కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రాజైన క్రీస్తుకు విశ్వసనీయంగా సేవ చేయడం

రాజైన క్రీస్తుకు విశ్వసనీయంగా సేవ చేయడం

రాజైన క్రీస్తుకు విశ్వసనీయంగా సేవ చేయడం

“సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను.”​—⁠దానియేలు 7:14.

ఏ పరిపాలకుడు, తన ప్రజలకోసం ప్రాణాలర్పించి, రాజుగా పరిపాలించేందుకు తిరిగి జీవించగలడు? ఏ రాజు తన ప్రజలకు తనపట్ల నమ్మకం, విశ్వాసం కలిగేలా భూమ్మీద జీవించి, ఆ తర్వాత పరలోకం నుండి పరిపాలించగలడు? వీటినీ, ఇంకా మరెన్నింటినో చేయగలిగిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. (లూకా 1:​32, 33) క్రీస్తు మరణించి, పునరుత్థానం చేయబడి పరలోకానికి ఆరోహణమైన తర్వాత, సా.శ. 33 పెంతెకొస్తునాడు, దేవుడు ‘ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు.’ (ఎఫెసీయులు 1:20-22; అపొస్తలుల కార్యములు 2:​32-36) ఆ విధంగా, క్రీస్తు పరిమిత భావంలో తన పరిపాలనను ఆరంభించాడు. “దేవుని ఇశ్రాయేలు” అనే ఆధ్యాత్మిక ఇశ్రాయేలుగా కూర్చబడిన ఆత్మాభిషిక్త క్రైస్తవులే ఆయన తొలి ప్రజలు.​—⁠గలతీయులు 6:​16; కొలొస్సయులు 1:​13.

2 సా.శ. 33 పెంతెకొస్తు ముగిసి దాదాపు 30 సంవత్సరాలైన తర్వాత, క్రీస్తు ఇంకా రాజ్యాధికారాన్ని పూర్తిగా చేపట్టలేదు గానీ, ఆయన “తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడువరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను” అని అపొస్తలుడైన పౌలు స్థిరంగా చెప్పాడు. (హెబ్రీయులు 10:​12, 13) ఆ తర్వాత, సా.శ. మొదటి శతాబ్దం చివర్లో, వృద్ధ అపొస్తలుడైన యోహాను ఒక దర్శనంలో, విశ్వసర్వాధిపతియైన యెహోవా క్రొత్తగా స్థాపించిన పరలోక రాజ్యానికి క్రీస్తుయేసును రాజుగా ప్రతిష్ఠించడాన్ని ముందుగానే చూశాడు. (ప్రకటన 11:​15; 12:​1-5) మెస్సీయ రాజుగా యేసు 1914లో పరలోకంలో తన పరిపాలన ఆరంభించాడని ధృవీకరించే తిరుగులేని రుజువును, చరిత్రలోని ఈ కాలంలో మన దృక్కోణం నుండి సమీక్షించవచ్చు. *

3 అవును, 1914 నుండి ఆ రాజ్య సువార్తలో ఉత్తేజకరమైన ఓ క్రొత్త అంశం చేరింది. ‘తన శత్రువుల మధ్యనే’ అయినా, దేవుని పరలోక రాజ్యపు రాజుగా క్రీస్తు చురుకుగా పరిపాలిస్తున్నాడు. (కీర్తన 110:​1, 2; మత్తయి 24:​14; ప్రకటన 12:​7-12) అంతేకాక, భూవ్యాప్తంగావున్న ఆయన విశ్వసనీయ ప్రజలు, మానవ చరిత్రలోనే సాటిలేని భౌగోళిక బైబిలు విద్యా కార్యక్రమంలో భాగంవహిస్తూ ఆయన అధికారానికి ఉత్సాహంగా ప్రతిస్పందిస్తున్నారు. (దానియేలు 7:​13, 14; మత్తయి 28:​18) ‘రాజ్యసంబంధులైన’ ఆత్మాభిషిక్త క్రైస్తవులు “క్రీస్తుకు రాయబారులు[గా]” సేవ చేస్తున్నారు. దేవుని రాజ్యాధికార ప్రతినిధులుగా పనిచేస్తున్న క్రీస్తు ‘వేరేగొర్రెల’ వర్ధిల్లుతున్న సమూహం వారికి విశ్వసనీయంగా మద్దతిస్తోంది. (మత్తయి 13:​38; 2 కొరింథీయులు 5:​20; యోహాను 10:​16) అయినప్పటికీ, మనం వ్యక్తిగతంగా క్రీస్తు అధికారాన్ని నిజంగా గుర్తిస్తున్నామా లేదా అనేది విశ్లేషించుకోవాలి. మనమాయనకు దృఢమైన లేక సుస్థిరమైన విశ్వసనీయతను కనబరుస్తున్నామా? పరలోకంలో పరిపాలించే రాజుపట్ల మనమెలా విశ్వసనీయతను చూపించవచ్చు? అయితే మనం, క్రీస్తుపట్ల విశ్వసనీయంగా ఉండేందుకు మనకెలాంటి కారణాలున్నాయో మొదట పరిశీలిద్దాం.

