కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కీర్తనల ద్వితీయ స్కంధములోని ముఖ్యాంశాలు

కీర్తనల ద్వితీయ స్కంధములోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

కీర్తనల ద్వితీయ స్కంధములోని ముఖ్యాంశాలు

యెహోవా సేవకులముగా మనకు శ్రమలు, పరీక్షలు వస్తాయని తెలుసు. “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అని అపొస్తలుడైన పౌలు వ్రాశాడు. (2 తిమోతి 3:​12) శ్రమలు, హింసలు సహించి దేవునిపట్ల మన యథార్థతను నిరూపించుకోవడానికి మనకు ఏమి సహాయం చేస్తుంది?

కీర్తనల ఐదు స్కంధాల్లోని ద్వితీయ స్కంధము ఆ సహాయాన్ని అందజేస్తుంది. మనం శ్రమలను విజయవంతంగా సహించాలంటే మనం యెహోవాపై సంపూర్ణ నమ్మకం ఉంచాలని, విడుదల కోసం ఆయనపై ఆధారపడడాన్ని నేర్చుకోవాలని 42 నుండి 72 కీర్తనలు చూపిస్తున్నాయి. అది మనకెంత విలువైన పాఠమో కదా! కీర్తనల ద్వితీయ స్కంధములోని సందేశం, మిగతా దేవునివాక్యమంతటిలాగే, నేటికీ నిజంగా ‘సజీవమైనది, బలముగలది.’​—⁠హెబ్రీయులు 4:​12.

యెహోవా మనకు “ఆశ్రయమును దుర్గమునై యున్నాడు”

(కీర్తన 42:1-50:23)

ఒక లేవీయుడు చెరలో ఉన్నాడు. ఆరాధించడానికి తాను యెహోవా ఆలయానికి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతూ ఆయన తనను తాను ఇలా ఓదార్చుకుంటున్నాడు: “నా ప్రాణమా, నీవు ఏల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము.” (కీర్తన 42:5, 11; 43:⁠5) పదేపదే వచ్చే ఈ వచనం 42, 43 కీర్తనల మూడు చరణాలను ఒక కావ్యంగా కలుపుతుంది. 44వ కీర్తన యూదా కోసం చేయబడిన విజ్ఞప్తి. ఆ దేశం విపద్దశను అనుభవిస్తోంది, దానికి కారణం బహుశా అది హిజ్కియా రాజు కాలంలో అష్షూరీయుల దాడికి గురయ్యే ప్రమాదంలోవుండి ఉండవచ్చు.

45వ కీర్తన ఒక రాజు వివాహానికి సంబంధించినది, అది ప్రవచనార్థకంగా మెస్సీయ రాజును సూచిస్తుంది. తర్వాతి మూడు కీర్తనలు యెహోవాను, ‘ఆశ్రయముగా, దుర్గముగా,’ ‘సర్వభూమికి మహారాజుగా,’ “ఆశ్రయముగా” వర్ణిస్తున్నాయి. (కీర్తన 46:1; 47:2; 48:⁠3) ఏ మానవుడూ, “ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు” అని 49వ కీర్తన ఎంత చక్కగా చూపిస్తోందో కదా! (కీర్తన 49:⁠7) ద్వితీయ స్కంధములోని మొదటి ఎనిమిది కీర్తనలు కోరహు కుమారులు వ్రాసినట్లు చెప్పబడుతోంది. ఈ స్కంధములో తొమ్మిదవదైన 50వ కీర్తన, ఆసాపు కూర్చినది.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

44:19​—⁠“నక్కలున్నచోటు” అంటే ఏమిటి? కీర్తనకర్త బహుశా యుద్ధభూమిని ఉద్దేశించి మాట్లాడి ఉండవచ్చు, అక్కడ యుద్ధంలో మరణించేవారు నక్కలకు ఆహారమవుతారు.

