“మందకు మాదిరులుగా” ఉన్న కాపరులు
“మందకు మాదిరులుగా” ఉన్న కాపరులు
“ఇష్టపూర్వకముగాను . . . సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. . . . మందకు మాదిరులుగా ఉండుడి.”—1 పేతురు 5:2, 3.
సా.శ. 33 పెంతెకొస్తుకు కొన్నిరోజుల ముందు, పేతురు, ఆరుగురు ఇతర శిష్యులు గలిలయ సముద్రపు ఒడ్డున యేసు సిద్ధంచేసిన అల్పాహారం తింటున్నారు. పునరుత్థానుడైన యేసును పేతురు చూడడం ఇది మొదటిసారి కాదు, అంతేగాక యేసు సజీవంగా ఉన్నాడని తెలుసుకొని ఆయన నిస్సందేహంగా పులకించిపోయి ఉంటాడు. అయితే, పేతురు కాస్త భయపడి కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఆయన కొద్దిరోజుల క్రితం యేసు ఎవరో తనకేమాత్రం తెలియదని అందరిముందు చెప్పాడు. (లూకా 22:55-60; 24:34; యోహాను 18:25-27; 21:1-14) పశ్చాత్తప్త పేతురు చూపించిన అవిశ్వాసాన్నిబట్టి యేసు ఆయనను గద్దించాడా? లేదు. బదులుగా, యేసు తన “గొఱ్ఱె పిల్లలను” మేపే, కాసే బాధ్యతను పేతురుకు అప్పగించాడు. (యోహాను 21:15-17) మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘ చరిత్రకు సంబంధించిన బైబిలు వృత్తాంతం చూపిస్తున్నట్లుగా, పేతురుపై యేసు ఉంచిన నమ్మకం వమ్ముకాలేదు. తీవ్ర పరీక్షలు ఎదురైన మరియు శీఘ్ర విస్తరణ జరిగిన కాలంలో పేతురు, యెరూషలేములోని ఇతర అపొస్తలులతో, పెద్దలతో కలిసి క్రైస్తవ సంఘాన్ని కాసాడు.—అపొస్తలుల కార్యములు 1:15-26; 2:14; 15:6-9.
2 నేడు, మానవ చరిత్రలోని అత్యంత అపాయకరమైన కాలాల్లో యెహోవా తన గొర్రెలను నడిపేందుకు, యేసుక్రీస్తు ద్వారా, ఆధ్యాత్మిక కాపరులుగా సేవ చేసేందుకు అర్హులైన పురుషులను నియమించాడు. (ఎఫెసీయులు 4:11, 12; 2 తిమోతి 3:1) మరి ఆయన వారిపై ఉంచిన ఆ నమ్మకం వ్యర్థమైందా? ప్రపంచవ్యాప్తంగా ఉనికిలోవున్న శాంతిభరిత క్రైస్తవ సహోదరత్వం అది వ్యర్థం కాలేదని నిరూపిస్తోంది. అవును, ఈ కాపరులు కూడా పేతురులాగే అపరిపూర్ణ మానవులు. (గలతీయులు 2:11-14; యాకోబు 3:2) అయినప్పటికీ, యెహోవా “తన స్వరక్తమిచ్చి [‘కుమారుని రక్తమిచ్చి,’ NW] సంపాదించిన” గొర్రెలను కాసే విషయంలో వారిని నమ్ముతున్నాడు. (అపొస్తలుల కార్యములు 20:28) యెహోవా ఈ మనుష్యులను “రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా” పరిగణిస్తూ వారిపట్ల ప్రగాఢ అనురాగాన్ని చూపిస్తున్నాడు.—1 తిమోతి 5:17.
3 మందకు మాదిరులుగా ఉండేలా, ఆధ్యాత్మిక కాపరులు ఇష్టపూర్వకమైన, సిద్ధమనస్సుతోకూడిన స్ఫూర్తిని ఎలా కాపాడుకుంటారు? పేతురు, మొదటి శతాబ్దపు ఇతర కాపరుల్లాగే వారు కూడా దేవుని పరిశుద్ధాత్మపై ఆధారపడతారు, ఆ ఆత్మ వారు తమ బాధ్యతా బరువులను మోసేందుకు అవసరమైన బలాన్ని వారికిస్తుంది. (2 కొరింథీయులు 4:7) పరిశుద్ధాత్మ వారిలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము వంటి ఆత్మఫలమును కూడా ఫలింపజేస్తుంది. (గలతీయులు 5:22) కాపరులు, తమకు అప్పగించబడిన దేవుని మందను కాస్తున్నప్పుడు ఈ ఫలాన్ని ప్రదర్శించడంలో వారు మాదిరిగా ఉండగల కొన్ని ప్రత్యేక మార్గాలను మనం చూద్దాం.
