కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘బ్రతుకునట్లు జీవమును కోరుకొనుడి’

‘బ్రతుకునట్లు జీవమును కోరుకొనుడి’

‘బ్రతుకునట్లు జీవమును కోరుకొనుడి’

‘నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను మీ యెదుట ఉంచితిని; మీరు బ్రదుకునట్లు జీవమును కోరుకొనుడి.’​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19-20.

“మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము.” దేవుడు పలికిన ఆ మాటలు బైబిల్లోని మొదటి అధ్యాయంలో వ్రాయబడివున్నాయి. తదనుగుణంగా “దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను” అని ఆదికాండము 1:26, 27 నివేదిస్తోంది. ఆ విధంగా మొదటి మానవుడు భూమ్మీది మిగతా సృష్టి అంతటిలో విభిన్నంగా ఉన్నాడు. తర్కించడంలో, ప్రేమను, న్యాయాన్ని, జ్ఞానాన్ని, శక్తిని ప్రదర్శించడంలో దేవుని దృక్పథాన్ని ప్రతిబింబించగల వ్యక్తిగా ఆయన తన సృష్టికర్తను పోలి ఉన్నాడు. తనకు ప్రయోజనం చేకూర్చడమే కాక, తన పరలోకపు తండ్రిని సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకునేలా సహాయపడే మనస్సాక్షి ఆయనకుంది. (రోమీయులు 2:​15) ఒక్కమాటలో చెప్పాలంటే, ఆదాముకు స్వేచ్ఛాచిత్తముంది. తన భూసంబంధ కుమారుని రూపకల్పనను చూసినప్పుడు, యెహోవా తన చేతిపనిని ఉద్దేశించి “అది చాలమంచిదిగ నుండెను” అని చెప్పాడు.​—⁠ఆదికాండము 1:​31; కీర్తన 95:⁠6.

2 ఆదాము సంతతిగా, మనం కూడా దేవుని స్వరూపంలో, ఆయన పోలికతో ఉన్నాం. అయితే, మనం చేయగలవాటిని ఎంచుకునే అవకాశం మనకు నిజంగా ఉందా? ఉంది, ఎందుకంటే ఏమి జరుగుతుందో ముందే తెలుసుకునే సామర్థ్యము యెహోవాకున్నా, ఆయన మన వ్యక్తిగత క్రియల్ని, వాటి ఫలితాల్ని ముందే నిర్ణయించడు. ఆయన తన భూసంబంధ పిల్లలు విధి నిర్ణయంచేత నడిపించబడేందుకు ఎన్నడూ అనుమతించడు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మన స్వేచ్ఛాచిత్తాన్ని ఉపయోగించుకోవడానికున్న ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు, మొట్టమొదట మనం ఇశ్రాయేలు జనాంగం నుండి ఓ పాఠాన్ని నేర్చుకుందాం.​—⁠రోమీయులు 15:⁠4.

ఇశ్రాయేలీయులకు ఎంచుకునే స్వేచ్ఛ ఉంది

3 “దాసుల గృహమైన ఐగుప్తుదేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనైన యెహోవాను నేనే” అని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. (ద్వితీయోపదేశకాండము 5:⁠6) సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలు జనాంగం అద్భుతరీతిలో ఐగుప్తు దాసత్వం నుండి విడిపించబడింది కాబట్టి, ఆ జనాంగం ఆ మాటలను నిస్సందేహంగా నమ్మవచ్చు. పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞనిస్తూ యెహోవా తన ప్రతినిధియైన మోషే ద్వారా ఇలా ప్రకటించాడు: “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” (నిర్గమకాండము 20:​1, 3) ఆ సందర్భంలో, ఇశ్రాయేలు జనాంగం విధేయత చూపించేందుకు నిర్ణయించుకుంది. వారు ఇష్టపూర్వకంగా యెహోవాపట్ల సంపూర్ణ భక్తిని ప్రదర్శించారు.​—⁠నిర్గమకాండము 20:⁠5; సంఖ్యాకాండము 25:​11.

4 దాదాపు 40 సంవత్సరాల తర్వాత, మోషే తర్వాతి తరం ఇశ్రాయేలీయులకు వారు చేసుకోవలసిన ఎంపిక ఏమిటో శక్తిమంతంగా గుర్తుచేశాడు. ఆయన ఇలా ప్రకటించాడు: ‘నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీవును నీ సంతానమును బ్రదుకునట్లు జీవమును కోరుకొనుడి.’ (ద్వితీయోపదేశకాండము 30:​19-20) అలాగే నేడు కూడా, మనం ఎంపిక చేసుకోవచ్చు. అవును, మనం నిత్యజీవం పొందగల ఉత్తరాపేక్షతో యెహోవాను నమ్మకంగా సేవించేందుకు ఎంచుకోవచ్చు లేదా ఆయనకు అవిధేయత చూపించడాన్ని ఎంచుకుని దాని పర్యవసానాలు అనుభవించవచ్చు. భిన్నమైన ఎంపికలు చేసుకున్న ప్రజల రెండు ఉదాహరణలు పరిశీలించండి.

5 సా.శ.పూ. 1473లో యెహోషువ ఇశ్రాయేలీయులను వాగ్దానదేశంలోకి నడిపించాడు. యెహోషువ తన మరణానికి ముందు బలంగా చేసిన ప్రబోధనలో, జనాంగమంతటిని ఇలా వేడుకున్నాడు: “యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి.” ఆ తర్వాత ఆయన తన కుటుంబం గురించి ప్రస్తావిస్తూ ఇంకా ఇలా అన్నాడు: “నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము.”​—⁠యెహోషువ 24:​15.

6 అంతకుముందు, యెహోవా యెహోషువను ధైర్యంగా, బలంగా ఉండమని ప్రోత్సహిస్తూ దేవుని ధర్మశాస్త్రానికి అవిధేయులు కావద్దని ఆదేశించాడు. బదులుగా ఆ ధర్మశాస్త్రాన్ని చదివి, దివారాత్రము ధ్యానిస్తూ ఉంటే, యెహోషువ తన మార్గాన్ని వర్ధిల్లజేసుకుంటాడు. (యెహోషువ 1:​7, 8) అలాగే జరిగింది. యెహోషువ ఎంపిక ఆశీర్వాదాలు తెచ్చింది. “యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియు తప్పియుండలేదు, అంతయు నెరవేరెను” అని యెహోషువ ప్రకటించాడు.​—⁠యెహోషువ 21:​44.

7 దానికి భిన్నంగా, దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలులో ఉన్న పరిస్థితిని పరిశీలించండి. ఆ సమయానికి, ఇశ్రాయేలీయుల్లో చాలామంది అన్యుల ఆచారాలు పాటిస్తున్నారు. ఉదాహరణకు, సంవత్సరంలోని చివరి రోజున ప్రజలు వివిధరకాల రుచికరమైన ఆహార పదార్థాలు, తియ్యని ద్రాక్షారసంతో విందు చేసుకునేవారు. అదేదో మామూలుగా కుటుంబ సభ్యులందరూ కూడుకునే సందర్భం కాదు. అది ఇద్దరు అన్యదేవతలను సన్మానించే మతాచరణ. ఈ అవిశ్వాస్యత విషయంలో దేవుని దృక్కోణమేమిటో ప్రవక్తయైన యెషయా ఇలా వ్రాశాడు: ‘మీరు యెహోవాను విసర్జించి, పరిశుద్ధపర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారిగా, అదృష్టదేవికి పానీయార్పణము నర్పించువారిగా’ ఉన్నారు. ప్రతీ సంవత్సరం పంటకోత, యెహోవా ఆశీర్వాదం కలిగివుండడంపై కాదుగానీ, ‘గాదును, అదృష్టదేవిని’ శాంతింపజేయడంపై ఆధారపడిందని నమ్మారు. నిజానికి వారి తిరుగుబాటు స్వభావం, ఇష్టపూర్వకంగా వారు చేసుకున్న ఎంపిక, వారికి దుఃఖకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. “నేను పిలువగా మీరు ఉత్తరమియ్యలేదు; నేను మాటలాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైనదాని చేసితిరి, నాకిష్టము కానిదాని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరు వధకు లోనగుదురు” అని యెహోవా ప్రకటించాడు. (యెషయా 65:​11, 12) వారి అజ్ఞానపు ఎంపిక వారిపైకి నాశనం తెచ్చింది, గాదు దేవతకు గానీ, అదృష్టదేవికి గానీ ఆ నాశనాన్ని ఆపే శక్తి లేకపోయింది.

సరైన ఎంపిక చేసుకోవడం

8 జీవాన్ని కోరుకొమ్మని మోషే ఇశ్రాయేలీయులకు చెప్పినప్పుడు, ఆయన వారు తీసుకోవలసిన ఈ మూడు చర్యలను సూచించాడు: “నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొను[డి].” (ద్వితీయోపదేశకాండము 30:​20) సరైన ఎంపిక చేసుకునేందుకు మనం వీటిలో ఒక్కొక్క దానిని పరిశీలిద్దాం.

9మన దేవుడైన యెహోవాను ప్రేమించడం ద్వారా: మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టే మనమాయనను సేవించడానికి ఎంపిక చేసుకున్నాం. ఇశ్రాయేలు కాలంనాటి ఉదాహరణలను లక్ష్యపెడుతూ, మనం లైంగిక దుర్నీతికి పాల్పడాలనే శోధనలన్నింటినీ ఎదిరిస్తూ, ఈ లోక ఐశ్వర్యాసక్తి ఉరిలో చిక్కుబడేలా చేయగల జీవన విధానాల్ని మనం విసర్జిస్తాం. (1 కొరింథీయులు 10:​11; 1 తిమోతి 6:​6-10) మనం యెహోవాను హత్తుకుని ఆయన నియమాలు ఆచరిస్తాం. (యెహోషువ 23:⁠8; కీర్తన 119:​5, 8) ఇశ్రాయేలీయులు వాగ్దానదేశంలోకి ప్రవేశించడానికి ముందు, మోషే వారినిలా వేడుకున్నాడు: “నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము.” (ద్వితీయోపదేశకాండము 4:​5, 6) మన జీవితాల్లో యెహోవా చిత్తానికి ప్రథమస్థానమిస్తూ యెహోవాపట్ల మనకున్న ప్రేమను ప్రదర్శించేందుకు ఇదే సమయం. మనం అలా చేసేందుకు ఎంచుకున్నప్పుడు తప్పక ఆశీర్వదించబడతాం.​—⁠మత్తయి 6:​33.

10దేవుని వాక్యమును వినడం ద్వారా: నోవహు ‘నీతిని ప్రకటించాడు.’ (2 పేతురు 2:⁠5) దాదాపు జలప్రళయానికి ముందున్న ప్రజలందరూ పరధ్యాసలో పడిపోయి నోవహు ప్రకటించిన హెచ్చరికల్ని “ఎరుగక పోయిరి.” ఫలితం? ‘జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోయింది.’ మన కాలం అంటే ‘మనుష్యకుమారుని రాకడ’ లేదా ప్రత్యక్షతా సమయం కూడా అలాగే ఉంటుందని యేసు హెచ్చరించాడు. నోవహు కాలంలో జరిగినది, నేడు దేవుని సందేశాన్ని పెడచెవినబెట్టేందుకు ఎంచుకునే ప్రజలకు ఓ శక్తిమంతమైన హెచ్చరికగా పనిచేస్తుంది.​—⁠మత్తయి 24:​39.

11 దేవుని ఆధునికదిన సేవకులు ఇచ్చే దైవిక హెచ్చరికల్ని అపహసించేవారు, హెచ్చరికల్ని పెడచెవినబెడితే ఏమౌతుందో గ్రహించాలి. అలాంటి అపహాసకుల గురించి అపొస్తలుడైన పేతురు ఇలా చెబుతున్నాడు: “పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలోనుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు. ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.”​—⁠2 పేతురు 3:​3-7.

12 వీరికి భిన్నంగా నోవహు ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని పరిశీలించండి. “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను.” ఆయన హెచ్చరికను లక్ష్యపెట్టడం ఆయన కుటుంబానికి రక్షణను తెచ్చింది. (హెబ్రీయులు 11:⁠7) మనం దేవుని సందేశాన్ని వినేందుకు వేగిరపడేవారంగా ఉండి, దానిని లక్ష్యపెడదాం.​—⁠యాకోబు 1:​19, 22-25.

13యెహోవాను హత్తుకొని ఉండడం ద్వారా: మనం ‘బ్రతుకునట్లు జీవం కోరుకునేందుకు’ మనం యెహోవాను ప్రేమిస్తూ, ఆయన మాట వినడమే కాక, మనం ‘యెహోవాను హత్తుకొని ఉండాలి’ కూడా అంటే ఆయన చిత్తం చేయడంలో పట్టుదలతో కొనసాగాలి. “మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు” అని యేసు చెప్పాడు. (లూకా 21:​19) నిజానికి ఈ విషయంలో మనం చేసుకునే ఎంపిక మన హృదయంలో ఏముందో వెల్లడిచేస్తుంది. “నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును” అని సామెతలు 28:⁠14 చెబుతోంది. ప్రాచీన ఐగుప్తు రాజైన ఫరో దీనికొక ఉదాహరణ. ఐగుప్తు మీదికి వచ్చిన పది తెగుళ్లలో ప్రతీది సంభవించిన తర్వాత ఫరో దైవ భయాన్ని ప్రదర్శించే బదులు తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు. అవిధేయత చూపించేలా యెహోవా ఫరోను బలవంతపెట్టలేదు, బదులుగా గర్విష్ఠియైన ఆ పరిపాలకుడే నిర్ణయించుకునేందుకు అనుమతించాడు. ఏదేమైనా, ఫరో విషయంలో యెహోవా దృక్కోణం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా వివరించినట్లుగా యెహోవా చిత్తం మాత్రం నెరవేరింది: “నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంతట ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితిని.”​—⁠రోమీయులు 9:​17.

14 ఫరో చేతిలోనుండి ఇశ్రాయేలీయులు విడిపించబడిన శతాబ్దాల తర్వాత, ప్రవక్తయైన యెషయా ఇలా ప్రకటించాడు: “యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు; మేమందరము నీ చేతిపనియై యున్నాము.” (యెషయా 64:⁠8) మన వ్యక్తిగత అధ్యయనం ద్వారా, ఆయన వాక్యాన్ని అన్వయించుకోవడం ద్వారా, యెహోవా మనల్ని రూపించేందుకు మనం అనుమతించినప్పుడు, మనం క్రమేణా నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. మనం యెహోవాను సంతోషపెట్టాలని నిజంగా కోరుకుంటాం కాబట్టి, ఆయనను యథార్థంగా హత్తుకొని ఉండడం సులభమయ్యేలా మనం మరింత సాత్వికముగా, మృదువుగా తయారౌతాం.​—⁠ఎఫెసీయులు 4:​23, 24; కొలొస్సయులు 3:​8-10.

‘మీరు వాటిని నేర్పించాలి’

15 వాగ్దానదేశంలోకి ప్రవేశించబోతూ, సమకూడివున్న ఇశ్రాయేలు జనాంగానికి మోషే ఇలా చెప్పాడు: “నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పిం[చవలెను].” (ద్వితీయోపదేశకాండము 4:⁠9) ఆ ప్రజలు తాము స్వతంత్రించుకోబోతున్న దేశంలో యెహోవా ఆశీర్వాదాలను, సమృద్ధిని అనుభవించేందుకు, తమ దేవుడైన యెహోవా ఎదుట రెండంచెల బాధ్యతను నెరవేర్చాలి. వారి కళ్ల ఎదుట యెహోవా జరిగించిన ఆశ్చర్యకార్యాలను వారు మర్చిపోకుండా ఉండడమే కాక, వాటిని తమ భావి తరాలవారికి బోధించాలి. నేడు, దేవుని ప్రజలముగా మనం, ‘బ్రతుకునట్లు జీవాన్ని కోరుకోవాలని’ ఇష్టపడితే మనం కూడా అలాగే చేయాలి. మన పక్షాన యెహోవా జరిగించిన వేటిని మనం కళ్లారా చూశాం?

16 మన ప్రకటనాపనిని, శిష్యులను చేసేపనిని యెహోవా ఎలా ఆశీర్వదించాడో చూసి మనమెంతో ఉత్తేజం పొందాం. 1943లో వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌ ఆరంభమైన దగ్గరనుండి, మిషనరీలు అనేక దేశాల్లో శిష్యులను చేసేపనిలో నాయకత్వం వహించారు. ఈ పాఠశాల తొలి పట్టభద్రులు ప్రస్తుతం వృద్ధులైపోయినప్పటికీ, వారిలో కొందరికి శారీరక పరిమితులు ఉన్నప్పటికీ, వారు నేటికీ రాజ్య ప్రకటనా పనిపట్ల తమకున్న ఉత్సాహాన్ని కాపాడుకుంటున్నారు. వారిలో ఓ చక్కని ఉదాహరణ మేరీ ఓల్సన్‌, ఈమె 1944లో గిలియడ్‌ పట్టభద్రురాలయ్యింది. ఆమె మొదట కొలంబియాలో, ఆ తర్వాత ఉరుగ్వేలో మిషనరీగా సేవచేసింది, ఇప్పుడు ప్యూర్టోరికోలో సేవచేస్తోంది. సహోదరి ఓల్సన్‌కు వృద్ధాప్యంవల్ల కొంతమేరకు శారీరక పరిమితులున్నా, ప్రకటనాపనిపట్ల ఆమె తనకున్న ఉత్సాహాన్ని కాపాడుకుంటోంది. ఆమె స్పానిష్‌ భాష నేర్చుకుని, క్షేత్ర పరిచర్యలో స్థానిక ప్రచారకులతో కలిసి పనిచేసేందుకు ప్రతీవారం సమయం కేటాయిస్తోంది.

17 ప్రస్తుతం విధవరాలిగావున్న నాన్సీ పోర్టర్‌, 1947లో గిలియడ్‌ పాఠశాలలో పట్టభద్రురాలయ్యింది. ఆమె ఇప్పటికీ బహమాస్‌లో సేవచేస్తోంది. ఈ మిషనరీ సహోదరి కూడా ప్రకటనాపనిలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటుంది. “ప్రత్యేకించి, ఇతరులకు బైబిలు సత్యాన్ని బోధించడం, ఆనందాన్నిస్తోంది. అది క్రమమైన ఆధ్యాత్మిక దినచర్యగా ఉండి, నా జీవితానికి ఒక పద్ధతిని స్థిరత్వాన్ని ఇచ్చింది” అని సహోదరి పోర్టర్‌ తన జీవిత కథలో నివేదిస్తోంది. * సహోదరి పోర్టర్‌, మరితర నమ్మకమైన సేవకులు తమ గతాన్ని గుర్తుచేసుకున్నప్పుడు, యెహోవా తమకోసం చేసిన వాటిని మర్చిపోరు. మరి మన విషయమేమిటి? మన ఇరుగుపొరుగున రాజ్య పనిని యెహోవా ఆశీర్వదించిన రీతిని మనం కృతజ్ఞతా భావంతో చూస్తున్నామా?​—⁠కీర్తన 68:​11.

18 ఈ వృద్ధులు చేసిన, ఇంకా చేస్తున్న దాన్నిబట్టి మనమెంతో ఆనందిస్తాం. వారి జీవిత కథలను చదవడం మనకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది, ఎందుకంటే ఈ నమ్మకస్థుల విషయంలో యెహోవా ఏమిచేశాడో చూడడం ఆయనను సేవించాలనే మన నిర్ణయాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కావలికోటలో ప్రచురించబడే అలాంటి ఉత్తేజవంతమైన వృత్తాంతాలను మీరు క్రమంగా చదివి వాటి గురించి ధ్యానిస్తారా?

19 ఇశ్రాయేలీయులు యెహోవా తమకోసం చేసిన వాటిని మర్చిపోకూడదనీ, వారి జీవితకాలమంతటిలో అవి వారి హృదయాల నుండి తొలగిపోకూడదని మోషే వారికి గుర్తుచేశాడు. ఆ తర్వాత ఆయన మరో చర్యను ఇలా సూచించాడు: “నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పిం[చవలెను].” (ద్వితీయోపదేశకాండము 4:⁠9) యథార్థ గాథలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. పెరిగే పిల్లలకు మంచి మాదిరి అవసరం. అవివాహిత సహోదరీలు కావలికోటలో వివరించబడిన నమ్మకమైన వృద్ధ సహోదరీల జీవిత కథల నుండి పాఠాలు నేర్చుకోవచ్చు. తమ దేశంలోవున్న వేరే భాషా క్షేత్రాల్లో సేవ చేయడం సహోదర సహోదరీలకు సువార్త ప్రకటించే పనిలో నిమగ్నమయ్యే విస్తారమైన అవకాశాలను అందిస్తోంది. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలు పూర్తికాల సేవా జీవితాన్ని ఎంచుకునేందుకు నమ్మకస్థులైన గిలియడ్‌ మిషనరీల, మరితరుల అనుభవాలను ఒక ప్రేరణగా ఎందుకు ఉపయోగించకూడదు?

