కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

రక్షించబడేందుకు మీరు సిద్ధంగావున్నారా?

రక్షించబడేందుకు మీరు సిద్ధంగావున్నారా?

రక్షించబడేందుకు మీరు సిద్ధంగావున్నారా?

“ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.”​—⁠ఆదికాండము 7:⁠1.

నోవహు కాలంలో యెహోవా, “భక్తిహీనుల సమూహము మీదికి జలప్రళయము రప్పిం[చాడు],” అయితే ఆయన రక్షణకోసం ఏర్పాటుకూడా చేశాడు. (2 పేతురు 2:⁠5) సత్య దేవుడు, ఆ భౌగోళిక జలప్రళయం నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఓడనెలా నిర్మించాలో నీతిమంతుడైన నోవహుకు నిర్దిష్టమైన సూచనలిచ్చాడు. (ఆదికాండము 6:​14-​16) యెహోవా విశ్వసనీయ సేవకుడు ఎలా ఉండాలని మనం ఎదురుచూస్తామో, అలాగే ‘నోవహు, దేవుడు తనకాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.’ అవును, ఆయన ‘అలాగే చేశాడు.’ కొంతమేరకు నోవహు విధేయత కారణంగానే మనమీరోజు సజీవంగా ఉన్నాం.​—⁠ఆదికాండము 6:​22.

2 ఓడను నిర్మించడం చిన్నపనేమీ కాదు. నోవహు, ఆయన కుటుంబం చేస్తున్న పనిచూసి చాలామంది బహుశా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. అయితే, ఓడలోకి ప్రవేశించడం మీదే రక్షణ ఆధారపడివుందని ఆ ప్రజలను ఒప్పించేందుకు కేవలం ఓడను నిర్మించడం మాత్రమే సరిపోలేదు. చివరకు, ఆ దుష్టలోకం విషయంలో దేవుని ఓపిక నశించింది.​—⁠ఆదికాండము 6:3; 1 పేతురు 3:​20.

3 నోవహు ఆయన కుటుంబం కష్టపడి పనిచేసిన అనేక దశాబ్దాల తర్వాత యెహోవా నోవహుకు ఇలా చెప్పాడు: “ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి.” యెహోవా మాటలపై నమ్మకంతో “నోవహును అతనికూడ అతని కుమారులును, అతని భార్యయు అతని కోడండ్రును . . . ఓడలో ప్రవేశించిరి.” తన ఆరాధకులను రక్షించేందుకు యెహోవాయే ఓడ తలుపును మూసేశాడు. భూమ్మీద జలప్రళయం వచ్చినప్పుడు, ఆ ఓడే రక్షణకోసం దేవుడు ఏర్పాటుచేసిన ఆధారమని రుజువైంది.​—⁠ఆదికాండము 7:​1, 7, 10, 16.

నోవహు కాలానికి ఆధునిక సాదృశ్యాలు

4 “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును [‘ప్రత్యక్షతయు,’ NW] ఆలాగే ఉండును.” (మత్తయి 24:​37) ఈ మాటలతో యేసు, తన అదృశ్య ప్రత్యక్షతా కాలం నోవహు కాలంలాగే ఉంటుందని సూచించాడు, అది నిజంగా అలాగే ఉంది. ప్రత్యేకంగా 1919 నుండి, నోవహు ప్రకటించినలాంటి హెచ్చరికా సందేశమే అన్ని జనాంగాల ప్రజలకు ప్రకటించబడుతోంది. సాధారణంగా వారి స్పందన కూడా నోవహు కాలంలోని ప్రజల స్పందనలాగే ఉంది.