మందంతటినీ, వ్యక్తిగతంగా ప్రతీ గొర్రెను ప్రేమించండి
4 దేవుని ఆత్మ ఫలింపజేసే ప్రధాన లక్షణం ప్రేమ. యెహోవా సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారం అందజేస్తూ యెషయా 65:13, 14; మత్తయి 24:45-47) అయితే, ఆయన కేవలం మందను మేపడంకన్నా ఇంకా ఎక్కువే చేస్తున్నాడు. ఆయన వ్యక్తిగతంగా ప్రతీ గొర్రెపట్ల ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తున్నాడు. (1 పేతురు 5:6, 7) యేసు కూడా మందను ప్రేమిస్తున్నాడు. ఆయన దానికోసం ప్రాణాలు అర్పించడమే కాక, ఆయనకు వ్యక్తిగతంగా ప్రతీ గొర్రె ‘పేరు’ కూడా తెలుసు.—యోహాను 10:3, 14-16.
మందంతటిపట్ల తన ప్రేమను కనబరుస్తున్నాడు. (5 ఆధ్యాత్మిక కాపరులు యెహోవాను, యేసుక్రీస్తును అనుకరిస్తారు. సంఘానికి ‘బోధించుటలో జాగ్రత్తగా ఉంటూ’ వారు దేవుని మందంతటిపట్ల ప్రేమను కనబరుస్తారు. వారిచ్చే బైబిలు ఆధారిత ప్రసంగాలు మందను మేపేందుకు, కాపాడేందుకు సహాయం చేస్తాయి అంతేకాక, దానికి సంబంధించి వారు చేసే కృషి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. (1 తిమోతి 4:13, 16) అయితే సంఘకూటాలు, ఇతర కార్యక్రమాలు “మర్యాదగాను క్రమముగాను” జరిగేలా చూడడంలో భాగంగా సంఘ రికార్డులను భద్రపరచడానికి, ఉత్తరప్రత్యుత్తరాలు జరపడానికి, కాలపట్టికలు వేయడానికి, అలాగే అనేక ఇతర విషయాల గురించి శ్రద్ధ వహించడానికి వారు వెచ్చించే సమయం అందరికీ అంతగా కనిపించదు. (1 కొరింథీయులు 14:39) ఈ పనిలో అధికశాతం ఇతరులు గమనించేలా ఉండకపోవడమే కాక, అదంతగా గుర్తించబడకపోవచ్చు. అది నిజంగా ప్రేమతోచేసే సేవే.—గలతీయులు 5:13.
6 ప్రేమగల క్రైస్తవ కాపరులు సంఘంలోని ప్రతీ గొర్రెపట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపించేందుకు కృషిచేస్తారు. (ఫిలిప్పీయులు 2:4) కాపరులు గొర్రెలను వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ తెలుసుకునేందుకు ఒక మార్గమేమిటంటే, ప్రకటనాపనిలో వారితో కలిసి పనిచేయడమే. ప్రకటనాపనిలో యేసు తరచూ తన అనుచరులను వెంట తీసుకుని వెళ్లడమే కాక, వారిని ప్రోత్సహించేందుకు అలాంటి సందర్భాల్ని ఉపయోగించుకున్నాడు. (లూకా 8:1) అనుభవజ్ఞుడైన ఒక క్రైస్తవ కాపరి ఇలా చెబుతున్నాడు: “ఒక సహోదరుణ్ణి లేదా సహోదరిని అర్థం చేసుకుని ప్రోత్సహించేందుకు అతనితో లేదా ఆమెతో కలిసి క్షేత్ర పరిచర్యలో పనిచేయడమే శ్రేష్ఠమైన మార్గమని నేను గ్రహించాను.” క్షేత్ర పరిచర్యలో ఒక పెద్దతో కలిసి పనిచేసే అవకాశం మీకు ఇటీవల లభించకపోతే, అలా చేసేందుకు వెంటనే ఎందుకు ఏర్పాట్లు చేసుకోకూడదు?
