కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“గలిలయ ప్రాంతానికే తలమానికం”

“గలిలయ ప్రాంతానికే తలమానికం”

“గలిలయ ప్రాంతానికే తలమానికం”

యేసు పెరిగిన ఊరైన నజరేతుకు వాయవ్య దిశగా కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలోవున్న ఆ పట్టణం గురించి సువార్తలు ఏ మాత్రం ప్రస్తావించలేదు. అయినప్పటికీ, ఆ పట్టణాన్ని “గలిలయ ప్రాంతానికే తలమానికం” అని మొదటి శతాబ్దపు ప్రసిద్ధ చరిత్రకారుడైన ఫ్లేవియస్‌ జోసిఫస్‌ కొనియాడాడు. అది సెఫోరెస్‌ అనే పట్టణం. ఈ పట్టణం గురించి మనకేమి తెలుసు?

హేరోదు ద గ్రేట్‌ మరణించిన తర్వాత, బహుశా సా.శ.పూ. 1లో సెఫోరెస్‌ పౌరులు రోముపై తిరుగుబాటు చేయడంతో ఆ పట్టణం నాశనం చేయబడింది. హేరోదు కుమారుడైన అంతిప గలిలయను, పెరయను వారసత్వంగా పొంది శిథిలావస్థలో ఉన్న సెఫోరెస్‌ను రాజధాని ప్రాంతంగా ఎన్నుకున్నాడు. ఆ పట్టణం గ్రీసు, రోమన్‌ నిర్మాణ శైలిలో పునర్నిర్మించబడింది, అయితే అక్కడి జనాభాలో అధికశాతం యూదులే ఉన్నారు. పండితుడైన రిచర్డ్‌ ఎ. బాటీ ప్రకారం, దాదాపు సా.శ. 21లో అంతిప, సెఫోరెస్‌ స్థానంలో తిబెరియను రాజధానిగా నెలకొల్పేంతవరకు, అది “గలిలయ, పెరయల ప్రభుత్వపాలనకు ముఖ్యస్థానంగా” నిలిచింది. ఆ కాలంలో యేసు ఈ పట్టణానికి చేరువలోనే నివసించాడు.

సెఫోరెస్‌వద్ద త్రవ్వకాలు జరిపిన పండితుడైన జేమ్స్‌ స్ట్రేంజ్‌ ఆ పట్టణంలో ప్రభుత్వ దస్తావేజులు దాచిపెట్టే స్థలాలు, ఖజానా, ఆయుధశాల, బ్యాంకులు, ప్రజా భవనాలు ఉండేవనీ మట్టిపాత్రలు, గాజు సామగ్రి, లోహపు వస్తువులు, ఆభరణాలు, రకరకాల భోజన పదార్థాలు అమ్మబడే దుకాణాలు ఉండేవనీ వర్ణిస్తున్నాడు. అక్కడ నేతపనివాళ్ళు, బట్టల వ్యాపారస్థులు ఉండేవారు, బుట్టలు, కలప సామగ్రి, పరిమళ ద్రవ్యాలు తదితర వస్తువులు అమ్మే దుకాణాలు ఉండేవి. ఆ కాలంలో అక్కడి జనాభా 8,000 నుండి 12,000 కు మధ్య ఉండవచ్చని అంచనా వేయబడింది.

నజరేతు నుండి కాలినడకన ఓ గంటలో వెళ్లగల ఈ రద్దీగల రాజధానికి యేసు ఎప్పుడైనా వెళ్లాడా? దానికి సువార్తలు మనకు జవాబు ఇవ్వడంలేదు. అయితే, ది యాంకర్‌ బైబిల్‌ డిక్షనరీ ఇలా చెబుతోంది: “నజరేతు నుండి గలిలయలోని కానాకు వెళ్లే ఒక మార్గం సెఫోరెస్‌ గుండా వెళ్లేది.” (యోహాను 2:⁠1; 4:​46) నజరేతు నుండి చూస్తే, లోయ మట్టానికి దాదాపు 120 మీటర్ల ఎత్తునవున్న సెఫోరెస్‌ కొండ కన్పిస్తుంది. “కొండమీదనుండు పట్టణము మరుగైయుండనేరదు” అనే ఉపమానాన్ని యేసు చెప్పినప్పుడు ఆయన మదిలో బహుశా ఈ కొండే ఉండవచ్చని కొందరు నమ్ముతారు.​—⁠మత్తయి 5:​14.

సా.శ. 70లో యెరూషలేము నాశనమైన తర్వాత, సెఫోరెస్‌ గలిలయలో ముఖ్యమైన యూదా పట్టణంగా, ఆ తర్వాత యూదుల ఉన్నత న్యాయసభ ఉన్న స్థలంగా మారింది. కొంతకాలంపాటు అది యూదుల విజ్ఞాన కేంద్రంగా విలసిల్లింది.

[32వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

గలిలయ సముద్రం

గలిలయ

కానా

తిబెరియ

సెఫోరెస్‌

నజరేతు

పెరయ

[32వ పేజీలోని చిత్రసౌజన్యం]

మట్టిపాత్రలు: Excavated by Wohl Archaeological Museum, Herodian Quarter, Jewish Quarter. Owned by Company for the Reconstruction of the Jewish Quarter in the Old City of Jerusalem, Ltd