5 జలప్రళయం ద్వారా యెహోవా “బలత్కారముతో నిండియున్న” లోకంపై చర్య తీసుకున్నాడు. (ఆదికాండము 6:​13) నోవహు ఆయన కుటుంబం అలాంటి బలత్కారంలో భాగం వహించకుండా ప్రశాంతంగా ఓడ నిర్మించడం, వారిని గమనిస్తున్నవారికి స్పష్టంగా కనిపించింది. ఇందులో కూడా మనకాలపు సాదృశ్యాన్ని చూడవచ్చు. “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” యథార్థవంతులు ఇప్పుడు చూడవచ్చు. (మలాకీ 3:​18) యెహోవాసాక్షులు కనబరిచే నిజాయితీని, దయను, శాంతితత్వాన్ని, శ్రద్ధను నిష్పక్షపాత ప్రజలు ఆశ్చర్యంతో గమనిస్తున్నారు, ఈ లక్షణాలు దేవుని ప్రజలను, సాధారణ లోకం నుండి భిన్నంగా ఉంచుతున్నాయి. సాక్షులు సమస్త బలత్కారాన్ని విసర్జిస్తూ యెహోవా ఆత్మ తమను పురికొల్పేందుకు అనుమతిస్తారు. అందుకే వారు సమాధానంతో ఆశీర్వదించబడ్డారు, అందుకే వారు నీతియుక్త మార్గాన్ని వెంబడిస్తున్నారు.​—⁠యెషయా 60:17.

6 నోవహుకు దేవుని మద్దతు ఉందనీ, ఆయన దేవుని నిర్దేశాన్ని అనుసరిస్తున్నాడనీ నోవహు సమకాలీనులు గ్రహించలేదు. కాబట్టి, వారాయన ప్రకటిస్తున్నది గంభీరంగా పరిగణించలేదు, ఆయనిచ్చిన హెచ్చరికా సందేశాన్నిబట్టి చర్య తీసుకోలేదు. మరి నేటి విషయమేమిటి? చాలామంది యెహోవాసాక్షుల పనిని, ప్రవర్తనను ప్రశంసించినా, వారు సువార్తను, బైబిలు హెచ్చరికల్ని గంభీరంగా తీసుకోవడం లేదు. పొరుగువారు, యజమానులు లేదా బంధువులు నిజ క్రైస్తవుల చక్కని లక్షణాలను మెచ్చుకోవచ్చు, కానీ “వారు యెహోవాసాక్షులు కాకపోతే ఎంత బాగుండేది!” అని విచారిస్తారు. అయితే ఇలా మాట్లాడేవారు, ప్రేమ, సమాధానం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశానిగ్రహం వంటి లక్షణాలను సాక్షులు కనబరచడానికి కారణం, వారు దేవుని పరిశుద్ధాత్మచేత నడిపించబడుతున్నారనే విషయాన్ని గమనించడం లేదు. (గలతీయులు 5:​22-​25) సాక్షులు కనబరిచే ఈ లక్షణాలు వారి సందేశాన్ని ప్రజలు నమ్మేలా చేయాలి.

7 ఉదాహరణకు, రష్యాలో యెహోవాసాక్షులు ఒక రాజ్యమందిరం నిర్మిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నవారిలో ఒకరితో మాట్లాడేందుకు ఆగిన ఒక వ్యక్తి ఇలా అడిగాడు: “ఎంత విచిత్రమైన నిర్మాణ స్థలం​—⁠సిగరెట్లు లేవు, మొరటుగా మాట్లాడడం లేదు, ఎవరూ త్రాగినట్లుగా కనబడడం లేదు! మీరు పొరపాటున యెహోవాసాక్షులు కాదుగదా?” దానికి, అక్కడ పనిచేస్తున్న ఆ వ్యక్తి “కాదు అని నేను చెప్తే మీరు నమ్ముతారా?” అని అతణ్ణి అడిగాడు. దానికతడు వెంటనే “నమ్మనే నమ్మను” అని జవాబిచ్చాడు. రష్యాలోని మరో నగరంలో, సాక్షులు సొంతగా తమ క్రొత్త రాజ్యమందిరం నిర్మించుకోవడం చూసినప్పుడు ఆ నగర మేయర్‌ ఎంతో ముగ్ధుడయ్యాడు. అన్ని మత గుంపులు ఒకలాగే ఉంటాయని తానొకప్పుడు తలంచినా, యెహోవాసాక్షుల నిష్కపటమైన నిస్వార్థతను కార్యరూపంలో చూసిన తర్వాత, తానిక ఏ మాత్రం అలా తలంచడంలేదని చెప్పాడు. బైబిలు ప్రమాణాలకు హత్తుకోనివారికి యెహోవా ప్రజలకు మధ్య వ్యత్యాసముందని చూపించడానికి ఇవి కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే.