7 యేసు తన అనుచరుల ఆనందాలను, దుఃఖాలను పంచుకునేలా ప్రేమ ఆయనను పురికొల్పింది. ఉదాహరణకు, తన 70 మంది శిష్యులు తమ ప్రకటనా పనినుండి సంతోషంగా తిరిగివచ్చినప్పుడు, యేసు ‘బహుగా ఆనందించాడు.’ (లూకా 10:17-21) అయితే లాజరు మరణం, మరియపై ఆమె కుటుంబ సభ్యులపై, స్నేహితులపై చూపించిన ప్రభావాన్ని గమనించినప్పుడు “యేసు కన్నీళ్లు విడి[చాడు].” (యోహాను 11:33-35) అదేవిధంగా, నేడు శ్రద్ధ కనబరిచే కాపరులు, గొర్రెల భావోద్వేగాల విషయంలో ఉదాసీనంగా ఉండరు. ‘సంతోషించేవారితో సంతోషించేలా, ఏడ్చేవారితో ఏడ్చేలా’ ప్రేమ వారిని ప్రేరేపిస్తుంది. (రోమీయులు 12:15, 16) మీరు మీ జీవితంలో ఆనందాన్ని లేదా దుఃఖాన్ని అనుభవిస్తుంటే, క్రైస్తవ కాపరులతో మీ భావాలను పంచుకోండి. మీ ఆనందాన్ని గురించి వినడం వారిని ప్రోత్సహిస్తుంది. (రోమీయులు 1:11, 12) మీకు ఎదురౌతున్న పరీక్షలను తెలుసుకోవడం, మిమ్మల్ని బలపరచి, ఓదార్చేందుకు వారికి దోహదపడుతుంది.—1 థెస్సలొనీకయులు 1:6; 3:1-3.
8 మందపట్ల ఒక కాపరికుండే ప్రేమ, ప్రత్యేకంగా ఆయన తన కుటుంబాన్ని చూసుకునే విధానంలో స్పష్టమౌతుంది. (1 తిమోతి 3:1, 4) ఆయన వివాహితుడైతే, ఆయన తన భార్యపట్ల చూపించే ప్రేమ, గౌరవం ఇతర భర్తలు అనుకరించగల మాదిరిని ఉంచుతుంది. (ఎఫెసీయులు 5:25; 1 పేతురు 3:7) లిండా అనే ఒక క్రైస్తవ స్త్రీ వ్యాఖ్యానాలను పరిశీలించండి. ఆమె భర్త చనిపోవడానికి ముందు 20 కన్నా ఎక్కువ సంవత్సరాలు పైవిచారణకర్తగా సేవచేశాడు. ఆమె ఇలా చెబుతోంది: “నా భర్త ఎప్పుడూ సంఘ పనుల్లో నిమగ్నమైవుండేవారు. అయినప్పటికీ మేమిద్దరం ఒక జట్టుగా ఉన్నామని నేను భావించేలా చేసేవారు. ఆయన తరచూ, నేనిస్తున్న మద్దతు విషయంలో కృతజ్ఞత వ్యక్తంచేస్తూ, తన ఖాళీ సమయాన్ని నాతో గడిపేవారు. తత్ఫలితంగా, నేను ప్రేమించబడుతున్నానని భావించానే తప్ప, సంఘం కోసం ఆయన వెచ్చిస్తున్న సమయం విషయంలో ఈర్ష్యపడలేదు.”
9 ఒకవేళ ఒక క్రైస్తవ కాపరికి పిల్లలుంటే, ఆయన తన పిల్లలకు ప్రేమపూర్వకంగా శిక్షణనిస్తూ, క్రమంగా వారిని మెచ్చుకునే విధానం ఇతర తల్లిదండ్రులు అనుసరించదగిన మాదిరిని ఉంచుతుంది. (ఎఫెసీయులు 6:4) వాస్తవానికి ఆయన తన కుటుంబంపట్ల చూపించే ప్రేమ, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడి, తత్ఫలితంగా తనపై ఉంచబడిన నమ్మకానికి తగ్గట్టు జీవిస్తున్నాడని రుజువు చేస్తుంది.—1 తిమోతి 3:4, 5.