45:​13, 14ఎ​—⁠“రాజు కుమార్తె” ఎవరు, ‘రాజునొద్దకు తీసుకురాబడేది’ ఎవరు? ఆమె “యుగములకు రాజు” అయిన యెహోవా దేవుని కుమార్తె. (ప్రకటన 15:⁠3) ఆమె 1,44,000 మంది క్రైస్తవుల మహిమాన్విత సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, యెహోవా వారిని తన పరిశుద్ధాత్మతో అభిషేకించడం ద్వారా తన పిల్లలుగా స్వీకరిస్తాడు. (రోమీయులు 8:​16) “తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి” ఉన్న, యెహోవా యొక్క ఈ “కుమార్తె,” పెండ్లి కుమారుని దగ్గరికి అంటే మెస్సీయ రాజు దగ్గరికి తీసుకురాబడుతుంది.​—⁠ప్రకటన 21:⁠2.

45:14బి, 15​—⁠“కన్యకలు” ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు? వారు, అభిషిక్త శేషముతో కలిసి, వారికి మద్దతిచ్చే సత్యారాధకుల “గొప్పసమూహము.” వారు “మహాశ్రమలను” తప్పించుకుని సజీవంగా ఉంటారు కాబట్టి, పరలోకంలో మెస్సీయ రాజు వివాహం ముగిసినప్పుడు వారు భూమిపై ఉంటారు. (ప్రకటన 7:​9, 13, 14) ఆ సందర్భంలో, వారు “ఉత్సాహ సంతోషములతో” నింపబడతారు.

45:16​—⁠రాజు పితరులకు ప్రతిగా కుమారులు ఎలా ఉంటారు? యేసు భూమిపై జన్మించినప్పుడు ఆయనకు భూసంబంధమైన పితరులున్నారు. ఆయన వారిని తన వెయ్యేండ్ల పరిపాలనలో పునరుత్థానం చేసినప్పుడు వారు ఆయన కుమారులవుతారు. వారిలో కొందరు ‘భూమియందంతట అధికారులుగా’ నియమించబడినవారిలో ఉంటారు.

50:2​—⁠యెరూషలేము “పరిపూర్ణ సౌందర్యముగలది” అని ఎందుకు పిలువబడుతోంది? అలా పిలువబడుతున్నది ఆ నగర రూపాన్నిబట్టి కాదు. బదులుగా, యెహోవా దాన్ని ఉపయోగించుకుని, దాన్ని తన ఆలయానికి తగిన స్థలంగా, తన అభిషిక్త రాజులకు రాజధానిగా ఎంచుకోవడం ద్వారా దానిపై మహిమను కుమ్మరించడమే దానికి కారణం.

మనకు పాఠాలు:

42:​1-3. నీరులేని ప్రదేశంలోవున్న దుప్పి నీటి కోసం ఆశించినట్లు లేవీయుడు యెహోవా కోసం తృష్ణగొన్నాడు. యెహోవాను ఆయన ఆలయంలో ఆరాధించలేకపోవడాన్నిబట్టి ఆయనకు ఎంత దుఃఖం కలిగిందంటే, ఆయనకు ఆకలి లేకుండాపోయి, ‘రాత్రింబగళ్ళు ఆయన కన్నీళ్ళే ఆయనకు అన్నపానములయ్యాయి.’ తోటి విశ్వాసులతో కలిసి యెహోవాను ఆరాధించడంపట్ల మనం ప్రగాఢమైన మెప్పును పెంపొందించుకోవద్దా?

42:4, 5, 11; 43:​3-5. మన అదుపులోలేని కారణాలనుబట్టి తాత్కాలికంగా మనం క్రైస్తవ సంఘం నుండి దూరంగా ఉండవలసి వస్తే, గతంలో అలాంటి సంఘ సహవాసం ద్వారా మనం పొందిన ఆనందాలు మనల్ని బలపరుస్తాయి. ఇది ప్రారంభంలో, ఒంటరితనపు బాధను అధికం చేసినా, దేవుడు మనకు ఆశ్రయమని, ఉపశమనం కావాలంటే మనం ఆయన కోసం ఎదురుచూడాలని కూడా మనకు గుర్తుచేస్తుంది.

