కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యథార్థంగా నడవడం ఆనందాన్నిస్తుంది

యథార్థంగా నడవడం ఆనందాన్నిస్తుంది

యథార్థంగా నడవడం ఆనందాన్నిస్తుంది

“యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు [‘ఆయన దానితోపాటు ఏ కష్టాన్నీ తీసుకురాడు,’ NW].”​—⁠సామెతలు 10:​22.

“భవిష్యత్తును గురించి అతిగా ఆలోచించడం . . . మనకు ప్రస్తుతమున్న వాటినిబట్టి ఆనందించకుండా అడ్డగిస్తుంది” అని ఒక అమెరికా తత్వవేత్త వ్రాశారు. పిల్లల విషయంలో కూడా అలాగే జరుగుతుంది, వారు తాము పెరిగి పెద్దవారై ఆనందించే ఆధిక్యతల గురించే ఆలోచిస్తూ తమ బాల్యమంతా గడిచిపోయేవరకు ఆ బాల్యంలో ఉండే ప్రయోజనాల గురించి ఆలోచించరు.

2 ఇలాంటి ఆలోచనా విధానానికి యెహోవా ఆరాధకులు సహితం అతీతులు కాదు. ఈ క్రింది పరిస్థితి గురించి ఆలోచించండి. భూమిపై పరదైసును తీసుకొచ్చే దేవుని వాగ్దాన నెరవేర్పును మనం కోరుకుంటాం. వ్యాధి, వృద్ధాప్యం, నొప్పి, బాధలేని జీవితం కోసం మనం ఆశగా ఎదురుచూస్తున్నాం. అలాంటివాటి కోసం అపేక్షించడం సముచితమైనప్పటికీ, మన ప్రస్తుత ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను గ్రహించలేనంతగా భావి భౌతికాశీర్వాదాల గురించే అతిగా ఆలోచిస్తూ ఉంటే ఏమౌతుంది? అదెంత విచారకరమో కదా! మనమపేక్షించిన ‘కోరికలు సఫలము కాకుండుటచేత’ మనం సులభంగా నిరుత్సాహానికి గురవడమే కాక, మన ‘హృదయం నొచ్చుకుంటుంది.’ (సామెతలు 13:​12) జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు మనల్ని నిరుత్సాహపు లేదా అసంతోషపు ఉరిలోకి నెట్టేయవచ్చు. కష్టపరిస్థితులను తాళుకునే బదులు, ఫిర్యాదుచేసే మనస్తత్వాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. మన ప్రస్తుత ఆశీర్వాదాలను కృతజ్ఞతాపూర్వకంగా ధ్యానించడం ద్వారా వీటన్నిటినీ మనం తప్పించుకోవచ్చు.

3 “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు [‘ఆయన దానితోపాటు ఏ కష్టాన్నీ తీసుకురాడు,’ NW] అని సామెతలు 10:​22 చెబుతోంది. యెహోవా ఆధునిక సేవకుల ఆధ్యాత్మిక సమృద్ధికరమైన స్థితి ఆనందించదగిన ఆశీర్వాదం కాదా? మన ఆధ్యాత్మిక సమృద్ధికి సంబంధించిన కొన్ని అంశాలను మనమిప్పుడు పరిశీలించి, అవి మనకు వ్యక్తిగతంగా ఎలా తోడ్పడతాయో చూద్దాం. ‘యథార్థవర్తనుడైన నీతిమంతునిపై’ యెహోవా కురిపించే ఆశీర్వాదాలను ధ్యానించేందుకు సమయం తీసుకోవడం, మన పరలోకపు తండ్రిని ఆనందంగా నిరంతరం సేవించాలనే మన తీర్మానాన్ని నిజంగా బలపరుస్తుంది.​—⁠సామెతలు 20:7.