విశ్వసనీయతను పురికొల్పే రాజు

4 క్రీస్తు చేసిన కార్యాలపట్లనే కాక, ఆయన అసాధారణ లక్షణాలపట్ల మనకున్న కృతజ్ఞతమీద కూడా మన విశ్వసనీయత ఆధారపడివుంది. (1 పేతురు 1:⁠8) దేవుని నిర్ణయకాలంలో, భూవ్యాప్తంగా పరిపాలించే రాజుగా తాను చేయగలిగే కార్యాలను, యేసు నియమిత రాజుగా భూమ్మీద ఉన్నప్పుడు కొద్ది పరిమాణంలో చేసి చూపించాడు. ఆకలితో ఉన్నవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన రోగులను, గ్రుడ్డివారిని, వికలాంగులను, చెవిటివారిని, మూగవారిని స్వస్థపరిచాడు. ఆయన చనిపోయిన కొందరిని తిరిగి బ్రతికించాడు కూడా. (మత్తయి 15:​30, 31; లూకా 7:​11-16; యోహాను 6:​5-13) అంతేకాక, యేసు భూ జీవితానికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడం, భావి భూ పరిపాలకునిగా ఆయన లక్షణాలను, ప్రత్యేకంగా ఆయన స్వయంత్యాగపూరిత ప్రేమను తెలుసుకునేందుకు మనకు సహాయం చేస్తుంది. (మార్కు 1:​40-45) దీని గురించి, నెపోలియన్‌ బోనాపార్ట్‌ ఇలా అన్నాడని చెప్పబడుతోంది: “అలెగ్జాండర్‌, కైసరు, షార్లిమాన్‌, నేనూ సామ్రాజ్యాలు నెలకొల్పాం, అయితే మేము దేని ఆధారంగా ఈ ఘనకార్యాలు సాధించాం? బలం ఆధారంగానే. ఒక్క యేసుక్రీస్తు మాత్రమే ప్రేమ ఆధారంగా తన రాజ్యాన్ని స్థాపించాడు, ఆయనకోసం నేడు లక్షలాదిమంది ప్రాణాలర్పిస్తారు.”

5 యేసు సాత్వికుడు, దీనమనస్సుగలవాడు కాబట్టి, ఒత్తిళ్లతో, బాధ్యతలతో కృంగినవారు ఆయన బోధలు, దయాపూర్వక వ్యక్తిత్వం మూలంగా విశ్రాంతిపొందారు. (మత్తయి 11:​28-30) పిల్లలు చనువుగా ఆయన దగ్గరకు వచ్చేవారు. వినయం, వివేచనగల వ్యక్తులు ఉత్సాహంగా ఆయన శిష్యులయ్యారు. (మత్తయి 4:​18-22; మార్కు 10:​13-16) ఆయన శ్రద్ధగల, గౌరవపూర్వక ప్రవర్తన మూలంగా భయభక్తులుగల అనేకమంది స్త్రీలు ఆయనపట్ల విశ్వసనీయత చూపించారు, అలాంటివారిలో చాలామంది, ఆయన తన పరిచర్య కొనసాగిస్తున్నప్పుడు ఆయన గురించి శ్రద్ధ తీసుకునేందుకు తమ సమయాన్ని, సామర్థ్యాన్ని, వస్తుసంపదను ఉపయోగించారు.​—⁠లూకా 8:​1-3.

