితో సంభాషించడానికి సహాయపడే కీలకాలు
‘నేనలా అనకుండా ఉండాల్సింది.’ ‘నేను నా భావాలను స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయాను.’ మీ భావాలను మీ భాగస్వామితో చెప్పడానికి ప్రయత్నించిన తర్వాత మీరెప్పుడైనా అలా అనుకున్నారా? సంభాషణ అనేది అభివృద్ధి చేసుకోవాల్సిన ఒక నైపుణ్యం. ఇతర నైపుణ్యాల విషయంలోలాగే దీనిపై కూడా కొందరు త్వరగా పట్టుసాధిస్తున్నట్లు అనిపిస్తుంది, అయితే మరికొందరికి అది కష్టంగా ఉంటుంది. మీరు రెండవ కోవకు చెందినవారైనా, మీరు మీ భావాలను ఆహ్లాదకరమైన రీతిలో, సమర్థంగా వ్యక్తం చేయడం నేర్చుకోవచ్చు.
కొన్నిసార్లు, ప్రజలు తమ భాగస్వాములతో వ్యవహరించే విధానాన్ని సంస్కృతికి సంబంధించిన ఒత్తిళ్ళు ప్రభావితం చేస్తాయి. ‘మగాడిలా వ్యవహరించాలంటే నీవు మరీ ఎక్కువ మాట్లాడకూడదు’ అని పురుషులకు బోధించబడివుండవచ్చు. యాకోబు 1:19) అయితే, ఆ సలహా పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ వర్తిస్తుంది, సంభాషించడమంటే కేవలం మాట్లాడడమే కాదని అది చూపిస్తోంది. ఇద్దరు వ్యక్తులు చాలాసేపు మాట్లాడుకుంటుండవచ్చు, అయితే ఒకరు చెప్పేది మరొకరు విననట్లైతే అప్పుడేమిటి? వారి మధ్య నిజమైన సంభాషణ జరుగకపోవచ్చు. పై లేఖనం చూపిస్తున్నట్లు, వినే నైపుణ్యమే విజయవంతమైన సంభాషణలో పెద్ద పాత్ర పోషిస్తుంది.
ఎక్కువగా మాట్లాడే పురుషులను ప్రజలు అవివేకులుగా, నిజాయితీలేనివారిగా పరిగణించి వారిని చిన్నచూపు చూడవచ్చు. నిజమే, బైబిలు ఇలా చెబుతోంది: ‘ప్రతి మనుష్యుడు వినడానికి వేగిరపడేవానిగా, మాటలాడడానికి నిదానించేవానిగా ఉండాలి.’ (మౌనంగా భావాలు వ్యక్తం చేయడం
భార్యలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయకూడదని కొన్ని సమాజాల్లో భావిస్తారు. భర్తలు కుటుంబ వ్యవహారాల విషయంలో ఉదాసీనంగా ఉండాలని అనుకుంటారు. అలాంటి వాతావరణంలో, ఏదైనా ఒక నిర్దిష్ట పరిస్థితిలో భాగస్వామికి ఏమి కావాలనేది భార్యగానీ భర్తగానీ కేవలం ఊహించవలసి ఉంటుంది. కొంతమంది భార్యలు తమ భర్తల అవసరాలను ఎంతో చక్కగా గుర్తించి వాటిని వెంటనే తీర్చడంలో నిపుణులవుతారు. అలాంటి సందర్భాల్లో, భార్యాభర్తల మధ్య మాటలులేకుండా భావాలు వ్యక్తమవుతుంటాయి. అయితే, సాధారణంగా, అనేక సందర్భాల్లో ఇలాంటి భావ వ్యక్తీకరణ ఒకవైపు నుండే జరుగుతుంది. భార్య తన భర్త ఆలోచనలను లేక భావాలను గుర్తించడం నేర్చుకోవచ్చు, అయితే, భర్త అలాంటి నైపుణ్యాన్నే వృద్ధిచేసుకొని తన భార్య భావాలను గుర్తించాలని అరుదుగా భావించబడుతుంది.
నిజమే, కొన్ని సంస్కృతుల్లో పురుషులు స్త్రీల భావోద్రేక అవసరాలు గమనించి వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తారు. అయితే, అలాంటి సంస్కృతుల్లో కూడా అనేక వివాహాలు చక్కని సంభాషణ నుండి ప్రయోజనం పొందుతాయి.
