కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు చదవడాన్ని ప్రోత్సహించే సాహసోపేత ప్రయత్నం

బైబిలు చదవడాన్ని ప్రోత్సహించే సాహసోపేత ప్రయత్నం

బైబిలు చదవడాన్ని ప్రోత్సహించే సాహసోపేత ప్రయత్నం

ఆయన అపనిందలు వేయబడి, అవమానింపబడి, తూర్పు సైబీరియాలోని శీతల మైదానాల్లో తన తుది శ్వాస విడిచాడు. తన తోటి గ్రీసు దేశస్థుల ఆధ్యాత్మిక పురోభివృద్ధికి దోహదపడిన ప్రముఖుల్లో ఆయన ఒకడని చాలా తక్కువమంది గుర్తుతెచ్చుకుంటారు. అలక్ష్యం చేయబడిన ఈ అగ్రగామి పేరు సెరాఫిమ్‌. బైబిలు చదవడాన్ని ప్రోత్సహించేందుకు ఆయన చేసిన సాహసోపేత ప్రయత్నం ఆయన మరణానికి దారితీసింది.

ఒట్టోమాన్‌ సామ్రాజ్యంలో గ్రీసు ఒక భాగంగావున్న కాలంలో సెరాఫిమ్‌ జీవించాడు. గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ విద్వాంసుడైన జార్జ్‌ మెటాల్లినోస్‌ అభిప్రాయం ప్రకారం, ఆ కాలంలో “తగిన పాఠశాలల కొరత” ఉండేది, మతనాయకులతో సహా “చాలామంది ప్రజలకు విద్య ఉండేది కాదు.”

కొయిని (సామాన్య) గ్రీకుకు, అనేక మాండలికాలున్న వాడుకభాషకు మధ్య చాలా తేడా ఉండేది. ఆ తేడా ఎంతగా పెరిగిపోయిందంటే, క్రైస్తవ గ్రీకు లేఖనాలు వ్రాయబడిన కొయిని గ్రీకు, విద్యలేని వారికి అర్థంకాని స్థితికి చేరుకుంది. ఆ తర్వాత తలెత్తిన వివాదంలో, అందరికీ అంతగా అర్థంకాని కొయిని గ్రీకును ఆమోదించడానికే చర్చి నిర్ణయించుకుంది.

ఈ వాతావరణంలో, గ్రీసులోని లెస్‌బోస్‌ ద్వీపంలో నివసిస్తున్న ఒక ప్రముఖ కుటుంబంలో, 1670లో, స్టీఫెనోస్‌ ఇయోయానీస్‌ పోగోనాటోస్‌ జన్మించాడు. ఆ ద్వీపంలో పేదరికం, నిరక్షరాస్యత ప్రబలంగా ఉన్నాయి. పాఠశాలల కొరత మూలంగా స్టీఫెనోస్‌ స్థానిక క్రైస్తవమఠంలో ప్రాథమిక విద్య అభ్యసించవలసి వచ్చింది. చాలా చిన్న వయసులోనే ఆయన గ్రీకు ఆర్థొడాక్స్‌ చర్చిలో మతాచార్యునిగా నియమించబడ్డాడు, ఆయనకు సెరాఫిమ్‌ అనే పేరు ఇవ్వబడింది.

ఇంచుమించు 1693లో, జ్ఞానార్జన విషయంలో సెరాఫిమ్‌కున్న ఆకాంక్ష మూలంగా ఆయన కాన్‌స్టాంటినోపుల్‌కు (ఇప్పుడు టర్కీలోని ఇస్తాంబుల్‌కు) వెళ్ళాడు. కొంతకాలానికి, ఆయన తనకున్న నైపుణ్యాల మూలంగా గ్రీసులోవున్న ప్రముఖుల గౌరవాన్ని చూరగొన్నాడు. అనతి కాలంలోనే, రహస్య గ్రీకు జాతీయ ఉద్యమ ప్రతినిధిగా ఆయన రష్యా చక్రవర్తియైన పీటర్‌ ద గ్రేట్‌ దగ్గరికి వెళ్లాడు. మాస్కోకు వెళ్ళి తిరిగిరావడం మూలంగా సెరాఫిమ్‌ యూరప్‌లోని చాలాభాగంలో ప్రయాణించగలిగాడు, అక్కడ ఆయన మతపరమైన, మేధాపరమైన సంస్కరణలను గమనించాడు. సెరాఫిమ్‌ 1698లో ఇంగ్లాండ్‌కు ప్రయాణించి, లండన్‌లోనూ ఆక్స్‌ఫర్డ్‌లోనూ ప్రాముఖ్యమైన సంబంధాలు ఏర్పరచుకున్నాడు. ఆయన ఆంగ్లికన్‌ చర్చి అధిపతియైన కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌కు పరిచయం చేయబడ్డాడు, ఆ సంబంధం సెరాఫిమ్‌కు త్వరలోనే ఉపయోగకరమైనదిగా నిరూపించబడుతుంది.

బైబిలును ప్రచురించడం

సెరాఫిమ్‌ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు, “క్రొత్త నిబంధన” (క్రైస్తవ గ్రీకు లేఖనాల) యొక్క నూతనమైన, సుళువుగా అర్థమయ్యే అనువాదం గ్రీకువారికి ఎంతగానో అవసరముందనే ముగింపుకు వచ్చాడు. సెరాఫిమ్‌, అర్థ శతాబ్దంకంటే ఎక్కువకాలం క్రితం మాక్సిమస్‌ అనే సన్యాసి ప్రచురించిన అనువాదాన్ని ఉపయోగిస్తూ తాజాగా, తప్పులులేని, సుళువుగా అర్థంచేసుకోగల అనువాదాన్ని ప్రచురించడం ఆరంభించాడు. ఆయన తన పనిని ఉత్సాహంగా ప్రారంభించాడు కానీ త్వరలోనే ఆయనకు నిధుల కొరత ఏర్పడింది. కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ తాను ఆర్థిక సహాయం చేస్తానని వాగ్దానం చేయడంతో పరిస్థితి మెరుగుపడినట్లు కనిపించింది. అలాంటి మద్దతుతో పురికొల్పబడి, సెరాఫిమ్‌ ముద్రణా కాగితాలు కొని, ఒక ముద్రణకర్తతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

అయితే, లూకా సువార్త సగం వరకు ముద్రించడానికి మాత్రమే నిధులు సరిపోయాయి. ఆ తర్వాత, ఇంగ్లాండ్‌లో వచ్చిన రాజకీయ మార్పు, కాంటర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ ఆర్థిక సహాయం చేయడం మానేసేలా చేసింది. అయినా వెనుదీయకుండా, సెరాఫిమ్‌ కొంతమంది ధనికుల సహాయం తీసుకుని 1703లో తన అనువాదాన్ని ప్రచురించగలిగాడు. ఖర్చులో కొంతభాగం, విదేశాల్లో సువార్త వ్యాప్తి చేసే సంస్థ భరించింది.

మాక్సిమస్‌ రూపొందించిన పాత, రెండు సంపుటుల అనువాదంలో ఆదిమ గ్రీకు మూలపాఠం కూడా ఉండేది. అది పెద్దగా, బరువుగా ఉండేది. సెరాఫిమ్‌ మార్పు చేసి రూపొందించిన అనువాదం చిన్న అక్షరాల్లో ముద్రించబడింది, దానిలో ఆధునిక గ్రీకు అనువాదం మాత్రమే ఉంది, అది సన్నగా ఉండి, చౌకగా లభించేది.

అగ్నికి ఆజ్యం పోయడం

“నవీకరించబడిన ఈ ప్రచురణ ప్రజల నిజమైన అవసరాన్ని ఖచ్చితంగా తీర్చింది. అయితే, [బైబిలు] అనువాదాలను వ్యతిరేకించే మతనాయకుల గుంపుమీద దాడి చేయడానికి సెరాఫిమ్‌ ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు” అని విద్వాంసుడైన జార్జ్‌ మెటాల్లినోస్‌ పేర్కొన్నాడు. ‘ప్రాముఖ్యంగా, [కొయిని] గ్రీకు అర్థం కాని కొంతమంది ప్రీస్టులు, మతపెద్దలు అతిపరిశుద్ధమైన ఆత్మ సహాయంతో ఆదిమ మూలపాఠం నుండి చదివి, అర్థం చేసుకుని, దాన్ని సామాన్య క్రైస్తవులకు అందజేయగలగాలన్న’ ఉద్దేశంతోనే తాను తన అనువాదాన్ని రూపొందించానని సెరాఫిమ్‌ ముందుమాటలో పేర్కొనడం మతనాయకులకు ఆగ్రహం తెప్పించింది. (ద ట్రాన్స్‌లేషన్‌ ఆఫ్‌ ద బైబిల్‌ ఇన్‌టు మోడ్రన్‌ గ్రీక్‌​—⁠డ్యూరింగ్‌ ద నైంటీంత్‌ సెంచరీ) అలా సెరాఫిమ్‌, బైబిలు అనువాదానికి సంబంధించి గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ చర్చిలో చెలరేగిన సుడిగుండంలో చిక్కుకున్నాడు.

ఒకవైపు, బైబిలును అర్థం చేసుకోవడంపైనే ప్రజల ఆధ్యాత్మిక, నైతిక అభివృద్ధి ఆధారపడి ఉంటుందని గుర్తించిన వారున్నారు. మతనాయకులు తమ లేఖన జ్ఞానాన్ని మెరుగుపరచుకోవాలని కూడా వారు భావించారు. అంతేగాక, బైబిలు అనువాదాన్ని ప్రోత్సహించినవారు, లేఖన సత్యాలను ఏ భాషలోనైనా వ్యక్తం చేయవచ్చని విశ్వసించారు.​—⁠ప్రకటన 7:⁠9.

బైబిలు అనువాదాన్ని వ్యతిరేకించినవారు, బైబిలును అనువదించడం దానిలోని సమాచారాన్ని కలుషితం చేస్తుందనే విషయాన్ని, అర్థం చెప్పడంలోనూ సిద్ధాంతాలను అధికారపూర్వకంగా రూపొందించడంలోనూ చర్చికున్న అధికారాన్ని నిర్వీర్యం చేస్తుందనే విషయాన్ని, సాకుగా ఉపయోగించారు. కానీ, గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ చర్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ప్రొటస్టెంట్లు బైబిలు అనువాదాన్ని ఉపయోగిస్తున్నారన్నది వాళ్ళ అసలు భయం. బైబిలు సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేయాలనే ప్రయత్నాలతోసహా ప్రొటస్టెంట్లపై సానుభూతి చూపించే ఎలాంటి ధోరణినైనా వ్యతిరేకించడం తమ బాధ్యతని చాలామంది మతనాయకులు తలంచారు. అలా బైబిలును అనువదించడం, ప్రొటస్టెంటిసమ్‌కు, సంప్రదాయకతకు మధ్యవున్న పోరులో ఒక వివాదాంశంగా తయారైంది.

ఆర్థొడాక్స్‌ చర్చిని వదిలేయాలన్నది సెరాఫిమ్‌ ఉద్దేశం కాకపోయినా, తనను వ్యతిరేకిస్తున్న మతనాయకుల అజ్ఞానానికి, పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. తాను అనువదించిన “క్రొత్త నిబంధన” యొక్క ముందుమాటలో ఆయనిలా వ్రాశాడు: “దేవునికి భయపడే ప్రతీ క్రైస్తవుడు పరిశుద్ధ బైబిలు చదవాలి,” అప్పుడే అతడు, “క్రీస్తును అనుకరిస్తాడు, [ఆయన] బోధలకు విధేయుడవుతాడు.” లేఖనాల అధ్యయనాన్ని నిషేధించడం అపవాది సంబంధమైనది అని సెరాఫిమ్‌ నొక్కిచెప్పాడు.

వ్యతిరేకతా తరంగం

సెరాఫిమ్‌ అనువాదం గ్రీసుకు చేరినప్పుడు, అది గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ చర్చికి ఆగ్రహం తెప్పించింది. ఆ క్రొత్త అనువాదం నిషేధించబడింది. ఆ అనువాదపు ప్రతులు కాల్చివేయబడ్డాయి, అది ఎవరి దగ్గరైనా ఉన్నా, దాన్ని ఎవరైనా చదివినా వారు బహిష్కరించబడతారని బెదిరించబడ్డారు. IIIవ గాబ్రియేల్‌ బిషప్పు, సెరాఫిమ్‌ అనువాదాన్ని అనవసరమైనది, నిష్ప్రయోజనకరమైనది అంటూ దాని పంపిణీని నిషేధించాడు.

సెరాఫిమ్‌ ఆశ వదులుకోకపోయినా, జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తించాడు. ఆయన అనువాదాన్ని చర్చి అధికారికంగా నిషేధించినా, చాలామంది మతనాయకులు, సామాన్యులు దాన్ని అంగీకరించారు. ఆ అనువాదాన్ని వ్యాప్తి చేయడంలో ఆయనెంతో సఫలమయ్యాడు. అయితే, శక్తిమంతమైన వ్యతిరేకులతో ఆయన పోరాటం అంతటితో ఆగిపోలేదు.

అంతం యొక్క ఆరంభం

సెరాఫిమ్‌ బైబిలు పంపిణీని వృద్ధిచేయడమే గాక, విప్లవాత్మక, జాతి సంబంధిత ఉద్యమాల్లో పాల్గొన్నాడు. వీటిని సాధించడానికి, ఆయన 1704 వసంతకాలంలో మాస్కోకు తిరిగివచ్చాడు. ఆయన పీటర్‌ ద గ్రేట్‌కు ఆంతరంగిక స్నేహితుడై, రష్యన్‌ రాయల్‌ అకాడమీలో కొంతకాలంపాటు పండితునిగా ఉన్నాడు. అయితే సెరాఫిమ్‌ తన అనువాదానికి ఏమవుతుందోనన్న వ్యాకులతతో 1705లో కాన్‌స్టాంటినోపుల్‌కు తిరిగి వచ్చాడు.

అదే సంవత్సరంలో జరిగిన ఆయన అనువాదపు పునర్‌ముద్రణలో నుండి సెరాఫిమ్‌, మొదటి ముద్రణలో ఉన్న ఆక్షేపణీయమైన ముందుమాటను తొలగించాడు. బైబిలు చదవమని ప్రోత్సహించే సరళమైన ముందుమాటను చేర్చాడు. ఈ సంచిక విస్తృతంగా పంపిణీ చేయబడింది, బిషప్పుల నుండి కూడా ఎలాంటి ప్రతికూల ప్రతిస్పందన వచ్చిన దాఖలాలు లేవు.

అయితే, 1714లో, బైబిలు అనువాద వ్యతిరేకి, గ్రీకు యాత్రికుడైన అలెగ్జాండర్‌ హెల్లాడిస్‌ కారణంగా చావుదెబ్బ తగిలింది. ఆయన స్టేటస్‌ ప్రీసెన్స్‌ ఎక్లిసీ గ్రీసీ (గ్రీక్‌ చర్చి ప్రస్తుత పరిస్థితి) అనే తన పుస్తకంలో, బైబిలు అనువాదాలపై, అనువాదకులపై క్రూరంగా దాడి చేశాడు. హెల్లాడిస్‌, సెరాఫిమ్‌ గురించి వ్రాసేందుకు ఒక పూర్తి అధ్యయాన్ని కేటాయించి, ఆయనను ఒక దొంగగా, మోసగాడిగా, నిరక్షరాస్యుడిగా, అవినీతికరమైన దగాకోరుగా చిత్రించాడు. అలాంటి నిందల్లో ఏమైనా సత్యముందా? సెరాఫిమ్‌ ‘పనిమంతుడు, జ్ఞానవంతుడైన అగ్రగామి’ అనీ, ఆయన తన సమకాలీనులకంటే ముందున్నందుకు దాడికి గురవుతున్నాడనీ చెప్తూ స్టీలియానోస్‌ బైరాక్‌తారీస్‌ అనే రచయిత చాలామంది విద్వాంసుల జ్ఞానయుక్తమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. అయినప్పటికీ, హెల్లాడిస్‌ పుస్తకం సెరాఫిమ్‌ అంతానికి దారితీసింది.

అనుమానపు మబ్బులచాటున

సెరాఫిమ్‌ 1731లో రష్యాకు తిరిగివచ్చేసరికి, పీటర్‌ ద గ్రేట్‌ చనిపోయాడు. దానితో గ్రీకు మతాచార్యుడైన సెరాఫిమ్‌కు ఇక అధికారిక రక్షణ లేకుండా పోయింది. పరిపాలిస్తున్న అన్నా ఇవానోవ్‌నా సామ్రాజ్ఞి తన రాజ్యంలో తలెత్తగల ఏ విధమైన వివాదం గురించైనా చాలా అప్రమత్తంగా ఉండేది. ఒక గ్రీకు గూఢచారి సామ్రాజ్య ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనే వదంతి 1732 జనవరిలో, సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో వ్యాపించింది. అనుమానితుడు సెరాఫిమే. ఆయనను నిర్బంధించి, విచారణ కోసం నెవస్కీ మఠానికి పంపించారు. ఆ మఠంలో, సెరాఫిమ్‌పై వివిధ నేరాల ఆరోపణలు చేసిన హెల్లాడిస్‌ వ్రాసిన పుస్తకం ఉంది. మూడు లిఖిత ప్రతివాదాల్లో మతాచార్యుడైన సెరాఫిమ్‌ తనపై వేయబడిన నిందలు తప్పని నిరూపించడానికి ప్రయత్నించాడు. విచారణ దాదాపు ఐదు నెలలపాటు కొనసాగింది, సెరాఫిమ్‌పై ఇతరులకున్న అనుమానాల మూలంగా ఆయన తాను నిర్దోషినని నిరూపించుకోవడం కష్టమైంది.

సెరాఫిమ్‌కు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాధారాలేవీ చూపించబడలేదు కాబట్టి, ఆయనకు మరణశిక్ష తప్పింది. అయితే, హెల్లాడిస్‌ వేసిన నిందల కారణంగా, అధికారులు సెరాఫిమ్‌ను స్వేచ్ఛగా విడిచిపెట్టడానికి సంకోచించారు. మతాచార్యుడైన సెరాఫిమ్‌కు సైబీరియాలో యావజ్జీవ ద్వీపాంతరవాస శిక్ష పడింది. “గ్రీకు రచయిత హెల్లాడిస్‌ ప్రచురించిన వ్యాసంలోవున్న” ఆరోపణల ఆధారంగా నేర నిర్ధారణ జరిగిందని తీర్పు తెలియజేసింది. 1732, జూలైలో, సెరాఫిమ్‌ ఇనుప సంకెళ్లతో బంధించబడి తూర్పు సైబీరియాకు తీసుకువెళ్ళబడి, క్రూరమైన అకోట్స్క్‌ చెరసాలలో వేయబడ్డాడు.

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, సెరాఫిమ్‌ మరణించాడు, అందరూ ఆయనను వదిలేసి, ఆయనను మర్చిపోయారు. కొన్నిసార్లు ఆయన నిర్ణయాలు, పద్ధతులు తప్పుదోవ పట్టించబడ్డాయి, అవి వివేచనారహితంగా ఉండేవి, కానీ ఆయన అనువాదం నేడు ఆధునిక గ్రీకులో అందుబాటులో ఉన్న అనేక బైబిలు అనువాదాల్లో ఒకటి. * వాటిలోనే మరొకటి, సుళువుగా అర్థం చేసుకోగల పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదం, ఇది అనేక ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంది. సర్వత్రా ఉన్న ప్రజలు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండే అవకాశాన్ని పొందగలిగేలా యెహోవా దేవుడు తన వాక్యాన్ని భద్రపరచినందుకు మనం ఎంత కృతజ్ఞత కలిగివుండవచ్చో కదా!​—⁠1 తిమోతి 2:​3, 4.

[అధస్సూచి]

^ పేరా 26 కావలికోట నవంబరు 15, 2002, 26-​9 పేజీల్లోవున్న, “ఆధునిక గ్రీకు భాషలో బైబిలు కోసం పోరాటం” అనే ఆర్టికల్‌ చూడండి.

[12వ పేజీలోని చిత్రం]

పీటర్‌ ద గ్రేట్‌

[10వ పేజీలోని చిత్రసౌజన్యం]

ఫోటోలు: Courtesy American Bible Society