6 క్రీస్తు తన ప్రియ స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు, తనలోని వాత్సల్యపూరితమైన లోతైన భావాలను వెల్లడించాడు. మరియ, మార్తలు అనుభవిస్తున్న బాధను చూసి ఆయనెంతగా కదిలించబడ్డాడంటే, ఆయన తాను కూడా బాధతో మూలిగి “కన్నీళ్లు విడి[చాడు].” కాసేపట్లో తాను లాజరును తిరిగి బ్రతికిస్తానని తెలిసి కూడా ఆయన ‘కలవరపడ్డాడు,’ అంటే తీవ్ర దుఃఖంతో హృదయవేదనను అనుభవించాడు. ఆ తర్వాత ప్రేమ, కనికరాలచేత కదిలించబడిన యేసు, దేవుడు తనకనుగ్రహించిన శక్తిని ఉపయోగించి లాజరును తిరిగి బ్రతికించాడు.​—⁠యోహాను 11:11-15, 33-35, 38-44.

7 సరైనదానిపట్ల యేసుకున్న ప్రగాఢమైన ప్రేమే కాక, వేషధారణపట్ల, దుష్టత్వంపట్ల ఆయనకున్న ద్వేషం, మనలో భక్తిపూర్వక భయాన్ని కలిగిస్తాయి. ఆలయంలో నుండి దురాశాపరులైన వ్యాపారులను వెళ్లగొట్టడానికి ఆయన రెండుసార్లు ధైర్యవంతమైన చర్య తీసుకున్నాడు. (మత్తయి 21:​12, 13; యోహాను 2:​14-17) అంతేకాక, ఆయన భూమ్మీద మానవునిగా ఉన్నప్పుడు, మనమెదుర్కొనే ఒత్తిళ్లు, సమస్యలు వ్యక్తిగతంగా తెలుసుకునేందుకు అన్నిరకాల శ్రమలను అనుభవించాడు. (హెబ్రీయులు 5:​7-9) ద్వేషానికి, అన్యాయానికి గురవడం ఎలా ఉంటుందో కూడా యేసుకు తెలుసు. (యోహాను 5:​15-18; 11:​53, 54; 18:38-19:​16) చివరకు, తన తండ్రి చిత్తం నెరవేర్చి, తన ప్రజలకు నిత్యజీవమిచ్చేందుకు ఆయన క్రూరంగా చంపబడేందుకు నిర్భయంగా సిద్ధపడ్డాడు. (యోహాను 3:​16) క్రీస్తుకున్న అలాంటి లక్షణాలు, ఆయనకు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా సేవ చేసేందుకు మిమ్మల్ని ప్రోత్సహించవా? (హెబ్రీయులు 13:⁠8; ప్రకటన 5:​6-10) అయితే రాజైన క్రీస్తు ప్రజలుగా ఉండాలంటే ఏమి చేయాలి?

ఆయన ప్రజలుగా ఉండేందుకు అర్హులవడం

8 ఈ సారూప్యం గురించి ఆలోచించండి: ఒక వ్యక్తి మరోదేశపు పౌరునిగా మారాలనుకుంటే సాధారణంగా కొన్ని ప్రాథమిక అర్హతలు సంపాదించుకోవాల్సి ఉంటుంది. భావి పౌరులు సత్ప్రవర్తన గలవారిగా ఉండడమే కాక, కొన్ని ఆరోగ్య ప్రమాణాలు చేరుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, క్రీస్తు ప్రజలు ఉన్నత నైతిక ప్రమాణాలు పాటిస్తూ, మంచి ఆధ్యాత్మిక ఆరోగ్యం కాపాడుకోవాలి.​—⁠1 కొరింథీయులు 6:​9-11; గలతీయులు 5:​19-23.