46:​1-3. మనకు ఎలాంటి విపత్తు సంభవించినా, “దేవుడు మనకు ఆశ్రయము, దుర్గము” అనే అచంచలమైన విశ్వాసం మనకుండాలి.

50:​16-19. మోసపు మాటలు మాట్లాడేవారికి, చెడు కార్యాలు చేసేవారికి, దేవునికి ప్రాతినిధ్యం వహించే హక్కులేదు.

50:​20. ఇతరుల లోపాలను ఆతృతగా ప్రచారంచేసే బదులు, మనం వాటిని చూసీచూడనట్లు విడిచిపెట్టాలి.​—⁠కొలొస్సయులు 3:​13.

“నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము”

(కీర్తన 51:1-71:​24)

కీర్తనల ఈ భాగం, దావీదు బత్షెబతో పాపంచేసిన తర్వాత చేసిన హృదయపూర్వక ప్రార్థనతో ప్రారంభమవుతుంది. యెహోవాపై భారంవేసి ఆయన రక్షణ కోసం ఎదురుచూసేవారిని యెహోవా విమోచిస్తాడని 52 నుండి 57 వరకున్న కీర్తనలు చూపిస్తాయి. 58-64 కీర్తనల్లో వ్యక్తం చేయబడినట్లు, దావీదు తన కష్టాలన్నిటిలో యెహోవాను తన ఆశ్రయంగా చేసుకున్నాడు. ఆయనిలా పాడాడు: “నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది.”​—⁠కీర్తన 62:⁠5.

మన విమోచకునితో మనకున్న సాన్నిహిత్యం, మనం ‘ఆయన నామప్రభావము కీర్తించడానికి’ మనల్ని పురికొల్పాలి. (కీర్తన 66:​1) యెహోవా, 65 కీర్తనలో ఉదారంగా సమకూర్చే దాతగా, 67, 68 కీర్తనల్లో రక్షణకార్యాల దేవునిగా, 70, 71 కీర్తనల్లో విమోచకునిగా స్తుతించబడుతున్నాడు.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

51:12​—⁠దావీదు ఎవరి “సమ్మతిగల మనస్సు” యొక్క మద్దతు కావాలని కోరుకున్నాడు? ఇది దావీదుకు సహాయం చేయాలన్న దేవుని సుముఖతనుగానీ, యెహోవా పరిశుద్ధాత్మనుగానీ సూచించడం లేదు, అయితే ఇది దావీదు సొంత మనసును అంటే ఆయన మానసిక దృక్పథాన్ని సూచిస్తోంది. సరైనది చేయాలనే కోరికను తనలో కలుగజేయమని ఆయన దేవుణ్ణి కోరుతున్నాడు.

53:1​—⁠దేవుని ఉనికిని ఒప్పుకోని వ్యక్తి ఏ విధంగా ‘బుద్ధిహీనుడు’? ఇక్కడ ప్రస్తావించబడిన బుద్ధిహీనత మేధాసంబంధమైన లేమిని సూచించడం లేదు. అలాంటి వ్యక్తి నైతికంగా బుద్ధిహీనంగా ఉంటాడనే విషయాన్ని, తత్ఫలితంగా వచ్చే, నైతిక పతనం నుండి గ్రహించవచ్చు, దాని గురించి కీర్తన 53:1-4 వచనాల్లో వర్ణించబడింది.

