కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సార్దీస్‌కు చెందిన మెలెటో బైబిలు సత్యాలను సమర్థించాడా?

సార్దీస్‌కు చెందిన మెలెటో బైబిలు సత్యాలను సమర్థించాడా?

సార్దీస్‌కు చెందిన మెలెటో బైబిలు సత్యాలను సమర్థించాడా?

ప్రతీ ఏడాది నిజ క్రైస్తవులు, హీబ్రూ క్యాలెండర్‌లో నీసాను 14కు సరిసమానమైన తేదీన ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరిస్తారు. అలా ఆచరించడం ద్వారా వారు యేసు ఇచ్చిన ఈ ఆజ్ఞకు విధేయులవుతున్నారు: “నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” యేసు వాస్తవానికి సా.శ. 33, నీసాను 14న, పస్కా ఆచరించిన తర్వాత, తన బలిపూర్వక మరణానికి సంబంధించిన జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించాడు. ఆ రోజు ముగిసేలోపే ఆయన మరణించాడు.​—⁠లూకా 22:​19, 20; 1 కొరింథీయులు 11:​23-28.

సా.శ. రెండవ శతాబ్దంలో కొందరు, ఆ ఆచరణ సమయాన్ని, విధానాన్ని మార్చడం మొదలు పెట్టారు. ఆసియా మైనరులో, యేసు మరణించిన తేదీలోనే జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడం కొనసాగించారు. అయితే, “యేసు మరణానికి బదులు, ఆయన పునరుత్థానాన్ని ఆదివారంనాడు ఆచరించడం రోములో, అలెగ్జాండ్రియాలో వాడుకగా ఉండేది,” అది పునరుత్థాన పస్కా అని పిలవబడేదని ఒక గ్రంథం పేర్కొంటోంది. క్వార్టోడెసిమన్స్‌ [‘పధ్నాల్గవ దినాన్ని ఆచరించేవారు’] అని పిలవబడే ఒక గుంపు యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను నీసాను 14న ఆచరించడాన్ని సమర్థించారు. సార్దీస్‌కు చెందిన మెలెటో ఆ బోధతో ఏకీభవించాడు. మెలెటో ఎవరు? ఆయన ఈ బైబిలు సత్యాన్ని, మరితర బైబిలు సత్యాలను ఎలా సమర్థించాడు?

ఒక ‘గొప్ప జ్యోతి’

రెండవ శతాబ్దాంతంలో, కైసరయకు చెందిన యుసేబియస్‌ వ్రాసిన ఎక్లీసియాస్టికల్‌ హిస్టరీ అనే గ్రంథం ప్రకారం, “క్రైస్తవత్వాన్ని అనుసరిస్తూ దాని నుండి ఎన్నడూ ప్రక్కదోవ పట్టకుండా, సువార్తల ప్రకారం పస్కాను పధ్నాల్గవ రోజున ఆచరించడాన్ని” సమర్థిస్తూ ఎఫెసుకు చెందిన పోలిక్రెటెస్‌ రోముకు ఒక ఉత్తరం పంపించాడు. ఆ ఉత్తరం ప్రకారం, లూదియలోని సార్దీస్‌కు చెందిన బిషప్‌గా ఉన్న మెలెటో, నీసాను 14న జ్ఞాపకార్థ ఆచరణను ఆచరించడాన్ని సమర్థించినవారిలో ఒకడు. మెలెటో సమకాలీనులు ఆయనను, ‘మరణించిన గొప్ప జ్యోతుల్లో’ ఒకనిగా పరిగణించారని ఆ ఉత్తరం పేర్కొంది. మెలెటో అవివాహితుడని, “పరిశుద్ధాత్మకు సంబంధించిన అంశాల్లోనే ఆయన శ్రద్ధచూపించాడని, ఆయన సార్దీస్‌లో పాతిపెట్టబడి తాను మృతుల్లో నుండి పునరుత్థానం చేయబడినప్పుడు పరలోక పిలుపు కోసం వేచివున్నాడని” పోలిక్రెటెస్‌ పేర్కొన్నాడు. క్రీస్తు తిరిగివచ్చేంతవరకు పునరుత్థానం జరగదని నమ్మినవారిలో మెలెటో ఒకడని దాని భావం కావచ్చు.​—⁠ప్రకటన 20:​1-6.

