కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేదరికం నేటి పరిస్థితి

పేదరికం నేటి పరిస్థితి

పేదరికం నేటి పరిస్థితి

వీసేంటె * తరచూ బ్రెజిల్‌లోని సావోపౌలో వీధులగుండా చాలా బరువుతో నిండివున్న బండిని లాక్కెళ్తూ కనిపిస్తుంటాడు. అతడు అట్టముక్కలు, లోహపు ముక్కలు, ప్లాస్టిక్‌ లాంటివి సేకరిస్తాడు. చీకటిపడుతుండగా అతడు తన బండి క్రింద ఒక అట్టముక్క వేసుకుని, దానిమీద పడుకుని నిద్రకుపక్రమిస్తాడు. అతడు రాత్రంతా పడుకునే, రద్దీగావుండే వీధిలో తిరుగుతున్న కార్ల, బస్సుల శబ్దాన్ని ఏమాత్రం పట్టించుకోనట్లే ఉంటాడు. ఒకప్పుడు అతడికి ఉద్యోగం, ఇల్లు, కుటుంబం ఉండేవి కానీ అతడు వాటన్నింటినీ కోల్పోయాడు. ఇప్పుడతడు వీధిలోనే కష్టంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు.

విచారకరంగా, వీసేంటెలాగే ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కడుపేదరికంలో జీవిస్తున్నారు. వర్ధమాన దేశాల్లో, చాలామంది వీధుల్లో లేక మురికివాడల్లో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కుంటివారు, గ్రుడ్డివారు, పిల్లలకు పాలిస్తున్న స్త్రీలు సర్వసాధారణంగా అడుక్కుంటూ కనిపిస్తూనే ఉంటారు. రోడ్డుమీద ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడినప్పుడు, కొంత డబ్బైనా దొరుకుతుందనే ఆశతో పిల్లలు ఆగివున్న కార్ల మధ్య పరుగెత్తుతూ పువ్వులు, వార్తాపత్రికలు అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు.

అంతటి పేదరికం ఎందుకు అనుమతించబడుతోందో వివరించడం కష్టం. ఎకానమిస్ట్‌ అనే బ్రిటీష్‌ పత్రిక ఇలా వ్యాఖ్యానించింది: “మానవజాతి నేటికన్నా సుసంపన్నంగా ముందెప్పుడూ లేదు, పేదరికాన్ని నిర్మూలించడానికి అవసరమైన వైద్యపరిజ్ఞానం, సాంకేతిక నైపుణ్యాలు, మేధోసంపత్తి ఇంతకన్నా ఎక్కువగా ముందెప్పుడూ లేవు.” ఈ పరిజ్ఞానం నుండి అనేకులు ఖచ్చితంగా ప్రయోజనం పొందారు. అనేక వర్ధమాన దేశాల్లోని పెద్ద నగరాల వీధులు మెరిసిపోయే క్రొత్త కార్లతో రద్దీగా ఉంటున్నాయి. దుకాణాలు ఆధునిక ఉపకరణాలతో నిండివుంటున్నాయి, వాటిని కొనుగోలుచేసే ప్రజలకు కొదువేలేదు. బ్రెజిల్‌లోని రెండు షాపింగ్‌ సెంటర్లు తమ ఉత్పత్తులను అమ్మేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. అవి 2004 డిసెంబరు 23, 24 తేదీల్లో రాత్రంతా తెరిచే ఉంచబడ్డాయి. ఆ సెంటర్లలో ఒకటి, కొనుగోలుదారుల వినోదం కోసం డాన్సర్‌లను కూడా ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమం దాదాపు 5,00,000 మంది కొనుగోలుదారులను ఆకర్షించింది!

అయినప్పటికీ, కొంతమందికున్న సంపద నుండి చాలామంది ప్రజలకు ప్రయోజనమేమీ చేకూరడం లేదు. ధనికులకు పేదవారికి మధ్యవున్న స్పష్టమైన వ్యత్యాసం, అనేకులు పేదరికాన్ని నిర్మూలించడం అత్యవసరమనే ముగింపుకొచ్చేలా చేసింది. బ్రెజిల్‌ పత్రిక వేజా ఇలా పేర్కొన్నది: “ఈ సంవత్సరం [2005] పేదరిక నిర్మూలనా పోరాటం, భూగోళవ్యాప్తంగా చేయవలసిన పనుల్లో ప్రధానాంశమై ఉండాలి.” కడుపేద దేశాలకు, ప్రత్యేకంగా ఆఫ్రికాలోని పేదదేశాలకు సహాయం చేసేందుకు ఉద్దేశించబడిన ఒక క్రొత్త “మార్షల్‌ ప్లాన్‌” ప్రతిపాదన గురించి కూడా వేజా నివేదించింది. * అయితే, అలాంటి ప్రతిపాదనలు అభివృద్ధి జరుగుతోందనే భావన కలుగజేసినా, అదే పత్రిక ఇంకా ఇలా అన్నది: “ఫలితాలను సందేహించేందుకు కూడా అనేక కారణాలున్నాయి. చాలా దేశాలు విరాళాలు ఇవ్వడానికి సంకోచిస్తున్నాయంటే దానికి కారణం, నిధులు ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడుతున్నాయో అవి వారికి ఎంతో అరుదుగాగానీ అందకపోవడమే.” విచారకరంగా, ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు ఇచ్చే విరాళాల్లో అధికభాగం అవినీతి, ఉత్తర ప్రత్యుత్తరాల్లో అధికార యంత్రాంగం చేసే కాలయాపన మూలంగా అవి నిజంగా అవసరమైన ప్రజలకు ఎప్పుడూ చేరవు.

పేదరికం తీరని సమస్యగా ఉంటుందని యేసుకు తెలుసు. ఆయనిలా అన్నాడు: ‘బీదలెల్లప్పుడు మీతోకూడ ఉంటారు.’ (మత్తయి 26:​11) అంటే భూమ్మీద పేదరికం ఎల్లప్పుడూ ఉంటుందని దీని భావమా? పరిస్థితిని మెరుగుపరచడానికి ఏమీ చేసే అవకాశం లేదా? పేదలకు సహాయం చేయడానికి క్రైస్తవులు ఏమి చేయవచ్చు?

[అధస్సూచీలు]

^ పేరా 2 పేరు మార్చబడింది.

^ పేరా 5 మార్షల్‌ ప్లాన్‌ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌ ఆర్థికంగా తిరిగి నిలదొక్కుకునేందుకు సహాయం చేయడానికి రూపొందించబడిన, అమెరికా స్పాన్సర్‌ చేసిన కార్యక్రమం.