కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

మోషే ధర్మశాస్త్రంలో, కొన్ని సహజ లైంగిక క్రియలు ఒక వ్యక్తిని “అపవిత్రము” చేస్తాయని ఎందుకు పరిగణించబడింది?

దేవుడు మానవుల పునరుత్పత్తికోసం, వివాహ దంపతుల ఆనందంకోసం లైంగిక సంబంధాలను ఏర్పరిచాడు. (ఆదికాండము 1:​28; సామెతలు 5:​15-18) అయితే, వీర్యస్ఖలనానికి, ఋతుస్రావానికి, శిశు జననానికి సంబంధించిన అపవిత్రత గురించిన వివరణాత్మక నియమాలు లేవీయకాండములోని 12, 15 అధ్యాయాల్లో మనం చూస్తాం. (లేవీయకాండము 12:​1-6; 15:​16-24) ప్రాచీన ఇశ్రాయేలుకు ఇవ్వబడిన అలాంటి నియమాలు వారిలో ఆరోగ్యదాయకమైన జీవనశైలిని పురికొల్పడమేకాక, ఉన్నత నైతిక విలువలను హెచ్చిస్తూ, రక్తానికున్న పవిత్రతను, పాపాల ప్రాయశ్చిత్త అవసరతను కూడా నొక్కిచెప్పాయి.

లైంగిక సంబంధాల గురించిన మోషే ధర్మశాస్త్ర నియమాలు ఇతర ప్రయోజనాలు చేకూర్చడంతోపాటు ఇశ్రాయేలు సమాజపువారి సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. ద బైబిల్‌ అండ్‌ మోడర్న్‌ మెడిసిన్‌ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “ఋతుస్రావమప్పుడు నియమిత కాలం కడగా ఉండడం కొన్నిరకాల లైంగిక వ్యాధులు సోకకుండా కాపాడే సమర్థవంతమైన నిరోధక చర్యగా నిరూపించబడింది . . . అంతేగాక, అది స్త్రీల గర్భాశయానికి సంబంధించిన అపాయకరమైన క్యాన్సర్‌ సోకి, విస్తరించకుండా ఖచ్చితంగా కాపాడుతుంది.” అటువంటి నియమాలు, దేవుని ప్రజలకు బహుశా తెలియని వ్యాధులనుండి, లేక వారు కనిపెట్టలేని వ్యాధులనుండి వారిని రక్షించాయి. సుభిక్షంగా అభివృద్ధి చెందుతుందనే వాగ్దానంతో దేవుడు ఆశీర్వదించిన జనాంగంలో సరైన లైంగిక పరిశుభ్రత, సంతాన సాఫల్యాన్ని వృద్ధిచేసింది. (ఆదికాండము 15:⁠5; 22:​17) అందులో దేవుని ప్రజల భావోద్వేగ ఆరోగ్యం కూడా ఇమిడివుంది. ఆ నియమాలకు లోబడడం ద్వారా భార్యాభర్తలు తమ లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకున్నారు.

లైంగిక విషయాల సంబంధిత అపవిత్రతల్లో, రక్తస్రావం లేదా రక్తహీనత అనేది అత్యంత ప్రాముఖ్యమైన అంశం. రక్తానికి సంబంధించిన యెహోవా నియమాలు, రక్త పవిత్రతను గురించే కాక, యెహోవా ఆరాధనలో రక్తానికున్న ప్రత్యేకస్థానాన్ని అంటే పాపాల ప్రాయశ్చిత్తం కోసం అర్పించబడే బలుల గురించి కూడా ఇశ్రాయేలీయుల మనసులపై ముద్రవేశాయి.​—⁠లేవీయకాండము 17:⁠11; ద్వితీయోపదేశకాండము 12:​23, 24, 27.

అందువల్ల, ఈ విషయంలో ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన వివరణాత్మక నియమాలకు, మానవ పరిపూర్ణతకు దగ్గర సంబంధం ఉంది. ఆదాముహవ్వలు పాపం చేసిన తర్వాత, వారు పరిపూర్ణ సంతానాన్ని కనలేకపోయారనీ, వారి సంతానమంతా వారసత్వపు పాపపు ప్రభావాలను అంటే అపరిపూర్ణతను, మరణాన్ని అనుభవిస్తారనీ ఇశ్రాయేలీయులకు తెలుసు. (రోమీయులు 5:​12) ఈ కారణంగా, వివాహ ఏర్పాటు ద్వారా పరిపూర్ణ జీవాన్ని ఇచ్చేందుకే నిజానికి మానవుల పునరుత్పత్తి అవయవాలు రూపొందించబడినప్పటికీ, తల్లిదండ్రులు తమ సంతానానికి కేవలం అపరిపూర్ణమైన, పాపభరిత జీవితాన్నే ఇవ్వగలిగారు.

అలా, పరిశుభ్రతకు సంబంధించిన ధర్మశాస్త్ర నియమాలు ఇశ్రాయేలీయులకు వారసత్వంగా సంక్రమించిన పాపం గురించి గుర్తుచేయడమేకాక, వారి పాపాల్ని కప్పి, మానవ పరిపూర్ణతను పునరుద్ధరించాల్సిన అవసరతను కూడా వారికి గుర్తుచేశాయి. అయితే వారు అర్పించిన జంతు బలులు దానిని నెరవేర్చలేదు. (హెబ్రీయులు 10:​3, 4) మోషే ధర్మశాస్త్రం ఉద్దేశమేమిటంటే, నమ్మకస్థులకు నిత్యజీవపు మార్గాన్ని తెరవడమే కాక, నిజమైన క్షమాపణ యేసు పరిపూర్ణ మానవ బలిద్వారా మాత్రమే సాధ్యమని గ్రహించేలా వారికి సహాయం చేస్తూ వారిని క్రీస్తువద్దకు నడిపించాలి.​—⁠గలతీయులు 3:​24; హెబ్రీయులు 9:​13, 14.