58:​3-5​—⁠దుష్టులు ఏ విధంగా పామును పోలి ఉన్నారు? వారు ఇతరుల గురించి చెప్పే అబద్ధాలు పాము విషంలా ఉంటాయి. వారు తమ బాధితుల మంచి పేరును విషమయం చేస్తారు. ‘తన చెవి మూసికొనే పాములా’ దుష్టులు నడిపింపును లేక దిద్దుబాటును వినరు.

58:7​—⁠దుష్టులు “పారు నీళ్ళవలె” ఎలా “గతించిపోవుదురు”? దావీదు బహుశా వాగ్దానదేశంలోని కొన్ని లోయల్లో వడిగాపారే నీటి గురించి ఆలోచిస్తుండవచ్చు. వరద వచ్చినప్పుడు అలాంటి లోయలో నీటిమట్టం హఠాత్తుగా పెరిగిపోతుంది, ఈ నీరు వడిగా ప్రవహించి కనుమరుగైపోతుంది. దుష్టులు త్వరగా గతించిపోవాలని దావీదు ప్రార్థిస్తున్నాడు.

68:13​—⁠“గువ్వల రెక్కలు” ఎలా ‘వెండితోనూ వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతోనూ కప్పబడినట్టున్నాయి’? నీలం-బూడిద రంగుల్లో ఉండే కొన్నిరకాల గువ్వల ఈకలు వివిధ రంగులతో ప్రకాశిస్తూ ఉంటాయి. వాటి ఈకల మీద బంగారువన్నె సూర్యకాంతి పడినప్పుడు అవి తళతళ మెరుస్తున్నట్లు కనిపిస్తాయి. దావీదు బహుశా, యుద్ధంలో విజయం సాధించి తిరిగివస్తున్న ఇశ్రాయేలు యోధులను బలమైన రెక్కలు, ప్రకాశమానమైన రూపం ఉన్న అలాంటి గువ్వలతో పోలుస్తున్నాడు. కొంతమంది విద్వాంసులు సూచిస్తున్నట్లుగా, ఈ వర్ణన దోపుడుసొమ్ముగా తీసుకువస్తున్న కళాకృత్యానికి లేక విజయ చిహ్నానికి కూడా సరిపోతుంది. ఏదేమైనా దావీదు, యెహోవా తన ప్రజలకు వారి శత్రువుల మీద అనుగ్రహించిన విజయాలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు.

68:​18​—⁠“మనుష్యుల” రూపంలోవున్న “కానుకలు” ఎవరు? వీరు, వాగ్దానదేశం స్వాధీనం చేసుకోబడినప్పుడు చెరపట్టబడిన మనుష్యులు. వీరికి ఆ తర్వాత, లేవీయులకు సహాయం చేసే పని అప్పగించబడింది.​—⁠ఎజ్రా 8:​20.

68:30​—⁠“రెల్లులోని మృగమును” “గద్దించుము” అని చేయబడిన విన్నపం భావమేమిటి? దావీదు, యెహోవా ప్రజల శత్రువులను మృగములతో పోల్చి సూచనార్థకంగా మాట్లాడుతూ వారిని గద్దించమని, లేక హాని చేసేందుకు వారికున్న శక్తిని నియంత్రించమని దేవుణ్ణి అడుగుతున్నాడు.

69:⁠23​—⁠శత్రువుల ‘నడుములకు ఎడతెగని వణకు పుట్టించడం’ అంటే ఏమిటి? ఏదైనా బరువు ఎత్తడం, బరువులు మోసుకుని వెళ్ళడం వంటి శ్రమతో కూడిన పనులు చేయడానికి నడుము భాగంలోని కండరాలు ఎంతో ఆవశ్యకం. అస్థిరమైన నడుము శక్తిహీనతను సూచిస్తుంది. తన శత్రువులకు బలం లేకుండా చేయమని దావీదు ప్రార్థించాడు.

మనకు పాఠాలు:

51:​1-4, 17. పాపం చేయడం మనల్ని యెహోవా దేవుని నుండి దూరం చేయవలసిన అవసరం లేదు. మనం పశ్చాత్తాపపడితే, మనం ఆయన దయయందు నమ్మకం కలిగివుండవచ్చు.

51:​5, 7-10. మనం పాపం చేస్తే, మనకు వారసత్వంగా లభించిన పాపాన్నిబట్టి క్షమించమని యెహోవాకు విజ్ఞప్తి చేయవచ్చు. మనల్ని శుద్ధి చేయమని, పునఃస్థాపించమని, మన హృదయంలో నుండి పాపపు దృక్పథాలు తొలగించుకోవడానికి సహాయం చేయమని, స్థిరమైన మనసును ఇవ్వమని కూడా మనం ప్రార్థించాలి.

51:​18. దావీదు పాపాలు జనాంగమంతటి సంక్షేమానికి ముప్పు తెచ్చాయి. కాబట్టి ఆయన సీయోనుపట్ల దేవుని కటాక్షం కోసం ప్రార్థించాడు. మనమేదైనా గంభీరమైన పాపం చేసినప్పుడు, అది యెహోవా నామానికి, ఆయన సంఘానికి కళంకం తీసుకువస్తుంది. మన క్రియలవల్ల కలిగిన హానిని తొలగించమని మనం దేవునికి ప్రార్థించాలి.

52:⁠8. మనం యెహోవాకు విధేయత చూపించడం ద్వారా, ఆయనిచ్చే క్రమశిక్షణను ఇష్టపూర్వకంగా స్వీకరించడం ద్వారా, “దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలె” అంటే యెహోవాకు సన్నిహితంగా, ఆయన సేవలో ఫలవంతంగా ఉండవచ్చు.​—⁠హెబ్రీయులు 12:5, 6.

55:​4, 5, 12-14, 16-18. తన సొంత కుమారుడైన అబ్షాలోము కుట్ర, విశ్వసనీయ సలహాదారుడైన అహీతోపెలు నమ్మకద్రోహం దావీదుకు తీవ్రమైన మానసిక వేదన కలిగించాయి. అయితే, అది దావీదుకు యెహోవాపైనున్న నమ్మకాన్ని తగ్గించలేదు. మానసిక వేదన దేవునిపై మనకున్న నమ్మకాన్ని తగ్గించడానికి మనం అనుమతించకూడదు.

55:​22. మనం మన భారాన్ని యెహోవాపై ఎలా మోపుతాము? (1) చింత కలిగిస్తున్న విషయాన్ని ప్రార్థనలో ఆయనకు చెప్పడం ద్వారా, (2) నడిపింపు కోసం మద్దతు కోసం ఆయన వాక్యంపై, సంస్థపై ఆధారపడడం ద్వారా, (3) పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మనం సహేతుకంగా చేయగలిగింది చేయడం ద్వారా యెహోవాపై మన భారాన్ని మోపవచ్చు.​—⁠సామెతలు 3:5, 6; 11:14; 15:22; ఫిలిప్పీయులు 4:6, 7.

56:⁠8. యెహోవాకు మన పరిస్థితే కాదు అది మనపై చూపించే భావోద్వేగ ప్రభావం కూడా తెలుసు.

62:​11. దేవుడు బలం కోసం బాహ్య మూలంపై ఆధారపడవలసిన అవసరం లేదు. ఆయనే బలానికి మూలం. ‘బలము ఆయనది.’

63:⁠3. దేవుని “కృప జీవముకంటె ఉత్తమము,” ఎందుకంటే అది లేకపోతే జీవితానికి అర్థముండదు, సంకల్పముండదు. కాబట్టి మనం యెహోవాతో స్నేహం వృద్ధి చేసుకోవడం జ్ఞానయుక్తమైనది.

63:⁠6. అవధానాన్ని ప్రక్కకు మళ్ళించేవేవీ ఉండని ప్రశాంతమైన రాత్రి సమయం ధ్యానించడానికి చక్కని సమయంగా ఉండగలదు.

