కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా తన మంద కాపరులకు శిక్షణనిస్తాడు

యెహోవా తన మంద కాపరులకు శిక్షణనిస్తాడు

యెహోవా తన మంద కాపరులకు శిక్షణనిస్తాడు

“యెహోవాయే జ్ఞానమిచ్చువాడు; తెలివియు వివేచనయు ఆయన నోటనుండి వచ్చును.”​—⁠సామెతలు 2:⁠6.

“నేనొక పెద్దగా నియమించబడినప్పుడు చాలా సంతోషించాను. యెహోవాను మరింతగా సేవించేందుకు నాకు లభించిన అవకాశంగా ఆ ఆధిక్యతను పరిగణించాను. ఆయన నా కోసం చేసిన దానంతటికీ నేను ఆయనకు రుణపడి ఉన్నట్లు భావించాను. ఇతర పెద్దలు నాకు సహాయం చేసినట్లే, నేను కూడా సంఘ సభ్యులకు సాధ్యమైనంత ఎక్కువగా సహాయం చేయాలని కోరుకున్నాను” అని ఏడు సంవత్సరాలు పైవిచారణకర్తగా సేవచేసిన నిక్‌ చెబుతున్నాడు. అయితే ఆయనకు సంతోషంతోపాటు కొంత ఆందోళన కూడా కలిగింది. నిక్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “నేను నియమించబడే సమయానికి నాకు 30 ఏళ్లుకూడా రాలేదు కాబట్టి, సంఘాన్ని సమర్థవంతంగా కాసేందుకు అవసరమైన నైపుణ్యాలు అంటే వివేచన, తెలివి నాకు ఉండవేమోనని ఆందోళనపడ్డాను.”

2 యెహోవా తన మందను కాసేందుకు నియమించినవారు సంతోషించడానికి అనేక కారణాలున్నాయి. అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని పెద్దలకు వాటిలో ఒక కారణాన్ని గుర్తుచేశాడు. యేసు మాటలను ఉల్లేఖిస్తూ ఆయనిలా అన్నాడు: “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము.” (అపొస్తలుల కార్యములు 20:​35) పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా సేవచేయడం, బాప్తిస్మం తీసుకున్న పురుషులు యెహోవాకు, సంఘానికి ఇవ్వడానికి అదనపు మార్గాలను అందిస్తుంది. ఉదాహరణకు, పరిచర్య సేవకులు పెద్దలకు సహాయం చేస్తారు. ఈ సేవకులు సమయం అవసరమైన అనేక నియామకాలపట్ల కూడా శ్రద్ధ వహిస్తారు. అలాంటి సహోదరులు విలువైన సేవలు అందించేలా దేవునిపట్ల, పొరుగువారిపట్ల వారికున్న ప్రేమ వారిని పురికొల్పుతుంది.​—⁠మార్కు 12:​30, 31.

3 పరిచర్య సేవకునిగా, చివరకు పెద్దగా సేవచేసే ఆధిక్యతకు కావాల్సిన అర్హతను సంపాదించుకునే యోగ్యత తనకులేదని భావిస్తూ వెనుకంజవేసే క్రైస్తవ పురుషుని విషయమేమిటి? నిక్‌లాగే ఆ సహోదరుడు, సమర్థుడైన కాపరిగా ఉండేందుకు అవసరమైన నైపుణ్యాలు తనకు లేవని బాధపడవచ్చు. బాప్తిస్మం తీసుకున్న ఒక సహోదరునిగా, మీరూ అలా భావించేవారిలో ఉన్నారా? అలా ఆందోళన చెందడం అసాధారణమేమీ కాదు. మందను కాసే విషయంలో యెహోవా నియమిత కాపరులను జవాబుదారులుగా ఎంచుతాడు. యేసు ఇలా చెప్పాడు: “ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వానియొద్ద ఎక్కువగా అడుగుదురు.”​—⁠లూకా 12:​48.