ఇప్పుడు ‘మనకు ఐశ్వర్యమిచ్చే ఆశీర్వాదాలు’

4 బైబిలు బోధల ప్రామాణిక జ్ఞానం. క్రైస్తవమత సామ్రాజ్యంలోని మతశాఖలు సాధారణంగా బైబిలును నమ్ముతామని చెప్పుకుంటాయి. అయితే, అవి తరచూ అది బోధించే విషయాలను అంగీకరించవు. ఒకే మతానికి చెందిన సభ్యులు సహితం లేఖనాలు నిజంగా బోధించే విషయాలపై విభిన్న దృక్కోణాలు కలిగివుంటారు. యెహోవా సేవకుల పరిస్థితికీ వారి పరిస్థితికీ ఎంత తేడావుందో కదా! మన దేశం, సంస్కృతి లేదా జాతి నేపథ్యమేదైనా మనమొకే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన పేరేమిటో మనకు తెలుసు. ఆయన విచిత్రమైన త్రిత్వదేవుడు కాదు. (ద్వితీయోపదేశకాండము 6:⁠4; కీర్తన 83:​18; మార్కు 12:​29) దేవుని విశ్వ సర్వాధిపత్యపు ప్రాథమిక వివాదాంశం త్వరలోనే పరిష్కరించబడుతుందనే కాక, ఆయనపట్ల మనకున్న యథార్థతను కాపాడుకోవడం ద్వారా ఆ వివాదాంశంలో మనలో ప్రతీ ఒక్కరం వ్యక్తిగతంగా ఇమిడివున్నామనీ కూడా మనకు తెలుసు. మృతుల గురించిన సత్యం మనకు తెలుసు, అంతేగాక, దేవుడు మానవులను నరకాగ్నిలో బాధిస్తాడని లేదా పాపవిమోచన లోకంలో పడేస్తాడని చాలామంది నమ్ముతున్నట్లుగా, దేవుని విషయంలో మనకలాంటి గడగడలాడే భయం లేదు.​—⁠ప్రసంగి 9:​5, 10.

5 అంతేకాక, మనం తర్కవిరుద్ధ పరిణామపు యాదృచ్ఛిక ఉత్పత్తి కాదని తెలుసుకోవడం ఎంత ఆనందదాయకమో కదా! బదులుగా, మనం దేవుని సృష్టి, మనమాయన స్వరూపంలో చేయబడ్డాం. (ఆదికాండము 1:​26; మలాకీ 2:​10) “నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందునుబట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది” అని కీర్తనకర్త తన దేవునికి స్తుతిగీతం పాడాడు.​—⁠కీర్తన 139:​14.

6 హానికరమైన అలవాట్ల నుండి, అభ్యాసాల నుండి విడుదల. పొగత్రాగడం, అతిగా మద్యపానం, లైంగిక విచ్చలవిడితనం గురించిన హెచ్చరికలను ప్రసార మాధ్యమాలు విస్తృతంగా ప్రసారం చేస్తున్నాయి. చాలావరకు ప్రజలు ఈ హెచ్చరికల్ని లక్ష్యపెట్టడం లేదు. అయితే నిష్కపటమైన ఒక వ్యక్తి, సత్యదేవుడు అలాంటి వాటిని ఖండిస్తున్నాడనీ, వాటిని అభ్యసిస్తున్న వారినిబట్టి ఆయన విచారిస్తున్నాడనీ తెలుసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? ఆ వ్యక్తి అలాంటి అలవాట్లను మానుకునేందుకు ప్రేరేపించబడతాడు! (యెషయా 63:​10; 1 కొరింథీయులు 6:​9, 10; 2 కొరింథీయులు 7:⁠1; ఎఫెసీయులు 4:​30) ఆయన ప్రాథమికంగా యెహోవా దేవుణ్ణి సంతోషపెట్టేందుకు ఈ పని చేసినా, ఆయన అదనపు ప్రయోజనాలను అంటే మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా పొందుతాడు.

7 చాలామందికి చెడు అలవాట్లు మానుకోవడం చాలాకష్టం. అయినప్పటికీ, ప్రతీ సంవత్సరం వేలాదిమంది అలా మానుకుంటున్నారు. వారు యెహోవాకు సమర్పించుకొని, నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా, తాము దేవునికి అసంతోషం కలిగించే అలవాట్లను మానుకున్నామని బహిరంగంగా తెలియజేస్తున్నారు. మనందరికీ అదెంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! పాపభరితమైన, హానికరమైన ప్రవర్తనకు దాసోహమవకుండా ఉండాలనే మన తీర్మానం మరింత బలపడుతుంది.