సంభాషించడం ద్వారా సంతోషానికి, సమాధానానికి తోడ్పడండి
10 పరిశుద్ధాత్మ వ్యక్తిగతంగా ఒక క్రైస్తవునిలో, పెద్దల సభలో, సంఘమంతటిలో సంతోషాన్ని, సమాధానాన్ని ఫలింపజేయగలదు. అయితే, నిష్కపటమైన సంభాషణ లోపించడం ఈ సంతోషంపై, సమాధానంపై ప్రతికూల ప్రభావం చూపించగలదు. ప్రాచీనకాలపు సొలొమోను ఇలా పేర్కొన్నాడు: “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును.” (సామెతలు 15:22) మరోవైపున, గౌరవప్రదమైన, దాపరికంలేని సంభాషణ సంతోషానికి, సమాధానానికి తోడ్పడుతుంది. ఉదాహరణకు, సున్నతికి సంబంధించిన వివాదంవల్ల తొలి శతాబ్దపు సంఘ సమాధానం పాడయ్యే ప్రమాదం ఏర్పడినప్పుడు, యెరూషలేములోని పరిపాలక సభ సభ్యులు పరిశుద్ధాత్మ నిర్దేశం కోసం ప్రార్థించారు. అలాగే ఆ అంశంపై వారు తమ విభిన్న దృక్కోణాలను వ్యక్తపరిచారు. ఎంతో ఉత్తేజకరమైన చర్చ తర్వాత, వారొక నిర్ణయానికొచ్చారు. వారు తమ ఏకాభిప్రాయ నిర్ణయాన్ని సంఘాలకు తెలియజేసినప్పుడు, సహోదరులు “ఆదరణపొంది సంతోషించిరి.” (అపొస్తలుల కార్యములు 15:6-23, 25, 31; 16:4, 5) సంతోషం, సమాధానం అధికమయ్యాయి.
11 అదేవిధంగా నేడు, కాపరులు చక్కగా సంభాషించేవారిగా ఉంటూ సంఘంలోని సంతోషానికి, సమాధానానికి తోడ్పడతారు. సమస్యలు సంఘ సమాధానాన్ని ప్రమాదంలో పడేసినప్పుడు, వారు కలుసుకొని దాపరికంలేకుండా తమ భావాలను వ్యక్తపరుచుకుంటారు. వారు తోటి కాపరుల వ్యాఖ్యానాలను గౌరవభావంతో వింటారు. (సామెతలు 13:10; 18:13) పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించిన తర్వాత వారు బైబిలు సూత్రాల, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన నిర్దేశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. (మత్తయి 24:45-47; 1 కొరింథీయులు 4:6) అలా పెద్దలసభ లేఖనాధారంగా సరైన నిర్ణయం తీసుకున్న తర్వాత, ప్రతీ పెద్ద తన వ్యక్తిగత అభిప్రాయంతో చాలామంది పెద్దలు ఏకీభవించకపోయినా ఆ నిర్ణయానికి మద్దతివ్వడం ద్వారా పరిశుద్ధాత్మ నిర్దేశానికి లోబడతాడు. అలాంటి నమ్రత సంతోషానికి, సమాధానానికి తోడ్పడుతూ, దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలనే విషయంలో గొర్రెలకు చక్కని మాదిరినుంచుతుంది. (మీకా 6:8) సంఘంలోని కాపరులు తీసుకున్న బైబిలు ఆధారిత నిర్ణయాలకు మీరు వినమ్రతతో సహకరిస్తున్నారా?
దీర్ఘశాంతాన్ని, దయాళుత్వాన్ని ప్రదర్శించండి
12 అపొస్తలులు పదేపదే విఫలమైనప్పటికీ, యేసు దీర్ఘశాంతం వహించి, వారితో దయాపూర్వకంగా వ్యవహరించాడు. ఉదాహరణకు, యేసు అనేకమార్లు వినయంగా ఉండాల్సిన అవసరాన్ని వారికి నొక్కిచెప్పాడు. (మత్తయి 18:1-4; 20:25-27) అయినప్పటికీ, యేసు తన భూజీవితంలోని చివరి రాత్రి, వారి కాళ్లు కడిగి వినయం గురించిన పాఠం వివరించిన కొద్ది సమయానికే ‘తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడతాడనే వివాదం వారిలో పుట్టింది.’ (లూకా 22:24; యోహాను 13:1-5) యేసు ఆ అపొస్తలులను దూషించాడా? లేదు, ఆయన దయాపూర్వకంగా వారితో తర్కిస్తూ ఇలా అడిగాడు: “గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్యచేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.” (లూకా 22:27) యేసు చూపించిన దీర్ఘశాంతం, దయతోపాటు ఆయన ఉంచిన మంచి మాదిరి చివరకు ఆ అపొస్తలుల హృదయాల్ని స్పర్శించింది.