8 జలప్రళయంలో నాశనమైన “పూర్వకాలమందున్న లోకము” యొక్క అంత్యకాలంలో నోవహు నమ్మకంగా ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:⁠5) ప్రస్తుతకాల ఈ అంత్యదినాల్లో యెహోవా ప్రజలు దేవుని నీతి ప్రమాణాలను తెలియజేస్తూ, నూతనలోకంలోకి రక్షించబడే అవకాశముందనే సువార్తను ప్రకటిస్తున్నారు. (2 పేతురు 3:​9-​13) నోవహు, దైవభక్తిగల ఆయన కుటుంబం ఓడలో కాపాడబడినట్లే, నేడు ఆయా వ్యక్తులు రక్షించబడడం వారి విశ్వాసంపై, యెహోవా విశ్వ సంస్థయొక్క భూసంబంధ భాగంతో వారు విశ్వసనీయంగా సహవసించడంపై ఆధారపడివుంది.

రక్షించబడాలంటే విశ్వాసం అవసరం

9 సాతాను అధికారం క్రిందవున్న ఈ లోకానికి రాబోయే నాశనం నుండి రక్షించబడాలంటే ఒక వ్యక్తి ఏమి చేయాలి? (1 యోహాను 5:​19) ఆయన మొదట తాను కాపాడబడవలసిన అవసరతను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆయన అలాంటి కాపుదలను సద్వినియోగం చేసుకోవాలి. నోవహు కాలంనాటి ప్రజలు మామూలుగానే తమ దైనందిన వ్యవహారాల్లో మునిగిపోయి, రానున్న విపత్తునుండి కాపాడబడవలసిన అవసరతను చూడలేదు. వారిలో మరో విషయం కొరవడింది, అదే దేవునిపై విశ్వాసం.

10 మరోవైపున, నోవహు ఆయన కుటుంబ సభ్యులు రక్షణకు, విడుదలకు సంబంధించిన అవసరతను గుర్తించారు. అలాగే వారు విశ్వ సర్వాధిపతియైన యెహోవా దేవునిపై విశ్వాసముంచారు. “విశ్వాసములేకుండ [యెహోవాకు] ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. ఆయనింకా ఇలా అన్నాడు: “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.”​—⁠హెబ్రీయులు 11:​6, 7.

11 ప్రస్తుత దుష్ట విధానాంతం నుండి రక్షించబడాలంటే, అది నాశనమౌతుందని నమ్మడం మాత్రమే సరిపోదు. రక్షణ కోసం దేవుడు చేసిన ఏర్పాట్లపై విశ్వాసం కలిగివుండాలి, ఆ ఏర్పాట్లను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అవును మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు విమోచన క్రయధన బలిపై విశ్వాసముంచాలి. (యోహాను 3:​16, 36) అయితే నోవహు ఓడలో ఉన్నవారు మాత్రమే జలప్రళయం నుండి రక్షించబడ్డారని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా, ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో పొరపాటున హత్యచేసిన వ్యక్తి ఆశ్రయపురములోనికి పరుగెత్తి, ప్రధానయాజకుని మరణంవరకు అక్కడే ఉన్నప్పుడు ఆ ఆశ్రయపురాలు కాపుదలనిచ్చేవి. (సంఖ్యాకాండము 35:​11-​32) మోషే కాలంలో ఐగుప్తులో సంభవించిన పదవ తెగులువల్ల ఐగుప్తీయుల తొలి సంతతి హతమవగా, ఇశ్రాయేలీయుల తొలి సంతతి తప్పించబడింది. ఎందుకు? యెహోవా మోషేను ఇలా ఆదేశించాడు: “ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు . . . దాని [పస్కా గొర్రెపిల్ల] రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను . . . తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.” (నిర్గమకాండము 12:​7, 22) ద్వారబంధముల మీద, నిలువు కమ్ముల మీద రక్తంతో గుర్తువేయబడిన ఇళ్లనుండి బయటకు వెళ్లడం ద్వారా దేవుని ఆదేశాలను ధిక్కరించేందుకు ఇశ్రాయేలీయుల ప్రథమ సంతతిలో ఎవరు సాహసించి ఉండేవారు?

