కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న వృద్ధులు

నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న వృద్ధులు

నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్న వృద్ధులు

గూర్ఖా రౌండ్లు వేస్తున్నప్పుడు, తాను చూసిన దారుణ దృశ్యానికి చలించిపోయాడు. ఒక విలాసవంతమైన భవనం బయట ఆయన రెండు నిర్జీవ శరీరాల్ని చూశాడు. ఆ శరీరాలు, ఎనిమిదవ అంతస్థులోని తమ ఫ్లాటు కిటికీలోనుండి దూకేసిన వృద్ధ దంపతులవి. వారి ఆత్మహత్య ఎంతో విభ్రాంతికరమైనదే అయినా, వారలా చేయడం వెనకున్న కారణం మరింత కలవరపరుస్తుంది. భర్త జేబులో దొరికిన కాగితంలో ఇలా వ్రాసివుంది: “మా కొడుకు, కోడలు మమ్మల్ని పదేపదే దూషించడాన్ని, వేధించడాన్ని భరించలేక మేము మా జీవితాల్ని అంతం చేసుకుంటున్నాం.”

ఈ ఉదంతపు వివరాలు అసాధారణమైనవే కావచ్చు, అయితే, అలాంటి పరిస్థితులకు నడిపిన కారణం మాత్రం కలవరపరిచేంత సర్వసాధారణమైనది. నిజానికి, వృద్ధులు నిరాదరణకు గురికావడం ప్రపంచంలోని ప్రతీ ప్రాంతంలో ప్రబలంగా ఉంది. క్రింది వివరాల్ని పరిశీలించండి:

ఒక పరిశోధన ప్రకారం కెనడాలోని వృద్ధుల్లో 4 శాతం మంది తాము ఇతరుల, సాధారణంగా కుటుంబ సభ్యుల దూషణలకు గురౌతున్నామని, లేదా వారి స్వార్థానికి ఉపయోగించుకోబడుతున్నామని చెప్పారు. అయితే, వృద్ధుల్లో అనేకులు తమ దయనీయ స్థితి గురించి మాట్లాడడానికి ఎంతో సిగ్గుపడతారు లేదా అతిగా భయపడతారు. అయితే, అసలు సంఖ్య దాదాపు 10 శాతంవరకు ఉంటుందని నిపుణులు అంటున్నారు.

“భారతీయ సమాజం, పైకి బలమైన కుటుంబ బాంధవ్యాలు ఉన్నట్లు కనిపిస్తున్నా, తమ సంతానంచే తృణీకరించబడుతున్న వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా విచ్ఛిన్నమౌతోంది” అని ఇండియా టుడే పత్రిక నివేదించింది.

అందుబాటులో ఉన్న అత్యుత్తమ అంచనాల ప్రకారం, “కోటీ, రెండు కోట్లమంది అమెరికన్లలో, 65 లేదా అంతకన్నా ఎక్కువ వయసున్నవారు సంరక్షణకోసం ఎవరిపైనైతే ఆధారపడుతున్నారో, వారు ఆ వృద్ధులపై దౌర్జన్యం చేస్తూ, వారిని స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారు, లేదా మరితర విధాల్లో నిరాదరణకు గురిచేస్తున్నారు” అని నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎల్డర్‌ అబ్యూస్‌ అంటోంది. వృద్ధులను శారీరకంగా మానసికంగా హింసించడమనేది, “చట్టాన్ని అమలు చేయడానికి సంబంధించి ప్రస్తుతం అతి గంభీరమైన వివాదాంశంగా” తయారైందని కాలిఫోర్నియాలోని సాండియాగోలో డిప్యూటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని అంటున్నాడు. ఆయనిలా కూడా అన్నాడు: “రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ సమస్య మరింత అధికమౌతుందని నాకనిపిస్తోంది.”

న్యూజీలాండ్‌లోని క్యాంటర్‌బరీలో, సొంత కుటుంబ సభ్యులే, ప్రత్యేకంగా మాదకద్రవ్యాలకు, త్రాగుబోతుతనానికి, జూదానికి అలవాటుపడినవారు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న వృద్ధుల్ని ఆస్తి కోసం వేధించడం పెద్ద సమస్యగా మారింది. క్యాంటర్‌బరీలో, వృద్ధులపై శారీరకంగా మానసికంగా జరిగిన హింసను నివేదించిన కేసుల సంఖ్య 2002లో 65 కాగా, 2003లో అది 107కు పెరిగిపోయింది. ఈ సంఖ్య, అసలు సంఖ్యను పూర్తిగా వెల్లడిచేయకపోవచ్చని, అలాంటి నిరాదరణను నివారించేందుకు స్థాపించబడిన ఒక సంస్థకు చెందిన ఉన్నతాధికారి అన్నాడు.

“అత్యాచారానికి గురైన పిల్లలకన్నా, మరోవిధంగా గృహ హింసకు గురైనవారికన్నా హింసింపబడుతున్న వృద్ధులకు మరింత శ్రద్ధ, ఆదరణ చూపించాల్సిన అవసరముంది” అని జపాన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్స్‌ ఉపదేశించిందని ద జపాన్‌ టైమ్స్‌ నివేదించింది. ఎందుకలా ఉపదేశించింది? దానికిగల ఒక కారణాన్ని తెలియజేస్తూ టైమ్స్‌ పత్రిక ఇలా అంటోంది: “పిల్లలపై, వివాహ జతపై జరిగే అత్యాచారంకన్నా, వృద్ధులను శారీరకంగా మానసికంగా హింసించడం వెలుగులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే, తమ సంతానమే దౌర్జన్యం చేస్తున్నప్పుడు, వృద్ధులు తామే దానికి బాధ్యులమనే అభిప్రాయంతో కొంతమేరకు దాన్ని దాచిపెడతారు. అంతేగాక, ప్రభుత్వం, స్థానిక అధికారులు ఇప్పటివరకూ ఆ సమస్యను పరిష్కరించలేకపోవడంవల్ల అది వెలుగులోకి రావడం లేదు.”

ప్రపంచంలో జరుగుతున్నదాన్ని చూచాయగా చూపించే ఈ సమాచారం, మనమీ ప్రశ్నల్ని అడిగేలా చేస్తుంది: ఎందుకు ఇంతమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురౌతున్నారు? పరిస్థితులు మెరుగవుతాయనే ఆశేమైనా ఉందా? వృద్ధులకు ఎటువంటి ఓదార్పు ఉంది?