దీనినిబట్టి, మెలెటో ధైర్యం, దృఢనిశ్చయంగల వ్యక్తై ఉండవచ్చని అనిపిస్తోంది. వాస్తవానికి, మెలెటో వ్రాసిన అపాలజీ అనే పుస్తకం క్రైస్తవులను సమర్థిస్తూ ఇప్పటివరకు వ్రాయబడిన పుస్తకాల్లో మొదటిది, ఆయన దానిని సా.శ. 161 నుండి 180 వరకు రోమా చక్రవర్తిగా పరిపాలించిన మార్కస్‌ ఆరియలస్‌ను ఉద్దేశించి వ్రాశాడు. మెలెటో క్రైస్తవత్వాన్ని సమర్థించడానికి, దుష్టులను, దురాశాపరులను ఖండించడానికి భయపడలేదు. అలాంటివారు, క్రైస్తవుల ఆస్తులను దోచుకోవడానికి వీలుగా, సామ్రాజ్య సంబంధ వివిధ ఉత్తర్వులను సాకుగా ఉపయోగించి క్రైస్తవులను హింసించేవారు, వారిపై అన్యాయంగా దోషారోపణ చేసేవారు.

మెలెటో, చక్రవర్తికి ధైర్యంగా ఇలా వ్రాశాడు: “[క్రైస్తవులు] అలాంటి పోరాటాలకు కారకులో కాదో మీరే పరిశీలించి వారు మరణానికి, శిక్షకు తగినవారో లేక భద్రత, రక్షణ పొందడానికి తగినవారో న్యాయంగా తీర్పుతీర్చండి అని మాత్రమే మేము విన్నవించుకుంటున్నాం. అయితే, క్రూరులైన శత్రువులమీద విధించడానికి కూడా న్యాయంగాలేని అధికార ఆదేశాన్నీ, క్రొత్త చట్టాన్నీ మీరు జారీ చేసి ఉండకపోతే, కనీసం అల్లరిమూక మమ్మల్ని అలా అన్యాయంగా దోచుకోవడాన్ని చూస్తూ ఊరుకోవద్దని మేము హృదయపూర్వకంగా ఎంతగానో వేడుకుంటున్నాం.”

క్రైస్తవత్వాన్ని సమర్థించడానికి లేఖనాలు ఉపయోగించడం

పరిశుద్ధ లేఖనాల అధ్యయనం విషయంలో మెలెటో ఎంతో ఆసక్తి చూపించాడు. ఆయన వ్రాసిన గ్రంథాల పూర్తి పట్టిక మనకు అందుబాటులో లేకపోయినా, ఆయన వ్రాసిన కొన్ని గ్రంథాల పేర్లు, బైబిలు సంబంధ అంశాల్లో ఆయన చూపించిన ఆసక్తిని వెల్లడిచేస్తాయి. క్రైస్తవ జీవితం మరియు ప్రవక్తలు, మనిషి విశ్వాసం, సృష్టి, బాప్తిస్మం సత్యం విశ్వాసం మరియు క్రీస్తు పుట్టుక, ఆతిథ్యం మరియు కీలకం, అపవాది మరియు యోహాను వ్రాసిన అపోకలిప్స్‌ వంటి గ్రంథాలను ఆయన వ్రాశాడు.

హీబ్రూ లేఖనాల్లో ఖచ్చితంగా ఎన్ని పుస్తకాలున్నాయో పరిశోధించడానికి మెలెటో స్వయంగా బైబిలు ప్రాంతాలకు వెళ్లాడు. దాని గురించి ఆయన ఇలా వ్రాశాడు: “ఆ ప్రకారంగా నేను తూర్పుదిక్కుకు వెళ్ళి ఈ విషయాలు ప్రకటించబడి, ఆచరించబడిన ప్రాంతంలో ఉన్నాను, పాత నిబంధనలో ఉన్న పుస్తకాల గురించి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత నేను మీకు పంపించిన ఆ వాస్తవాలను నమోదు చేశాను.” మెలెటో తయారుచేసిన పట్టికలో నెహెమ్యా, ఎస్తేరు పుస్తకాలు లేకపోయినా క్రైస్తవులమని చెప్పుకున్నవారు వ్రాసిన గ్రంథాల్లో, ఆ పుస్తకాలు హీబ్రూ లేఖనాలకు చెందిన ప్రామాణిక పుస్తకాల పురాతన జాబితాలో పేర్కొనబడ్డాయి.

మెలెటో ఆ పరిశోధన చేస్తున్న సమయంలో యేసు గురించిన ప్రవచనాలున్న వరుస వచనాలను హీబ్రూ లేఖనాల నుండి సంపుటీకరించాడు. యేసు ఎంతోకాలంగా ఎదురుచూడబడిన మెస్సీయ అనీ, మోషే ధర్మశాస్త్రం క్రీస్తును సూచించిందనీ, ప్రవక్తలు కూడా ఆయననే సూచించారనీ ఎక్స్‌ట్రాక్ట్స్‌ అనే పేరుతో మెలెటో వ్రాసిన గ్రంథం వివరిస్తోంది.