8 సంతోషభరితమైన కుటుంబ జీవితం. అనేకదేశాల్లో కుటుంబ జీవితం బలహీనపడుతోంది. చాలా వివాహాలు విడాకుల ద్వారా విడిపోతున్నాయి, తత్ఫలితంగా తరచూ పిల్లలు తీవ్ర భావోద్వేగ హానికి గురౌతున్నారు. కొన్ని ఐరోపా దేశాల్లో, మొత్తం కుటుంబాల్లో దాదాపు 20 శాతం వరకు ఒంటరి తల్లి/తండ్రిగల కుటుంబాలే ఉంటున్నాయి. ఈ విషయంలో యథార్థంగా నడిచేందుకు యెహోవా మనకెలా సహాయం చేశాడు? దయచేసి ఎఫెసీయులు 5:​22-6:​4 చదివి, భర్తలకు, భార్యలకు, పిల్లలకు దేవుని వాక్యమిచ్చే ప్రశస్తమైన సలహాను గమనించండి. ఆ లేఖనంలోనేకాక మరితర లేఖనాల్లో ప్రస్తావించబడిన సలహాను అన్వయించుకోవడం నిశ్చయంగా వివాహబంధాన్ని బలపరచడమే కాక, తల్లిదండ్రులు తమ పిల్లల్ని సరిగా పెంచేందుకు దోహదపడుతూ, సంతోషభరితమైన కుటుంబ జీవితానికి తోడ్పడుతుంది. అది ఆనందించదగిన ఆశీర్వాదం కాదా?

9 లోక సమస్యలు త్వరలోనే పరిష్కరించబడతాయనే హామీ. వైజ్ఞానిక, సాంకేతిక నైపుణ్యాలు, కొంతమంది నాయకుల యథార్థ కృషి ఉన్నప్పటికీ, ప్రస్తుత జీవితంలోని గంభీరమైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక చర్యావేదిక వ్యవస్థాపకుడైన క్లాస్‌ షావాబ్‌ ఇటీవలే ఇలా అన్నాడు: “ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల పట్టిక పెరుగుతూ ఉండగా, వాటిని పరిష్కరించే సమయం తగ్గుతూ ఉంది.” ఆయన “అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్న ఉగ్రవాదం, పర్యావరణ పతనం, ఆర్థిక అస్థిరత వంటి ప్రమాదాల గురించి” మాట్లాడాడు. షావాబ్‌ ఇలా ముగించాడు: “ముందెన్నడూ లేనంతగా ప్రపంచం ఇప్పుడు సమిష్టిగానే కాక, నిర్ణయాత్మకంగానూ చర్య తీసుకోవలసిన అవసరమున్న వాస్తవిక పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.” ఈ 21వ శతాబ్దం ముందుకు సాగుతుండగా, మానవజాతి భవిష్యత్తు గురించి అనేకమంది దృక్కోణం నిస్తేజంగా ఉంది.

10 మానవాళి సమస్యలన్నింటినీ పరిష్కరించే ఏర్పాటును యెహోవా చేశాడని అంటే దేవుని మెస్సీయ రాజ్యాన్ని ఏర్పరిచాడని తెలుసుకోవడం ఎంత సంతోషకరమో కదా! దాని మూలంగా సత్యదేవుడు ‘యుద్ధాలను మాన్పి,’ విస్తారమైన ‘క్షేమాభివృద్ధి’ కలుగజేస్తాడు. (కీర్తన 46:⁠9; 72:⁠7) అభిషిక్త రాజైన యేసుక్రీస్తు ‘దరిద్రులను, దీనులను విడిపించి, నిరుపేదలను కపట బలత్కారము నుండి విమోచిస్తాడు.’ (కీర్తన 72:​12-​14) రాజ్య పరిపాలన క్రింద, ఆహార కొరత ఉండదు. (కీర్తన 72:​16) యెహోవా “[మన] కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైననూ, వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను.” (ప్రకటన 21:⁠4) ఆ రాజ్యము ఇప్పటికే పరలోకంలో స్థాపించబడింది, అది త్వరలోనే ఈ భూమ్మీది ప్రతీ సమస్యను పరిష్కరించడానికి అవసరమైన చర్యను తీసుకుంటుంది.​—⁠దానియేలు 2:​44; ప్రకటన 11:​15.