12 కాబట్టి మనం మన వ్యక్తిగత పరిస్థితి గురించి జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరముంది. మనం నిజంగా, ఆధ్యాత్మిక రక్షణకై యెహోవా చేసిన ఏర్పాటు లోపలే ఉన్నామా? మహాశ్రమ వచ్చినప్పుడు, అలాంటి రక్షణను వెదకిన వారి కళ్లల్లోనుండి కృతజ్ఞతతో కూడిన ఆనందబాష్పాలు ప్రవహిస్తాయి. ఇతరులకు దుఃఖం, పరితాపంతో కూడిన కన్నీళ్లే మిగుల్తాయి.

ప్రగతిశీల సవరణలు మనల్ని సిద్ధం చేస్తాయి

13 యెహోవా తన సంస్థయొక్క భూసంబంధ భాగంలో ప్రగతిదాయకంగా సవరణలు తీసుకొచ్చాడు. అవి మన ఆధ్యాత్మిక రక్షణ కోసం ఆయన చేసిన ఏర్పాటును అలంకరించి, స్థిరపరచి, బలపరిచాయి. 1870ల నుండి 1932 వరకు పెద్దలు, డీకన్లు సంఘ సభ్యులచేత ఎన్నుకోబడేవారు. 1932లో, ఎన్నుకోబడే పెద్దల స్థానంలో నియమిత సేవా నిర్దేశకునికి సహాయం చేసేందుకు సంఘం ఒక సేవాకమిటీని ఎన్నుకునే పద్ధతి వచ్చింది. 1938వ సంవత్సరంలో సంఘ సేవకులందరినీ దైవపరిపాలనా రీతిలో నియమించే ఏర్పాట్లు చేయబడ్డాయి. యెహోవాసాక్షుల పరిపాలక సభ నిర్దేశం క్రింద 1972 నుండి, సిఫారసులు చేయబడుతున్నాయి, పైవిచారణకర్తలను, పరిచర్య సేవకులను దైవపరిపాలనా రీతిలో నియమించే ఉత్తరాలు సంఘాలకు పంపించబడుతున్నాయి. కాల ప్రవాహంలో పరిపాలక సభపై పనిభారం పెరగడంతో, దాని పనిని సుళువు చేసేందుకు మార్పులు చేయబడ్డాయి.

14 వెనకటికి 1950లో, కీర్తన 45:⁠16ను జాగ్రత్తగా పరిశీలించడం నిరంతర శిక్షణా కార్యక్రమానికి దారితీసింది. ఆ వచనం ఇలా చదవబడుతోంది: “నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు, భూమియందంతట నీవు వారిని అధికారులనుగా నియమించెదవు.” ఇప్పుడు సంఘాల్లో సారథ్యం వహిస్తున్న పెద్దలు ప్రస్తుతమూ, అర్మగిద్దోను తర్వాతి కాలంలోనూ దైవపరిపాలనా విధులు నిర్వహించేందుకు శిక్షణ పొందుతున్నారు. (ప్రకటన 16:​14-16) రాజ్య పరిచర్య పాఠశాల 1959లో ఆరంభించబడింది. అప్పట్లో సంఘ సేవకులని పిలవబడిన సంఘ పైవిచారణకర్తలకు ప్రాథమికంగా ఒక నెలపాటు ఉపదేశ కోర్సు నిర్వహించబడేది. ఈ పాఠశాల ఇప్పుడు పైవిచారణకర్తలకు, పరిచర్య సేవకులకు ఉపదేశమిచ్చేందుకు విస్తరింపజేయబడింది. ఈ సహోదరులు తిరిగి, తమతమ సంఘాల్లోని ఆయా యెహోవాసాక్షులకు శిక్షణ ఇవ్వడంలో సారథ్యం వహిస్తారు. ఆ విధంగా, అందరికీ ఆధ్యాత్మికంగా సహాయం అందజేయబడుతోంది, రాజ్య సువార్త ప్రచారకులుగా తమ పరిచర్య సామర్థ్యాన్ని వృద్ధి చేసుకునేందుకు మద్దతు ఇవ్వబడుతోంది.​—⁠మార్కు 13:10.

