కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
యెహోవా వాక్యము సజీవమైనది
కీర్తనలు ప్రథమ స్కంధములోని ముఖ్యాంశాలు
మన సృష్టికర్తయైన యెహోవా దేవుని స్తుతులతో నిండివున్న పుస్తకానికి ఏది సముచితమైన పేరుగా ఉంటుంది? కీర్తనలు అనే పేరుకన్నా మరే పేరు అంత సముచితంగా ఉండదు. బైబిల్లోని సుదీర్ఘమైన ఈ పుస్తకంలో, దేవుని అద్భుతమైన లక్షణాలనూ ఆయన శక్తివంతమైన కార్యాలనూ వివరించే, అనేక ప్రవచనాలను తెలియజేసే, అందంగా కూర్చబడిన గీతాలున్నాయి. అనేక గీతాలు, కష్టాలనుభవిస్తున్నప్పుడు వాటి రచయితలకు కలిగిన భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నాయి. అవి మోషే ప్రవక్త కాలం నుండి ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగివచ్చిన కాలాల వరకు ఉన్న, దాదాపు వెయ్యి సంవత్సరాల కాలంలో వ్యక్తం చేయబడ్డాయి. మోషే, దావీదు రాజు, ఇతరులు వాటి రచయితలు. యాజకుడైన ఎజ్రా ఈ గ్రంథాన్ని ఇప్పుడున్న విధంగా ఏర్పాటు చేసినట్లు చెప్పబడుతోంది.
ప్రాచీనకాలం నుండి, కీర్తనల గ్రంథము ఐదు భాగాలుగా లేక కీర్తనల స్కంధాలుగా విభాగించబడింది: (1) 1-41 కీర్తనలు; (2) 42-72 కీర్తనలు; (3) 73-89 కీర్తనలు; (4) 90-106 కీర్తనలు; (5) 107-150 కీర్తనలు. ఈ ఆర్టికల్‌లో ప్రథమ స్కంధము పరిశీలించబడుతుంది. దీనిలోని మూడు తప్ప మిగతా కీర్తనలన్నీ ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు వ్రాసినవే. 1వ, 10వ, 33వ కీర్తనలను ఎవరు వ్రాశారో తెలియదు.
‘నా దేవుడు నా దుర్గము’
మొదటి కీర్తన యెహోవా ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందించే వ్యక్తి ధన్యుడని చెప్పిన తర్వాత, రెండవ కీర్తన సూటిగా రాజ్యం గురించి చెబుతుంది. * కీర్తనల్లోని ఈ భాగంలో దేవునికి చేసుకున్న విన్నపాలు ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు 3-5, 7, 12, 13, 17 కీర్తనలు శత్రువుల నుండి విడిపించమని చేసిన విజ్ఞాపనలు. 8వ కీర్తన యెహోవా గొప్పతనంతో పోలిస్తే మానవుడు ఎంత అల్పమైనవాడో నొక్కి చెబుతోంది.
యెహోవాను తన ప్రజల రక్షకునిగా వర్ణిస్తూ దావీదు ఇలా పాడాడు: “నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.” (కీర్తన 18:2) యెహోవా 19వ కీర్తనలో శాసనకర్తగా, 20వ కీర్తనలో రక్షకునిగా, 21వ కీర్తనలో తన అభిషిక్త రాజు యొక్క రక్షకునిగా స్తుతించబడ్డాడు. 23వ కీర్తన ఆయనను గొప్ప కాపరిగా వర్ణిస్తుండగా, 24వ కీర్తన ఆయనను మహిమగల రాజుగా అభివర్ణిస్తోంది.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
2:1, 2—జనములు ఏ “వ్యర్థమైన” దాని గురించి తలంచుచున్నవి? ఆ “వ్యర్థమైనది” ఏమిటంటే, తమ సొంత అధికారాన్ని శాశ్వతంగా నిలుపుకోవాలని మానవ ప్రభుత్వాలకున్న తీరని చింత. వారి సంకల్పం చివరికి విఫలమవకతప్పదు కాబట్టి అది వ్యర్థమైనది. జనములు ‘యెహోవాకు ఆయన అభిషిక్త [రాజుకు]’ వ్యతిరేకంగా నిలిచినప్పుడు, తాము విజయం సాధించగలమని అవి నిజంగా నిరీక్షించగలవా?
2:7—యెహోవా “కట్టడ” అంటే ఏమిటి? ఈ కట్టడ యెహోవా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుతో చేసిన రాజ్య నిబంధన.—లూకా 22:28, 29.