11 నిజమైన సంతోషాన్ని తీసుకొచ్చేదేదో మనకు తెలుసు. ఏది నిజమైన సంతోషాన్ని తీసుకొస్తుంది? సంతోషంలో మూడు అంశాలు అంటే సుఖానుభూతి, భాగం వహించడం, (ఉద్యోగ, కుటుంబ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడం) సంకల్పం (స్వార్థం కోసం కాక ఇతరుల ప్రయోజనార్థం లేదా ఒక లక్ష్యం కోసం పనిచేయడం) ఉన్నాయని ఒక మానసిక శాస్త్రవేత్త అన్నాడు. ఆ మూడింటిలో సుఖానుభూతి తక్కువ ప్రాముఖ్యమైనదని పేర్కొంటూ, ఆయనిలా అన్నాడు: “ఇది ప్రజలకు ఆసక్తికరమైన విషయం ఎందుకంటే చాలామంది సుఖానుభవాన్ని వెంబడించడం మీదే తమ జీవితాల్ని కేంద్రీకరిస్తారు.” ఈ విషయంలో బైబిలు దృక్కోణమేమిటి?

12 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన సొలొమోను ఇలా అన్నాడు: “నిన్ను సంతోషముచేత శోధించి చూతును​—⁠నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్నమాయెను. నవ్వుతో​—⁠నీవు వెఱ్ఱిదానవనియు, సంతోషముతో​—⁠నీచేత కలుగునదేమియనియు నేనంటిని.” (ప్రసంగి 2:​1, 2) లేఖనానుసారంగా, సుఖానుభవంవల్ల కలిగే ఎలాంటి సంతోషమైనా తాత్కాలికమైనదే. మరి పనిలో భాగంవహించే విషయమేమిటి? మనం భాగం వహించగల అత్యంత అర్థవంతమైన పని అంటే రాజ్య ప్రకటనా పని, శిష్యులను చేసే పని మనకుంది. (మత్తయి 24:​14; 28:​19, 20) బైబిల్లో వివరించబడిన రక్షణ సందేశాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా, మనకూ, మనం చెప్పేది వినేవారికీ రక్షణ తీసుకురాగల పనిలో భాగం వహిస్తాం. (1 తిమోతి 4:​16) “దేవుని జతపనివారి[గా]” మనం ‘పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యమని’ అనుభవపూర్వకంగా గ్రహిస్తాం. (1 కొరింథీయులు 3:⁠9; అపొస్తలుల కార్యములు 20:​35) ఈ పని మన జీవితాలకు అర్థాన్నివ్వడమే కాక, సృష్టికర్తకు తనను నిందించే అపవాదియైన సాతానుకు జవాబిచ్చే అవకాశాన్ని కూడా ఇస్తుంది. (సామెతలు 27:​11) అవును, దైవభక్తి మనకు నిజమైన, శాశ్వతమైన సంతోషాన్ని తీసుకొస్తుందని యెహోవా చూపించాడు.​—⁠1 తిమోతి 4:⁠8.