15 క్రైస్తవ సంఘంలో భాగమయ్యేందుకు ఇష్టపడేవారు కొన్ని ప్రమాణాలు నెరవేర్చాలి. నేటి అపహాసకులు వెలుపటే ఉంచబడడం న్యాయసమ్మతమైనదే, నోవహు ఓడలోకి కూడా అలాంటివారు ప్రవేశించలేకపోయారు. (2 పేతురు 3:​3-7) ప్రత్యేకంగా 1952 నుండి, యెహోవాసాక్షులు సంఘాన్ని కాపాడడానికి సహాయపడే ఒక ఏర్పాటుకు మరింత మద్దతునిచ్చారు, పశ్చాత్తాపం చూపని పాపులను బహిష్కరించడమే ఆ ఏర్పాటు. అయితే, నిజంగా పశ్చాత్తాపపడిన దోషులకు ‘తమ పాదములకు మార్గములను సరళము చేసుకునేందుకు’ ప్రేమపూర్వక సహాయం చేయబడింది.​—⁠హెబ్రీయులు 12:​12, 13; సామెతలు 28:​13; గలతీయులు 6:⁠1.

16 యెహోవా ప్రజల ఆధ్యాత్మిక సుభిక్ష స్థితి అనుకోకుండా లేదా యాదృచ్ఛికంగా సంభవించింది కాదు. ప్రవక్తయైన యెషయా ద్వారా యెహోవా ఇలా చెప్పాడు: “ఆలకించుడి నా సేవకులు భోజనముచేయుదురు గాని మీరు ఆకలిగొనెదరు. నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిగొనెదరు. నా సేవకులు సంతోషించెదరు గాని మీరు సిగ్గుపడెదరు, నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరుగాని మీరు చింతాక్రాంతులై యేడ్చెదరు, మనో దుఃఖముచేత ప్రలాపించెదరు.” (యెషయా 65:​13, 14) మనల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచే సమయానుకూలమైన, ఆరోగ్యదాయకమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని యెహోవా సమృద్ధిగా, ఎడతెగక అందజేస్తూనే ఉన్నాడు.​—⁠మత్తయి 24:​45.

రక్షించబడేందుకు సిద్ధంగా ఉండండి

17 “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు . . . ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచిం[చవలసిన]” సమయమిదే. (హెబ్రీయులు 10:​23-25) 98,000కన్నా ఎక్కువగావున్న యెహోవాసాక్షుల సంఘాల్లో ఒకదానితో సన్నిహితంగా సహవసిస్తూ చురుగ్గా ఉండడం, రక్షించబడేందుకు మనల్నిమనం సిద్ధం చేసుకోవడానికి సహాయం చేస్తుంది. “నవీన స్వభావమును” కనబరిచేందుకు కృషిచేస్తూ, రక్షణకై యెహోవా చేసిన ఏర్పాటు గురించి తెలుసుకునేలా ఇతరులకు సహాయం చేయాలని పూర్ణహృదయంతో ప్రయత్నించే తోటి విశ్వాసుల మద్దతు మనకుంటుంది.​—⁠ఎఫెసీయులు 4:​22-​24; కొలొస్సయులు 3:​9, 10; 1 తిమోతి 4:​16.

