కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ‘ధైర్యంగా మాట్లాడగలరా’?

మీరు ‘ధైర్యంగా మాట్లాడగలరా’?

మీరు ‘ధైర్యంగా మాట్లాడగలరా’?

రెండు వందల ముప్పైఐదు దేశాల్లో అరవై లక్షలకన్నా ఎక్కువమంది, బైబిల్లో పేర్కొనబడినట్లుగా, ‘ధైర్యంగా మాట్లాడగలరు.’ పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదములోని క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో ‘ధైర్యంగా మాట్లాడడం’ అని అనువదించబడిన ఈ పదబంధం 16 సార్లు కనిపిస్తుంది. (2 కొరింథీయులు 3:⁠13; ఫిలిప్పీయులు 1:19; 1 తిమోతి 3:13; హెబ్రీయులు 3:6; 1 యోహాను 3:​21) ‘ధైర్యంగా మాట్లాడడంలో’ ఏమి ఇమిడివుంది? అలా మాట్లాడడానికి మనకేమి సహాయం చేస్తుంది? ఈ స్వేచ్ఛ, ఏయే సందర్భాల్లో ఆటంకమేమీ లేకుండా మాట్లాడడానికి మనకు సహాయం చేస్తుంది?

వైన్స్‌ ఎక్స్‌పోజిటరీ డిక్షనరీ ఆఫ్‌ ఓల్డ్‌ అండ్‌ న్యూ టెస్ట్‌మెంట్‌ వర్డ్స్‌ ప్రకారం, ‘ధైర్యంగా మాట్లాడడం’ అని అనువదించబడిన గ్రీకు పదానికి, “వాక్‌స్వాతంత్ర్యం; దాపరికం లేకుండా మాట్లాడడం . . . భయం లేకుండా మాట్లాడడం” అనే భావాలున్నాయి; “కాబట్టి అది నమ్మకం, సానుకూల సాహసం, ధైర్యం అనే భావాన్ని అందజేస్తుంది. ఆ పదానికి అన్ని సందర్భాల్లోనూ సంభాషణతో సంబంధం ఉండదు.” అయితే, అలా నిర్భయంగా మాట్లాడడమంటే అది కరుకుదనమో, మొరటుతనమో అనుకోకూడదు. ‘మీ సంభాషణ ఎల్లప్పుడు కృపాసహితముగా ఉండనియ్యుడి’ అని బైబిలు చెబుతోంది. (కొలొస్సయులు 4:⁠6) ధైర్యంగా మాట్లాడడంలో, కష్టతరమైన పరిస్థితులు లేదా మనుష్యభయం మనల్ని మాట్లాడకుండా చేసేందుకు అనుమతించకుండా, యుక్తిగా ఉండడం కూడా ఇమిడివుంది.

ధైర్యంగా మాట్లాడడం మనకు జన్మతః వస్తుందా? ఎఫెసులోని క్రైస్తవులకు అపొస్తలుడైన పౌలు ఏమి వ్రాశాడో పరిశీలించండి. ఆయనిలా అన్నాడు: ‘శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించే కృప పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు అనుగ్రహించబడింది.’ యేసుక్రీస్తు ద్వారా, “ఆయనయందలి విశ్వాసముచేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును . . . మనకు కలిగియున్నవి” అని కూడా పౌలు అన్నాడు. (ఎఫెసీయులు 3:​8-​12) ధైర్యంగా మాట్లాడడం, మనకు జన్మతః వచ్చిన ఆధిక్యత కాదుగానీ, అది యేసుక్రీస్తు మీద విశ్వాసం ఆధారంగా యెహోవా దేవునితో మనకున్న సంబంధం నుండి ఉత్పన్నమౌతుంది. ఈ స్వేచ్ఛను పొందడానికి మనకేమి సహాయం చేయగలదో, ప్రకటించేటప్పుడు, బోధించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు దాన్ని మనమెలా ప్రదర్శించవచ్చో చూద్దాం.

ధైర్యంగా ప్రకటించడానికి మనకేమి సహాయం చేస్తుంది?

ధైర్యంగా మాట్లాడడంలో యేసుక్రీస్తు సర్వోత్తమ మాదిరిగా ఉన్నాడు. ఆయనకున్న ఉత్సాహం, ప్రకటించడానికి అవకాశాల్ని సద్వినియోగం చేసుకునేలా ఆయనను ప్రేరేపించింది. విశ్రాంతి తీసుకుంటున్నా, ఎవరి ఇంట్లోనైనా భోజనం చేస్తున్నా, లేక దారిలో నడుస్తున్నా, దేవుని రాజ్యం గురించి మాట్లాడే అవకాశాన్ని ఆయన ఎన్నడూ వదులుకోలేదు. దూషణగానీ తీవ్ర వ్యతిరేకతగానీ యేసును మౌనంగా ఉండేంతగా భయపెట్టలేకపోయాయి. బదులుగా, ఆయన తన కాలంనాటి అబద్ధ మతనాయకుల గుట్టును ధైర్యంగా బయటపెట్టాడు. (మత్తయి 23:​13-​36) నిర్బంధించబడి, విచారణ చేయబడుతున్నప్పుడు కూడా యేసు నిర్భయంగా మాట్లాడాడు.​—⁠యోహాను 18:​6, 19, 20, 37.

యేసు అపొస్తలులు కూడా అదేవిధంగా నిర్భయంగా మాట్లాడడాన్ని నేర్చుకున్నారు. సా.శ. 33 పెంతెకొస్తునాడు, పేతురు 3,000 కంటే ఎక్కువమంది ఎదుట ధైర్యంగా మాట్లాడాడు. గమనించదగ్గ విషయమేమిటంటే, ఆ సందర్భానికి కొద్దిరోజుల ముందు, ఒక పనికత్తె ఆయనను గుర్తుపట్టినప్పుడు ఆయన భయపడిపోయాడు. (మార్కు 14:66-​71; అపొస్తలుల కార్యములు 2:​14, 29, 41) మతనాయకుల ఎదుటకు లాక్కెళ్ళబడినప్పుడు పేతురు యోహానులు భయంతో కృంగిపోలేదు. నిస్సంకోచంగా, వారు పునరుత్థానం చేయబడిన యేసుక్రీస్తు గురించి ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. వాస్తవానికి, పేతురు యోహానులు అలా నిర్భయంగా మాట్లాడడమే వారు యేసుతో ఉన్నవారని మతనాయకులు గుర్తించేలా చేసింది. (అపొస్తలుల కార్యములు 4:​5-​13) అంత ధైర్యంగా మాట్లాడడానికి వారికి సహాయం చేసిందేమిటి?

యేసు తన అపొస్తలులకు ఇలా వాగ్దానం చేశాడు: “వారు మిమ్మును అప్పగించునప్పుడు, ఏలాగు మాటాడుదుము? ఏమి చెప్పుదుము? అని చింతింపకుడి; మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాటలాడుచున్నాడే గాని మాటలాడువారు మీరు కారు.” (మత్తయి 10:​19, 20) స్వేచ్ఛగా మాట్లాడకుండా ఆటంకపరచగల ఏ పిరికితనాన్నైనా, భయాన్నైనా అధిగమించడానికి పేతురుకు, ఇతరులకు పరిశుద్ధాత్మ సహాయం చేసింది. ఆ బలమైన శక్తి ప్రభావం మనకు కూడా అలాగే సహాయం చేయగలదు.

అంతేగాక, యేసు తన అనుచరులకు శిష్యులను చేసే పని అప్పగించాడు. ఇది సముచితమైనదే, ఎందుకంటే ఆయనకే, “పరలోకమందును భూమిమీదను . . . సర్వాధికారము ఇయ్యబడినది.” ఆయన ‘వారితో కూడ ఉన్నాడు.’ (మత్తయి 28:​18-​20) తమకు యేసు మద్దతు ఉందనే విషయం తొలి శిష్యులకు తెలియడం, తమ ప్రకటనాపనిని ఆపడానికి ప్రయత్నిస్తున్న అధికారులను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని వారికిచ్చింది. (అపొస్తలుల కార్యములు 4:​18-​20; 5:​28, 29) ఆ విషయం తెలిసివుండడం మనకు కూడా అలాగే ధైర్యాన్నిస్తుంది.

నిర్భయంగా మాట్లాడడానికి మరో కారణాన్ని గుర్తిస్తూ, పౌలు నిరీక్షణను ‘బహు ధైర్యముగా మాట్లాడడంతో’ ముడిపెట్టాడు. (2 కొరింథీయులు 3:​13; ఫిలిప్పీయులు 1:​20) నిరీక్షణా సందేశం తమ దగ్గరే ఉంచుకోలేనంత అద్భుతమైనది కాబట్టి, క్రైస్తవులు దాని గురించి ఇతరులకు చెప్పాలి. వాస్తవానికి, మన నిరీక్షణ మనం ధైర్యంగా మాట్లాడడానికి ఒక కారణం.​—⁠హెబ్రీయులు 3:⁠6.

ధైర్యంగా ప్రకటించడం

మనం భయం గొలిపే పరిస్థితుల్లో కూడా ఎలా ధైర్యంగా ప్రకటించవచ్చు? అపొస్తలుడైన పౌలు ఉదాహరణ పరిశీలించండి. ఆయన రోములో ఖైదీగా ఉన్నప్పుడు, “నేను మాటలాడ నోరు తెరచునప్పుడు దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్ఛక్తి నాకు అనుగ్రహింపబడునట్లు” ప్రార్థించమని తన తోటి విశ్వాసులను అడిగాడు. (ఎఫెసీయులు 6:​19, 20) ఆ ప్రార్థనలకు సమాధానం ఇవ్వబడిందా? ఇవ్వబడింది! చెరసాలలో ఉన్నప్పుడు పౌలు “ఏ ఆటంకమునులేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించ[డంలో]” కొనసాగాడు.​—⁠అపొస్తలుల కార్యములు 28:​30, 31.

పనిస్థలంలో, పాఠశాలలో, లేక ప్రయాణిస్తున్నప్పుడు సాక్ష్యమివ్వడానికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనకెంత ధైర్యముందో చూపిస్తాము. పిరికితనం, ఇతరులెలా ప్రతిస్పందిస్తారోననే భయం, మన సామర్థ్యంపై నమ్మకం లేకపోవడం మనం మౌనంగా ఉండేలా చేయవచ్చు. ఈ విషయంలో కూడా అపొస్తలుడైన పౌలు ఒక మంచి మాదిరి ఉంచుతున్నాడు. “యెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవునియందు ధైర్యము తెచ్చుకొంటిమి” అని ఆయన వ్రాశాడు. (1 థెస్సలొనీకయులు 2:⁠2) పౌలు తాను తన సొంత శక్తిసామర్థ్యాలతో సాధించలేనివాటిని, యెహోవాపై ఆధారపడడం ద్వారా మాత్రమే సాధించగలిగాడు.

అనియత సాక్ష్యమిచ్చే అవకాశం లభించినప్పుడు ధైర్యం కూడగట్టుకోవడానికి షెర్రీ అనే ఒక స్త్రీకి ప్రార్థన సహాయం చేసింది. ఒకరోజు, ఆమె తన భర్త పని ముగించుకుని తిరిగిరావడం కోసం ఎదురుచూస్తున్నప్పుడు, తనలాగే వేచి ఉన్న మరో స్త్రీని చూసింది. “నా గొంతులో ఏదో అడ్డుపడినట్లు అనిపించడంతో, నేను ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించాను” అని షెర్రీ చెబుతోంది. షెర్రీ ఆ స్త్రీని సమీపించేసరికి, ఒక బాప్టిస్ట్‌ పరిచారకుడు అక్కడికి వచ్చాడు. మతనాయకుణ్ణి కలుసుకోవలసి వస్తుందని షెర్రీ ఊహించలేదు. అయితే, ఆమె మళ్లీ ప్రార్థన చేసుకుని సాక్ష్యమివ్వగలిగింది. ఆమె ఆ స్త్రీకి సాహిత్యం ఇచ్చి, పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకుంది. మనం సాక్ష్యమివ్వడానికి అవకాశాలను చేజిక్కించుకున్నప్పుడు, యెహోవాపై ఆధారపడడం మనం నిర్భయంగా మాట్లాడడానికి సహాయం చేస్తుందని మనం నమ్మకంతో ఉండవచ్చు.

ధైర్యంగా బోధించడం

ధైర్యంగా మాట్లాడడానికీ, బోధించడానికీ సన్నిహిత సంబంధం ఉంది. సంఘంలో “పరిచారకులైయుండి ఆ పనిని బాగుగా నెరవే[ర్చేవారి]” గురించి బైబిలు ఇలా చెబుతోంది: “వారు, మంచి పదవిని సంపాదించుకొని, క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు.” (1 తిమోతి 3:​13) ఇతరులకు తాము బోధించేదాన్ని తమకు తాము అన్వయించుకోవడం ద్వారా వారు ధైర్యంగా మాట్లాడే సామర్థ్యాన్ని సంపాదించుకుంటారు. వారలా చేయడం సంఘాన్ని కాపాడి, బలపరుస్తుంది.

మనం ఈ విధంగా ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు, మనమిచ్చే ఉపదేశం మరింత ప్రభావవంతంగా ఉండి, మరింత అనుసరించదగినదిగా ఉంటుంది. ఒకరు మాదిరికరంగా లేకపోవడం చూసి తప్పుదోవ పట్టే బదులు, తమకు బోధించబడుతున్నది ఆచరణాత్మకంగా అన్వయించుకోబడడం చూసి శ్రోతలు ప్రోత్సహించబడతారు. ఏదైనా సమస్య తారాస్థాయికి చేరకముందే, ‘తమ సహోదరుణ్ణి మంచి దారికి తీసుకురావడానికి’ ఇలా ధైర్యంగా మాట్లాడడం ఆధ్యాత్మిక అర్హతలు గలవారికి సహాయం చేస్తుంది. (గలతీయులు 6:⁠1) మంచి మాదిరి ఉంచని వ్యక్తి, తనకు మాట్లాడే హక్కులేదని గ్రహిస్తూ మాట్లాడడానికి సంకోచించవచ్చు. అవసరమైన ఉపదేశాన్ని ఇవ్వడంలో ఆలస్యం కావడం నాశనకరమైన పర్యవసానాలకు దారితీయవచ్చు.

మనం ధైర్యంగా మాట్లాడడమంటే విమర్శనాత్మకంగా, మొండిగా తయారవడమని కాదు. పౌలు “ప్రేమనుబట్టి” ఫిలేమోనును ఉద్బోధించాడు. (ఫిలేమోను 8, 9) అపొస్తలుని మాటలకు అనుకూలమైన ప్రతిస్పందన లభించిందని స్పష్టమౌతోంది. ఒక పెద్ద ఇచ్చే ఏ ఉపదేశానికైనా ప్రేమే ప్రేరకంగా ఉండాలి!

ఉపదేశం ఇచ్చేటప్పుడు, ధైర్యంగా మాట్లాడడం ఆవశ్యకం. ఇతర సమయాల్లోనూ అది అవసరమే. పౌలు కొరింథులోని సంఘానికిలా వ్రాశాడు: “మీ యెడల నేను బహు ధైర్యముగా మాటలాడుచున్నాను, మిమ్మును గూర్చి నాకు చాల అతిశయము కలదు.” (2 కొరింథీయులు 7:⁠4) పౌలు తన సహోదర సహోదరీలను ప్రశంసించవలసిన సమయంలో ప్రశంసించకుండా ఉండలేదు. ఆయనకు తన తోటి విశ్వాసుల లోపాలు తెలిసినా వారి మంచి లక్షణాలపై కేంద్రీకరించడానికి ప్రేమ ఆయనకు సహాయం చేసింది. అలాగే నేడు పెద్దలు తమ సహోదర సహోదరీలను స్వేచ్ఛగా ప్రశంసించి, ప్రోత్సహించినప్పుడు క్రైస్తవ సంఘం వృద్ధి చెందుతుంది.

క్రైస్తవులందరూ బోధించడంలో ప్రభావవంతంగా ఉండాలంటే వారు ధైర్యంగా మాట్లాడగలిగి ఉండాలి. ముందు ప్రస్తావించబడిన షెర్రీ, పాఠశాలలో సాక్ష్యమివ్వమని తన పిల్లలను ప్రోత్సహించాలనుకుంది. “నేను సత్యములోనే పెంచబడినా, నేనెప్పుడూ పాఠశాలలో సాక్ష్యమివ్వలేదు. నేను తటస్థంగా కూడా అంతగా సాక్ష్యమివ్వను” అని ఆమె అంగీకరిస్తోంది. “‘నేను నా పిల్లలకు ఎలాంటి మాదిరి ఉంచుతున్నాను?’ అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను” అని షెర్రీ చెబుతోంది. ఇది, అనియత సాక్ష్యమిచ్చేందుకు షెర్రీ మరింతగా కృషి చేయడానికి ఆమెను ప్రేరేపించింది.