13 అదేవిధంగా, ఆధ్యాత్మిక కాపరి, ఏదైనా ఒక తప్పుచేసిన వ్యక్తికి పదేపదే హితబోధ చేయాల్సివుంటుంది. ఆ కాపరి ఆ వ్యక్తితో విసిగిపోవచ్చు. అయితే, ‘అక్రమముగా నడిచేవారికి బుద్ధి చెప్పేటప్పుడు’ కాపరి తన సొంత వైఫల్యాలను మనసులో ఉంచుకున్నప్పుడు, ఆయన తన సహోదరునిపట్ల దీర్ఘశాంతాన్నీ, దయను చూపించగలుగుతాడు. ఆ విధంగా ఆయన, కాపరులతో సహా క్రైస్తవులందరిపట్ల ఆ లక్షణాలను ప్రదర్శించే యేసును, యెహోవాను అనుకరిస్తాడు.—1 థెస్సలొనీకయులు 5:14; యాకోబు 2:13.
14 కొన్నిసార్లు, కాపరులు గంభీరమైన పాపం చేసిన వ్యక్తిని గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి పశ్చాత్తాపం చూపించకపోతే, కాపరులు ఆ తప్పిదస్థుణ్ణి సంఘం నుండి తొలగించాలి. (1 కొరింథీయులు 5:11-13) అయినప్పటికీ, ఆ వ్యక్తితో వారు వ్యవహరించే విధానం, తాము ఆ పాపిని ద్వేషించడంలేదుగానీ, పాపాన్ని ద్వేషిస్తున్నామని చూపిస్తుంది. (యూదా 23) కాపరులు దయతో వ్యవహరించే విధానం, దారిమళ్లిన ఆ గొర్రె, చివరకు మళ్లీ మందలోకి తిరిగి రావడాన్ని సులభం చేస్తుంది.—లూకా 15:11-24.
విశ్వాసం మూలంగా సత్క్రియలు పురికొల్పబడతాయి
15 ప్రజలకు యెహోవా చేస్తున్న దాన్నిబట్టి వారిలో కృతజ్ఞత ఉన్నా లేకపోయినా “యెహోవా అందరికి ఉపకారి.” (కీర్తన 145:9; మత్తయి 5:45) “రాజ్య సువార్త” ప్రకటించేందుకు తన ప్రజలను పంపించడంలో యెహోవా మంచితనం ప్రత్యేకంగా స్పష్టమౌతుంది. (మత్తయి 24:14) ఈ ప్రకటనాపనికి సారథ్యం వహించడం ద్వారా కాపరులు దేవుని మంచితనాన్ని ప్రతిబింబిస్తారు. అవిశ్రాంతంగా కృషి చేయడానికి వారిని ఏది పురికొల్పుతుంది? యెహోవాపై, ఆయన వాగ్దానాలపై బలమైన విశ్వాసమే.—రోమీయులు 10:10, 13, 14.
16 ప్రకటించడం ద్వారా ‘అందరికి మేలు చేయడమే’ గలతీయులు 6:10) ప్రోత్సాహకరమైన కాపరి సందర్శనాలు చేయడం ఇందుకు ఒక మార్గం. ఒక పెద్ద ఇలా చెబుతున్నాడు: “కాపరి సందర్శనాలు చేయడమంటే నాకిష్టం. అవి నాకు సహోదర సహోదరీలు చేస్తున్న ప్రయత్నాలను మెచ్చుకొని, వారి పని విలువైనదిగా ఎంచబడుతోందని గ్రహించేలా వారికి సహాయం చేసేందుకు అవకాశాన్నిస్తాయి.” కొన్నిసార్లు కాపరులు, ఒక వ్యక్తి యెహోవాకు తాను చేస్తున్న సేవను మెరుగుపరచుకునేందుకు మార్గాలను సూచించవచ్చు. అలా చేయడంలో జ్ఞానవంతులైన కాపరులు అపొస్తలుడైన పౌలు మాదిరిని అనుకరిస్తారు. ఆయన థెస్సలొనీకలోని సహోదరులను ఏ విధంగా అభ్యర్థిస్తున్నాడో పరిశీలించండి: “మేము మీకు ఆజ్ఞాపించువాటిని మీరు చేయుచున్నారనియు, ఇక చేయుదురనియు ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగి యున్నాము.” (2 థెస్సలొనీకయులు 3:4) నమ్మకానికి సంబంధించిన అలాంటి మాటలు గొర్రెల సదుద్దేశాలను ప్రోత్సహించడమే కాక, ‘నాయకులుగా ఉన్నవారికి లోబడి ఉండడాన్ని’ వారికి సులభం చేస్తుంది. (హెబ్రీయులు 13:17) మీకు ప్రోత్సాహకరమైన కాపరి సందర్శనం లభించినప్పుడు, దానిపట్ల కృతజ్ఞతను ఎందుకు వ్యక్తం చేయకూడదు?
కాక “విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడల” మేలు చేయాల్సిన బాధ్యత కాపరులకుంది. (సాత్వికానికి ఆశానిగ్రహం అవసరం
17 యేసు రెచ్చగొట్టబడిన సందర్భాల్లో కూడా సాత్వికాన్ని ప్రదర్శించాడు. (మత్తయి 11:29) యేసు తాను అప్పగించబడి, బంధించబడిన సందర్భంలో కూడా సాత్వికాన్ని, గొప్ప ఆశానిగ్రహాన్ని ప్రదర్శించాడు. పేతురు అనాలోచితంగా కత్తిదూసి, దాడిచేశాడు. అయితే యేసు ఆయనకిలా గుర్తుచేశాడు: “ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనినయెడల ఆయన పండ్రెండు సేనా వ్యూహములకంటె ఎక్కువమంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా?” (మత్తయి 26:51-53; యోహాను 18:10) పేతురు అందులోని పాఠాన్ని గ్రహించి ఆ తర్వాత క్రైస్తవులకు ఇలా గుర్తుచేశాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను. . . . ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు; ఆయన శ్రమపెట్టబడియు బెదిరిం[చలేదు].”—1 పేతురు 2:21-23.
18 అదేవిధంగా, సమర్థులైన కాపరులు తమకు అవమానం ఎదురైనా సాత్వికాన్ని ప్రదర్శిస్తారు. ఉదాహరణకు, సంఘంలో తాము సహాయం చేయాలనుకుంటున్న కొందరు సానుకూలంగా స్పందించకపోవచ్చు. సహాయం అవసరమైన వ్యక్తి ఆధ్యాత్మికంగా గాయపడినప్పుడు లేదా రోగిగా మారినప్పుడు, ఆ వ్యక్తి హితోపదేశానికి ‘కత్తిపోటువంటి మాటలతో’ స్పందించవచ్చు. (సామెతలు 12:18) అయితే, కాపరులు యేసు మాదిరిని అనుసరించి పరుషమైన మాటలతో లేదా ప్రతీకార క్రియలతో బదులుకు బదులు తీర్చుకోరు. దానికి భిన్నంగా, వారు ఆత్మ నిగ్రహంతో సానుభూతి ప్రదర్శిస్తారు, అది సహాయం అవసరమైన వ్యక్తికి ఒక వరంగా ఉండవచ్చు. (1 పేతురు 3:8, 9) మరి మీరు పెద్దల మాదిరిని అనుకరిస్తూ, హితోపదేశం లభించినప్పుడు సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ప్రదర్శిస్తారా?
19 ప్రపంచవ్యాప్త మందపట్ల ఇష్టపూర్వకంగా శ్రద్ధవహిస్తున్న వేలాదిమంది కాపరుల ప్రయాసను యెహోవా, యేసు నిస్సందేహంగా విలువైనదిగా పరిగణిస్తారు. “పరిశుద్ధులకు ఉపచారము” చేయడంలో పెద్దలకు మద్దతిచ్చే వేలాదిమంది పరిచర్య సేవకులపట్ల యెహోవాకు, ఆయన కుమారునికి కూడా ప్రగాఢమైన అనురాగముంది. (హెబ్రీయులు 6:10) అలాంటప్పుడు, బాప్తిస్మం తీసుకున్న కొంతమంది సహోదరులు ఈ ‘దొడ్డపని’ కోసం కావాల్సిన అర్హత సంపాదించుకునేందుకు ఎందుకు వెనుదీస్తున్నారు? (1 తిమోతి 3:1) కాపరులుగా తాను నియమించేవారికి యెహోవా ఎలా శిక్షణనిస్తాడు? మనమీ ప్రశ్నలను తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
• కాపరులు మందపట్ల ప్రేమ చూపించే కొన్ని మార్గాలు ఏమిటి?
• సంఘంలోని వారందరూ, సంతోషానికి, సమాధానానికి ఎలా తోడ్పడవచ్చు?
• హితోపదేశం చేస్తున్నప్పుడు కాపరులు ఎందుకు దీర్ఘశాంతంతో, దయతో వ్యవహరిస్తారు?
• పెద్దలు మంచితనాన్ని, విశ్వాసాన్ని ఎలా ప్రదర్శిస్తారు?
[అధ్యయన ప్రశ్నలు]
1, 2. (ఎ) అపొస్తలుడైన పేతురుకు యేసు ఏ బాధ్యతను అప్పగించాడు, యేసు నమ్మకం ఎందుకు వ్యర్థంకాలేదు? (బి) నియమిత కాపరులపట్ల యెహోవా మనోభావమెలా ఉంది?
3. ఆధ్యాత్మిక కాపరులు ఇష్టపూర్వకమైన, సిద్ధమనస్సుతోకూడిన స్ఫూర్తిని ఎలా కాపాడుకుంటారు?
4, 5. (ఎ) యెహోవా, యేసుక్రీస్తు మందపట్ల ప్రేమనెలా చూపిస్తున్నారు? (బి) ఆధ్యాత్మిక కాపరులు మందపట్ల ప్రేమను కనబరిచే కొన్ని మార్గాలు ఏమిటి?
6, 7. (ఎ) కాపరులు గొర్రెలను మరింతగా తెలుసుకునేందుకు ఒక మార్గమేమిటి? (బి) కొన్నిసార్లు మన భావాలను ఒక పెద్దతో పంచుకోవడం ఎందుకు ప్రయోజనకరం?
8, 9. (ఎ) ఒక పెద్ద తన భార్యపట్ల ప్రేమనెలా చూపించాడు? (బి) కాపరి తన కుటుంబంపట్ల ప్రేమ కనబరచడం ఎంత ప్రాముఖ్యం?
10. (ఎ) సంఘ సంతోషంపై, సమాధానంపై ఏది ప్రతికూల ప్రభావం చూపించగలదు? (బి) తొలి శతాబ్దపు సంఘ సమాధానాన్ని ఏది ప్రమాదంలో పడేసింది, ఆ వివాదమెలా పరిష్కరించబడింది?
11. పెద్దలు సంఘంలో సంతోషానికి, సమాధానానికి ఎలా తోడ్పడవచ్చు?
12. యేసు తన అపొస్తలులతో దీర్ఘశాంతంతో, దయతో ఎందుకు వ్యవహరించాల్సివచ్చింది?
13, 14. కాపరులు ప్రత్యేకంగా ఎప్పుడు దయతో వ్యవహరించాలి?
15. కాపరులు యెహోవా మంచితనాన్ని అనుకరించే ఒక మార్గమేమిటి, అలా చేసేందుకు వారిని ఏది పురికొల్పుతుంది?
16. కాపరులు గొర్రెలకు ఎలా ‘మేలు చేయవచ్చు’?
17. యేసు నుండి పేతురు ఏ పాఠం నేర్చుకున్నాడు?
18, 19. (ఎ) కాపరులు ప్రత్యేకంగా ఎప్పుడు సాత్వికాన్ని, ఆశానిగ్రహాన్ని ప్రదర్శించాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమే ప్రశ్నలు పరిశీలిస్తాం?
[18వ పేజీలోని చిత్రం]
సంఘానికి సేవచేసేందుకు పెద్దలు ప్రేమచేత పురికొల్పబడతారు
[18వ పేజీలోని చిత్రాలు]
వారు తమ కుటుంబాలతో ఉల్లాస కార్యకలాపాల్లో . . .
. . . పరిచర్యలో కూడా సమయం గడుపుతారు
[20వ పేజీలోని చిత్రం]
పెద్దలమధ్య మంచి సంభాషణ, సంఘంలో సంతోషాన్ని, సమాధానాన్ని పురికొల్పుతుంది