64:​2-4. హానికరమైన గాలి కబుర్లు అమాయకుని మంచి పేరును పాడుచేస్తాయి. మనం అలాంటి కబుర్లను విననూ కూడదు, వాటిని అందరికీ ప్రచారం చేయనూ కూడదు.

69:​4. మనం సమాధానాన్ని కాపాడడానికి, మనది తప్పనే నమ్మకం మనకు కుదరకపోయినా, క్షమాపణ చెప్పడం ద్వారా ‘ఇచ్చుకోవడం’ కొన్నిసార్లు జ్ఞానయుక్తమైనది.

70:​1-5. సహాయం కోసం మనం చేసే అత్యవసర విజ్ఞాపనలను యెహోవా వింటాడు. (1 థెస్సలొనీకయులు 5:17; యాకోబు 1:13; 2 పేతురు 2:⁠9) ఏదైనా ఒక పరీక్ష కొనసాగడానికి దేవుడు అనుమతిస్తుండవచ్చు, అయినా పరిస్థితితో వ్యవహరించడానికి కావలసిన జ్ఞానాన్ని, దాన్ని సహించడానికి కావలసిన బలాన్ని ఆయన మనకిస్తాడు. మనం సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధించబడడానికి ఆయన అనుమతించడు.​—⁠1 కొరింథీయులు 10:13; హెబ్రీయులు 10:36; యాకోబు 1:​5-8.

71:​5, 17. దావీదు ఫిలిష్తీయ శూరుడైన గొల్యాతును ఎదుర్కోకముందే, తన బాల్యంలోనే యెహోవాపై నమ్మకాన్ని పెంచుకోవడం ద్వారా ధైర్యాన్ని, బలాన్ని వృద్ధిచేసుకున్నాడు. (1 సమూయేలు 17:​34-37) యౌవనస్థులు తాము చేసే వాటన్నిటిలోనూ యెహోవాపై ఆధారపడడం మంచిది.

“సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక”

ద్వితీయ స్కంధములోని చివరి కీర్తన, అంటే 72వ కీర్తన సొలొమోను పరిపాలనను గురించినది, ఆయన పరిపాలన మెస్సీయ పరిపాలన క్రింద ఉండే పరిస్థితులకు ముంగుర్తుగా ఉంది. అక్కడ, సమృద్ధియైన సమాధానం ఉండడం, అణచివేత, దౌర్జన్యం లేకపోవడం, భూమిపై ఆహారం సమృద్ధిగా ఉండడం వంటి ఎంత అద్భుతమైన ఆశీర్వాదాల గురించి వర్ణించబడిందో కదా! వీటిని, ఇంకా ఇతర రాజ్య ఆశీర్వాదాలను పొందేవారిలో మనమూ ఉంటామా? కీర్తనకర్తలా, మనం కూడా యెహోవా కోసం వేచివుండడంలో సంతుష్టిని పొందుతూ, ఆయనను మన ఆశ్రయంగా, బలంగా చేసుకున్నప్పుడు మనం తప్పకుండా వారిలో ఉంటాం.

“దావీదు ప్రార్థనలు” ఈ మాటలతో ‘ముగిశాయి’: “దేవుడైన యెహోవా, ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్‌, ఆమేన్‌.” (కీర్తన 72:​18-20) అలాగే మనం కూడా యెహోవాను, ఆయన మహిమాన్విత నామాన్ని హృదయపూర్వకంగా స్తుతిద్దాం.

[9వ పేజీలోని చిత్రం]

“రాజు కుమార్తె” ఎవరికి చిత్రీకరణగా ఉందో మీకు తెలుసా?

[10, 11వ పేజీలోని చిత్రం]

యెరూషలేము “పరిపూర్ణ సౌందర్యముగలది” అని పిలువబడుతోంది. ఎందుకో మీకు తెలుసా?