కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భయపడకండి యెహోవా మీకు తోడైయున్నాడు!

భయపడకండి యెహోవా మీకు తోడైయున్నాడు!

భయపడకండి యెహోవా మీకు తోడైయున్నాడు!

యాభైకంటే ఎక్కువ సంవత్సరాల క్రితం, మొదటి అణుబాంబుల విస్ఫోటనం జరిగిన కొంతకాలం తర్వాత, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన అణు విజ్ఞానశాస్త్రవేత్త హెరాల్డ్‌ సి. యురే, భవిష్యత్తు గురించి ఇలా చెప్పాడు: “మనం భయంతో తింటాము, భయంతో నిద్రపోతాము, భయంతో జీవిస్తాము, భయంతోనే మరణిస్తాము కూడా.” నిజంగా, నేడు మన ప్రపంచం భయంతో నిండి ఉందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు! ప్రతీరోజు వార్తాపత్రికలు తీవ్రవాదం, దౌర్జన్యపూరిత నేరాలు, అంతుబట్టని రోగాలు వంటివాటి గురించిన భయంకరమైన వృత్తాంతాలను తెలియజేస్తున్నాయి.

క్రైస్తవులముగా మనకు, అలాంటి పరిస్థితులకున్న ప్రాముఖ్యత తెలుసు. అవి మనం ఈ దుష్టవిధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నామని సూచిస్తున్నాయి, ఈ అంత్యదినాలు “అపాయకరమైన కాలముల” ద్వారా గుర్తించబడతాయని బైబిలు ముందే తెలియజేసింది. (2 తిమోతి 3:⁠1) నీతి నివసించే నూతనలోకాన్ని యెహోవా దేవుడు త్వరలోనే తీసుకువస్తాడనే మన నమ్మకం అలా బలపర్చబడుతుంది. (2 పేతురు 3:​13) అయితే ఈలోగా మనం భయానికి అతీతులముగా ఉండగలమా?

భయం మరియు దేవుని సేవకులు

ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు కొంతమేరకు భయపడిన యెహోవా సేవకుల్లో యాకోబు, దావీదు, ఏలీయా ఉన్నారు. (ఆదికాండము 32:6, 7; 1 సమూయేలు 21:11, 12; 1 రాజులు 19:​2, 3) వీరికి విశ్వాసం కొరవడలేదు. బదులుగా, వారు యెహోవాపై దృఢమైన నమ్మకాన్ని చూపించారు. అయితే యాకోబు, దావీదు, ఏలీయా మానవులు, కాబట్టి వారు భయానికి గురయ్యారు. “ఏలీయా మనవంటి స్వభావముగల మనుష్యుడే” అని శిష్యుడైన యాకోబు వ్రాశాడు.​—⁠యాకోబు 5:​17.

మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న లేక భవిష్యత్తులో ఎదుర్కొనే అడ్డంకి గురించి ఆలోచించినప్పుడు మనం కూడా భయపడుతుండవచ్చు. అలాంటి భయం అర్థం చేసుకోదగినదే. ఎంతైనా, అపవాదియైన సాతాను, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచున్న” వారితో “యుద్ధము” చేయాలనే దృఢనిశ్చయంతో ఉన్నాడని బైబిలు చెబుతోంది. (ప్రకటన 12:​17) ఆ మాటలు నిర్దిష్టంగా అభిషిక్త క్రైస్తవులకు అన్వయించినా, పౌలు ఇలా వ్రాశాడు: “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించు వారందరు హింసపొందుదురు.” (2 తిమోతి 3:​12) అయినప్పటికీ, మనకు సమస్యలు ఎదురైనప్పుడు మనం భయంతో దుర్బలులం కానవసరం లేదు. ఎందుకు?

“పూర్ణరక్షణ కలుగజేయు దేవుడు”

కీర్తనకర్తయైన దావీదు ఇలా వ్రాశాడు: “దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు.” (కీర్తన 68:​20) యెహోవా తన ప్రజలను ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి కాపాడడం ద్వారా లేదా సహించడానికి బలం ఇవ్వడం ద్వారా, వారిని రక్షించడానికి తన సామర్థ్యాన్ని పదే పదే ప్రదర్శించాడు. (కీర్తన 34:17; దానియేలు 6:22; 1 కొరింథీయులు 10:​13) మీరు చేసిన బైబిలు అధ్యయనం నుండి, అలాంటి “రక్షణ” కార్యాలను ఎన్నింటిని గుర్తుతెచ్చుకోగలరు?

వాచ్‌టవర్‌ పబ్లికేషన్స్‌ ఇండెక్స్‌ * ఉపయోగిస్తూ, నోవహు కాలంనాటి భూగోళవ్యాప్త జలప్రళయం, సొదొమ గొమొఱ్ఱాల నుండి లోతును, ఆయన కుమార్తెలను కాపాడడం, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికివచ్చి ఎఱ్ఱసముద్రం గుండా ప్రయాణించడం, లేదా యూదా జనాంగాన్ని నాశనం చేయడానికి హామాను పన్నిన పన్నాగం విఫలంకావడం వంటి నిజజీవిత సంఘటనలపై ఎందుకు పరిశోధన చేయకూడదు? ఈ ఉత్తేజకరమైన వృత్తాంతాలను చదవడం, వాటిని ధ్యానించడం, యెహోవా రక్షణ కార్యాలు చేసే దేవుడనే మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. ఇది, మీరు మీ విశ్వాస పరీక్షలను నిర్భయంగా ఎదుర్కోవడానికి మీకు సహాయం చేస్తుంది.

నేటి ఉదాహరణలు

నేడు మీ ప్రాంతంలోవుంటున్న, సహనం చూపించిన వారి ఉదాహరణలను మీరు గుర్తుతెచ్చుకోగలరా? నమ్మకంగా ఉన్నందుకు జైలుపాలైన వారెవరైనా ఉండవచ్చు. ఆరోగ్యం బాగాలేకపోయినా నమ్మకంగా యెహోవా సేవ చేస్తున్న వృద్ధ క్రైస్తవులు మీకు తెలిసివుండవచ్చు. లేదా తమ తోటి విద్యార్థుల నుండి తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా లోకం నుండి వేరుగా ఉంటున్న యౌవనస్థుల గురించి ఆలోచించవచ్చు. తోడు లేకుండా పిల్లలను పెంచుతున్న ఒంటరి తల్లి లేక తండ్రి, ఒంటరితనం బాధిస్తున్నా యెహోవా సేవలో కొనసాగుతున్న అవివాహితులు కూడా ఉంటుండవచ్చు. అలాంటివారి నుండి మీరేమి నేర్చుకోవచ్చు? వాళ్ళ నమ్మకమైన జీవన విధానం గురించి ఆలోచించడం, మీకు ఎలాంటి కష్టాలు ఎదురైనా సహించడానికి, నిర్భయంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది.

మనకు వ్యతిరేకత, హింస ఎదురైనప్పుడు మాత్రమే కాదు గానీ మనపట్ల యెహోవాకున్న ప్రేమ విషయంలో సందేహాలు మొదలైనప్పుడు కూడా మనకు ధైర్యం అవసరం. క్రీస్తు విమోచన క్రయధన బలి వ్యక్తిగతంగా మనకు అన్వయిస్తుందనే నమ్మకాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. (గలతీయులు 2:​20) ఆ తర్వాత, మనం ఎలాంటి అనుచితమైన భయం లేదా భీతి లేకుండా యెహోవాను సమీపించవచ్చు. మనం యెహోవా ప్రేమకు అనర్హులమన్న భావం కలిగితే, యేసు తన అనుచరులకు చెప్పిన ఈ మాటల గురించి ధ్యానించవచ్చు: “రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా; అయినను మీ తండ్రి సెలవులేక వాటిలో ఒకటైనను నేలనుపడదు. మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.”​—⁠మత్తయి 10:​29-31.

కావలికోట తేజరిల్లు! పత్రికలు, నిర్భయంగా సవాళ్ళను ఎదుర్కొన్న ఆధునిక దిన యెహోవాసాక్షుల అనుభవాలను తరచూ ప్రచురిస్తాయి. అంటే వారు తమకు ఎదురైన కష్టాలనుబట్టి ఎన్నడూ ప్రతికూల భావాలకు గురికాలేదని కాదు. కానీ, అలాంటి భావాలు యెహోవా సేవ చేయకుండా తమను ఆపేందుకు వారు అనుమతించలేదు. ప్రచురించబడిన వారి వృత్తాంతాలు మీరు కూడా నిర్భయంగా సహించేందుకు సహాయం చేయగలవు. రెండు ఉదాహరణలు పరిశీలించండి.

ఒక గాయం ఆయన జీవితాన్ని మార్చేసింది

తేజరిల్లు! జూలై-సెప్టెంబరు, 2003, సంచికలో “నా జీవితాన్నే మార్చివేసిన గాయం” అనే ఆర్టికల్‌ ప్రచురించబడింది. దానిలో, కెన్యాలోవున్న యెహోవాసాక్షుల్లో ఒకరైన స్టాన్‌లీ ఓమ్‌బివా, వేగంగా వస్తున్న వాహనం ఢీకొనడం మూలంగా తాను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి తెలియజేశాడు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండగా, ఆయన తన ఉద్యోగాన్నీ దానివల్ల వచ్చే ప్రయోజనాలన్నిటినీ కోల్పోయాడు. సహోదరుడు ఓమ్‌బివా తన వృత్తాంతంలో ఇలా అంగీకరించాడు: “నాకు నా పరిస్థితి గురించి అర్థమైనకొలది నేను ప్రతికూలంగా మారి, నా గురించే ఆలోచించుకోవడం, విసుక్కోవడం ప్రారంభించానని అంగీకరించవలసిందే. కొన్నిసార్లు నేను కోపగించుకోవడం, గొడవపడడం . . . వంటివి చేసేవాడిని.” ఈ క్రైస్తవునికి అంత కష్టం వచ్చినా ఆయన నిర్భయంగానే ఉన్నాడు. ఆయన తనను నిరుత్సాహం ఆవరించి పూర్తి నిరాశకు గురయ్యేలా చేయడానికి అనుమతించలేదు. బదులుగా, ఆయన యెహోవాపై ఆధారపడ్డాడు. ‘నా కష్ట సమయమంతటా కూడా ఆయన నాకు సర్వదా ఎంతో మద్దతునిచ్చాడు, ఆయన నాకు ఎంతగా మద్దతునిచ్చాడంటే నేను కొన్నిసార్లు సిగ్గుపడ్డాను కూడా. నేను ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఊరటనిచ్చే నాకు తెలిసిన కొన్ని లేఖనాలను చదివి ధ్యానించాలని గట్టిగా తీర్మానించుకున్నాను’ అని సహోదరుడు ఓమ్‌బివా చెబుతున్నాడు.

సహోదరుడు ఓమ్‌బివా చేసిన నిజాయితీగల వ్యాఖ్యలు, ఇతరులనేకులు నిర్భయంగా కష్టాలు ఎదుర్కోవడానికి సహాయం చేశాయి. ఒక క్రైస్తవ సహోదరి ఇలా వ్రాసింది: “నేను ఈ ఆర్టికల్‌ చదివినప్పుడు ఏడ్చాను. యెహోవా ఈ ఆర్టికల్‌ ద్వారా నాకు తన వాత్సల్యాన్ని, ప్రేమపూర్వక శ్రద్ధను చూపిస్తున్నాడనీ, ఓదార్పునిస్తున్నాడనీ నేను భావించాను.” మరో సాక్షి ఇలా వ్రాశాడు: “అలాంటి పరిస్థితులనే అనుభవిస్తూ, మౌనంగా సహిస్తున్న మాలాంటి వారికి ఇటువంటి ఆర్టికల్స్‌ గొప్ప ప్రోత్సాహాన్నిస్తాయి.”

మానసిక వ్యధను సహించడం

“రేపేమి సంభవించునో మీకు తెలియదు” అనే ఆర్టికల్‌లో హెర్బర్ట్‌ జెన్నింగ్స్‌ చెప్పినది మరో కదిలించే అనుభవం. * సహోదరుడు జెన్నింగ్స్‌ బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నాడు. ఆయన తన అనారోగ్యపు తొలి దినాలను గుర్తు తెచ్చుకుంటూ ఇలా చెబుతున్నాడు: “క్రైస్తవ కూటాలకు హాజరవడానికి కూడా చాలా కష్టపడవలసి వచ్చేది. అయినప్పటికీ, ఆధ్యాత్మిక సహవాసం యొక్క విలువను నేను పూర్తిగా గుణగ్రహిస్తూనే ఉన్నాను. దీనిని అధిగమించడానికి గాను, నేను రాజ్య మందిరానికి జనం వచ్చి కూర్చొన్న తర్వాత వెళ్ళేవాడిని, కార్యక్రమం ముగింపులో జనం లేచి వెళ్ళడానికి కొంచెం ముందు లేచి వచ్చేసే వాడిని.”

ప్రకటించడం కూడా కష్టమయ్యేది. సహోదరుడు జెన్నింగ్స్‌ ఇలా చెబుతున్నాడు: ‘కొన్నిసార్లు, ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత డోర్‌బెల్‌ను కొట్టాలన్నా కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. అయినా మానలేదు, ఎందుకంటే మన పరిచర్యవల్ల మనం రక్షణ పొందడమే కాక పరిచర్యకు అనుకూలంగా ప్రతిస్పందించేవారు కూడా రక్షణ పొందేందుకు సహాయం చేస్తామని నేను గుర్తించాను. (1 తిమోతి 4:16) కొద్దిసేపటికి, నా భావోద్రేకాలను అదుపు చేసుకుంటూ ఇంకొక ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేసేవాడిని. పరిచర్యలో క్రమంగా భాగం వహించడం ద్వారా నేను నా ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగాను, అది, నేను నా సమస్యను తాళుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అధికం చేసింది.’