4 యెహోవా తాను నియమించిన పరిచర్య సేవకులు, పెద్దలు ఎలాంటి సహాయం లేకుండానే తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆశిస్తాడా? ఆశించడు, బదులుగా వారు దాన్ని నిర్వర్తించేందుకే కాక, విజయం సాధించేలా కూడా ఆయన వారికి ప్రయోజనాత్మక సహాయం అందిస్తాడు. ముందరి ఆర్టికల్‌లో చర్చించినట్లుగా, యెహోవా వారికి తన పరిశుద్ధాత్మనిస్తాడు, ఫలితంగా దాని ఫలాలు, వారు వాత్సల్యంతో మందపట్ల శ్రద్ధ వహించేందుకు సహాయం చేస్తాయి. (అపొస్తలుల కార్యములు 20:​28; గలతీయులు 5:​22) అంతేకాక, యెహోవా వారికి జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను అనుగ్రహిస్తాడు. (సామెతలు 2:⁠6) ఆయన వాటినెలా అనుగ్రహిస్తాడు? తన మంద కాపరులుగా తాను నియమించే వ్యక్తులకు యెహోవా శిక్షణనిచ్చే మూడు మార్గాలను మనం చర్చిద్దాం.

అనుభజ్ఞులైన కాపరులచేత శిక్షణ పొందడం

5 అపొస్తలులైన పేతురు, యోహానులు యూదుల ప్రధాన న్యాయస్థానం ఎదుట నిలబడినప్పుడు, ఆ న్యాయస్థానంలో లోకసంబంధ జ్ఞానులైన న్యాయాధిపతులు, తమ ఎదుట నిలబడ్డవారు “విద్యలేని పామరులని” ఎంచారు. నిజానికి వారికి చదవడం, వ్రాయడం వచ్చు, అయితే వారు లేఖనాల అధ్యయనానికి సంబంధించి రబ్బీలుపొందే శిక్షణ పొందలేదు. అయినప్పటికీ, ఇతర అపొస్తలులతోపాటు పేతురు యోహానులు తమ శ్రోతలు విశ్వాసులయ్యేలా వారిని ప్రోత్సహిస్తూ, తాము సమర్థులైన బోధకులమని నిరూపించుకున్నారు. ఈ సాధారణ మనుష్యులు అంతటి అసాధారణ బోధకులెలా అయ్యారు? పేతురు యోహానులు చెప్పిన విషయాలను విన్న తర్వాత ఆ న్యాయసభలో ఉన్నవారు, “వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.” (అపొస్తలుల కార్యములు 4:1-4, 13) అవును, వారు పరిశుద్ధాత్మను పొందారు. (అపొస్తలుల కార్యములు 1:⁠8) అలాగే ఆధ్యాత్మిక అంధులైన ఆ న్యాయాధిపతులకు కూడా యేసే ఆ మనుష్యులకు శిక్షణ ఇచ్చాడనే విషయం స్పష్టమైంది. యేసు, భూమ్మీద వారితోవున్న కాలంలో ఆయన గొర్రెలాంటి వారిని ఎలా సమకూర్చాలో అపొస్తలులకు నేర్పించడమే కాక, వారు మందలో భాగమైనప్పుడు వారిపట్ల ఎలా శ్రద్ధ తీసుకోవాలో కూడా బోధించాడు.​—⁠మత్తయి 11:​29; 20:​24-28; 1 పేతురు 5:⁠4.

6 యేసు పునరుత్థానం చేయబడిన తర్వాత, కాపరులుగా నియమించబడినవారికి ఆయన శిక్షణ ఇవ్వడం మానలేదు. (ప్రకటన 1:⁠1; 2:1-3:​22) ఉదాహరణకు, ఆయన వ్యక్తిగతంగా పౌలును ఎన్నుకొని ఆయనకివ్వబడే శిక్షణను పర్యవేక్షించాడు. (అపొస్తలుల కార్యములు 22:​6-10) పౌలు తాను పొందిన శిక్షణను విలువైనదిగా పరిగణించి, తాను నేర్చుకున్నది ఇతర పెద్దలకు తెలియజేశాడు. (అపొస్తలుల కార్యములు 20:​17-35) ఉదాహరణకు, దేవుని సేవలో “సిగ్గుపడనక్కరలేని పనివానిగా” తయారయ్యేందుకు తిమోతికి శిక్షణనివ్వడంలో ఆయనెంతో సమయాన్ని, శక్తిని వెచ్చించాడు. (2 తిమోతి 2:​15) వారిద్దరి మధ్య సన్నిహిత బంధమేర్పడింది. అంతకుముందు, పౌలు తిమోతి గురించి ఇలా వ్రాశాడు: “తండ్రికి కుమారుడేలాగు సేవచేయునో ఆలాగే అతడు నాతోకూడ సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను.” (ఫిలిప్పీయులు 2:​22) పౌలు తిమోతిని గానీ, మరే వ్యక్తిని గానీ తన శిష్యునిగా చేసుకునేందుకు ప్రయత్నించలేదు. బదులుగా, ఆయన ‘తను క్రీస్తునుపోలి నడుచుకున్న ప్రకారం, తనను పోలి నడుచుకొనుడని’ తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు.​—⁠1 కొరింథీయులు 11:⁠1.

7 యేసును, పౌలును అనుకరిస్తూ అనుభవజ్ఞులైన కాపరులు బాప్తిస్మం తీసుకున్న సహోదరులకు శిక్షణనిచ్చేందుకు చొరవ తీసుకుని అలాంటి సత్ఫలితాలనే సాధిస్తారు. చాధ్‌ అనుభవాన్ని పరిశీలించండి. ఆయన మతపరంగా విభాగించబడిన కుటుంబంలో పెరిగి, ఇటీవలే ఒక పెద్దగా నియమించబడ్డాడు. ఆయనిలా చెబుతున్నాడు: “నేను ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేందుకు చాలా సంవత్సరాలుగా ఎంతోమంది అనుభవజ్ఞులైన పెద్దలు నాకు సహాయం చేశారు. మా నాన్నగారు అవిశ్వాసి కాబట్టి, ఆ పెద్దలు నామీద ప్రత్యేక శ్రద్ధచూపిస్తూ, నా ఆధ్యాత్మిక తండ్రులయ్యారు. పరిచర్యలో, నాకు శిక్షణనిచ్చేందుకు వారు సమయం వెచ్చించారు. ఆ తర్వాత, ప్రత్యేకంగా ఒక పెద్ద, నేను పొందిన సంఘ నియామకాలను నిర్వహించేందుకు శిక్షణనిచ్చాడు.”

8 చాధ్‌ అనుభవం చూపిస్తున్నట్లుగా, వివేచనగల కాపరులు, భావి పరిచర్య సేవకులు, పెద్దలు అలాంటి ఆధిక్యతలకు అర్హులయ్యేలా పురోగతి సాధించడానికి చాలాకాలం ముందే శిక్షణ ఇవ్వడం ఆరంభిస్తారు. ఇది ఎందుకు అవసరం? ఎందుకంటే పరిచర్య సేవకులు, పెద్దలు తాము సేవా నియామకం పొందడానికన్నా ముందే ఉన్నత, నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలకు సరితూగాలని బైబిలు ఆదేశిస్తోంది. వారు “మొదట పరీక్షించబడవలెను.”​—⁠1 తిమోతి 3:​1-10.

9 బాప్తిస్మం తీసుకున్న సహోదరులు పరీక్షించబడాలంటే, మొదట వారికి శిక్షణ ఇవ్వబడడమే సముచితం. ఉదాహరణకు, ఉపాధ్యాయులు ఏ విధమైన ప్రత్యేక శిక్షణ ఇవ్వకుండానే కష్టమైన పరీక్ష వ్రాయమని ఒక విద్యార్థిని అడిగితే, ఆ విద్యార్థి ఆ పరీక్ష పాసవుతాడా? అతడు తప్పకుండా ఫెయిలవుతాడు. కాబట్టి శిక్షణ అవసరం. అయితే, నిబద్ధతగల ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పరీక్ష పాసయ్యేందుకే కాక, వారు సంపాదించుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకునేందుకు కూడా శిక్షణనిస్తారు. అదేవిధంగా, శ్రద్ధగల పెద్దలు బాప్తిస్మం తీసుకున్న సహోదరులకు ప్రత్యేకమైన శిక్షణనిస్తూ నియమిత పెద్దలకు ఉండవలసిన లక్షణాలను వారు అలవర్చుకునేందుకు సహాయం చేస్తారు. ఈ సహోదరులు కేవలం సేవ కోసం నియమించబడేందుకు మాత్రమే కాదుగానీ, వారు మందను తగిన రీతిలో శ్రద్ధగా చూసుకోగలిగేలా సహాయపడేందుకు కూడా శిక్షణనిస్తారు. (2 తిమోతి 2:⁠2) అయితే, బాప్తిస్మం తీసుకున్న సహోదరులు తమ వంతు కృషిచేస్తూ, పరిచర్య సేవకునిగా లేదా పెద్దగా నియమించబడేందుకు అవసరమైన అర్హతలు సంపాదించుకోవడానికి కష్టపడి పనిచేయాలి. (తీతు 1:​5-9) అయితే, అనుభవజ్ఞులైన కాపరులు, సంఘ బాధ్యతకు అర్హత సంపాదించుకుంటున్నవారికి ఇష్టపూర్వకంగా శిక్షణనిస్తూ వారు మరింత వేగంగా అభివృద్ధి సాధించేందుకు సహాయం చేయవచ్చు.

10 ఇతరులు సంఘ ఆధిక్యతలపట్ల శ్రద్ధ వహించేందుకు అనుభవజ్ఞులైన కాపరులు వారికి ఏ ప్రత్యేక రీతిలో శిక్షణ ఇవ్వవచ్చు? మొట్టమొదట, కాపరులు సంఘ సహోదరులపట్ల ఆసక్తి ప్రదర్శించాలి అంటే, క్షేత్ర పరిచర్యలో వారితో క్రమంగా పనిచేస్తూ, “సత్యవాక్యమును సరిగా” ఉపదేశించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వారికి సహాయం చేయాలి. (2 తిమోతి 2:​15) పరిణతిగల సహోదరులు, స్వయంగా ఇతరులకు సేవ చేయడం ద్వారా, ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవడం ద్వారా లభించే సంతోషం, సంతృప్తి గురించి ఆ సహోదరులతో చర్చిస్తారు. ఒక సహోదరుడు ‘మందకు మాదిరిగా’ ఉండడంలో ఎలా ప్రగతి సాధించవచ్చో కూడా వారు ప్రేమతో ప్రత్యేక సూచనలు ఇస్తారు.​—⁠1 పేతురు 5:3, 5.

11 ఒక సహోదరుడు పరిచర్య సేవకునిగా నియమించబడిన తర్వాత కూడా జ్ఞానులైన కాపరులు ఆయనకిచ్చే శిక్షణను కొనసాగిస్తారు. అనేక దశాబ్దాలపాటు పెద్దగా సేవచేసిన బ్రూస్‌ ఇలా చెబుతున్నాడు: “క్రొత్తగా నియమించబడిన సేవకునితో కూర్చొని నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ప్రచురించిన ఆదేశాలను ఆయనతో పునఃసమీక్షించడానికి నేను ఇష్టపడతాను. ఆయనకివ్వబడిన ప్రత్యేక నియామకానికి సంబంధించిన మార్గనిర్దేశాలను కలిసి చదవడమే కాక, ఆయన తన విధులను బాగా తెలుసుకునేంతవరకు ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను.” ఆ సేవకుడు అనుభవం గడించేకొద్దీ, ఆయనకు కాపరి పనిలో కూడా శిక్షణనివ్వవచ్చు. బ్రూస్‌ ఇంకా ఇలా అంటున్నాడు: “నేను ఒక పరిచర్య సేవకుణ్ణి కాపరి సందర్శనానికి నాతోపాటు తీసుకెళ్లినప్పుడు, మేము సందర్శించే వ్యక్తిని లేదా కుటుంబాన్ని ప్రోత్సహించి, పురికొల్పే ప్రత్యేక లేఖనాలను ఎంచుకునేందుకు నేనాయనకు సహాయం చేస్తాను. ఒక సేవకుడు సమర్థుడైన కాపరిగా తయారవ్వాలంటే, హృదయాన్ని స్పృశించేలా లేఖనాలను ఉపయోగించే రీతిని తెలుసుకోవడం అత్యంత ప్రాముఖ్యం.”​—⁠హెబ్రీయులు 4:​12; 5:​14.

12 క్రొత్తగా నియమించబడిన కాపరులు కూడా అదనపు శిక్షణ నుండి ఎక్కువగా ప్రయోజనం పొందుతారు. ఆరంభంలో పేర్కొనబడిన నిక్‌ ఇలా చెబుతున్నాడు: “ప్రత్యేకంగా ఇద్దరు వృద్ధ పైవిచారణకర్తల నుండి నేను పొందిన శిక్షణ చాలా సహాయకరంగా ఉంది. ఫలాని పరిస్థితితో ఎలా వ్యవహరించాలో సాధారణంగా ఈ సహోదరులకు తెలుసు. వారు అన్ని సందర్భాల్లోనూ నేను చెప్పింది ఓపికగా విని, నా అభిప్రాయంతో వారు విభేదించినా దాన్ని గంభీరంగా పరిగణించేవారు. సంఘంలోని సహోదర సహోదరీలతో వారు వ్యవహరించే వినయపూర్వక, గౌరవపూర్వక విధానాన్ని గమనించడం ద్వారా నేనెంతో నేర్చుకున్నాను. సమస్యలతో వ్యవహరిస్తున్నప్పుడు లేదా ప్రోత్సహిస్తున్నప్పుడు బైబిలును నైపుణ్యంగా ఉపయోగించాల్సిన అవసరాన్ని ఈ పెద్దలు నాకు నొక్కిచెప్పారు.”

దేవుని వాక్యంచేత శిక్షణపొందడం

13 అవును, దేవుని వాక్యమైన బైబిల్లో “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి” ఉండడానికి కాపరికి అవసరమైన నియమాలు, సూత్రాలు, ఉదాహరణలు ఉన్నాయి. (2 తిమోతి 3:​16, 17) ఒక సహోదరుడు విద్యావంతుడే అయుండవచ్చు, కానీ ఆయనకున్న లేఖన పరిజ్ఞానంతోపాటు వాటిని అన్వయించుకునే విధానం ఆయనను సమర్థుడైన కాపరిగా చేస్తుంది. యేసు మాదిరిని పరిశీలించండి. ఆయన భూమ్మీద జీవించినవారిలోకెల్లా అత్యంత తెలివైన, వివేచనపరుడైన, జ్ఞానియైన ఆధ్యాత్మిక కాపరిగా ఉన్నాడు; అయినప్పటికీ, ఆయన సహితం, యెహోవా గొర్రెలకు బోధించేటప్పుడు తన సొంత జ్ఞానంపై ఏ మాత్రం ఆధారపడలేదు. ఆయనిలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.” యేసు తన పరలోకపు తండ్రికి ఎందుకు ఘనతనిచ్చాడు? ఆయనిలా వివరించాడు: “తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును.”​—⁠యోహాను 7:​16, 18.

14 విశ్వసనీయ కాపరులు తమ సొంత మహిమ కోసం ప్రయత్నించరు. వారు తమ ఉపదేశాన్ని, ప్రోత్సాహాన్ని తమ సొంత జ్ఞానంపై ఆధారపడి ఇవ్వరు గానీ, దేవుని వాక్యంపై ఆధారపడి ఇస్తారు. గొర్రెలు పెద్దల మనసును కాక “క్రీస్తు మనస్సును” పొందేందుకు సహాయం చేయడమే కాపరి నియామకమని వారు గ్రహిస్తారు. (1 కొరింథీయులు 2:​14-16) ఉదాహరణకు, వైవాహిక సమస్యలతో వ్యవహరించేందుకు ఓ జంటకు సహాయం చేస్తున్న ఒక పెద్ద, బైబిలు సూత్రాలపై, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ప్రచురించిన సమాచారంపై కాక తన అనుభవంపై ఆధారపడి సలహా ఇస్తే అప్పుడేమిటి? (మత్తయి 24:​45) ఆయనిచ్చే సలహా స్థానిక ఆచారాల ప్రభావానికి అతిగా లోనై, ఆయనకున్న పరిమిత జ్ఞానంపై ఆధారపడి ఉండవచ్చు. నిజమే, కొన్ని ఆచారాలు తప్పు కాకపోవచ్చు, ఆ పెద్దకు జీవితంలో అనుభవం ఉండవచ్చు. అయితే మనుష్యుల ఆలోచనలకు లేదా స్థానిక ఆచారాలకు సంబంధించిన నియమాలకు బదులు యేసు స్వరాన్ని, యెహోవా మాటల్ని వినమని కాపరులు ప్రోత్సహించినప్పుడు గొర్రెలు అత్యధిక ప్రయోజనం పొందుతాయి.​—⁠కీర్తన 12:⁠6; సామెతలు 3:5, 6.

‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిచేత’ శిక్షణ పొందడం

15 అపొస్తలులైన పేతురు, యోహాను, పౌలు వంటి కాపరులందరూ “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అని యేసు వర్ణించిన గుంపులో సభ్యులుగా ఉన్నారు. ఈ దాసుని తరగతిలో, పరలోకంలో క్రీస్తుతోపాటు పరిపాలించే నిరీక్షణగల భూమ్మీదున్న యేసు ఆత్మాభిషిక్త సహోదరులు ఉన్నారు. (ప్రకటన 5:​9, 10) ఈ విధానపు అంత్యదినాల్లో, ఈ భూమ్మీద మిగిలివున్న క్రీస్తు సహోదరుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. అయితే, అంతానికి ముందే నెరవేర్చాలని యేసు ఆజ్ఞాపించిన రాజ్య సువార్త ప్రకటనాపని క్రితమెన్నటికన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా జరుగుతోంది. అయినప్పటికీ, దాసుని తరగతి అసాధారణ విజయం సాధిస్తోంది! ఎందుకు? ఎందుకంటే, ప్రకటనా, బోధనా పనిలో వారికి కొంతమేరకు సహాయం చేసేందుకు వారు ‘వేరేగొర్రెల’ సభ్యులకు శిక్షణనిచ్చారు. (యోహాను 10:16; మత్తయి 24:​14; 25:​40) నేడు, యథార్థవంతులైన ఈ గుంపు సభ్యులే అధికంగా ఈ పనిని నెరవేరుస్తున్నారు.

16 ఈ దాసుని తరగతి ఎలా శిక్షణనిస్తోంది? మొదటి శతాబ్దంలో, ఆయా వ్యక్తులకు శిక్షణనిచ్చి వారిని సంఘాల్లో పైవిచారణకర్తలుగా నియమించే అధికారం ఈ దాసుని తరగతికి చెందిన ప్రతినిధులకు ఇవ్వబడింది, ఆ పైవిచారణకర్తలు ఇతర సంఘ సభ్యులకు శిక్షణ ఇచ్చేవారు. (1 కొరింథీయులు 4:​17) నేడు కూడా అలాగే జరుగుతోంది. పరిపాలక సభ అంటే దాసుని తరగతికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషిక్త పెద్దల చిన్నగుంపు, ప్రపంచవ్యాప్తంగావున్న వేలాది సంఘాల్లోనివారికి శిక్షణ ఇచ్చి, వారిని సేవకులుగా, పెద్దలుగా నియమించే అధికారాన్ని తన ప్రతినిధులకు ఇస్తోంది. అంతేకాక, పరిపాలక సభ, గొర్రెలపట్ల అధిక శ్రద్ధను కనబరిచే విషయంలో బ్రాంచి కమిటీ సభ్యులకు, ప్రయాణ పైవిచారణకర్తలకు, పెద్దలకు, పరిచర్య సేవకులకు శిక్షణ ఇచ్చేందుకు పాఠశాలలను ఏర్పాటుచేస్తోంది. అలాగే ఉత్తరాల ద్వారా, కావలికోటలో ప్రచురించబడే ఆర్టికల్స్‌ ద్వారా, యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం * వంటి ఇతర సాహిత్యాల ద్వారా అదనపు నిర్దేశం ఇవ్వబడుతోంది.

17 ఈ దాసుని తరగతిపై యేసుకు ఎంత నమ్మకముందంటే ఆయన ఆ తరగతిని “తన యావదాస్తిమీద” అంటే ఈ భూమ్మీదున్న తన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలన్నిటిపై నియమించాడు. (మత్తయి 24:​47) పరిపాలక సభ నుండి అందే నిర్దేశాలను అన్వయించుకోవడం ద్వారా నియమిత కాపరులు, దాసుని తరగతిపై తమకు నమ్మకముందని నిరూపించుకుంటారు. అవును, కాపరులు ఇతరులకు శిక్షణ ఇచ్చినప్పుడు, దేవుని వాక్యంచేత శిక్షణ ఇవ్వబడేందుకు తమనుతాము అనుమతించుకున్నప్పుడు, దాసుని తరగతి అందజేసే శిక్షణను వారు అన్వయించుకున్నప్పుడు వారు మంద ఐక్యతకు తోడ్పడతారు. క్రైస్తవ సంఘంలోని ప్రతీ సభ్యునిపట్ల అధిక శ్రద్ధ చూపేలా పురుషులకు యెహోవా శిక్షణనిస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమో కదా!

[అధస్సూచి]

^ పేరా 21 యెహోవాసాక్షులు ప్రచురించినది.

మీరెలా జవాబిస్తారు?

•పరిణతిగల ఆధ్యాత్మిక కాపరులు ఇతరులకు ఎలా శిక్షణనిస్తారు?

•కాపరులు తమ సొంత ఆలోచనల ఆధారంగా ఎందుకు బోధించరు?

•దాసుని తరగతిపై తమకు నమ్మకముందని కాపరులు ఎలా చూపిస్తారు, ఎందుకు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. బాప్తిస్మం తీసుకున్న పురుషులు సంఘంలో మరింత బాధ్యత వహించేందుకు అర్హత ఎందుకు సంపాదించుకుంటారు?

3. సంఘ ఆధిక్యతలకు అవసరమైన అర్హత సంపాదించుకునేందుకు కొందరు ఎందుకు వెనుదీయవచ్చు?

4. తన గొర్రెలపట్ల శ్రద్ధ వహించేందుకు తాను నియమించిన వారికి యెహోవా ఎలా సహాయం చేస్తాడు?

5. పేతురు యోహానులు ఎలా సమర్థులైన కాపరులయ్యారు?

6. ఇతరులకు శిక్షణనివ్వడంలో యేసు, పౌలు ఎలాంటి మాదిరివుంచారు?

7, 8. (ఎ) పెద్దలు యేసును, పౌలును అనుకరించినప్పుడు కలిగే ప్రయోజనాన్ని ఏ అనుభవం చూపిస్తోంది? (బి) పెద్దలు భావి పరిచర్య సేవకులకు, పెద్దలకు ఎప్పుడు శిక్షణనివ్వడాన్ని ఆరంభించాలి?

9. పరిణతిగల కాపరులకు ఏ బాధ్యతవుంది, ఎందుకు?

10, 11. భావి ఆధిక్యతల కోసం కాపరులు ఇతరులకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

12. అనుభవజ్ఞులైన కాపరులు క్రొత్తగా నియమించబడిన పెద్దలకు ఎలా శిక్షణనివ్వవచ్చు?

13. (ఎ) సమర్థుడైన కాపరిగా ఉండాలంటే ఒక సహోదరునికి ఏమి అవసరం? (బి) “నేను చేయు బోధ నాది కాదు” అని యేసు ఎందుకు చెప్పాడు?

14. కాపరులు తమ సొంత మహిమ కోసం ప్రయత్నించకుండా ఎలా ఉండవచ్చు?

15. ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి’ యేసు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, ఈ దాసుని తరగతి విజయానికి ఒక కారణమేమిటి?

16. దాసుని తరగతి నియమిత పురుషులకు ఎలా శిక్షణనిస్తోంది?

17. (ఎ) దాసుని తరగతిపై యేసు తన నమ్మకాన్ని ఎలా ప్రదర్శించాడు? (బి) దాసుని తరగతిపై తమకు నమ్మకముందని ఆధ్యాత్మిక కాపరులు ఎలా చూపించవచ్చు?

[24, 25వ పేజీలోని చిత్రాలు]

క్రైస్తవ పెద్దలు సంఘంలోని యౌవనులకు శిక్షణనిస్తారు

[26వ పేజీలోని చిత్రాలు]

“నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” పెద్దలకు విస్తారంగా శిక్షణనిస్తున్నాడు