సంభాషణ చాలా ప్రాముఖ్యం
దాపరికం లేకుండా సంభాషిస్తే అపార్థాలు, అనర్థాలు ఉండవు. ఇశ్రాయేలీయుల చరిత్ర ఆరంభంలో, యొర్దాను నదికి తూర్పున నివసించిన రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధ గోత్రపువారు యొర్దాను దగ్గర “చూపునకు గొప్ప బలిపీఠము” కట్టారు. ఇతర గోత్రాలవారు వారి చర్యలను అపార్థం చేసుకున్నారు. యొర్దాను అవతల ఉన్న తమ సహోదరులు మతభ్రష్టత్వానికి పాల్పడ్డారని భావించి, పడమర దిక్కున ఉన్న గోత్రాలు “తిరుగుబాటుదారుల”తో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. అయితే, వారు యుద్ధానికి వెళ్ళేముందు తూర్పున ఉన్న గోత్రాలవారితో మాట్లాడడానికి ఒక బృందాన్ని పంపించారు. అది ఎంతటి వివేకవంతమైన చర్యో కదా! ఆ బలిపీఠము చట్టవిరుద్ధమైన దహనబలులు లేక బలులు అర్పించడానికి నిర్మించబడలేదని వారు తెలుసుకున్నారు. దానికిబదులు, “యెహోవా యందు మీకు పాలేదియు లేదు” అని ఇతర గోత్రాలవారు భవిష్యత్తులో చెబుతారేమోనని తూర్పున ఉన్న గోత్రాలవారు భయపడ్డారు. తాము కూడా యెహోవా ఆరాధకులమే అనే విషయానికి బలిపీఠము సాక్ష్యంగా నిలుస్తుందని వారు భావించారు. (యెహోషువ 22:10-29) వారు ఆ బలిపీఠానికి సాక్షి అనే పేరుపెట్టారు, వారికి యెహోవాయే సత్యదేవుడనే విషయానికి అది సాక్ష్యంగా నిలుస్తుంది కాబట్టి దానికి అలా పేరు పెట్టివుండవచ్చు.—యెహోషువ 22:34, అధస్సూచి.
ఇతర గోత్రాలవారిని ఒప్పించేందుకు ఆ వివరణ సరిపోయింది, రెండు గోత్రాలవారిమీద, అర్ధ గోత్రపువారిమీద చర్య తీసుకునే విషయంలో ఇతర గోత్రాలవారు మనసు మార్చుకున్నారు. అవును, మనసువిప్పి, దాపరికంలేకుండా మాట్లాడుకున్నందుకు సాయుధ పోరాటం తప్పింది. కొంతకాలం తర్వాత ఇశ్రాయేలు తమ అలంకారార్థ భర్తయైన యెహోవా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు, తాను దయతో ‘ప్రేమగా మాట్లాడతానని’ ఆయన వారితో అన్నాడు. (హోషేయ 2:14) వివాహితులకు అది ఎంత చక్కని మాదిరో కదా! అవును, మీ భాగస్వామి మీ భావాలను అర్థం చేసుకునే విధంగా ఆయనతో లేక ఆమెతో ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించండి. ప్రత్యేకంగా భావోద్రేక సంబంధమైన విషయాలు చర్చించాల్సివచ్చినప్పుడు అలా చేయడం ప్రాముఖ్యం. “మాట్లాడడానికి అంత ఖర్చుకాదని కొందరంటారు, అయితే మాటలు అమూల్యమైనవిగా కూడా ఉండగలవు. తమ భావాలను వ్యక్తం చేయడం కొందరికి కష్టమనిపించవచ్చు, కానీ వ్యక్తం చేయడంవల్ల వచ్చే ఫలితం బ్యాంక్‌లోని డబ్బు కన్నా విలువైనదిగా ఉండవచ్చు” అని అమెరికాలో విలేఖరిగా పనిచేస్తున్న ప్యాటీ మిహాలిక్ చెబుతోంది.
సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ ఉండండి
‘మా వివాహం మొదటినుండి ఒక వైఫల్యమే’ అని కొందరు వాదించవచ్చు. ‘ఈ వివాహాన్ని కాపాడలేము’ అనే నిర్ధారణకు మరికొందరు రావచ్చు. వివాహమైన తర్వాత సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం సాధ్యంకాదని కొందరు అనుకోవచ్చు. అయినా, సొంతవాళ్ళు
వివాహాలు కుదిర్చే సమాజాల్లో నివసిస్తున్నవారి గురించి ఆలోచించండి. అలాంటి సంస్కృతులకు చెందిన చాలామంది, కొంతకాలానికి తమ వివాహ జీవితాల్లో చక్కగా సంభాషించుకోవడం ప్రారంభిస్తారు.ప్రాచ్య దేశానికి చెందిన ఒక జంట, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. పురుషుని కోసం పెళ్ళికూతురిని చూడడానికి దూర ప్రయాణం చేయమని మధ్యవర్తి కోరబడ్డాడు. అయినా, దాదాపు 4,000 సంవత్సరాల క్రితం జీవించిన ఆ దంపతులు సంభాషణా కళలో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇస్సాకు అనే ఆ వ్యక్తి మధ్యవర్తిని, తనకు కాబోయే భార్యను పొలంలో కలుసుకున్నాడు. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి “తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.” ఈ వివాహం గురించిన బైబిలు వృత్తాంతం ఇంకా ఇలా చెబుతోంది: “ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను [రిబ్కాను] తీసికొనిపోయెను [ఈ చర్య అధికారిక వివాహానికి సూచనగా పనిచేసింది]. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను.”—ఆదికాండము 24:62-67.
ఇస్సాకు మొదట వివరాలను తెలుసుకున్న తర్వాతే రిబ్కాను తన భార్యగా స్వీకరించాడనేది గమనించండి. వారికి మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి యెహోవా దేవునికి సమర్పించుకున్న నమ్మదగిన సేవకుడు, ఆ దేవుణ్ణే ఇస్సాకు ఆరాధించాడు. కాబట్టి, ఇస్సాకు ఆ వ్యక్తిని నమ్మడానికి సరైన కారణం ఉంది. ఆ తర్వాత, ఇస్సాకు తాను వివాహమాడిన రిబ్కాను ‘ప్రేమించాడు.’
ఇస్సాకు, రిబ్కాలు మంచి సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారా? తమ కుమారుడు ఏశావు, ఇద్దరు హేతు కుమార్తెలను వివాహం చేసుకున్నప్పుడు తీవ్రమైన కుటుంబ సమస్య తలెత్తింది. రిబ్కా ఇస్సాకుతో “పదే పదే,” ఇలా చెప్పింది: “హేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు [వారి చిన్న కుమారుడు] పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను?” (ఆదికాండము 26:34; 27:46, NW) ఆమె తన వ్యధను స్పష్టంగా, నిర్దిష్టంగా వ్యక్తం చేసిందనడంలో సందేహంలేదు.
కనాను కుమార్తెలలో ఎవరినీ వివాహం చేసుకోవద్దని ఏశావు కవలసహోదరుడైన యాకోబుతో ఇస్సాకు చెప్పాడు. (ఆదికాండము 28:1, 2) రిబ్కా తాను చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టం చేసింది. ఆ దంపతులు తమ కుటుంబానికి సంబంధించిన అతి సున్నితమైన అంశాన్ని విజయవంతంగా మాట్లాడుకొని నేడు మనకోసం ఒక మంచి ఉదాహరణను ఉంచారు. దంపతులు ఏకాభిప్రాయానికి రాలేకపోతే అప్పుడేమిటి? ఏమి చేయవచ్చు?
ఏకాభిప్రాయం లేనప్పుడు
మీకూ, మీ భాగస్వామికీ తీవ్ర భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు, మీ భర్తతో లేక భార్యతో మాట్లాడడం మానేయకండి. అలా చేస్తే, మీరు సంతోషంగా లేరనీ మీ భాగస్వామి కూడా సంతోషంగా ఉండకూడదని మీరు కోరుకుంటున్నారనీ ఎంతో స్పష్టమైన సందేశం వారికి అందుతుంది. అయినా, మీ భాగస్వామి మీ ఆశలను, భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు.