9 యేసుక్రీస్తు కూడా తన ప్రజలు తనపట్ల, తన రాజ్యంపట్ల విశ్వసనీయంగా ఉండాలని కోరడం సరైనదే. నియమిత రాజుగా ఆయన భూమిపై జీవించినప్పుడు బోధించిన విషయాలకు అనుగుణంగా జీవించడం ద్వారా వారు అలాంటి విశ్వసనీయతను చూపిస్తారు. ఉదాహరణకు, వారు వస్తుసంపదను సమకూర్చుకోవడంకన్నా రాజ్య సంబంధ విషయాలకు, దేవుని చిత్తానికి ప్రథమ స్థానమిస్తారు. (మత్తయి 6:​31-34) అలాగే వారు తీవ్ర కష్ట పరిస్థితుల్లోనూ క్రీస్తువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. (1 పేతురు 2:​21-23) అంతేకాక, క్రీస్తు ప్రజలు ఇతరులకు మేలు చేయడానికి చొరవ తీసుకుంటూ ఆయన మాదిరిని అనుసరిస్తారు.​—⁠మత్తయి 7:​12; యోహాను 13:​3-17.

10 క్రీస్తు అనుచరులు తమ కుటుంబ జీవితంలో కూడా ఆయన లక్షణాలను ప్రతిబింబిస్తూ తమ విశ్వసనీయతను కనబరుస్తారు. ఉదాహరణకు, భర్తలు తమ భార్యలను, పిల్లలను చూసుకోవడంలో క్రీస్తు లక్షణాలను అనుకరించడం ద్వారా తమ పరలోక రాజుపట్ల విశ్వసనీయతను ప్రదర్శిస్తారు. (ఎఫెసీయులు 5:​25, 28-30; 6:⁠4; 1 పేతురు 3:⁠7) భార్యలు పవిత్ర ప్రవర్తన కలిగి, ‘సాధువైన, మృదువైన స్వభావాన్ని’ కనబరచడం ద్వారా క్రీస్తుపట్ల తమ విశ్వసనీయతను ప్రదర్శిస్తారు. (1 పేతురు 3:​1-4; ఎఫెసీయులు 5:​22-24) పిల్లలు విధేయత చూపించడంలో క్రీస్తు మాదిరిని అనుసరిస్తూ ఆయనపట్ల విశ్వసనీయతను చూపిస్తారు. యౌవనునిగా ఉన్నప్పుడు యేసు, తన తల్లిదండ్రులు అపరిపూర్ణులైనప్పటికీ వారికి లోబడ్డాడు. (లూకా 2:​51, 52; ఎఫెసీయులు 6:⁠1) క్రీస్తు ప్రజలు ‘ఒకరి సుఖదుఃఖాల్లో ఒకరు పాలుపంచుకుంటూ, సహోదర ప్రేమను’ కనబరుస్తూ ‘కరుణాచిత్తులై’ ఉండడం ద్వారా ఆయనను అనుకరించేందుకు విశ్వసనీయంగా కృషిచేస్తారు. క్రీస్తులాగే వారు కూడా “కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతిదూషణయైనను చేయ[కుండా]” ఉండేందుకు కృషిచేస్తారు.​—⁠1 పేతురు 3:​8, 9; 1 కొరింథీయులు 11:⁠1.

నియమాలకు లోబడే ప్రజలు

11 ఒక దేశపు భావి పౌరులు తమ క్రొత్త దేశపు నియమాలకు లోబడినట్లే, క్రీస్తు ప్రజలు కూడా ఆయన బోధించిన, ఆజ్ఞాపించిన వాటన్నింటికి అనుగుణంగా జీవిస్తూ తమంతట తాముగా ‘క్రీస్తు నియమానికి’ లోబడతారు. (గలతీయులు 6:⁠2) ప్రత్యేకంగా, వారు ప్రేమ అనే ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞకు’ తగినట్లు విశ్వసనీయంగా జీవిస్తారు. (యాకోబు 2:⁠8) ఈ నియమాల్లో ఏమి ఇమిడివుంది?