18 సాతాను అతని దుష్టలోకం మనల్ని క్రైస్తవ సంఘం నుండి దూరం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా, మనమా సంఘంలో భాగంగా ఉండడమే కాక, ప్రస్తుత దుష్ట విధానాంతం నుండి కూడా తప్పించుకోవచ్చు. యెహోవాపట్ల, ఆయన ప్రేమపూర్వక ఏర్పాట్లపట్ల మనకున్న ప్రేమ సాతాను ప్రయత్నాలను అడ్డుకునేందుకు మరింత దృఢంగా తీర్మానించుకునేలా మనల్ని పురికొల్పును గాక! మన ప్రస్తుత ఆశీర్వాదాలను ధ్యానించడం మన తీర్మానాన్ని బలపరుస్తుంది. వీటిలోని కొన్ని ఆశీర్వాదాలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి.

మీ జవాబులు ఏమిటి?

• మన కాలాలు ఏ విధంగా నోవహు కాలానికి సాదృశ్యంగా ఉన్నాయి?

• రక్షించబడేందుకు ఏ లక్షణం అవసరం?

• రక్షణ కోసం యెహోవా చేసిన ఏర్పాటును ఏ ప్రగతిశీల సవరణలు బలపరిచాయి?

• రక్షించబడేందుకు వ్యక్తిగతంగా మనమెలా సిద్ధపడవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. నోవహు కాలంలో రక్షణకు సంబంధించి యెహోవా ఎలాంటి ఏర్పాటు చేశాడు?

2, 3. (ఎ) నోవహు సమకాలీనులు ఆయన చేపట్టిన పనికి ఎలా స్పందించారు? (బి) ఏ నమ్మకంతో నోవహు ఓడలో ప్రవేశించాడు?

4, 5. (ఎ) యేసు తన ప్రత్యక్షతా కాలాన్ని దేనితో పోల్చాడు? (బి) నోవహు కాలానికీ, మన కాలానికీ మధ్య ఎలాంటి సాదృశ్యాలున్నాయి?

6, 7. (ఎ) నోవహు కాలంనాటి ప్రజలు దేనిని గ్రహించడంలో విఫలమయ్యారు, నేటి ప్రజలు కూడా ఎలా ఆ విధంగానే ఉన్నారు? (బి) సాధారణంగా యెహోవాసాక్షులు భిన్నమైనవారిగా గుర్తించబడతారని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి?

8. ఈ దుష్ట లోకాంతం నుండి మనం రక్షించబడడం దేనిపై ఆధారపడివుంది?

9, 10. సాతాను విధానాంతం నుండి రక్షించబడాలంటే మనకు విశ్వాసమెందుకు అత్యావశ్యకం?

11. పూర్వకాలాల్లో యెహోవా ఏర్పాటుచేసిన రక్షణనుండి మనమేమి తెలుసుకోవచ్చు?

12. మనలో ప్రతీ ఒక్కరమూ ఏమని ప్రశ్నించుకోవాలి, ఎందుకు?

13. (ఎ) సంస్థాగత సవరణలు ఏ సంకల్పాన్ని నెరవేర్చాయి? (బి) కొన్ని ప్రగతిశీల సవరణలను వివరించండి.

14. ఏ శిక్షణా కార్యక్రమం 1959లో ఆరంభమైంది?

15. సంఘ స్వచ్ఛతను కాపాడే రెండు మార్గాలు ఏమిటి?

16. యెహోవా ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎలావుంది?

17. రక్షణ పొందేలా సిద్ధపడేందుకు మనకేది సహాయం చేస్తుంది?

18. క్రైస్తవ సంఘానికి సన్నిహితంగా ఉండాలని మీరు ఎందుకు తీర్మానించుకున్నారు?

[22వ పేజీలోని చిత్రం]

నోవహు సమకాలీనులు ఆయన సందేశాన్ని గంభీరంగా పరిగణించలేదు

[23వ పేజీలోని చిత్రం]

దేవుని హెచ్చరికా సందేశాలను గంభీరంగా పరిగణించడం ప్రయోజనకరం

[24వ పేజీలోని చిత్రం]

రాజ్య పరిచర్య పాఠశాల ఏ సంకల్పాన్ని నెరవేరుస్తోంది?

[25వ పేజీలోని చిత్రం]

క్రైస్తవ సంఘానికి సన్నిహితంగా ఉండవలసిన సమయమిదే