మీరు, మీ భాగస్వామి విషయాలను చర్చించుకోవాల్సి ఉండవచ్చు. వివాదాంశం సున్నితమైన విషయమైతే ప్రశాంతంగా ఉండడం అంత సులభం కాకపోవచ్చు. ఇస్సాకు తల్లిదండ్రులైన అబ్రాహాము, శారాలు ఒకసారి కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. శారాకు పిల్లలు కలగలేదు కాబట్టి ఆమె ఆ రోజుల్లో పాటించబడే ఆచారాన్ని అనుసరించి సంతానం కోసం హాగరు అనే తన దాసిని ఆయనకు ఉపపత్నిగా ఇచ్చింది. హాగరు అబ్రాహాముకు ఒక అబ్బాయిని కన్నది, ఆ బాలుడు ఇష్మాయేలు. అయితే కొంతకాలం తర్వాత శారా గర్భవతియై అబ్రాహాముకు ఒక కుమారుణ్ణి కన్నది, ఆ బాలుడు ఇస్సాకు. ఇస్సాకు పాలువిడిచే రోజున ఇష్మాయేలు తన కుమారుణ్ణి పరిహసించడం శారా గమనించింది. కాబట్టి శారా తన కుమారునికి పొంచివున్న అపాయాన్ని గమనించి దాసిని, ఇష్మాయేలును వెళ్ళగొట్టమని అబ్రాహామును కోరింది. అవును, శారా తన భావాలను నిర్మొహమాటంగా చెప్పింది. అయితే, ఆమె కోరిన విషయం అబ్రాహాముకు ఎంతో దుఃఖాన్ని కలిగించింది.
వారి మధ్య ఉన్న భేదాభిప్రాయం ఎలా పరిష్కరించబడింది? బైబిలు వృత్తాంతం ఇలా చెబుతోంది: “దేవుడు—ఈ చిన్నవానిబట్టియు నీ దాసినిబట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము; ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును.” అబ్రాహాము, యెహోవా దేవుని మార్గనిర్దేశాన్ని విని, దాని ప్రకారం చర్య తీసుకున్నాడు.—ఆదికాండము 16:1-4; 21:1-14.
‘దేవుడు పరలోకం నుండి మాతో మాట్లాడితే మేము త్వరగా ఒక అంగీకారానికి రాగలం!’ అని మీరు అనవచ్చు. వివాహ సంబంధమైన తగాదాలను పరిష్కరించుకునేందుకు సహాయం చేసే మరో కీలకంవైపు అది మనల్ని నడిపిస్తుంది. దంపతులు దేవుడు చెప్పేది వినవచ్చు. ఎలా? 1 థెస్సలొనీకయులు 2:13.
వారు కలిసి దేవుని వాక్యాన్ని చదివి, దానిలోని విషయాలను దేవుని మార్గనిర్దేశంగా స్వీకరించడం ద్వారా.—పరిణతి చెందిన ఒక క్రైస్తవ భార్య ఇలా చెప్పింది: “చాలాసార్లు, ఎవరైనా ఒక యువతి తన వివాహానికి సంబంధించిన సలహా అడగడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు, ఆమె, ఆమె భర్త కలిసి బైబిలు చదువుతున్నారో లేదో చెప్పమని అడుగుతాను. తమ వివాహంలో సమస్యలు ఎదుర్కొంటున్న చాలామందికి ఆ అలవాటు ఉండదు.” (తీతు 2:3-5) ఆమె వ్యాఖ్యానం నుండి మనమందరం ప్రయోజనం పొందవచ్చు. మీ భాగస్వామితో కలిసి దేవుని వాక్యాన్ని క్రమంగా చదవండి. మీరలా చదివితే, ప్రతీ దినం ఎలా ప్రవర్తించాలి అనే అంశం మీద దేవుని మాటలను ‘వింటారు.’ (యెషయా 30:21) అయితే ఒక హెచ్చరిక: మీ భాగస్వామి అన్వయించుకోవడంలో విఫలమవుతున్నట్లు మీకు అనిపిస్తున్న లేఖనాలను పదేపదే చూపిస్తూ బైబిలును మీ భాగస్వామిని కొట్టే బెత్తంగా ఉపయోగించకండి. దానికిబదులు, మీరు చదువుతున్నదానిని మీరిద్దరూ ఎలా ఆచరణలో పెట్టవచ్చో గ్రహించడానికి ప్రయత్నించండి.
