కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

“అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు” సత్యారాధనా “మందిరము”లోనికి వచ్చేందుకు వారినేది పురికొల్పుతుంది?​—హగ్గయి 2:⁠7.

ప్రవక్తయైన హగ్గయి ద్వారా యెహోవా ముందుగానే ఇలా తెలియజేశాడు: “నేను అన్యజనులనందరిని కదలింపగా, అన్యజనులందరియొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును.” (హగ్గయి 2:7) “అన్యజనులు” కదిలింపబడడం కారణంగానే, వాటి “యిష్టవస్తువులు” అంటే యథార్థహృదయులు సత్యారాధనను హత్తుకుంటున్నారా? కాదనేదే దానికి జవాబు.

అన్యజనులను ఏది కదిలిస్తుందో, అలా కదిలింపబడడం దేనికి నడిపిస్తుందో గమనించండి. ‘అన్యజనులు అల్లరి రేపుచున్నారని, జనములు వ్యర్థమైనదానిని తలంచుచున్నవని’ బైబిలు చెబుతోంది. (కీర్తన 2:1) వారు “తలంచుచున్న” లేదా ధ్యానిస్తున్న “వ్యర్థమైన” విషయం వారి సర్వాధిపత్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నదే. వారి పరిపాలనకు కలిగే ఏ విధమైన ముప్పుకన్నా ఎక్కువగా వారినింకేదీ భయపెట్టదు.

స్థాపించబడిన దేవుని రాజ్యం గురించి యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనాపని అన్యజనులకు అంటే జనాంగాలకు అలాంటి ముప్పులాగే తయారైంది. వాస్తవానికి, యేసుక్రీస్తు అధీనంలోని దేవుని మెస్సీయ రాజ్యం “[మానవ నిర్మిత] రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము” చేస్తుంది. (దానియేలు 2:​44) మన ప్రకటనాపనిలో భాగంగా ఉన్న తీర్పు సందేశం ఆ అన్యజనులను అంటే జనాంగాలను కదిలిస్తోంది. (యెషయా 61:2) ప్రకటనాపని అంతకంతకూ విస్తరిస్తూ, తీవ్రతరమౌతుండగా, అవి మరింత ఎక్కువగా కదిలింపబడతాయి. అయితే హగ్గయి 2:7లో ప్రవచించబడిన కదిలింపబడడం దేనికి సూచనగా ఉంది?

హగ్గయి 2:6లో మనమిలా చదువుతాము: “సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా—‘ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.’” ఈ లేఖనాన్ని ఉల్లేఖిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “‘నేనింకొకసారి భూమిని మాత్రమేకాక ఆకాశమును కూడ కంపింపచేతును’ అని మాట యిచ్చియున్నాడు. ‘ఇంకొకసారి’ అను మాట చలింపచేయబడనివి [రాజ్యము] నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది.” (హెబ్రీయులు 12:​26, 27) అవును, దేవుడు సృష్టించే నూతనలోకం వచ్చేందుకు వీలుగా ప్రస్తుతమున్న లోకవ్యవస్థంతా ఉనికిలో లేకుండా నాశనం చేయబడుతుంది.

జనాంగాలు కదిలింపబడుతున్న కారణంగా యథార్థహృదయులు సత్యారాధనవైపు ఆకర్షింపబడడంలేదు. వారిని యెహోవావైపు, ఆయన ఆరాధనవైపు ఆకర్షిస్తున్న చర్యే జనాంగాలను కదిలిస్తోంది, ఆ చర్య ఏమిటంటే స్థాపించబడిన దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రపంచవ్యాప్త ప్రకటనాపని. ‘నిత్యసువార్త’ గురించిన ప్రకటన సరైన మనోవైఖరిగల వ్యక్తులను సత్యదేవుని ఆరాధనవైపు ఆకర్షిస్తుంది.​—⁠ప్రకటన 14:​6, 7.

రాజ్య సందేశంలో తీర్పుకు, రక్షణకు సంబంధించిన సమాచారం ఉంది. (యెషయా 61:​1, 2) ప్రపంచవ్యాప్తంగా ఆ సందేశం ప్రకటించబడడంవల్ల వచ్చే ఫలితాలు రెండు విధాలుగా ఉంటాయి, అవేమిటంటే, అది అన్యజనులను అంటే జనాంగాలను కదిలిస్తుంది, అంతేగాక, అన్యజనాంగాలకు చెందిన ఇష్టవస్తువులు యెహోవా మహిమకోసం ఆయన మందిరములోకి ప్రవేశించేలా చేస్తుంది.