విమోచన క్రయధన విలువను సమర్థించడం

ఆసియా మైనరులోని ముఖ్య నగరాల్లో యూదుల పెద్దపెద్ద సమాజాలు ఉండేవి. మెలెటో నివాస నగరమైన సార్దీస్‌లోని యూదులు, నీసాను 14న హెబ్రీయుల పస్కా పండుగను ఆచరించేవారు. మెలెటో ద పాసోవర్‌ అనే పేరుతో ఒక ప్రసంగం వ్రాశాడు, అది ధర్మశాస్త్రం ప్రకారం పస్కా పండుగను ఆచరించడం సరైనదని చూపించి, నీసాను 14న క్రైస్తవులు ప్రభువు రాత్రి భోజనం ఆచరించడాన్ని సమర్థించింది.

మెలెటో, నిర్గమకాండము 12వ అధ్యాయం మీద వ్యాఖ్యానాలు చేసి, పస్కా పండుగ క్రీస్తు బలికి ప్రతీకగా ఉందని చూపించిన తర్వాత, క్రైస్తవులు పస్కా పండుగను ఆచరించడం ఎందుకు సహేతుకంకాదో వివరించాడు. ఎందుకంటే, దేవుడు మోషే ధర్మశాస్త్రాన్ని రద్దుచేశాడు. ఆ తర్వాత ఆయన క్రీస్తు బలి ఎందుకు అవసరమయ్యిందో వివరించాడు: ఆదాము ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపగలిగేలా దేవుడు అతనిని పరదైసులో ఉంచాడు. కానీ మొదటి మానవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని తినవద్దనే ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు. ఆ కారణంగా విమోచన క్రయధనపు అవసరం ఏర్పడింది.

యేసు భూమ్మీదకు పంపించబడ్డాడని, విశ్వాసులైన మానవాళిని పాపమరణాల నుండి విడిపించడానికి ఆయన మ్రానుమీద మరణించాడని మెలెటో పునరుద్ఘాటించాడు. ఆసక్తికరంగా, మెలెటో యేసు మరణించిన మ్రాను గురించి వ్రాస్తున్నప్పుడు గ్రీకు పదమైన జైలోన్‌ను ఉపయోగించాడు, దానికి “కొయ్య” అని అర్థం.​—⁠అపొస్తలుల కార్యములు 5:​30; 10:​39; 13:​29.

ఆసియా మైనరుకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో కూడా మెలెటోకు గుర్తింపు ఉంది. టెర్టూలియన్‌, అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంట్‌, ఆరిజెన్‌లకు ఆయన వ్రాసిన గ్రంథాల గురించి తెలుసు. అయినా, చరిత్రకారుడు రాన్యీరో కాంటాలామెసా ఇలా పేర్కొన్నాడు: “ఆదివారం పస్కాను ఆచరించడం ప్రాబల్యం పొందిన తర్వాత, క్వార్టోడెసిమన్‌లు మతభ్రష్టులుగా పరిగణించబడడం ప్రారంభమైంది, ఆ సమయంలోనే మెలెటో ప్రాముఖ్యత తగ్గి క్రమేణా ఆయన గ్రంథాలు కనుమరుగవడం మొదలైంది.” చివరకు, మెలెటో గ్రంథాలు దాదాపు పూర్తిగా కనుమరుగయ్యాయి.

మతభ్రష్టత్వం ఆయనను ప్రభావితం చేసిందా?

అపొస్తలులు మరణించిన తర్వాత ముందుగా చెప్పబడిన మతభ్రష్టత్వం నిజ క్రైస్తవత్వంలోకి ప్రవేశించింది. (అపొస్తలుల కార్యములు 20:​29, 30) అది మెలెటోను ప్రభావితం చేసిందనేది స్పష్టం. ఆయన వ్రాసిన గ్రంథాల సంక్లిష్టమైన శైలి, గ్రీకుతత్వ జ్ఞానానికి, రోమా ప్రపంచానికి సంబంధించిన గ్రంథాలను ప్రతిబింబిస్తున్నట్లు అనిపిస్తుంది. బహుశా అందుకే, మెలెటో క్రైస్తవత్వాన్ని “మన తత్వజ్ఞానం” అని పిలిచివుండవచ్చు. నామకార్థ కైస్తవత్వం రోమా సామ్రాజ్యంతో మిళితంకావడాన్ని “విజయానికి . . . గొప్ప రుజువుగా” కూడా ఆయన పరిగణించాడు.

మెలెటో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఈ సలహాను ఖచ్చితంగా లక్ష్యపెట్టలేదు: “ఆయనను [క్రీస్తును] అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా ఈ లోకసంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానముచేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి.” కాబట్టి, మెలెటో కొంతవరకు బైబిలు సత్యాలను సమర్థించినా అనేక విధాలుగా ఆయన వాటిని విడిచిపెట్టాడు.​—⁠కొలొస్సయులు 2:⁠8.

[18వ పేజీలోని చిత్రం]

యేసు నీసాను 14న ప్రభువు రాత్రి భోజన ఆచరణను ప్రారంభించాడు