2:12—జనములు ఏ విధముగా “కుమారుని ముద్దుపెట్టుకొన” వచ్చును? బైబిలు కాలాల్లో, ముద్దుపెట్టుకోవడం స్నేహాన్ని, నమ్మకత్వాన్ని సూచించే గుర్తు. అది అతిథులను ఆహ్వానించే విధానం. కుమారుణ్ణి
ముద్దుపెట్టుకోమని, అంటే మెస్సీయ రాజుగా ఆయనను ఆహ్వానించమని భూరాజులకు ఆజ్ఞాపించబడింది.3:పైవిలాసము—కొన్ని కీర్తనలకు ఇవ్వబడిన పైవిలాసము యొక్క ఉద్దేశమేమిటి? పైవిలాసం కొన్నిసార్లు రచయిత ఎవరో తెలియజేస్తుంది, కీర్తన కూర్చబడిన పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని అందజేస్తుంది, దానికి ఒక ఉదాహరణ 3వ కీర్తన. పైవిలాసం నిర్దిష్టమైన గీతం (4, 5 కీర్తనలు) యొక్క ఉద్దేశాన్ని లేక ఉపయోగాన్ని కూడా వివరించవచ్చు, అలాగే సంగీత సంబంధమైన సూచనలు (6వ కీర్తన) కూడా ఇవ్వవచ్చు.
3:2—“సెలా” అంటే ఏమిటి? ఈ పదం, పాడడంలోగానీ లేక పాడుతూ వాయిద్యాలు ఉపయోగించే సంగీతంలోగానీ నిశ్శబ్ద ధ్యానం కోసం ఆగడాన్ని సూచిస్తుందని సాధారణంగా తలంచబడుతోంది. ఒక కీర్తనలోని తలంపును లేదా భావనను మరింతగా నొక్కిచెప్పేందుకు ఇలా ఆగడం జరిగేది. కీర్తనలను బహిరంగంగా బిగ్గరగా చదువుతున్నప్పుడు ఈ పదాన్ని చదవాల్సిన అవసరంలేదు.
11:3—ఏ పునాదులు పాడైపోయాయి? మానవ సమాజానికి ఆధారంగావున్న శాసనం, చట్టం, న్యాయం అనేవే ఆ పునాదులు. ఇవి గందరగోళానికి గురైనప్పుడు, సామాజిక అక్రమం అధికమై, న్యాయం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో “నీతిమంతులు” దేవుని మీద పూర్తి నమ్మకముంచాలి.—కీర్తన 11:4-7.
21:3—“అపరంజి కిరీటము” యొక్క విశేషత ఏమిటి? కిరీటము అక్షరార్థమైనదో, దావీదు సాధించిన అనేక విజయాల కారణంగా ఆయనకు లభించిన అదనపు మహిమను సూచిస్తుందో చెప్పబడలేదు. అయితే, ఈ వచనం, యేసు 1914లో యెహోవా నుండి పొందిన రాచరిక కిరీటాన్ని ప్రవచనార్థకంగా సూచిస్తోంది. కిరీటం బంగారంతో చేయబడిందనే వాస్తవం, ఆయన పరిపాలన సర్వశ్రేష్ఠమైనదై ఉంటుందని సూచిస్తుంది.
22:1, 2—యెహోవా తనను విడిచిపెట్టాడని దావీదు ఎందుకు భావించివుండవచ్చు? దావీదు తన శత్రువుల నుండి ఎంత తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నాడంటే, ఆయన ‘హృదయము తన అంతరంగమందు మైనమువలె కరిగింది.’ (కీర్తన 22:14) యెహోవా తనను విడిచిపెట్టాడని ఆయనకు అనిపించి ఉండవచ్చు. మ్రానున వ్రేలాడదీయబడినప్పుడు యేసు కూడా అలాగే భావించాడు. (మత్తయి 27:46) దావీదు మాటలు తానున్న దుర్భర పరిస్థితికి మానవ సహజ స్పందనను ప్రతిబింబిస్తాయి. అయితే కీర్తన 22:16-21 వచనాల్లో వ్రాయబడివున్న దావీదు ప్రార్థన నుండి, ఆయన దేవునిపై విశ్వాసాన్ని కోల్పోలేదని స్పష్టమవుతోంది.
మనకు పాఠాలు:
1:1. యెహోవాను ప్రేమించనివారితో సహవాసం చేయకూడదు.—1 కొరింథీయులు 15:33.