అవును, ఇతరులు మన క్రియలు గమనిస్తూ మనం బోధిస్తున్నదాన్ని అనుసరించడంలో మనమే విఫలమైతే చూస్తారు. కాబట్టి మనం మన మాటలకు అనుగుణంగా నడుచుకోవడం ద్వారా ధైర్యంగా మాట్లాడడానికి కృషి చేద్దాం.

నిరాటంకంగా ప్రార్థించడం

మనం యెహోవాకు ప్రార్థించేటప్పుడు ధైర్యంగా మాట్లాడడం మరింత ప్రాముఖ్యం. ఎలాంటి అడ్డంకూలేకుండా, యెహోవా మన ప్రార్థనలు వింటాడనీ, వాటికి సమాధానం ఇస్తాడనీ నమ్మకంతో మనం ఆయన ఎదుట మన హృదయాన్ని కుమ్మరించవచ్చు. అలా మనం మన పరలోక తండ్రితో వాత్సల్యపూరితమైన, సన్నిహిత సంబంధాన్ని ఆనందిస్తాం. మనం మరీ అల్పులమని భావిస్తూ మనం యెహోవాను సమీపించడానికి ఎన్నడూ సంకోచించకూడదు. మనం చేసిన తప్పులనుబట్టి మనకు కలిగే అపరాధ భావాలు మన హృదయపూర్వక ప్రార్థనలకు ఆటంకంగా మారితే అప్పుడెలా? అప్పుడు కూడా మనం విశ్వసర్వాధిపతిని స్వేచ్ఛగా సమీపించగలమా?

ప్రధానయాజకునిగా యేసు ఉన్నతపరచబడిన స్థానం, ప్రార్థనలో నమ్మకం కలిగివుండడానికి మరింత ఆధారాన్నిస్తుంది. హెబ్రీయులు 4:​15, 16లో మనమిలా చదువుతాం: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.” యేసు మరణం, ప్రధానయాజకునిగా ఆయన పాత్ర అంత విలువైనవి.

మనం యెహోవాకు విధేయత చూపించడానికి హృదయపూర్వకంగా కృషి చేస్తే, ఆయన మన ప్రార్థన తప్పక వింటాడనే నమ్మకం కలిగివుండడానికి మనకు ప్రతీ కారణం ఉంది. అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.”​—⁠1 యోహాను 3:​21, 22.

ఎలాంటి ఆటంకం లేకుండా యెహోవాకు ప్రార్థించడమంటే మనం ఆయనకు ఏదైనా చెప్పవచ్చు. మనకు ఏ భయాలున్నా, మనల్ని ఏ చింతలు, వ్యాకులతలు లేక ఆందోళనలు బాధిస్తున్నా వాటన్నిటినీ, యెహోవా మన యథార్థమైన ప్రార్థనలను తప్పక వింటాడనే నమ్మకంతో మనం ఆయన ఎదుట కుమ్మరించవచ్చు. మనం గంభీరమైన పాపం చేసినా, మనం యథార్థంగా పశ్చాత్తాపపడితే, మన అపరాధం మన ప్రార్థనలకు ఆటంకం కాకూడదు.

ధైర్యంగా మాట్లాడడం అనే వరం నిజంగా అమూల్యమైనది. దానితో మన ప్రకటనా, బోధనా కార్యకలాపాల్లో మనం దేవుణ్ణి మహిమపరచి, ప్రార్థనలో ఆయనకు ఎంతో సన్నిహితం కావచ్చు. కాబట్టి మనం ‘ధైర్యమును విడిచిపెట్టకుండా ఉందాము; దానికి ప్రతిఫలముగా’ నిత్యజీవమనే “గొప్ప బహుమానము కలుగును.”​—⁠హెబ్రీయులు 10:​35.

[13వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన పౌలు ధైర్యంగా మాట్లాడాడు

[15వ పేజీలోని చిత్రాలు]

సమర్థవంతంగా బోధించడానికి ధైర్యంగా మాట్లాడడం అవసరం

[16వ పేజీలోని చిత్రం]

ప్రార్థనలో ధైర్యంగా మాట్లాడడం ఆవశ్యకం