సహోదరుడు జెన్నింగ్స్‌ నిజాయితీతో కూడిన వృత్తాంతం, తమ కష్టాలను అలాంటి ధైర్యంతోనే ఎదుర్కోవడానికి అనేకమంది పాఠకులకు సహాయం చేసింది. ఉదాహరణకు, ఒక క్రైస్తవ సహోదరి ఇలా వ్రాసింది: “నేను ఈ ఆర్టికల్‌ చదివి కదిలించబడినంతగా, కావలికోట తేజరిల్లు! పత్రికలు చదువుతున్న 28 సంవత్సరాల్లో ఏ ఆర్టికల్‌ చదివీ కదిలించబడలేదు. నేను పూర్తికాల సేవ మానేయాల్సి వచ్చింది, నాకు మరింత విశ్వాసం ఉంటే నేను కొనసాగగలిగేదాన్ని కదా అని భావిస్తూ నేను ఎంతో అపరాధ భావానికి లోనయ్యాను. సహోదరుడు జెన్నింగ్స్‌ తన అనారోగ్యం మూలంగా తన నియామకాన్ని ఎలా వదిలేయాల్సి వచ్చిందో చదవడం, నేను నా పరిస్థితిని సమతుల్యంగా దృష్టించడానికి సహాయం చేసింది. ఇది నిజంగా నా ప్రార్థనలకు జవాబు!”

అదేవిధంగా, ఒక క్రైస్తవ సహోదరుడు ఇలా వ్రాశాడు: “పది సంవత్సరాలపాటు సంఘ పెద్దగా సేవచేసిన తర్వాత, ఒక మానసిక రుగ్మత కారణంగా నేను నా ఆధిక్యతను వదులుకోవలసి వచ్చింది. నాకు ఎంతగా వైఫల్య భావాలు కలిగేవంటే, యెహోవా ప్రజలు సాధించిన అసాధారణ విషయాలను ఎక్కువగా వివరించే జీవిత కథలను చదవడం నాకు తరచూ ఎంతో వేదన కలిగించేది. కానీ సహోదరుడు జెన్నింగ్స్‌ చూపించిన పట్టుదల నాకు ప్రోత్సాహాన్నిచ్చింది. నేను ఆ ఆర్టికల్‌ను లెక్కలేనన్నిసార్లు చదివాను.”

నమ్మకంతో ముందుకు సాగడం

సహోదరులు ఓమ్‌బివా, జెన్నింగ్స్‌లలాగే అనేకమంది యెహోవాసాక్షులు ఎంతో కష్టతరమైన అడ్డుంకులు ఉన్నా నిర్భయంగా యెహోవా దేవుణ్ణి ఆరాధించడంలో కొనసాగుతున్నారు. మీరూ వారిలో ఒకరైతే, మీరు ప్రశంసనీయులు. “మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు” అనే నమ్మకం కలిగివుండండి.​—⁠హెబ్రీయులు 6:​10.

యెహోవా, ప్రాచీన కాలాలకు చెందిన తన నమ్మకమైన ప్రజలు తమ శత్రువులను జయించడానికి ఎలాగైతే సహాయం చేశాడో అలాగే, మీకు ఎదురవగల ఎలాంటి అడ్డంకునైనా జయించడానికి ఆయన మీకు సహాయం చేయగలడు. కాబట్టి, యెహోవా యెషయా ప్రవక్త ద్వారా పలికిన ఈ మాటలను మనసులో ఉంచుకోండి: “నీకు తోడైయున్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము. నేను నిన్ను బలపరతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.”​—⁠యెషయా 41:​9-10.

[అధస్సూచీలు]

^ పేరా 9 యెహోవాసాక్షులు ప్రచురించినది.

[16వ పేజీలోని చిత్రాలు]

స్టాన్‌లీ ఓమ్‌బివా (పైన), హెర్బర్ట్‌ జెన్నింగ్స్‌ (కుడివైపు) సహోదరుల్లాగే, అనేకులు నిర్భయంగా యెహోవాను సేవిస్తున్నారు

[14వ పేజీలోని చిత్రసౌజన్యం]

USAF photo