12 క్రీస్తు ప్రజలు అపరిపూర్ణతకు, వైఫల్యాలకు అతీతులేమీ కాదు. (రోమీయులు 3:​23) కాబట్టి, ‘ఒకరినొకరు హృదయపూర్వకంగా, మిక్కటంగా ప్రేమించుకునేందుకు’ వారు “నిష్కపటమైన సహోదరప్రేమ” పెంపొందించుకోవాలి. (1 పేతురు 1:​22) క్రైస్తవులు, ‘ఎవరైనా తమకు హానిచేశారని అనుకుంటే, ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు క్షమించుకోవడం’ ద్వారా క్రీస్తు నియమాన్ని విశ్వసనీయంగా అన్వయించుకుంటారు. ఈ నియమానికి లోబడడం, ఇతరుల అపరిపూర్ణతలను చూసీచూడనట్లు ఉంటూ పరస్పరం ప్రేమించుకోవడానికి కారణాలను కనుగొనేందుకు వారికి సహాయం చేస్తుంది. మన ప్రేమగల రాజుకు విశ్వసనీయ విధేయత చూపిస్తూ “పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను” ధరించుకునేవారితో కలిసి ఉండడాన్ని మీరు ఇష్టపడరా?​—⁠కొలొస్సయులు 3:​13, 14.

13 అంతేకాక, యేసు తాను మాదిరిగా ఉంచిన ప్రేమ, ప్రజలు సాధారణంగా పరస్పరం చూపించుకునే ప్రేమకన్నా మరెంతో గొప్పదని వివరించాడు. (యోహాను 13:​34, 35) మనం కేవలం మనల్ని ప్రేమించేవారినే ప్రేమిస్తే, మనమేమీ ‘ఎక్కువ చేయడం’ లేదు. మనమలా ప్రేమిస్తుంటే, మన ప్రేమ అసంపూర్ణంగా, లోపభూయిష్టంగా ఉంటుంది. మనల్ని ద్వేషిస్తూ, హింసించేవారిపట్ల సహితం సూత్రాధారిత ప్రేమను కలిగివుండడం ద్వారా తన తండ్రి చూపించిన ప్రేమను అనుకరించాలని యేసు మనకు ఉద్బోధించాడు. (మత్తయి 5:​46-48) ఈ విధమైన ప్రేమ, రాజ్య ప్రజలు తమ ముఖ్యపనిలో పట్టుదలగా కొనసాగేందుకు కూడా ప్రేరణనిస్తుంది. ఆ ముఖ్యమైన పనేమిటి?

విశ్వసనీయత పరీక్షించబడుతుంది

14 దేవుని రాజ్య ప్రజలకు ఇప్పుడు “దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చే” ముఖ్యమైన పనివుంది. (అపొస్తలుల కార్యములు 28:​23) ఆ పని చేయడం ఎంతో ప్రాముఖ్యం, ఎందుకంటే మెస్సీయ రాజ్యం యెహోవా విశ్వసర్వాధిపత్యమే సరైందని నిరూపిస్తుంది. (1 కొరింథీయులు 15:24-28) మనం సువార్త ప్రకటించినప్పుడు, వినేవారికి ఆ రాజ్య ప్రజలుగా మారే అవకాశం లభిస్తుంది. అంతేకాక, ఆ సందేశానికి ప్రజలు స్పందించే తీరు, రాజైన క్రీస్తు మానవాళికి తీర్పుతీర్చడానికి ఆధారమైన ప్రమాణంగా ఉంటుంది. (మత్తయి 24:​14; 2 థెస్సలొనీకయులు 1:​6-10) కాబట్టి, రాజ్యాన్ని గురించి ఇతరులకు చెప్పాలనే క్రీస్తు ఆజ్ఞకు లోబడడమే, ఆయనపట్ల మన విశ్వసనీయతను చూపించే ప్రాముఖ్యమైన మార్గం.​—⁠మత్తయి 28:​18-20.

15 నిజమే, సాతాను తనకు సాధ్యమైన విధంగా ప్రకటనాపనిని నిరోధిస్తాడు, మానవ పరిపాలకులు దేవుడు క్రీస్తుకిచ్చిన అధికారాన్ని గుర్తించరు. (కీర్తన 2:​1-3, 6-8) కాబట్టి, యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కా[డు]. . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహాను 15:​20) అందువల్ల, క్రీస్తు అనుచరులు తమ విశ్వసనీయతను పరీక్షించే ఆధ్యాత్మిక యుద్ధంలో పాల్గొంటున్నారు.​—⁠2 కొరింథీయులు 10:​3-5; ఎఫెసీయులు 6:​10-12.