13 ప్రాముఖ్యమైన, కార్యసాధకమైన శిక్షణా కార్యక్రమం. గెర్‌హార్ట్‌, యెహోవాసాక్షుల సంఘంలో ఒక పెద్దగా సేవ చేస్తున్నాడు. తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనిలా చెబుతున్నాడు: “బాలునిగా ఉన్నప్పుడు మాట్లాడ్డం నాకు పెద్ద సమస్యగా ఉండేది. ఒత్తిడికి గురైనప్పుడు, స్పష్టంగా మాట్లాడలేకపోయేవాడిని, మాట తడబడేది. న్యూనతా భావంతో నేను కృంగిపోయేవాడిని. మా తల్లిదండ్రులు నేను స్పీకింగ్‌ కోర్స్‌లో చేరే ఏర్పాటుచేశారు, అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. నాది శారీరక సమస్య కాదు మానసిక సమస్య. అయితే యెహోవా ఒక అద్భుతమైన ఏర్పాటును అంటే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలను ఏర్పాటు చేశాడు. ఈ పాఠశాలలో చేరడం నాకు ధైర్యాన్నిచ్చింది. నేను నేర్చుకున్నది అభ్యసించడానికి శాయశక్తులా కృషి చేశాను. అది పనిచేసింది! నేను స్పష్టంగా మాట్లాడ్డం మొదలుపెట్టి, న్యూనతా భావాన్ని అధిగమించి, పరిచర్యలో మరింత ధైర్యంగా కొనసాగాను. నేనిప్పుడు బహిరంగ ప్రసంగాలు కూడా ఇస్తున్నాను. ఈ పాఠశాల ద్వారా నాకొక క్రొత్త జీవితాన్నిచ్చినందుకు నేను నిజంగా యెహోవాకు కృతజ్ఞుడను.” మనమాయన పని చేసేందుకు యెహోవా ఈ విధంగా శిక్షణ ఇవ్వడం ఆనందించడానికొక కారణం కాదా?

14 యెహోవాతో వ్యక్తిగత సంబంధం, ఐక్యతగల అంతర్జాతీయ సహోదరత్వపు మద్దతు. జర్మనీలో నివసిస్తున్న కాట్రీన్‌, ఈశాన్య ఆసియాలో తీవ్ర భూకంపం, దాని ఫలితంగా విరుచుకుపడిన సునామీ సంబంధిత నివేదికలు విన్నప్పుడు ఎంతో దిగులుపడింది. ఆ విపత్తు జరిగినప్పుడు ఆమె కుమార్తె థాయ్‌లాండ్‌ను సందర్శించడానికి వెళ్ళింది. ఆ తర్వాత 32 గంటలవరకు తన కుమార్తె బ్రతికివుందో లేక గంటగంటకు సంఖ్య పెరుగుతున్న క్షతగాత్రుల్లో ఉందో ఆమెకు తెలియలేదు. చివరకు కాట్రీన్‌కు ఆమె కూతురు సురక్షితంగానే ఉందని ఫోను ద్వారా తెలిసినప్పుడు ఆమె మనసు కుదుటపడింది!

15 అన్ని గంటలు ఆందోళన కలిగించిన ఆ సమయాన్ని తాళుకునేందుకు కాట్రీన్‌కు ఏమి సహాయం చేసింది? ఆమె ఇలా వ్రాస్తోంది: “దాదాపు ఆ సమయమంతటినీ నేను యెహోవాకు ప్రార్థిస్తూ గడిపాను. అది పదేపదే నాకెంత బలాన్నీ, మనశ్శాంతినీ ఇచ్చిందో నేను గమనించాను. అంతేకాక, ప్రేమగల ఆధ్యాత్మిక సహోదరులు నన్ను సందర్శించి నాకు అండగా నిలబడ్డారు.” (ఫిలిప్పీయులు 4:​6, 7) ప్రార్థించే అవకాశం, ప్రేమగల ఆధ్యాత్మిక సహోదరత్వపు ఆదరణ లేకపోతే ఆ బాధాకరమైన సమయంలో ఆమె పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదో కదా! యెహోవాతో, ఆయన కుమారునితో మనకున్న దగ్గరి సంబంధంతోపాటు క్రైస్తవ సహోదరత్వంతో మనకున్న సన్నిహిత సహవాసం ఏ మాత్రం తేలికగా తీసుకోకూడని ప్రశస్తమైన, నిరుపమానమైన ఆశీర్వాదం!

16 చనిపోయిన ప్రియమైనవారిని మళ్లీ చూస్తామనే నిరీక్షణ. (యోహాను 5:​28, 29) మాటియాస్‌ అనే యౌవనుడు ఒక యెహోవాసాక్షిగా పెంచబడ్డాడు. అయితే తనకు లభించే ఆశీర్వాదాల విలువను గ్రహించక కౌమార ప్రాయంలోనే నెమ్మదిగా క్రైస్తవ సంఘానికి దూరమయ్యాడు. ఇప్పుడు ఆయనిలా వ్రాస్తున్నాడు: “నేనెప్పుడూ నిజంగా మా నాన్నతో లోతుగా చర్చించలేదు. సంవత్సరాలు గడిచేకొద్దీ మాకెన్నో విభేదాలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ, మా నాన్న ఎల్లప్పుడూ నేను మంచిగా జీవించాలనే కోరుకున్నాడు. ఆయన నన్నెంతో ప్రేమించాడు, అయితే అప్పట్లో నేనది గ్రహించలేదు. కానీ 1996లో ఆయన మంచం ప్రక్కనే కూర్చొని, ఆయన చేతులు పట్టుకొని, పశ్చాత్తాపంతో ఏడుస్తూ నేను చేసినదానంతటికీ క్షమాపణ కోరుతూ ఆయననెంతో ప్రేమిస్తున్నానని చెప్పాను. అయితే నేను చెప్పే మాటలు ఆయన వినలేదు. కొద్దికాలం వ్యాధితో బాధపడి, చివరికాయన చనిపోయాడు. పునరుత్థానంలో మా నాన్నను చూసేందుకు నేను బ్రతికుంటే, గత పరిస్థితిని సరిదిద్దుకుంటాం. నేనిప్పుడు ఒక పెద్దగా సేవచేస్తున్నాననీ, నాకూ నా భార్యకూ పయినీర్లుగా సేవచేసే ఆధిక్యత లభించిందనీ తెలుసుకొని ఆయన ఖచ్చితంగా ఆనందిస్తాడు.” పునరుత్థాన నిరీక్షణ మనకెంతటి ఆశీర్వాదమో కదా!

‘ఆయన దానితోపాటు ఏ కష్టాన్నీ తీసుకురాడు’

17 యేసుక్రీస్తు తన పరలోకపు తండ్రి గురించి ఇలా చెప్పాడు: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్తయి 5:​45) యెహోవా తన ఆశీర్వాదాలను అనీతిమంతులమీద, చెడ్డవారిమీద కూడా కురిపిస్తున్నాడంటే, యథార్థతా మార్గంలో నడిచేవారిని మరెంతగా ఆశీర్వదిస్తాడో కదా! “యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన యే మేలును చేయక మానడు” అని కీర్తన 84:⁠11 చెబుతోంది. తనను ప్రేమించేవారిపట్ల ఆయన చూపే ప్రత్యేకమైన శ్రద్ధాసక్తుల గురించి మనం ధ్యానించినప్పుడు, మన హృదయాలు కృతజ్ఞతాభావంతో, ఆనందంతో ఎంతగా ఉప్పొంగుతాయో కదా!

18 “యెహోవా ఆశీర్వాదము” తన ప్రజలకు ఆధ్యాత్మిక అభివృద్ధినిచ్చింది. ‘ఆయన దానితోపాటు ఏ కష్టాన్నీ తీసుకురాడు,’ అని మనకు అభయమివ్వబడింది. (సామెతలు 10:​22, NW) మరైతే, యథార్థవంతులైన దేవుని ప్రజల్లో అనేకులు బాధ, వేదన కలుగజేసే శ్రమల్ని, శోధనల్ని ఎందుకు ఎదుర్కొంటున్నారు? కష్టాలు, బాధలు కలగడానికి 3 ప్రాముఖ్యమైన కారణాలున్నాయి. (1) మనలోని పాపపు స్వభావం. (ఆదికాండము 6:⁠5; 8:​21; యాకోబు 1:​14, 15) (2) సాతాను అతని దయ్యాలు. (ఎఫెసీయులు 6:​11, 12) (3) దుష్టలోకం. (యోహాను 15:​19) మనకు చెడు సంగతులు సంభవించడానికి యెహోవా అనుమతిస్తున్నప్పటికీ ఆయన వాటికి కారకుడు కాదు. నిజానికి, “శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును.” (యాకోబు 1:​17) యెహోవా ఆశీర్వాదాలతోపాటు ఏ కష్టమూ కలుగదు.

