కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది

దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది

జీవిత కథ

దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది

హారీ పెలోయన్‌ చెప్పినది

దేవుడు బాధనెందుకు అనుమతిస్తున్నాడు? చిన్నప్పటి నుండి ఆ ప్రశ్న నన్ను వేధించింది. నా తల్లిదండ్రులు కుటుంబ సంక్షేమంపట్ల శ్రద్ధగల, కష్టపడి పనిచేసే నిజాయితీపరులు. మా నాన్నగారికి మతసంబంధ విషయాల్లో అంతగా ఆసక్తి ఉండేదికాదుగానీ మా అమ్మకు కాస్త ఆసక్తి ఉండేది. కాబట్టి వాళ్ళు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేకపోయారు.

నేను రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడూ ఆ తర్వాతా, మూడు సంవత్సరాలకంటే ఎక్కువ కాలంపాటు అమెరికా నౌకాదళంలో ఉన్నప్పుడు ఆ ప్రశ్న గురించి మరింత ఆలోచించాను. యుద్ధం ముగిసిన తర్వాత, సహాయ సామగ్రి అందజేయడానికి చైనాకు పంపించబడిన ఓడలో నాకు పని ఇవ్వబడింది. అక్కడ నేను దాదాపు ఒక సంవత్సరంపాటు ఉండి, ఎంతోమంది తీవ్ర బాధలు అనుభవించడం కళ్లారా చూశాను.

చైనీయులు కష్టపడి పనిచేసే తెలివైన ప్రజలు. కానీ, పేదరికం మూలంగా, రెండవ ప్రపంచ యుద్ధంవల్ల తలెత్తిన దౌర్జన్యం మూలంగా చాలామంది తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు. అందమైన పిల్లల్ని చూసి నేను మరీ బాధపడ్డాను, వారిలో చాలామంది సరైన పోషణలేక, చిరిగిపోయిన బట్టలేసుకుని, మేము తీరం దగ్గరికి వెళ్తే మా దగ్గర అడుక్కునేవారు.

ఎందుకు?

నేను 1925లో జన్మించాను, అమెరికాలోని కాలిఫోర్నియాలో పెరిగాను. నేను అలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. కాబట్టి, నన్ను నేను పదే పదే ఇలా ప్రశ్నించుకున్నాను, ‘సర్వశక్తిమంతుడైన సృష్టికర్త ఉంటే, అంతమంది, అందులోనూ అమాయకులైన పిల్లలు అంత దుర్భరమైన పరిస్థితుల్లో బాధపడడానికి ఆయనెందుకు అనుమతిస్తున్నాడు?’

ఒకవేళ దేవుడు నిజంగా ఉనికిలో ఉంటే, ఆయన మానవజాతిపైకి శతాబ్దాలపాటు, ప్రత్యేకంగా ఐదు కోట్లకంటే ఎక్కువమంది మరణించిన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అంత నాశనం, సామూహిక హత్యలు, మరణం, బాధ రావడానికి ఎందుకు అనుమతిస్తున్నాడు అని కూడా ఆలోచించేవాడిని. అంతేగాక, యుద్ధం జరుగుతున్న సమయమంతటిలోనూ ఒకే మతానికి చెందిన ప్రజలు, తమ మతనాయకులచే ప్రేరేపించబడి, తమ దేశాలు వేరైనందుకు ఒకరినొకరు ఎందుకు చంపుకుంటారు?

దుర్భిణి

1939లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమై సామూహిక నరమేధం జరుగుతున్నప్పుడు, దేవుడు లేడేమో అనుకున్నాను. తర్వాత, ఉన్నత పాఠశాలలో సైన్స్‌ తరగతిలో, విద్యార్థులమైన మేమందరం ఏదైనా ఒక వైజ్ఞానిక పరికరం తయారుచేయాలి. నాకు ఖగోళశాస్త్రమంటే ఇష్టం కాబట్టి, నేను 20 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న అద్దంగల పెద్ద పరావర్తన దుర్భిణి తయారుచేయడం మొదలుపెట్టాను.