16 అయినప్పటికీ, దేవుని రాజ్య ప్రజలు మానవ అధికారులపట్ల అగౌరవాన్ని చూపించకుండానే తమ అదృశ్య రాజుపట్ల విశ్వసనీయంగా ఉంటారు. (తీతు 3:​1, 2) యేసు ఇలా చెప్పాడు: “కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడి.” (మార్కు 12:​13-17) కాబట్టి క్రీస్తు ప్రజలు, దేవుని నియమాలతో విభేదించని ప్రభుత్వ నియమాలకు విధేయులౌతారు. (రోమీయులు 13:​1-7) అయితే, యూదా న్యాయస్థానం, ప్రకటించవద్దని యేసు శిష్యులను ఆదేశిస్తూ దేవుని నియమాలను అలక్ష్యం చేసినప్పుడు, వారు గౌరవపూర్వకంగానే అయినా స్థిరంగా తాము ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడవలెను’ అని చెప్పారు.​—⁠అపొస్తలుల కార్యములు 1:⁠8; 5:27-32.

17 నిజమే, హింస ఎదురైనా తమ రాజుపట్ల విశ్వసనీయంగా ఉండేందుకు క్రీస్తు ప్రజలకు ఎంతో ధైర్యమవసరం. అయితే యేసు ఇలా అన్నాడు: “నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.” (మత్తయి 5:​11, 12) క్రీస్తు తొలి అనుచరులు ఆ మాటల సత్యసంధతను చవిచూశారు. రాజ్యాన్ని మానక ప్రకటిస్తున్నందుకు వారు కొరడాలతో కొట్టబడినప్పటికీ, “ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు . . . ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.” (అపొస్తలుల కార్యములు 5:​41, 42) మీరు కష్టాలను, వ్యాధిని, ప్రియమైనవారిని పోగొట్టుకోవడాన్ని లేదా వ్యతిరేకతను సహిస్తూ అదేవిధమైన విశ్వసనీయతను ప్రదర్శిస్తుంటే మీరు నిజంగా ప్రశంసార్హులు.​—⁠రోమీయులు 5:​3-5; హెబ్రీయులు 13:⁠6.

18 యేసు నియమిత రాజుగా ఇంకనూ భూమ్మీద ఉన్నప్పుడు, ఆయన రోమా అధిపతియైన పొంతి పిలాతుతో ఇలా అన్నాడు: “నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదు.” (యోహాను 18:​36) కాబట్టి, పరలోక రాజ్య ప్రజలు, ఏ వ్యక్తికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టరు లేదా ఏ మానవ పోరాటంలోనూ ఒకరి పక్షం వహించరు. “సమాధానకర్తయగు అధిపతి”పట్ల విశ్వసనీయత ప్రదర్శిస్తూ, వారు లోక సంబంధ విభాజక వ్యవహారాల్లో పూర్తిగా తటస్థంగా ఉంటారు.​—⁠యెషయా 2:​2-4; 9:6, 7.

విశ్వసనీయ ప్రజలకు లభించే నిత్యాశీర్వాదాలు

19 ‘రాజులకు రాజైన’ క్రీస్తు విశ్వసనీయ ప్రజలు, నమ్మకంగా భవిష్యత్తు కోసం ఎదురుచూస్తారు. త్వరలో రానున్న ఆయన మానవాతీత రాజ్యాధికార ప్రదర్శనకోసం వారు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. (ప్రకటన 19:11-20:⁠3; మత్తయి 24:​30) ఆత్మాభిషిక్త “రాజ్యసంబంధుల” విశ్వసనీయ శేషము క్రీస్తుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించేందుకు తమకు లభించే అమూల్యమైన వారసత్వం కోసం ఎదురుచూస్తున్నారు. (మత్తయి 13:​38; లూకా 12:​32) క్రీస్తు విశ్వసనీయ “వేరే గొఱ్ఱెల” సభ్యులు, రాజు తమను ఆమోదిస్తూచేసే ఈ ప్రకటన కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు: ‘నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యానికి [సంబంధించిన భూ పరదైసును] స్వతంత్రించుకొనుడి.’ (యోహాను 10:​16; మత్తయి 25:​34) కాబట్టి, రాజ్య ప్రజలందరూ రాజైన క్రీస్తును విశ్వసనీయంగా సేవించడంలో కొనసాగాలని తీర్మానించుకొందురు గాక.