20 మరి మనలో ప్రతీ ఒక్కరం ఎలా ‘జీవాన్ని కోరుకోవచ్చు’? యెహోవాను మనం ప్రేమిస్తున్నామని ఆయనకు చూపించేందుకు అద్భుత బహుమానమైన మన స్వేచ్ఛా చిత్తాన్ని ఉపయోగించడం ద్వారా, ఆయన సేవచేయడమనే ఆధిక్యత కలిగివుండడానికి ఆయన అనుమతించినంత వరకు ఆయన సేవలో మనం చేయగలిగినదంతా చేయడంలో కొనసాగడం ద్వారా మనమలా చేయవచ్చు. ఎందుకంటే, మోషే చెప్పినట్లుగా, యెహోవాయే “మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుస్సుకును మూలమై యున్నాడు.”​—⁠ద్వితీయోపదేశకాండము 30:​19, 20.

[అధస్సూచి]

^ పేరా 22 కావలికోట జూన్‌ 1, 2001 23-7 పేజీల్లో ప్రచురించబడిన “గుండె పగిలేంత నష్టం జరిగినప్పటికీ ఆనందభరితురాలిని, కృతజ్ఞురాలిని” అనే జీవిత కథను చూడండి.

మీరు జ్ఞాపకం చేసుకోగలరా?

మనం పరిశీలించిన విభిన్న ఉదాహరణల నుండి మీరేమి నేర్చుకున్నారు?

‘జీవాన్ని కోరుకునేందుకు’ మనమే చర్యలు తీసుకోవాలి?

ఏ రెండంచెల బాధ్యతను నెరవేర్చాలని మనం ఉద్బోధించబడ్డాం?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. మానవుడు ఏయే విధాలుగా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు?

3. పది ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏమిటి, నమ్మకమైన ఇశ్రాయేలీయులు దానికి లోబడేందుకు ఎలా నిర్ణయించుకున్నారు?

4. (ఎ) ఇశ్రాయేలీయుల ఎదుట మోషే ఏ ఎంపికను ఉంచాడు? (బి) నేడు మన ఎదుట ఏ ఎంపిక ఉంది?

5, 6. యెహోషువ ఎలాంటి ఎంపిక చేసుకున్నాడు, దాని ఫలితమేమిటి?

7. యెషయా కాలంలో, కొందరు ఇశ్రాయేలీయులు ఏ ఎంపిక చేసుకున్నారు, దాని పర్యవసానాలు ఏమిటి?

8. ద్వితీయోపదేశకాండము 30:⁠20 ప్రకారం, సరైన ఎంపిక చేసుకోవడంలో ఏమి ఇమిడివుంది?

9. యెహోవాపట్ల మన ప్రేమను మనమెలా ప్రదర్శించవచ్చు?

10-12. నోవహు కాలంలో జరిగిన వాటిని పరిశీలించడం నుండి మనమే పాఠాలు నేర్చుకోవచ్చు?

13, 14. (ఎ) ‘యెహోవాను హత్తుకొని ఉండడం’ ఎందుకు ప్రాముఖ్యం? (బి) మన “కుమ్మరి” అయిన యెహోవా మనల్ని రూపించేందుకు మనమెలా అనుమతించాలి?

15. ద్వితీయోపదేశకాండము 4:9 ప్రకారం, మోషే ఏ రెండంచెల బాధ్యతను ఇశ్రాయేలీయులకు గుర్తుచేశాడు?

16, 17. (ఎ) రాజ్య ప్రకటనాపనిలో గిలియడ్‌ శిక్షిత మిషనరీలు ఏమి సాధించగలిగారు? (బి) తమ ఉత్సాహాన్ని కాపాడుకున్న ఎవరి ఉదాహరణలు మీకు తెలుసు?

18. మిషనరీల జీవిత కథలను చదవడం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

19. క్రైస్తవ తల్లిదండ్రులు కావలికోటలో వ్రాయబడిన జీవిత కథలను ఎలా చక్కగా ఉపయోగించవచ్చు?

20. ‘జీవాన్ని కోరుకునేందుకు’ మనమేమి చేయాలి?

[26వ పేజీలోని చిత్రం]

‘జీవమును మరణమును నేను మీ యెదుట ఉంచితిని’

[29వ పేజీలోని చిత్రం]

దేవుని మాట వినడం నోవహుకు ఆయన కుటుంబానికి రక్షణను తీసుకొచ్చింది

[30వ పేజీలోని చిత్రం]

మేరీ ఓల్సన్‌

[30వ పేజీలోని చిత్రం]

నాన్సీ పోర్టర్‌