19 ఆధ్యాత్మిక అభివృద్ధిని అనుభవించడంలో ఎల్లప్పుడూ దేవునితో సన్నిహిత సంబంధం ఇమిడివుంది. దేవునితో సన్నిహిత సంబంధాన్ని పెంచుకున్నప్పుడు, మనం ‘వాస్తవమైన జీవమును’ అంటే నిత్యజీవమును ‘సంపాదించుకొను నిమిత్తం, రాబోవు కాలమునకు మంచి పునాది వేసికొంటాం.’ (1 తిమోతి 6:​12, 17-​19) రాబోయే దేవుని నూతనలోకంలో, మన ఆధ్యాత్మిక సంపత్తి భౌతికాశీర్వాదాలతో రెండింతలౌతుంది. ఆ వాస్తవమైన జీవం “యెహోవా మాట వినిన” వారందరి సొంతమవుతుంది. (ద్వితీయోపదేశకాండము 28:⁠2) మరింత బలోపేతమైన తీర్మానంతో, మనం ఆనందంగా నిరంతరం యథార్థతా మార్గంలో నడుద్దాం.

మీరేమి తెలుసుకున్నారు?

• భవిష్యత్తు గురించి అధికంగా తలంచడం ఎందుకు అవివేకం?

• మనమిప్పుడు ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాం?

• దేవుని నమ్మకమైన సేవకులు ఎందుకు బాధలు అనుభవిస్తున్నారు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా మనమెందుకు జాగ్రత్తపడాలి?

3. ఈ ఆర్టికల్‌లో దేనిపై మన అవధానాన్ని కేంద్రీకరిస్తాం?

4, 5. ఏ బైబిలు బోధను మీరు ప్రత్యేకంగా విలువైనదిగా పరిగణిస్తారు, ఎందుకు?

6, 7. మీ జీవితంలోని లేదా మీకు తెలిసిన ఇతరుల జీవితంలోని ఏ మార్పులు ఆశీర్వాదంగా నిరూపించబడ్డాయి?

8. సంతోషభరిత కుటుంబ జీవితానికి ఏ బైబిలు ఆధారిత సలహా తోడ్పడుతుంది?

9, 10. భవిష్యత్తు గురించిన మన దృక్కోణం, లోక దృక్కోణానికి ఎలా భిన్నంగా ఉంది?

11, 12. (ఎ) సుఖానుభవాన్ని వెంబడించడం నిత్య సంతోషాన్ని తీసుకొస్తుందా? వివరించండి. (బి) ఏది నిజమైన సంతోషాన్ని తీసుకొస్తుంది?

13. (ఎ) మనం ఆనందించేందుకు దైవపరిపాలనా పాఠశాల ఏ విధంగా ఒక ఆశీర్వాదంగా ఉంది? (బి) దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి మీరెలా ప్రయోజనం పొందారు?

14, 15. ఆందోళన కలిగించే సమయాల్లో మనకు సత్వరమే ఏ సహాయం అందుబాటులో ఉంది? ఉదాహరించండి.

16. పునరుత్థాన నిరీక్షణా విలువను ఉదాహరించే ఒక అనుభవాన్ని వివరించండి.

17. యెహోవా ఆశీర్వాదాలను ధ్యానించడం మనకెలా సహాయం చేస్తుంది?

18. (ఎ) యెహోవా ఆశీర్వాదాలతోపాటు ఏ కష్టాన్నీ తీసుకురాడని ఎలా చెప్పవచ్చు? (బి) యథార్థవంతులైన దేవుని ప్రజల్లో చాలామంది ఎందుకు బాధలు అనుభవిస్తున్నారు?

19. నిరంతరం యథార్థతా మార్గంలో నడిచేవారికోసం ఏమి వేచివుంది?