1:2. ఒక్కరోజు కూడా ఆధ్యాత్మిక విషయాలను పరిశీలించకుండా గడిచిపోవడానికి మనం అనుమతించకూడదు.—మత్తయి 4:4.
4:5. మన ఆధ్యాత్మిక బలులు సరైన ఉద్దేశంతో అర్పించబడినప్పుడే, మన ప్రవర్తన యెహోవా కోరేవాటికి అనుగుణంగా ఉన్నప్పుడే అవి “నీతియుక్తమైన బలులు” అవుతాయి.
6:5. సజీవంగా ఉండాలని కోరుకోవడానికి ఇంతకన్నా మంచి కారణం ఏముంటుంది?—కీర్తన 115:17.
9:12. యెహోవా అపరాధులను శిక్షించడానికి రక్తాపరాధము కోసం చూస్తాడు, కానీ ఆయన ‘బాధపరచబడువారి మొఱ్ఱను’ గుర్తుంచుకుంటాడు.
15:2, 3; 24:3-5. సత్యారాధకులు సత్యం మాట్లాడాలి, అబద్ధ ప్రమాణాలు చేయడం, అపవాదులు వేయడం మానుకోవాలి.
15:4. మనం ఏదైనా లేఖనవిరుద్ధ వాగ్దానం చేశామని గ్రహిస్తే తప్ప, ఎంత కష్టమైనా సరే మనమిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి చేయగలిగిందంతా చేయాలి.
15:5. యెహోవా ఆరాధకులముగా మనం డబ్బును దుర్వినియోగం చేయకుండా జాగ్రత్త వహించాలి.
17:14, 15. “ఈ లోకులు” మంచి జీవనోపాధి సంపాదించుకుని కుటుంబాన్ని పోషిస్తూ తర్వాతి తరాలవారికి స్వాస్థ్యం ఉంచడానికే తమ జీవితమంతా వెచ్చిస్తారు. యెహోవా దేవుని ‘ముఖదర్శనము చేసుకోగలిగేలా’ అంటే ఆయన అనుగ్రహాన్ని పొందగలిగేలా ఆయన ఎదుట మంచి పేరు సంపాదించుకోవాలన్నది దావీదు జీవితంలో ముఖ్యాంశం. యెహోవా వాగ్దానాల, హామీల విషయంలో “మేల్కొనునప్పుడు” దావీదు ‘ఆయన స్వరూపదర్శనముతో తన ఆశ తీర్చుకుంటాడు’ లేక యెహోవా సన్నిధిలో ఆయనతోపాటు ఆనందిస్తాడు. దావీదులా మనం కూడా మన హృదయాలను ఆధ్యాత్మిక సంపదలపై కేంద్రీకరించవద్దా?
19:1-6. మాట్లాడలేని, తర్కించలేని సృష్టి యెహోవాను మహిమపరిస్తే, ఆలోచించగల, మాట్లాడగల, ఆరాధించగల మనం మరెంతగా ఆయనను మహిమపరచాలో కదా?—ప్రకటన 4:10-11.
19:7-11. యెహోవా శాసనములు—మనకెంత ప్రయోజనకరమో కదా!
19:12, 13. పొరపాట్లు, దురభిమాన క్రియలు మనం చేయకూడని పాపములు.
19:14. మనం మన క్రియల్లోనే కాక, మాటల్లోనూ ఆలోచనల్లోనూ జాగ్రత్తగా ఉండాలి.
“నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు”
ఈ భాగంలోని మొదటి రెండు కీర్తనల్లో దావీదు తన యథార్థతను కాపాడుకోవాలన్న ఎంతటి హృదయపూర్వక కోరికను, దృఢ నిశ్చయతను వ్యక్తం చేస్తున్నాడో కదా! “నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను” అని ఆయన పాడాడు. (కీర్తన 26:11) పాపక్షమాపణ కోసం ప్రార్థిస్తూ ఆయనిలా అంగీకరిస్తున్నాడు: “నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నా యెముకలు క్షీణించినవి.” (కీర్తన 32:3) యెహోవాపట్ల యథార్థవంతులుగా ఉన్నవారికి, దావీదు ఈ హామీ ఇస్తున్నాడు: “యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.”—కీర్తన 34:15.
37వ కీర్తనలో ఇవ్వబడిన ఉపదేశం ఇశ్రాయేలీయులకూ, ఈ విధానపు “అంత్యదినములలో” జీవిస్తున్నాం కాబట్టి మనకూ ఎంత విలువైనదో కదా! (2 తిమోతి 3:1-5) యేసుక్రీస్తు గురించి ప్రవచనార్థకంగా మాట్లాడుతూ కీర్తన 40:7, 8 వచనాలు ఇలా చెబుతున్నాయి: “పుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.” ఈ విభాగంలోని చివరి కీర్తన, దావీదు బత్షెబతో పాపం చేసిన తర్వాతి కల్లోలభరిత సంవత్సరాల్లో యెహోవా సహాయం కోసం విజ్ఞప్తి చేయడానికి సంబంధించినది. ఆయనిలా పాడుతున్నాడు: “నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు.”—కీర్తన 41:12.
లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:
26:6—దావీదులా మనం యెహోవా బలిపీఠం చుట్టూ సూచనార్థకంగా ఎలా ప్రదక్షిణము చేస్తాము? మానవజాతి విమోచన కోసం యేసుక్రీస్తు అర్పించిన క్రయధన బలిని యెహోవా అంగీకరిస్తాడనే భావంలో, బలిపీఠం ఆయన చిత్తాన్ని సూచిస్తుంది. (హెబ్రీయులు 8:5; 10:5-10) మనం ఆ బలియందు విశ్వాసం ఉంచడం ద్వారా యెహోవా బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేస్తాము.
29:3-9—యెహోవా స్వరాన్ని, భీతిగొలిపే ఉరుముతో పోల్చడం దేన్ని సూచిస్తుంది? యెహోవాకున్న అద్భుతమైన శక్తిని సూచిస్తుంది!
31:23—గర్వంతో ప్రవర్తించేవారికి “గొప్ప ప్రతికారము” ఎలా లభిస్తుంది? ఇక్కడ ప్రస్తావించబడిన ప్రతికారం వారికి లభించే శిక్ష. నీతిమంతుడు అనుకోకుండా చేసే పొరపాట్లకు యెహోవా నుండి క్రమశిక్షణ రూపంలో అతనికి ప్రతిఫలం లభిస్తుంది. గర్వంతో ప్రవర్తించే వ్యక్తి తప్పు మార్గం నుండి వైదొలగడు కాబట్టి, అతడికి తీవ్రమైన శిక్షే ప్రతిఫలంగా లభిస్తుంది.—సామెతలు 11:31; 1 పేతురు 4:18.
ఆదికాండము 1:1, 2) అది ఆయన నోటి ఊపిరి అని ఎందుకు పిలువబడుతుందంటే, ఒక శక్తిమంతమైన ఊపిరిలా అది ఎంత దూరంలోవున్న పనులైనా చేయడానికి పంపబడవచ్చు.
33:6—యెహోవా “వాక్కు” లేక ఆయన “నోటి ఊపిరి” అంటే ఏమిటి? ఇది దేవుని చురుకైన శక్తి లేక పరిశుద్ధాత్మ, దీన్నే ఆయన విశ్వాన్ని సృష్టించడానికి ఉపయోగించాడు. (35:19—తనను ద్వేషించేవారు కన్ను గీటకుండా చేయమని దావీదు చేసిన విన్నపం యొక్క భావమేమిటి? కన్ను గీటడం, దావీదు శత్రువులు ఆయనకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ద్వేషపూరిత పథకాల సాఫల్యం నుండి ఆనందాన్ని పొందడాన్ని సూచిస్తుంది. అలా జరగనివ్వవద్దని దావీదు విజ్ఞప్తి చేశాడు.
మనకు పాఠాలు:
26:4. ఇంటర్నెట్ చాట్ రూముల్లో, పాఠశాలలో, లేక మన పనిస్థలాల్లో తమ గుర్తింపును మరుగుచేసి మోసకరమైన కారణాలనుబట్టి మన స్నేహితుల్లా నటించేవారితో, యథార్థతా ముసుగు ధరించే మతభ్రష్టులతో, ద్వంద్వ జీవితం గడిపేవారితో సహవసించకపోవడం జ్ఞానయుక్తమైనది.
26:7, 12; 35:18; 40:9. మనం క్రైస్తవ కూటాల్లో యెహోవాను బహిరంగంగా స్తుతించాలి.
26:8; 27:4. క్రైస్తవ కూటాలకు హాజరవడాన్ని మనం ప్రేమిస్తామా?
26:11. యథార్థవంతుడనై నడుచుకుంటానని తన నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూనే దావీదు విమోచన కోసం కూడా విజ్ఞప్తి చేశాడు. అవును, మనం అపరిపూర్ణులమే అయినా మనం మన యథార్థతను కాపాడుకోవచ్చు.