[అధస్సూచి]

^ పేరా 4 యెహోవాసాక్షులు ప్రచురించిన లేఖనాలనుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలోని 95-7 పేజీల్లో “దేవుని రాజ్యం 1914లో స్థాపించబడిందని యెహోవాసాక్షులు ఎందుకు చెబుతారు?” అనే అంశాన్ని చూడండి.

మీరు వివరించగలరా?

•క్రీస్తు మన విశ్వసనీయతకు ఎందుకు అర్హుడు?

•క్రీస్తు ప్రజలు ఆయనపట్ల తమ విశ్వసనీయతను ఎలా ప్రదర్శిస్తారు?

•రాజైన క్రీస్తుకు విశ్వసనీయంగా ఉండాలని మనమెందుకు ఇష్టపడతాం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. క్రీస్తు సా.శ. 33లో, పూర్తిస్థాయిలో రాజ్యాధికారం చేపట్టలేదని మనకెలా తెలుసు?

3. (ఎ) రాజ్య సువార్తలో 1914 నుండి ఏ క్రొత్త అంశం చేరింది? (బి) మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?

4. యేసు నియమిత రాజుగా తన భూ పరిచర్య కాలంలో ఏ పనులు చేశాడు?

5. యేసు వ్యక్తిత్వం ఎందుకంత ఆకర్షణీయంగా ఉండేది?

6. లాజరు చనిపోయినప్పుడు యేసు ఎలాంటి వాత్సల్యపూరిత భావాలను కనబరిచాడు?

7. మన విశ్వసనీయతను పొందేందుకు యేసు ఎందుకు అర్హుడు? (31వ పేజీలోని బాక్సు కూడా చూడండి.)

8. క్రీస్తు ప్రజలనుండి ఏమి కోరబడుతుంది?

9. క్రీస్తుపట్ల మనం విశ్వసనీయత కనబరుస్తున్నామని ఎలా చూపించవచ్చు?

10. (ఎ) కుటుంబ జీవితంలో, (బి) సంఘంలో క్రీస్తుపట్ల విశ్వసనీయతను ఎలా ప్రదర్శించవచ్చు?

11. క్రీస్తు ప్రజలు తమంతట తాముగా ఏ నియమాలకు లోబడతారు?

12, 13. మనం విశ్వసనీయంగా ‘క్రీస్తు నియమానికి’ ఎలా లోబడతాం?

14. ప్రకటనాపని ఎందుకంత ప్రాముఖ్యం?

15. క్రైస్తవుల విశ్వసనీయత ఎందుకు పరీక్షించబడుతుంది?

16. రాజ్య ప్రజలు ఎలా “దేవునివి దేవునికి” చెల్లిస్తారు?

17. విశ్వసనీయతా పరీక్షలను మనమెందుకు ధైర్యంగా ఎదుర్కోవచ్చు?

18. పొంతి పిలాతుతో యేసు పలికిన మాటలు ఏమి సూచిస్తున్నాయి?

19. క్రీస్తు ప్రజలు నమ్మకంగా భవిష్యత్తు కోసం ఎందుకు ఎదురుచూస్తారు?

[31వ పేజీలోని బాక్సు]

క్రీస్తు అసాధారణ లక్షణాల గురించిన అధిక సమాచారం

నిష్పక్షపాతం​—⁠యోహాను 4:​7-30.

కనికరం​—⁠మత్తయి 9:​35-38; 12:​18-21; మార్కు 6:​30-34.

స్వయంత్యాగపూరిత ప్రేమ​—⁠యోహాను 13:⁠1; 15:​12-15.

విశ్వసనీయత​—⁠మత్తయి 4:​1-11; 28:​20; మార్కు 11:​15-18.

సహానుభూతి​—⁠మార్కు 7:​32-35; లూకా 7:​11-15; హెబ్రీయులు 4:​15, 16.

సముచితత్వం​—⁠మత్తయి 15:​21-28.

[29వ పేజీలోని చిత్రం]

పరస్పరం ప్రేమ చూపించుకోవడం ద్వారా, మనం ‘క్రీస్తు నియమానికి’ విశ్వసనీయంగా లోబడతాం

[31వ పేజీలోని చిత్రాలు]

క్రీస్తు లక్షణాలు ఆయనను విశ్వసనీయంగా సేవించేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాయా?