భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
భూమిపట్ల దేవుని సంకల్పం ఏమిటి?
ఉద్యానవనంలో నడవాలన్నా, పరిమళాలు వెదజల్లే పూలతోటలో వాహ్యాళికి వెళ్ళాలన్నా మీరు ఎందుకు ఇష్టపడతారు? అందమైన సరస్సును లేక మేఘాల్లోకి చొచ్చుకుపోయిన ఎత్తైన పర్వత శిఖరాలను చూసినప్పుడు మీరు ఎందుకు ఉత్తేజితులవుతారు? చెట్లమీద నుండి పక్షులు చేసే వినసొంపైన కిలకిలరావాలు వినడానికి మీరు ఎందుకు సమయం తీసుకుంటారు? అందమైన జింక గెంతులు వేస్తుండడాన్ని చూడడం లేక పచ్చిక మైదానంలో మేసే గొర్రెల మందను చూడడం ఎందుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది?
ఈ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబుంది. మనం పరదైసులో జీవించేందుకు సృష్టించబడ్డాం! మన మొదటి తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు తమ జీవితాన్ని ఆ పరదైసులోనే ప్రారంభించారు. పరదైసులో జీవించాలనే కోరికను మనం వారి నుండి పొందితే, వారు ఆ కోరికను తమ సృష్టికర్తయైన యెహోవా దేవుని నుండి పొందారు. అలాంటి అద్భుతమైన భూగృహాన్ని ఆస్వాదించడానికి కావాల్సిన లక్షణాలతో ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి, మానవులమైన మనం పరదైసులో సంతోషంగా ఉంటామని ఆయనకు తెలుసు.
యెహోవా భూమిని ఎందుకు సృష్టించాడు? మానవజాతికి ‘నివాసస్థలమగునట్లుగా ఆయన దానిని సృజించాడు.’ (యెషయా 45:18) “భూమి సృష్టికర్త,” అందమైన పరదైసు గృహంగా ఉన్న ఏదెను తోటను ఆదాము హవ్వలకు ఇచ్చాడు. (యిర్మీయా 10:12; ఆదికాండము 2:7-9, 15, 21, 22) వారు ఆ తోటలో ఉన్న వాగులను, పూలను, చెట్లను ఎంతగా ఆస్వాదించివుంటారో కదా! ఆకాశంలో ఎగిరే ఆకర్షణీయమైన పక్షులను చూడవచ్చు, వివిధ రకాల జంతువులు ఆ ప్రాంతంలో సంచరించేవి, వాటిలో ఏవీ మానవులకు హానిచేయవు. చేపలు, మరితర ప్రాణులు భూమ్మీద తేటగా, స్వచ్ఛంగా ఉన్న నీటిలో తిరుగులాడేవి. అన్నింటికన్నా ప్రాముఖ్యంగా ఆదాము హవ్వలు కలిసివున్నారు. వారు పిల్లలను కని, పెరుగుతున్న కుటుంబంతో ఆనందంగా గడుపుతూ తమ పరదైసు గృహాన్ని విస్తరించగలిగేవారు.
నేడు భూమి పరదైసుగా లేనప్పటికీ, దానిని ఒక సంతోషకరమైన కుటుంబానికి చెందిన చక్కని గృహంతో పోల్చవచ్చు. దేవుడు మనకిచ్చిన భౌగోళిక గృహంలో మనకు కావాల్సిన కాంతి, ఉష్టోగ్రత, నీరు, ఆహారం ఉన్నాయి. సూర్యకాంతిని, వేడిని, రాత్రుల్లో చంద్రుడి చల్లని వెన్నెలను మనమెంతగా ఇష్టపడతామో కదా! (ఆదికాండము 1:14-18) వేడిని పుట్టించేందుకు ఉపయోగించగల బొగ్గు, చమురు వంటి ఇంధనాలు భూగర్భంలో ఉన్నాయి. నీటి చక్రం కారణంగా, భూవ్యవస్థలో ఉన్న నదులు, సరస్సులు, సముద్రాల కారణంగా మనకు నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. భూమ్మీద పచ్చగడ్డి తివాచీలా పరచబడి ఉంది.
ఒక ఇంట్లో ఆహారాన్ని భద్రపరచగలిగినట్లే భూమ్మీద ఆహారం సమృద్ధిగా భద్రపరచబడి ఉంది. పొలాల్లోని పంటల ద్వారా పండ్లతోటల్లో ఫలాల ద్వారా యెహోవా ‘ఫలవంతమైన రుతువులనిచ్చి, మన హృదయాలను ఉల్లాసంతో నింపుతున్నాడు.’ (అపొస్తలుల కార్యములు 14:16, 17) భూమి ఇప్పటికే ఇంత చక్కని గృహంగా ఉంది కాబట్టి, “సంతోషంగా ఉండే దేవుడు” అయిన యెహోవా దాన్ని పరదైసుగా మార్చినప్పుడు అదింకెలా ఉంటుందో ఒకసారి ఊహించండి!—1 తిమోతి 1:8, NW.
[2వ పేజీలోని చిత్రసౌజన్యం]
ముఖచిత్రం: భూమి: NASA photo; నక్షత్రాలు: NASA, ESA and AURA/Caltech