29:10. “ప్రళయజలముల” మీద ఆసీనుడైయుండడం ద్వారా, యెహోవా తన శక్తి తన అధీనంలోనే ఉందని సూచిస్తున్నాడు.
30:5. యెహోవా ప్రధాన లక్షణం ప్రేమ—కోపం కాదు.
32:9. మనం, కళ్లెము లేదా కొరడా ఉపయోగిస్తేనే విధేయత చూపే గుఱ్ఱములా లేక గాడిదలా ఉండాలని యెహోవా కోరుకోవడం లేదు. బదులుగా, మనం ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుని తనకు విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు.
33:17-19. మానవ నిర్మిత విధానం ఎంత బలమైనదైనప్పటికీ అది రక్షణ తీసుకురాలేదు. మన నమ్మకం యెహోవా మీద, ఆయన రాజ్య ఏర్పాటు మీద ఉండాలి.
34:10. తమ జీవితాల్లో రాజ్య సంబంధ విషయాలకు ప్రాధాన్యతనిచ్చేవారికి ఇది ఎంతటి హామీనిస్తుందో కదా!
39:1, 2. దుష్టులు మన తోటి విశ్వాసులకు హాని చేయడానికి సమాచారం రాబట్టాలని చూస్తే, మనం మన “నోటికి చిక్కము ఉంచుకొని” మౌనంగా ఉండడం జ్ఞానయుక్తమైనది.
40:1, 2. యెహోవాపై నమ్మకం ఉంచడం కృంగుదలను సహించడానికి, “నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు” బయటికి రావడానికి మనకు సహాయం చేస్తుంది.
40:5, 12. మనకెన్ని అపాయాలు ఎదురైనా, ఎన్ని వ్యక్తిగత బలహీనతలున్నా, మన ఆశీర్వాదాలు “లెక్కకు మించియున్నవి” అనే వాస్తవాన్ని మనం గుర్తుంచుకుంటే అవి మనల్ని ఏమీ చేయలేవు.
‘యెహోవా స్తుతింపబడును గాక’
ప్రథమ స్కంధములోని 41 కీర్తనలు ఎంత ఓదార్పునిచ్చేవిగా, ప్రోత్సాహకరమైనవిగా ఉన్నాయో కదా! మనకు కష్టాలొచ్చినా, లేక మన మనస్సాక్షి మనల్ని వేధిస్తున్నా, దేవుని శక్తివంతమైన వాక్యంలోని ఈ భాగం నుండి మనం బలాన్ని, ప్రోత్సాహాన్ని పొందవచ్చు. (హెబ్రీయులు 4:12) ఈ కీర్తనల్లో, జీవించడానికి విశ్వసనీయమైన నిర్దేశాన్నిచ్చే సమాచారం ఉంది. మనమే కష్టంలోవున్నా యెహోవా మనల్ని విడిచిపెట్టడనే హామీ మనకు పదే పదే ఇవ్వబడింది.
కీర్తనల ప్రథమ స్కంధము ఈ మాటలతో ముగుస్తుంది: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్.” (కీర్తన 41:13) వాటిని పరిశీలించిన తర్వాత, మనం యెహోవాను స్తుతించడానికి పురికొల్పబడడం లేదా?
[అధస్సూచి]
^ పేరా 7 2వ కీర్తన దావీదు కాలంలో మొదటగా నెరవేరింది.
[19వ పేజీలోని బ్లర్బ్]
అచేతనమైన సృష్టి యెహోవాను మహిమపర్చగలిగితే, మనం ఇంకెంతగా మహిమపర్చాలో కదా!
[17వ పేజీలోని చిత్రం]
మొదటి 41 కీర్తనల్లో అధిక భాగాన్ని దావీదు కూర్చాడు
[18వ పేజీలోని చిత్రం]
ఏ కీర్తన యెహోవాను గొప్ప కాపరిగా వర్ణిస్తోందో మీకు తెలుసా?
[20వ పేజీలోని చిత్రం]
ఒక్కరోజు కూడా ఆధ్యాత్మిక విషయాలను పరిశీలించకుండా గడిచిపోవడానికి అనుమతించకండి
[17వ పేజీలోని చిత్రసౌజన్యం]
నక్షత్రాలు: Courtesy United States Naval Observatory
[19వ పేజీలోని చిత్రసౌజన్యం]
నక్షత్రాలు, 18, 19 పేజీలు: Courtesy United States Naval Observatory
[20వ పేజీలోని చిత్రసౌజన్యం]
నక్షత్రాలు: Courtesy United States Naval Observatory