ఈ దుర్భిణిని తయారుచేయడానికి, నేను 2.5 సెంటీమీటర్ల మందం, 20 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న గాజు ముక్క తీసుకువచ్చి, గాజును కోసే వ్యక్తితో దాన్ని గుండ్రంగా కోయించాను. ఆ తర్వాత, దాన్ని పుటాకార దర్పణముగా మార్చడానికి దానిని సానబెట్టడమనే శ్రమతోకూడిన పని మొదలుపెట్టాను. దానితో, దాదాపు నాలుగు నెలలపాటు నా ఖాళీ సమయమంతా ఆ పనికే పోయింది. దర్పణం సిద్ధమయ్యేసరికి, దాన్ని ఒక పొడవైన లోహపు గొట్టంలో పెట్టి, దుర్భిణికి వివిధ బలాలుగల కటకాలను బిగించాను.

చంద్రుడు లేని ఒక నిర్మలమైన రాత్రి, నేను పూర్తైన నా దుర్భిణిని మొదటిసారి బయటికి తీసుకువచ్చి, మన సౌరకుటుంబంలోని నక్షత్రాలపై, గ్రహాలపై దాన్ని కేంద్రీకరించాను. అన్ని చంద్రనక్షత్రగ్రహాలను, అవన్నీ ఎంతో చక్కగా వ్యవస్థీకరించబడి ఉండడాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత, కొన్ని “నక్షత్రాలు” వాస్తవానికి మన పాలపుంత నక్షత్రవీధి లాంటి నక్షత్రవీధులనీ, ఒక్కోదానిలో కోటానుకోట్ల నక్షత్రాలు ఉంటాయనీ తెలుసుకుని నేను మరింత ఆశ్చర్యపోయాను.

‘ఖచ్చితంగా అదంతా దానంతటదే ఉనికిలోకి వచ్చి ఉండకపోవచ్చు. సంస్థీకృతమైనదేదీ దానంతటదే ఉనికిలోకి రాదు. విశ్వమంతా ఎంత చక్కగా వ్యవస్థీకరించబడి ఉందంటే అది అపారమైన మేధాశక్తిగల ఒక వ్యక్తి చేసినట్లుగా ఉంది. బహుశా దేవుడు ఉన్నాడేమో?’ దుర్భిణితో నా అనుభవం, అంతకుముందు నాకున్న హేతుబద్ధంకాని నాస్తిక దృక్కోణాన్ని కొంతమేరకు మార్చుకోవడానికి కారణమైంది.

అప్పుడు నన్ను నేనిలా ప్రశ్నించుకున్నాను: ‘ఈ అద్భుతమైన విశ్వాన్ని సృష్టించగలిగేంత శక్తిమంతుడు, జ్ఞానవంతుడు అయిన దేవుడు నిజంగా ఉంటే, భూమ్మీదున్న దుర్భర స్థితిని ఆయన సరిచేయలేడా? అసలు ఈ బాధలన్నిటినీ ఆయనెందుకు అనుమతించాడు?’ నేను మతసంబంధమైన ప్రజల్ని అలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు, వాళ్ళు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు.

నేను ఉన్నత పాఠశాల విద్య ముగించి, కొన్ని సంవత్సరాలు కళాశాలలో చదువుకుని, అమెరికా నౌకాదళంలో చేరాను. అయితే, సైన్యంలోని మతగురువులు కూడా నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారు. తరచూ, మతసంబంధ విషయాల్లో ఆసక్తిగలవారు ఇలా చెప్పేవారు: “ప్రభువు కార్యాలు అర్థం చేసుకోవడం కష్టం.”

నా అన్వేషణను కొనసాగించాను

నేను చైనా వదిలి వచ్చేశాక కూడా, దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు అనుమతిస్తున్నాడనేదాని గురించి నాకున్న ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. ప్రాముఖ్యంగా ఇంటికి తిరిగివచ్చేటప్పుడు దారిలో పసిఫిక్‌ సముద్రాన్ని దాటివస్తూ మేము ఆగిన వివిధ ద్వీపాల్లో సైనిక సమాధులను చూసినప్పుడు, ఆ ప్రశ్నలు నన్ను మళ్లీ వేధించాయి. దాదాపు ఆ సమాధులన్నీ లేతవయసులోని యౌవనస్థులవే.

నేను అమెరికాకు తిరిగివచ్చి, నౌకాదళం నుండి విడుదల చేయబడిన తర్వాత, మసాచుసెట్స్‌లోవున్న కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఒక సంవత్సరం విద్య ముగించవలసి ఉంది. ఆ సంవత్సరం తర్వాత నేను విద్య ముగించి పట్టా పుచ్చుకున్నాను గానీ కాలిఫోర్నియాలోని మా ఇంటికి వెళ్లలేదు. నా ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడానికి ప్రయత్నిస్తూ కొంతకాలం తూర్పు అమెరికాలోనే ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాను. చాలా మతాలున్న న్యూయార్క్‌ నగరానికి వెళ్ళి, ఏమి బోధించబడుతుందో చూడడానికి కొన్ని మత సేవలకు హాజరవ్వాలన్నది నా ఉద్దేశం.

న్యూయార్క్‌లో మా పెద్దమ్మ ఇజాబెల్‌ కాపిజెన్‌ నన్ను వాళ్ళింట్లో ఉండమని ఆహ్వానించింది. ఆమె, ఆమె ఇద్దరు కుమార్తెలైన రోజ్‌, రూత్‌లు యెహోవాసాక్షులు. నాకు యెహోవాసాక్షుల నమ్మకాల్లో ఆసక్తి ఉంటుందని భావించక, నేను ఇతరులతో మాట్లాడుతూ వాళ్ళ సాహిత్యం చదువుతూ వాళ్ళ మతసేవలకు హాజరవడం మొదలుపెట్టాను. దేవుడు బాధను ఎందుకు అనుమతిస్తున్నాడని నేను వాళ్ళను అడిగేవాడిని కానీ నాలాగే వాళ్ళకు కూడా దానికి సమాధానం తెలియదు. బహుశా దేవుడే లేకుండవచ్చనే ముగింపుకు నేను చేరుకున్నాను.

సమాధానాలు కనుగొనడం

యెహోవాసాక్షుల దృక్కోణాలు తెలుసుకునేందుకు నేను మీ సాహిత్యాలు చదవచ్చా అని నేను మా పెద్దమ్మను, ఆమె కూతుర్లను అడిగాను. నేను వాళ్ళ ప్రచురణలు చదివినప్పుడు, సాక్షులు చెబుతున్నదానికి ఇతర మతాలు చెప్పేదానికి చాలా పెద్ద తేడా ఉందని నేను వెంటనే గ్రహించాను. సమాధానాలన్నీ బైబిల్లో నుండే ఉన్నాయి, అవి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయి. కొంతకాలంలోనే, దేవుడు బాధనెందుకు అనుమతిస్తాడనే నా ప్రశ్నలకు సమాధానాలు లభించాయి.

అంతేకాదు, యెహోవాసాక్షులు తమ బైబిలు ఆధారిత సమాధానాలకు అనుగుణంగా జీవిస్తారని కూడా నేను చూడగలిగాను. ఉదాహరణకు, రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీలోని యెహోవాసాక్షుల యౌవనస్థులు ఏమి చేశారని నేను మా పెద్దమ్మను అడిగాను. వాళ్ళు అక్కడున్న సైన్యంలో చేరి “హేయిల్‌ హిట్లర్‌!” అని చెప్తూ స్వస్థికా పతాకానికి వందనం చేశారా? వాళ్ళు అలా చేయలేదని ఆమె చెప్పింది. వాళ్ళు తటస్థవైఖరిని అవలంబించినందుకు సామూహిక నిర్భంద శిబిరాలకు పంపబడ్డారు, అక్కడ వారిలో చాలామంది చంపబడ్డారు. యుద్ధం సమయంలో, ఎక్కడ ఉన్న యెహోవాసాక్షులైనా తటస్థవైఖరినే అవలంబిస్తారని ఆమె వివరించింది. చివరికి ప్రజాస్వామ్య దేశాల్లో సహితం, యెహోవాసాక్షుల్లోని యౌవనస్థులు తమ తటస్థవైఖరినిబట్టి చెరసాలల్లో వేయబడ్డారు.

అప్పుడు మా పెద్దమ్మ నన్ను యోహాను 13:⁠35 చదవమంది, అదిలా ఉంది: “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” నిజక్రైస్తవులు ప్రేమకు సంబంధించిన ఆ గుర్తింపు చిహ్నాన్ని అంతర్జాతీయ స్థాయిలో కలిగివుండాలి. వాళ్ళు తమ జాతీయత వేరైనంత మాత్రాన రెండు శత్రువర్గాల్లో ఉండి ఒకరినొకరు ఎన్నడూ చంపుకోరు! ఆమె ఇలా అడిగింది: “రోమన్‌ యుద్ధాల్లో యేసు ఆయన శిష్యులు శత్రువర్గాల్లో ఉండి ఒకరినొకరు చంపుకోవడాన్ని నీవు ఊహించగలవా?”

ఆమె నన్ను 1 యోహాను 3:10-12 కూడా చదవమంది. అదిలా ఉంది: “దీనినిబట్టి దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనమొకని నొకడు ప్రేమింపవలెను; . . . మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను.”

బైబిలు స్పష్టంగా బోధిస్తోంది. నిజ క్రైస్తవులు ఏ దేశంలో నివసిస్తున్నా ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అందుకే, వారెప్పుడూ తమ ఆధ్యాత్మిక సహోదరులనుగానీ, ఆ మాటకొస్తే మరెవరినైనాగానీ ఎన్నడూ చంపరు. అందుకే యేసు తన అనుచరుల గురించి ఇలా చెప్పగలిగాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.”​—⁠యోహాను 17:​16.

ఎందుకు అనుమతించబడింది?

దేవుడు బాధను ఎందుకు అనుమతించాడో బైబిలు చెబుతోందని నేను త్వరలోనే తెలుసుకున్నాను. దేవుడు మన మొదటి తల్లిదండ్రులను సృష్టించినప్పుడు ఆయన వాళ్ళను పరిపూర్ణంగా సృష్టించి పరదైసు తోటలో ఉంచాడని అది వివరిస్తోంది. (ఆదికాండము 1:26; 2:​15) ఆయన వాళ్ళకు ఎంతో అద్భుతమైన బహుమానం కూడా ఇచ్చాడు, అదే స్వేచ్ఛాచిత్తం. కానీ వాళ్ళు దాన్ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి. వాళ్ళు దేవునికి, ఆయన కట్టడలకు విధేయత చూపిస్తే, వాళ్ళు పరదైసులో పరిపూర్ణంగా జీవించడం కొనసాగిస్తారు. పరదైసు, భూమి అంతటికీ వ్యాపించేవరకు వాళ్ళు దాని సరిహద్దులను విస్తరింపజేస్తారు. వాళ్ళ సంతానం కూడా పరిపూర్ణంగా ఉంటుంది, తత్ఫలితంగా, కొంతకాలానికి ఈ భూమి పరిపూర్ణమైన, సంతోషవంతులైన ప్రజలు నివసించే మహిమాన్విత పరదైసుగా మారుతుంది.​—⁠ఆదికాండము 1:​28.

అయితే, ఆదాముహవ్వలు దేవుని నడిపింపు లేకుండా స్వతంత్రంగా నడుచుకోవాలనుకుంటే, పరిపూర్ణ వ్యక్తులుగా కొనసాగడానికి ఆయన వారిని అనుమతించడు. (ఆదికాండము 2:​16, 17) మానవజాతికి విచారకరమైన విషయం ఏమిటంటే, మన మొదటి తల్లిదండ్రులు తమ స్వేచ్ఛాచిత్తాన్ని దుర్వినియోగం చేసి, దేవుని నుండి స్వతంత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళు అపవాదియైన సాతానుగా పేరుపొందిన తిరుగుబాటుదారుడైన ఆత్మప్రాణిచే పురికొల్పబడ్డారు. అతడు దేవుని నుండి స్వతంత్రంగా ఉండడాన్ని, న్యాయంగా దేవునికి మాత్రమే చెందవలసిన ఆరాధనను ఆశించాడు.​—⁠ఆదికాండము 3:1-19; ప్రకటన 4:​10.

అలా సాతాను “ఈ యుగ సంబంధమైన దేవత” అయ్యాడు. (2 కొరింథీయులు 4:⁠4) బైబిలు ఇలా చెబుతోంది: “లోకమంతయు దుష్టుని యందున్నది.” (1 యోహాను 5:​19) యేసు సాతానును “ఈ లోకాధికారి” అని పిలిచాడు. (యోహాను 14:​30) సాతాను, మన మొదటి తల్లిదండ్రులు చూపించిన అవిధేయత మూలంగా అపరిపూర్ణత, దౌర్జన్యం, మరణం, దుఃఖం, బాధ మానవజాతి అంతటిపైకి వచ్చాయి.​—⁠రోమీయులు 5:⁠12.

“నరులవశములో లేదు”

సృష్టికర్త కట్టడలను అలక్ష్యం చేస్తే మానవ కుటుంబానికి పరిస్థితులు ఎలా ఉంటాయో చూపించడానికి, దేవుడు దాని పర్యవసానాలు వేలాది సంవత్సరాలపాటు కొనసాగడానికి అనుమతించాడు. ఈ కాలావధి బైబిలు చెబుతున్న ఈ మాటల సత్యత్వాన్ని గమనించడానికి మానవజాతంతటికీ తగినంత అవకాశాన్నిచ్చింది: ‘తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు. యెహోవా, నన్ను శిక్షింపుము.’​—⁠యిర్మీయా 10:​23, 24.

ఇప్పుడు, ఈ శతాబ్దాలన్నీ గడిచిన తర్వాత, దేవుని నిర్దేశం లేకుండా స్వతంత్రంగా చేసే పరిపాలన ఒక వైఫల్యమేనని మనం చూడవచ్చు. మానవజాతి తనను, తన కట్టడలను అలక్ష్యం చేస్తూ నాశనకరమైన ప్రయోగాలు చేయడాన్ని దేవుడు ఇక ఎంతమాత్రం అనుమతించడు.

అద్భుతమైన భవిష్యత్తు

దేవుడు ఈ క్రూరమైన విధానానికి త్వరలోనే అంతం తీసుకువస్తాడని బైబిలు ప్రవచనం చూపిస్తోంది: “ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. . . . దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖించెదరు.”​—⁠కీర్తన 37:​10, 11.

దానియేలు 2:44లోని ఒక ప్రవచనం ఇలా ప్రకటిస్తోంది: “ఆ రాజుల [ఇప్పుడు ఉనికిలోవున్న అన్ని విధాలైన పరిపాలనలు] కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును.” మానవ పరిపాలన మళ్ళీ ఎన్నడూ అనుమతించబడదు. భూమినంతటినీ దేవుని రాజ్యం పరిపాలిస్తుంది. దాని నిర్వహణ క్రింద, భూమి అంతా పరదైసుగా మారుతుంది, సంతోషంగా నిరంతరం జీవించడానికి మానవజాతి పరిపూర్ణతకు ఎదుగుతుంది. బైబిలు ఇలా వాగ్దానం చేస్తోంది: “[దేవుడు] వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు.” (ప్రకటన 21:⁠4) మన కోసం దేవుడు ఎంత అద్భుతమైన భవిష్యత్తును సంకల్పించాడో కదా!

భిన్నమైన జీవితం

నా ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు తెలుసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది. అప్పటినుండి, దేవుని సేవచేయాలని, ఈ సమాధానాలు తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయాలని కోరుకున్నాను. 1 యోహాను 2:​17 చెబుతున్నదాని గంభీరతను నేను అర్థం చేసుకున్నాను: “లోకమును [సాతాను పరిపాలిస్తున్న ఈ విధానం] దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.” దేవుని నూతనలోకంలో నిత్యజీవం పొందాలని నేనెంతో కోరుకున్నాను. నేను న్యూయార్క్‌లోనే ఉండి యెహోవాసాక్షుల సంఘంతో సహవసించడం ప్రారంభించి, నేను తెలుసుకున్న విషయాలు ఇతరులు తెలుసుకునేందుకు సహాయం చేస్తున్నప్పుడు ఎన్నో మంచి అనుభవాలు ఎదురయ్యాయి.

నేను 1949లో రోజ్‌ మేరీ లూయిస్‌ను కలిశాను. ఆమె, వాళ్ళమ్మ సాడీ, ఆమె ఆరుగురు అక్కచెల్లెళ్ళూ యెహోవాసాక్షులే. రోజ్‌ ప్రకటనాపనిలో పూర్తికాలం దేవునిసేవ చేస్తోంది. ఆమెలో ఎన్నో మంచి లక్షణాలున్నాయి, నేను వెంటనే ఆమెవైపు ఆకర్షించబడ్డాను. మేము 1950 జూన్‌లో వివాహం చేసుకుని న్యూయార్క్‌లోనే ఉన్నాము. మేము చేస్తున్న దానిలో ఆనందాన్ని పొందుతూ, దేవుని నూతనలోకంలో నిరంతరం జీవించడమనే నిరీక్షణనుబట్టి ఎంతో ఆనందించాము.

1957లో, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధాన కార్యాలయంలో పూర్తికాల సేవ చేసేందుకు నేనూ, రోజ్‌ మేరీ ఆహ్వానించబడ్డాము. 2004 జూన్‌ నాటికి మేము 54 సంవత్సరాల ఆనందభరితమైన వైవాహిక జీవితం గడిపాము, వాటిలో 47 సంవత్సరాలు బ్రూక్లిన్‌లోవున్న ప్రధాన కార్యాలయంలో గడిపాము. వేలాదిమంది తోటి విశ్వాసులతో కలిసి యెహోవాసేవలో గడిపిన ఆ సంవత్సరాలు ఎంతో సంతోషకరమైన కాలాలు.

నాకు కలిగిన విపరీతమైన వేదన

విచారకరంగా, 2004 డిసెంబరు ఆరంభంలో రోజ్‌మేరీకి ఊపిరితిత్తుల్లో కంతి ఉన్నట్లు వైద్యపరీక్షల్లో తేలింది. అది చాలా వేగంగా పెరుగుతోందనీ, దాన్ని తొలగించాలనీ నిపుణులు ఏకీభవించారు. డిసెంబరులో శస్త్రచికిత్స చేయబడింది, ఆ తర్వాత ఒక వారానికి శస్త్రవైద్యుడు ఆసుపత్రిలో రోజ్‌మేరీ ఉంటున్న గదిలోకి వచ్చి, నా సమక్షంలోనే “రోజ్‌మేరీ, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు! నీకు బాగైపోయింది!” అని చెప్పాడు.

కానీ, ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులకే ఆమెకు కడుపులోనూ మరితర స్థలాల్లోనూ విపరీతమైన నొప్పి రావడం ప్రారంభమైంది. అది తగ్గకుండా అలాగే కొనసాగడంతో, ఆమె మరితర పరీక్షల కోసం మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళింది. ఏదో కారణాన్ని బట్టి ఆమె ప్రాణాధారమైన అవయవాల్లో రక్తం గడ్డకట్టడం మొదలుపెట్టిందనీ, దానితో ఆ అవయవాలకు ఆవశ్యకమైన ప్రాణవాయువు అందడం లేదనీ తేలింది. డాక్టర్లు దానిని ఆపేందుకు మానవపరంగా తమకు సాధ్యమైనదంతా చేశారు గానీ ప్రయోజనం లేకపోయింది. కేవలం కొన్ని వారాల తర్వాత, 2005, జనవరి 30న, నా జీవితమంతటిలోనూ నేను చవిచూడనంతటి పెద్ద దెబ్బ నాకు తగిలింది. నా ప్రియమైన రోజ్‌మేరీ మరణించింది.

ఆ సమయంలో, నాకు దాదాపు 80 సంవత్సరాలు, నా జీవితమంతా ప్రజలు బాధలు అనుభవించడం చూశాను గానీ, ఇది పూర్తిగా వేరు. రోజ్‌మేరీ నేను, బైబిలు చెబుతున్నట్లుగా “ఏక శరీరమై” ఉన్నాం. (ఆదికాండము 2:​24) నేను ఇతరుల బాధ చూశాను, స్నేహితులు బంధువులు మరణించినప్పుడు స్వయంగా కూడా బాధపడ్డాను. కానీ నా భార్య మరణించినప్పుడు నాకు కలిగిన బాధ చాలా తీవ్రమైనది, దీర్ఘకాలం ఉండేది. ప్రియమైనవారి మరణం మానవ కుటుంబంపైకి ఇంతకాలంగా ఎంత విపరీతమైన దుఃఖాన్ని తీసుకువచ్చిందో నేను ఇప్పుడు పూర్తిగా గ్రహించాను.

అయితే, బాధకు కారణమేమిటో, అది ఎలా నిర్మూలమవుతుందో నేను అర్థం చేసుకోవడం నన్ను ఆదుకుంది. కీర్తన 34:⁠18 ఇలా చెబుతోంది: “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.” ఈ బాధను సహించడానికి ఒక కీలకం, పునరుత్థానం ఉంటుందనీ, సమాధులలో ఉన్నవారందరూ బయటికి వస్తారనీ, దేవుని నూతనలోకంలో నిరంతరం జీవించే అవకాశం వారికి లభిస్తుందనీ బైబిలు బోధిస్తోందని తెలుసుకోవడం. అపొస్తలుల కార్యములు 24:⁠14 ఇలా చెబుతోంది: “నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నది.” రోజ్‌మేరీ దేవుణ్ణి ఎంతగానో ప్రేమించింది. ఆయన కూడా ఆమెనలాగే ప్రేమించాడనీ, ఆయన ఆమెను గుర్తుంచుకుని తన నిర్ణయ కాలంలో ఆమెను తిరిగి లేపుతాడనీ నేను నమ్ముతున్నాను, అది అతి త్వరలో జరగనుందని నేను నమ్ముతున్నాను.​—⁠లూకా 20:37; యోహాను 11:​25.

ప్రియమైనవారిని కోల్పోవడంవల్ల ఎంతో బాధ కలిగినా, పునరుత్థానం ద్వారా వారిని తిరిగి పొందడంవల్ల కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. (మార్కు 5:​42) దేవుని వాక్యం ఇలా వాగ్దానం చేస్తోంది: “మృతులైన నీ వారు బ్రదుకుదురు. . . . భూమి తనలోని ప్రేతలను [“మృతులను,” NW] సజీవులనుగా చేయును.” (యెషయా 26:​19) అపొస్తలుల కార్యములు 24:14లో ప్రస్తావించబడిన ‘నీతిమంతులలో’ అనేకులు బహుశా ముందుగా పునరుత్థానం చేయబడవచ్చు. ఆ సమయం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! అలా తిరిగి లేపబడేవారిలో రోజ్‌మేరీ కూడా ఉంటుంది. ఆమెను ప్రేమించేవారు ఆమెకు ఎంత ఆప్యాయంగా స్వాగతం పలుకుతారో కదా! ఆ సమయంలో బాధలేని లోకంలో జీవించడం ఎంత సంతృప్తికరంగా ఉంటుందో కదా!

[9వ పేజీలోని చిత్రాలు]

నేను చైనాలో ఉన్నప్పుడు ప్రజలు బాధపడడాన్ని కళ్ళారా చూశాను

[10వ పేజీలోని చిత్రాలు]

నేను 1957 నుండి బ్రూక్లిన్‌లోవున్న యెహోవాసాక్షుల ప్రధాన కార్యాలయంలో సేవచేస్తున్నాను

[12వ పేజీలోని చిత్రం]

నేను 1950లో రోజ్‌మేరీని వివాహం చేసుకున్నాను

[13వ పేజీలోని చిత్రం]

2000లో, మా 50వ వివాహ వార్షికోత్సవం సమయంలో