మీరు ఒక కష్టమైన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంటే మిమ్మల్ని వేధిస్తున్న నిర్దిష్టమైన సమస్య గురించి వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ * (ఆంగ్లం)లో చెబుతున్న విషయాలను ఎందుకు చూడకూడదు? బహుశా మీరు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకుంటుండవచ్చు, అది మీ వివాహంలో ఒత్తిళ్ళకు కారణంకావచ్చు. మీ భాగస్వామి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయం గురించి వాదించుకునే బదులు, మీరిద్దరూ కలిసి ఇండెక్స్‌ను ఎందుకు చూడకూడదు? మొదట, “పేరెంట్స్” (తల్లిదండ్రులు) అనే ప్రధాన శీర్షిక చూడండి. “కేరింగ్ ఫర్ ఏజ్డ్ పేరెంట్స్” (వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడం) వంటి ఉపశీర్షికల క్రింద పేర్కొనబడిన సాహిత్యాలను చూడడానికి మీరు ఇష్టపడవచ్చు. యెహోవాసాక్షుల ప్రచురణల నుండి ఆ అంశానికి సంబంధించిన ఆర్టికల్స్‌ను కలిసి చదవండి. యథార్థవంతులైన అనేకమంది క్రైస్తవులకు సహాయం చేసిన ఆ బైబిలు ఆధారిత సమాచారం నుండి మీరూ, మీ భాగస్వామీ ఎంతగా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకొని మీరు ఆశ్చర్యపోవచ్చు.
పేర్కొనబడిన సాహిత్యాల కోసం వెతికి వాటిని కలిసి చదవడం మీ సమస్యపట్ల వాస్తవిక దృక్పథాన్ని పెంపొందించుకోవడానికి సహాయం చేస్తుంది. మీ సమస్య విషయంలో దేవుని తలంపు గురించి వివరించే లేఖన ఉల్లేఖనాలు, ఉదాహరించబడిన లేఖనాలు మీకు దొరుకుతాయి. బైబిలును తెరచి వాటిని కలిసి చదవండి. అవును, మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి దేవుడు ఏమి చెబుతున్నాడో మీరు వింటారు!
చక్కగా సంభాషించడంలో కొనసాగండి
కొంతకాలంగా ఉపయోగించబడని తలుపు తెరవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? కీచుమనే ధ్వనిచేస్తూ తుప్పుపట్టిన కీళ్లు మెల్లగా తెరుచుకుంటాయి. అదే ఆ తలుపును ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ, దాని కీళ్లకు చక్కగా గ్రీజు రాస్తున్నట్లయితే అప్పుడెలా ఉంటుంది? దానిని తెరవడం సులభంగా ఉంటుంది. సంభాషణ అనే తలుపు విషయంలో కూడా అదే నిజం. మీరు సంభాషించడాన్ని అభ్యాసంగా చేసుకొని, సంభాషణ అనే తలుపు కీళ్లకు క్రైస్తవ ప్రేమ అనే గ్రీజు రాసినట్లయితే, మీ మధ్య తీవ్ర భేదాభిప్రాయాలున్నా మీ భావాలను ఎంతో సులభంగా వ్యక్తంచేయగలుగుతారు.
మీరు ఎప్పుడో ఒకప్పుడు మీ భావాలను వ్యక్తం చేయడం ప్రారంభించాలి. అలా చేయడానికి ప్రారంభంలో ఎంతో ప్రయాసపడాల్సివచ్చినా దానికోసం కృషి చేయండి. అప్పుడు మీరు కొంతకాలానికి మీ భాగస్వామితో చక్కని సంబంధాన్ని ఆనందించగలుగుతారు, అది మీరిద్దరి మధ్య శాశ్వత అవగాహనకు దారితీస్తుంది.
[అధస్సూచి]
^ పేరా 22 యెహోవాసాక్షులు ప్రచురించినది.
[7వ పేజీలోని చిత్రం]
మీ మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినప్పుడు మీరు దేవుని నిర్దేశం కోసం చూస్తారా?